![UK Woman Finds Cigarette Butt In Child Happy Meal At McDonald Shares Photo - Sakshi](/styles/webp/s3/article_images/2023/10/25/McDonald.jpg.webp?itok=-jGeBFaR)
UK Woman Finds Cigarette Butt In Child Happy Meal At McDonald: ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్‌డోనాల్డ్స్‌లో యూకేకు చెందిన మహిళకు చేదు అనుభవం ఎదురైంది. తన ఇద్దరు చిన్నారుల కోసం మెక్‌డొనాల్డ్స్‌లో హ్యాపీ మీల్‌ను ఆర్డర్ చేసింది. బిడ్డల ఆకలి తీర్చాలన్న ఆమె ఆరాటం కాస్తా ప్యాకెట్ విప్పిన చూసాక ఆవిరైపోయింది. ఇంతకీ ఏం జరిగిందో తెలియాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే.
గెమ్మా కిర్క్-బోనర్ ఇంగ్లాండ్‌లోని బారో-ఇన్-ఫర్నెస్‌లోని మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్ నుండి పిల్లల హ్యాపీ మీల్‌ను కొనుగోలు చేసింది. రెండు ఫిష్ ఫింగర్ హ్యాపీ మీల్స్‌ను ఇంటికి తీసుకెళ్లింది. ఒక ప్యాకెట్ విప్పి పెద్దకుమారుడు జాక్సన్(3)కి ఇచ్చింది. మరో మీల్ ఓపెన్ చేసిన ఏడాది వయస్సున్న చిన్న కుమారుడు కాలేబ్‌కు తినిపించాలని ప్రయత్నిస్తుండగా అందులో కాల్చి పారేసిన సిగరెట్ పీక, బూడిదను గమనించింది. దీంతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. చిన్న పిల్లాడికి తీనిపిస్తూ తాను చూశాను గనుక సరిపోయింది.. అదే పెద్దవాడు చూడకుండా తినేసి ఉంటే అన్న ఆలోచనే ఆమెలో అసహ్యాన్ని, ఆందోళననూ రేపింది.
మరొకరికి తనలాంటి అనుభవం ఎదురు కాకూడదంటూ ఈ విషయాన్ని ఫోటోతో సహా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. సిగరెట్ పీక, బూడిదతో ఇపుడు అదనపు రుచి అంటూ తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. అంతేకాదు దీనిపై ఫిర్యాదు చేయబోగా డాల్టన్ రోడ్‌లోని మెక్‌డొనాల్డ్స్ బ్రాంచ్ మేనేజర్ కటువుగా మాట్లాడి ఫోన్ పెట్టేశాడని కూడా పేర్కొంది. ఈ వ్యవహారంలో తనకు న్యాయం కావాలని, కంపెనీ క్షమాపణ చెప్పాలని కోరుతోంది. దీనిపై స్పందించిన ఫ్రాంచైజీ కస్టమర్ల సంతృప్తి, ఆహార భద్రతే తమకు తొలి ప్రాధాన్యమని వెల్లడించింది. ఈ విషయాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment