
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తొలి చైర్మన్, వ్యాపారవేత్త లలిత్ మోదీ(Lalit Modi) మరోసారి ప్రేమలో పడ్డాడు. రీమా బౌరీ(Rima Bouri)తో పాతికేళ్లుగా తనకున్న స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిందని తెలిపాడు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఈ విషయాన్ని లలిత్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
దేశం విడిచిపారిపోయి
కాగా వ్యాపార కుటుంబానికి చెందిన లలిత్ మోదీ ఢిల్లీలో జన్మించాడు. ఐపీఎల్(IPL) సృష్టికర్తగా పేరు ప్రఖ్యాతులు పొందిన అతడు.. అదే స్థాయిలో అప్రతిష్టను మూటగట్టుకున్నాడు. ఆర్థిక అవకతవలకు పాల్పడి దేశం విడిచిపారిపోయే పరిస్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం లలిత్ మోదీ లండన్‌లో తలదాచుకుంటున్నట్లు జాతీయ మీడియా కథనాల ద్వారా వెల్లడైంది.
భార్య కంటే తొమ్మిదేళ్లు చిన్న
ఇదిలా ఉంటే.. లలిత్ మోదీ వృత్తిగత జీవితం మాదిరే వ్యక్తిగత జీవితం కూడా సంచలనాల మయమే. వయసులో తనకంటే తొమ్మిదేళ్లు పెద్దదైన, డివోర్సీ మినాల్‌ను లలిత్ మోదీ ప్రేమించి పెళ్లాడాడు. ఆమె కోసం కుటుంబాన్ని ఎదిరించి మరీ ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చిన లలిత్.. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగాడు.
ఇక లలిత్- మినాల్ దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె అలియా, కుమారుడు రుచిర్ మోదీ ఉన్నారు. వీరిద్దరితో పాటు మినాల్‌కు మొదటి వివాహం ద్వారా కలిగిన కుమార్తె కరీమా సంగ్రాణిని కూడా లలిత్ మోదీ చేరదీసినట్లు కథనాలు ఉన్నాయి. లలిత్ ప్రాణంగా ప్రేమించిన మినాల్ క్యాన్సర్‌తో పోరాడి దురదృష్టవశాత్తూ 2018లో కన్నుమూశారు.
సుస్మితా సేన్‌తో ప్రేమలో ఉన్నట్లు
అప్పటి నుంచి ఒంటరి జీవితం గడుపుతున్న లలిత్ మోదీ గతేడాది.. విశ్వ సుందర్ సుస్మితా సేన్‌తో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించి సంచలనానికి తెరదీశాడు. అనంతరం.. ఆమెను బెటర్ హాఫ్ అని సంబోధిస్తూ పెళ్లి వార్తలకు ఊతమిచ్చాడు. అయితే, ఆ తర్వాత ఇద్దరూ వీటిని ఖండించడంతో ఊహాగానాలకు చెక్ పడింది.
అయితే, తాజాగా.. 61 ఏళ్ల లలిత్ మోదీ తాను మరోసారి ప్రేమలో పడ్డట్లు తెలపడం విశేషం. ‘‘ఒక్కసారి అదృష్టం అంటారు... మరి నేను మాత్రం రెండుసార్లు లక్కీ అయ్యాను. 25 ఏళ్ల స్నేహం ప్రేమగా రూపాంతరం చెందిన వేళ.. అవును ఇది రెండోసారి జరిగింది. మీ జీవితాల్లోనూ ఇలా జరిగే ఉంటుంది. హ్యాపీ వాలైంటైన్స్ డే’’ అంటూ రీమా బౌరీతో ఉన్న ఫొటోలతో కూడిన వీడియోను లలిత్ మోదీ షేర్ చేశాడు.
జీవితాంతం నువ్వే నా ప్రేమ
ఇందుకు స్పందిస్తూ.. ‘‘లవ్ యూ మోర్’’ అని రీమా పేర్కొనగా.. లలిత్.. ‘‘జీవితాంతం నువ్వే నా ప్రేమ’’ అంటూ రొమాంటిక్‌గా బదులివ్వడం విశేషం. కాగా రీమా బౌరీ వృత్తిరీత్యా మార్కెటింగ్ కన్సల్టెంట్‌గా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. 2022లో లలిత్ మోదీ తన కుమార్తె ఆలియా వివాహం జరిపించాడు. బ్రెట్ కార్ల్‌సన్ అనే విదేశీయుడిని ఆలియా పెళ్లి చేసుకున్నారు.
ఇటలీలోని వెనిస్ నగరంలో వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఇదిలా ఉంటే.. 2008లో మొదలైన ఐపీఎల్ పదిహేనేళ్లుగా విజయవంతమైన లీగ్‌గా కొనసాగుతోంది. ఈ ఏడాది మార్చి 21 నుంచి ఈ మెగా క్రికెట్ ఈవెంట్ మొదలుకానుంది.
చదవండి: అప్పుడే ఆఫర్ వచ్చింది.. కానీ!.. వదిలేసిన ఫ్రాంఛైజీ జట్టుకే కెప్టెన్‌గా..
Comments
Please login to add a commentAdd a comment