అది 2006 జనవరి 25.. లండన్‌లోని మెట్రోపాలిటన్ హౌసింగ్ ట్రస్ట్ అధికారులు.. అడ్వకేట్స్‌తో కలసి తమ ఆధీనంలో ఉన్న బెడ్‌సిట్ అపార్ట్‌మెంట్స్‌లోని ఓ ఫ్లాట్ ముందు నిలబడి.. కాలింగ్ బెల్ కొడుతూనే ఉన్నారు. బెడ్‌సిట్ ఫ్లాట్స్ అంటే.. వసతి గృహాలు లాంటివి. గృహహింసల నుంచి విముక్తి పొందిన మహిళలకు తక్కువ అద్దెతో వసతి కల్పించే ఆవాసకేంద్రాలు. ఎంతసేపటికీ తలుపు తియ్యకపోవడంతో.. అనుమానం వచ్చిన వారంతా తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు.
తలుపు తెరవగానే.. గుమ్మం ముందే కుప్పలు తెప్పలుగా పడున్న ఉత్తరాలు చూసి షాక్ అయ్యారు. చీకటిగా ఉన్న ఎంట్రెన్స్ గేట్ నుంచి కిచెన్‌లోకి వెళ్లారు. సింక్ నిండా చాలారోజులగా కడగని సామాన్లే. గది అంతా కుళ్లిన వాసన. అక్కడ నుంచి ఇంకాస్త లోపలికి వెళ్లేసరికి హాల్లో టీవీ ఆన్‌లోనే ఉంది. టీవీ ముందు సోఫాలో ఓ మహిళ కూర్చుని ఉన్నట్లు కనిపించింది. దగ్గరకు వెళ్లేసరికి గుప్పుమన్న దుర్గంధం నిమిషం కూడా అక్కడ నిలబడనివ్వలేదు. అస్థిపంజరానికి బట్టలు తొడిగినట్లుగా ఉన్న ఆ శవం.. ఆ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న మహిళదే అని గుర్తించడానికి వారికి ఎంతో సమయం పట్టలేదు. ఆమె కాళ్ల దగ్గర ఓ షాపింగ్ బ్యాగ్ పడుంది.
కాస్త దూరంలో కొన్ని క్రిస్మస్ గిఫ్ట్స్ ప్యాక్ చేసున్నాయి. ఫ్రిజ్‌లోని ప్రొడక్ట్స్ 2003 ఎక్స్‌పెయిరీ డేట్‌తో కనిపించాయి. అంటే ఆమె చనిపోయి ఆరోజుకి మూడేళ్లు కావస్తోందా? టీవీ అప్పటి నుంచి ఆన్‌లోనే ఉందా? ఆ షాక్‌తో వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు శవాన్ని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి.. విచారణ మొదలుపెట్టారు. నిజానికి హౌసింగ్ ట్రస్ట్ అధికారులు.. అడ్వొకేట్స్‌తో ఆ అపార్ట్‌మెంట్‌కి రావడానికి కారణం మూడేళ్లుగా ఆ మహిళ అద్దె కట్టకపోవడమే.
కేసు విచారణలో భాగంగా ఆ మహిళ ఊరు, పేరు, వయసు అన్నీ ట్రస్ట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు పోలీసులు. మరిన్ని వివరాలను ఆమె అపార్ట్‌మెంట్‌లో సేకరించారు. మరునాడు ఉదయం పత్రికల్లో ‘మూడేళ్లకు బయటపడిన మహిళ శవం’ అనే వార్తతో పాటు.. చనిపోయిన ఆ మహిళ పేరు జాయిస్ కరోల్ విన్సెంట్ అని, ఆమె వయసు 38 ఏళ్లని, మీలో ఎవరికైనా ఆమె గురించి తెలుసా? తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండంటూ ప్రకటనలూ వచ్చాయి.
శరీరం పూర్తిగా కుళ్లిపోయి, అస్థిపంజరం మాత్రమే మిగలడంతో.. ఆమె మరణానికి గల కారణాన్ని గుర్తించడానికి చాలా సమయం పట్టింది. తలుపు వేసి ఉన్న ఇంట్లో.. టీవీ చూస్తున్న మహిళ.. కూర్చున్న చోటే ఎలా మరణించింది? అనేది ఎవ్వరికీ అంతుపట్టలేదు. పైగా ఆ ఫ్లాట్స్‌లో ఎంతో మంది ఉంటున్నారు.
‘మూడేళ్లుగా ఏ ఒక్కరికీ కుళ్లిన వాసన రాలేదంటే ఆశ్చర్యమే?’ అదే ప్రశ్న ఆ అపార్ట్‌మెంట్స్ వాళ్లను అడిగితే.. కిందే పేరుకున్న డంప్ యార్డ్‌ని చూపించారు. ఆ కుళ్లిన వాసన.. కిందున్న చెత్త వల్లే వస్తుందనుకున్నామని చెప్పారు. ఇక ఈ వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారమయ్యేసరికి.. జాయిస్ విన్సెంట్ మాజీ కొలీగ్స్, బాయ్‌ఫ్రెండ్స్, స్నేహితులు ఇలా ఒక్కొక్కరూ బయటికి వచ్చారు. వాళ్లకు తెలిసిన సమాచారాన్ని అందించారు.
జాయిస్ 1965 అక్టోబరు 19న లండన్‌లోని హ్యామర్‌స్మిత్ ప్రాంతంలో జన్మించిందని, తండ్రి లారెన్స్.. ఆఫ్రికన్ సంతతికి, తల్లి లిరిస్.. భారత సంతతికి చెందినవారని, తన పదకొండేళ్ల వయసులో తల్లి మరణించిందని, తర్వాత తన నలుగురు తోబుట్టువులే ఆమె ఆలనాపాలనా చూశారని, పదహారేళ్ల వయసులో పాఠశాలను విడిచిపెట్టి.. మ్యూజిక్ వైపు దృష్టిసారిస్తూనే లండన్‌లోని ౖఇఔలో సెక్రటరీగా పని చేసిందని, ఎర్నెస్ట్‌లోని ట్రెజరీ డిపార్ట్‌మెంట్‌లో నాలుగు సంవత్సరాలకు పైగా పని చేసి.. 2001 మార్చిలో ఉన్నట్టుండి రాజీనామా చేసిందని.. ఆమె జీవితంలో నెల్సన్ మండేలా వంటి గొప్పవారిని కలుసుకుందని.. ఇలా కొన్ని వివరాలు సేకరించగలిగారు పోలీసులు.
అదే 2001లో తనకు ఎంతో ఇష్టమైన తండ్రి మరణ వార్త ఆమెను చాలా కుంగదీసిందని కొందరు సన్నిహితులు చెప్పారు. నిజానికి జాయిస్ తండ్రి లారెన్స్ 2004లో చనిపోయాడు. అతడి కంటే ముందే జాయిస్ చనిపోయిందన్న విషయం లారెన్స్‌కు తెలియదు. జాయిస్.. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత బెడ్‌సీట్ ఫ్లాట్స్‌లో ఆశ్రమం పొందుతూ డబ్బుల కోసం హోటల్లో క్లీనర్‌గా మారింది. ఈక్రమంలోనే ఆమె తన కుటుంబానికి, స్నేహితులకు దూరమైంది. తన వాళ్లు ఇంతమంది ఉన్నా.. తను చనిపోయిన విషయం ఏ ఒక్కరూ గుర్తించకపోవడమే ఈ కథ విన్న ప్రతిఒక్కరినీ కదిలించింది.
2003 నవంబర్‌లో ఆమె కడుపులో పుండు కారణంగా రెండు రోజుల పాటు నార్త్ మిడిల్‌సెక్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందిందని, ఉబ్బసంతో బాధపడిందని, పెప్టిక్ అల్సర్ అటాక్ అవ్వడం వల్లే చనిపోయిందని అధికారులు భావించారు. ఎలాంటి విషప్రయోగం జరగలేదని రిపోర్ట్ రావడంతో.. సహజ మరణమేనని పోలీసులు తేల్చారు. టెలివిజన్ అన్నేళ్లుగా పనిచేయడానికి కారణం.. ఆటోమేటిక్ డెబిట్ సిస్టమ్ యాక్టివ్‌లో ఉండటమేనని నిర్ధారించారు.
అన్నేళ్లుగా టీవీ సౌండ్ వినిపిస్తున్నా ఎవ్వరూ పట్టించుకోకపోవడం బాధాకరమే.అయితే ఈ వార్తను మీడియాలో ఫాలో అయిన కరోల్ మోర్లీ అనే ప్రముఖ దర్శకురాలు.. దీనిపై డాక్యుమెంటరీ తియ్యాలనే ఉద్దేశంతో జాయిస్ స్నేహితులను, బంధువుల్ని కలసినప్పుడు జాయిస్ చనిపోయిందన్న విషయం తెలిసి వాళ్లు షాకయ్యారట. 2011లో మోర్లీ డైరెక్షన్‌లో వచ్చిన ‘డ్రీమ్ ఆఫ్ ఎ లైఫ్’ అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ జాయిస్ జీవితాన్ని చూపిస్తూనే.. ఒంటరి జీవితంపై ఎందరినో ఆలోచింపచేసింది. జాయిస్ విన్సెంట్ కథ ఎంత వింతగా ఉంటుందో అంతే విషాదకరమైనది.
‘మనిషికి జీవిత భాగస్వామే అసవరం లేదు.. కనీసం తన అనుకునే మనిషి.. తనకోసం ఆలోచించే మనిషి ఉండేలా చూసుకోవడం చాలా అవసరం’ అని నమ్మేవాళ్లు ఎక్కువయ్యారు. ఏదిఏమైనా కూర్చున్న మనిషి కూర్చున్నట్లే ప్రాణాలు విడవడంతో.. ఆమె మరణానికి సరైన కారణాన్ని తేల్చకపోవడంతో ఈ కథ మిస్టరీగానే మిగిలింది.
∙సంహిత నిమ్మన
Comments
Please login to add a commentAdd a comment