భారతీయ వంటకాలకు ప్రపంచ ఆహార ప్రియులు ఫిదా
ఢిల్లీ ముర్గ్ మఖానీకి 29 స్థానం
31వ స్థానంలో హైదరాబాద్ బిర్యానీ
టేస్ట్ అట్లాస్ నివేదిక వెల్లడి
సాక్షి, అమరావతి: భారతీయ వంటకాలు ప్రపంచ ఆహార ర్యాంకింగ్స్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ప్రపంచస్థాయి వంటకాలు, ఐకానిక్ రెస్టారెంట్‌ల క్యూరేటెడ్ జాబితాలో చోటు దక్కించుకుంటున్నాయి. టేస్ట్ అట్లాస్ ఇటీవల 2024–25 ప్రపంచ ఆహార అవార్డులను ప్రకటించింది. ఇందులో భారతీయ వంటకాలు ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి. సంప్రదాయం, రుచుల్ని మిళితం చేసే భారతదేశం పాకశాస్త్ర సంస్కృతికి అద్దం పట్టాయి. భారతీయ వంటకాలు సుగంధ ద్రవ్యాలతో కూడినవని విమర్శకులు పేర్కొన్నప్పటికీ.. ప్రపంచంలోని అత్యంత ఇష్టపడే వంటకాల్లో అగ్రస్థానంలో నిలవడం విశేషం. మొఘల్, పంజాబీ, దక్షిణాది వంటకాల రుచి అనేక రెస్టారెంట్లకు సైతం ప్రపంచ ఖ్యాతిని తీసుకొచ్చాయి.
దక్షిణాదిలో దోశ.. ఉప్మా రెస్టారెంట్
టేస్ట్ అట్లాస్ 100 మోస్ట్ లెజెండరీ రెస్టారెంట్లలో ఐకానిక్ వంటకాలు, గొప్ప వంటలో భారతీయ ఆహార మార్కెట్ సత్తా చాటింది. కలకత్తాలోని పీటర్ క్యాట్ రెస్టారెంట్‌కు 7వ ర్యాంక్ రాగా.. ఇక్కడ దొరికే ‘చెలో కబాబ్’కు ఆదరణ లభిస్తోంది. ముర్తల్లోని అమ్రిక్ సుఖ్‌దేవ్ రెస్టారెంట్‌కు 13వ ర్యాంక్‌లో ఆలూ పరాటా అందిస్తూ ఆకట్టుకుంటోంది. న్యూఢిల్లీలోని కరీం రెస్టారెంట్ 1,913 నుంచి కోర్మా వంటకం ద్వారా భోజన ప్రియులను ఆకట్టుకుంటోంది.
దీనికి 59వ ర్యాంక్ రావడం విశేషం. బెంగళూరులోని సెంట్రల్ టిఫిన్ రూమ్ మసాలా దోశ మంచి క్రేజ్ సంపాదించుకుని ప్రపంచవ్యాప్తంగా 69వ ర్యాంక్‌లో నిలిచింది. న్యూఢిల్లీలోని గులాటి రెస్టారెంట్ 77 ర్యాంక్‌తో బట్టర్ చికెన్.. ముంబైలోని రామ్ ఆశ్రమం ఉప్మాకు 78వ ర్యాంక్ సంపాదించింది.
హైదరాబాద్ బిర్యానీ అదుర్స్
ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ ప్రపంచంలోని 100 ఉత్తమ వంటకాల జాబితాను వెల్లడించింది. భారత్ నుంచి ముర్గ్ మఖానీ 29వ, హైదరాబాద్ బిర్యానీ 31 స్థానాల్లో నిలిచాయి. చికెన్–65 సైతం 97వ స్థానంలో, కీమా 100వ స్థానం పొందాయి. ముర్గ్ మఖానీ, హైదరాబాద్ బిర్యానీ గ్లోబల్ ఆహార ప్రియుల నుంచి వరుసగా 5, 4.52 స్టార్ రేటింగ్ అందుకున్నాయి. మరోవైపు చికెన్ 65, కీమాకు 4.44 స్టార్ రేటింగ్ వచ్చింది.
కొలంబియా లెచోనా.. ఇటలీ పిజ్జా
టేస్ట్ అట్లాస్ ర్యాంకింగ్‌లో కొలంబియాకు చెందిన లెచోనా (పోర్క్) వంటకం 4.78 రేటింగ్‌తో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఆ తర్వాతి స్థానంలో ఇటలీకి చెందిన పిజ్జా 4.75 రేటింగ్‌తో రెండో స్థానంలో, బ్రెజిల్‌కు చెందిన పికాన్హా 4.69 రేటింగ్‌తో మూడో స్థానం, ఆ తరువాత స్థానాల్లో థాయ్‌లాండ్‌కు చెందిన ఫనాంగ్ కర్రీ, అర్జెంటీనాకు చెందిన అసడో వంటకాలు 4.65 రేటింగ్‌ను పొందాయి.
Comments
Please login to add a commentAdd a comment