ఆర్థర్, మేరీ, చార్లెస్, ఫెన్నీ, మెర్రీ లూ (తల్లిఒడిలో) జేమ్స్, మేబెల్, రేమండ్, క్యారీ
అత్యంత క్రూరమైన జంతువు నుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కొందరు మనుషుల క్రూరమైన ఆలోచనల నుంచి తప్పించుకోవడం అసాధ్యం. ఎందుకంటే, అనుకున్నది జరిగేంత వరకూ.. వాళ్లు పన్నే వ్యూహాలు.. వేసే ఎత్తుగడలు.. ఎవరి ఊహలకూ అందవు. ఎలాంటి అనుమానాలకూ తావివ్వవు. దాదాపు 93 ఏళ్ల క్రితం జరిగిన.. ‘లాసన్ ఫ్యామిలీ ట్రాజెడీ’ చదివితే.. తోటి మనిషిపైన, రేపటి రోజుపైన క్షణకాలం పాటు నమ్మకం సడలుతుంది.
\అది 1929, డిసెంబర్ 25 మధ్యాహ్నం.. అమెరికాలోని నార్త్ కరోలినాలోని జర్మన్టన్‌లో ప్రజలు క్రిస్మస్ సంబరాల్లోంచి ఇంకా బయటకు రాలేదు. ఉన్నట్టుండి చార్లెస్ డేవిస్ లాసన్ అనే పొగాకు రైతు ఇంట్లో వరుసగా తుపాకీ కాల్పులు వినిపించాయి. ఊరు ఊరంతా అటు పరుగుతీసింది. ఇంటినిండా ఛిద్రమైన శవాలు. రక్తపు చారలు. పెనుగులాడిన ఆనవాళ్లు. వంట గదిలోని క్రిస్మస్ కేక్ ఇంకా పొగలు కక్కుతూనే ఉంది. ఆ ఘాతుకానికి పాల్పడిన వారికోసం పోలీసులు, ప్రజలు చుట్టుపక్కలంతా గాలిస్తూనే ఉన్నారు. ఎక్కడా ఏ ఆధారం దొరకలేదు. కొన్ని గంటల తర్వాత పక్కనే ఉన్న అడవిలోంచి మరో తుపాకీ గుండు పేలిన శబ్దం వినిపించింది. వెళ్లి చూస్తే చార్లెస్ శవమై ఉన్నాడు.
చార్లెస్ డేవిస్ లాసన్.. నార్త్ కరోలినాలోని లాస¯Œ విల్లేలో 1886, మే 10న జన్మించాడు. 1911లో ఫెన్నీ మాన్రింగ్‌తో పెళ్లి తర్వాత జర్మన్టన్‌లో స్థిరపడ్డాడు. 18 ఏళ్ల కాపురంలో ఆ దంపతులకు నలుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు పుట్టారు. అయితే మూడో సంతానమైన విలియం 1920లో అనారోగ్యంతో చనిపోయాడు. 1927 నాటికి ఆర్థికంగా బలపడిన చార్లెస్ కుటుంబం.. బ్రూక్ కోవ్ రోడ్‌లో సొంత పొలాన్ని కొనడానికి సరిపడా డబ్బులు పోగు చేసుకుంది. అంతా సజావుగానే సాగుతుందనుకునే సమయంలో.. 1929 డిసెంబర్ 25 ఉదయాన్నే కుటుంబాన్ని తీసుకుని దగ్గరలోని పట్టణం వెళ్లాడు చార్లెస్(43). పండుగ పేరుతో భార్యబిడ్డలకు కొత్త బట్టలు కొనిచ్చాడు. నిజానికి ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబానికి అవన్నీ అతి ఖరీదైన దుస్తులు. ఆ తర్వాత అంతా కలిసి ఒక గ్రూప్ ఫొటో కూడా దిగారు. అదే ఆ కుటుంబానికి చివరి ఫొటోగా మిగిలింది.
ఇంటికి వచ్చాక చార్లెస్ తన పెద్దకొడుకు ఆర్థర్(17)తో కలిసి.. సమీపంలోని అడవికి వేటకు వెళ్లాడు. అక్కడ బుల్లెట్స్ అన్నీ అయిపోవడంతో.. వాటిని కొని తెమ్మని ఆర్థర్‌ని పట్టణానికి పంపించి.. ఇంట్లో మారణహోమానికి సిద్ధమయ్యాడు చార్లెస్. తన కుమార్తెలు క్యారీ(12), మేబెల్(7)లు మేనత్త ఇంటికి వెళ్లిరాగానే.. తుపాకీ గుళ్లతో విరుచుకుపడ్డాడు. ముందుగా క్యారీ, మేబెల్‌లను కాల్చి చంపి.. పొగాకు కుప్పల పక్కన దాచిపెట్టాడు. అనంతరం ఇంటి వాకిట్లో ఉన్న భార్యపై(37) కాల్పులు జరిపాడు. ఆ వెంటనే కొడుకులు జేమ్స్(4), రేమండ్(2)లను, వారిని కాపాడటానికి ప్రయత్నించిన పెద్ద కూతురు మేరీ(16)నీ చంపేశాడు. చివరికి మూడు నెలల పసి బిడ్డ మెర్రీ లూని కూడా విడిచిపెట్టలేదు. అతి కిరాతకంగా నేలకేసి కొట్టికొట్టి కడతేర్చాడు. అయితే పెద్దకొడుకు ఆర్థర్‌ని తనంతట తానే ఎందుకు వదిలిపెట్టాడనేది అంతుబట్టని రహస్యంగా మారింది. ఆర్థర్ ఇంటికి వచ్చేసరికి ఇల్లు శ్మశానంగా మారిపోయింది. అడవిలో ఆత్మహత్య చేసుకున్న చార్లెస్ జేబులో ఏవో రెండు లేఖలు దొరికాయి. అయితే అందులో తన తల్లిదండ్రులకు సంబంధించిన సమాచారం తప్ప.. వీళ్లందరినీ ఎందుకు చంపాడనే వివరం లేదు.
ఈ దుర్ఘటనపై చాలా ఊహాగానాలు, కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అవే ఈ కేసుపై ఆసక్తి చూపించినవారిని సమాధానపరచాయి. ఈ ఘటన జరడగానికి సరిగ్గా నెల రోజుల ముందు చార్లెస్ తలకి బలమైన దెబ్బ తగిలిందని, మానసిక స్థితి దెబ్బతినడం వల్లే అలా హత్యలకు పాల్పడి ఉంటాడని కొందరు వాదించారు. అయితే చార్లెస్ మెదడుపై చేసిన వైద్య పరీక్షల్లో అలాంటి తేడాలేం గుర్తించలేదు.
మరొక కథనం అతి ఘోరమైనది. చార్లెస్ తన పెద్ద కుమార్తె మేరీతో అనుచిత సంబంధం కలిగి ఉన్నాడని.. అతడి కారణంగా ఆమె గర్భవతి అయ్యిందని, అందుకు సాక్ష్యం.. కుటుంబమంతా ఉన్న ఆ చివరి ఫొటోనే అని, అందులో మేరీని గమినిస్తే తను కడుపుతో ఉందన్న విషయం స్పష్టమవుతుందని, ఆ నిజం ప్రపంచానికి తెలియకూడదనే ఉద్దేశంతోనే కుటుంబం మొత్తాన్ని చార్లెస్ చంపేశాడనేది మరి కొందరి వాదన. మేరీ గర్భవతన్న విషయం.. తమతో మేరీ తల్లి ఫెన్నీ చెప్పిందని, చార్లెస్, మేరీల ప్రవర్తనపై ఆమె ఆందోళనగా ఉండేదని.. బంధువుల్లో, స్నేహితుల్లో కొందరు సాక్షులుగా ముందుకొచ్చారు. వారితో అలా ఎవరైనా చెప్పించారా అనేది కూడా ప్రశ్నే. పైగా, మేరీ గర్భవతని నిర్ధారించే వైద్యపరమైన ఏ అధికారిక నివేదికా రాలేదు. ఇది ఇలా ఉండగా.. చార్లెస్సే హత్యలు చేశాడనడానికి బలమైన కారణాలుగా అదే రోజు భార్యబిడ్డలకు ఖరీదైన దుస్తులు కొనివ్వడం, వారితో కలిసి ఫొటోదిగడం.. ఇవేమీ యాదృచ్ఛికం కాదంటారు చాలా మంది. పథకం ప్రకారమే చార్లెస్ తన కుటుంబాన్ని కడతేర్చాడు అనేది వారి వాదన.
మరోవైపు.. చార్లెస్‌కి ఏ పాపం తెలియదని, చార్లెస్‌తో సహా ఆ కుటుంబాన్ని మొత్తం ఎవరో చంపేసి ఇలా చిత్రీకరించి ఉంటారనేది ఇంకో కోణం. మొత్తానికి ప్రాణాలతో మిగిలిన చార్లెస్ పెద్ద కొడుకు ఆర్థర్ లాసన్ ఏకాకిగా పెరిగి, పెద్దయ్యాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అతడికి నలుగురు పిల్లలు పుట్టారు. ఏవో ఆస్తి తగాదాల్లో తన భూమిని కూడా కోల్పోయాడు. దురదృష్టవశాత్తు, అతని 32వ ఏట 1945లో కారు ప్రమాదంలో చనిపోయాడు. నార్త్ కరోలినా, మాడిస¯Œ లోని ‘మాడిసన్ డ్రై గూడ్స్ కంట్రీ స్టోర్’లో చార్లెస్ లాసన్ కుటుంబానికి గుర్తుగా ఒక చిన్న మ్యూజియం ఉంది. ఇప్పటికీ ఈ భయంకరమైన విషాదాన్ని తెలుసుకోవడానికి అక్కడి ప్రజలు ఆ మ్యూజియానికి వస్తుంటారు. ఆ రోజు ఎవరూ తినకుండా మిగిలిపోయిన చార్లెస్ ఇంట్లోని క్రిస్మస్ కేక్‌ని కూడా కొన్నాళ్లపాటు ప్రజల సందర్శనకు ఉంచారు. చివరికి లాసన్ బంధువుల్లో ఒకరు గొయ్యితీసి దాన్ని పూడ్చేశారు. ఈ ఉదంతాన్ని కథనాంశంగా తీసుకుని ఎన్నో పుస్తకాలు, సిరీస్, కథలు ఇలా చాలానే వచ్చాయి. అయితే చార్లెస్ నిజంగానే ఈ కుట్రకు పాల్పడ్డాడా? లేక మరెవరైనా ఈ కుట్రకు పాల్పడి, చార్లెస్‌ని ఇరికించారా? అనేది నేటికీ మిస్టరీనే. ఏది ఏమైనా ఒక ఘోరమైన నిందతోనే ఈ కుటుంబ కథ ముగిసింది.
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment