సిగరెట్ పీకలతో తారురోడ్లు!
పొగ తాగితే ఆరోగ్యానికి చేటని అందరికీ తెలిసిన విషయమే కానీ.. సిగరెట్ల పీకల వల్ల పర్యావరణానికి ముప్పని ఎంతమందికి తెలుసు? అవును ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు ఆరు లక్షల కోట్ల సిగరెట్ పీకలు నదులు, సముద్రాల్లోకి చేరి విధ్వంసం సృష్టిస్తున్నాయి. త్వరలో ఈ పరిస్థితిని మార్చేస్తామంటున్నారు ఆస్ట్రేలియాలోని ఆర్‌ఎంఐటీ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఎలాగంటే సిగరెట్ పీకలను వేడి తారులో కలిపినప్పుడు వాటిల్లోని ప్రమాదకరమైన రసాయనాలు తప్పించుకునే పరిస్థితి ఉండదని, ఫలితంగా రహదారి ఏర్పాటుకయ్యే ఖర్చు, కాలుష్యం తగ్గుతాయని చెప్పారు.
పైగా సిగరెట్ పీకలను ఉపయోగించి వేసిన రోడ్లపై వేడి కొంచెం తక్కువగా ఉంటుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్ అబ్బాస్ మోహజెరాని అంటున్నారు. దీంతోపాటు కొన్ని ఇతర రంగాల్లోనూ సిగరెట్ పీకలను వాడవచ్చునని అబ్బాస్ తెలిపారు.