న్యూఢిల్లీ: పంజాబీ చికెన్ టిక్కా... రాజస్థానీ థాలీ... మహారాష్ట్ర వడాపావ్... తమిళనాడు సాంబార్ ఇడ్లీ... హైదరాబాద్ బిర్యానీ... చెబుతుంటేనే నోరూరుతోంది కదా..!! ఈ భారతీయుల వంటకాల ఘుమఝుమలు విదేశీయులనూ ఆవురావురుమనేలా చేస్తున్నాయి. అదిరిపోయే భారతీయ వంటలతో మనోళ్లు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. మన నలభీములకు విదేశీయులు ఎర్ర తివాచీ పరుస్తుండటంతో ఇక్కడి రెస్టారెంట్ చైన్లు అత్యంత వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. లైట్ బైట్ ఫుడ్స్, జిగ్స్ అండ్ జోరవార్ కల్‌రా రెస్టారెంట్ చైన్లతో పాటు పారిశ్రామికవేత్త, ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్‌కు చెందిన రెస్టారెంట్లు విదేశాల్లో పాగా వేస్తున్నాయి.
అనుమతులు, లైసెన్సులు సులువు...
కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్, డామినోస్ లాంటి విదేశీ రెస్టారెంట్ చైన్‌లకు దీటుగా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంస్థలు చొచ్చుకుపోతున్నాయి. ఇతర దేశాల్లో రెస్టారెంట్లను ప్రారంభించడం సులువుగా ఉండటం, బయట వంటకాలకు విదేశీయులు ఖర్చులు పెంచడం లాంటి సానుకూల అంశాలు హోటల్ వ్యాపార అభివృద్ధికి దోహదపడుతున్నాయని నిర్వహకులు చెబుతున్నారు.
’విదేశీ రెస్టారెంట్ వ్యాపారం విధానాలలో స్థిరత్వం ఉంటుంది. అనేక దేశాలలో హోటళ్లను ప్రారంభించడానికి బహుళ అనుమతులు, లైసెన్సుల అవసరం లేకపోవడం అనేది ప్రయోజనకరంగా ఉంది. లండన్, న్యూయార్క్, దుబాయ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో బయట తిండికి వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 150 మంది కూర్చుని భోజనం చేయడానికి సరిపడేంతటి రెస్టారెంట్‌ను ఈఏడాది సెప్టెంబరులోనే వాషింగ్టన్ డీసీలో ప్రారంభిస్తున్నాం’ అని లైట్ బైట్ ఫుడ్స్ డైరెక్టర్ రోహిత్ అగర్వాల్ అన్నారు. పంజాబ్ గ్రిల్ పేరుతో ఈ రెస్టారెంట్ ప్రారంభం కానుందని, త్వరలోనే దుబాయ్, కువైట్, ఇతర గల్ఫ్ దేశాలలో సైతం సత్తా చాటనున్నామని వెల్లడించారు.
మానవ వనరుల పరంగా ఇబ్బందే...
వ్యాపారం బాగానే ఉన్నా... మానవవనరుల కొరత, వీసా సమస్యలు వెంటాడుతున్నట్లు రోహిత్ తెలిపారు. భారత్‌లో మార్జిన్లు చూడలేకపోతున్న అనేక రెస్టారెంట్ చైన్లు విదేశాల్లో లాభాలను గడిస్తున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్‌ఆర్‌ఏఐ) అంటోంది. ఇతర దేశాలలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ చాలా ఎక్కువగా ఉందని ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు రాహుల్ సింగ్ వెల్లడించారు. గతేడాది అమెరికన్లు ఆహారంపై చేస్తున్న ఖర్చులలో ఏకంగా 48% రెస్టారెంట్లలోనే జరుగుతున్నట్లు తెలిపారు.
విదేశాల్లో హోటల్ నడపడం చాలా సులభం...
దివ్యాని ఇంటర్‌నేషనల్ అమెరికా, లండన్, సింగపూర్, దుబాయ్ దేశాలలో విస్తరిస్తోంది. నోరు ఊరించే వంటకాలతో అదరగొట్టే సంజీవ్ కపూర్ సైతం విదేశీ రెస్టారెంట్ల విస్తరణలో వేగంగా దూసుకుపోతున్నారు. సంజీవ్ కపూర్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మొత్తం 70 స్టోర్లను నడుపుతుండగా, వీటిలో సగం వరకు విదేశాల్లోనే ఉన్నాయి. విదేశాల్లో హోటల్ వ్యాపారం చాలా సులువుగా నడపవచ్చని వెల్లడించిన ఆయన త్వరలోనే లండన్, న్యూయార్క్, టొరంటో, సౌదీలలో రెస్టారెంట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment