Mystery Case
-
2016లో గల్లంతు.. ఎట్టకేలకు వీడిన మిస్టరీ
ఢిల్లీ/చెన్నై: ఎనిమిదేళ్ల కిందటి భారత వైమానిక దళం(ఐఏఎఫ్) ఏఎన్-32 మిస్సింగ్ మిస్టరీ వీడింది. బంగాళా ఖాతం అడుగున విమాన శిథిలాల్ని గుర్తించినట్లు అధికారులు ప్రకటించారు. దీంతో ఇందులో ప్రయాణించిన 29 మంది సజీవంగా లేరనేది దాదాపుగా నిర్ధారణ అయ్యింది. 2016లో బంగాళాఖాతం మీదుగా 29 మందితో వెళ్తున్న విమానం జాడ లేకుండా పోయింది. అయితే అది సముద్రంలో కూలిపోయి ఉంటుందని ఓ అంచనాకి వచ్చిన అధికారులు.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ రూపొందించిన ఆటానమస్ యుటిలిటీ వెహికల్(AUV) ద్వారా అన్వేషణ ప్రారంభించారు. చివరకు.. ఇన్నేళ్ల తర్వాత చెన్నై తీరానికి దాదాపు 310 కి.మీ దూరంలో సముద్రగర్భంలో కూలిపోయిన విమానం శిథిలాలు కనిపెట్టారు. అత్యాధునిక సాంకేతికను ఉపయోగించిన జరిపిన అన్వేషణలో పలు అంశాల పరిశీలన తర్వాత.. సముద్రం అడుగున కనిపించిన శిథిలాలు ఏఎన్-32వేనని అధికారులు నిర్ధారించుకున్నారు. అయితే ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. జూలై 22, 2016 ఉదయం ఏం జరిగిందంటే.. ఉదయం 8.30ని ప్రాంతంలో IAF ఆంటోనోవ్ An-32, చెన్నైలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి బయలుదేరింది. మూడు గంటల తర్వాత అది గమ్యస్థానం అయిన అండమాన్ ,నికోబార్ దీవులలోని పోర్ట్ బ్లెయిర్‌కు చేరాల్సి ఉంది. ఎఎన్-32 రకానికి చెందిన విమానాలు చాలా బరువుతో పాటు బలంతో ఉంటాయి. పర్వతాలు, ఎడారుల్లో ఈ ఫ్లైట్ అధికంగా సంచరిస్తుంది. వారానికోసారి పోర్ట్‌బ్లెయిర్‌కు ఈ రవాణా విమానం వెళ్లాల్సి ఉంది. ఆతేదీ సిబ్బందితో సహా మొత్తం 29 మంది బయల్దేరారు. అయితే పోర్ట్ బ్లెయిర్‌లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ అయిన INS ఉత్క్రోష్‌లో అది ల్యాండ్ కాలేదు. బయల్దేరిన 15 నిమిషాలకే చెన్నై ఎయిర్ పోర్టులోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. బంగాళాఖాతం మీదుగా వెళ్తుండగా రాడార్‌తో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు ధృవీకరించుకుని రంగంలోకి దిగారు. అదృశ్యమైన విమానం కోసం భారతదేశం తీవ్రంగా వెతికింది. భారత వైమానిక దళం అణువణువు గాలించినా ఫలితం లేకపోవడంతో.. సెప్టెంబర్‌లో బాధిత కుటుంబ సభ్యులకు ‘‘విమానాన్ని గుర్తించడంలో ప్రభుత్వం విఫలమైందని, విమానంలో ఉన్నవారిని చనిపోయినట్లు భావించి ప్రకటించడం తప్ప వేరే మార్గం లేద’’ని లేఖలు రాసింది. అలా.. విమానం బంగాళాఖాతంలో కూలిపోయి ఉండవచ్చునని అధికారులు అప్పుడు భావించారు. విమానం కోసం ఐదు యుద్ధనౌకలు సముద్ర జలాల్లోకి గాలింపు చర్యల నిమిత్తం బరిలోకి బయల్దేరాయి. వీటితో పాటు 13 ఫుల్ స్పీడ్ పడవలను కూడా పంపారు. అయితే జాడను గుర్తించేందుకు ఉపయోగపడే పరికరాలను ఎయిర్‌క్రాఫ్ట్ మోసుకెళ్లలేదనే విషయం దర్యాప్తులో వెల్లడైంది. దీంతో సెర్చ్ ఆపరేషన్‌కు తీవ్ర విఘాతం ఏర్పడింది. అలా.. ఎయిర్‌క్రాఫ్ట్ కోసం భారత్ జరిపిన అతిపెద్ద గాలింపు చర్యగా మిగిలిపోయింది ఈ ఆపరేషన్. -
కూతురు జాడ కోసం తుది శ్వాస వరకు ఆరాటపడ్డ ఓ తల్లి వ్యథ!
కాలం ఎప్పుడూ.. బంధాల కోసం పాకులాడే అనురాగాలతో పాటు, ఆ బలహీనతలతో ఆటలాడుకునే నైజాన్ని సరితూకమేస్తుంది. జరిగినదాంట్లో పాపపుణ్యాలను పక్కనపెడితే చివరికి మిగిలిన వ్యథే.. ఎన్నో హెచ్చరికలను జారీ చేస్తుంది. సుమారు యాభై ఏళ్ల క్రితం అదృశ్యమైన ‘అమీ బిల్లిగ్’ అనే అమ్మాయి ఉదంతం అలాంటిదే. అమెరికా, ఫ్లోరిడాలోని మయామిలో ‘కోకోనట్ గ్రోవ్’ సమీపంలో నివసించే నెడ్ బిల్లిగ్, సుసాన్ బిల్లిగ్ దంపతులు.. కూతురు అమీ, కొడుకు జోస్‌తో కలసి సంతోషంగా జీవించేవారు. తండ్రి నెడ్ ఆర్ట్ గ్యాలరీ నడుపుకుంటుంటే.. తల్లి సుసాన్ ఇంటీరియర్ డిజైనర్‌గా పనిచేస్తూ .. వచ్చినదానితోనే పిల్లల్ని ప్రాణంగా చూసుకునేవారు. జోస్ కంటే అమీ సుమారు పదేళ్లు పెద్దది. అమ్మాయికి యుక్త వయసు వచ్చేనాటికి.. ఆ కుటుంబాన్ని ఊహించని ఉపద్రవం ముంచెత్తింది. అది 1974 మార్చి 5, మధ్యాహ్నం 12 దాటింది. పదిహేడేళ్ల అమీ.. స్కూల్ నుంచి ఇంటికి వచ్చింది. రాగానే ఆర్ట్ గ్యాలరీకి కాల్ చేసి.. తండ్రితో మాట్లాడింది. ‘డాడ్.. నేను మా స్నేహితులతో కలసి హోటల్లో లంచ్‌కి వెళ్తున్నా.. నాకు 2 డాలర్లు కావాలి’ అని కోరింది. ‘సరే.. గ్యాలరీకి వచ్చి తీసుకెళ్లమ్మా’ అన్నాడు నెడ్. వెంటనే రెడీ అయ్యి.. కెమెరా పట్టుకుని.. ‘అటు నుంచి అటే వెళ్తా మమ్మీ’ అని తల్లికి చెప్పి.. తండ్రి దగ్గరకు బయలుదేరింది అమీ. ఇంటి నుంచి గ్యాలరీకి పావుగంట పడుతుంది. దాంతో కాసేపట్లో కూతురు వస్తుందని నెడ్ ఎదురు చూడసాగాడు. గంటదాటినా రాలేదు. ‘ఒకవేళ డబ్బులు వద్దనుకుని వెళ్లిపోయిందేమో’ అని సరిపెట్టుకున్నాడు నెడ్. సాయంత్రం ఇంటికెళ్లి చూస్తే.. కూతురు ఇంకా ఇల్లు చేరలేదు. మధ్యాహ్నం వెళ్లిన అమ్మాయి.. రాత్రి కావస్తున్నా రాకపోయేసరికి భయమేసింది. పైగా అమీ డబ్బులు తీసుకోవడానికి తన దగ్గరకు కూడా రాలేదనే భర్త మాటలు విని.. సుసాన్‌కి గుండె ఆగినంత పనైంది. వెంటనే ఆమె స్నేహితుల్ని ఆరా తీస్తే.. తెలియదనే సమాధానమే వినిపించింది. పోలీసుల్ని ఆశ్రయిస్తే.. ‘ఈ రోజుకి చూడండి.. రేపటికీ రాకపోతే కేసు నమోదు చేసుకుందాం’ అనే బదులొచ్చింది. మరునాడు కూడా అమీ అడ్రస్ లేకపోయేసరికి.. అన్నమాట ప్రకారం పోలీసులు రంగంలోకి దిగారు. ఆ వెతుకులాటలోనే వైల్డ్‌వుడ్ ఎగ్జిట్ అనే హైవే రోడ్లో అమీ తీసుకెళ్లిన కెమెరా దొరికింది. దానిలోని ఏ ఫొటో.. తదుపరి విచారణకు సహకరించలేదు. కొన్ని రోజులకు.. నెడ్ దంపతులకు ఓ నంబర్ నుంచి బెదిరింపు కాల్స్ రావడం మొదలయ్యాయి. ఆ కాల్స్‌లో ప్రతిసారి.. ‘మమ్మీ, డాడీ కాపాడండి’ అంటూ ఏడ్చే అస్పష్టమైన అమ్మాయి స్వరం వారిని వణికించింది. ‘పోలీసులకు చెప్పకుండా 30 వేల డాలర్లు ఇస్తే.. మీ అమ్మాయిని వదిలిపెడతాం.. లేదంటే చంపేస్తాం’ అనే హెచ్చరిక.. వారి కన్నపేగును మెలిపెట్టింది. దాంతో వారు చెప్పిన సమయానికి.. అడిగినంత డబ్బు పంపించేశారు. అయితే రోజులు గడిచినా అమీ తిరిగి రాలేదు. కనీసం ఆ నంబర్ నుంచి ఫోన్ కాల్స్ కూడా లేవు. తిరిగి కాల్ చేస్తే కలవలేదు. దాంతో నెడ్ దంపతులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కూపీ లాగిన పోలీసులు.. ఆ బెదిరింపు కాల్స్ చేసింది చార్ల్స్, లారే గ్లాసర్ అనే కవలలని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. చివరికి వాళ్లు కేవలం డబ్బు కోసం మాత్రమే అలా చేశారని.. అమీ మిస్సింగ్‌కి వాళ్లకి ఏ సంబంధం లేదని తేలింది. అమీ తల్లిదండ్రుల ఎమోషన్స్‌తో ఆడుకున్నందుకు కోర్టు వారికి జైలు శిక్ష విధించింది. మరికొన్ని రోజులకు.. ‘ది అవుట్లాస్’ అనే మోటర్‌సైకిల్ గ్యాంగ్.. అమీని కిడ్నాప్ చేసుండొచ్చు అనే కొందరు స్థానికుల అనుమానం.. నెడ్ దంపతుల్ని బెదరగొట్టింది. దాంతో నెడ్ ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు.. పోలీసులతో సంబంధం లేకుండా.. ఓ అనుమానిత బైక్ ముఠా సభ్యులతో నెడ్ కుటుంబానికి రహస్య సమావేశం ఏర్పాటు చేశాడు. అమీ ఫొటోలు చూసిన ఆ ముఠా సభ్యుల్లో కొందరు.. ‘మేము అమీనైతే చూడలేదు. కానీ, గతంలో కొందరు అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి అమ్ముకున్న మాట వాస్తవమే’ అని ఒప్పుకున్నారు. అందులో కొందరు కేవలం క్రెడిట్ కార్డ్స్ కోసం, బైక్స్ కోసమే అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి, విక్రయించినట్టు చెప్పారు. అమీ వివరాలు ఇతర బైకర్స్ నుంచి సంపాదిస్తామని నెడ్ ఫ్యామిలీకి మాటిచ్చారు. కానీ వాళ్ల నుంచి ఆ తర్వాత ఎలాంటి సహాయమూ అందలేదు, సమాచారమూ రాలేదు. అయితే అంతకు ఐదేళ్ల క్రితం బైకర్ ముఠాకు చిక్కిన ‘గినా ఆండ్రూ’ అనే అమ్మాయి తప్పించుకుని క్షేమంగా తిరిగి రావడంతో.. అమీ కూడా అలాగే తిరిగి వస్తుందని ఆశపడింది నెడ్ కుటుంబం. కానీ అలా జరగలేదు. అమీ తల్లి సుసాన్.. కూతురి ఫొటోలు పట్టుకుని పిచ్చిదానిలా చాలా చోట్ల వెతికింది. ఆ క్రమంలోనే తమ ఇంటికి 160 మైళ్ల దూరంలో ఉన్న ఒక కన్వీనియెన్స్ స్టోర్ మేనేజర్ని కలిసింది. అమీ ఫొటో చూసి గుర్తుపట్టిన ఆ మేనేజర్.. ‘అమీ ఇద్దరు బైకర్స్‌తో కలసి చాలాసార్లు మా స్టోర్‌కి వచ్చింది. ఆమె వెజిటేరియన్ కావడంతో తను నాకు బాగా గుర్తుంది’ అని చెప్పాడు. అతని మాట విన్న కొన్ని పత్రికలు.. అమీ తన ఇష్టప్రకారమే కుటుంబానికి దూరంగా పారిపోయిందనే కథనాలను అల్లాయి. ఆ ఊహాగానాల్లో ఏడాది గడిచిపోయింది. సుసాన్ మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదు. ఎవరి మాటలూ నమ్మలేదు. ఒకరోజు ఓ కొత్త నంబర్ నుంచి నెడ్ కుటుంబానికి కాల్ వచ్చింది. ‘నా పేరు జాన్సన్.. అమీ గురించి మరచిపొండి, తనని వెతకొద్దు.. నేనో సెక్స్ రాకెట్ సభ్యుడ్ని. తనని బంధించింది నేనే’ అని బెదిరించాడు అవతలి వ్యక్తి. కాసేపటికే ఫోన్ కట్ అయ్యింది. అతడి నుంచి వరసగా కాల్స్ వస్తూనే ఉన్నాయి. కానీ అతడు పబ్లిక్ బూత్ నుంచి కాల్స్ చేస్తుండడంతో పోలీసులు పట్టుకోలేకపోయారు. ఆ బెదిరింపు కాల్స్ నెడ్ కుటుంబాన్ని మరింత కుంగదీశాయి. ‘అమీ మాట వినలేదని నాలుక కత్తిరించాం. మీరు ఇలానే అమీ కోసం వెతుకుతూ ఉంటే ఆమెను చంపేస్తాం. అమీని కిడ్నాప్ చేసినట్లే.. నిన్ను కూడా కిడ్నాప్ చేస్తాం’ అని సుసాన్‌ని వీలు చిక్కినప్పుడల్లా హడలెత్తించాడు జాన్సన్. అసభ్యకరమైన పదజాలంతో హింసించేవాడు. వేధింపులు ఎక్కువైనా.. ఏదో ఒకరోజు జాన్సన్.. అమీ గురించి నిజం చెబుతాడేమోనన్న ఆశతో ఫోన్ నంబర్ మార్చలేదు నెడ్ కుటుంబం. ఇక 1975 చివరిలో డేవిడ్ అనే ఒక ముఠా సభ్యుడు సుసాన్‌ని వ్యక్తిగతంగా కలిశాడు. ‘ఒక వార్తాపత్రికలో అమీ ఫొటో చూసి, గుర్తుపట్టి వచ్చాను. ఆమె నాకు బాగా తెలుసు’ అని చెప్పాడు. ‘ఎలా తెలుసు?’ అని అడిగితే.. ‘చట్టవిరుద్ధంగా ఒక ముఠాకి కొంత డబ్బు ఇచ్చి.. కొన్ని నెలలకుగాను అమీని నేను కొన్నాను. ఆమె నా దగ్గరున్నంత కాలం దిగులుగానే ఉంది. మూగది కావడంతో తన బాధ నాకు అర్థం కాలేదు’ అని చెప్పాడు. ఆ అమ్మాయి మూగది అనడంతో.. జాన్సన్ మాటలు గుర్తొచ్చాయి సుసాన్‌కి. అమీ ఒంటిమీదుండే రహస్య పుట్టుమచ్చల వివరాలు డేవిడ్ నోట వినడంతో.. తన నమ్మకం బలపడింది. అయితే సుసాన్ ఆవేదన చూడలేకపోయిన డేవిడ్.. అమీని వెతకడంలో సాయం చేస్తానని మాటిచ్చాడు. ఆ మాట ప్రకారమే డేవిడ్.. ఒకరోజు సుసాన్‌ని అసాంఘిక ప్రదేశానికి తీసుకెళ్లి.. అక్కడున్న ఓ ముఠా దగ్గర అమీ గురించి ఆరా తీశాడు. తీరా వారికి డేవిడ్ మీద అనుమానం వచ్చి దాడికి దిగారు. అదృష్టవశాత్తూ సుసాన్ తప్పించుకోగలిగింది. సరిగ్గా ఐదువారాలకు కాళ్లు, చేతులకు కట్లతో డేవిడ్.. సుసాన్ దగ్గరకు వచ్చాడు. ఓక్లహామా, తుల్సాలోని ఒక బార్లో అమీ పనిచేస్తున్నట్లు తెలిసిందని సమాచారమిచ్చి వెళ్లిపోయాడు. తిరిగి ఎప్పుడూ సుసాన్‌ని అతడు కలుసుకోలేదు. కూతురు మీద బెంగతో సుసాన్‌కి గుండెపోటు వచ్చింది. అయినా సరే.. కూతురి కోసం తుల్సా వెళ్లి.. అక్కడే కొన్ని నెలల పాటు ఉండి.. సమీపంలోని బార్లు, టాటూ సెంటర్స్ అన్నీ వెతికింది. అయితే అమీ ఫొటో చూసిన కొందరు.. డేవిడ్ చెప్పినట్లే ఆమె మూగ అమ్మాయిగా గుర్తు చేసుకున్నారు. ఏళ్లు గడిచాయి. జాన్సన్ వేధింపులూ ఆగలేదు. సుసాన్‌కి మరో రెండుసార్లూ గుండెపోటు వచ్చింది. అమీ మిస్ అయిన నాటికి బాలుడిగా ఉన్న జోస్ పెద్దవాడయ్యాడు. తల్లితో పాటు తన అక్క కోసం వెతకడం మొదలుపెట్టాడు. ఇక తండ్రి నెడ్ 1993లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బారినపడ్డాడు. చనిపోయే ముందు చివరిసారిగా అమీని చూడాలని ఆరాటపడ్డాడు. జాన్సన్ కాల్ కోసం ఎదురు చూసిన సుసాన్.. నెడ్ పరిస్థితి వివరించి.. తన కూతుర్ని చూపించమని వేడుకుంది. అయినా జాన్సన్ నుంచి సమాధానం రాలేదు. చివరికి నెడ్ తన కోరిక తీరకుండానే మరణించాడు. హెన్రీ(ఎడమవైపు), అమీ(కుడివైపు) సుమారు 20 ఏళ్లకి.. పోలీసులు జాన్సన్‌ని అదుపులోకి తీసుకోగలిగారు. అయితే అతడి పూర్తిపేరు హెన్రీ జాన్సన్ బ్లెయిర్ అని.. కస్టమ్స్ డిపార్ట్మెంట్ మాజీ ఉద్యోగి అని గుర్తించారు. తీరా అధికారులు తమదైన శైలిలో విచారిస్తే.. ‘అమీ నాకు తెలియదు. కేవలం సెక్సువల్ ప్లెజర్ కోసమే నెడ్ కుటుంబానికి అలా బూటకపు కాల్స్ చేసేవాడ్ని’ అని చెప్పాడు. అతడో ‘మానసిక రోగి, మద్యానికి బానిస’ అని అతడి సన్నిహితులు తెలిపారు. అతడు మరికొందరికి చేసిన ఇలాంటి బూటకపు కాల్స్ అధికారికంగా నిరూపితమయ్యాయి. దాంతో నెడ్ కుటుంబానికి హెన్రీ జాన్సన్ కలిగించిన మనోవ్యథకు జైలు శిక్ష పడింది. అయితే హెన్రీ జాన్సన్.. అమీకి సుపరిచితుడేనని తేల్చాయి కొన్ని ఆనవాళ్లు. అమీ ఫొటోస్‌లో ఉన్న ఒక తెల్ల కారు.. హెన్రీ జాన్సన్ దగ్గరుంది. అలాగే అమీ తన డైరీలో ఒక చోట ‘హంక్ అనే స్నేహితుడు నన్ను దక్షిణ అమెరికా తీసుకెళ్తా అన్నాడు’ అని రాసుకుంది. ఆశ్చర్యకరంగా కస్టమ్స్ ఏంజెంట్‌గా హెన్రీ జాన్సన్ మారుపేరు హంక్. అయితే స్పష్టమైన మరే ఇతర సాక్ష్యాలు లేకపోవడంతో హెన్రీ ఈ కేసు నుంచి బయట పడ్డాడు. ఇక 1997లో ఒక మహిళ.. పోలీస్ స్టేషన్‌కి వచ్చి ‘పాల్ బ్రాండ్’ అనే వ్యక్తి నా భర్త, మోటర్‌సైకిల్ ముఠా మాజీ సభ్యుడు, అతడు చనిపోతూ అమీ వివరాలు చెప్పాడు’ అని షాకిచ్చింది. ఆమె మాటలకు అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. పాల్ ఆమెతో చెప్పిన మాటల సారాంశం ఇలా ఉంది. ‘ఒకసారి అమీ.. మోటర్‌సైకిల్ ముఠా సభ్యులను అవమానించిందనే కక్షతో ఆమెను కిడ్నాప్ చేసి, ఫ్లోరిడా ఎవర్గ్లేడ్స్ పార్టీకి తీసుకెళ్లాం. ఆమెపై పలుమార్లు లైంగికదాడి చేశాం. ఆమెను లొంగదీసుకోవడానికి చాలాసార్లు డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడంతో ఆమె చనిపోయింది. దాంతో ఆ రాత్రికే ఓ చిత్తడి నేలలో ఆమెను పూడ్చిపెట్టాం’ అని చనిపోయే ముందు భార్యతో చెప్పాడట పాల్. దీన్ని నమ్మేందుకు ఒక ఆధారం ఉంది. అమీ మిస్ అయిన కోకోనట్ గ్రోవ్కి.. పాల్ చెప్పిన క్రైమ్ జరిగిన ఎవర్గ్లేడ్స్కి మార్గం మధ్యలోనే అమీ తీసుకెళ్లిన కెమెరా దొరికింది. మొదట పాల్ మాటల్ని నమ్మిన సుసాన్ కుటుంబం.. అమీకి స్మారక చిహ్నం కూడా కట్టించింది. కానీ పాల్ పబ్లిసిటీ కోసం ఈ కథను సృష్టించి ఉంటాడేమో అనే ఆలోచన రావడంతో మళ్లీ అమీ కోసం వెతకడం మొదలుపెట్టింది ఆ కుటుంబం. దురదృష్టవశాత్తు సుసాన్ .. 2005, జూన్ 7న ఎనభై ఏళ్ల వయసులో మరణించింది. ఇప్పుడు అమీని వెతికే బాధ్యతను.. జోస్ అందుకున్నాడు. అసలు.. అమీ ఎవరినైనా గుడ్డిగా నమ్మి మోసపోయిందా? లేక బలవంతంగా అపహరణకు గురైందా? హెన్రీ జాన్సన్ మాటల్లో వాస్తవమెంత? పాల్ తన భార్యకు చెప్పింది నిజమేనా? డేవిడ్ ఏమయ్యాడు? ఇలా ఎన్నో ప్రశ్నలు నేటికీ మిస్టరీనే. ∙సంహిత నిమ్మన (చదవండి: -
అప్పటికే సూపర్ స్టార్,రెండో పెళ్లి.. ఇప్పటికీ మిస్టరీగా చమ్కీలా మరణం
మనసులో పుట్టిన మాటలకు బాణీ కట్టి రాగం అందుకుంటే, అది మహామహా జనసందోహాలను కూడా ఏకం చేసి ఉరకలేయిస్తుంది. సై.. సై.. అంటూ ఉర్రూతలూగిస్తుంది. విప్లవాలను, ఉద్యమాలను, సంస్కరణలను జతచేర్చి.. తరతరాలకు పాఠమవుతుంది. అయితే అదే రాగం కొందరికి చేదును, మరికొందరికి చికాకును ఇంకొందరిలో అసూయనూ రగిలించి నిప్పు రాజేస్తుంది. ఆ నిప్పే కాల్చేసిందో, లేక అంతటి ఔదార్యమున్న కలానికి కులం రంగు అద్దిన ఉన్మాదమే కడతేర్చిందో.. తెలియదు కానీ అమర్ సింగ్ చమ్కీలా జీవితంలో పెద్ద ఉపద్రవమే ముంచుకొచ్చింది. అసలు ఎవరీ చమ్కీలా? ఏం జరిగింది? భారతీయ సంగీత చరిత్రలో చమ్కీలా కథకు ప్రత్యేకమైన అధ్యాయముంది. చమ్కీలా అంటే పంజాబీలో ప్రకాశవంతమైనదని అర్థం. పంజాబ్, లూథియానా సమీపంలోని దుగ్రీ గ్రామంలో చమార్ (దళిత్) కులానికి చెందిన కర్తార్ కౌర్, హరిరామ్ సింగ్ దంపతులకు 1960 జూలై 21న చమ్కీలా జన్మించాడు. అతని అసలు పేరు ధనీరామ్. చిన్నవయసులోనే గుర్మైల్ కౌర్ అనే బంధువుల అమ్మాయితో పెళ్లి జరిగింది. వీరికి అమన్‌దీప్ కౌర్, కమన్ చమ్కీలా (ప్రస్తుతం ఫోక్ సింగర్) అనే ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. మరో కొడుకు పుట్టి.. అనారోగ్యంతో చనిపోయాడు. మొదటి నుంచి ఎలక్ట్రీషియన్ కావాలని ఆశపడిన ధనీరామ్.. ఆ ఆలోచనను పక్కనపెట్టి.. ఆర్థిక కష్టాలను ఎదుర్కోవడానికి దుస్తుల మిల్లులో చేరాడు. అక్కడ ఓ స్నేహితుడు ఇతని రాతకు ముగ్ధుడై.. సురీందర్ షిండా అనే ఓ సంగీతవిద్వాంసుడి దగ్గరకు తీసుకెళ్లాడు. ధనీరామ్ కథలో, పేరులో మార్పులు అక్కడి నుంచే మొదలయ్యాయి. చమ్కీలా (ధనీరామ్) టీమ్‌లో చేరినప్పటి నుంచి షిండా పేరు దేశవిదేశాలకు పాకింది. చమ్కీలాకు మాత్రం గుర్తింపు దక్కలేదు. పైగా ఇతర దేశాల్లో ప్రదర్శనలకు చమ్కీలాను తీసుకెళ్లడానికి షిండా ఇష్టపడేవాడు కాదు. 1980లో ఒకసారి షిండా.. కెనడా పర్యటనకు వెళ్లినప్పుడు ఆ గ్రూప్‌లోని సోనియా అనే మరో గాయని చమ్కీలాను కలిసింది. ‘షిండాను దాటి నీకు గుర్తింపు రావాలంటే.. నేను కొత్తగా ప్రారంభిస్తున్న బృందంలో చేరు’ అని చెప్పడంతో చమ్కీలా సరే అన్నాడు. సోనియా పెట్టుబడి పెడితే.. చమ్కీలా తన ఆలోచనలకు మరింత పదునుపెట్టి.. ఆమె దగ్గరే జీతానికి కుదిరాడు. అనుకున్నట్లే షిండా కెనడా నుంచి పంజాబ్ వచ్చేలోపు.. సోనియా ఆధ్వర్యంలో ఎనిమిది యుగళగీతాలను విడుదల చేసి పంజాబ్‌ని ఓ ఊపు ఊపాడు చమ్కీలా. అయితే ఆ ఏడాది చివరికి.. సోనియా, ఆమె భర్త కలసి.. తన కారణంగా లక్షలు సంపాదిస్తూ, తనకు నెల జీతం మాత్రమే ఇస్తున్నారని గ్రహించాడు. దాంతో చమ్కీలా.. తానే ఒక రంగస్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నట్లే హార్మోనియం, ఢోలక్ వాయించగలిగే బృందంతో పాటు.. అమర్‌జోత్ కౌర్ అనే ఒక మహిళా గాయనినీ తన టీమ్‌లోకి తీసుకుని.. ఆల్బమ్స్ రిలీజ్ చేయడం మొదలు పెట్టాడు. రిలీజ్ చేసిన ప్రతి ఆల్బమ్ హిట్ కొట్టడంతో చమ్కీలా పంజాబ్ సూపర్ స్టార్ అయ్యాడు. చమ్కీలా పాటల్లో కొన్ని.. ‘పెహెలే లల్కార్ నాల్ (తొలుత బాకా మోగింది)’ ఇది పెళ్ళైన జంట గురించి పాడిన పాట. ‘బాబా తేరా నన్కానా (బాబా నీ మందిరం, నీ గురువు గురునానక్)’ ఇది సిక్కులకు ధైర్యం చెప్పే పాట. ‘భూల్ గయీ మై ఘుండ్ కడ్నా (ముసుగు వేసుకోవడం మరచాను)’.. లాంటి పాటలూ ఎంతో ప్రాచుర్యం పొందాయి. ఆ సమయం లోనే అతనికి అమర్ జోత్‌తో స్నేహం కుదిరింది. ఆ స్నేహం ప్రేమగా మారి.. పెళ్లిదాకా వెళ్లింది. మొదటి భార్య గుర్మైల్ని ఒప్పించి (విడాకులు తీసుకున్నాడని కొందరంటారు).. 1983లో అమర్జోత్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి జైమన్ (ప్రస్తుత ఫోక్ సింగర్) అనే కొడుకు పుట్టాడు. వివాహేతర సంబంధాలు, మత సంఘర్షణలు, మద్యపానం, వరకట్నాలు, మాదకద్రవ్యాలు.. ఇలా ప్రతి సమస్యపైనా పాట కట్టి.. ప్రజలను ఆలోచింపచేసేవాడు చమ్కీలా. వేడుక ఏదైనా.. ప్రతి ఊళ్లో అతని దరువు వినిపించాల్సిందే. ఏడాదికి ఊరూరా 366 ప్రత్యక్ష ప్రదర్శనలు చేసేవారంటే చమ్కీలా దంపతులు ఎంత బిజీగా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు. 1988 మార్చి 8న మధ్యాహ్నం 2 గంటలకు మెహసంపూర్ సమీపంలోని ప్రదర్శనకు వెళ్తుంటే.. ముసుగులేసుకున్న కొందరు దుండగులు బైక్స్ మీదొచ్చి చమ్కీలా కారుకు అడ్డుపడ్డారు. మరుక్షణమే తుపాకులతో తూటాల వర్షం కురిపించారు. ఆ దాడిలో చమ్కీలా(27), అమర్‌జోత్ అక్కడికక్కడే కన్నుమూశారు. ఆ సమయంలో అమర్‌జోత్ గర్భవతి. సంఘటనా స్థలంలో ఉన్న కొందరు గ్రామస్థులు.. ఆ దుండగులను వెంబడించినా దొరకలేదు. దాంతో ఎవరు చంపారు? అనేది నేటికీ మిస్టరీగా మిగిలిపోయింది. నిజానికి ఈ హత్యకేసుపై చాలా ఊహాగానాలున్నాయి. అప్పటి ఖలిస్తాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా పాటలు రాసినందుకే సిక్కు ఉగ్రవాదులు చమ్కీలాను చంపేశారని కొందరి అభిప్రాయం. కొన్ని సంగీత బృందాలు కేవలం చమ్కీలా వల్లే మరుగున పడ్డాయని.. ఆ అక్కసుతోనే వారంతా కలసి అతనిని చంపించారని మరి కొందరి ఊహ. మరోవైపు చమ్కీలా రెండో భార్య అమర్‌జోత్ ఉన్నత వర్గానికి చెందిన స్త్రీ కావడంతో.. ఇది పరువు హత్య అని.. అమర్‌జోత్ కుటంబీకులే ఈ నేరానికి పాల్పడి ఉంటారని ఇంకొందరి వాదన. ఇతడి జీవితకథపై చాలా సినిమాలు, పుస్తకాలూ విడుదలయ్యాయి. వాటిలో కొన్ని వివాదాల పాలయ్యాయి. ఏది ఏమైనా చమ్కీలా గొంతు మూగబోయి 35 ఏళ్లు దాటింది. అయినా నేటికీ జానపద సంగీత ప్రియులకు అతడి పాట వినిపిస్తూనే ఉంది. ∙సంహిత నిమ్మన -
అబద్ధమని కొట్టిపారేయకండి.. దెయ్యాలతో మాట్లాడిన చిన్నారి!
దెయ్యాల కథలు సృష్టించే ప్రకంపనాలకు సాక్ష్యాలు తక్కువ. నిజమా? అబద్ధమా? అనే సంశయం నుంచి పుట్టే ఆత్రానికి.. వాదోపవాదాలు ఎక్కువ. అందుకే ‘పుట్టుకకు ముందు.. చావు తర్వాత..’ అనే ఆత్మాన్వేషణ కథలెప్పుడూ మిస్టరీలుగానే మిగిలిపోతాయి. అలాంటిదే సరిగ్గా 34 ఏళ్ల క్రితం.. ఓ నాలుగేళ్ల అమ్మాయి జీవితంలో జరిగింది. అది 1989. ఫిబ్రవరి మొదటి వారం. ఆండ్రూ వైరిక్, లీసా దంపతులు తమ నాలుగేళ్ల కూతురు హెడీతో కలసి.. కొత్తింట్లోకి అడుగుపెట్టారు. రావడం రావడమే హెడీ ఆడుకోవడానికి పరుగులు తీస్తే.. భార్యభర్తలు మాత్రం ఇల్లంతా సర్దుకునే పనిలో పడ్డారు. ఆ ఇల్లు అమెరికా, జార్జియాలోని ఎల్లెర్స్లీలో ఉంది. హెడీకి ఆ ఇల్లు బాగా నచ్చేసింది. అక్కడున్న ఓ పెద్దాయన కూడా. ఆ ఇంటికి రావడం రావడమే పెరట్లో ఉన్న ఆయనతో ఆటలాడటం మొదలుపెట్టింది. పనుల హడావిడి నుంచి తేరుకున్న హెడీ తల్లి లీసా.. ఆ పెద్దాయన సంగతులన్నీ హెడీ నోట విని షాక్ అయ్యింది. అతడి పేరు గోర్డీ అని హెడీ చెప్పింది. అసలు లీసా.. ఆ ఇంటి చుట్టు పక్కల హెడీ చెప్పిన పోలికలతో ఎవరినీ చూసింది లేదు. ‘హెడీని కిడ్నాప్ చేయడానికి ఎవరైనా నాటకం ఆడుతున్నారా?’ అనే అనుమానం లీసాని కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే భర్తకు విషయం చెప్పింది. హెడీని బయటికి పోనీకుండా జాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత హెడీ ప్రవర్తనపై దృష్టిపెట్టిన లీసా.. ఆమె ఎవరితోనో మాట్లాడుతోందని.. ఆమె చేతిని ఎవరో పట్టుకుని నడుస్తున్నారని గుర్తించింది. పైగా అర్ధరాత్రులు ఊయల ఊగడం, నిద్రలో లేచి నడవడం ఇలా చాలానే చేసేది హెడీ. లీసాకి ఏం అర్థం కాలేదు. కానీ వెన్నులో కాస్త భయం మొదలైంది. హెడీకి స్నేహితులు లేకపోవడంతో అలా ఏదో ఊహించుకుని ఆడుకుంటోందని సరిపెట్టుకుంది. అయితే హెడీ.. గోర్డీతో పాటు లోన్ అనే మరో ముసలాయన పేరు చెప్పడం మొదలుపెట్టింది. లోన్ ఎడమ చేతికి రక్తంతో కట్టు ఉందని.. అతడి షర్ట్ నిండా రక్తం ఉందని చెప్పేది హెడీ. వెంటనే లీసా.. తన భర్తతో కలసి.. ‘హెడీ చెబుతున్న పేర్లతో ఎవరైనా ఉన్నారా?’ అంటూ ఆ చుట్టూ వెతకడం మొదలుపెట్టింది. లోన్, గోర్డీ ఇద్దరు కాదేమో.. ఒకే వ్యక్తి అయ్యి ఉంటాడని వాళ్లు నమ్మారు. ‘లోన్ గోర్డీ అనే పేరు ఎప్పుడైనా విన్నారా?’ అంటూ అందరినీ ఆరా తీశారు. ఆ ప్రయత్నంలోనే లోన్ గోర్డీ గురించి పక్కింట్లో ఉండే తన సోదరితో చర్చించింది లీసా. అయితే.. లీసా చెప్పింది విని లీసా సోదరి షాక్ అయ్యింది. అతడి పూర్తి పేరు జేమ్స్ ఎస్. గోర్డీ అని.. అతడు తమ ఇంటి మాజీ యజమాని అని, అతడు చనిపోయి చాలా ఏళ్లు అయ్యిందని చెప్పింది ఆమె. సాక్ష్యం కోసం తన ఇంటి దస్తావేజులు కూడా చూపించింది. అది చూడగానే లీసాకి చెమటలు పట్టేశాయి. వెంటనే ఇద్దరూ.. గోర్డీ బంధువైన కేథరీన్ లెడ్ఫోర్డ్ అనే స్థానికురాలి దగ్గరకి పరుగుతీశారు. జేమ్స్ గోర్డీ 1974లోనే మరణించాడని, అతడికి కొలంబస్లో రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండేదని, చాలా సంవత్సరాలు అతను జార్జియాలో ఎల్లెర్స్లీలో ఉండే ఎల్లిసన్ మెథడిస్ట్ ^è ర్చ్‌లో సండే స్కూల్ సూపరింటెండెంట్‌గా పనిచేశాడని వివరాలిచ్చింది కేథరీన్. అచ్చం హెడీ చెప్పినట్లే.. గోర్డీ మెరిసిన జుట్టుతో.. సూట్, టై, నల్లటి బూట్లు వేసుకుని ఎప్పుడూ నీట్‌గా ఉండేవాడని నిర్ధారించింది. వెంటనే హెడీని కేథరీన్ ఇంటికి తీసుకుని వెళ్లిన లీసా.. తన పాపకి ఆ ఇంట్లోని పాత ఫొటోలన్నీ చూపించమని కోరింది. ఆశ్చర్యకరంగా ఆ ఫొటోల్లో లోన్ ఫొటోని గుర్తుపట్టింది హెడీ. ‘ఎడమ చేతికి కట్టుతో ఉన్న ముసలాయన ఇతడే’ అంటూ లోన్ ఫొటోని చూపించింది. అతడ్ని హెడీ గుర్తు పట్టగానే బిత్తరపోయింది కేథరీన్. వరుసగా లీసా, ఆండ్రూ, హెడీ, జోర్డాన్, జోయిస్ (హెడీ మేనత్త) ‘ఇతడు మా అంకుల్ లోన్’ అంది షాక్‌లో. లోన్ 20 ఏళ్ల యువకుడిగా ఉన్నప్పుడు ఎక్కువగా ఇక్కడే గడిపేవాడని, అతడు 1957లో క్యాన్సర్‌తో చనిపోయాడని, అతడు ఓ ప్రమాదంలో తన ఎడమ చేతిని పోగొట్టుకున్నాడని చెప్పింది. దాంతో లీసాకి.. హెడీ మాట్లాడే గోర్డీ, లోన్లు కల్పితపాత్రలు కాదని.. వారు నిజంగా చనిపోయిన వ్యక్తులని స్పష్టమైంది. (హెడీ విషయంలో హెడీ మేనత్త జోయిస్ కూడా లీసాకు చాలా సాయం చేసింది).అలా గోర్డీ, లోన్లతో హెడీ సంభాషణ సుమారు నాలుగేళ్ల పాటు సాగింది. 1993లో హెడీ తల్లి గర్భవతి అయింది. అప్పుడొచ్చింది మరో ఆత్మ. అది చీకట్లో బొమ్మల రూపంలో కదలడం హెడీని తీవ్రంగా భయపెట్టింది. కొన్నిసార్లు ఆ ఆత్మ చేసిన హింసకు హెడీ చాలా ఏడ్చేది. అప్పుడప్పుడు హెడీ ముఖంపైన రక్తపు చార లు కనిపించేవి. 1994 ఫిబ్రవరి 3న హెడీకి జోర్డాన్ అనే చెల్లెలు పుట్టింది. 2 వారాల తర్వాత, హెడీ మరింతగా వణకసాగింది. అయితే ఆ ఆత్మ గురించి.. హెడీ తండ్రి ఆండ్రూ మొదట్లో నమ్మలేదు. కానీ కొన్ని రాత్రుల తర్వాత ఆండ్రూ కూడా ఆ ఆత్మ దాడికి గురయ్యాడు. ఆ సమయంలోనే హెడీ ఒంటి మీద గోళ్ల చారికలు తీవ్రమైన నొప్పిని కలిగించేవి. వెంటనే పారా సైకాలజిస్ట్ డాక్టర్ విలియం రోల్‌ని ఇంటికి పిలిపించింది లీసా. హెడీ చెప్పే మాటలు నిజమేనన్న నిర్ధారణకు వచ్చిన రోల్.. చనిపోయిన వారితో కమ్యూనికేట్ చేయడానికి హెడీ.. ఏదైనా రహస్యమైన శక్తిని కలిగి ఉందా? అంటూ హెడీపై ఎన్నో ప్రయోగాలు చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఏ విషయాన్నీ తేల్చలేకపోయాడు. కొన్నేళ్లకు హెడీ కుటుంబం ఆ ఇంటికి దూరంగా వెళ్లిపోయింది. ఆ తర్వాత గోర్డీ, లోన్ ఆత్మలు హెడీకి కనిపించడం మానేశాయి. కానీ ఇప్పటికీ హెడీని చీకటి బొమ్మలు, వికృత రూపాలు, జంతు ఆత్మలు భయపెడుతూనే ఉన్నాయట. హెడీకి సాధారణమైన జీవితం గడపాలనే ఆశే ఆమెని ప్రపంచానికి దూరంగా బతికేలా చేస్తోంది. కానీ హెడీకి ఆత్మలు, దుష్టశక్తులు కనిపించడం మాత్రం ఆగలేదు. దురదృష్టవశాత్తూ హెడీ తండ్రి ఆండ్రూ 45 ఏళ్ల వయసులో 2012లో మరణించాడు. అసలు హెడీ చెప్పింది నిజమేనా? అబద్ధమైతే అంత చిన్ని పిల్ల గోర్డీ, లోన్ల ఆత్మల కథలను ఎలా ఊహించగలిగింది? చనిపోయిన వారితో మాట్లాడే శక్తి హెడీకి నిజంగానే ఉందా? ఇలా వేటికీ సమాధానాల్లేవు. పైగా ఆ కుటుంబం మీడియాకి దూరంగా ఉండేందుకు ప్రయత్నించడంతో సమగ్ర సమాచారమూ దొరకలేదు. ఈ కథ ఆధారంగా ఎన్నో నవలలు, డాక్యుమెంటరీలు, సినిమాలు పుట్టుకొచ్చాయి. అయితే హెడీ చెప్పింది నిజమే అనేవాళ్లు ఎంతమందో.. అబద్ధమని కొట్టిపారేసేవాళ్లూ అంతేమంది. అందుకే ఈ కథ ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. హెడీ మాటల్లో.. ఎప్పుడైతే దుష్ట ఆత్మలు కనిపించడం మొదలయ్యాయో అప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయి. ప్రతిరోజూ ఇలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నా జీవితం చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఇలాంటి వాటితో పేరు పొందాలనుకోను.. ప్రజలు కొంతమంది విశ్వసిస్తారు, కానీ మరికొంత మంది మమ్మల్ని పిచ్చివాళ్లుగా భావిస్తారు. ఇప్పటికీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి.. ధైర్యంగా ఉండటానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటాను. ∙సంహిత నిమ్మన -
అక్కడ శిశువులు ఎలా చనిపోతున్నారనేది?..అంతుపట్టని మిస్టరీ!
ఆ ఊరిలోని కుటుంబాలు పిల్లల్ని కనడానికే భయపడతున్నారు. అక్కడ శిశువులంతా కేవలం పుట్టిన మూడు నెలలకే చనిపోవడం. చనిపోయిన శిశువులంతా సడెన్‌గా కాళ్లు చేతులు వెనక్కి వాలేసి.. గుక్కపెట్టి ఏడ్చి చనిపోతున్నారు. శిశువుల మరణాలన్నీ ఒకే తీరు. పోనీ ధైర్యం చేసి వేరే ఊరు వెళ్లి పురుడు పోసుకుని వచ్చినా.. అదే పరిస్థితి. అక్కడ ప్రజలకు బిడ్డలను కనే యోగం లేదో మరేదైనా కారణం ఉందా!.. అనేది వైద్యులకు సైతం అంతుపట్టకపోవడం ఆశ్చర్యాన్ని రేకెత్తించే అంశం. అసలేం జరిగిందంటే..రెండేళ్ల కిందట 2021 ఆగస్ట్ నెలలో అశోక్, మత్స్యమ్మ దంపతులకు పుట్టిన మొదటి బిడ్డకు రెండు నిండి, మూడో నెల నడుస్తున్న సమయంలో...ఒక రోజు తల్లి మత్స్యమ్మ పాలు ఇచ్చిన కాసేపటికే పిడికిలి బిగిపెట్టి ఏడుస్తూ ప్రాణాలు వదిలేసింది ఆ శిశువు. పిల్లలకు ఏ పేర్లు పెట్టాలా అని అశోక్, మత్స్యమ్మల కుటుంబాల్లో చర్చలు జరుగుతున్న సమయానికే పిల్లల ప్రాణాలు పోయాయి. మత్స్యమ్మ, అశోక్ ఇంట్లో జరిగినట్లుగానే ఆ రూఢకోట గ్రామంలోని అన్ని కుటుంబాల్లోనూ ఇలాంటి విషాదాలే చోటు చేసుకున్నాయి. గత మూడేళ్లలో 20 మంది శిశువులు మరణించారు. వారి మరణాలకు కారణమేంటో తెలుసుకునేందుకు వైద్య బృందాలు పరిశోధనలు చేసినా నిర్దిష్టమైన కారణం ఇంతవరకు తెలియలేదు. చనిపోయిన చిన్నారులంతా మూడు నుంచి ఆరు నెలల లోపు వయసు వారే. మా చేతుల్లో చనిపోడానికే అయితే పిల్లల్ని కనడం ఎందుకు? మాకు పిల్లలు వద్దు, ఊరులో పరిస్థితులు బాగుపడితేనే పిల్లల్ని కంటాం. లేదంటే పిల్లలు వద్దు అని మూడు నెలల వయసున్న ఇద్దరు శిశువుల్ని పొగొట్టుకున్న బాలు, సంధ్యారాణి దంపతులు ఆవేదనగా చెబుతున్నారు. అశోక్, మత్స్యమ్మ దంపతులు కూడా ఇలాగే వాపోయారు. ఇప్పటికే ఇద్దరు పిల్లల్ని పోగొట్టుకున్నాను. కారణాలేంటో తెలియడం లేదు. చనిపోయే క్షణం వరకు పిల్లలు ఆరోగ్యంగానే ఉంటున్నారు. మాతో చక్కగా ఆడుకున్నారు. కానీ ఏం జరుగుతుందో తెలియడం లేదు. ఒక్కసారిగా పిడికిలి బిగబట్టి, తల వాల్చేసి క్షణాల్లో చనిపోతున్నారు. పీహెచ్ సీ కూడా పక్కనే ఉంది. కానీ అక్కడకు తీసుకెళ్లేంత సమయం కూడా దొరకడం లేదు. ఇంకేం చేయాలి?” అని సంధ్యారాణి ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి గర్భం దాల్చినా కూడా ఈ గ్రామంలో ఉండను. వేరే గ్రామానికి వెళ్లిపోయి, అక్కడే శిశువుకి జన్మనిచ్చి, కొంచెం పెద్దయ్యాకే గ్రామంలోకి అడుగు పెడదామనుకుంటున్నాను అని చెప్పారామె. పోనీ వేరే చోట పురుడు పోసుకున్నా.. రూఢకోటకు కోడలిగా వచ్చిన ఓ మహిళ గర్భం దాల్చగానే తన పుట్టినిల్లయిన హుకుంపేటకు వెళ్లిపోయారు. అక్కడే బిడ్డకు జన్మనిచ్చారు. అయితే, ఆ బిడ్డ కూడా మూడు నెలలకే ఈ ఏడాది మేలో మరణించాడు. ఈ విషయాన్ని రూఢకోట పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ నిర్థారించారు. రూఢకోటకు హుకుంపేటకు మధ్య దూరం 35 కిలోమీటర్లు. ఆరు నెలలు ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు! 2019 నుంచి 2022 మే వరకు 17 మంది శిశువులు మరణించారు. ఆ తర్వాత ఆరు నెలలు ఏ విధమైన మరణాలు సంభవించలేదు. మళ్లీ ఈ ఏడాది జనవరి, మే, ఆగస్ట్ నెలల్లో ముగ్గురు శిశువులు మరణించారు. ఇప్పటి వరకు 20 మంది శిశువులు రూఢకోట గ్రామంలో మరణించారని రూఢకోట పీహెచ్ సీ మెడికల్ ఆఫీసర్ సత్యారావు చెప్పారు. రూఢకోటలో గర్భం దాల్చిన మహిళలు గ్రామంలో ఉన్నా, బయటకు వెళ్లినా, ఇంటి దగ్గరే ప్రసవమైనా లేదా ఆసుపత్రిలో ప్రసవమైన వారిలోని కొందరు శిశువులు మరణిస్తున్నారు. కారణాలపై మాత్రం స్పష్టత రాలేదని డాక్టర్ సత్యారావు చెప్పారు. వరుసగా శిశువులు మరణిస్తుండటంతో ఆ ఊర్లో మహిళలు పిల్లలను కనేందుకు భయపడుతున్నారు. అందుకనే 2022 మే, జూన్ తర్వాత ఊరిలో ఎవరు గర్భం దాల్చలేదు. ఆరు నెలలు పాటు ఊరిలో ఎటువంటి మరణాలు సంభవించకపోవడంతో సంతోషపడ్డాం. కానీ మళ్లీ 2023 జనవరిలో ఒక శిశువు మరణిచడంతో మళ్లీ పిల్లల మరణాలు మొదలయ్యాయి. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదని రూఢకోట ప్రజలు ఆవేదనగా చెబుతున్నారు. వైద్య బృందాలు అధ్యయనం చేయగా.. వైద్య బృందాలు అధ్యయనం చేసినప్పుడు.. ప్రసవాలన్నీ ఆసుపత్రుల్లోనే జరిగాయని గుర్తించారు. శిశువుల బరువు సాధారణ స్థాయిలో ఉంది. తల్లుల ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులూ లేవు. వీరిలో ఒక మహిళ డిప్లొమా వరకు చదివింది. ఈ గ్రామంలో 138 గృహాలు ఉండగా 247 మంది పురుషులు, 244 మంది మహిళలు. ఇక్కడ ఉన్నవారంతా చదువుకున్నవారే. గుర్తించిన అంశాలు.. శిశువుల మరణాలు అత్యధికంగా అర్ధరాత్రి పూట సంభవించాయి. తీవ్రస్థాయిలో ఏడుస్తూ.. వాంతులు చేసుకుంటూ 6 నుంచి 12 గంటల వ్యవధిలోనే ప్రాణాలు విడిచారు. శ్వాస పీల్చుకోవడంలో శిశువులు బాగా ఇబ్బందులు పడ్డారు. ఒక శిశువులో ఫిట్స్ లక్షణాలు కనిపించాయి. స్థానికులు తాగే మంచినీటి నాణ్యత కూడా బాగానే ఉంది. ఎందువల్ల శిశువులు చనిపోతున్నారనేది ఇప్పటికీ అంతుచిక్కని మిస్టరిలా మిగిలిపోయింది. (చదవండి: అత్యంత అరుదైన పాము! వీడియో వైరల్) -
సాక్స్ కిల్లర్..జంటలే టార్గెట్‌గా హత్యలు! అతడెవరనేది ఇప్పటకీ..
అది 1985 డిసెంబర్ 12, మధ్యాహ్నం ఒంటిగంట దాటింది. వాషింగ్టన్ లోని మినరల్ సమీపంలోని స్పానవేలో కె–మార్ట్ స్టోర్ కస్టమర్స్‌తో రద్దీగా ఉంది. ఆ బయట రెండేళ్ల పాప ఒక్కర్తే అయోమయంగా, అటు ఇటు తచ్చాడటాన్ని కొందరు స్టోర్ ఉద్యోగులు గమనించారు. వారు పాపను చేరదీసి, పోలీసులకు సమాచారమిచ్చారు. కాసేపటికి ఆ మార్ట్‌కు చేరుకున్న అధికారులు పాప పరిస్థితి చూసి, స్థానిక ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. పాప శారీరకంగా బాగానే ఉన్నా, ఏదో చూసి భయపడిందని గుర్తించి, తాత్కాలికంగా దగ్గర్లోని సంరక్షణ కేంద్రానికి తరలించారు. చిన్న పాప కావడంతో అందరినీ చూసి బెదిరిపోయింది. తను ఎవరు? తన వాళ్లు ఎవరు? తనొక్కర్తే అక్కడెందుకు ఉంది?’ లాంటివన్నీ సమాధానం లేని ప్రశ్నలయ్యాయి. పాప వివరాల సేకరణలో భాగంగా పత్రికలకు కూడా పాప ఫొటో ఇచ్చి ‘ఎవరీ పాప?’ అనే శీర్షికతో వార్తలు రాయించారు అధికారులు. సరిగ్గా రెండు రోజులకు పాప వార్త ఉన్న న్యూస్ పేపర్, కొన్ని రియల్ ఫొటోలు పట్టుకుని.. లూయిస్ కాన్రాడ్ అనే మహిళ పోలీస్ స్టేషన్ కి వచ్చింది. ‘మార్ట్ ముందు దొరికిన పాప నా మనవరాలే, తన పేరు క్రిస్టల్’ అంటూ ఇంట్లోని పాప ఫొటోలను ఆధారంగా చూపించింది. పాప దొరికిన రోజు (డిసెంబర్ 12) ఉదయాన్నే తన కూతురు డయానా రాబర్ట్సన్(21), అల్లుడు మైక్ రీమర్(36), క్రిస్టల్‌తో కలసి టకోమా సమీపంలోని పర్వతాలలో వన్ డే వెకేషన్ కోసం వెళ్లారని చెప్పింది లూయిస్. పాప ఒక్కర్తే ఒంటరిగా దొరికిందంటే.. మైక్, డయానాలకేమైందోనని కూలబడి ఏడ్చేసింది. లూయిస్ సమాచారంతో ఆ పర్వాతాల సమీపంలో మొత్తం గాలింపు చర్యలు మొదలుపెట్టారు అధికారులు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. ఇక మనవరాలు క్రిస్టల్‌ని ప్రేమగా ఒడిలో కూర్చోబెట్టుకుని ‘మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు?’ అని ఆరా తీసింది లూయిస్. ఆ ప్రశ్నకు ‘మమ్మీ చెట్లలో ఉంది’ అని జవాబు ఇచ్చింది క్రిస్టల్. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం చెప్పింది. క్రిస్టల్ చిన్నది కావడంతో తనని విచారించి ప్రయోజనం లేదని అర్థమైంది. రెండు నెలలు గడిచిపోయాయి. 1986 ఫిబ్రవరి 18 ఉదయాన్నే వాషింగ్టన్‌లోని మినరల్‌కు ఉత్తరంగా ఉన్న రోడ్డుపై వాకింగ్‌కి వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ ఎదురైంది. రోడ్డు నుంచి కాస్త లోపలికి గుబురు చెట్ల మధ్య.. కరుగుతున్న మంచుపెళ్లల్లో రెడ్‌కలర్ ప్లిమత్ పికప్ ట్రక్ కనిపించింది. దగ్గరకు వెళ్లి చూస్తే, దాని పక్కనే ఓ మహిళ కుళ్లిన నగ్న మృతదేహం భయపెట్టింది. ఆమె మెడకు సాక్స్‌తో ముడివేసి బిగించినట్లుంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. డీఎన్ఏ పరీక్షలో అది డయానా శవమని తెలియడంతో మిస్సింగ్ కేసు కాస్త మర్డర్ కేసుగా మారింది. క్రిస్టల్ చెప్పినట్లే తన మమ్మీ చెట్ల మధ్య ఉండటం అధికారులను ఆశ్చర్యపరచింది. అంటే తన తల్లి చావుని క్రిస్టల్ చూసే ఉంటుందని అంతా అంచనాకు వచ్చారు. అయితే ఆ చుట్టుపక్కల ఎక్కడా మైక్ జాడ కనిపించలేదు. ఆ పికప్ ట్రక్ మైక్దే కావడంతో దానిలో అంతా క్షుణంగా పరిశీలించారు. డ్రైవర్ పక్క సీట్లో రక్తం మరకలున్నాయి. వాటి శాంపిల్స్ ల్యాబ్‌కి పంపిస్తే, ఆ రక్తం మనిషిదే కాని ఎవరిదో తేలలేదు. ట్రక్‌లో దొరికిన ఒక ఎన్వలప్ కవర్ మీద ‘ఐ లవ్యూ డయానా’ అని రాసి ఉంది. అది మైక్ హ్యాండ్ రైటింగ్ అని లూయిస్ గుర్తించింది. డయానా కడుపులో పదిహేడు కత్తిపోట్లు ఉన్నాయని, మెడ చుట్టూ బిగించిన సాక్స్ ఆమెని కదలకుండా నియంత్రించడానికి మాత్రమే వాడిన సాధనమని తేలింది. ఓ పక్క దట్టమైన మంచు దర్యాప్తుకు ఆటకం కలిగిస్తున్నా, మైక్ కోసం తీవ్రంగా గాలించారు అధికారులు. ఎక్కడా మైక్ ఆనవాళ్లు లేవు. అయితే గతంలో మైక్.. డయానా విషయంలో చాలా అనుచితంగా ప్రవర్తించేవాడని పోలీసుల దృష్టికి రావడంతో డయానాని అతడే చంపేసి పారిపోయాడని నమ్మారు. మైక్.. డయానాని చాలాసార్లు కొట్టేవాడని, చంపేస్తానని బెదిరించేవాడని, అతడి వేధింపులు భరించలేక విడిపోయి తనకు మైక్ దూరంగా ఉండాలంటూ డయానా కోర్టు ఉత్తర్వును కూడా పొందిందని, కొన్నాళ్లకు వాళ్లు మళ్లీ కలసి జీవించడం మొదలుపెట్టారని చెప్పింది. దాంతో మైక్ అనుమానితుడుగా మారాడు. అయితే కొందరు మైక్ కూడా బాధితుడు కావచ్చని, గడ్డకట్టే చలిలో మైక్ తన చలికోటును ట్రక్‌లో వదిలి పారిపోయే అవకాశం లేదని నమ్మారు. ఈ క్రమంలోనే డయానా మెడకు చుట్టిన సాక్స్ కీలక ఆధారమైంది. మైక్, డయానా మిస్సింగ్‌కి ముందు.. అంటే 1985 ఆగస్ట్ 10న స్టీఫెన్ హార్కిన్, రూత్ కూపర్ అనే జంట మర్డర్ కేసు తిరగేశారు అధికారులు. ఈ జంట వాషింగ్టన్లో తులే సరస్సు పక్కన క్యాంపింగ్‌కి వెళ్లి తిరిగి రాలేదు. నాలుగు రోజులకు స్టీఫెన్ తన కారు డ్రైవింగ్ సీట్లో శవమై కనిపించాడు. నుదుటి మీద బుల్లెట్ గాయం ఉంది. అతడు నిద్రిస్తున్న సమయంలోనే దాడి జరిగినట్లు తేలింది. వెంట తీసుకెళ్లిన వారి పెంపుడు కుక్క సమీపంలో బుల్లెట్ గాయాలతో చనిపోయి ఉంది. రూత్ బూట్లు తప్ప మరో ఆధారం కనిపించలేదు. సరిగ్గా రెండు నెలలకు (అంటే డయానా మర్డర్‌కి సరిగ్గా నెల క్రితం) స్టీఫెన్ దొరికిన మైలున్నర దూరంలో రూత్ తల, మొండెం వేరువేరుగా దొరికాయి. రూత్ మెడకు కూడా డయానా మెడకు కట్టినట్లే సాక్స్‌తో బిగించి ఉంది. ఆమె కడుపులో చాలాసార్లు తుపాకీతో కాల్చినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. కాల్పుల కారణంగానే మరణించింది తప్ప సాక్స్ కారణంగా కాదని తేలింది. రూత్ మెడలోని సాక్స్, డయానా మెడలోని సాక్స్ రెండూ ఒకేలా ఉన్నాయని సాంకేతిక నిపుణులు కొందరు భావించారు. ఇది కచ్చితంగా సీరియల్ కిల్లర్ పనేనని వారి నమ్మారు. అయితే మైక్ జంతువుల కోసం వలపన్నే ప్రాంతం.. రూత్, స్టిఫెన్లు మృతదేహాలు దొరికిన ప్రాంతం రెండూ ఒకటే కావడంతో అనుమానాలన్నీ మైక్ మీదకు తిరిగాయి. నిజానికి మైక్.. తన భార్యను, కూతుర్ని తీసుకుని బయలుదేరేముందే ఆ వలపన్నిన ప్రాంతాన్ని ఒకసారి సందర్శించి వస్తామని ఇంట్లో చెప్పాడట. ఇన్ని ఆధారాలతో పాటు మైక్ కనిపించకపోవడంతో అతడే సీరియల్ కిల్లర్ అని కొందరు అధికారులు నమ్మడం మొదలుపెట్టారు. అయితే ఈ తరహా కేసే మరొకటి పోలీసులు దృష్టికి వచ్చింది. 1985 మార్చి 9న వాషింగ్టన్ గ్రాంట్ కౌంటీలో ఎడ్వర్డ్ స్మిత్, కింబర్లీ లావైన్ అనే ప్రేమజంట మరణం వెనుక కూడా ఇదే సీరియల్ కిల్లర్ ఉండి ఉంటాడని నమ్మారు అధికారులు. అయితే ఎడ్వర్డ్ కారులో దొరికిన వేలిముద్రల ఆధారంగా 1989లో బిల్లీ రే బల్లార్డ్ అనే ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అతడు ఎడ్వర్డ్, కింబర్లీ హత్యల నేరాన్ని అంగీకరించాడు కాని రూత్ జంట, డయానా జంటల హత్యలు తనకు సంబంధం లేదన్నాడు. 1986 ఆగస్ట్ 22న మిస్ అయిన రాబర్ట్, డాగ్మార్ మిస్సింగ్ కేసును కూడా కలిపి విచారించారు. తర్వాత రాబర్ట్ క్రెడిట్ కార్డ్ వినియోగించిన ఓ సీరియల్ కిల్లర్ చార్లెస్ సింక్లైర్ని అరెస్ట్ చేశారు. అయితే విచారణ సమయంలోనే అతడు మరణించాడు. కాలక్రమేణా మినరల్ పరిసరప్రాంతాల్లో సీరియల్ కిల్లర్ ఉన్నాడని పుకార్లు స్థానికుల్ని పర్యటకులను తీవ్రంగా భయపెట్టాయి. మరోవైపు మైక్ కనిపించకపోవడంతో అతడే సీరియల్ కిల్లర్ అనే వాళ్ల సంఖ్య పెరిగిపోయింది. 2011 మార్చి 26న డయానా మృతదేహం దొరికిన మైలు దూరంలో హైకర్స్కి మనిషి పుర్రె కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. దంత పరీక్షలతో ఆ పుర్రె మైక్దని తేలింది. దాంతో మైక్ కూడా ఆ సీరియల్ కిల్లర్ బాధితుడేనని, అసలు హంతకుడు వేరే ఉన్నాడని స్పష్టమైంది. మొత్తానికీ వాషింగ్టన్ మినరల్ సమీపంలోని ప్రేమ జంటలు, దంపతుల హత్యకేసులు.. రూత్, డయానా జంటల హత్యలతో కలిసి విచారించినా, ఎంతోమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నించినా అసలు సాక్స్ కిల్లర్ ఎవరో బయటపడలేదు. క్రిస్టల్(పాప) దొరికిన రోజు.. మైక్ రెడ్ కలర్ ట్రక్‌ని కె–మార్ట్ స్టోర్ ముందు చూశామని కొందరు సాక్షులు చెప్పారు. అంటే పాపను ఆ కిల్లరే ఆ స్టోర్ దగ్గర వదిలివెళ్లాడా? ఆ స్టోర్ దగ్గరకు వచ్చాడా? అనేది ఎప్పటికీ తేలలేదు. వాళ్లని చంపింది ఎవరు? ఆ కిల్లర్ ఇంకా ఎంత మంది మాయం చేశాడు? ఇలా వేటికీ సమాధానాలు లేవు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన (చదవండి: ఇప్పటకీ అంతుతేలని కేర్‌టేకర్ అదృశ్యం కేసు! ఆరోజు ఏం జరిగింది..?) -
ఇప్పటకీ అంతుతేలని కేర్‌టేకర్ అదృశ్యం కేసు! ఆరోజు ఏం జరిగింది..?
అది 1999 జూలై 15. తెల్లవారుజామున మూడు కావస్తోంది. అమెరికా మిస్సోరీ, సెయింట్ లూయీలోని రిచ్మండ్ హైట్స్‌లో 1600 బ్లాక్ ముందు ఉన్నట్టుండి అలజడి రేగింది. అప్పటిదాకా గాఢ నిద్రలో ఉన్న అపార్ట్మెంట్ వాసులు.. పోలీస్ హారన్స్‌తో ఉలిక్కిపడి లేచారు. చాలాసేపటి నుంచి తమ పక్క ఇంట్లో పసికందు ఏడుపు వినిపిస్తోందని.. తమకేదో అనుమానంగా ఉందని ఓ కుటుంబం.. ఎమర్జెన్సీ కాల్ చేయడంతోనే పోలీసులు అక్కడికి వచ్చారు. సదరు కుటుంబమిచ్చిన సమాచారంతో.. అంతా ఆ అనుమానాస్పద ఇంటి తలుపు తీసే ప్రయత్నం మొదలుపెట్టారు. లోపల బిడ్డ గుక్కతిప్పుకోకుండా ఏడుస్తుంటే బయటున్నవారందరికీ హృదయం ద్రవించిపోతోంది. తీరా తలుపు తీసి లోపలికి వెళ్లేసరికి ఆ ఇంట్లో ఆ పసిపాప తప్ప ఇంకెవరూ కనిపించలేదు. దాంతో అంతా షాకయ్యారు. ఇరుగూ పొరుగూ ఆ పాపని సేదతీర్చే పనిలో పడ్డారు. కాసేపటికి పోలీసు కన్ను పడకగదిలో రక్తపుచుక్కల్ని పసిగట్టింది. వెంటనే ఇల్లంతా శోధించారు. రక్తం మరకలున్న చేతి రుమాలు, చెత్తబుట్ట వెనుక రక్తంతో తడిసిన తలదిండ్లు ఒక్కొక్కటిగా బయటపడినప్పుడు.. అదో మిస్టీరియస్ కేసుగా మిగలబోతోందని అక్కడున్న వారెవ్వరికీ తెలియదు. ఈ పాప తల్లిదండ్రులు.. డానా మాడెన్(తల్లి), క్రిస్టోఫర్ హెర్బర్ట్(తండ్రి) అనే దంపతులు. వాళ్లు ఆఫీసులకు వెళ్లినప్పుడు పాపని చూసుకోవడానికి ఎవరో తెలిసిన వాళ్ల అమ్మాయిని కేర్ టేకర్‌గా పెట్టి వెళ్తారని.. కనీసం ఆ అమ్మాయి కూడా కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందని.. పోలీసులకు స్థానికుల్లో కొందరు చెప్పారు. అసలు చంటిపాపను చూసుకోవడానికి వచ్చిన అమ్మాయి ఎవరు? అని ఆరా తీస్తే.. పన్నెండేళ్ల హెదర్ కులోర్న్ అని.. తను, మాడెన్ స్నేహితురాలైన క్రిస్టీన్ కులోర్న్ కూతురని తేలింది. బ్లో మిడిల్ స్కూల్లో చదువుతున్న ఆ పాప.. మాడెన్ కూతురికి కేర్‌టేకర్‌గా ఉండేదట. క్రిస్టీన్, మాడెన్, హెర్బర్ట్లతో మాట్లాడిన తర్వాత ఆ రాత్రి పాపతో ఆ ఇంట్లో ఉన్నది హెదరేనని పోలీసులకు స్పష్టమైంది. రెండు రోజులకు ఆ ఇంట్లో దొరికిన బ్లడ్ శాంపిల్స్‌ను డీఎన్ఏ పరీక్షకు పంపిస్తే.. ఆ రక్తం హెదర్దేనని తేలింది. అసలు హేథర్కి ఏమైంది? ‘కేవలం మా పసిబిడ్డను చూసుకోవడానికే ఆ బాలికను ఇంట్లో ఉంచాం. ఆ రాత్రి మేము ఆ ఇంట్లో లేకపోవడం వల్ల ఏం జరిగిందో? హెదర్ని ఎవరు ఏం చేశారో? మాక్కూడా తెలియదు’ అని చెప్పుకొచ్చారు మాడెన్ దంపతులు. ఆ రోజు తెల్లవారుజామున సుమారు 2 గంటలకు ఆ అపార్ట్మెంట్ నుంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దుప్పట్లో ఏదో బరువైనది మోసుకుని వెళ్లడాన్ని తాను చూసినట్టు ఓ సాక్షి చెప్పాడు. అయితే ఆ దుండగుడ్ని అతడు గుర్తించలేకపోయాడు. ఆ దుప్పట్లో ఉన్నది హెదర్ మృతదేహం కావచ్చని కొందరు నమ్మారు. కానీ అందుకు ఎటువంటి ఆధారాల్లేవు. హెదర్ కోసం ఆమె తల్లి క్రిస్టీన్ గుండెలవిసేలా ఏడ్చింది. ‘నా బిడ్డకు మధుమేహం ఉంది.. తనకు మందులు అందకపోతే ఎక్కువ కాలం బతకలేదు. రోజువారీ ఇన్సులిన్ ఇస్తూ, తరచుగా రక్తపరీక్ష చేస్తూ ఉండాలి. దయచేసి నా బిడ్డను ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటే వదిలిపెట్టండి’ అంటూ మీడియా ముఖంగానే వేడుకుంది. అయినా హెదర్ సమాచారం బయటికి రాలేదు. ఆ తల్లి వ్యథ ఎందరినో కంటతడి పెట్టించింది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదని.. ప్రీప్లాన్‌గానే ఆ అమ్మాయిని ఎత్తుకెళ్లారని.. అది హేథర్కి తెలిసినవారి పనేనని.. రక్తపు ఆనవాళ్లు ఉన్నాయంటే చంపేసి ఉంటారని కూడా అధికారులు అంచనాకు వచ్చారు. అయితే మృతదేహం దొరక్కపోవడంతో క్రిస్టీన్ తన న్యాయపోరాటాన్ని ఆపలేదు. తొమ్మిది నెలలు గడిచినా కేసులో ఎలాంటి పురోగతిలేదు. దాంతో ‘హెదర్ ఎక్కడ?’ అంటూ.. మాడెన్, హెర్బర్ట్లను అరెస్ట్ చేసి.. గట్టిగా నిలదీశారు. కానీ ఆ దంపతులు సరైన సమాధానాలు ఇవ్వలేదు. మాడెన్ ఆ రాత్రి నైట్ షిఫ్ట్‌లో ఉందని తేలినప్పటికీ.. హెర్బర్ట్ ఎక్కడున్నాడనే దానిపై సరైన క్లారిటీ రాలేదు. అతడు పొంతన లేని ఎన్నో సమాధానాలిచ్చి.. ఆధారాలు లేక నిర్దోషిగా బయటపడ్డాడు. అయితే క్రిస్టీన్ మాత్రం.. ‘తన కూతురు మాయం కావడానికి అసలు కారణం మాడెన్ దంపతులకు కచ్చితంగా తెలిసే ఉంటుంది’ అని నమ్మింది. ఆ క్రమంలోనే దర్యాప్తులో మరో నిజం బయటపడింది. మిస్సోరీలోని ప్రధాన డ్రగ్స్ మూలాలు ఆ అపార్ట్మెంట్లోనూ ఉన్నాయనే కొన్ని ఆధారాలు బయటపడ్డాయి. అంటే అపార్ట్మెంట్లో రహస్యంగా ఉన్న చట్టవిరుద్ధమైన ఆ ల్యాబ్ గురించి హెదర్‌కి తెలిసి ఉంటుందని.. అపార్ట్మెంట్ గ్యారేజీలో మాదకద్రవ్యాల కార్యకలాపాలను ఆమె కళ్లారా చూసి ఉంటుందని.. అందుకే బలవంతంగా అపహరించి, హత్య చేసి ఉంటారని విశ్వసించారు. ఇది పరిష్కారం కాకుండానే.. క్రిస్టీన్ 2017 డిసెంబర్ 16న కన్నుమూసింది. ఏదైమైనా హెదర్‌కి ఏమైందనేది మాత్రం బయటపడలేదు. ఒకవేళ సీరియల్ కిల్లర్ దాడి చేసి ఉంటాడా? మాడెన్ భర్త హెర్బర్ట్ దురుద్దేశంతో హెదర్ మీద ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి, చంపేశాడా? లేదంటే హెదర్ తన స్నేహితుల్ని గుడ్డిగా నమ్మి.. ఆ ఇంటికి ఆహ్వానించి మోసపోయిందా? అనేది మాత్రం నేటికీ తేలలేదు. 12 ఏళ్ల హెదర్ కులోర్న్ అదృశ్యమై.. 24 ఏళ్లు గడిచిపోయాయి. ఈ కేసులో హెదర్ ఊహాచిత్రాలు పెరిగాయి తప్ప మిస్టరీ అయితే వీడలేదు. సంహిత నిమ్మన (చదవండి: ఆ దేశంలోని టొమోటా ధర వింటే..కళ్లుబైర్లు కమ్మడం ఖాయం!) -
పోలీసులకే చుక్కలు చూపించిన పుర్రె కేసు..ఆగంతకుడెవరో తెలిసినా..
విచక్షణ లేని ఆధిపత్యం.. తట్టుకోలేనంత క్రోధం.. దానికి మించిన స్వార్థం.. పశ్చాత్తాపమే లేని మనస్తత్వం.. మానవత్వం సిగ్గు పడటానికి ఇంతకన్నా అవలక్షణాలేముంటాయి? కానీ.. అవన్నీ కూడదీసుకుని చరిత్రలో ఒకడు ప్యాంటూ షర్టు వేసుకుని దర్జాగా తిరిగాడు. ఓ అమాయకురాలి జీవితాన్ని నేటికీ మిస్టరీగా మిగిల్చాడు. అది 1990 జూన్ 28 మధ్యాహ్నం రెండు కావస్తోంది. అమెరికా, మిస్సోరీలో బ్రిడ్జ్‌టన్ లోని కాసా గలార్డో రెస్టారెంట్.. కస్టమర్స్‌తో కిటకిటలాడుతోంది. కిటికీ పక్కనే కూర్చుని భోజనం చేస్తున్న ఇద్దరు ఫ్లైట్ అటెండంట్స్కి ఉన్నట్టుండి, కిటికీ బయట ఏదో అలికిడి వినిపించింది. తిరిగి చూస్తే ఆ పొదల మాటున ఓ పుర్రె స్పష్టంగా కనిపింంది. కావాలనే ఎవరో దాన్ని అక్కడ పెట్టి తప్పుకున్నారు. దగ్గరకెళ్లి చూసేసరికి ఆ చుట్టుపక్కల మనుషులెవ్వరూ లేరు. ఊహించని ఆ క్రైమ్ సీన్.. అక్కడున్న వారందరినీ వణికింంది. రంగంలోకి దిగిన విచారణ అధికారులు.. పుర్రెను స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలకు పంపించారు. ఆ పరిశీలనలో పుర్రె ఓ మహిళదని తేలింది. అయితే కొన్ని రోజుల క్రితమే ఆ ప్రాంతంలోని శ్మశానవాటికను ఒక చోటి నుం మరోచోటికి మార్చారు. చాలా సమాధులను తరలించారు. ఆ సమయంలో బయటపడిన పుర్రెను ఎవరో ఆకతాయిలు కావాలనే జనాల మధ్య పెట్టి భయపెట్టి ఉంటారనే అంచనాకొచ్చారు. దాంతో ఆ పుర్రెను బ్రిడ్జ్‌టన్ మార్చురీకి పంపించేశారు. సరిగ్గా పద్నాలుగు నెలల తర్వాత (1991 సెప్టెంబర్ 6న) పుర్రె దొరికిన రెస్టారెంట్‌కి 25 మైళ్లదూరంలో ఉన్న వినిటా పార్క్ పోలీస్ స్టేషన్‌కి.. తెరిచి ఉన్న ఓ ఎన్వలప్ లెటర్ వచ్చింది. దానిలో ‘బ్రిడ్జ్‌టన్ పోలీసులకు రెస్టారెంట్ బయట దొరికిన పుర్రె లిండా షెర్మాన్ అనే మహిళది’ అని టైపింగ్ అక్షరాలతో ఉంది. అది చూడగానే ఆ అధికారులు షాకయ్యారు. వెంటనే బ్రిడ్జ్‌టన్ పోలీసులను అలర్ట్ చేశారు. దాంతో ఆ పుర్రెను పరీక్షలకు పంపించారు. అన్ని నెలలుగా ఆ పుర్రెపై ఎలాంటి సీల్ లేకపోవడంతో దానిపై ఏ వేలి ముద్రలు దొరకలేదు. వైద్య పరీక్షల్లో డీఎన్ఏ తేలలేదు. చివరికి దంత పరీక్షల్లో.. ఆ పుర్రె నిజంగానే ఆరేళ్ల క్రితం (1985 ఏప్రిల్ 22న) మిస్సయిన లిండా షెర్మాన్దేనని రుజువైంది. దాంతో ఒక్కసారిగా ఈ కేసు సంచలనమైపోయింది. పత్రికల మొదటి పేజీ వార్తగా వరింది. పాత ఫైల్స్ తిరగేస్తే.. వినిటా పోలీస్ స్టేషన్లో లిండాకి సంబంధించిన కేసులు చాలానే బయటికి వచ్చాయి. అప్పటికి ఆరేళ్ల క్రితమే మిస్సోరీలోని సెయింట్ లూయీలో గవర్నమెంట్ రికార్డ్స్ సెంటర్లో పనిచేసే లిండా.. తన 27 ఏళ్ల వయసులో కనిపించకుండా పోయినట్లు రికార్డ్స్‌లో ఉంది. వినిటా పార్క్‌లోని సెయింట్ లయీ శివారులో పుట్టి పెరిగిన లిండా.. పదహారేళ్ల వయసులో తన సీనియర్ విద్యార్థి డోనాల్డ్ డాన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఏడాదికే వారికి ఒక పాప కూడా పుట్టింది. ఆ పాపకి ప్రేమగా ప్యాట్రీషియామేరీ అని పేరు పెట్టుకున్నారు. పాప పుట్టిన తర్వాత కూడా లిండా చదువు కొనసాగించింది. అయితే వారి సంతోషాలకు ఆర్థిక కష్టాలు శాపంగా మారాయి. ఇద్దరూ ఉద్యోగం చేయడం మొదలుపెట్టారు. షిఫ్ట్ టైమింగ్స్, చాలీచాలని ఆదాయం వారి బంధాన్ని మరింత దెబ్బతీశాయి. రెండు మూడేళ్లకే కేసులు, విడాకులు అనుకుంటూ వైవాహిక జీవితం ఛిద్రమైంది. చాలాసార్లు పోలీస్ స్టేషన్లకు, కోర్టులకు తిరిగిన ఆ భార్యభర్తలు.. కొన్నిసార్లు రాజీపడి కలసి బతకడానికి ప్రయత్నించారు. గొడవ జరిగిన ప్రతిసారీ లిండా.. తన కూతురు మేరీని తీసుకుని దగ్గర్లోని పుట్టింటికి వెళ్లిపోయేది. రాజీ కుదరగానే తిరిగి భర్త దగ్గరకు వచ్చేది. డాన్.. లిండాపై చాలా పొసెసివ్‌గా ఉండేవాడు. అది కాస్తా అనుమానంగా మారిపోయింది. ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చినా భరించేవాడు కాదు. వేరే మగవాళ్లతో మాట్లాడితే సహించేవాడు కాదు. ఎదురు తిరిగితే కొట్టేవాడు. ఏప్రిల్ 1985 నాటికి డాన్ పెట్టే బాధలు భరించలేక అతడికి వ్యతిరేకంగా.. రిస్టెయినింగ్ ఆర్డర్ (గృహ హింస, రక్షణా ఉత్తర్వులు) తెచ్చుకుంది. అయినా డాన్ మారలేదు. దాంతో తన తొమ్మిదేళ్ల వైవాహిక జీవితానికి శాశ్వతంగా ముగింపు చెప్పాలని నిర్ణయించుకుని.. ఆ విషయాలన్ని తన కుటుంబ సభ్యులతో, శ్రేయోభిలాషులతో పంచుకుంది. అయితే ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని.. అతడితో ఆమెకి వివాహేతర సంబంధం ఉందని డాన్ నమ్మేవాడు. పంచాయతీకి వచ్చిన ప్రతి ఒక్కరితోనూ అదే వాదనకు దిగేవాడు. ఉన్నట్టుండి అదే ఏడాది, ఏప్రిల్ 22 తర్వాత లిండా ఎవరికీ కనిపించలేదు. ఈ కథ మొత్తం తిరగదోడిన పోలీసులు.. వెంటనే డాన్ని కస్టడీలోకి తీసుకుని విచారించారు. ‘లిండా మరణంతో నాకెలాంటి సంబంధం లేదు. ఆరేళ్లక్రితమే నా భార్య.. తన బాయ్‌ఫ్రెండ్‌తో పారిపోయింది. వాళ్లిద్దరూ సహోద్యోగులని నా అనుమానం. వాడే ఆమెను చంపి ఉంటాడు’ ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా ప్రశ్నింనా ఇదే సమాధానం ఇచ్చాడు డాన్. దాంతో పోలీసులు లిండా.. చివరి రోజు ఎక్కడికి వెళ్లింది? ఏం జరిగింది? లాంటి వివరాలు సేకరించడంలో బిజీ అయ్యారు. ఏప్రిల్ 22 తెల్లవారు జామున 2:16కి తన ఆఫీస్ నుంచిబయలుదేరిందని తేలడంతో లిండా కూతురు మేరీని విచారించారు. ‘ఆ రోజు నిద్రపోతుంటే మమ్మీ, డాడీల గొడవ వినిపింంది. మరునాడు నేను లేచేసరికి మమ్మీ సోఫాలో అటు తిరిగి పడుకుని ఉంది. రోజూ నన్ను స్కూల్‌కి తీసుకుని వెళ్లే మమ్మీ ఆ రోజు ఇంకా లేవకపోవడం ఆశ్చర్యంగా అనిపింంది. ఆ రోజు డాడీనే నన్ను స్కూల్‌కి తీసుకెళ్లారు. కనీసం నాకు బై చెప్పడానికి కూడా మమ్మీ నిద్ర లేవలేదు. నేను మమ్మీని చూడటం అదే చివరిసారి’ అని చెప్పింది మేరీ. దాంతో ఆ రాత్రి ఏం గొడవ పడ్డారు? అని డాన్‌ను మరోసారి విచారణలో కూర్చోబెట్టారు పోలీసులు. ‘ఇంటికి రావడానికి అంత ఆలస్యం ఎందుకు అయిందని గొడవ పడ్డాను. మేరీని స్కల్లో డ్రాప్ చేసి, నేను ఆఫీస్‌కి వెళ్లిపోయాను. మధ్యాహ్నం భోజనానికి వచ్చేసరికి.. లిండా ఇంట్లో హడావుడిగా పనులు చేసుకుంటోంది. సాయంత్రం 6 గంటలకు కారులో ఇంటి నుం బయలుదేరడం చూశాను. మళ్లీ రాలేదు. ఆఫీస్‌లో ఆరా తీస్తే అసలు ఆఫీస్‌కే రాలేదన్నారు. గతంలోలానే తాత్కాలికంగా నాకు దూరంగా వెళ్లి ఉంటుందని సరిపెట్టుకున్నాను. ఇంట్లో వెతికితే తన బ్యాగ్, ఇతర ముఖ్యమైన వస్తువులు కనిపించలేదు. అదే విషయాన్ని లిండా కుటుంబానికి చెప్పి.. మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను’ అని చెప్పాడు. డాన్. లిండా కనిపించకుండా పోయిన కొన్ని రోజులకే ఆమె కారు.. ఓ స్థానిక విమానాశ్రయంలో దొరికింది. అందులో ఆమె వస్తువులన్నీ భద్రంగానే ఉన్నాయి. ఏప్రిల్ 24 నుంచి ఆ కారును అక్కడ చూశామని సెక్యూరిటీ చెప్పారు. అయితే ఆమె పేరు మీద ఏ ఫ్లైట్ టికెట్ న మోదు కాలేదు. కొన్ని రోజులకు ఆమె.. వేరే వ్యక్తి కారులో వెళ్లడం చూశానని డాన్ ఆరోపించాడు. గలార్డో రెస్టారెంట్‌కి డాన్ రెగ్యులర్‌గా వెళ్తుండేవాడట. అది అతడి ఫేవరెట్ ప్లేస్ అని అతడి సన్నిహితులు కొందరు బయటపెట్టారు. ‘పుర్రె దొరికిన రోజు సాయంత్రం అదే రెస్టారెంట్లో ఉన్నాను. అదేరోజు పుర్రె కలకలం గురించి నేనూ విన్నాను. అయితే ఆ రోజు.. అది నా భార్య లిండా పుర్రె అని నాకు తెలియలేదు’ అని పోలీసులకు చెప్పుకొచ్చాడు డాన్. ఇక్కడే మరో ట్విస్ట్ ఉంది.1989లో డాన్.. లిండాతో విడాకులకు అప్లై చేసుకున్నప్పుడు.. లిండా అదృశ్యంపై సరైన ఆధారం లేకపోవడంతో విడాకులు ఇవ్వకుండా ఆ కేసును కొట్టేసింది కోర్టు. సరిగ్గా ఏడాదికి లిండా పుర్రె బయటపడింది. అంటే హంతకుడు కచ్చితంగా డాన్ అయ్యి ఉంటాడని కొందరు అధికారులు నమ్మారు. ‘పుర్రె బయటపెట్టడంతో పాటూ.. అది లిండా పుర్రె అని అజ్ఞాత లేఖ రాశారంటే.. ఆమె చావు ప్రపంచానికి నిర్ధారణ కావాలి. ఆ అవసరం ఒక్క డాన్‌కి మాత్రమే ఉంది. అతడికి విడాకులు కావాలన్నా.. రెండో పెళ్లి చేసుకోవాలన్నా.. లిండా లేదు, ఇక తిరిగి రాదు అనే క్లారిటీ కోర్టుకు రావాలి. నిజానికి డాన్ ఆ రోజు తెల్లవారు జామునే గొడవ సమయంలో లిండాను చంపేసి.. కూతురుకి తెలియకుండా జాగ్రత్తపడి ఉంటాడు. ఆ తర్వాత లిండాను ఎక్కడో పాతిపెట్టి ఉంటాడు. విడాకులు రాకపోయేసరికి పుర్రె బయటపడేలా చేసి, అజ్ఞాత లేఖ రాసి.. ఈ కథను నడిపించి ఉంటాడని వారు భావించారు. అదే వాదనను లిండా కుటుంబం కూడా నమ్మింది. కానీ దేనికీ ఆధారం లేదు. ఈ వాదనను బలపరిచేలా నిజంగానే డాన్ 1994లో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. డాన్ చెప్పినట్లు.. ఇంటి నుంచి లిండా కారులో వెళ్లడం.. మరో వ్యక్తి కారులో తిరగడం.. ఏ ఒక్కరూ చూడలేదు. మరోవైపు 1999లో లిండా పుర్రెను పరిశీలింన ఆర్కియాలజిస్టులు.. అది ఆల్రెడీ భూమిలో ఖననం చేసిన పుర్రె అని, దానిపైనున్న మట్టి నమూనాలను సేకరించి.. మిస్సోరీలో కొన్ని ప్రాంతాలను గుర్తించారు. మిగిలిన శరీర భాగాల కోసం చాలా చోట్ల తవ్వి, తనిఖీలు చేశారు. కుటుంబంలోనూ నేర చరిత్ర కానీ ఎక్కడా లిండా అవశేషాలు దొరకలేదు. కొన్నేళ్లకు డాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ ఒకామె పోలీస్ స్టేషన్‌కి వచ్చి.. ‘డాన్.. తన భార్య లిండాను చంపానని నా ముందు ఒప్పుకున్నాడు’ అని చెప్పింది. కానీ, ఆధారాలేమీ చూపించలేకపోయింది. ఇక 2015 మే 7న ఇల్లినాయిలోని మౌంట్ వెర్నాయాలో ‘గుడ్ సమారిటన్ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం’లో డాన్ తన 58వ ఏట అనారోగ్యంతో మృతి చెందాడు. అయితే అతడి కూతురు మేరీ.. అతడిని చివరి చూపు చూడటానికి కూడా వెళ్లలేదు. 1974లో డాన్ తండ్రి చార్లెస్‌ను ఎవరో అతడి ఇంట్లోనే గన్‌తో కాల్చి చంపేశారు. హంతకులు తేలకపోయినా, కుటుంబీకులే అనుమానితులయ్యారు. కొన్నాళ్లకు డాన్ తల్లి ఆడ్రీ.. ఒక హత్య కేసులో నేరస్థురాలిగా.. జైలుకి కూడా వెళ్లింది. ఏది ఏమైనా డాన్.. లిండాను చంపేశాడనే దానికి సరైన ఆధారం లేక.. ఆమె మిగిలిన బాడీ ఎక్కడ ఖననమైందో తెలియక.. ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. -సంహిత నిమ్మన (చదవండి: ఇప్పటికీ అంతు తేలని ఇద్దరి యువతుల మిస్టరీ గాథ.. అడవిలో ఏం జరిగింది?) -
గాజు ముక్కతో కళ్లలో పొడిచి.. బురదలో తొక్కి చంపి..
పరిగి: కలకలం రేపిన శిరీష మృతి మిస్టరీ కేసు వీ డింది. సొంత అక్క భర్తే హత్య చేసినట్లు విచారణ లో తేలిందని ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. బుధవారం పరిగిలో మీడియాతో మాట్లాడుతూ కేసు వివరాల ను వెల్లడించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్ గ్రామానికి చెందిన జుట్టు యాదమ్మ, జంగయ్య దంపతులకు ఇద్దరు కూతు ళ్లు, పెద్ద కుమార్తె శ్రీలతను పరిగి పట్టణానికి చెందిన ఎర్రగడ్డపల్లి అనిల్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. అనిల్‌కు వికారాబాద్‌లో నర్సింగ్ చేస్తున్న మరదలు శిరీష(18)పై కన్ను పడింది. ఈ క్రమంలో శిరీష ఫోన్లో వేరే యువకుడితో మాట్లాడుతోందని ఆమెపై కోపం పెంచుకున్నాడు. కాగా, ఇటీవల శిరీష తల్లికి ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆమెను నగరంలో ని ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఇంట్లో ఉంటు న్న శిరీష ఈనెల 10న ఫోన్లో మాట్లాడుతుండటంతో తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీనివాస్ మందలించారు. ఇదే అదనుగా అనిల్ కూడా శిరీషను ఫోన్లో మందలించడంతో పాటు జంగయ్యతో కలిసి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లో నుంచి పారిపోయిన శిరీష తీవ్ర మనస్తాపం చెందిన శిరీష ఇంట్లో ఎవరికీ చెప్పకుండా పారిపోయింది. ఆమెను వెతికే క్రమంలో గోనె మై సమ్మ గుడివద్ద శిరీష ఉందన్న సమాచారం మేరకు అనిల్ అక్కడికి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇన్ని రోజులూ తనతో కలవడానికి నిరాకరించి వేరే వ్యక్తితో ఫోన్లో మాట్లాడతావా అంటూ కర్రతో విచక్షణారహితంగా దాడి చేశాడు. పగిలిన బీరు సీసా ముక్కతో కళ్లలో పొడిచాడు. పడిపోయిన శిరీషను పక్కనే ఉన్న నీటి కుంటలోకి లాక్కెళ్లి బురదలో తొక్కి.. చనిపోయిందని నిర్ధారించుకున్నాక అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు.. నిందితుడిని అరెస్ట్ చేశారు. తొందరగా శిక్ష పడేట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. -
మెడికో ప్రీతీ మృతిపై వీడని మిస్టరీ
-
నార్వేను ఉలిక్కిపడేలా చేసిన ‘ఇస్డాల్ ఉమన్’
ఉన్నత ఆశయానికీ.. ఒట్టి మోసానికీ పోలికేంటీ? గొప్ప ప్రేరణకు.. స్వార్థ గుణానికి పొంతనేంటీ? కానీ ఆమె జీవితంలో.. వాటన్నింటికీ చోటుంది. అవును.. ఆమె బతుకు, చావు రెండూ మిస్టరీనే. నార్వే చరిత్రలో ఎన్నో అనుమానాలతో లిఖించిన ‘ఇస్డాల్ ఉమన్ ’ స్టోరీ పూర్తిగా చదివితే అది నిజమే అనిపిస్తుంది. 1970 నవంబర్ 29, ఆదివారం మిట్ట మధ్యాహ్నం మొదలైందీ కథ. నార్వేలోని బర్గన్ నగరానికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న ఇస్డాలెన్ వ్యాలీ సమీపంలోని కొండ మీదకు ఓ తండ్రి తన ఇద్దరు కూతుళ్లతో హైకింగ్ ట్రయల్కి వెళ్లాడు. ఉన్నట్టుండి కాలిన వాసన గుప్పుమంటూ.. ఆ తండ్రీకూతుళ్లను ఆ చుట్టూ వెతికేలా చేసింది. కాసేపటికి.. వెనుకవైపు ఏటవాలుగా ఉన్న లోయలో సగం కాలిన ఓ అమ్మాయి శవం.. వాళ్లని గజగజా వణికించింది. వెంటనే ముగ్గురూ బర్గన్ పోలీస్ స్టేషన్‌కి పరుగుతీశారు. దట్టమైన చెట్లతో.. చెత్తాచెదారంతో కాస్త భయంకరంగా ఉండే ఆ చోటు.. చాలామందికి పర్యాటక ప్రదేశం. నిరంతరం ఆత్మహత్యలు, అనుకోని ప్రమాదాలతో అప్పటికే ఇస్డాలెన్ లోయకి ‘ది డెత్ వ్యాలీ’ అనే పేరు పుట్టుకొచ్చింది. నిటారుగా, అగమ్యగోచరంగా ఉన్న క్రైమ్ స్పాట్‌కి చేరుకోవడం పోలీసులకు చాలా కష్టమైంది. శవం సగంపైనే కాలిపోయింది. రూపం చెదిరిపోయింది. రెండు పిడికిళ్లు బిగించి.. బాక్సర్ పొజిషన్ లో ‘ఫైట్ చేయడానికి సిద్ధమే’ అన్నట్లుంది ఆమె శవం. ఆ పక్కనే సగం కాలిన గొడుగు, రెండు ప్లాస్టిక్ సీసాలు, లిక్కర్ బాటిల్ ఇలా చాలా పడి ఉన్నాయి. నిజానికి అక్కడ ప్రతి గుర్తింపుని ఉద్దేశపూర్వకంగా నాశనం చేసినట్లనిపించింది. డ్రెస్ లేబుల్స్, బాటిల్ లేబుల్స్ ఏవీ లేవు. పైగా ఆమె నగలు, వాచ్ ఓ పక్కన పొందిగ్గా కనిపించాయి. వైద్యపరీక్షల్లో ఆమె కడుపులో 50 నుంచి 70 దాకా నిద్రమాత్రలున్నాయని.. తేలింది. కొన్ని రోజులకి బర్గన్ రైల్వే స్టేషన్ లో అనుమానాస్పద స్థితిలో 2 సూట్‌కేసులు దొరికాయి. వాటిపై చనిపోయిన అమ్మాయి వేలిముద్రలు ఉండటంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకుని ఓపెన్ చేశారు. అందులో 2 కళ్లద్దాలు.. రంగురంగుల డ్రెస్‌లతో పాటు చాలా విగ్గులు.. జర్మనీ, నార్వే, బెల్జియం వంటి దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు.. కోడింగ్‌లో రాసిన ఒక పేపర్, షూ షాప్ కవర్ ఉన్నాయి. అన్నింటిలో కోడింగ్ పేపర్, షూ కవర్.. కేస్‌ను ఛేదించే క్లూస్‌గా కనిపించాయి. షూ కవర్.. నార్వేలోని స్టవంగర్లో రార్ట్వెట్ షూ షాప్‌కి చెందిందని గుర్తించి.. అక్కడికి వెళ్లి ఆరా తీశారు. కొన్ని రోజుల క్రితం ఒక యువతి తమ దగ్గర జత బూట్లు కొన్నదని.. సెలెక్ట్ చేసుకోవడానికి చాలా సమయం తీసుకుందని.. తను చాలా వినయంగా, అందంగా ఉందని.. కళ్లు, జుట్టు గోధుమ రంగులో ఉన్నాయని.. ఆ షాప్ యజమాని కొడుకు చెప్పాడు. మృతదేహం దగ్గర దొరికిన షూస్ అవేనని అతడు గుర్తించాడు. దాంతో పోలీసులు వెంటనే ఆమె ఊహాచిత్రాన్ని గీయించారు. ఇంతలో కోడింగ్ పేపర్లో ఉన్నదాన్ని కనిపెట్టి.. ఆమె బస చేసిన ఓ హోటల్‌కి వెళ్లారు. ఊహాచిత్రం ఆధారంగా ఆ హోటల్లో ఆరా తియ్యగా.. ఆమె ‘ఫనెలా లార్ష్’ అనే పేరుతో చెక్ ఇన్ అయ్యిందని, కొన్ని రోజుల అక్కడే ఉందని తేలింది. ఆల్విల్డా రంగ్నెసా అనే వెయిట్రెస్.. ఆమెని వెంటనే గుర్తుపట్టింది. ‘ఆమె చాలా అందంగా ఉంది. ఆమె అందానికి ముగ్ధురాలినయ్యానని ఆమె గ్రహించి.. నన్ను చూసి కొంటెగా నవ్వేది. అందుకే తను నాకు బాగా గుర్తుండిపోయింది’ అని చెప్పింది. అలాగే ఆమె మరో కీలక సమాచారాన్నీ ఇచ్చింది. ‘ఒకరోజు ఆమె.. డైనింగ్ హాల్లో ఇద్దరు జర్మనీ నేవీ అధికారుల పక్కనే చాలాసేపు కూర్చుంది. అయితే తను వాళ్లతో మాట్లాడటం నేను చూడలేదు’ అనీ చెప్పింది. దాంతో కోడ్ లాంగ్వేజ్ రాతలను సరిపోల్చుకుంటూ.. ‘ఆమె ఒక గూఢాచారి’ అన్న అభిప్రాయం ఏర్పడింది. కొన్నిరోజులకు ఆమె చాలా మారుపేర్లతో, మారువేషాలతో.. పలు హోటల్స్‌లో ఉందనే సమాచారం వచ్చింది. 1960లో నార్వేజియన్ పెంగ్విన్ క్షిపణి ట్రయల్స్‌తో ఒక స్త్రీ కదలికలు చురుగ్గా ఉండేవని, ఆమె ఈమే కావచ్చనే నివేదికలూ బయటికొచ్చాయి. ఈ క్రమంలోనే.. ‘ఆమె మోసగత్తె అయ్యి ఉంటుంది, డబ్బు కోసం వేషాలు మారుస్తూ ఉండేదేమో?’ అని కొందరు.. ‘లేదు లేదు తనో వేశ్య కావచ్చు’ అని మరికొందరు సొంత కథనాలు అల్లడం మొదలుపెట్టారు. పోలీసులు ఎంత దర్యాప్తు చేసినా.. కనీసం ఆమె పేరు కూడా తెలుసుకోలేకపోయారు. ఆమె శవం ఇస్డాలెన్లో దొరికింది కాబట్టి కాలక్రమంలో ‘ఇస్డాల్ ఉమన్’ అంటూ వార్తాపత్రికలే నామకరణం చేశాయి. అయితే సడెన్‌గా 1971లో పోలీసులు ఆ కేసును క్లోజ్ చేశారు. సరిగ్గా 46 ఏళ్ల తర్వాత.. 2016లో తీవ్ర ఒత్తిళ్ల మధ్య.. ఈ కేసుని రీ–ఓపెన్ చేశారు. ఆమె అవశేషాలకు మళ్లీ వైద్య పరీక్షలు చేయించారు. ఆమె ఊపిరితిత్తుల్లో పొగ రేణువులు ఉన్నాయని.. మంటల్లో కాలుతున్నప్పుడు ఆమె బతికే ఉందని.. శరీరం పెట్రోల్‌తో కాలిందని, కడుపులోని నిద్రమాత్రలతో పాటు.. మంటలతో ఏర్పడిన కార్బ¯Œ మోనాక్సైడ్ కూడా ఆమె మరణానికి కారణమైందని వైద్యులు తేల్చారు. ఇక రీ ఓపెన్‌లోనూ సేమ్ సీన్. ఆమె చావుపై కాస్త క్లారిటీ వచ్చినా.. ఆమె ఎవరన్నది ఎవరికీ తెలియలేదు. 2019లో ఫ్రాన్స్‌లోని ఫర్బాష్ నివాసి ఒకరు ‘లే రిపబ్లికేన్ లోరేన్ ’ అనే న్యూస్ పేపర్లో వచ్చిన ఈమె కథనాన్ని చదివి.. ఆ సంస్థ రిపోర్టర్స్ని కలిశాడు. ‘1970 వేసవిలో.. నేను సుమారు 26 ఏళ్ల వయసున్న ఓ యువతితో కలసి జీవించాను. తను చాలా భాషల్లో మాట్లాడగల సమర్థురాలు. యూరప్‌లోని బాల్కన్ యాసలో మాట్లాడేది. వ్యక్తిగత వివరాలు పంచుకోవడానికి ఇష్టపడేది కాదు. తనకు చాలా ఫోన్ కాల్స్ వచ్చేవి. తన దగ్గర చాలా విగ్గులు, రంగురంగుల దుస్తులు ఉండేవి. ఆమె అచ్చం ఇస్డాల్ ఉమన్ ఊహాచిత్రంలానే ఉంది’ అని చెప్పాడు. అతడు ఇచ్చిన సమాచారం కథను రసవత్తరంగా మార్చింది తప్ప.. ముందుకు మాత్రం తీసుకెళ్లలేదు. ఇక ఈ కేసుని శాస్త్రవేత్తలు సవాలుగా తీసుకున్నారు. డీఎన్ఏ ప్రొఫైల్ ఆధారంగా.. ఆమె యూరప్ సంతతికి చెందని మహిళ అంటూ.. ఆమె బంధువుల్ని వెతికే పనిలో పడ్డారు. నిజానికి వాళ్ల ప్రయత్నం ఫలిస్తే.. ఏదో ఒకరోజు ఆమె ఎవరు అన్నది ప్రపంచానికి తెలుస్తుంది. కానీ అది హత్యా? ఆత్మహత్యా? హత్య అయితే ఎవరు చేశారు? వంటి ప్రశ్నలకు సమాధానం దొరకడం మాత్రం కష్టమే. ఏదేమైనా చివరికి ఆమె సృష్టించుకున్న మారుపేర్లు, మారు రూపాలే.. ఆమె ఉనికిని కాలగర్భంలో కలిపేశాయి. ఆమె ఒక స్పై(గూఢచారి)గా తన దేశానికి గొప్ప సేవ అందించి యోధగా శత్రువు చేతిలో మరణించిందా? లేక మోసగత్తెగా ఎవరి ప్రతికారానికైనా బలయ్యిందా? జీవితంపై విరక్తితో నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? అన్న ఎన్నో ప్రశ్నలకు నేటికీ సమాధానాల్లేవు. - సంహిత నిమ్మన -
Mystery: ఆ కుటుంబాన్ని కడతేర్చిందెవరు..?
ఆకస్మిక అదృశ్యాలను, అసహజ మరణాలను తిరగదోడేటప్పుడు.. ప్రతి కోణం ఉత్కంఠగానే ఉంటుంది. కానీ కొన్నింటికి ముగింపే ఉండదు. ఎంత వెతికినా దొరకదు. ఎందుకంటే అవి కల్పితాలు కావు, నిజ జీవిత కథలు. పైశాచికత్వం ముందు ఓడిపోయిన బతుకులు. అలాంటి మరో మిస్టరీనే ఇది.. 48 ఏళ్ల క్రితం.. పిక్నిక్కి వెళ్లిన కూతురు, అల్లుడు, పిల్లలు.. తన ఇంటి దగ్గర ఆగి, డిన్నర్ చేసి వెళ్తారని ఆశపడింది ఆ తల్లి. ఎందుకంటే అమెరికాలోని ఒరెగన్ రాష్ట్రం, కాపర్లోని తనింటికి.. 2 కిలో మీటర్లలోపే ఉన్న సిస్కియో పర్వతాల్లో క్యాంప్గ్రౌండ్కే వాళ్లు వెళ్లింది. రుచికరమైన వంటకాలు సిద్ధం చేసి, ఎదురు చూడసాగింది. ఎంతకూ రాకపోయేసరికి మనసెందుకో కీడు శంకించింది. దగ్గరే కావడంతో ధైర్యం చేసి క్యాంప్‌గ్రౌండ్‌కి నడిచేసింది. అక్కడ క్రీక్ రోడ్ సమీపంలోని క్యాంప్‌గ్రౌండ్‌కి వెళ్లి, తనవాళ్ల టెంట్‌ని గుర్తుపట్టింది. తీరా లోపలికి వెళ్తే అందులో ఎవ్వరూ లేరు. చిన్న టేబుల్ మీద సగం ఖాళీ చేసిన పాలడబ్బా, వెహికిల్ తాళం చెవి, అల్లుడు రిచర్డ్ కౌడెన్(28) పర్స్ కనిపించాయి. రిచర్డ్.. కూతురు బెలిండా(22), మనవడు డేవిడ్(5), ఐదు నెలల మనవరాలు మెలిసా సహా ఎవ్వరూ కనిపించలేదు. వాళ్ల వెంటవెళ్లిన పెంపుడు కుక్కలు కూడా కనిపించలేదు. దాంతో ఆ పెద్దావిడకు టెన్షన్ పెరిగిపోయింది. పైగా ఆ టెంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా కనిపించాయి. పర్స్‌లో 21 డాలర్లు సురక్షితంగా ఉన్నాయి. వెంటనే కూతురు, అల్లుడు వచ్చిన వాహనం కోసం వెతకడం మొదలుపెట్టింది బెలిండా తల్లి. క్రీక్ రోడ్‌పై పార్క్ చేసి ఉన్న ట్రక్కులో బాతింగ్ సూట్లు తప్ప అన్ని బట్టలూ ఉన్నాయి. బహుశా వాగుల్లో స్నానానికి వెళ్లినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందా? ఆ ఆలోచనే ఆమెను కుదురుగా ఉండనివ్వలేదు. వెంటనే పోలీస్ స్టేషన్ కి పరుగుతీసింది. పాలడబ్బా సాక్ష్యం సంఘటన స్థలానికి అధికారులు వచ్చారు. అక్కడ ఎలాంటి హింసాత్మక వాతావరణం కనిపించకపోవడంతో ఆ రాత్రి విచారణను అశ్రద్ధ చేశారు. మరునాడు వాళ్ల పెంపుడు కుక్కలైన బాసెట్ హౌండ్, డ్రూపీలు ‘కాపర్ జనరల్ స్టోర్’ ముందు తచ్చాడుతూ కనిపించాయి. సెప్టెంబర్ 1న ఉదయం 9 గంటలకు రిచర్డ్, కొడుకు డేవిడ్ కలసి వచ్చి.. తమ స్టోర్‌లో పాల ప్యాకెట్ కొనుక్కుని వెళ్లారని ఆ స్టోర్ యజమాని చెప్పాడు. దానికి టెంట్లో టేబుల్ మీదున్న సగం పాలడబ్బానే సాక్ష్యం. చరిత్రలోనే.. కౌడెన్ కుటుంబం వైట్ సిటీలో ఉండేవారు. 1974 ఆగస్టు 30న వీకెండ్ ట్రిప్ అంటూ ఓరెగన్ లోని అత్తగారి ఇంటి నుంచే క్యాంప్‌గ్రౌండ్‌కి వెళ్లారు. సెప్టెంబర్ 1 సాయంత్రానికల్లా అత్తగారి ఇంటికి చేరుకుని, అటు నుంచి తిరిగి వైట్ సిటీకి వెళ్లాలనేది వారి ప్లాన్. కానీ అలా జరగలేదు. వాళ్లు వెళ్లిన చోటికి పర్యాటకులు వస్తూపోతూ ఉంటారు. రిచర్డ్ ఫ్యామిలీ మిస్ అవడంతో ఆ ప్రాంతం నిఘా నీడలోకి చేరింది. జాతీయ మీడియా దీనిపై కవరేజ్ ఇవ్వడంతో కౌడెన్ కుటుంబం పట్ల సానుభూతి మొదలైంది. హైకర్స్ వల్ల.. స్థానిక వాలంటీర్లు, ఎక్స్‌ప్లోరర్ స్కౌట్స్, ఫారెస్ట్ సర్వీస్ అధికారులు, ఒరెగన్ నేషనల్ గార్డ్స్ విచారణాధికారులకు గట్టి సహకారమే అందించారు. ఫారెస్ట్ సర్వీస్ క్యాంప్ సైట్ చుట్టూ అణువణువూ గాలించారు అధికారులు. హెలికాప్టర్ల సాయంతో క్షుణ్ణంగా పరిశీలించినా ఫలితం లేదు. 1975 ఏప్రిల్ 12న ఒరెగన్ లోని ఫారెస్ట్ గ్రోవ్ నుంచి ఇద్దరు హైకర్స్ కొండపైన ఓ చెట్టుకు కట్టేసిన వ్యక్తి శవాన్ని చూశారు. అది బాగా కుళ్లిపోయింది. రంగంలోకి దిగిన పోలీసులు సమీపంలోని గుహలో ఒక మహిళ, ఇద్దరు పిల్లల శవాలను గుర్తించారు. ఆ మృతదేహాలు కౌడెన్ కుటుంబానివేనని పరీక్షల్లో తేలింది. నిజానికి ఆ ప్రదేశం వారి క్యాంప్‌సైట్ నుంచి దాదాపు 11 కిమీ దూరంలో ఉంది. శవపరీక్షల్లో బెలిండా, డేవిడ్‌లను తుపాకీతో కాల్చి, మెలిసాను బండకు బాది చంపారని తేలింది. చెట్టుకు కట్టిన తర్వాతే రిచర్డ్ చనిపోయాడని, బెలిండాతో పాటు ఇద్దరు పిల్లల్నీ వేరే చోట చంపి, గుహలో పడేశారని వైద్యులు భావించారు. అతనే.. సెప్టెంబర్ 1న క్యాంప్‌గ్రౌండ్‌లో ఉన్న పర్యాటకుల్ని విచారించినప్పుడు ‘ఓ లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ ఆ రోజు సాయంత్రం 5 గంటలకు పార్కులో నడుచుకుంటూ వెళుతుండగా ఇద్దరు మగవారు, ఒక మహిళ పికప్ ట్రక్‌లోంచి దిగడం చూశాం. వారు మమ్మల్ని భయాందోళనకు గురిచేశారు. అక్కడి నుంచి మేమెప్పుడు కదులుతామా అన్నట్లు ప్రవర్తించారు. అందుకే జనావాసం ఉండే చోటికి వెళ్లిపోయాం’ అంటూ చెప్పారు. అప్పుడే ఓ స్థానికుడు మరో షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ‘సెప్టెంబరులో కౌడెన్ కుటుంబం కోసం శోధించినప్పుడు ఆ గుహ మొత్తం నేను వెతికాను. అప్పుడు అక్కడ ఏ మృతదేహాలు లేవు’ అంటూ. ఈ క్రమంలోనే రూష్కు చెందిన డ్వైన్ లీ లిటిల్(25) అనే ఖైదీని నిందితుడిగా భావించారు. అతడు పదహారేళ్ల వయస్సులో ఓ యువకుడిపై అత్యాచారం, హత్య చేసిన నేరంపై శిక్షను అనుభవిస్తూ, కౌడెన్స్ కుటుంబం అదృశ్యానికి 3 నెలల ముందే పెరోల్ మీద విడుదలయ్యాడు. మిస్ అయిన రోజు అతడు కాపర్లోనే ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పైగా 1975 జనవరిలో లిటిల్ దగ్గర తుపాకీ ఉందని తేల్చుకున్న పోలీసులు పెరోల్ రద్దు చేశారు. మళ్లీ 1977 ఏప్రిల్‌లో బయటికి వచ్చిన లిటిల్.. ఓ గర్భవతిపై లైంగికదాడి చేసి, తీవ్రంగా కొట్టాడు. కొంచెంలో ఆ తల్లి, బిడ్డా ప్రాణాలతో బయటపడ్డారు. ఆ కేసులో కోర్టు లిటిల్‌కి 3 జీవిత ఖైదులను విధించింది. అంగీకరించలేదు విచారణలో లాస్ ఏంజెలెస్ ఫ్యామిలీ చెప్పినట్లుగా పార్క్ సమీపంలో ట్రక్‌లో వచ్చిన ఇద్దరు మగవారు, ఒక మహిళ ఎవరో కాదని.. లిటిల్, అతని తల్లిదండ్రులేనని పోలీసులు బలంగా నమ్మారు. కానీ సాక్ష్యాలే లేవు. 1974 సెప్టెంబర్ 2 సోమవారం నాడు లిటిల్ కుటుంబం క్యాంప్ గ్రౌండ్ సమీపంలోనే ఉన్నారని, గెస్ట్ బుక్‌లో సంతకం కూడా చేశాడని ఓ మైనర్ సాక్ష్యమిచ్చాడు. అయితే లిటిల్ కుటుంబం ఆ ఆరోపణలను అంగీకరించలేదు. మరోవైపు లిటిల్‌తో సెల్ పంచుకున్న ఓ ఖైదీ.. కౌడెన్ కుటుంబాన్ని చంపింది తనేనని లిటిల్ తన ముందు ఒప్పుకున్నట్లుగా చెప్పాడు. కానీ నేరం రుజువు కాకపోవడంతో కౌడెన్ కుటుంబాన్ని హతమార్చింది ఎవరో? నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన -
21 ఏళ్లైనా అంతుచిక్కని జర్నలిస్ట్ డెత్ మిస్టరీ.. హత్యే అని తెలిసినా..!
దుష్టులు నిర్మించుకున్న దుర్భేద్యమైన కోటలను కూలగొట్టాలని విఫలయత్నం చేశాడో వీరుడు. కథల్లోనో, సినిమాల్లోనో అయితే.. ఆ వీరుడే గెలిచేవాడు. కానీ ఈ రియల్ స్టోరీ.. అతడి మరణాన్నే మిస్టరీగా మలచింది. 1991 ఆగస్టు 10, మధ్యాహ్నం వెస్ట్ వర్జీనియాలోని మార్టిన్స్బర్గ్ సమీపంలోని షెరటన్ హోటల్ ముందు ఒక్కసారిగా జనం గుమిగూడారు. హోటల్ కస్టమర్స్, సిబ్బంది, యాజమాన్యం.. అంతా అక్కడున్నారు. వేగంగా వచ్చి ఆగిన పోలీస్ వ్యాన్‌లోంచి పోలీసులు ఒక్క ఉదుటన దుమికి.. ‘ఏ రూమ్?’ అన్నారు. సిబ్బందిలో ఒకరు 517 అని చెప్పగానే.. పోలీస్ బూట్లు అటుగా పరుగుతీశాయి. రూమ్ నంబర్ 517లోని బాత్‌టబ్‌లో ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ డానీ కాసోలారో(44) నిర్జీవంగా పడి ఉన్నాడు. అతడి రెండు చేతుల మణికట్లు లోతుగా తెగున్నాయి. ఓ పక్కన రేజర్ బ్లేడ్, మరోపక్కన సూసైడ్ నోట్ కనిపించాయి. నోట్ ఓపెన్ చేస్తే.. ‘నన్ను ప్రేమించేవారంతా నన్ను క్షమించండి. ముఖ్యంగా నా కొడుకు నన్ను అర్థం చేసుకుంటాడనుకుంటున్నా.. దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు’ అని రాసుంది. డానీ.. 1977లో మాజీ మిస్ వర్జీనియా అయిన టెరిల్ పేస్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు ట్రే అనే కొడుకున్నాడు. పదేళ్ల తర్వాత వాళ్లు విడాకులు తీసుకోవడంతో కొడుకు ట్రే బాధ్యతను డానీకే అప్పగించింది కోర్టు. 1970 నుంచి జర్నలిస్ట్‌గా ఉన్న డానీ.. కమ్యూనిస్ట్ చైనా నల్లమందును యూఎస్‌లోకి అక్రమంగా రవాణా చేయడం.. వంటి ఎన్నో సమస్యలను వెలుగులోకి తెచ్చి.. ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. డానీ రూమ్ మొత్తం క్షుణ్ణంగా వెతికిన పోలీసులకు.. క్రెడిట్ కార్డులు, డబ్బులున్న అతని వాలెట్ బెడ్ మీద సురక్షితంగా కనిపించింది. బలవంతంగా ఎవరైనా రూమ్‌లోకి వచ్చారా? అంటే.. అలాంటి ఆనవాళ్లేమీ లేవు. దాంతో డానీ మరణాన్ని ఆత్మహత్యగా నిర్ధారించేశారు పోలీసులు. రెండు రోజుల తర్వాత సమాచారం అందుకున్న డానీ ఫ్యామిలీ.. అది కచ్చితంగా హత్యేనని మొరపెట్టుకున్నారు. ‘మృతదేహం దొరికిన రోజే ఎందుకు మాకు సమాచారం ఇవ్వలేదు’ అని నిలదీశారు. దానికి అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. రిపోర్టర్‌గా డానీ జరిపిన వందలాది విచార ణ పత్రాలు, ఇతర ముఖ్యమైన ఫైల్స్.. వేటినీ కుటుంబానికి అందించలేదు. ‘అవన్నీ ఎక్కడా?’ అని ఆరా తీసిన డానీ సోదరుడు టోనీకి.. మృతదేహం దొరికిన హోటల్ రూమ్‌లో అవేం దొరకలేదనే సమాధానం వచ్చింది. రక్తపరీక్షల కోసం సూది గుచ్చితేనే భయపడే డానీ.. చేతులను కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటే నమ్మలేమంటూ.. అతడి కుటుంబం పోరాటం మొదలుపెట్టింది. డానీ మరణానికి కొద్ది రోజుల ముందు.. అతను చాలా మంది స్నేహితులతో.. ‘నేను చాలా పెద్ద కేసుని దర్యాప్తు చేస్తున్నా. త్వరలోనే వెలుగులోకి తెస్తా’ అని చెప్పాడట. నిజానికి ఆగస్ట్ 1990లో ఇన్‌స్లా అనే కార్పొరేట్ – గవర్నమెంట్ సాఫ్ట్వేర్ కంపెనీదారులైన బిల్ హామిల్ట¯న్Œ , నాన్సీలను ఇంటర్వ్యూ చేయడంతోనే ఆ సాఫ్ట్వేర్ మీద డానీ పరిశోధన మొదలైందట. వారు ప్రారంభించిన ‘ప్రామిస్’ అనే శక్తిమంతమైన ప్రాసిక్యూషన్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్‌లో.. చాలా పెద్ద మోసం ఉందని.. తెరవెనుక పెద్ద స్కామ్ నడుస్తుందని అనుమానించిన డానీ.. ఆ దిశగా విచారణ మొదలుపెట్టాడు. అప్పటికే ఇన్‌స్లా కంపెనీ సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేస్తున్నారని.. కొందరు న్యాయశాఖ అధికారులు దీన్ని ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇందులో ప్రభుత్వపెద్దల కుట్ర కూడా ఉందని.. ఆ లింకులు ఇతర దేశాలకూ పాకుతున్నాయని వస్తున్న పుకార్లను కూపీలాగడం మొలుపెట్టాడు డానీ. ఎందరో గూఢచారుల్ని కలసి.. ఎన్నో ఆధారాలను సంపాదించాడు. ఆ క్రమంలోనే ఎన్నో బెదిరింపు కాల్స్‌నూ ఎదుర్కొన్నాడు. ఆ విషయం తన సోదరుడు టోనీకి చెబుతూ.. ‘ఒకవేళ నేను చనిపోతే, అది ప్రమాదవశాత్తు జరిగిన మరణమని నమ్మవద్ద’ని చెప్పాడట. తను విచారిస్తున్న కుంభకోణానికి ‘ది ఆక్టోపస్’ అని పేరు కూడా పెట్టాడట. పోలీస్ విచారణపై నమ్మకం లేని కుటుంబ సభ్యులు.. హోటల్ సిబ్బందిని ఆరా తీయగా మరో నిజం బయటపడింది. డానీ చనిపోయిన రోజు.. పోలీసులు రాకముందే ఎవరో.. ప్రొఫెషనల్ క్లీనింగ్ వర్కర్స్‌తో డానీ రూమ్‌ని శుభ్రం చేయించారని తేలింది. ఆ క్లీనింగ్ వర్కర్లలో ఒకరు మాట్లాడుతూ.. ‘ఆ రోజు రక్తంతో తడిచిన రెండు టవల్స్‌ని మృతదేహం దగ్గర్లో చూశాం. వాటిని అప్పుడే చెత్తలో వేసేశాం. మాకంటే ముందే ఎవరో ఆ రూమ్‌లో నేల మీద పడిన రక్తాన్ని ఆ టవల్స్‌తో తుడిచినట్లు అనిపించింది’ అని చెప్పాడు. అయితే అతడు బహిరంగ సాక్ష్యానికి అంగీకరించలేదు. ఇక ఆగస్టు 9 సాయంత్రం ఐదున్నరకు.. డానీ తన పక్క గదిలో దిగిన లూనీని పలకరించాడట. ఒక ముఖ్యమైన కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని కలవబోతున్నానని చెప్పాడట. తొమ్మిదింటికి లూనీని మళ్లీ కలసిన డానీ.. ఒక ఫోన్ కాల్ మాట్లాడి వస్తానని వెళ్లి.. కొన్ని నిమిషాల్లోనే తిరిగివచ్చాడట. ‘బహుశా అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయలేదేమో? తెలియదు. మేం చాలాసేపు మామూలుగా మాట్లాడుకున్నాం’ అని లూనీ చెప్పుకొచ్చాడు. ఆ రోజు రాత్రి డానీ.. సమీపంలోని పిజ్జాహట్‌లో డిన్నర్ చేశాడట. అందులోని వెయిట్రెస్ డానీని గుర్తుపట్టింది. రాత్రి 10 దాటాక కాసోలారో సమీపంలోని కన్వీనియెన్స్ స్టోర్‌లో కాఫీ కొనుక్కుని తాగాడట. అదే అక్కడివారికి డానీ చివరిసారిగా సజీవంగా కనిపించింది. ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు. మరి ఆ రాత్రి ఏం జరిగింది? మరునాడు మధ్యాహ్నం వరకూ శవాన్ని ఎందుకు గుర్తించలేదు? ఇలా వేటికీ సమాధానాల్లేవు. మరోవైపు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేని ఒక ఆర్మీమన్.. డానీ అంత్యక్రియలకు హాజరయ్యాడట. డానీ శవపేటిక మీద గౌరవప్రదంగా ఒక పతకాన్ని ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయాడట. అసలు అతడు ఎవరు? ఎందుకు వచ్చాడు? అతడు నిజంగానే సైనికాధికారా? లేక డానీని చంపిన కిల్లరా? అనేది నేటికీ తేలలేదు. 1973లో లాభాపేక్షలేని సంస్థగా ఏర్పడిన ఇన్‌స్లా.. 1981లో లాభాపేక్షతో కూడిన అనుబంధసంస్థలను ఏర్పాటు చేసింది. ఆ తర్వాతే దాని ఆస్తులన్నీ కొత్త సంస్థలకు బదిలీ అయ్యాయి. డానీ మరణం తర్వాత.. ఇన్‌స్లా సంస్థ.. తన సాఫ్ట్‌వేర్‌ను దొంగిలించడానికి ప్రభుత్వమే కుట్ర పన్నిందని, దొంగిలించిన సాఫ్ట్‌వేర్‌ను.. విదేశీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా గూఢచర్య కార్యకలాపాలకు వినియోగించిందని.. నాసాతో సహా సీ.ఐ.ఏ, డి.ఓ.జీలు ఈ సమాచారాన్ని ఉపయోగించుకున్నాయని.. హత్యల్లోనూ ప్రమేయం ఉందని ఇలా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కొన్ని ఆధారాలు దొరికాయి. కానీ.. 12 సంవత్సరాల సుదీర్ఘన్యాయ విచారణ తర్వాత ఫెడరల్ క్లెయిమ్స్ కోర్ట్ వాటన్నింటినీ కొట్టిపారేసింది. ఇక్కడ 1960 నుంచి 66 వరకూ బిల్ హామిల్టన్ ఆరేళ్ల పాటు నాసా ఉద్యోగిగా ఉండడం గమనార్హం. -సంహిత నిమ్మన -
Mystery: ఆ మాటలు వణుకు పుట్టించాయి! మత్స్యకారుల వలలో మృతదేహం! నేటికీ..
అది 2010 జనవరి 12, రాత్రి ఎనిమిది కావస్తోంది. పన్నెండు డిగ్రీల వాతావరణంలో మంచు.. వానలా కురిసే రోజులవి. అమెరికాలోని మిషిగన్‌లో సెయింట్ పాల్ కేథలిక్ చర్చ్‌కి, క్లెయిర్ సరస్సుకు మధ్యలో వన్–వే ఎగ్జిట్ డ్రైవ్‌వేలో పెట్రోలింగ్ చేస్తున్న లెఫ్టినెంట్ ఆండ్రూ దృష్టి.. ఆగి ఉన్న ఓ సిల్వర్ కలర్ కారు మీద పడింది. అది సరస్సుకు వంద అడుగుల దూరంలో ఉంది. దగ్గరకు వెళ్లిన ఆండ్రూ కారుని పరిశీలనగా చూశాడు. కారులో ఎవరూ లేరు. ఆ చుట్టుపక్కలా ఎవరూ లేరు. ‘ఇన్ఫర్మేషన్ నెట్వర్క్’లో కారు నంబరు చెక్ చేసి, కారు మిషెల్ అనే అమ్మాయి పేరు మీద ఉన్నట్లు నిర్ధారించుకున్నాడు. కారుకి ఏదైనా సమస్య వచ్చి వదిలారనుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరో గంట తర్వాత పెట్రోలింగ్‌లో ఉన్న పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ కీత్ దృష్టి కూడా ఆ కారు మీదే పడింది. కారు ముందు సీట్లో హ్యాండ్ బ్యాగ్ ఉండటంతో అతడికి అనుమానం మొదలైంది. మంచునేలపై కొన్ని అడుగుల ఆనవాళ్లు.. కారు నుంచి సరస్సు వైపు దారిని చూపడంతో, కీత్ వాటినే అనుసరించాడు. సుమారు 75 అడుగుల తర్వాత రెండు విరిగిన దిమ్మలపై పేరుకున్న మంచు మరింత రక్తికట్టించే కథను చెప్పు కొచ్చింది. ఒక దిమ్మపై మనిషి కూర్చున్నట్లు, మరో దిమ్మపై మనిషి జారి సరస్సులో పడినట్లు ఆనవాళ్లు ఉన్నాయి. వాటిని గమనించిన కీత్, వెంటనే ఆండ్రూ సాయం కోరాడు. తక్షణమే రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగింది. కారు నంబర్ ఆధారంగా.. అడ్రెస్ పట్టుకుని.. తొమ్మిదిన్నర అయ్యేసరికి మిషెల్ ఇంటికి చేరుకున్నారు పోలీసులు. కాలింగ్ బెల్ కొట్టగానే.. ‘ఇంత ఆలస్యమా?’ అన్నట్లు మిషెల్ ఆత్రంగా తలుపు తీసింది. అప్పటి దాకా సరస్సులో పడింది మిషెల్ అనుకున్న పోలీసులు, తలుపు తీసింది స్వయంగా ఆమేనని తెలుసుకుని ఆశ్చర్యపోయారు. వచ్చింది తన తల్లి జోవాన్ అనుకున్న మిషెల్.. పోలీసులను చూసి షాక్ అయ్యింది. కారు జోవాన్(50) తీసుకుని వెళ్లిందని తెలుసుకున్న పోలీసులు, ‘మీరు ఆమెతో చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు మిషెల్‌కి గుండె ఆగినంత పనైంది. వెంటనే తల్లి ఫోన్‌కి వరసగా డయల్ చేస్తూనే ఉంది. ‘దిస్ నంబర్ ఈజ్ అవుటాఫ్ స్టేషన్’ అనే మాటలు వణుకు పుట్టించాయి. రాత్రి పది దాటేసరికి మిషెల్, తన చెల్లెలు కెల్లీ, తమ్ముడు మైకేల్ ముగ్గురూ కలిసి బిక్కు బిక్కమంటూ పోలీసుల వెంట సరస్సు దగ్గరకు వెళ్లారు. కారు చుట్టూ ఉన్న క్రైమ్ సీన్ టేప్ వాళ్లని మరింత భయపెట్టింది. ఎటు చూసినా పోలీసులే! వారిలో ఒక పోలీస్ ‘జోవాన్ మీ మదరా? ఆవిడ ఈ లేక్‌లో పడిపోయారు’ అన్న మాటలు చుట్టూ చెలరేగే శబ్దాలను నిశబ్దం చేస్తూ ఒక్కసారిగా వారిని దుఃఖంలో ముంచెత్తాయి. కోస్ట్ గార్డ్ హెలికాప్టర్లలతో, లేక్ షోర్ డ్రైవ్‌లతో సరస్సు మొత్తం జల్లెడపడుతున్నాడు. మర్నాడు తెల్లవారుజామున 4 గంటలకు సర్చ్ ఆపేసి, కారును పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లిపోయారు. ఏదైనా సమాచారం అందితే చెబుతామంటూ మిషెల్ వాళ్లని ఇంటికి పంపించేశారు. జోవాన్ 1980లో డేవిడ్ రోమైన్ అనే వ్యక్తిని ప్రేమించి, పెళ్లి చేసుకుంది. పెళ్లి అయిన ఇరవై ఐదేళ్లకి విడాకులు ఇచ్చి, తన ముగ్గురు పిల్లలతో కలిసి బతకడం మొదలుపెట్టింది. అయితే విడిపోయే వరకూ ఇద్దరి మధ్య చాలా గొడవలు నడిచాయి. జోవాన్‌కు స్నేహితులు ఎక్కువ. ఎప్పుడూ పార్టీలు, గెట్ టుగెదర్ అంటూ జీవితంలో తనకు తానే సంతోషాన్ని సృష్టించుకునేది. అలాంటి మనిషి అకస్మాత్తుగా కనిపించకపోవడం ఆమె పిల్లలకే కాదు, ఆమె సన్నిహితులకు కూడా మింగుడుపడలేదు. జోవాన్ తప్పకుండా తిరిగి వస్తుందనే వారంతా నమ్మారు. మర్నాడే కారు స్పేర్ కీతో హ్యాండ్ బ్యాగ్ బయటికి తీశారు పోలీసులు. అందులో 15 వందల డాలర్లు సురక్షితంగా ఉండటంతో, ఈ కేసు కుట్రపూరితం కాదని తేల్చేశారు. సరిగ్గా డబ్భై రోజులకు బోబ్లో దీవిలో డెట్రాయిట్ నదిలో మత్స్యకారుల వలలో ఓ మృతదేహం చిక్కింది. అది జోవాన్దేనని తేలింది. ఆ దీవి.. క్లెయిర్ సరస్సుకు 35 మైళ్ల దూరంలో ఉంది. పోలీసులు ఆత్మహత్యగా నిర్ధారించారు. అయితే, ‘మా మామ్‌ని ఎవరో కావాలనే చంపేశారు. కేసు తారుమారు చేయడంలో పోలీసుల పాత్ర కూడా ఉంది, తను మిస్ అవ్వడానికి ముందురోజుల్లో తనను ఎవరో ఫాలో అవుతున్నారని భయపడింది’ అంటూ కోర్టుకెక్కారు జోవాన్ పిల్లలు. ఆ రోజు కారు సమీపంలో, సరస్సు చుట్టు ప్రక్కల పాదముద్రలు కానీ, సరస్సులో పడిన ఆనవాళ్లు కానీ లేవని చీఫ్ జెన్సన్ తేల్చి చెప్పడంతో వివాదం ముదిరింది. పోలీసులపై నమ్మకం లేని మిషెల్.. రాండాల్ అనే ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ని నియమించుకుంది. అతడు చర్చిలో చాలామంది సాక్షులతో మాట్లాడాడు. ఆ రోజు చర్చి నుంచి బయటికి వచ్చే సమయంలో జోవాన్ కారు నుంచి అలారం మోగిందని, పొరబాటున టచ్ అయ్యి ఉంటుందనుకున్నామని కొందరు, సమీపంలో ఓ నల్లటి వ్యాన్ని, నల్ల కండువా ధరించిన మనిషిని చూశామని మరికొందరు చెప్పుకొచ్చారు. మరి జోవాన్ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే చర్చికి వెళ్లేముందు ఎందుకు కారులో గ్యాస్‌ని ఫుల్ ట్యాంక్ చేయించింది? గ్యాస్ట్స్టేషన్ మేనేజర్‌తో ఎందుకంత సంతోషంగా మాట్లాడింది? సరసులో గంటల తరబడి వెతికినా దొరకని మృతదేహం అంతదూరం నీటిలో ఎలా వెళ్లింది? వంటి ఎన్నో అనుమానాలను లేవనెత్తాడు రాండాల్. జోవాన్ శవపరీక్షలో పాల్గొన్న డాక్టర్ జెంట్జెన్.. మృతదేహం కనుగొన్నప్పుడు ఆమె ఊపిరితిత్తులలో నీరు లేదని, అంటే నీటిలో పడకముందే ఆమె ప్రాణాలు పోయాయని ధ్రువీకరించాడు. అయితే అది ప్రమాదమా? హత్యా? ఆత్మహత్యా? అనేది తేల్చలేకపోయాడు. మృతదేహం కోటు జేబులోనే అసలు కారు కీస్ దొరికాయి. జోవాన్ అదృశ్యం కావడానికి నెల్లాళ్ల ముందు.. కారుతో పాటు ఇంటి స్పేర్ కీస్ కూడా కనిపించడం లేదని కూతురు మిషెల్‌తో చెప్పింది. అయితే పోలీసులకు కారు స్పేర్ కీ ఎలా అందింది అనేది అనుమానాస్పదమే. మరోవైపు జోవాన్ మృతదేహాన్ని పరిశీలించిన మిషెల్, ‘మా మామ్ ఎప్పుడూ కోటును ఇలా గడ్డం వరకూ జిప్ చేసుకోదు. అలాగే తను ఎప్పుడూ హ్యాండ్ బ్యాగ్‌ని ఎడమ చేతికే వేసుకునేది. అదే చేతికి రెండు చిన్నచిన్న గాయాలు ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్‌కి చిరుగులు ఉన్నాయి. పైగా అది పదిరోజుల క్రితం కొన్న కొత్త బ్యాగ్. బహుశా కిల్లర్‌కి, మామ్‌కి మధ్య జరిగిన పెనుగులాటలో ఆ డ్యామేజ్ జరిగి ఉంటుంది’ అని ఆరోపించింది. హత్యకు కారకులుగా.. తండ్రి డేవిడ్, మేనమామలు జాన్, బిల్లతో పాటు జోవాన్ కజిన్ టిమ్ మటౌక్లపై అనుమానం వ్యక్తం చేసింది మిషెల్. తన తల్లికి తండ్రితో ఉన్న వ్యక్తిగత తగాదాలతో పాటు మిగిలిన వారితో ఉన్న ఆర్థిక తగాదాలను కారణంగా చూపించింది. జోవాన్‌కి సంబంధించిన రోజరీ (మెడలో వేసుకునే శిలువ), సెల్‌ఫోన్ ఇప్పటికీ దొరకలేదు. స్కాట్ లూయీ అనే మరో ప్రైవేట్ ఇన్వెస్టిగేటర్ సాయంతో.. మిషెల్ నేటికి ఆన్లైన్ పిటిషన్స్ వేస్తూ.. తల్లి కోసం న్యాయం పోరాటం చేస్తూనే ఉంది. సుమారు పన్నెండేళ్లుగా జోవాన్ మరణం మిస్టరీగానే మిగిలింది. -సంహిత నిమ్మన -
చెరువులో దూకి.. చెన్నైలో తేలిన టెక్కీ.. కేసులో ఊహించని ములుపు!
కోలారు: 16వ తేదీన కోలారు తాలూకాలోని కెందట్టి చెరువులో బెంగళూరు రూరల్ బాగలూరులో ఉండే చెందిన టెక్కీ రాహుల్ (27), కూతురు దియా (3)తో కలిసి దూకాడన్న కేసులో మిస్టరీ వీడుతోంది. చిన్నారి దియా అదే రోజు చెరువులో శవమై తేలడం తెలిసిందే. టెక్కీ జాడ మాత్రం కనిపించలేదు. దీంతో పోలీసులు అతడు చెరువులోకి దూకలేదని, పాపను విసిరేసి పరారై ఉంటాడని అనుమానం వ్యక్తంచేశారు. చివరకు అదే నిజమైంది. టెక్కీ రాహుల్ శనివారం చెన్నై నుంచి భార్యకు ఫోన్‌కు చేసి తనను కిడ్నాప్ చేశారని ప్రస్తుతం చెన్నైలోనే ఉన్నానని చెప్పినట్లు తెలిసింది. దీంతో అతడు బతికే ఉన్నాడని ఖరారైంది. మరో కొత్త డ్రామా అని అనుమానాలు అయితే కిడ్నాప్ అయ్యానని అతడు చెబుతున్న మాటలు మరో కొత్త డ్రామా అని భావిస్తున్నారు. 15వ తేదీన తన కుమార్తె దియాను బడికి వదలి వస్తానని కారులో బయలేదేరిన రాహుల్ అనంతరం కనిపించలేదు. తరువాత 16వ తేదీన తాలూకాలోని కెందట్టి చెరువులో కూతురు దియా మృతదేహం కనిపించింది. కానీ రాహుల్ కనిపించలేదు. రాహుల్‌ను నిజంగానే కిడ్నాప్ చేశారా, లేదా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీడి దేవరాజ్ తెలిపారు. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలను తట్టుకోలేక ఈ విధంగా కథ నడుపుతున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. చదవండి: షాకింగ్.. పట్టాలు తప్పి ప్లాట్‌ఫాం పైకి దూసుకెళ్లిన రైలు.. ముగ్గురు మృతి.. -
'డ్రీమ్ ఆఫ్ ఎ లైఫ్'.. మిస్టరీ స్టోరీ
అది 2006 జనవరి 25.. లండన్‌లోని మెట్రోపాలిటన్ హౌసింగ్ ట్రస్ట్ అధికారులు.. అడ్వకేట్స్‌తో కలసి తమ ఆధీనంలో ఉన్న బెడ్సిట్ అపార్ట్మెంట్స్లోని ఓ ఫ్లాట్ ముందు నిలబడి.. కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు. బెడ్సిట్ ఫ్లాట్స్ అంటే.. వసతి గృహాలు లాంటివి. గృహహింసల నుంచి విముక్తి పొందిన మహిళలకు తక్కువ అద్దెతో వసతి కల్పించే ఆవాసకేంద్రాలు. ఎంతసేపటికీ తలుపు తియ్యకపోవడంతో.. అనుమానం వచ్చిన వారంతా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. తలుపు తెరవగానే.. గుమ్మం ముందే కుప్పలు తెప్పలుగా పడున్న ఉత్తరాలు చూసి షాక్ అయ్యారు. చీకటిగా ఉన్న ఎంట్రెన్స్ గేట్ నుంచి కిచెన్‌లోకి వెళ్లారు. సింక్ నిండా చాలారోజులగా కడగని సామాన్లే. గది అంతా కుళ్లిన వాసన. అక్కడ నుంచి ఇంకాస్త లోపలికి వెళ్లేసరికి హాల్లో టీవీ ఆన్‌లోనే ఉంది. టీవీ ముందు సోఫాలో ఓ మహిళ కూర్చుని ఉన్నట్లు కనిపించింది. దగ్గరకు వెళ్లేసరికి గుప్పుమన్న దుర్గంధం నిమిషం కూడా అక్కడ నిలబడనివ్వలేదు. అస్థిపంజరానికి బట్టలు తొడిగినట్లుగా ఉన్న ఆ శవం.. ఆ అపార్ట్మెంట్లో ఉంటున్న మహిళదే అని గుర్తించడానికి వారికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె కాళ్ల దగ్గర ఓ షాపింగ్ బ్యాగ్ పడుంది. కాస్త దూరంలో కొన్ని క్రిస్మస్ గిఫ్ట్స్ ప్యాక్ చేసున్నాయి. ఫ్రిజ్‌లోని ప్రొడక్ట్స్ 2003 ఎక్స్‌పెయిరీ డేట్‌తో కనిపించాయి. అంటే ఆమె చనిపోయి ఆరోజుకి మూడేళ్లు కావస్తోందా? టీవీ అప్పటి నుంచి ఆన్‌లోనే ఉందా? ఆ షాక్‌తో వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి.. విచారణ మొదలుపెట్టారు. నిజానికి హౌసింగ్ ట్రస్ట్ అధికారులు.. అడ్వొకేట్స్తో ఆ అపార్ట్మెంట్కి రావడానికి కారణం మూడేళ్లుగా ఆ మహిళ అద్దె కట్టకపోవడమే. కేసు విచారణలో భాగంగా ఆ మహిళ ఊరు, పేరు, వయసు అన్నీ ట్రస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. మరిన్ని వివరాలను ఆమె అపార్ట్మెంట్లో సేకరించారు. మరునాడు ఉదయం పత్రికల్లో ‘మూడేళ్లకు బయటపడిన మహిళ శవం’ అనే వార్తతో పాటు.. చనిపోయిన ఆ మహిళ పేరు జాయిస్ కరోల్ విన్సెంట్ అని, ఆమె వయసు 38 ఏళ్లని, మీలో ఎవరికైనా ఆమె గురించి తెలుసా? తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండంటూ ప్రకటనలూ వచ్చాయి. శరీరం పూర్తిగా కుళ్లిపోయి, అస్థిపంజరం మాత్రమే మిగలడంతో.. ఆమె మరణానికి గల కారణాన్ని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. తలుపు వేసి ఉన్న ఇంట్లో.. టీవీ చూస్తున్న మహిళ.. కూర్చున్న చోటే ఎలా మరణించింది? అనేది ఎవ్వరికీ అంతుపట్టలేదు. పైగా ఆ ఫ్లాట్స్‌లో ఎంతో మంది ఉంటున్నారు. ‘మూడేళ్లుగా ఏ ఒక్కరికీ కుళ్లిన వాసన రాలేదంటే ఆశ్చర్యమే?’ అదే ప్రశ్న ఆ అపార్ట్మెంట్స్ వాళ్లను అడిగితే.. కిందే పేరుకున్న డంప్ యార్డ్‌ని చూపించారు. ఆ కుళ్లిన వాసన.. కిందున్న చెత్త వల్లే వస్తుందనుకున్నామని చెప్పారు. ఇక ఈ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యేసరికి.. జాయిస్ విన్సెంట్ మాజీ కొలీగ్స్, బాయ్‌ఫ్రెండ్స్, స్నేహితులు ఇలా ఒక్కొక్కరూ బయటికి వచ్చారు. వాళ్లకు తెలిసిన సమాచారాన్ని అందించారు. జాయిస్ 1965 అక్టోబరు 19న లండన్‌లోని హ్యామర్‌స్మిత్ ప్రాంతంలో జన్మించిందని, తండ్రి లారెన్స్.. ఆఫ్రికన్ సంతతికి, తల్లి లిరిస్.. భారత సంతతికి చెందినవారని, తన పదకొండేళ్ల వయసులో తల్లి మరణించిందని, తర్వాత తన నలుగురు తోబుట్టువులే ఆమె ఆలనాపాలనా చూశారని, పదహారేళ్ల వయసులో పాఠశాలను విడిచిపెట్టి.. మ్యూజిక్ వైపు దృష్టిసారిస్తూనే లండన్‌లోని ౖఇఔలో సెక్రటరీగా పని చేసిందని, ఎర్నెస్ట్లోని ట్రెజరీ డిపార్ట్మెంట్లో నాలుగు సంవత్సరాలకు పైగా పని చేసి.. 2001 మార్చిలో ఉన్నట్టుండి రాజీనామా చేసిందని.. ఆమె జీవితంలో నెల్సన్ మండేలా వంటి గొప్పవారిని కలుసుకుందని.. ఇలా కొన్ని వివరాలు సేకరించగలిగారు పోలీసులు. అదే 2001లో తనకు ఎంతో ఇష్టమైన తండ్రి మరణ వార్త ఆమెను చాలా కుంగదీసిందని కొందరు సన్నిహితులు చెప్పారు. నిజానికి జాయిస్ తండ్రి లారెన్స్ 2004లో చనిపోయాడు. అతడి కంటే ముందే జాయిస్ చనిపోయిందన్న విషయం లారెన్స్‌కు తెలియదు. జాయిస్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత బెడ్సీట్ ఫ్లాట్స్‌లో ఆశ్రమం పొందుతూ డబ్బుల కోసం హోటల్లో క్లీనర్‌గా మారింది. ఈక్రమంలోనే ఆమె తన కుటుంబానికి, స్నేహితులకు దూరమైంది. తన వాళ్లు ఇంతమంది ఉన్నా.. తను చనిపోయిన విషయం ఏ ఒక్కరూ గుర్తించకపోవడమే ఈ కథ విన్న ప్రతిఒక్కరినీ కదిలించింది. 2003 నవంబర్‌లో ఆమె కడుపులో పుండు కారణంగా రెండు రోజుల పాటు నార్త్ మిడిల్సెక్స్ హాస్పిటల్లో చికిత్స పొందిందని, ఉబ్బసంతో బాధపడిందని, పెప్టిక్ అల్సర్ అటాక్ అవ్వడం వల్లే చనిపోయిందని అధికారులు భావించారు. ఎలాంటి విషప్రయోగం జరగలేదని రిపోర్ట్ రావడంతో.. సహజ మరణమేనని పోలీసులు తేల్చారు. టెలివిజన్ అన్నేళ్లుగా పనిచేయడానికి కారణం.. ఆటోమేటిక్ డెబిట్ సిస్టమ్ యాక్టివ్‌లో ఉండటమేనని నిర్ధారించారు. అన్నేళ్లుగా టీవీ సౌండ్ వినిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడం బాధాకరమే.అయితే ఈ వార్తను మీడియాలో ఫాలో అయిన కరోల్ మోర్లీ అనే ప్రముఖ దర్శకురాలు.. దీనిపై డాక్యుమెంటరీ తియ్యాలనే ఉద్దేశంతో జాయిస్ స్నేహితులను, బంధువుల్ని కలసినప్పుడు జాయిస్ చనిపోయిందన్న విషయం తెలిసి వాళ్లు షాకయ్యారట. 2011లో మోర్లీ డైరెక్షన్లో వచ్చిన ‘డ్రీమ్ ఆఫ్ ఎ లైఫ్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ జాయిస్ జీవితాన్ని చూపిస్తూనే.. ఒంటరి జీవితంపై ఎందరినో ఆలోచింపచేసింది. జాయిస్ విన్సెంట్ కథ ఎంత వింతగా ఉంటుందో అంతే విషాదకరమైనది. ‘మనిషికి జీవిత భాగస్వామే అసవరం లేదు.. కనీసం తన అనుకునే మనిషి.. తనకోసం ఆలోచించే మనిషి ఉండేలా చూసుకోవడం చాలా అవసరం’ అని నమ్మేవాళ్లు ఎక్కువయ్యారు. ఏదిఏమైనా కూర్చున్న మనిషి కూర్చున్నట్లే ప్రాణాలు విడవడంతో.. ఆమె మరణానికి సరైన కారణాన్ని తేల్చకపోవడంతో ఈ కథ మిస్టరీగానే మిగిలింది. ∙సంహిత నిమ్మన -
సోనాలి ఫోగట్ మృతి కేసు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులా కానివొద్దు
చండీగఢ్: హర్యానా బీజేపీ నేత సోనాలి ఫోగట్ మృతిపై అనుమానాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీసులు ఇప్పటివరకు నలుగురిని అరెస్టు చేసినా ఆమె మరణానికి గల కారణాలపై మిస్టరీ వీడటం లేదు. ఈ నేపథ్యంలో సోనాలి ఫోగట్ కుటుంబసభ్యులు ఈ కేసును బాలీవుడ్ దివంగత నుటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుతో పోల్చుతున్నారు. ఫోగట్ మృతి కేసు కూడా సుశాంత్ కేసులా కాకూడదని అంటున్నారు. 'సుశాంత్ సింగ్ హత్యకు గురై ఉంటాడని ఆయన కుటుంబసభ్యులు ఇంకా నమ్ముతున్నారు. రియా చక్రవర్తి అతనికి డ్రగ్స్ ఇచ్చింది. అయినా ఇప్పుడు ఆమె బయటే ఉంది. కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదు. ఆ కేసు డ్రగ్స్ గురించి కాదు. హత్య గురించి' అని సోనాలి ఫోగట్ సోదరుడు కుల్దీప్ ఫోగట్ అన్నారు. సోనాలి ఫోగట్ మృతికి కారణమైన వారిని ఉరి తీయాలని కుల్దీప్ డిమాండ్ చేశారు. ఒకవేళ ఆమె హత్యకు గురైందని పోలీసులు రుజువు చేయలేకపోతే సీబీఐని ఆశ్రయిస్తామన్నారు. నార్కో టెస్టు కూడా నిర్వహించాలని కోరుతామన్నారు. కుటుంబసభ్యుల అనుమతి అనంతరం సోనాలి భౌతికకాయానికి గురువారం పోస్టుమార్టం చేశారు వైద్యులు. ఆమె శరీరంపై గాయాలున్నట్లు గుర్తించారు. దీంతో గోవా పోలీసులు సోనాలి మృతిని హత్య కేసుగా నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆమె సహాయకులిద్దరితో పాటు క్లబ్ ఓనర్, డ్రగ్ పెడ్లర్‌ను అరెస్టు చేశారు. చదవండి: సోనాలి ఫోగట్ దారుణ హత్య.. ఆ రెండున్నర గంటలేం జరిగింది? -
Mystery: పసికందుగా మాయమై.. ఐదుగురు పిల్లల తల్లిగా! కానీ ఆమె తల్లిదండ్రులు..
ఫ్లోరిడాలో ఇది 1980 నాటి కథ. డోనా కాసాసంటా అనే ఓ మహిళ.. తన కొడుకు, కోడలు, మనవరాలు కనిపించడం లేదంటూ టెక్సాస్ పోలీసుల్ని ఆశ్రయించింది. ‘కొడుకు హెరాల్డ్ డీన్ క్లౌస్ జూనియర్.. టీనా గెయిల్ లిన్ క్లౌస్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని, టెక్సాస్‌లో నివాసం ఉంటున్నారని, వారికి ఓ పాప కూడా పుట్టిందని, పాప పేరు బేబీ హోలీ అని, కొన్ని వారాలుగా వీళ్ల నుంచి ఎలాంటి సమాచారం లేదని, తనకు చెప్పకుండా వాళ్లు ఎక్కడికీ వెళ్లరని.. ఇలా ఎన్నో విషయాలు చెబుతూ కేసు నమోదు చేయించింది. పోలీసులు రంగంలోకి దిగారు. డీన్ క్లౌస్ టెక్సాస్‌లో వడ్రంగి పని చేసేవాడు. అతడికి మత ఆచారాలు ఎక్కువ. ఫ్లోరిడాలోని వోలుసియా కౌంటీలో ఉన్నప్పుడు.. 1970లో ఒక మతఛాందస బృందంలో సభ్యుడిగా చేరాడు. ఆ బృందం ఆచార నియమాల ప్రకారం సర్వ భోగాలు, పెళ్లి, పిల్లలు, ఆస్తులు ఇలా అన్నింటినీ త్యజించాల్సిన డీన్ క్లౌస్.. టీనాని పెళ్లి చేసుకుని.. పాపని కని.. టెక్సాస్‌లోని లెవిస్విల్లేలోకి మకాం మార్చాడు. తన జీవితాన్ని రంగుల ప్రపంచంగా మార్చుకున్నాడు. దాంతో మత సమూహం నుంచి కొన్ని బెదిరింపులొచ్చాయి. డీన్ వాటిని పట్టించుకోలేదు. అయితే ఉన్నట్టుండి అతడి కుటుంబం కనిపించకుండా పోయింది. ఆ జంట మిస్ అవ్వడానికి ముందు.. టూ–డోర్ రెడ్ బర్గండీ ఏఎంసీ కాంకార్డ్ కారుపై తిరిగే వారు. ఆ కారుతోనే వారు మిస్ అయ్యారు. కీలకంగా ఫోన్ కాల్! 1981 జనవరిలో డోనా కుటుంబం.. ఓ ఫోన్ కాల్ అందుకుంది. అదేంటంటే.. ‘మేము లాస్ ఏంజెలెస్ నుంచి కాల్ చేస్తున్నాం.. టీనా, డీన్లు మా మత బృందంలో చేరారు.. ఇకపై వారు కుటుంబాలతో ఎలాంటి సంబంధం కలిగి ఉండరు. తమ ఆస్తుల్ని కూడా వదులుకుంటున్నట్లు చెప్పమన్నారు. వారి కారు మా వద్దే ఉంది. కావాలంటే దాన్ని మీకు అందిస్తాం.. కానీ కొంత ఖర్చు అవుతుంది’ అని సిస్టర్ సుసాన్ అనే మహిళ డోనా కుటుంబంతో డీల్ మాట్లాడింది. అందుకు డోనా కుటుంబం సరేనంది. ‘ఫ్లోరిడాలోని డేటోనా రేస్ట్రాక్లో.. సిస్టర్ సుసాన్ ను కలవాలని నిర్ణయించుకున్నారు. ముందు చేసుకున్న డీల్ ప్రకారం నలుగురు వ్యక్తులు కారు ఇవ్వడానికి వచ్చారు. అందులో ముగ్గురు ఆడవారు ఉన్నారని.. వారంతా తెల్లటి వస్త్రాలను ధరించి, చెప్పులు లేకుండా ఉన్నారని.. డోనా కుటుంబం అధికారులకు తెలిపింది. ఆ దిశగా దర్యాప్తు మొదలైంది. ఎలాంటి ఆధారాలు చిక్కకపోవడంతో 2021 వరకూ ఈ కేసు మిస్సింగ్ కేసుగానే మిగిలిపోయింది. కోల్డ్ కేసుల సరసన చేరిపోయింది. టీనా, డీన్ల శవాలు సరే.. బేబీ హోలీ ఎక్కడా? 2021 అక్టోబర్‌లో ఓ షాకింగ్ విషయం బయటపడింది. 1981 జనవరిలో హారిస్ కౌంటీలోని వాలిస్విల్లే రోడ్ సమీపంలో హ్యూస్టన్ లోని అటవీ ప్రాంతంలో లభించిన ఓ జంట శవాలు.. టీనా, డీన్లవని తేలడంతో డోనా కుటుంబం అల్లాడిపోయింది. మరి పసికందు బేబీ హోలీ ఎక్కడా? అనే ప్రశ్నకు పోలీసుల నుంచి సమాధానం లేకపోయింది. ఆ పాపకు సంబంధించి.. ఒక్క ఆధారం కూడా ఘటనా స్థలంలో దొరకలేదు. దాంతో ఆనాడు గుర్తుతెలియని నూతన దంపతుల హత్య అని మాత్రమే కేసు నమోదు చేసుకున్నారు. భర్తని కొట్టి, భార్యని పీక కోసి చంపేశారని అప్పుడే తేలింది. కానీ వాళ్లు ఎవరు అనేది అంతుపట్టలేదు. ఏది ఏమైనా బేబీ హోలీ ఏమైంది? ఇదే ప్రశ్నతో పోలీసులు కేసును సీరియస్‌గా తీసుకున్నారు. మీడియా కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించింది. పాప ఫొటోతో ఊహాచిత్రాలు బయటికి వచ్చాయి. పోలీసులు.. అనాథ పిల్లలు, దత్తత వెళ్లిన పిల్లలు ఇలా 1980–81 చరిత్రను తిరగేశారు. డీఎన్ఏ పరీక్షలు విస్తృతంగా నిర్వహించారు. ఈ క్రమంలో 2022 జూన్‌లో.. ఓక్లహోమాలో నివసిస్తున్న 42 ఏళ్ల మహిళే ఈ బేబీ హోలీ అని తేలింది. ప్రపంచం నివ్వెరపోయింది. ఇదెలా సాధ్యం? అని ఆరా తీశారు అధికారులు. 1981లో తెల్లవస్త్రాలు ధరించిన ఓ మత సమూహం.. ఆ పాపని అరిజోనాలోని ఒక చర్చ్‌లో ఇచ్చి వెళ్లారని.. లాండ్రోమాట్ దగ్గర పాప దొరికిందని వారు చెప్పారని.. వారంతా సర్వం త్యజించిన శాకాహారులని.. విచారణలో తేలింది. చర్చ్ నుంచి ఓ కుటుంబం బేబీ హోలీని దత్తత తీసుకుని పెంచింది. బేబీ హోలీ ప్రస్తుతం అత్తింటితో, పెంచిన కుటుంబంతో మంచి సంబంధాలే కలిగి ఉంది. అలాగే డోనా కుటుంబాన్ని కలుసుకుంది. అయితే తమ వివరాలు గోప్యంగా ఉంచమంటూ హోలీ కుటుంబం అధికారులని కోరింది. అలాగే దత్తత తీసుకున్న కుటుంబానికీ, ఈ మర్డర్ కేసులకి ఏ సంబంధం లేదని అధికారులు క్లారిటీ ఇచ్చారు. మొత్తానికీ డీన్ పుట్టిన రోజు నాడే హోలీ దొరకడంతో డోనా కుటుంబం చాలా సంతోషంగా ఉంది. అయితే టీనా, డీన్లను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? అనేదానికి నేటికీ సరైన సమాధానం దొరకలేదు. దాంతో ఈ కేసు ఇంకా మిస్టరీగానే మిగిలి ఉంది. అరిజోనా, కాలిఫోర్నియా, టెక్సాస్‌తో సహా నైరుతి యునైటెడ్ స్టేట్స్లో ఆ మత సమూహం బిక్షాటన చేసేదని.. ఆ దిశగా విచారణ చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఏది ఏమైనా.. నలభై దశాబ్దాల క్రితం ఒక పసికందుగా మాయమైన బేబీ హోలీ.. ఐదుగురు పిల్లల తల్లిగా తిరిగి ప్రపంచానికి పరిచయం కావడం గమ్మత్తైన విషయం. -సంహిత నిమ్మన -
హింటర్‌కైఫెక్ హత్యలు.. ఇప్పటికే మిస్టరీ గానే..!
కొన్ని నేరాలు ఘోరాతి ఘోరంగా.. భయంకరంగా.. ఒళ్లు గగుర్పొడిచేలా.. ఉంటాయి! హింటర్‌కైఫెక్ మర్డర్స్ అలాంటివే! జర్మనీ అపరిష్కృత నేరాల్లో ఇదీ ఒకటి. సుమారు 100 ఏళ్ల నాటి ఆ కథే.. ఈ వారం మన ముందున్న మిస్టరీ. జర్మనీలోని మ్యూనిక్‌కి 43 మైళ్ల దూరంలో ఉంటుంది ఈ హింటర్‌కైఫెక్ అనే గ్రామీణ అటవీ భూభాగం. అక్కడ ఆండ్రీస్ గ్రూబర్(64) అనే మోతుబరి అతి పెద్ద ఫామ్ హౌస్ నిర్మించుకున్నాడు. అతని భార్య కాజిలియా గ్రూబర్(73), వాళ్ల వితంతు కూతురు విక్టోరియా(35), ఆమె ఇద్దరు పిల్లలు జూనియర్ కాజిలియా(7), జోసెఫ్(2) అంతా కలసి ఆ ఇంట్లోనే ఉండేవారు. వారికి అన్ని పనులు చేసిపెట్టడానికి ఓ పనిమనిషి వాళ్లతోనే ఉండేది. అయితే 1921 అక్టోబర్‌లో ఆమె ఉన్నట్టుండి ఆ ఇంటి నుంచి పారిపోయింది. అప్పటికే ఆమె ‘ఆ ఇంటి అటక మీద ఏవో స్వరాలు, శబ్దాలు వినిపిస్తున్నాయి. భయంగా ఉంటోంది’ అంటూ ప్రచారం చేసింది. అదే విషయాన్ని ఆండ్రీస్ కూడా చాలామందితో చెప్పేవాడు. పైగా ఇంటి వెనుకవైపు పడిన మంచు మీద ఏవో విచిత్రమైన అడుగులు కనిపించాయని, అవి ఇంటివైపు వేసిన అడుగులే కానీ బయటకు వెళ్లిన అడుగులు కావనీ, లేవనీ అతడు చెప్పాడు. అది విన్నవారంతా ‘ఇంట్లో ఓ తుపాకీ ఉంచుకోవడం మంచిది’ అని సలహా కూడా ఇచ్చారు. కానీ ఆండ్రీస్ ఆ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎట్టకేలకు ఆరునెలల తర్వాత మారియా(45) అనే ఆవిడ ఆ ఇంట్లో పనికి కుదిరింది. గ్రామస్థులతో కలివిడిగా ఉండే ఆ కుటుంబం.. 1922 మార్చి 31 తర్వాత ఒక్కసారిగా కనిపించకుండా పోయింది. ఆదివారం రోజున చర్చ్‌కి రాలేదు. సోమవారం జూనియర్ కాజిలియా స్కూల్లోనూ కనిపించలేదు. పోస్ట్మ¯Œ బట్వాడా చేసిన ఉత్తరాలూ ఎక్కడ పెట్టినవి అక్కడే ఉన్నాయి. దాంతో గ్రామస్థుల్లో అనుమానం మొదలైంది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు.. ఆండ్రీస్ ఇంట్లోనూ వెదకడం మొదలుపెట్టారు. బెడ్రూమ్లో కొత్త పనిమనిషి మారియా రక్తపు మడుగులో పడి చనిపోయి ఉంది. రెండేళ్ల జోసెఫ్ తన ఉయ్యాల్లో నిర్జీవంగా పడి ఉన్నాడు. మిగిలిన వారు ఎక్కడా కనిపించలేదు. ఇంతలో పోలీసులూ వచ్చారు. కాసేపటికి ధాన్య కొటారంలో నాలుగు శవాలు వరుసగా ఒకదానిపై ఒకటి పేర్చి.. ఎండు గడ్డి కప్పి ఉన్నట్లుగా గుర్తించారు. ఆ శవాలను చూస్తే అక్కడున్నవారందరి వెన్నులో వణుకుపుట్టింది. పోస్ట్‌మార్టమ్ రిపోర్ట్‌లో.. ఆ హత్యలు చేయడానికి మట్టాక్ (పదునైన వ్యవసాయ పరికరం)ను ఉపయోగించినట్లు తేలింది. ఎవరెవరు ఏ విధంగా చనిపోయారు? ఏ సమయంలో చనిపోయారు? అన్నీ లెక్కలు తేలాయి. ఆ క్రమంలోనే ఏడేళ్ల కాజిలియా చావు అందరినీ కలచివేసింది. కిల్లర్ కొట్టిన దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఆ పాప.. చాలా సమయం ఆ శవాల మధ్య ప్రాణాలతో కొట్టుమిట్టాడిందని.. చనిపోయే ముందు చాలా భయపడిందని తేలింది. పైగా హత్యల తర్వాత కూడా కిల్లర్.. అదే ఇంట్లో వంట చేసుకుని తిన్నట్లు ఆధారాలు ఉన్నాయి. దాంతో పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. వందమందికి పైగా అనుమానితుల్ని విచారించారు. కానీ ఫలితం లేదు. ఈ కేసులో మరో విషాదకరమైన విషయమేంటంటే.. కొత్త పనిమనిషి ఆ ఇంటికి వచ్చిన రాత్రే ఆమె హత్యకు గురైంది. అయితే గతంలో ఆండ్రీస్ మాటలను గుర్తు చేసుకున్న చాలామంది.. హంతకుడు చాలా కాలంగా ఆ ఇంటి అటకపైన ఉన్నాడని నమ్మారు. విచారణలో భాగంగా ఆండ్రీస్ కుటుంబ చరిత్రను తవ్వడం మొదలుపెట్టారు పోలీసులు. అప్పుడో సమాచారం వెలుగులోకి వచ్చింది. ఆండ్రీస్.. కూతురు విక్టోరియాతో లైంగిక సంబంధం కలిగి ఉన్నాడని, అందుకే 1915లో ఆ ఇద్దరికీ జైలు శిక్ష విధించారని, అయినా వాళ్లలో మార్పు రాలేదని.. జోసెఫ్ వాళ్లిద్దరికీ పుట్టిన బిడ్డేనని ఇరుగుపొరుగు చెప్పుకొచ్చారు. మరికొంత మంది.. జోసెఫ్ తండ్రి ఆండ్రీస్ కాదని.. ఆ ఇంటికి సమీపంలో నివసించే లోరెంజ్ బౌర్ అనే వ్యక్తి అని వాదించారు. దాంతో జోసెఫ్ అసలు తండ్రి ఎవరో నేటికీ తేలలేదు. తదుపరి పరీక్ష కోసం బాధితుల తలలను వేరు చేసి, వాటిని మ్యూనిక్‌కి పంపినట్లు నివేదిక రాసి.. అందరినీ ఒకేచోట ఖననం చేశారు. అయితే ఈ హత్యల వెనుక ఉన్నది ఎవరో తెలుసుకోవడానికి ఓ డాక్టర్.. ఆ తలలను అంజనం వేసే వ్యక్తుల దగ్గరకు పంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారులు మాత్రం.. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఆ పుర్రెలు కనిపించకుండా పోయాయని చెప్పారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా హంతకుడు ఎవరో తెలియకపోవడంతో చాలా ఊహా గానాలు మొదలయ్యాయి. నిజానికి విక్టోరియా భర్త గాబ్రియేల్ ఒక సైనికుడు. 1914లో మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయాడు. అయితే గాబ్రియేల్ చనిపోలేదని.. తిరిగి వచ్చాడని.. విక్టోరియా పాపాలు తెలుసుకుని.. ఈ ఊచకోతలకు తెగబడ్డాడనేది ఓ వర్గం వాదన. మరోవైపు.. ఈ ఘోరానికి తెగబడింది లోరేంజ్ అని.. విక్టోరియా తనతో ఉంటూనే తండ్రితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేక ఇలా చేశాడనేది మరికొందరి ఊహాగానం. అయితే 1919లో ఓ వృద్ధురాలు పోలీస్ అధికారులను కలసి.. ‘ఈ హత్యలను నా మాజీ భూస్వామి చేశాడు. మొత్తం సమాచారం అతడితోనే ఉంది’ అని తెలిపింది. అయితే ఆ ప్రధాన నిందితుడు అప్పటికి ప్రాణాలతో లేడు. 2007లో జర్మనీ పోలీసు అకాడమీలోని విద్యార్థులు.. ఎలాగైనా ఈ కేసుని క్లోజ్ చెయ్యాలని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి.. ఒక అనుమానితుడ్ని హంతుకుడిగా గుర్తించారు. అయితే అతడు కూడా అప్పటికి ప్రాణాలతో లేకపోవడంతో అతడి కుటుంబ సభ్యుల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని.. అతడి పేరునూ బహిర్గతం చేయలేదు. దాంతో ఈ కేసు నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన -
బాక్స్ ఆఫ్ బోన్స్.. ఇప్పటికీ మిస్టరీగానే..!
అది 1992 మార్చి 30. అమెరికాలోని వ్యోమింగ్‌లోని థర్మోపోలిస్లో నివాసముంటున్న న్యూవెల్ సెషన్స్ ఇంట్లో ఉన్నట్టుండి గందరగోళం మొదలైంది. న్యూవెల్, అతడి స్నేహితులు కలసి.. ఓ పాత ట్రంకు పెట్టె తాళాన్ని పగలగొడుతున్నారు. గత ఆరేళ్లుగా అందులో ఏముందనే వారి కుతూహలం.. ఆ పనికి ఉసిగొల్పింది. తాళం ఊడింది. తలుపు తెరుచుకుంది. పాక్షికంగా కప్పిన ప్లాస్టిక్ కవర్‌ను తీసి చూస్తే.. అందులో ఒక బ్యాగ్.. ఆ బ్యాగ్‌లో ఓ మనిషి అస్థిపంజరం విడి భాగాలు ఉన్నాయి. అంతా షాక్. ఒక్కమాటలో చెప్పాలంటే గజగజా వణికిపోయారు. ఆ షాక్‌లోనే న్యూవెల్ భార్య డైసీ.. ‘ఇప్పుడు ఏం చేద్దాం’ అంది. ‘గొయ్యి తవ్వి పూడ్చిపెట్టడం బెటర్’ అన్నారంతా. అది మరింత నేరం కావచ్చని డైసీ హెచ్చరించింది. దాంతో న్యూవెల్.. ఆ ట్రంక్ పెట్టెను అక్కడ వదిలిపోయిన తన స్నేహితుడు గాబీ కోసం పరుగుతీశాడు. గాబీ ఎదురు పడగానే.. ట్రంక్ పెట్టె గురించి ఆరా తీసి.. అతడి హావభావాలను గమనించాలనుకున్నాడు. గాబీ 1986లో న్యూవెల్‌కి ఓ షెడ్‌ని అప్పగించాడు. వెళ్తూ వెళ్తూ కొన్ని వస్తువుల్ని అందులో వదిలేసి వెళ్లాడు. వాటిలో ట్రంకు పెట్టె ఒకటి. వదిలేసిన వస్తువుల్ని తీసుకెళ్లడానికి గాబీ చాలా సార్లు షెడ్‌కు వచ్చాడు కానీ..ఆ ట్రంక్ పెట్టెను తీసుకెళ్లే ప్రయత్నమైతే చెయ్యలేదు. ‘ఎందుకు?’ అని న్యూవెల్ అడగనూ లేదు. ఇప్పుడు గాబీని కలసిన న్యూవెల్.. ‘షెడ్లో నువ్వు వదిలిపెట్టిన ట్రంక్ పెట్టె గుర్తుందా?’ అని అడిగాడు. ‘గుర్తుంది.. కానీ దాన్ని నేనెప్పుడూ తెరవలేదు. కొన్నప్పుడే దాని తాళంచెవి మిస్ అయ్యింది. డమ్మీ కీస్‌తో చాలా సార్లు ట్రై చేశా.. కానీ ఓపెన్ కాలేదు..’ అంటూ ఎలాంటి తొణుకూ బెణుకూ లేకుండా సమాధానమిచ్చాడు గాబీ. అందులో మనిషి అస్థిపంజరం ఉందని న్యూవెల్ చెప్పగానే.. ‘వేళాకోళాలు వద్దు బ్రదర్’ అంటూ పెద్దగా నవ్వాడు గాబీ. తాను తమాషా చేయడం లేదని నమ్మించడానికి న్యూవెల్‌కి చాలా సమయమే పట్టింది. అయితే గాబీ సమాధానాల మీద న్యూవెల్‌కి నమ్మకం కుదరలేదు. వెంటనే న్యూవెల్.. జాన్ లమ్లీ అనే అధికారి సాయాన్ని కోరాడు. అతడి సమక్షంలోనే వివిధ పరీక్షల కోసం అస్థిపంజరం ల్యాబ్‌కి తరలింది. ఎడమ పుర్రెలో, ఎడమ భుజంలో బుల్లెట్స్ ఉన్నట్లు ఎక్స్‌రేలు తేల్చాయి. దాంతో పుర్రె ఆకారాన్ని బట్టి చనిపోయిన వ్యక్తి ఊహచిత్రాలను గీయించి .. విడుదల చేశారు పోలీసులు. దీనిపై పత్రికలు కూడా ప్రత్యేక శ్రద్ధచూపించాయి. లమ్లీ వెంటనే.. గాబీని కలసి, తన స్టైల్లో ప్రశ్నించాడు. అప్పుడు కూడా గాబీ తడబడలేదు. ‘చాలా సార్లు పెట్టె ఓపెన్ చేయడానికి ప్రయత్నించాను. కానీ కుదర్లేదు. దాన్ని ఎక్కడ కొన్నానో గుర్తులేదు. కానీ.. అది 1973 నాటి పెట్టె’ అని బదులిచ్చాడు. దాంతో వెంటనే లమ్లీ.. అస్థిపంజరాన్ని చెయెన్నేలోని వ్యోమింగ్ స్టేట్ క్రైమ్ ల్యాబ్‌కు అప్పగించాడు. అక్కడి ల్యాబ్ అధికారి శాండీ మేస్.. ఆ అస్థిపంజరం ఒక పురుషుడిదని, సుమారు 5.9 పొడవు ఉంటాడని తేల్చాడు. అప్పుడే దర్యాప్తు చేస్తున్న అధికారులకు.. గాబీ మిసిసిపీలో ఆత్మహత్య చేసుకున్నాడనే వార్త అందింది. దాంతో ఈ హత్యకు గాబీకి కచ్చితంగా సంబంధం ఉందని తేలినా.. గాబీ లేకుండాపోవడంతో ట్రంక్ పెట్టె కేసుకు బ్రేక్ పడినట్టయింది. అప్పట్లో లయోవా వాసి షెల్లీ స్టాట్లర్(16), ఆమె తండ్రి ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘బహుశా ఆ అస్థిపంజరం మీ తాత జోసెఫ్ ముల్వానీది కావచ్చ’ని స్టాట్లర్ తండ్రి పదేపదే అనుమానించాడు. అయితే అప్పట్లో స్టాట్లర్ పెద్దగా పట్టించుకోలేదు. ఏళ్లు గడిచేకొద్ది.. స్టాట్లర్కు తన కుటుంబ చరిత్రపై ఆసక్తి పెరిగింది. ఒకసారి తన అమ్మమ్మ మేరీ అలైస్.. తన భర్త జోసెఫ్ ముల్వానీని తన కొడుకు జాన్ డేవిడ్ మోరిస్ చంపేసి ఉంటాడని బాధపడింది. తన తాత గురించి ఎన్నో ఎంక్వైరీలు చేసిన స్టాట్లర్కు 2017 వచ్చేసరికి.. ఆ అస్థిపంజరం తన తాత జోసెఫ్దేననే నమ్మకం బలపడింది. వెంటనే తన తల్లి కేథరిన్ డీఎన్ఏతో సరిచూడాలని అధికారులకు సిఫారసు చేసింది. అదే ఏడాది అక్టోబర్ 19న కేథరిన్ నుంచి డీఎన్ఏ నమూనా తీసుకున్నారు అధికారులు. అనుకున్నట్లే ఆ అస్థిపంజరం జోసెఫ్ ముల్వానీదే కావడంతో జాతీయస్థాయిలో ఈ కేసు మరోసారి వార్తలకు ఎక్కింది. జోసెఫ్ ముల్వానీ ఎవరో కాదు. 1941 నాటి ఇల్లినాయిస్ నేషనల్ గార్డ్‌లోని 130వ పదాతిదళంలో సభ్యుడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో పసిఫిక్ థియేటర్‌కి పోరాటయోధుడిగా వెళ్లాడు. తర్వాత కాలిఫోర్నియాలో రైల్రోడ్ వర్కర్ అయ్యాడు. మేరీ అలైస్‌ను వివాహం చేసుకున్నాడు. కేథరిన్, ఓఓ, పాట్రిక్ అనే ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. మరి మోరిస్ ఎవరు? మేరీ అలైస్ మొదటి భర్త కొడుకే జాన్ డేవిడ్ మోరిస్. 1963లో జోసెఫ్ లయోవాలో ఇల్లు కొని, అందులోకి కుటుంబంతో సహా మాకాం మార్చాడు. ఉన్నట్టుండి జోసెఫ్ అదృశ్యమయ్యాడు. అప్పుడే 16 ఏళ్ల మోరిస్.. జోసెఫ్‌ను హత్య చేసి పాతిపెట్టి ఉంటాడని, ఆ తర్వాత తవ్వి శరీరభాగాలను పెట్టెలో పెట్టి.. థర్మోపోలిస్ తీసుకుని వెళ్లి ఉంటాడని స్టాట్లర్ కుటుంబం భావించింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. మోరిస్, గాబీ ఒక్కరే కావడం. మోరిస్ ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో చలామణీ అయ్యాడని దర్యాప్తులో తేలింది. దాంతో గాబీ ఆత్మహత్య కూడా ఒక డ్రామా కావచ్చనే అనుమానాలు బలపడ్డాయి. అయితే నిజం బయటపడక మునుపే.. న్యూవెల్(ట్రంక్ పెట్టె ఓపెన్ చేసిన వ్యక్తి) 2003న, 2009లో మేరీ అలైస్(జోసెఫ్ భార్య) కన్నుమూశారు. 2019 మార్చి 29న వ్యోమింగ్‌లోని బల్లార్డ్ ఫ్యునరల్ హోమ్‌లో జోసెఫ్ కుటుంబ సమక్షంలో పూర్తి సైనిక స్మారక లాంఛనాలతో గౌరవప్రదంగా జోసెఫ్ అంత్యక్రియలు జరిగాయి. మొత్తానికీ ఈ కథలో గాబీ అలియాస్ మోరిస్ ఏమయ్యాడు? అసలు స్టెప్ ఫాదర్ అయిన జోసెఫ్‌ను ఎందుకు చంపాడు? అనేది మాత్రం మిస్టరీగానే మిగిలిపోయింది. ∙సంహిత నిమ్మన చదవండి: Alzheimers Disease: ఇవి కూడా అల్జైమర్స్ లక్షణాలేనట!! -
ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి కిరాతకంగా హత్య చేసిం'ది'
కులమో మతమో.. ఆస్తో అంతస్తో.. కారణమేమైనా ఇరు కుటుంబాలకు నచ్చని ప్రేమకథల్లో విషాదాంతాలే ఎక్కువ. ఒకరి కోసం ఒకరు బతకలేనప్పుడు.. ఒకరి కోసం ఒకరు చావడమే మేలని తెగించిన సందర్భాలకు సాక్ష్యాలెన్నో చరిత్రలో. అయితే విఫలమైన ప్రేమలోంచి పుట్టుకొచ్చే ఉన్మాదం ఎంతకైనా తెగిస్తుంది. అదే జరిగింది ఎలిస్–ఫ్రీడా జీవితాల్లో. అయితే ప్రేమకు కులమతాలే కాదు లింగబేధాలు కూడా ఉండవని చెప్పిన తొలినాళ్ల కథ ఇది. అది 1892, జనవరి మొదటివారం. అమెరికాలోని టెన్నెసీ, మెంఫిస్‌లోని 17 ఏళ్ల ఫ్రీడా వార్డ్ దారుణ హత్య.. దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది. చంపింది ఎవరో కాదు తన ఫియాన్సీ ఎలిస్ మిషెల్. అంతకుముందు ఏడాది.. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కొత్త జీవితాన్ని ఊహించుకుంటూ ఎన్నో ప్రేమలేఖలు రాసుకున్నారు. ఎంతో ఇష్టంగా ఉంగరాలు మార్చుకున్నారు. ప్రాణంగా ప్రేమించిన మనిషే తన ప్రాణాలు తీస్తుంటే ఫ్రీడా నిస్సహాయంగా కూలబడిన క్షణాల గురించి.. ఆమె సోదరి.. ప్రత్యక్షసాక్షి.. ఎడా కన్నీటి పర్యంతమవుతూ జరిగిందంతా కళ్లకు కట్టింది. ‘నేను, మా చెల్లి (ఫ్రీడా) మా ఫ్యామిలీ ఫ్రెండ్ మిసెస్ కింబ్రోగ్ని కలవడానికి మెంఫిస్ వెళ్లాం. అక్కడ నుంచి తిరుగు ప్రయాణంలో ఎలిస్, వాళ్ల అక్క లిల్లీ .. ఇద్దరూ కలసి గుర్రపు బగ్గీలో మమ్మల్ని వెంబడించారు. మేము ఉండే గోల్డ్డస్ట్కి వెళ్తున్న దారిలో ఎలిస్.. మా చెల్లిని చేయి పట్టుకుని లాగి.. రేజర్‌తో దాడిచేయడంతో నేను షాక్ అయ్యాను. వెంటనే తేరుకొని ఎలిస్‌ని కాలితో తన్ని కిందకు తోశాను. గొడుగుతో ఎలిస్‌ని ఆపేందుకు ట్రై చేస్తూ.. ఫ్రీడాని పారిపోమని హెచ్చరించాను. క్షణాల్లో నన్ను తోసేసిన ఎలిస్.. ఫ్రీడా వెంట పగబట్టిన తోడేల్లా పరుగుతీయడం కళ్లరా చూశాను. అలా నా చెల్లిని వెంబడించి దొరకబుచ్చుకున్న ఎలిస్.. ఫ్రీడా జుట్టు పట్టుకొని వెనక్కి లాగి రేజర్‌తో కసుక్కున ఆమె మెడ కోయడం నేను చూశాను. ఎడమ చెవి కింద నుంచి కుడి చెవి వరకూ మెడ లోతుగా తెగడంతో క్షణాల్లో ఫ్రీడా కూప్పకూలిపోయింది. ఎలిస్ తనను చంపడమేంటనే అయోమయస్థితిలోనే నేలకొరిగింది. స్థానికుల సాయంతో ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. ఫ్రీడా చనిపోయింది.. నా చెల్లి ఫ్రీడా చనిపోయింది’ అంటూ ఎడా కోర్టు బోనులో కుమిలి కుమిలి ఏడుస్తుంటే అక్కడున్న వారందరి కళ్లు చెమర్చాయి. అసలు ఎవరీ ఎలిస్? తనకు ఫ్రీడా ఎలా తెలుసు? అంత ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని.. ఎందుకు వెంబడించి మరీ చంపాల్సి వచ్చింది? వంటి ఎన్నో ప్రశ్నలు చాలామందిని నిలకడగా ఉండనివ్వలేదు. హత్య జరిగిన మరునాడే ఎలిస్, లిల్లీల అరెస్ట్‌తో దర్యాప్తు వేగవంతమైంది. అప్పటి దాకా ఈ కేసుపై దృష్టి పెట్టనివారిని కూడా ఆశ్చర్యపరచే ఒక విషయం విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే.. ఎలిస్ అబ్బాయి కాదు. అమ్మాయి అని. నిజమే ఇది ఇద్దరు అమ్మాయిల ప్రేమ కథ. ఎలిస్, ఫ్రీడాలు కలసి చదువుకున్నారు. ఇద్దరూ సంపన్న కుటుంబాలకు చెందిన వారే. ప్రాణస్నేహితులు. ఆ స్నేహబంధం అంతకు మించిన అనుబంధంలా ఎప్పుడు మారిందో వాళ్లకు కూడా తెలియదు. వారి సన్నిహితుల్ని ఆరా తీస్తే.. 1890 నుంచే వారు ప్రేమలో ఉన్నారని తేల్చారు. ‘రెండేళ్ల క్రితమే వారి స్నేహం హద్దులు దాటి.. రొమాన్స్‌గా మారింది. పబ్లిక్‌గానే కౌగిలించుకుంటూ.. ముద్దులు పెట్టుకునేవారు. అయితే అప్పటికే చాలామంది ఆడపిల్లలు తమకు కాబోయే భర్తతో ఎలా ఉండాలో ఇతర ఆడపిల్లలతో రిహార్సల్స్ చేస్తుండటం సాధారణమైపోయేసరికి వాళ్ల వ్యవహారమూ అందులో భాగమే అనుకుని ఎవరం పెద్దగా పట్టించుకోలేదు’ అంటూ చెప్పుకొచ్చారు స్కూల్ టీచర్స్, స్టూడెంట్స్. అయితే ఫ్రీడా, ఎలిస్ల తీరును ఫ్రీడా ఫ్యామిలీ ముందే పసిగట్టింది. కావాలనే ఎలిస్‌కి దూరంగా అర్కాన్సాస్‌లోని గోల్డ్డస్ట్కి మకాం మార్చింది. ఆ దూరం ఇరువురిలో విరహాన్ని పెంచిందే తప్ప.. ప్రేమని తుంచలేదు. 1891లో ఓ రాత్రి ఫ్రీడా సూట్‌కేస్ సర్దుకుంటూ ఎడా కంటపడింది. వెంటనే ఫ్రీడాని బంధించిన ఎడా.. ఆమె దగ్గరున్న ప్రేమ లేఖలను లాక్కుని చదవడం మొదలుపెట్టింది. ‘డియర్ ఫ్రీడా, ఈ లెటర్‌తో పాటు ఓ రింగ్ పంపిస్తున్నాను. దాన్ని నువ్వు పెట్టుకో.. దీని అర్థం మన పెళ్లి అయిపోయినట్లే. మనం సెయింట్ లూయీస్‌కి పారిపోదాం. అక్కడ నేను ఎల్విన్ జే వార్డ్ అనే అబ్బాయి పేరుతో అందరికీ పరిచయం అవుతాను. నిన్ను నా భార్యగా పరిచయం చేస్తాను. అప్పుడిక మనల్ని ఎవ్వరూ విడదీయలేరు.. మనం ఎప్పటికీ కలిసే ఉంటాం’ అంటూ ఎలిస్.. ఫ్రీడాకి రాసిన చివరి లేఖను చదివి.. షాక్ అయింది ఎడా. వెంటనే ఆ లేఖను పెద్దవాళ్లకు చూపించింది. నాటి నుంచి ఫ్రీడాపై ఇంట్లో ఆంక్షలు ఎక్కువయ్యాయి. ఆ ఇరువురి మధ్య ఉత్తరాలు కూడా బంద్ అయ్యాయి. ఇవన్నీ దర్యాప్తులో తేలిన నిజాలు. ఫ్రీడా హత్యతో లిల్లీకి ఎలాంటి సంబంధం లేదని భావించిన కోర్ట్.. పది వేల డాలర్ల ఫైన్ విధించి, ఆమెను విడుదల చేసింది. ఎలిస్‌కి మానసిక స్థితి బాగోలేదని, ఎలిస్ పర్సనాలిటీ అమ్మాయిలానే ఉన్నా.. మనస్తత్వం, లక్షణాలు మాత్రం అబ్బాయివే అన్న వాదన తెరపైకి తెచ్చాడు ఎలిస్ తరపు లాయర్. ఫ్రీడా దూరమయ్యాక తట్టుకోలేని ఎలిస్.. చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేసినట్లు కూడా వాదనలో వినిపించారు.పది రోజుల వాదనలో చివరిరోజు.. జడ్జ్ తీర్పు కోసం, ఎలిస్ ఇచ్చే వివరణ కోసం కోర్టుకు వేలాదిమంది తరలి వచ్చారు. ఫ్రీడా కోసం ఆత్మహత్య చేసుకునేంతగా ప్రేమించిన ఎలిస్ ఎందుకు ఆమెనే చంపింది? ఇదే అందరి మనసుల్ని రగిల్చిన ప్రశ్న. ‘నాకు దక్కని అమ్మాయి మరొకరికి దక్కడానికి వీల్లేదని అనుకున్నాను కానీ చంపాలనే కసి మాత్రం లేదు. ఎప్పుడైతే ఎడా నన్ను అడ్డుకుందో.. అప్పుడు ఫ్రీడాను చంపాలనే కసి కలిగింది. అందుకే వెంబడించి చంపేశాను’ అని కోర్టులో చెప్పింది ఎలిస్. అంతా విన్నాక ఎలిస్‌కి మానసిక పరిస్థితి సరిగా లేదని నమ్మింది కోర్టు. ఎలిస్‌ని టెన్నెసీలోని బొలీవర్ దగ్గరున్న మెంటల్లీ చాలెంజ్డ్ హోమ్‌కు తరలించాలని ఆదేశించింది. దాంతో 1892 నుంచి 1898... చనిపోయే వరకూ ఎలిస్ అక్కడే ఉంది. అయితే ఆమె క్షయ వ్యాధి సోకి చనిపోయిందని కొందరు.. వాటర్ టవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటారు. ఏది ఏమైనా ఫ్రీడా హత్యపై ఎలిస్ సరైన వివరణ ఇవ్వకపోవడంతో చాలా పుకార్లు పుట్టుకొచ్చాయి. ఎలిస్ కంటే ఫ్రీడా అందగత్తె. చదువుకునే రోజుల్లో కుర్రాళ్లంతా ఫ్రీడా వెంటే పడేవారు. అది చూసినప్పుడల్లా ఎలిస్ అసూయపడేది. ఫ్రీడా తననే ప్రేమిస్తుంది కాబట్టి ఆ ఈర్ష్యని బయటపెట్టేది కాదు. హత్య జరిగిన రోజున ఫ్రీడాను చంపే ఉద్దేశం లేని ఎలిస్.. ఎడా జోక్యంతో రెచ్చిపోయి పాత అసూయనూ బయటపెట్టి అప్పటికప్పుడు ఆమె మెడ కోసి చంపేసింది’ అనేది ఒక పుకారు. ‘హత్య జరిగిన రోజున... ఓ అజ్ఞాత వ్యక్తిని ఎలిస్ గమనించింది. అతడు కచ్చితంగా ఫ్రీడా కోసమే వచ్చి ఉంటాడనే అనుమానంతో ఫ్రీడాను హత్య చేసి ఉంటుంద’ని ఇంకో పుకారు. దాన్ని బలపరచే స్థానిక జానపద గీతం నేటికీ ప్రాచుర్యంలో ఉంది. కానీ వేటికీ ఆధారాల్లేవు. - సంహిత నిమ్మన -
గుడ్డిగా నమ్మి ప్రాణాలు కోల్పోయింది.. కానీ ఆ విషయం మాత్రం మిస్టరీనే!
కొందరు మోసగాళ్లకి నమ్మకమే పెట్టబడి. ఎవరినైనా గుడ్డిగా నమ్మితే.. కనీసం మోసపోయామనే విషయం కూడా తెలియకుండానే జీవితం ముగిసిపోతుందనడానికి ఈ కథ ఓ ఉదాహరణ. అది 1893 డిసెంబర్ 3.. మినీయపోలిస్ (మిన్నెసొటా, అమెరికా).. కనిచీకటి పడుతున్న వేళ.. 29 ఏళ్ల క్యాథరిన్ జింగ్.. గూస్మాన్ లివెరీ స్టేబుల్‌కి వెళ్లి క్లాస్ బ్లిక్ట్స్ అనే పేరు మీద ఓ గుర్రం, ఓ బగ్గీ (గుర్రబ్బండి)ని అద్దెకు తీసుకుంది. సరిగ్గా రాత్రి ఏడున్నర అయ్యేసరికి ఆ బగ్గీపై వెస్ట్ హోటల్ వైపు వెళ్లి.. అక్కడ క్లాస్ బ్లిక్ట్స్ అనే వ్యక్తిని కలిసింది. తన దగ్గరున్న నకిలీ నోట్లు అతడికి ఇచ్చి.. అతడి దగ్గరున్న ఒరిజినల్ కరెన్సీని తను తీసుకోవాలి. కానీ అలా జరగలేదు. ఆమె రాకకోసం చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్న బ్లిక్ట్స్.. ఆమె రాగానే తుపాకీతో కాల్చాడు. క్షణాల్లో నేలకొరిగిన క్యాథరిన్ తలపై పెద్ద రాయితో కొట్టి, ఆమె దగ్గరున్న అన్నింటినీ లాక్కుని ఉడాయించాడు. గుర్రాన్ని, గుర్రబ్బండినీ గూస్మాన్ లివెరీ స్టేబుల్‌కి అప్పగించేశాడు. ఎలాగో బ్లిక్ట్స్ పేరుమీదే వాటిని క్యాథరిన్ అద్దెకు తీసుకుంది కాబట్టి వాటిని తిరిగి ఇవ్వడానికి అతడు పెద్దగా కష్టపడలేదు. ఎనిమిదిన్నర.. తొమ్మిది మధ్యలో డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్తున్న విలియం ఎర్హార్డ్ అనే వ్యక్తి రోడ్డు మీద జింగ్ మృతదేహాన్ని గుర్తించాడు. కాసేపటికే అజ్ఞాత యువతి యాక్సిడెంట్ అని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. పోస్ట్‌మార్టమ్ తర్వాత అది హత్య అని ఆమె తలలోని బుల్లెట్ తేల్చింది. ఆ తర్వాత.. ఆమె ఎవరో కాదు క్యాథరిన్ జింగ్ అనే డ్రెస్ మేకర్ అనీ తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. క్యాథరిన్ జింగ్... చాలా అందగత్తె. ఆమె సన్నిహితులంతా ఆమెని కిట్టీ అని ముద్దుగా పిలుచుకునేవారు. కొన్నేళ్ల క్రితం న్యూయార్క్ నుంచి మిన్నెసొటాకి వచ్చి, బట్టలు తయారుచేసే సంస్థలో డ్రెస్ మేకర్‌గా చేరింది. మరో డిపార్ట్మెంట్ స్టోర్‌లో క్లర్కుగా పనిచేస్తున్న ఫ్రెడెరిక్తో ప్రేమలో పడింది. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. నిశ్చితార్థం అయిన తర్వాత ఏవో కొన్ని గొడవలతో పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. అయితే ఫ్రెడెరిక్ తొడిగిన నిశ్చితార్థపు ఉంగారాన్ని మాత్రం ఆమె ఎప్పుడూ తన మెడలో వేసుకుని తిరిగేది. ఏళ్లు గడిచే కొలదీ ఆమె జీవితంలో కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులతో పాటు డబ్బూ జమకూడింది. అయితే జింగ్ మరణం తర్వాత మరింత లోతుగా ఆరాలు తీసిన పోలీసులు.. హత్య జరిగిన మూడురోజుల్లోనే నలుగురిని అరెస్ట్ చేశారు. వారిలో క్యాథరిన్ మాజీ ప్రేమికుడు ఫ్రెడెరిక్తో పాటు ధనిక కుటుంబానికి చెందిన హ్యారీ హేవార్డ్, హ్యారీ సోదరుడు ఆండ్రీ, సెక్యూరిటీ గార్డ్ బ్లిక్ట్స్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ విచారణలో ఫ్రెడెరిక్ అమాయకుడని నిర్ధారించి విడిచిపెట్టేశారు. ‘క్యాథరిన్ నా దగ్గర కొంత డబ్బు అప్పుగా తీసుకుంది. ఆ డబ్బు కోసమే ఆమెని చంపి, డబ్బు ఎత్తుకెళ్లి ఉంటారు’ చెప్పాడు హ్యారీ. తను క్యాథరిన్‌కు డబ్బు ఇచ్చేప్పుడు సాక్షిగా ఉన్న పనిమనిషినీ స్టేషన్‌కు పిలిపించాడు. దాంతో పోలీసులు హ్యారీది కూడా తప్పు లేదని నమ్మారు. ఆండ్రీ, బ్లిక్ట్స్ కూడా తమకు ఈ కేసుతో ఏ సంబంధం లేదనడంతో పోలీసుల దృష్టి హ్యారీ గర్ల్‌ఫ్రెండ్ లిలియన్ అలెన్ మీద పడింది. గతంలో హ్యారీతో క్యాథరిన్ క్లోజ్‌గా ఉండటం తట్టుకోలేకపోయిన అలెన్ .. రెండుమూడు సార్లు క్యాథరిన్తో గొడవపడిందట. కానీ విచారణలో ఆమె కూడా నిర్దోషిగానే తేలింది. అయితే పోలీసుల దెబ్బలు రుచి చూసిన ఆండ్రీ నోరు విప్పాడు. ‘హ్యారీ కొన్ని రోజుల క్రితం నా దగ్గరకు వచ్చి.. క్యాథరిన్‌ను చంపేందుకు సాయం చేయాలని కోరాడు. కానీ నేను భయపడి నో చెప్పాను. మా ఫ్యామిలీ లాయర్ లెవీ స్టూవర్ట్కి అప్పుడే ఈ విషయాన్ని షేర్ చేసుకున్నాను. కావాలంటే స్టూవర్ట్ని ప్రశ్నించండి’ అంటూ కేసుని హ్యారీ వైపు తిప్పాడు ఆండ్రీ. స్టూవర్ట్.. ఆండ్రీకి అనుకూలంగా నిలబడటంతో హ్యారీ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఒజార్క్ ఫ్లాట్స్‌లోని క్యాథరిన్ అద్దెకుండే అపార్ట్మెంట్ ఓనర్ హ్యారీ తండ్రిదని.. హ్యారీకి, క్యాథరిన్కి చాలా సన్నిహిత సంబంధం ఉందని ప్రాథమిక విచారణలో బయటపడింది. హ్యారీ మంచి జూదగాడు. ఇన్సూరెన్స్ మోసాలు, డబ్బు కోసం భారీ చోరీలు, నకిలీ కరెన్సీ తయారీ వంటి పనుల్లో ఆరితేరిన మనిషి. చాలా అపరిష్కృత హత్య కేసుల్లో అతడి పేరుంది. అతడి గురించి తెలిసినవాళ్లంతా అతన్ని శాపనార్థాలు పెట్టేవారు. ఫ్రెడెరిక్తో విడిపోయిన బాధలో ఉన్న క్యాథరిన్కి.. హ్యారీ స్నేహం ఊరటనిచ్చింది. క్యాథరిన్‌కు డబ్బు ఆశ చూపిస్తూ తను చేసే ప్రతి దుశ్చర్యలో ఆమెను భాగంచేసేవాడు.. కొంత సొమ్ము ముట్టజెప్పేవాడు. ఆ క్రమంలోనే వారి మధ్య బంధం బలపడింది. హ్యారీ ప్రోత్సాహంతో క్యాథరిన్.. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకుంది. దానికి నామినీగా అతడి పేరు రాయించుకున్నాడు. క్యాథరిన్ చనిపోతే ఆ పాలసీ డబ్బులు తనకే వస్తాయని ఇదంతా చేశాడు హ్యారీ. మొత్తం కథలో బ్లిక్ట్స్ ఇచ్చిన సాక్ష్యం కీలకంగా మారింది. క్యాథరిన్ నన్ను కలవడానికి ప్లాన్ చేసిందే హ్యారీ. నకలీ డబ్బుల మార్పిడి కోసం క్యాథరిన్ నా దగ్గరకు వచ్చిందని చెప్పాడు. అంతే కాదు హ్యారీ ఈ హత్య ప్లాన్ గురించి చెప్పడానికి నా దగ్గరకు వచ్చినప్పుడు, అతడు నా కళ్లలోకి కళ్లు పెట్టి తదేకంగా చూశాడు. ఆ తర్వాత అతడు ఏం చెప్పినా నేను నో అనలేకపోయాను. ఆ చూపులో ఏదో మాయ ఉంది. అందుకే క్యాథరిన్‌ని హత్య చేశాను’ అంటూ హ్యారీ తనపై హిప్నాటిజం చేశాడని చెప్పుకొచ్చాడు బ్లిక్ట్స్. అయితే అప్పటికే స్థానికులు హ్యారీ హిప్నాటిజం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. అతడికి ఏదో శక్తి ఉందని, అతడి కళ్లల్లో ఏదో మాయ ఉందని.. వశీకరణ చేసి చాలా మందిని మట్టుబెట్టాడని ఇలా హ్యారీపై చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. బ్లిక్ట్స్ ప్రత్యక్షసాక్షి కావడంతో వశీకరణ అనే అంశాన్ని పక్కన పెట్టి.. న్యాయపరంగానే విచారణ సాగించారు. కొన్ని వాయిదాల తర్వాత హ్యారీకి ఉరిశిక్ష, బ్లిక్ట్స్కి జీవితఖైదు పడింది. ఆండ్రీ నిర్దోషిగా బటయపడ్డాడు. 1895 డిసెంబర్ 11న తెల్లవారు జామున 2.12కి హ్యారీని ఉరి తీశారు. అయితే హ్యారీ 2.25 ని.ల వరకూ బతికేవున్నాడనీ రికార్డుల్లో నామోదు చేసుకున్నారు అధికారులు. దాంతో నిజంగానే హ్యారీ చాలా శక్తిమంతుడని.. అతడికి క్షుద్రపూజలు కూడా తెలుసని.. చాలా మంది నమ్మడం మొదలుపెట్టారు. అతడు తిరిగి లేచి, బతికొస్తాడనీ కొందరు భావించేవారు. హ్యారీకి ఉరి తీసే కొన్ని రోజుల ముందు ఒక విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తను చేసిన కొన్ని హత్యల గురించి నోరు విప్పాడు హ్యారీ. అప్పుడు కూడా వశీకరణ గురించి చెప్పలేదు. దాంతో బ్లిక్ట్స్ని నిజంగానే వశీకరణ చేసి క్యాథరిన్‌ని చంపించాడా? లేక బ్లిక్ట్స్ కావాలనే అబద్ధం చెప్పాడా? అనేది తేలలేదు. కేసు ముగిసినా నేరస్తుడికి శిక్షపడినా.. ఈ కథలోని వశీకరణ కోణం నేటికీ మిస్టరీనే. -సంహిత నిమ్మన చదవండి: Mystery Room No 1046 Story: నిన్ను చంపాలనుకుంది ఎవరు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రోలాండ్! -
వీడిన రెండేళ్ల మిస్సింగ్ కేసు మిస్టరీ
బద్వేలు అర్బన్ : రెండేళ్ల క్రితం బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్లో నమోదైన ఓ మిస్సింగ్ కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఇటీవల జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ జిల్లాలోని మహిళల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో రూరల్ పోలీసులు విచారణ చేపట్టగా సంచలన నిజాలు వెలుగు చూశాయి. సదరు తప్పిపోయిన మహిళ పొలానికి వేసిన విద్యుత్ కంచె తగులుకుని మృతిచెందగా పొలం యజమానితో పాటు మరికొందరు కలిసి శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా పూడ్చిపెట్టినట్లు తేలింది. దీంతో నిందితులను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం స్థానిక రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైదుకూరు డీఎస్పీ ఎస్.ఆర్.వంశీధర్‌గౌడ్ వివరించారు. బద్వేలు మండలం మల్లంపేట గ్రామానికి చెందిన బొల్లా రామసుబ్బమ్మ (49) అనే మహిళ తన భర్తతో ఏర్పడిన విభేదాలతో సిద్దవటం మండలం జ్యోతి సమీపంలోని గొల్లపల్లె గ్రామంలోని ఆమె సోదరుని ఇంటి వద్ద నివసిస్తుండేది. అయితే 2020వ సంవత్సరం జూలై 9వ తేదీన తమ తల్లి కనిపించడం లేదని ఆమె కుమారుడు శ్రీనివాసులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్ని నెలల పాటు విచారించి ఆచూకీ లభించకపోవడంతో పెండింగ్ కేసుగా ఉంచారు. ఇటీవల కాలంలో జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ జిల్లాలోని మహిళల మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి తిరిగి విచారణ చేయాలని ఆదేశించడంతో తన పర్యవేక్షణలో రూరల్ సీఐ హనుమంతనాయక్, ఎస్ఐ చంద్రశేఖర్, సబ్ డివిజన్ ఐడీపార్టీ సిబ్బందితో కలిసి విచారణ ముమ్మరం చేశారు. ఈ క్రమంలో సిద్దవటం గొల్లపల్లె గ్రామంలోని జ్యోతిరామకృష్ణారెడ్డికి చెందిన పొలానికి అమర్చిన విద్యుత్ తీగల కంచె తగులుకుని ఓ మహిళ మృతి చెందిందని సమాచారం లభించింది. దీనిపై సదరు పొలం యజమానిని పూర్తిస్థాయిలో విచారించగా అసలు విషయం బయటపడింది. పొలంలో ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగులుకుని మహిళ మృతి చెందడంతో మరికొందరి సహాయంతో సిద్దవటం సమీపంలోని పెన్నానదిలో పూడ్చినట్లు విచారణలో తేలింది. తర్వాత పెన్నానదిలో పూడ్చిన మృతదేహాన్ని వెలికి తీసి మృతదేహానికి ఉన్న చీర, జాకెట్ ఆధారంగా మృతురాలు అప్పట్లో తప్పిపోయిన రామసుబ్బమ్మగా నిర్ధారణకు వచ్చిఏడుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో పొలం యజమాని రామకృష్ణారెడ్డితో పాటు ఇందుకు సహకరించిన లక్షుమయ్య, వెంకటయ్య, కొండయ్య, వెంకటరమణ, వెంకటసుబ్బయ్యలను అరెస్టు చేసి కోర్టు ఎదుట హాజరుపరిచామని, ఈ కేసులో మరొక నిందితుడిని అరెస్టు చేయాల్సి ఉందని డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన సీఐ హనుమంతనాయక్, ఎస్ఐ చంద్రశేఖర్, ఏఎస్ఐలు రాజశేఖర్‌రెడ్డి, నరసింహారావు, ఐడీపార్టీ ఏఎస్ఐలు రాంభూపాల్‌రెడ్డి, నాగేంద్ర, కానిస్టేబుళ్లు శివ, అమరేశ్వర్‌రెడ్డి, ప్రసాద్‌లను జిల్లా ఎస్పీ, మైదుకూరు డీఎస్పీలు అభినందించారు. -
Mystery: నిన్ను చంపాలనుకుంది ఎవరు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన రోలాండ్!
ప్రతీకారమో పశ్చాత్తాపమో కానీ.. ఓ జీవితం ముగిసింది. హత్యనో.. ఆత్మహత్యనో తేలకుండా అనుమానాస్పద కథనంగా మిగిలిపోయింది. అది 1935 జనవరి 4. అమెరికాలోని కేంజస్ సిటీలో నిత్యం అతిథులతో కళకళలాడే ‘ప్రెసిడెంట్ హోటల్’లో ఊహించని కలకలం మొదలైంది. అంతకు రెండు రోజుల క్రితం రూమ్ నం. 1046లో దిగిన రోలాండ్ టి. ఓవెన్ అనే యువకుడు చావుబతుకుల మధ్య నెత్తురోడుతున్నాడు. గమనించిన హోటల్ సిబ్బంది.. మొదటి కాల్ అంబులెన్స్‌కి, రెండో కాల్ పోలీస్ స్టేషన్‌కి చేశారు. ఆ రూమ్ మొత్తంలో ఒక సిగరెట్ పెట్టె, పగిలిన గ్లాస్, టెలిఫోన్ స్టాండ్ మీద దొరికిన ఒక మహిళ వేలిముద్రలు కీలక ఆధారంగా మారాయి. పోలీస్ విచారణలో వింత విషయాలు చాలానే బయట పడ్డాయి. రోలాండ్ చూడటానికి కాస్త బాడీ బిల్డర్‌లా ఉన్నాడని, బ్లాక్ కోట్ ధరించిన అతడికి సుమారు 20 నుంచి 35 ఏళ్ల వయసు ఉండొచ్చని.. జుట్టు బ్రౌన్ కలర్లో ఉందని, అతడి తల మీద చాలా గాయాల తాలూక ఆనవాళ్లు ఉన్నాయని, అతడి చెవులు కాస్త భిన్నంగా కిందకు వంగినట్లుగా ఉన్నాయని.. చెప్పుకొచ్చారు అక్కడి సిబ్బంది. అయితే అతడ్ని మొదటిసారి రూమ్‌కి తీసుకుని వెళ్లిన బెల్‌బాయ్ రాండమ్ క్రాఫ్ట్.. మరో విచిత్రమైన విషయాన్ని చెప్పాడు. రోలాండ్ జనవరి 2న మధ్యాహ్న సమయంలో హోటల్‌కి వచ్చాడని, తన వెంట కేవలం ఒక బ్రష్, ఒక పేస్ట్, ఒక దువ్వెన మాత్రమే తెచ్చుకున్నాడని, పైగా రూమ్ కావాలని కాకుండా.. కిటికీలు కూడా లేని ఇంటీరియర్ రూమ్ కావాలని.. ప్రైవసీ ఎక్కువగా ఉండాలని కోరడంతో మేనేజర్.. అలాంటి రూమ్‌నే కేటాయించాడని చెప్పుకొచ్చాడు. అసలేం జరిగింది? రోలాండ్.. హోటల్లో దిగిన రోజు సాయంత్రం రూమ్ క్లీన్ చేసేందుకు మేరీ సోప్టిక్ అతడి రూమ్‌కి వెళ్లింది. అప్పుడు రోలాండ్.. డిమ్ లైట్లో చైర్‌పై కూర్చుని కాస్త భయపడుతున్నట్లుగా కనిపించాడట. రూమ్ క్లీన్ చేసిన తర్వాత బయటికి రాబోతున్న సోప్టిక్తో రోలాండ్.. ‘కాసేపట్లో నా స్నేహితుడు వస్తాడు, డోర్ లాక్ చేయొద్దు’ అని చెప్పాడట. దాంతో ఆమె డోర్ లాక్ చేయకుండానే వెళ్లింది. కొద్దిసేపటికి టవల్స్ తీసుకుని సోప్టిక్ మళ్లీ రోలాండ్ రూమ్‌కి వచ్చింది. అప్పుడు రోలాండ్ ఒంటినిండా దుప్పటి కప్పుకుని మంచంపై పడుకుని కనిపించాడట. అయితే బల్ల మీద ‘డాన్, నేను పావుగంటలో వస్తా, వెయిట్ చేయండి’ అని నోట్ రాసిపెట్టాడట. అది చదవిన సోప్టిక్ టవల్స్ రూమ్‌లో పెట్టి, బయటికి వచ్చేసింది. ఆ మరునాడు సోప్టిక్ మళ్లీ రోలాండ్ రూమ్‌ని క్లీన్ చేయడానికి వెళ్లినప్పుడు.. తలుపు బయట నుంచి లాక్ చేసి ఉండటంతో తన దగ్గరున్న డూప్లికేట్ కీ సాయంతో తలుపు తెరిచింది సోప్టిక్. రూమ్ అంతా చీకటిగా ఉండటంతో, లైట్ వేసింది. ఎదురుగా రోలాండ్ దిగులుగా కూర్చుని ఉండటం చూసి షాక్ అయ్యింది. బయట తలుపు ఎవరు పెట్టారు? అనేది ఆమెకు అర్థం కాలేదు. షాక్ నుంచి తేరుకుని క్లీనింగ్ చేస్తున్నప్పుడు రోలాండ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ.. ‘వద్దు డాన్, నాకు తినాలని లేదు. నేను ఇప్పుడే బ్రేక్ ఫాస్ట్ చేశాను’ అని చెప్పాడట. మరునాడు మళ్లీ దుప్పట్లు మార్చేందుకు రోలాండ్ రూమ్ బెల్ కొట్టింది సోప్టిక్. అయితే ఈ సారి ఆ రూమ్‌లో రోలాండ్‌తో పాటు మరో వ్యక్తి ఉన్నట్లుగా ఆమె గమనించింది. ‘మాకు ఏం అవసరం లేదు.. నువ్వు వెళ్లొచ్చు’ అనే గంభీరమైన స్వరం ఒకటి సోఫ్టిక్కి వినిపించింది. అది కచ్చితంగా రోలాండ్ స్వరం కాదు అనేది సోఫ్టిక్కి తెలుసు. మరోవైపు జనవరి 4 తెల్లవారు జామున రూమ్ నంబర్ 1048లో ఉంటున్న ఒక మహిళ నుంచి రిసెష్షన్కి ఓ కంప్లైంట్ వచ్చింది. ‘1046లో ఉంటున్న వాళ్లతో చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. అందులో ఓ మహిళ పెద్దపెద్దగా అరుస్తోంది’ అని ఆమె రిసెప్షన్‌కి కాల్ చేసి చెప్పింది. దాంతో వెంటనే రోలాండ్ ఉండే రూమ్‌కి ఫోన్ ట్రై చేశారు రిసెష్షన్లో పని చేసే సిబ్బంది. ఫోన్ కలవకపోవడంతో టెలిఫోన్ కనెక్షన్ పోయి ఉంటుందనుకుని.. బెల్ బాయ్‌ని రోలాండ్ రూమ్‌కి పంపించారు. ఎంత సేపు కొట్టినా తలుపు తీయకపోవడంతో వెనుదిరిగాడు బెల్ బాయ్. కొన్ని గంటల తర్వాత మరో బెల్ బాయ్ రోలాండ్ రూమ్ దగ్గరకు వచ్చాడు. అతడు ఈసారి బలవంతంగా తలుపు తెరిచి చూశాడు. డోర్‌కి రెండు అడుగుల దూరంలో రోలాండ్ మోకాళ్లపై కూర్చుని తలను చేతులతో పట్టుకుని ఉన్నాడు. ఒంటి నిండా రక్తం కారుతోంది. లైట్ ఆన్ చేసిన బెల్ బాయ్.. మంచం మీద, బాత్ రూమ్‌లో, గోడలపైనా ఉన్న రక్తం మరకల్ని చూసి భయపడ్డాడు. పరుగున వెళ్లి మేనేజర్‌కి విషయం చెప్పాడు. రోలాండ్‌కు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న డాక్టర్లు.. అతడ్ని ఎవరో తీవ్రంగా హింసించారని, ఛాతీలో, ఊపిరితిత్తుల్లో కత్తితో గట్టిగా పొడిచారని.. కుడివైపు మెదడు బాగా దెబ్బతిందని.. కొన్ని గంటల వరకూ ఏం చెప్పలేమని అన్నారు. దాంతో రోలాండ్పై హత్యాయత్నం చేసింది ఎవరంటూ పోలీసులు గట్టిగానే విచారణ మొదలుపెట్టారు. ఇక్కడే మరో ట్విస్ట్ కథను ఉత్కంఠగా మార్చింది. రోలాండ్ సృహలోకి వచ్చాడు. వెంటనే రోలాండ్పై డిటెక్టివ్, పోలీసులు కలసి ప్రశ్నల వర్షం కురిపించారు. ‘నిన్ను చంపడానికి ప్రయత్నించింది ఎవరు?’ అని రోలాండ్‌ని అడిగితే.. ‘నన్ను ఎవరూ చంపాలనుకోలేదు.. నేను బాత్ రూమ్ టబ్‌లో పడిపోయాను. అందుకే దెబ్బలు తగిలాయి’ అని షాకిచ్చాడు రోలాండ్. ‘నిజం చెప్పు.. ఎవరూ నీపై దాడి చేయకుంటే.. ఆత్మహత్యాయత్నం చేసుకున్నావా?’ అనీ ప్రశ్నించారు. ‘లేదు.. ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఘటన మాత్రమే’ అని సమాధానమిచ్చి కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ మరునాడు జనవరి 5న అదే ఆసుపత్రిలో చనిపోయాడు. దాంతో పోలీసులు కేసుని సవాలుగా తీసుకున్నారు. అప్పుడే మరో కీలక సాక్ష్యం బయటపడింది. ఆ హోటల్ ఎలివేటర్ ఆపరేటర్ చార్ల్స్ బ్లాషర్.. ‘ఒక మహిళ రూమ్ నంబర్ 1026 ఎక్కడా? అని నన్ను అడిగింది, తర్వాత ఆమె రోలాండ్ రూమ్ ముందు తచ్చాడుతూ కనిపించింది, నన్ను చూడగానే కాస్త కంగారుపడి పొరపాటుగా ఇక్కడికి వచ్చానని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయింది. కాసేపటికి ఆమె మరో వ్యక్తితో కలసి మాట్లాడటం నేను చూశాను’ అని చెప్పాడు. అంతే కాదు ఆ వ్యక్తే డాన్ అయి ఉండొచ్చని చార్ల్స్ అభిప్రాయపడ్డాడు. చార్ల్స్ చెప్పిందంతా విన్నాక.. రోలాండ్ గదిలో దొరికిన మహిళ వేలిముద్రలు ఆమెవే కావచ్చనీ పోలీసులు భావించారు. ఇక పోలీసులు రోలాండ్ శవాన్ని ఖననం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తుండగా.. ఊహించిన ఒక ఫోన్ కాల్.. అతడి మరణం హత్యేనని బలపరచింది. ‘కావాల్సినంత డబ్బు పంపిస్తాను. అతడి అంత్యక్రియలు మాత్రం కేంజస్ సిటీ మెమోరియల్ పార్క్ శ్మశాన వాటికలోనే ఘనంగా జరిపించండి. అక్కడైతే అతడు మా చెల్లెలికి దగ్గరలో ఉంటాడు’ అని ఫోన్ చేసిన వ్యక్తి చెప్పాడు. అతడు చెప్పినట్లే మార్చి 23న ఒక అజ్ఞాత సెంటర్ నుంచి పెద్ద డబ్బు కట్ట పోలీస్ స్టేషన్‌కి వచ్చింది. డబ్బుతో పాటు రాక్ ఫ్లవర్ కంపెనీ నుంచి కొన్ని పువ్వులు కూడా వచ్చాయి. వాటి మధ్యలో ‘లవ్ ఫరెవర్ లూయీ’ అనే నోట్ ఉంది. రాక్ కంపెనీలో ఆరా తీస్తే.. అక్కడ కూడా ఆధారాలు దొరకలేదు. ఇక ఈ విషయాన్ని వార్తాపత్రికలు కథలు కథలుగా ప్రచురించాయి. అలాంటి ఓ కథనాన్ని చదివిన రూబీ ఓగ్లెట్రీ అనే మహిళ.. కేంజస్ సిటీ పోలీస్ స్టేషన్ వెతుక్కుంటూ వచ్చింది. రోలాండ్ తన కన్నకొడుకు అని.. అతడి అసలు పేరు ఆర్టెమస్ ఓగ్లెట్రీ అని చెబుతూ తన కొడుకు తనకు రాసిన లెటర్లు కొన్ని సాక్ష్యంగా చూపించింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. రూబీకి వచ్చిన లెటర్స్‌లో కొన్ని రోలాండ్ చనిపోయిన తర్వాత తేదీతో ఉన్నాయి. అవన్నీ హ్యాండ్ రైటింగ్‌తో కాకుండా టైప్ చేసి ఉన్నాయి. ఇంకో వార్త పత్రికకు మరో మహిళ ఫోన్ చేసి.. ‘వాడు చేసిన తప్పుకు వాడికి తగిన శిక్షే పడింది’ అని చెప్పిందట. ‘ మీరు మాట్లాడేది రోలాండ్ గురించేనా అంటే.. ‘అవును’ అని ఫోన్ పెట్టేసిందట. అయితే పోలీసులకు ఆ ఫోన్ కాల్స్‌పై కూడా ఏ ఆధారం దొరకలేదు. ఆ ఫోన్ కాల్స్ ఎపిసోడ్ తర్వాత.. రోలాండ్ అలియాస్ ఆర్టెమస్ ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించి మోసం చేశాడని, అది తట్టుకోలేక ఆమె చనిపోతే.. ఆమె బంధువులే అతడ్ని మట్టుపెట్టి ఉంటారనే కథా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. మొత్తానికీ రూబీకి లెటర్లు ఎవరు పంపారు? డాన్ ఎవరు? 1048 రూమ్ నుంచి కంప్లైంట్ చేసిన మహిళ చెప్పినట్లు రోలాండ్ రూమ్‌లో పెద్దపెద్దగా అరిచిన మహిళ ఎవరు? చనిపోయాక అతడి కోసం డబ్బులు, పువ్వులు ఎవరు పంపిచారు? అసలు లూయీ అంటే ఎవరు? రోలాండ్ అసలు పేరు నిజంగానే ఆర్టెమస్సేనా? ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య అతడి కథ ముగిసింది అనుమానాస్పదంగా! -సంహిత నిమ్మన -
Mystery: లాసన్ ఫ్యామిలీ ట్రాజెడీ..
అత్యంత క్రూరమైన జంతువు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కొందరు మనుషుల క్రూరమైన ఆలోచనల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే, అనుకున్నది జరిగేంత వరకూ.. వాళ్లు పన్నే వ్యూహాలు.. వేసే ఎత్తుగడలు.. ఎవరి ఊహలకూ అందవు. ఎలాంటి అనుమానాలకూ తావివ్వవు. దాదాపు 93 ఏళ్ల క్రితం జరిగిన.. ‘లాసన్ ఫ్యామిలీ ట్రాజెడీ’ చదివితే.. తోటి మనిషిపైన, రేపటి రోజుపైన క్షణకాలం పాటు నమ్మకం సడలుతుంది. \అది 1929, డిసెంబర్ 25 మధ్యాహ్నం.. అమెరికాలోని నార్త్ కరోలినాలోని జర్మన్టన్లో ప్రజలు క్రిస్మస్ సంబరాల్లోంచి ఇంకా బయటకు రాలేదు. ఉన్నట్టుండి చార్లెస్ డేవిస్ లాసన్ అనే పొగాకు రైతు ఇంట్లో వరుసగా తుపాకీ కాల్పులు వినిపించాయి. ఊరు ఊరంతా అటు పరుగుతీసింది. ఇంటినిండా ఛిద్రమైన శవాలు. రక్తపు చారలు. పెనుగులాడిన ఆనవాళ్లు. వంట గదిలోని క్రిస్మస్ కేక్ ఇంకా పొగలు కక్కుతూనే ఉంది. ఆ ఘాతుకానికి పాల్పడిన వారికోసం పోలీసులు, ప్రజలు చుట్టుపక్కలంతా గాలిస్తూనే ఉన్నారు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. కొన్ని గంటల తర్వాత పక్కనే ఉన్న అడవిలోంచి మరో తుపాకీ గుండు పేలిన శబ్దం వినిపించింది. వెళ్లి చూస్తే చార్లెస్ శవమై ఉన్నాడు. చార్లెస్ డేవిస్ లాసన్.. నార్త్ కరోలినాలోని లాస¯Œ విల్లేలో 1886, మే 10న జన్మించాడు. 1911లో ఫెన్నీ మాన్రింగ్తో పెళ్లి తర్వాత జర్మన్టన్లో స్థిరపడ్డాడు. 18 ఏళ్ల కాపురంలో ఆ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు పుట్టారు. అయితే మూడో సంతానమైన విలియం 1920లో అనారోగ్యంతో చనిపోయాడు. 1927 నాటికి ఆర్థికంగా బలపడిన చార్లెస్ కుటుంబం.. బ్రూక్ కోవ్ రోడ్లో సొంత పొలాన్ని కొనడానికి సరిపడా డబ్బులు పోగు చేసుకుంది. అంతా సజావుగానే సాగుతుందనుకునే సమయంలో.. 1929 డిసెంబర్ 25 ఉదయాన్నే కుటుంబాన్ని తీసుకుని దగ్గరలోని పట్టణం వెళ్లాడు చార్లెస్(43). పండుగ పేరుతో భార్యబిడ్డలకు కొత్త బట్టలు కొనిచ్చాడు. నిజానికి ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి అవన్నీ అతి ఖరీదైన దుస్తులు. ఆ తర్వాత అంతా కలిసి ఒక గ్రూప్ ఫొటో కూడా దిగారు. అదే ఆ కుటుంబానికి చివరి ఫొటోగా మిగిలింది. ఇంటికి వచ్చాక చార్లెస్ తన పెద్దకొడుకు ఆర్థర్(17)తో కలిసి.. సమీపంలోని అడవికి వేటకు వెళ్లాడు. అక్కడ బుల్లెట్స్ అన్నీ అయిపోవడంతో.. వాటిని కొని తెమ్మని ఆర్థర్ని పట్టణానికి పంపించి.. ఇంట్లో మారణహోమానికి సిద్ధమయ్యాడు చార్లెస్. తన కుమార్తెలు క్యారీ(12), మేబెల్(7)లు మేనత్త ఇంటికి వెళ్లిరాగానే.. తుపాకీ గుళ్లతో విరుచుకుపడ్డాడు. ముందుగా క్యారీ, మేబెల్లను కాల్చి చంపి.. పొగాకు కుప్పల పక్కన దాచిపెట్టాడు. అనంతరం ఇంటి వాకిట్లో ఉన్న భార్యపై(37) కాల్పులు జరిపాడు. ఆ వెంటనే కొడుకులు జేమ్స్(4), రేమండ్(2)లను, వారిని కాపాడటానికి ప్రయత్నించిన పెద్ద కూతురు మేరీ(16)నీ చంపేశాడు. చివరికి మూడు నెలల పసి బిడ్డ మెర్రీ లూని కూడా విడిచిపెట్టలేదు. అతి కిరాతకంగా నేలకేసి కొట్టికొట్టి కడతేర్చాడు. అయితే పెద్దకొడుకు ఆర్థర్ని తనంతట తానే ఎందుకు వదిలిపెట్టాడనేది అంతుబట్టని రహస్యంగా మారింది. ఆర్థర్ ఇంటికి వచ్చేసరికి ఇల్లు శ్మశానంగా మారిపోయింది. అడవిలో ఆత్మహత్య చేసుకున్న చార్లెస్ జేబులో ఏవో రెండు లేఖలు దొరికాయి. అయితే అందులో తన తల్లిదండ్రులకు సంబంధించిన సమాచారం తప్ప.. వీళ్లందరినీ ఎందుకు చంపాడనే వివరం లేదు. ఈ దుర్ఘటనపై చాలా ఊహాగానాలు, కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అవే ఈ కేసుపై ఆసక్తి చూపించినవారిని సమాధానపరచాయి. ఈ ఘటన జరడగానికి సరిగ్గా నెల రోజుల ముందు చార్లెస్ తలకి బలమైన దెబ్బ తగిలిందని, మానసిక స్థితి దెబ్బతినడం వల్లే అలా హత్యలకు పాల్పడి ఉంటాడని కొందరు వాదించారు. అయితే చార్లెస్ మెదడుపై చేసిన వైద్య పరీక్షల్లో అలాంటి తేడాలేం గుర్తించలేదు. మరొక కథనం అతి ఘోరమైనది. చార్లెస్ తన పెద్ద కుమార్తె మేరీతో అనుచిత సంబంధం కలిగి ఉన్నాడని.. అతడి కారణంగా ఆమె గర్భవతి అయ్యిందని, అందుకు సాక్ష్యం.. కుటుంబమంతా ఉన్న ఆ చివరి ఫొటోనే అని, అందులో మేరీని గమినిస్తే తను కడుపుతో ఉందన్న విషయం స్పష్టమవుతుందని, ఆ నిజం ప్రపంచానికి తెలియకూడదనే ఉద్దేశంతోనే కుటుంబం మొత్తాన్ని చార్లెస్ చంపేశాడనేది మరి కొందరి వాదన. మేరీ గర్భవతన్న విషయం.. తమతో మేరీ తల్లి ఫెన్నీ చెప్పిందని, చార్లెస్, మేరీల ప్రవర్తనపై ఆమె ఆందోళనగా ఉండేదని.. బంధువుల్లో, స్నేహితుల్లో కొందరు సాక్షులుగా ముందుకొచ్చారు. వారితో అలా ఎవరైనా చెప్పించారా అనేది కూడా ప్రశ్నే. పైగా, మేరీ గర్భవతని నిర్ధారించే వైద్యపరమైన ఏ అధికారిక నివేదికా రాలేదు. ఇది ఇలా ఉండగా.. చార్లెస్సే హత్యలు చేశాడనడానికి బలమైన కారణాలుగా అదే రోజు భార్యబిడ్డలకు ఖరీదైన దుస్తులు కొనివ్వడం, వారితో కలిసి ఫొటోదిగడం.. ఇవేమీ యాదృచ్ఛికం కాదంటారు చాలా మంది. పథకం ప్రకారమే చార్లెస్ తన కుటుంబాన్ని కడతేర్చాడు అనేది వారి వాదన. మరోవైపు.. చార్లెస్‌కి ఏ పాపం తెలియదని, చార్లెస్‌తో సహా ఆ కుటుంబాన్ని మొత్తం ఎవరో చంపేసి ఇలా చిత్రీకరించి ఉంటారనేది ఇంకో కోణం. మొత్తానికి ప్రాణాలతో మిగిలిన చార్లెస్ పెద్ద కొడుకు ఆర్థర్ లాసన్ ఏకాకిగా పెరిగి, పెద్దయ్యాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అతడికి నలుగురు పిల్లలు పుట్టారు. ఏవో ఆస్తి తగాదాల్లో తన భూమిని కూడా కోల్పోయాడు. దురదృష్టవశాత్తు, అతని 32వ ఏట 1945లో కారు ప్రమాదంలో చనిపోయాడు. నార్త్ కరోలినా, మాడిస¯Œ లోని ‘మాడిసన్ డ్రై గూడ్స్ కంట్రీ స్టోర్’లో చార్లెస్ లాసన్ కుటుంబానికి గుర్తుగా ఒక చిన్న మ్యూజియం ఉంది. ఇప్పటికీ ఈ భయంకరమైన విషాదాన్ని తెలుసుకోవడానికి అక్కడి ప్రజలు ఆ మ్యూజియానికి వస్తుంటారు. ఆ రోజు ఎవరూ తినకుండా మిగిలిపోయిన చార్లెస్ ఇంట్లోని క్రిస్మస్ కేక్‌ని కూడా కొన్నాళ్లపాటు ప్రజల సందర్శనకు ఉంచారు. చివరికి లాసన్ బంధువుల్లో ఒకరు గొయ్యితీసి దాన్ని పూడ్చేశారు. ఈ ఉదంతాన్ని కథనాంశంగా తీసుకుని ఎన్నో పుస్తకాలు, సిరీస్, కథలు ఇలా చాలానే వచ్చాయి. అయితే చార్లెస్ నిజంగానే ఈ కుట్రకు పాల్పడ్డాడా? లేక మరెవరైనా ఈ కుట్రకు పాల్పడి, చార్లెస్‌ని ఇరికించారా? అనేది నేటికీ మిస్టరీనే. ఏది ఏమైనా ఒక ఘోరమైన నిందతోనే ఈ కుటుంబ కథ ముగిసింది. ∙సంహిత నిమ్మన