
రజత్ పాటిదార్ (PC: RCB X)
గత ఏడాదే కెప్టెన్సీపై ఆసక్తి ఉందా అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) యాజమాన్యం తనను అడిగినట్లు కొత్త కెప్టెన్ రజత్ పాటీదార్ తెలిపాడు. అయితే, ఐపీఎల్‌కు ముందు రాష్ట్ర జట్టుకు కెప్టెన్సీ చేయాలనుకుంటున్నట్లు వారికి చెప్పానన్నాడు. ఇప్పుడిలా ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశాడు.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఫ్రాంఛైజీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 2025 సీజన్‌లో కొత్త కెప్టెన్ నాయకత్వంలో బరిలోకి దిగనుంది. విరాట్ కోహ్లి మరోసారి సారథ్య బాధ్యతలు చేపట్టవచ్చనే అభిమానుల ఆశలకు భిన్నంగా టీమ్ మేనేజ్‌మెంట్ అనూహ్య నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
దూకుడైన బ్యాటింగ్‌తో జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగిన రజత్ పాటీదార్‌ను కెప్టెన్‌గా నియమించింది. గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో సారథ్య వివరాలను ఆర్‌సీబీ ప్రకటించింది.
గత మూడు సీజన్ల పాటు కెప్టెన్‌గా వ్యవహరించిన డు ప్లెసిస్‌ను వేలానికి ముందు టీమ్ విడుదల చేయడంతో కొత్త నాయకుడి ఎంపిక అనివార్యమైంది. వేలానికి ముందు జట్టు రిటైన్ చేసుకున్న ముగ్గురు ప్లేయర్లలో పాటీదార్ ఒకడు. అతడిని రూ.11 కోట్లకు ఆర్‌సీబీ తమతోనే కొనసాగించింది.
కాగా 2021–2024 మధ్య ఆర్‌సీబీ తరఫున 27 మ్యాచ్‌లు ఆడిన పాటీదార్ 158.84 స్ట్రైక్‌రేట్‌తో 799 పరుగులు సాధించాడు. ఇందులో 1 సెంచరీ, 7 అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పుడు తొలిసారి కెప్టెన్‌గా కూడా ఎంపిక చేసిన యాజమాన్యం పెద్ద బాధ్యతను అతనిపై పెట్టింది. ఐపీఎల్‌లో చరిత్రలో బెంగళూరుకు రజత్ ఎనిమిదో కెప్టెన్. గతంలో ఈ టీమ్‌కు ద్రవిడ్, పీటర్సన్, కుంబ్లే, వెటోరి, కోహ్లి, వాట్సన్, డుప్లెసిస్ సారథులుగా వ్యవహరించారు.

రజత్ పాటిదార్ (PC: RCB X)
మెరుపు బ్యాటింగ్‌తో గుర్తింపు...
ఇండోర్‌కు చెందిన 32 ఏళ్ల పాటీదార్ దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2021 సీజన్‌లో తొలిసారి అతను ఐపీఎల్ ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లకే పరిమితమైన అతడిని 2022 సీజన్‌కు ముందు విడుదల చేసింది. అయితే లవ్‌నీత్ సిసోడియా అనూహ్యంగా గాయపడటంతో రీప్లేస్‌మెంట్ ప్లేయర్‌గా మళ్లీ జట్టులోకి వచ్చి చెలరేగిపోయాడు.
మొత్తం 333 పరుగులు చేయగా... ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నోపై 54 బంతుల్లో 112 పరుగులు బాదిన ఇన్నింగ్స్ హైలైట్‌గా నిలిచింది. అయితే గాయం కారణంగా 2023 సీజన్‌కు పూర్తిగా దూరమైన అతను 2024లో తిరిగొచ్చి మెరుపు బ్యాటింగ్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 2024 సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 395 పరుగులు సాధించిన అతను 33 సిక్సర్లు బాదాడు.
అదే ఏడాది ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే టోర్నీల్లో తొలిసారి మధ్యప్రదేశ్‌కు కెప్టెన్‌గా పని చేసిన అనుభవం పాటీదార్‌కు ఉంది. ముస్తాక్ అలీ టోర్నీలో 186.08 స్ట్రయిక్‌రేట్‌తో 428 పరుగులు చేసిన అతను జట్టును ఫైనల్ వరకు చేర్చాడు.
కెప్టెన్‌గా ఎందుకు...
ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ఎంపిక చేసేందుకు మేనేజ్‌మెంట్ ముందుగా చూసేది అన్ని మ్యాచ్‌లలో కచ్చితంగా తుది జట్టులో ఉండే ఆటగాడి గురించే. అది కూడా భారత ఆటగాడైతే మరీ మంచిది. గతంలో విదేశీయులను కెప్టెన్‌గా చేసి అతను విఫలమవుతున్నా కొనసాగించి దాదాపు పది మందితోనే ఆడినట్లుగా టీమ్‌లు ఇబ్బంది పడిన ఘటనలు చాలా ఉన్నాయి. అలా చూస్తే విరాట్ కోహ్లి తర్వాత జట్టులో ప్రధాన బ్యాటర్ అయిన పాటీదార్ మినహా మరో ప్రత్యామ్నాయం ఆర్‌సీబీ వద్ద లేకపోయింది.
కృనాల్ పాండ్యా, భువనేశ్వర్, పడిక్కల్‌లతో పోలిస్తే ఇది మెరుగైన నిర్ణయమే. భారత్ తరఫున 3 టెస్టులు, ఒకే ఒక వన్డే ఆడిన రజత్‌కు వ్యక్తిగతంగా స్టార్ ఆటగాడిలా గుర్తింపు లేకపోయినా అతనిపై యాజమాన్యం నమ్మకం ఉంచింది. ‘రజత్ ఎంపికకు ఎన్నో కారణాలు ఉన్నాయి. అతని నెమ్మదైన స్వభావం, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండే తీరు, కెపె్టన్సీకి పనికొచ్చే లక్షణం. సరైన నిర్ణయాలు తీసుకోవడంలో అతని ప్రతిభ, పట్టుదల ఎలాంటివో మధ్యప్రదేశ్ కెప్టెన్‌గా దగ్గరి నుంచి చూశాం.
సహచరులతో కలిసిపోవడం, వారికి అండగా నిలిచే తత్వం కూడా మంచి సారథికి ఉండాల్సిన మరో లక్షణం’ అని ఆర్‌సీబీ హెడ్ కోచ్ ఆండీ ఫ్లవర్ అన్నాడు. మరోవైపు కోహ్లికి మళ్లీ కెప్టెన్సీ ఇచ్చే విషయంపైచర్చించామన్న టీమ్ డైరెక్టర్ మో బొబాట్... ఎందుకు వద్దనుకున్నారనే ప్రశ్నపై తగిన సమాధానం ఇవ్వలేదు. కోహ్లి స్థాయి ఆటగాడికి ‘కెప్టెన్’ అనే హోదా అవసరం
లేదని, తన సహజ నాయకత్వ లక్షణాలు జట్టుకు ఉపయోగపడతాయని అతను వ్యాఖ్యానించాడు.

రజత్ పాటిదార్ (PC: RCB X)
హడావిడి చేసే రకం కాదు
ఇక రజత్ పాటిదార్ మాట్లాడుతూ.. ‘‘నేను హడావిడి చేసే తరహా వ్యక్తిని కాదు కానీ మ్యాచ్‌లలో పరిస్థితులపై అవగాహన ఉంది. ఆటగాళ్లకు అండగా నిలిచి ఫలితాలు రాబడతా. టీమ్‌లో ఉన్న ఇతర ఆటగాళ్ల అనుభవమూ నాకు పనికొస్తుంది. ఇక కోహ్లినుంచి ఎంతో నేర్చుకునే అవకాశం ఉంది. అతని ఆలోచనలు, వ్యూహాలు కచ్చితంగా ఉపయోగించుకుంటా’’ అని తెలిపాడు.
కోహ్లి విషెస్
రజత్‌కు నా అభినందనలు. నీ ఆటతో ఎంతో మంది ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్న నువ్వు ఈ హోదాకు అర్హుడవు. నువ్వు జట్టును ముందుకు తీసుకెళ్లగలవనే నమ్మకం ఉంది- విరాట్ కోహ్లి.
Comments
Please login to add a commentAdd a comment