Cigarette butts
-
మర్డర్ మిస్టరీని ఛేదించిన సిగరెట్ పీక
ఎంత ప్రొఫెషనల్ నేరగాడైనా నేరానికి సంబంధించి ఏదో ఒక క్లూ వదులుతాడంటారు. అది నిజమేనని మరోసారి నిరూపించిన ఉదంతమిది. అప్పుడెప్పుడో 1984లో జరిగిన ఓ హత్య మిస్టరీని 2014లో చేధించారు. హంతకుడు తాగి పడేసిన సిగరెట్ పీకే అతని పీకకు చుట్టుకుంది. అత్యాధునికమైన డీఎన్ఏ ప్రొఫైలింగ్ మనవాన్ని పట్టించింది. 2021లో అతనికి శిక్ష పడింది.బ్రిటన్‌లో గ్లాస్గోకు చెందిన 58 ఏళ్ల మేరీ మెక్ లాఫ్లిన్కు రెండు పెళ్లిళ్లయ్యాయి. మొత్తం 11 మంది పిల్లలున్నారు. వారు వేర్వేరు నగరాల్లో ఉంటడంతో ఒక్కతే ఉంటోంది. కొడుకు మార్టిన్ కలెన్ (24) వారానికోసారి తల్లిదగ్గరకు వచ్చేవాడు. 1984 అక్టోబర్ 2న తల్లిని చూసేందుకు వచ్చినప్పుడు ఫ్లాట్ నుంచి భయంకరమైన వాసన వచ్చింది. లోపల మేరీ శవమై, మంచం మీద పడుంది. ఐదు రోజుల క్రితమే హత్యకు గురైనట్లు పోస్టుమార్టంలో తేలింది. సెప్టెంబర్ 26న ఆమె పబ్‌లో గడిపిందని, తర్వాత నడుచుకుంటూ ఇంటికెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దారిలో ఆగి సిగరెట్ కొనుక్కుందని కూడా చెప్పారు. బూట్లు చేతబట్టుకుని నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి ఆమెను వెంబడించడం చూసినట్టు ఓ ట్యాక్సీ డ్రైవర్ వాంగ్మూలమిచ్చాడు. అయినా కేసు ఎటూ తేలలేదు. ఒకానొక దశలో ఆమె పిల్లలపైనా సందేహాలు వ్యక్తమయ్యాయి. ఏడాది దర్యాప్తు తర్వాత కేసును మూసేశారు. తర్వాత మరో నాలుగుసార్లు దర్యాప్తు చేసినా లాభం లేకపోయింది. 30 ఏళ్ల తరువాత 2014లో ఈ హత్యకు సంబంధించిన సాక్షాధారాలను మరోసారి సమీక్షించాల్సిందిగా స్కాటిష్ క్రైమ్ క్యాంపస్‌లో పనిచేస్తున్న జోవాన్ కోక్రాన్‌ను మేరీ కుమార్తె గినా మెక్ గావిన్ అడిగారు. 1984ల్లో డీఎన్ఏ ప్రొఫైలింగ్ గురించి అంతగా తెలియకపోయినా అన్ని సాక్ష్యాలనూ భద్రపరిచారు. వాటిలోని మేరీ జుట్టు, గోరు వంటివాటిని డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేశారు. లివింగ్ రూమ్‌లో కాఫీ టేబుల్ మీది యాష్ ట్రేలోని ఉన్న సిగరెట్ పీక కీలక క్లూగా మారింది. పీకకు అంటిన డీఎన్ఏ గ్రాహం మెక్ గిల్ అనే నేరస్తుని డీఎన్ఏతో సరిపోలింది. అతను పలు లైంగిక నేరాల కేసుల్లో తీవ్ర శిక్షలు అనుభవిస్తున్నాడు. సరే, కేసు వీడింది కదా అనుకుంటే మరో చిక్కు వచ్చి పడింది. మేరీ హత్యకు గురైన సమయంలో మెక్ గిల్ ఖైదీగా ఉన్నట్టు రికార్డులు చూపించాయి. జైల్లో ఉంటే హత్య ఎలా చేయగలడా అని అధికారులు తల పట్టుకున్నారు. నేషనల్ రికార్డ్స్ ఆఫ్ స్కాట్లాండ్లో విచారించిన మీదట చిక్కు ముడి వీడింది. మేరీ హత్య జరిగిన సమయంలో మెక్ గిల్ ఐదు రోజులు పెరోల్‌పై బయట ఉన్నట్టు తేలింది. దాంతో 2019లో మెక్‌గిల్‌ను అరెస్టు చేశారు. దోషిగా నిర్ధారించి 2021లో 14 ఏళ్ల జైలు శిక్ష విధించారు. మేరీ హత్య సమయంలో మెక్‌గిల్‌కు 22 ఏళ్లు. 59 ఏళ్ల వయసులో అతనికి శిక్ష పడింది. ‘‘తల్లి హంతకుడిని జీవితకాలంలో చూస్తామనుకోలేదు. ఆశే మమ్మల్ని నడిపించింది. మొత్తానికి ఉపశమనం కలిగింది’’అని గినా అన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెక్‌డోనాల్డ్స్ హ్యాపీ మీల్ ఆర్డర్ చేస్తున్నారా ? ఈ మహిళ షాకింగ్ అనుభవం తెలిస్తే..!
UK Woman Finds Cigarette Butt In Child Happy Meal At McDonald: ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డోనాల్డ్స్‌లో యూకేకు చెందిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తన ఇద్దరు చిన్నారుల కోసం మెక్‌డొనాల్డ్స్‌లో హ్యాపీ మీల్‌ను ఆర్డర్ చేసింది. బిడ్డల ఆకలి తీర్చాలన్న ఆమె ఆరాటం కాస్తా ప్యాకెట్ విప్పిన చూసాక ఆవిరైపోయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. గెమ్మా కిర్క్-బోనర్ ఇంగ్లాండ్‌లోని బారో-ఇన్-ఫర్నెస్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ నుండి పిల్లల హ్యాపీ మీల్‌ను కొనుగోలు చేసింది. రెండు ఫిష్ ఫింగర్ హ్యాపీ మీల్స్‌ను ఇంటికి తీసుకెళ్లింది. ఒక ప్యాకెట్ విప్పి పెద్దకుమారుడు జాక్సన్(3)కి ఇచ్చింది. మరో మీల్ ఓపెన్ చేసిన ఏడాది వయస్సున్న చిన్న కుమారుడు కాలేబ్‌కు తినిపించాలని ప్రయత్నిస్తుండగా అందులో కాల్చి పారేసిన సిగరెట్ పీక, బూడిదను గమనించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిన్న పిల్లాడికి తీనిపిస్తూ తాను చూశాను గనుక సరిపోయింది.. అదే పెద్దవాడు చూడకుండా తినేసి ఉంటే అన్న ఆలోచనే ఆమెలో అసహ్యాన్ని, ఆందోళననూ రేపింది. మరొకరికి తనలాంటి అనుభవం ఎదురు కాకూడదంటూ ఈ విషయాన్ని ఫోటోతో సహా ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. సిగరెట్ పీక, బూడిదతో ఇపుడు అదనపు రుచి అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు దీనిపై ఫిర్యాదు చేయబోగా డాల్టన్ రోడ్‌లోని మెక్‌డొనాల్డ్స్ బ్రాంచ్ మేనేజర్ కటువుగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడని కూడా పేర్కొంది. ఈ వ్యవహారంలో తనకు న్యాయం కావాలని, కంపెనీ క్షమాపణ చెప్పాలని కోరుతోంది. దీనిపై స్పందించిన ఫ్రాంచైజీ కస్టమర్ల సంతృప్తి, ఆహార భద్రతే తమకు తొలి ప్రాధాన్యమని వెల్లడించింది. ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. -
హోటల్ నిర్వాకం.. గుంత పొంగనాల్లో తాగిపడేసిన సిగరెట్ పీకలు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: గుంత పొంగనాల్లో సిగరెట్ పీకలు కనిపించాయి. హోటల్ నిర్వాహకుడిని నిలదీస్తే సరైన సమాధానం రాక పోవడంతో బాధితుడు ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. నగరానికి చెందిన శివ అనే యువకుడు బుధవారం కమలానగర్‌లోని లక్ష్మీనరసింహా పొంగనాల హోటల్‌కు వెళ్లాడు. చదవండి: ఒకదానిపై ఒకటి రైలు బోగీలు.. జనం పరుగులు.. అసలేం జరిగింది? రూ.200 చెల్లించి పది ప్యాకెట్లు తీసుకెన్నాడు. తిరిగి వచ్చి కార్యాలయంలో స్నేహితులతో కలిసి పొంగనాలు తింటుండగా రెండు తాగిపడేసిన సిగరెట్ పీకలు కనిపించాయి. వెంటనే హోటల్ నిర్వాహకుడి దృష్టికి తీసుకెళ్లగా, సరైన సమాధానం రాక పోవడంతో ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశారు. గుంత పొంగనాల్లో సిగరెట్ పీకలు దృశ్యం -
ప్రభుత్వానికి ఖర్చులు తగ్గిస్తున్న కాకులు.. ఎలాగో తెలుసా?
నీళ్లు తాగడానికి ఓ కుండ దగ్గరకు వెళ్లిన కాకికి అందులోని నీళ్లు అందకపోతే రాళ్లు తీసుకొచ్చి కుండలో వేసి నీళ్లు పైకి రాగానే తాగేసిన కథను విని ఉంటారు. మరి అదే కాకికి ఆకలేస్తే..! ఏముంది రోడ్డుపై పడేసిన చెత్తను తీసుకొచ్చి ఓ డబ్బాలో వేస్తే చాలు. అలా చెత్త వేయగానే ఇలా తిండి బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు స్వీడన్లో కాకులు ఇదే పని మీదున్నాయి. చెత్తను డబ్బాల్లో వేస్తూ తిండి సంపాదిస్తున్నాయి. పక్క కాకులకు కూడా ఈ ట్రిక్‌ను నేర్పిస్తున్నాయి. అసలు కాకులు అలా ఎందుకు చేస్తున్నాయి, చెత్తను డబ్బాలో వేస్తే తిండి వస్తుందని వాటికెలా తెలిసింది, దాని వల్ల ప్రజలకు, సిటీకేంటి లాభం, తెలుసుకుందామా? చెత్త సమస్యకు చెక్ పెట్టేందుకు.. స్వీడన్ ప్రజలు వీధుల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేస్తున్నారు. సిగరెట్ తాగి పీకలను రోడ్డుపై విసిరేస్తున్నారు. ఆ దేశ వీధుల్లో పడే చెత్తలో దాదాపు 62 శాతం సిగరెట్ పీకలే ఉంటున్నాయని స్వీడన్ టైడీ ఫౌండేషన్ చెబుతోంది. అక్కడి వీధుల్లో ఏటా దాదాపు 100 కోట్ల వరకు సిగరెట్ పీకలను పడేస్తున్నారంటోంది. ఇవే సిగరెట్ పీకలు, చెత్త సమస్యతో స్వీడన్ లోని సోడెర్టాల్జె మున్సిపా లిటీ కూడా ఇబ్బంది పడుతోంది. రహదారులను పరిశుభ్రం చేసేందుకు ఏటా దాదాపు రూ. 16 కోట్లను ఆ మున్సిపాలిటీ ఖర్చు చేస్తోంది. దీంతో ఆ నగరంలోని స్టార్టప్ సంస్థ ‘కోర్విడ్ క్లీనింగ్’ తెలివిగా కాకులను రంగంలోకి దింపింది. చెత్తను, సిగరెట్ పీకలను తీసుకెళ్లి ఓ డబ్బాలో పడేసేలా శిక్షణ ఇచ్చింది. ఆ వెంటనే ఆ డబ్బా నుంచి తిండి వచ్చేలా ఏర్పాటు చేసింది. ఇందుకు ఆ సంస్థ ఓ డబ్బాను రూపొందించింది. కాకులనే ఎందుకు? కోర్విడ్ జాతికి చెందిన న్యూ కెలడోనియా కాకులు చాలా తెలివైనవని ఒక పరిశోధనలో వెల్లడైంది. ఏడేళ్లున్న మనిషి ఎలాగైతే ఆలోచిస్తాడో అచ్చం అలా ఆలోచించే సామర్థ్యం వీటి సొంతమని తేలింది. ఇవి ఏదైనా సరే చాలా త్వరగా నేర్చుకుంటాయి. పక్క వాటికి నేర్పిస్తాయి కూడా. ఈ పక్షులకే ఇప్పుడు చెత్త క్లీనింగ్‌పై శిక్షణనిచ్చారు. సిగరెట్ పీకలను, చెత్తను ఆహారం అనుకొని తినే అవకాశమే లేదని తేలింది. వీటి గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్నాకే శిక్షణ ఇచ్చారు. ఏమైనా లాభముందా? మున్సిపాలిటీ సిబ్బందికి ఒక్కో సిగరెట్ పీకను తీయడానికి అయ్యే ఖర్చుల్లో నాలుగో వంతు ఖర్చు చేస్తే చాలు కాకులు ఆ పని చేసి పెడుతున్నాయి. అంటే మొత్తంగా పీకలను తీయడానికి అయ్యే ఖర్చులో దాదాపు 75% తగ్గించేస్తున్నాయి. ఇప్పటి వరకు కాకులకే శిక్షణ ఇచ్చామని, మున్ముందు మరిన్ని రకాల పక్షులకు శిక్షణ ఇస్తామని అధికారు లు చెబుతున్నారు. ఇది కేవలం నగరాన్ని పరిశు భ్రంగా ఉంచడానికి మాత్రమే కాదని.. ప్రజలు కూడా వారి పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా చేయాలనేదే తమ ఉద్దేశమని చెప్పారు. మనుషులు నేర్చుకునేదెప్పుడో! ఏదేమైనా చెత్తను తొలగించడానికి పక్షులకు కూడా శిక్షణ ఇస్తున్నాం కానీ.. చెత్త వేయొద్దని మనుషులకు చెప్పలేకపోతున్నామని అక్కడి అధికారులు అంటున్నారు. కాకులు చెత్త తీసుకెళ్లడంపై కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ‘ఇప్పుటికైతే చెత్తను తీసుకెళ్లే పనే పక్షులకు అప్పగించారు. ఇకముందు చెత్త వేస్తే చాలు.. వచ్చి వెనక నుంచి తన్నేలా శిక్షణనిస్తారేమో’ అని ఫన్నీగా అంటున్నారు. సాక్షి, సెంట్రల్ డెస్క్ -
సిగరెట్ పీకలతో తారురోడ్లు!
పొగ తాగితే ఆరోగ్యానికి చేటని అందరికీ తెలిసిన విషయమే కానీ.. సిగరెట్ల పీకల వల్ల పర్యావరణానికి ముప్పని ఎంతమందికి తెలుసు? అవును ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు ఆరు లక్షల కోట్ల సిగరెట్ పీకలు నదులు, సముద్రాల్లోకి చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయి. త్వరలో ఈ పరిస్థితిని మార్చేస్తామంటున్నారు ఆస్ట్రేలియాలోని ఆర్ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఎలాగంటే సిగరెట్ పీకలను వేడి తారులో కలిపినప్పుడు వాటిల్లోని ప్రమాదకరమైన రసాయనాలు తప్పించుకునే పరిస్థితి ఉండదని, ఫలితంగా రహదారి ఏర్పాటుకయ్యే ఖర్చు, కాలుష్యం తగ్గుతాయని చెప్పారు. పైగా సిగరెట్ పీకలను ఉపయోగించి వేసిన రోడ్లపై వేడి కొంచెం తక్కువగా ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ అబ్బాస్ మోహజెరాని అంటున్నారు. దీంతోపాటు కొన్ని ఇతర రంగాల్లోనూ సిగరెట్ పీకలను వాడవచ్చునని అబ్బాస్ తెలిపారు.