
రెండు చేతులు కలిస్తే చప్పుడవుతుంది. రెండు మనసులు కలిస్తే ప్రేమవుతుంది. ఇద్దరు మనుషులు కలిస్తే సంపూర్ణ జీవితమవుతుంది. రెండు సగాలు ఒకటిగా అమరితే పరిపూర్ణత వస్తుంది. ఇలాంటి ఒక ఊహకు రూపమిస్తే లవ్ బ్రేస్‌లెట్ అయింది. లవ్ బ్రేస్‌లెట్ రూపుదిద్దుకుని యాభై ఏళ్లు దాటింది. న్యూయార్క్‌లో డిజైన్ అయిన ఈ బ్రేస్‌లెట్‌కు లండన్‌లో ఎక్కడలేని ఆదరణ వచ్చింది. ఇప్పటికీ నిత్యనూతనంగా మార్కెట్‌ను ఏలుతోంది. ప్రేమలాగానే అజరామరంగా ప్రేమికులను దగ్గర చేస్తూనే ఉంది.
సింబల్ ఆఫ్ లవ్
‘ప్రేమ లేకపోతే జీవితమే లేదు. ప్రేమలేని జీవితం పెద్ద గుండుసున్న’ అన్నాడు లవ్ బ్రేస్‌లెట్ రూపకర్త ఆల్డో సిపుల్లో. అతడు 1969లో ఈ డిజైన్ చేశాడు. ఓవల్ షేప్ బ్రేస్‌లెట్ ఇది. ఇంగ్లిష్ అక్షరం ’సి’ ఆకారంలో ఉన్న రెండు అర్ధభాగాలను కలుపుతూ లాక్ చేయాలి. ఆ లాక్‌ను టైల్ చేయటానికి, ఓపెన్ చేయడానికి చిన్న స్క్రూడ్రైవర్‌ను పోలిన తాళం చెవి కూడా ఉంటుంది. ‘ఒక ‘సి’ నువ్వు, ఒక ‘సి’ నేను... ఇద్దరం కలిస్తే అదే అందమైన బంధం’ అని అబ్బాయి అమ్మాయి ఒకరికొకరు బాస చేసుకుని బ్రేస్‌లెట్‌ని మణికట్టుకు పెట్టి లాక్ చేస్తారు. ‘మన ప్రేమ నిబద్ధతతో కూడినది, ఎప్పటికీ విడిపోకూడద’ని మాటలతో మనసును లాక్ చేసుకుంటారు.
ప్రేమ బంగారం
లవ్ బ్రేస్‌లెట్‌ని కార్టియర్ అనే ఆభరణాల తయారీ సంస్థ మార్కెట్‌లోకి తెచ్చింది. దాంతో దీనికి కార్టియర్ లవ్ బ్రేస్‌లెట్ అనే పేరు వాడుకలోకి వచ్చింది. మొదట్లో గోల్డ్ ప్లేటెడ్ బ్రేస్‌లెట్‌లతో మొదలు పెట్టారు. ఆ తర్వాత సాలిడ్ గోల్డ్ 18 క్యారట్‌లో, ΄్లాటినమ్‌లో కూడా తయారవుతోంది. బంగారంలో ఎల్లో గోల్డ్, రోజ్ గోల్డ్, వైట్ గోల్డ్ షేడ్‌లలో వస్తోంది. బ్రేస్‌లెట్‌లో లాక్ గుర్తులున్న చోట వజ్రాన్ని పోలిన రోడియం ఫినిషింగ్, అసలైన వజ్రాలు, ఇతర జాతిరాళ్లను పొదగడం వంటి మార్పులు కూడా సంతరించుకుంది. హాలీవుడ్ నటీనటులు ఎలిజబెత్ టేలర్, రిచర్డ్ బర్టన్, అలీ మ్యాక్‌గ్రావ్, స్టీవ్ మెక్‌క్వీన్‌లు ధరించడంతో ఇది పాపులర్ అయింది.
ఈ లవ్ బ్రేస్‌లెట్‌లు ఎక్కడికక్కడ స్థానికంగా తయారవుతున్నాయి. ఈ విషయంలో కార్టియర్ కొన్ని కంపెనీల మీద కేసు కూడా పెట్టింది. కొద్దిపాటి మార్పులతో కీ లేకుండా నేరుగా ధరించే మోడల్స్ వచ్చాయి. మనదేశంలో కూడా బంగారు ఆభరణాల తయారీదారులు ఈ మోడల్‌ను చేస్తున్నారు. రోజ్‌గోల్డ్ షేడ్‌లో ఇతర లోహాలతో ఫ్యాన్సీ మార్కెట్‌లోనూ విరివిగా దొరుకుతున్నాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ లవ్ బ్రేస్‌లెట్ కోసం దుకాణాల్లో వాకబు చేసేవాళ్లు, ఆన్‌లైన్ లో ఈ కామర్స్ వెబ్‌సైట్‌లలో సెర్చ్ చేసే వాళ్ల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా ఏడాదికేడాదికీ మూడింతలు నాలుగింతలుగా పెరుగుతోంది. ఈ లవ్ బ్రేస్‌లెట్ కూడా ప్రేమలాగానే ప్రకాశిస్తోంది.
హాస్పిటల్‌లో బ్రేస్‌లెట్ ‘కీ’
లవ్ బ్రేస్‌లెట్ ఎంతగా ప్రజాదరణ పొందిందో తెలిపే ఉదంతం ఒకటుంది. 1970–80లలో అమెరికాలోని హాస్పిటళ్లలో లవ్ బ్రేస్‌లెట్ తాళం చెవిని అందుబాటులో ఉంచేవారట. ఇంట్లో బ్రేస్‌లెట్ ధరించిన తర్వాత ‘కీ’ని ఇంట్లో పెట్టి బయటకు వస్తారు. ప్రమాదవశాత్తూ లేదా మరేదైనా కారణాలతో హాస్పిటల్‌కి వచ్చిన పేషెంట్‌కి అవసరమైన పరీక్షలు చేయాల్సినప్పుడు ఒంటిమీదున్న లోహపు వస్తువులన్నింటినీ తొలగించాల్సి ఉంటుంది. లవ్ బ్రేస్‌లెట్ కీ కోసం ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండదు. కాబట్టి హాస్పిటళ్లు లవ్ బ్రేస్‌లెట్ కీని సిద్ధంగా ఉంచేవి.
Comments
Please login to add a commentAdd a comment