Indian cuisine
-
టేస్ట్ అట్లాస్ రుచుల పండుగ.. టాప్ 100లో 4మనవే..!
‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.. ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా.. వేడి వేడన్నంలో వేడి వేడన్నంలో నెయ్యికారు కూరలు వెయ్యరా అడ్డ విస్తరిలో ఆరురుచులు ఉండగా బతుకు పండుగ చెయ్యరా’ అంటూ పాడే పాటలాగే, ప్రపంచంలోని కొన్ని ప్రశస్తమైన వంటకాలను గుర్తు చేసుకుంటేనే నోరూరుతుంది. ప్రపంచంలోని వందఅత్యుత్తమ వంటకాలు..వంద అత్యుత్తమ రుచుల నగరాలు.. వంద అత్యుత్తమ వంటల పుస్తకాలు..ఇవన్నీ ఒకేచోట పొందుపరిస్తే భోజనప్రియులకు అంతకు మించిన పండుగ ఏముంటుంది! మిమ్మల్ని మరోసారి వంటింటి వైపు చంటోడిలా చూసే వంటకాల్లో వంద ఉత్తమ వంటకాలను ప్రకటించింది ప్రముఖ ట్రావెల్ గైడ్ సైట్ ‘టేస్ట్ అట్లాస్’. వాటిలో మన భారతీయ వంటకాలు కూడా ఉండటం విశేషం.భోజనప్రియుల్లో చాలామంది ఫలానా ఆహార పదార్థం ఎక్కడ రుచిగా ఉంటుందని తెలిస్తే అక్కడకు ఎంత దూరమైన సరే, కేవలం ఆ వంటకం రుచి చూడటానికే వెళ్తుంటారు. మరికొందరు కొత్త ప్రాంతాలు, ఇతర దేశాలకు వెళ్లినప్పుడు ముందే నిర్ణయించుకుంటారు. అక్కడ ఏం వంటకం లభిస్తుంది, ఏది బాగుంటుంది అని ఇలా వంటకాలకు సంబంధించి చాలా విషయాలు తెలుసుకుంటుంటారు. అలాంటి వారందరికీ ఉపయోగపడేదే ఈ ‘టేస్ట్ అట్లాస్’. ఇదొక రుచుల ఎన్ సైక్లోపీడియా. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ చుట్టివచ్చి, అక్కడ లభించే వంటకాలకు రేటింగ్ ఇస్తుంటారు.ఆ రేటింగ్ ఇచ్చేవారు మామూలు వారు కాదు. ఎక్స్పీరియన్స్డ్ ట్రావెల్ గైడ్స్, గ్యాస్ట్రోనమీ ఎక్స్పర్ట్స్, ఫేమస్ ఫుడ్ రివ్యూయర్స్ సాయంతో ఈ మధ్యనే సుమారు పదివేల కంటే ఎక్కువ ఆహార పదార్థాలను పరిశీలించి, ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల పేర్లను ప్రకటించింది ‘టేస్ట్ అట్లాస్’. ఇవన్నీ అత్యంత జనాదరణ పొందినవి, అలాగే ప్రపంచంలోని ప్రతి నగరం, ప్రాంతం, గ్రామాల వారీగా మరచిపోయిన రుచులను, సుగంధద్రవ్యాలను అన్వేషించి ఇతర జాబితాలను కూడా ప్రకటించింది. 2024–2025 ఏడాదికి విడుదల చేసిన ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాలో మన భారతీయ వంటకాలు నాలుగు ర్యాంకులు దక్కించుకున్నాయి. వీటితోపాటు మన దేశంలోని ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నై వంటి నగరాలు తమ తమ ప్రాంతీయ వంటకాలతో అదరగొట్టి, ప్రపంచంలోని 100 ఉత్తమ ఆహార నగరాల జాబితాలో చేరాయి. వరల్డ్టాప్ 10అలా మొదలైంది..‘టేస్ట్ అట్లాస్’ ఒక ట్రావెల్ గైడ్ వెబ్సైట్. దీనిని క్రొయేషియన్ జర్నలిస్ట్స్ ఆసోసియేషన్ ఆధ్వర్యంలో, వ్యాపారవేత్త మతిజా బాబిక్ 2015లో ప్రారంభించారు. దాదాపు ఐదువేల వంటకాలు, వందల ట్రావెల్ గైడ్స్ ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా మొదటిసారి 2018లో ప్రపంచంలోని వంద ఉత్తమ వంటకాలతో తొలి నివేదిక విడుదల చేశారు. ఇక అప్పటి నుంచి ప్రతి ఏడాది వారు పరిశీలించే వంటకాల సంఖ్య పెరుగుతూనే పోతోంది. తాజాగా ప్రపంచవ్యాప్తంగా 11,258 వంటకాలను, 3,67,847 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా వంద ఉత్తమ వంటకాల జాబితాతో పాటు వంద ఉత్తమ ఆహార నగరాలు, వంద ఉత్తమ రెస్టరెంట్లు, ఉత్తమ వంటల పుస్తకాలు వంటి ఇతర జాబితాలను కూడా ‘టేస్ట్ అట్లాస్’ విడుదల చేసింది.ఉత్తమ వంటకాలు ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల్లో మొదటి స్థానాన్ని కొలంబియా దక్కించుకుంది. మాంసాహార వంటకం అయిన ‘లేచోనా’ ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన వంటకంగా ‘టేస్ట్ అట్లాస్’ ప్రకటించింది. గత ఏడాది మొదటి స్థానంలో నిలిచిన ఇటలీ ఈసారి రెండో స్థానంలో నిలిచింది. ఇటలీలోని ‘పిజ్జా నెపోలిటానా’ రెండవ రుచికరమైన వంటకంగా నిలిచింది. ఇక మూడో స్థానంలో బ్రెజిలియన్ బీఫ్ కట్ అయిన ‘పికాన్యా’ వంటకం నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో అల్జీరియా (రెచ్తా), థాయిలాండ్ (ఫానీంగ్ కర్రీ), అర్జెంటీనా (అసడో)లు, ఇతర దేశాలు ఉండగా, 99వ స్థానంలో ‘వాలాస్కీ ఫ్రగల్ కేక్’తో చెక్ రిపబ్లిక్ ఉంది. మన దేశం విషయానికి వస్తే, ఈ వంద ఉత్తమ వంటకాల్లో భారతదేశం నాలుగు ర్యాంకులు సాధించింది. మొదటగా 29వ ర్యాంకుతో ‘ముర్గ్ మఖానీ’ (బటర్ చికెన్) ఉండగా, 100వ ఉత్తమ వంటకంగా ‘కీమా’ నిలిచింది. ఇక ప్రపంచంలోని వంద ఉత్తమ ఆహార నగరాల్లో మన దేశం టాప్ టెన్‌లోనే ఉంది. స్ట్రీట్ ఫుడ్, ట్రెడిషనల్ వంటకాల్లో ముంబై ఐదవ ర్యాంకు సాధించింది. ముఖ్యంగా భారత్‌లో తప్పనిసరిగా తినాల్సిన వంటకాల్లో బటర్ చికెన్, అమృత్సర్ కుల్చా, హైదరాబాద్ బిరియానీ, బటర్ గార్లిక్ నాన్ ఉన్నాయి. అంతేకాదు, భారతదేశంలో లభించే గరమ్ మాసాలాలను కూడా తప్పనిసరిగా ట్రై చేయాలని ఈ రిపోర్ట్ సూచిస్తోంది. వీటితో పాటు గ్రీస్ దేశానికి చెందిన చాలా వంటకాలు ఉన్నాయి. వాటిలో ముసాకా, స్టిఫాడీ, సౌలాకీ, డోల్మడోస్, గౌరోస్, గ్రీక్ సలాడ్ ఇవన్నీ తప్పనిసరిగా రుచి చూడాల్సిన వంటకాలని, ముఖ్యంగా మెక్సికోలో మెక్సికన్ స్ట్రీట్ ఫుడ్ ‘టాకోస్’ చాలా ప్రజాదరణ పొందిన వంటకమని ‘టేస్ట్ అట్లాస్’ తెలిపింది. ప్రపంచంలోనే 100 అత్యంత పురాతన వంటల పుస్తకాలు లెక్కలేనన్ని కొత్త వంట పుస్తకాలు ప్రతిరోజూ ప్రచురిస్తున్నప్పటికీ, ఈ 100 వంట పుస్తకాలు కలకాలం జాతి సంపదగా నిలుస్తాయి. ఈ పుస్తకాలు పాక సంప్రదాయాలలో ప్రపంచంలోని పలువురు గొప్ప షెఫ్‌లకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన పుస్తకంగా మొదటి స్థానంలో అగస్టీ ఎస్కఫియా రచించిన ‘ది ఎస్కఫియా’ ఉండగా, రెండో స్థానంలో ‘ది జాయ్ ఆఫ్ కుకింగ్’ ఉంది. ఈ అత్యుత్తమ వంటల పుస్తకాల్లో నాలుగు భారతీయ పుస్తకాలు ఉన్నాయి. యాన్ ఇన్విటేషన్ టు ఇండియన్ కుకింగ్ (ర్యాంక్–09)మధుర్ జాఫ్రీ రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. ఇది పాశ్చాత్య పాఠకులకు భారతీయ వంటకాలను పరిచయం చేస్తుంది. వివిధ రకాల ప్రాంతీయ వంటకాలతో దేశ పాక సంప్రదాయాలను వివరిస్తుంది.మేడ్ ఇన్ ఇండియా (ర్యాంక్–25)మీరా సోదా రచించిన ఈ పుస్తకాన్ని 2014లో ప్రచురించారు. ప్రతిరోజూ చేసుకునే వంటకాలతో ఈ పుస్తకం కనిపిస్తుంది. అందుకే దీనికి పాఠకాదరణ ఎక్కువ. ది ఇండియన్ కుకింగ్ కోర్స్ (ర్యాంక్–33) మోనిషా భరద్వాజ్ రచించిన ఈ పుస్తకాన్ని 2018లో ప్రచురించారు. ఇది భారతీయ వంటకాలకు ఒక విస్తృతమైన మార్గదర్శి. సంప్రదాయ భారతీయ వంటకాలపై అవగాహనను పెంచుకోవాలనుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.ఇండియన్ వెజిటేరియన్ కుకరీ (ర్యాంక్–69)జాక్ శాంటా మారియా రచించిన ఈ పుస్తకాన్ని 1973లో ప్రచురించారు. భారతీయ శాకాహార వంటకాల వైవిధ్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. వంటలలో రకరకాల కూరగాయలు, సుగంధ ద్రవ్యాలను పరిచయం చేస్తూ, ఆరోగ్యకరమైన వంటకాల తయారీ ప్రక్రియను చెబుతుంది.టాప్ 100 ఉత్తమ ఆహార నగరాలు‘టేస్ట్ అట్లాస్’ 15,478 వంటకాలకు 4,77,287 రివ్యూయర్స్ రేటింగ్స్ ఆధారంగా, విడుదల చేసిన ఉత్తమ ఆహార నగరాల జాబితాలో జాతీయ, ప్రాంతీయ వంటకాలన్నీ ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత రుచికరమైన ఆహారం అందించే నగరాల జాబితాలో మొదటి నాలుగు స్థానాలను ఇటలీ దక్కించుకుంది. మొదటగా నిలిచిన నేపుల్స్ నగరంలోని పిజ్జా, మిలాన్‌లోని రిసోట్టాలను తప్పకుండా రుచి చూడాలంటూ ఈ రిపోర్టు తెలిపింది. ఇక ఆ తర్వాతి స్థానాల్లో బొలొగ్నా, ఫ్లోరెన్స్ నగరాలు ఉండగా, టాప్ 5వ స్థానాన్ని ముంబై దక్కించుకుంది. మరికొన్ని భారతీయ నగరాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. మన నగరాలు, వాటి ర్యాంకుల వివరాలు.ముంబై : వడాపావ్, భేల్పూరి, పావ్ భాజీ, దహీ పూరి, బాంబే శాండ్విచ్, బాంబే బిరియానీ, రగడా పట్టిచీ, ఐస్ చావ్లా, అంబా, బొంబిలీ ఫ్రై.అమృత్సర్ : అమృత్సరీ కుల్చా, పనీర్ కుల్చా, అమృత్సరీ ఫిష్ , చూర్ చూర్ నాన్.న్యూఢిల్లీ : బటర్ చికెన్, కుల్చా, రాజ్మా, ఖీర్, దాల్ మఖానీ, ఛోలే భటూరే, ఉల్లి పకోడీ, గులాబ్ జామూన్.హైదరాబాద్ : హైదరాబాదీ బిరియానీ, పెసరట్టు, చికెన్ 65, రూమాలీ రోటీ, మలీదా, కరాచీ బిస్కట్స్, బోటీ కూర, మిర్చీ కా సాలాన్, షికాంపురీ కబాబ్, కుబానీ కా మీఠా.కోల్కత్తా : కఠీ రోల్, గోబీ మంచూరియా, పనీర్ కఠీరోల్, రసగుల్లా, పొంగల్, చక్కర్ పొంగల్చెన్నై : మద్రాస్ కర్రీ, ఇడ్లీ, సాంబార్, దోశ, కొబ్బరి చట్నీ, మురుకులు, బోండా, కాజూ కత్లీ, చెట్టినాడ్ మసాలా. ఏది ఏమైనా ఈ ‘టేస్ట్ అట్లాస్’ రిపోర్ట్ ఒక సమీక్ష మాత్రమే! ‘లోకో భిన్న రుచి’ అని నానుడి. కొంతమందికి కొన్ని వంటకాలు నచ్చుతాయి, కొన్ని నచ్చవు. చాలామంది బయటి ఆహారం కంటే ఇంట్లో వండుకునే వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ‘టేస్ట్ అట్లాస్’లో ఎక్కువగా యూరోపియన్స్ వంటకాలే టాప్‌లో నిలిచాయి. ఏ దేశ ప్రజలకు వారి దేశీయ వంటకాలే ఎక్కువగా నచ్చుతాయి. కాబట్టి ఈ ర్యాంకులన్నీ కూడా కేవలం చెప్పుకోవాడానికే కాని, వీటికి కచ్చితమైన ప్రామాణికత అంటూ నిర్ణయించలేం. -
ఆహ.. ఏమి రుచి!
సాక్షి, అమరావతి: భారతీయ వంటకాలు ప్రపంచ ఆహార ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచస్థాయి వంటకాలు, ఐకానిక్ రెస్టారెంట్ల క్యూరేటెడ్ జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. టేస్ట్ అట్లాస్ ఇటీవల 2024–25 ప్రపంచ ఆహార అవార్డులను ప్రకటించింది. ఇందులో భారతీయ వంటకాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. సంప్రదాయం, రుచుల్ని మిళితం చేసే భారతదేశం పాకశాస్త్ర సంస్కృతికి అద్దం పట్టాయి. భారతీయ వంటకాలు సుగంధ ద్రవ్యాలతో కూడినవని విమర్శకులు పేర్కొన్నప్పటికీ.. ప్రపంచంలోని అత్యంత ఇష్టపడే వంటకాల్లో అగ్రస్థానంలో నిలవడం విశేషం. మొఘల్, పంజాబీ, దక్షిణాది వంటకాల రుచి అనేక రెస్టారెంట్లకు సైతం ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చాయి.దక్షిణాదిలో దోశ.. ఉప్మా రెస్టారెంట్ టేస్ట్ అట్లాస్ 100 మోస్ట్ లెజెండరీ రెస్టారెంట్లలో ఐకానిక్ వంటకాలు, గొప్ప వంటలో భారతీయ ఆహార మార్కెట్ సత్తా చాటింది. కలకత్తాలోని పీటర్ క్యాట్ రెస్టారెంట్‌కు 7వ ర్యాంక్ రాగా.. ఇక్కడ దొరికే ‘చెలో కబాబ్’కు ఆదరణ లభిస్తోంది. ముర్తల్లోని అమ్రిక్ సుఖ్‌దేవ్ రెస్టారెంట్‌కు 13వ ర్యాంక్‌లో ఆలూ పరాటా అందిస్తూ ఆకట్టుకుంటోంది. న్యూఢిల్లీలోని కరీం రెస్టారెంట్ 1,913 నుంచి కోర్మా వంటకం ద్వారా భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది.దీనికి 59వ ర్యాంక్ రావడం విశేషం. బెంగళూరులోని సెంట్రల్ టిఫిన్ రూమ్ మసాలా దోశ మంచి క్రేజ్ సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా 69వ ర్యాంక్‌లో నిలిచింది. న్యూఢిల్లీలోని గులాటి రెస్టారెంట్ 77 ర్యాంక్‌తో బట్టర్ చికెన్.. ముంబైలోని రామ్ ఆశ్రమం ఉప్మాకు 78వ ర్యాంక్ సంపాదించింది.హైదరాబాద్ బిర్యానీ అదుర్స్ ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాను వెల్లడించింది. భారత్ నుంచి ముర్గ్ మఖానీ 29వ, హైదరాబాద్ బిర్యానీ 31 స్థానాల్లో నిలిచాయి. చికెన్–65 సైతం 97వ స్థానంలో, కీమా 100వ స్థానం పొందాయి. ముర్గ్ మఖానీ, హైదరాబాద్ బిర్యానీ గ్లోబల్ ఆహార ప్రియుల నుంచి వరుసగా 5, 4.52 స్టార్ రేటింగ్ అందుకున్నాయి. మరోవైపు చికెన్ 65, కీమాకు 4.44 స్టార్ రేటింగ్ వచ్చింది.కొలంబియా లెచోనా.. ఇటలీ పిజ్జా టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్‌లో కొలంబియాకు చెందిన లెచోనా (పోర్క్) వంటకం 4.78 రేటింగ్‌తో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానంలో ఇటలీకి చెందిన పిజ్జా 4.75 రేటింగ్‌తో రెండో స్థానంలో, బ్రెజిల్‌కు చెందిన పికాన్హా 4.69 రేటింగ్‌తో మూడో స్థానం, ఆ తరువాత స్థానాల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఫనాంగ్ కర్రీ, అర్జెంటీనాకు చెందిన అసడో వంటకాలు 4.65 రేటింగ్‌ను పొందాయి. -
ప్రపంచంలోనే ది బెస్ట్ టేస్టీ వంటకాలను అందించే దేశాలివే..!
ప్రసిద్ధి ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ అల్పాహారం, స్వీట్స్, నాన్‌వెజ్, వెజిటేరియన్ పరంగా ఏది ఉత్తమమమేనదో దేశాల వారిగా ర్యాంకులు ఇచ్చింది. ఇప్పుడు మంచి టేస్ట్‌తో కూడిన వంటకాలను అందించే దేశాల జాబితాను విడుదల చేసింది. ఆయా దేశాల్లో ఉండే విభిన్న వంటకాలు, ఫేమస్ రెస్టారెంట్లు, పానీయాలు, ఆధారంగా ఈ ర్యాంకులు ఇచ్చింది. ప్రపంచంలోనే ఉత్తమ వంటకాలను అందించే.. వంద దేశాలో జాబితాలో గ్రీక్, ఇటాలియన్, మెక్సికన్, స్పానిష్, పోర్చుగీస్ తదితర దేశాలు అగ్రస్థానంలో నిలిచాయి.ఆ జాబితాలో భారతీయ వంటకాలు 12వ స్థానం దక్కించుకున్నాయి. ఈ ర్యాంకులను అట్లాస్ ఆయా దేశాల్లోని వివిధ వంటకాలు దక్కించుకున్న అత్యధిక స్కౌరు ఆధారంగా ఇచ్చింది. కాగా, టేస్టీ అట్లాస్ మన దేశంలోని బెస్ట్ టేస్టీ వంటకాలుగా..అమృతసరి కుల్చా, బట్టర్ గార్లిక్ నాన్, ముర్గ్ మఖానీ, హైదరాబాదీ బిర్యానీ తదితరాలను తప్పకుండా తిని చూడాల్సిన వంటకాలుగా పేర్కొంది. దీంతోపాటు మంచి ఆహార వైవిధ్యాన్ని అందించే రెస్టారెంట్లుగా దమ్ పుఖ్త్ (న్యూఢిల్లీ), గ్లెనరీస్ (డార్జిలింగ్), రామ్ ఆశ్రయ (ముంబై), శ్రీ థాకర్ భోజనాలయ్ (ముంబై)లుగా తెలిపింది. ఇక టేస్టీ అట్లాస్ ప్రకారం..భారత్‌లో కొన్ని రకాల వంటకాలు, పానీయాలు అత్యధిక స్కౌరుని దక్కించుకోవడంతో అగ్రస్థానంలో నిలిచింది. View this post on Instagram A post shared by TasteAtlas (@tasteatlas) (చదవండి: ఎగతాళి నుంచి సంతాలి రుచుల దాకా...) -
Maunika Govardhan: నచ్చేలా మెచ్చేలా ఘనంగా గరిట పట్టేలా
‘తినడం కోసం బతకడం కాదు. బతకడం కోసం తినాలి’ అని కాస్త గంభీరంగా అనుకున్నాసరే, ‘వంటల రుచుల కోసం కూడా బతకవచ్చు సుమీ!’ అనిపిస్తుంది కొన్నిసార్లు. పసందైన వంటకాలు జీవనోత్సాహాన్ని కలిగిస్తాయి. చురుకుదనాన్ని నింపుతాయి. ఇట్టి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని లండన్‌లో చేస్తున్న కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని చెఫ్‌గా మారి ప్రవాస భారతీయులకు అపూర్వమైన భారతీయ వంటకాలను పరిచయం చేయడంతో పాటు, వాటిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చు అనేదానిపై పుస్తకాలు రాస్తోంది మౌనికా గోవర్ధన్... ముంబైలోని దాదర్ ప్రాంతంలో పుట్టి పెరిగిన మౌనిక ప్రస్తుతం లండన్‌లో ఉంటోంది. చెఫ్‌గా సంప్రదాయ భారతీయ వంటకాల రుచులను విదేశీయులకు పరిచయం చేస్తుంది. ‘సులభంగా చేసుకునేలా... ఆరోగ్యంగా ఉండేలా...’ అనేది ఆమె వంటల పాలసీ. ప్రతి కుటుంబానికి తరతరాలుగా తమవైన ప్రత్యేక వంటకాలు ఉంటాయి. కొన్నిసార్లు కాలంతోపాటు అవి కనుమరుగు అవుతుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని మౌనిక తమ కుటుంబంలో ఎన్నో తరాల విలువైన వంటకాలను సేకరించింది. పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు, లైవ్ ఈవెంట్స్, సోషల్ మీడియా ద్వారా మన వంటకాలకు విదేశాల్లో ప్రాచుర్యం కల్పిస్తోంది. లండన్‌లో ఉంటున్నప్పటికీ మౌనికకు మన దేశంలోని పాతతరం వంటకాలపై ఆసక్తి తగ్గలేదు. ఏమాత్రం సమయం దొరికినా మన దేశానికి వచ్చి మధ్యప్రదేశ్ నుంచి మణిపుర్ వరకు ఎన్నో ప్రాంతాలకు వెళుతుంటుంది. ‘అందరిలాగే అమ్మ వంటకాలు అంటే నాకు ఇష్టం. అయితే కేవలం ఇష్టానికి పరిమితం కాకుండా అమ్మ చేసే వంటకాలను ఓపిగ్గా నేర్చుకున్నాను. నేను చేసే వంటకాలు కూడా అమ్మకు బాగా నచ్చేవి’ గతాన్ని గుర్తు చేసుకుంది మౌనిక. ఆమె అమెరికాలాంటి దేశాలకు వెళ్లినప్పుడు ప్రవాస భారతీయులతో మాట్లాడుతున్న సందర్భంగా మన వంటకాలను గుర్తు చేస్తున్నప్పుడు వారి నోట్లో నీళ్లు ఊరేవి. ప్రతివ్యక్తికి ‘సోల్ ఫుడ్’ అనేది ఒకటి ఉంటుంది అని చెబుతుంటుంది మౌనిక. మౌనిక తాజాపుస్తకం ‘తందూరీ హోమ్ కుకింగ్’ అద్భుత విజయాన్ని సాధించింది. ఈ పుస్తకంలో రకరకాల రుచికరమైన తందూరీ వంటకాలతో పాటు ఆయా వంటకాల చరిత్రను ఆసక్తికరంగా వివరిస్తుంది మౌనిక. ఇదంతా సరే, కార్పొరేట్ ఉద్యోగాన్ని వదులుకొని మరీ మౌనిక ఎందుకు చెఫ్‌గా మారింది? ఆమె మాటల్లోనే... ‘లండన్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో స్నేహితుల కోసం సరదాగా వంటలు చేసి పెట్టేదాన్ని. ఆ వంటకాలు వారికి విపరీతంగా నచ్చేవి. ఆ రుచుల మైమరుపులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం కూడా మరచి పోయేవారు. కుకింగ్‌ను ప్రొఫెషనల్‌గా తీసుకుంటే తిరుగులేని విజయం సాధిస్తావు అని చెప్పేవాళ్లు. నేను ఆ మాటలను పెద్దగా సీరియస్‌గా తీసుకునేదాన్ని కాదు. అయితే పదే పదే ఇలాంటి మాటలు వినిపించడంతో ఒకసారి ట్రై చేద్దామని కార్పొరేట్ జాబ్‌ను వదులుకొని కుకింగ్‌ను ఫుల్–టైమ్ జాబ్ చేసుకున్నాను. అయితే ఇది మా కుటుంబ సభ్యులకు నచ్చలేదు. కొందరైతే లండన్‌కు వెళ్లింది వంటలు చేయడానికా? అని వెక్కిరించారు. దీనికి కారణం కుకింగ్ అనేది వారికి ఒక ప్రొఫెషన్‌గా కనిపించకపోవడమే. కుకింగ్ అంటే ఇంట్లో ఆడవాళ్లు చేసే పని మాత్రమే అనేది వారి అభిప్రాయం. కుకింగ్కు సంబంధించిన రోల్‌మోడల్స్ గురించి కూడా వారికి తెలియదు. అయితే తరువాత మాత్రం వారిలో మార్పు వచ్చింది’ అంటుంది మౌనిక. మౌనిక ఇంట్లో ఆ రోజుల్లో ఒకే ఒక వంటల పుస్తకం కనిపించేది. ఆ పుస్తకాన్నే పదేపదే తిరగేసేది అమ్మ, ఈ పుస్తకాలు కూడా కొన్ని వంటకాలకు సంబంధించినవే ఉండేవి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వంటలు ఎలా చేయాలో నేర్పించడం కోసం పుస్తకాలు కూడా రాయాలని నిర్ణయించుకుంది. అందులో భాగంగా వెబ్‌సైట్‌ను మొదలుపెట్టింది. ఆ తరువాత ‘ది న్యూయార్క్ టైమ్స్’ ‘ది డెయిలీ మెయిల్’లో మన వంటకాలను ప్రపంచానికి పరిచయం చేసేది. వంటకాల తయారీలో రెండు దశాబ్దాల అనుభవం ఉన్న మౌనిక ఇండియన్ కిచెన్, థాలీ, తందూరీ హోమ్ కుకింగ్ అనే మూడు పుస్తకాలు రాసింది. ‘వంటలు చేసే సమయంలో నా దృష్టి మొత్తం తయారీ ప్రక్రియపైనే ఉంటుంది. ఆ సమయంలో వేరే విషయాల గురించి ఆలోచించడం తాలూకు ప్రభావం రుచిపై పడుతుంది. అందుకే వంటగదిలోకి వెళ్లినప్పుడు ఒక కొత్త ప్రపంచంలోకి వెళ్లినట్లుగా భావిస్తాను’ అంటుంది మౌనిక. మౌనిక లండన్‌లో చదువుకునే రోజుల్లో ‘అన్ని భారతీయ వంటకాలకు ఒకటే రెస్టారెంట్’ అన్నట్లుగా ఉండేది. ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు కొత్తిమీర దొరకడం గగనంగా ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ‘మన వంటకాల కోసం రెస్టారెంట్లపై మాత్రమే ఆధారపడడం ఎందుకు? ఆడుతూ పాడుతూ మన ఇంట్లో చేసుకోవచ్చు కదా’ అనుకునే ప్రవాస భారతీయులకు మౌనిక గోవర్ధన్ పుస్తకాలు అపురూపంగా మారాయి. చెఫ్‌గా మౌనికా గోవర్థన్ అపూర్వ విజయానికి కారణం అయ్యాయి. -
G20 Summit: జీ20 అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు
న్యూఢిల్లీ: జీ20 కూటమి నేతలు, అతిథులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం రాత్రి ఢిల్లీలో భారత్ మండపం వద్ద ఘనమైన విందు ఇచ్చారు. తృణధాన్యాలు, కశ్మీరీ కాహా్వతో తయారు చేసిన పసందైన వంటకాలను ఈ సందర్భంగా అతిథులు రుచి చూశారు. ముంబై పావ్, బాకార్ఖానీ అనే రొట్టెలు వడ్డించారు. డార్జిలింగ్ టీ ఏర్పాటు చేశారు. భారతీయ వంటకాల్లోని వైవిధ్యం ఇక్కడ సాక్షాత్కారించింది. తొలుత రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ జీ20 నేతలకు స్వాగతం పలికారు. స్వాగత వేదిక వెనుక ప్రాచీన నలందా విశ్వవిద్యాలయ శిథిలాల చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అలాగే జీ20 థీమ్ ‘వసుధైవ కుటుంబం’ అని లిఖించారు. రాష్ట్రపతి ఇచి్చన విందులో అమెరికా అధ్యక్షుడు బైడెన్, యూకే ప్రధాని రిషి సునాక్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 300 మంది హాజరయ్యారు. సునాక్ వెంట ఆయన భార్య అక్షతా మూర్తి కూడా వచ్చారు. నలందా విశ్వవిద్యాలయం గురించి బైడెన్‌కు, సునాక్ దంపతులకు ప్రధాని మోదీ తెలియజేశారు. జపాన్ ప్రధానమంత్రి ఫుమియో కిషిదా భార్య యోకో కిషిదా భారతీయ సంప్రదాయ చీరను ధరించి రావడం విశేషం. -
విదేశాల్లో భారత ‘వంటిల్లు’!
న్యూఢిల్లీ: పంజాబీ చికెన్ టిక్కా... రాజస్థానీ థాలీ... మహారాష్ట్ర వడాపావ్... తమిళనాడు సాంబార్ ఇడ్లీ... హైదరాబాద్ బిర్యానీ... చెబుతుంటేనే నోరూరుతోంది కదా..!! ఈ భారతీయుల వంటకాల ఘుమఝుమలు విదేశీయులనూ ఆవురావురుమనేలా చేస్తున్నాయి. అదిరిపోయే భారతీయ వంటలతో మనోళ్లు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. మన నలభీములకు విదేశీయులు ఎర్ర తివాచీ పరుస్తుండటంతో ఇక్కడి రెస్టారెంట్ చైన్లు అత్యంత వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. లైట్ బైట్ ఫుడ్స్, జిగ్స్ అండ్ జోరవార్ కల్రా రెస్టారెంట్ చైన్లతో పాటు పారిశ్రామికవేత్త, ప్రముఖ చెఫ్ సంజీవ్ కపూర్‌కు చెందిన రెస్టారెంట్లు విదేశాల్లో పాగా వేస్తున్నాయి. అనుమతులు, లైసెన్సులు సులువు... కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్, డామినోస్ లాంటి విదేశీ రెస్టారెంట్ చైన్లకు దీటుగా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంస్థలు చొచ్చుకుపోతున్నాయి. ఇతర దేశాల్లో రెస్టారెంట్లను ప్రారంభించడం సులువుగా ఉండటం, బయట వంటకాలకు విదేశీయులు ఖర్చులు పెంచడం లాంటి సానుకూల అంశాలు హోటల్ వ్యాపార అభివృద్ధికి దోహదపడుతున్నాయని నిర్వహకులు చెబుతున్నారు. ’విదేశీ రెస్టారెంట్ వ్యాపారం విధానాలలో స్థిరత్వం ఉంటుంది. అనేక దేశాలలో హోటళ్లను ప్రారంభించడానికి బహుళ అనుమతులు, లైసెన్సుల అవసరం లేకపోవడం అనేది ప్రయోజనకరంగా ఉంది. లండన్, న్యూయార్క్, దుబాయ్ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో బయట తిండికి వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 150 మంది కూర్చుని భోజనం చేయడానికి సరిపడేంతటి రెస్టారెంట్‌ను ఈఏడాది సెప్టెంబరులోనే వాషింగ్టన్ డీసీలో ప్రారంభిస్తున్నాం’ అని లైట్ బైట్ ఫుడ్స్ డైరెక్టర్ రోహిత్ అగర్వాల్ అన్నారు. పంజాబ్ గ్రిల్ పేరుతో ఈ రెస్టారెంట్ ప్రారంభం కానుందని, త్వరలోనే దుబాయ్, కువైట్, ఇతర గల్ఫ్ దేశాలలో సైతం సత్తా చాటనున్నామని వెల్లడించారు. మానవ వనరుల పరంగా ఇబ్బందే... వ్యాపారం బాగానే ఉన్నా... మానవవనరుల కొరత, వీసా సమస్యలు వెంటాడుతున్నట్లు రోహిత్ తెలిపారు. భారత్‌లో మార్జిన్లు చూడలేకపోతున్న అనేక రెస్టారెంట్ చైన్లు విదేశాల్లో లాభాలను గడిస్తున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ) అంటోంది. ఇతర దేశాలలో రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చాలా ఎక్కువగా ఉందని ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు రాహుల్ సింగ్ వెల్లడించారు. గతేడాది అమెరికన్లు ఆహారంపై చేస్తున్న ఖర్చులలో ఏకంగా 48% రెస్టారెంట్లలోనే జరుగుతున్నట్లు తెలిపారు. విదేశాల్లో హోటల్ నడపడం చాలా సులభం... దివ్యాని ఇంటర్నేషనల్ అమెరికా, లండన్, సింగపూర్, దుబాయ్ దేశాలలో విస్తరిస్తోంది. నోరు ఊరించే వంటకాలతో అదరగొట్టే సంజీవ్ కపూర్ సైతం విదేశీ రెస్టారెంట్ల విస్తరణలో వేగంగా దూసుకుపోతున్నారు. సంజీవ్ కపూర్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మొత్తం 70 స్టోర్లను నడుపుతుండగా, వీటిలో సగం వరకు విదేశాల్లోనే ఉన్నాయి. విదేశాల్లో హోటల్ వ్యాపారం చాలా సులువుగా నడపవచ్చని వెల్లడించిన ఆయన త్వరలోనే లండన్, న్యూయార్క్, టొరంటో, సౌదీలలో రెస్టారెంట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. -
కొత్త పెళ్లికూతురు కబుర్లు!
పెళ్లి పుస్తకం ఎట్టకేలకు అందాల రాశి దియా మీర్జా పెళ్లి, ప్రేమికుడు సాహిల్ సంఘాతో ఇటీవల ఘనంగా జరిగింది. భర్త సాహిల్ గురించి దియా చెప్పిన కబుర్లు ఇవి... తొలిసారి... ఒక స్క్రిప్ట్ వినిపించడానికి తొలిసారిగా నా దగ్గరికి వచ్చాడు. అతను స్క్రిప్ట్‌ను వినిపించిన పద్ధతి, హావభావాలు నాకు ‘నచ్చాయి’. ఇక అప్పటి నుంచి ఈ నచ్చడాల జాబితా పెరుగుతూ పోయి ప్రేమ వరకు, అక్కడి నుంచి పెళ్లి వరకు వచ్చింది.చాలా విషయాల్లో మా అభిప్రాయాలు కలుస్తాయి. ఒరినొకరం ఇష్టపడడానికి ఇదొక కారణం. గాఢమైన ప్రేమలో... సాహిల్‌కు కాస్త గర్వం ఎక్కువనే మాట నేనూ విన్నాను. అది నిజమైనా దాని వల్ల నేనేమీ ఇబ్బంది పడను. నిజం చెప్పాలంటే, నిండా ప్రేమలో మునిగిన వారికి ఏదీ సమస్య కాదు. చిన్న సమస్యకు ఆవేశకావేశాలకు లోనయ్యే ప్రేమ కాదు మాది. చెప్పాలంటే పరిణతితో కూడిన ప్రేమ. గట్టి పునాది ఉన్న గాఢమైన ప్రేమ. ఒక్క ‘సారీ’ కాదు... అప్పుడప్పుడు చిలిపి తగాదాలు మా మధ్య చోటు చేసుకుంటాయి. చాలా సందర్భాల్లో ఆయనే సారీ చెప్పి తగాదాకు ఫుల్స్టాప్ పెట్టేస్తారు. ఆయన సారీ చెప్పినందుకు... నేను మళ్లీ సారీ చెబుతాను. ఇక ఆ రోజంతా సారీలతోనే గడిచిపోతుంది. వంటంటే ఎంతిష్టం! మా ఇద్దరికీ వంట చేయడం అంటే మహా ఇష్టం. నేను ఇండియన్ వంటకాలు బాగా చేస్తాను. కొన్నిసార్లు హైదరాబాదీ వంటకాలు, కొన్నిసార్లు పంజాబీ వంటకాలు చేస్తుంటాను. నేను చేసే బిర్యానీ, కట్టి దాల్, ఖీమా..లాంటి హైదరాబాద్ వంటకాలంటే సాహిల్‌కు ఇష్టం. సాహిల్ యూరోపియన్, ఇటలియన్, థాయ్ వంటకాలు బాగా చేస్తాడు. - దియా మీర్జా, హీరోయిన్