Hyderabad Biryani
-
మజారె పావ్‌బాజీ.. బిర్యానీ భోజీ
సాక్షి, అమరావతి: దేశంలోని నగరాలను ప్రపంచానికి పరిచయం చేయడంలో స్థానిక ఆహార పదార్థాలు కీలక భూమిక పోషిస్తున్నాయి. వీధి చివరిలోని స్టాల్స్ నుంచి ఐకానిక్ హోటళ్ల వరకు నోరూరించే రుచులు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. ఢిల్లీ, ముంబై వడాపావ్, చాట్ బఠాణి, హైదరాబాద్ బిర్యానీ, చెన్నై ఇడ్లీ–దోశ, లక్నో కబాబ్–మొగలాయ్ వంటకాలు ఎల్లలు ఎరుగని ఆహార ప్రేమికులను సొంతం చేసుకుంటున్నాయి. ఒక ప్రాంత సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించడంలో పాకశాస్త్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని రుచుల ఎన్‌సైక్లోపిడియాగా పిలిచే ‘టేస్ట్ అట్లాస్’ సంస్థ పేర్కొంది. తాజాగా ‘ప్రపంచంలోని ఉత్తమ ఆహార నగరాల’ జాబితాను విడుదల చేసింది. ఇందులో టాప్–100లో భారతదేశం నుంచి ఐదు నగరాలకు స్థానం దక్కింది. టేస్ట్ అట్లాస్ ‘ట్రావెల్ గ్లోబల్ ఈట్ లోకల్’ నినాదంతో ప్రాంతీయ రుచులకు పెద్దపీట వేస్తోంది. తద్వారా వ్యవసాయం, వాణిజ్యాన్ని బలోపేతం చేయొచ్చని భావిస్తోంది. ఇటాలియన్ నగరాలే టాప్ ♦ టేస్ట్ అట్లాస్ నివేదికలో ఇటాలియన్ నగరాల రుచుల హవా కనిపించింది. అగ్రస్థానంలో రోమ్ (ఇటలీ) ఆ తర్వాత బోలోగ్రా, నేపుల్స్ నగరాలు నిలిచాయి. మొత్తం మూడు ఇటాలియన్ నగరాల్లో పాస్తా, పిజ్జా, జున్ను ఆధారిత వంటకాలకు ప్రసిద్ధి చెందడం విశేషం. ♦ ఉత్తమ రేటింగ్ పొందిన వంటకంగా బ్రెజిలియన్ మీట్ కట్ పికాన్హా, ఆ తర్వాత మలేషియన్ బ్రెడ్ రోటీ కనై , థాయ్ స్టిర్ ఫ్రై రెసిపీలు ఉన్నాయి. హైదరాబాద్ బిర్యానీకి దేశంలో రెండో స్థానం ♦ ప్రపంచ ఉత్తమ ఆహార నగరాల్లో ముంబై (35), హైదరాబాద్ (39) స్థానాలను దక్కించుకున్నాయి. ♦ ఆ తర్వాత ఢిల్లీ (56), చెన్నై (65), లక్నో (92) స్థానాల్లో నిలిచాయి. ఇక్కడ పావ్ బాజీ, దోశ, వడపావ్, చోలే భాతురే, కబాబ్స్, నిహారీ, పానీ పూరీ, చోలే కుల్చే, బిర్యానీ, వివిధ రకాల చాట్లు కేవలం కడుపునింపే ఆహారంగానే కాకుండా జిహ్వకు సంతృప్తి, అత్యుత్తమ రుచిని అందిస్తాయని నివేదిక పేర్కొంది. ♦ ఉత్తమ రెస్టారెంట్ల విషయంలో భారత్ 4.52 స్కోరుతో 11వ స్థానంలో నిలిచింది. ♦ ఉత్తమ ఆహార పదార్థంగా బటర్ గార్లిక్ నాన్ 4.67 స్కోర్‌తో 7వ స్థానం, ముర్గ్ మఖానీ 4.54 స్కోర్‌తో 43వ స్థానం, టిక్కా 4.54 స్కోర్‌తో 47వ స్థానం, తందూరి 4.54 స్కోర్‌తో 48వ స్థానంలో నిలిచాయి. ♦ ఉత్తమ అల్పాహారంగా శనగల కూరతో కూడిన పూరీ 18వ స్థానంలో ఉండగా.. అత్యంత ప్రసిద్ధ ఆహార స్థలాల్లో మంగుళూరులోని పబ్బా ఐస్ పార్లర్‌కు 7వ స్థానం దక్కింది. ప్రపంచంలోని టాప్–10 ఆహార నగరాలు ♦ రోమ్, ఇటలీ ♦ బోలోగ్నా, ఇటలీ ♦ నేపుల్స్, ఇటలీ ♦ వియన్నా, ఆస్ట్రియా ♦టోక్యో, జపాన్ ♦ఒసాకా, జపాన్ ♦ హాంకాంగ్, చైనా ♦ టురిన్, ఇటలీ ♦గాజియాంటెప్, టర్కీ ♦బాండుంగ్, ఇండోనేషియా -
'హైదరాబాద్ బిర్యానీ మస్తుంది.. SRH పని పడతం'
ఐపీఎల్ 16వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఇప్పటికే గుజరాత్ ప్లేఆఫ్‌కు చేరుకోగా.. మిగతా మూడు స్థానాల కోసం ఏడు జట్ల మధ్య పోటీ నెలకొంది. అందులో ఆర్సీబీ కూడా ఉంది. మే 18న హైదరాబాద్ వేదికగా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి. ఎస్ఆర్హెచ్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఆర్సీబీకి మాత్రం చాన్స్ ఉంది. కోహ్లి, డుప్లెసిస్, మ్యాక్స్‌వెల్ ఆటను చూడడానికి హైదరాబాద్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఆర్సీబీ హైదరాబాద్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే సిరాజ్ జుబ్లీహిల్స్‌లోని ఫిల్మ్‌నగర్‌లో కొత్త ఇంటిని నిర్మించాడు. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ ఆడేందుకు వచ్చిన ఆర్సీబీ జట్టును సిరాజ్ తన ఇంటికి ఆహ్వానించాడు. సోమవారం ఆర్సీబీ ప్లేయర్లు సిరాజ్ కొత్త ఇంట్లో సందడి చేశారు. కుటుంబంతో ఆనందంగా గడిపిన ఆర్సీబీ ఆటగాళ్లకు సిరాజ్ ఫేమస్హైదరాబాద్ బిర్యానీ తినిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆర్సీబీ యాజమాన్యం ఈ వీడియోనూ షేర్ చేస్తూ ''హైదరాబాద్ బిర్యానీ మస్తుంది.. ఇక ఎస్ఆర్హెచ్ పని పడతాం'' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్లో 12 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ.. 6 మ్యాచ్‌ల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఆర్సీబీ విజయం సాధిస్తే ప్లే ఆప్స్‌కు అర్హత సాధించే ఛాన్స్ ఉంది. Hyderabadi Biryani time! 🥳 The boys took a pitstop at Miyan's beautiful new house last night! 🏡#PlayBold #ನಮ್ಮRCB pic.twitter.com/kEjtB1pQid — Royal Challengers Bangalore (@RCBTweets) May 16, 2023 చదవండి: ప్రతీసారి మనది కాదు సూర్య.. జాగ్రత్తగా ఆడాల్సింది! -
HYD: నయా సాల్ ధమాకా.. చుక్క-ముక్క దుమ్మురేపాయి
ఢిల్లీ/హైదరాబాద్: నయా సాల్కి రోడ్లపై హడావిడి తక్కువగా కనిపించింది. వేడుకలపై పోలీస్ ఆంక్షలు అందుకు ఒక కారణం. అయితే.. ముక్క, మందుతో గప్‌చుప్ మజాలో రాష్ట్ర ప్రజలు ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రమంలో గతేడాది కంటే అదనంగా ఆల్కాహాల్ బిజినెస్ జరగడం గమనార్హం. కోవిడ్ ఆంక్షలు ఏమాత్రం లేకపోవడం, అమ్మకాలకు అదనపు సమయం ఇవ్వడమే ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాళ్లలో ఎక్కువమందిలో.. బ్లడ్ ఆల్కాహాల్ కంటెంట్ 500 ఎంజీ మించి ఉండడం పరిస్థితికి అద్దం పడుతోంది. 4,07,820 బీర్లు, 4,56,228 ఫుల్ బాటిళ్లు.. ఈ లెక్క నగరంలోని మద్యం బాబులు జనవరి 1 పార్టీ పేరుతో తాగేసింది. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 31వ తేదీన మద్యం డిపోల నుంచి రూ.215.74 కోట్ల విలువైన మద్యం సరఫరా అయ్యింది. చివరి వారం మొత్తంగా రూ.1,111.29 కోట్లు విలువైన అమ్మకాలు జరిగాయి.మద్యం దుకాణాలకు.. రెండు లక్షలకు పైగా కేసుల లిక్కర్, లక్షా 30 వేల దాకా బీర్ల కేసులు వెళ్లాయి. గతేడాది అదే తేదీన రూ.171.93 కోట్ల మద్యం అమ్ముడు పోయింది. అంటే.. రూ.43 కోట్లు అదనంగా ఆల్కాహాల్ సేల్ జరిగిందన్నమాట. అలాగే.. గతేడాది చివరి వారంలో రూ.925 కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే.. రూ.185 కోట్లు అదనంగా అన్నమాట. ఇక.. కొత్త సంవత్సరం సందర్భంగా నగరంలో మద్యం విక్రయాలు కనివిని ఎరుగని రికార్డు స్థాయిలో నమోదయ్యింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 76,038 కేసుల లిక్కర్, 33,985 బీర్ల కేసులు అమ్ముడుపోయాయి. అత్యధికంగా 40,655 లిక్కర్ కేసులు, 21,122 కేసుల బీర్లతో.. రంగారెడ్డి జిల్లా పరిధిలో జోరుగా విక్రయాలు జరిగాయి. మూడు జిల్లాల్లో కలిపి రూ.82.07 కోట్ల ఆదాయం వచ్చింది. అందులో.. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే రూ.43.21 కోట్ల ఆదాయం వచ్చింది. దుకాణాలు, బార్లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇవ్వడం ఈ పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా బిర్యానీ హవా కొత్త సంవత్సరం వేడుకల కోసం దేశంలో అత్యధికంగా ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లలో బిర్యానీ హవా స్పష్టంగా కనిపించింది. శనివారం రాత్రి పదిన్నర గంటల దాకా.. ఏకంగా 3.50 లక్షల బిర్యానీ ఆర్డర్లు చేసినట్లు ప్రముఖ ఫుడ్ యాప్ స్విగ్గీ ప్రకటించుకుంది. అదే సమయంలో.. 75.4 శాతం హైదరాబాదీ బిర్యానీకే ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ప్రకటించుకుంది. లక్నో బిర్యానీ, కోల్‌కతా బిర్యానీలు ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. హైదరాబాద్‌లోని ఓ పాపులర్ రెస్టారెంట్ ఏకంగా.. 15వేల కేజీల బిర్యానీని సర్వ్ చేయడం గమనార్హం. -
Garath Wynn Owen: హైదరాబాద్ తిండి తెగ నచ్చేసింది!
ఇంటికొచ్చిన అతిథి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం... నచ్చిన వంట వండి పెట్టడం... భారతీయులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు! మరి.. మన దేశానికో కొత్త అతిథి వస్తే...? వారికేమిష్టమో కూడా తెలుసుకోవాలి కదా... అందుకే.. ‘ఫ్యామిలీ’ గారెత్ ఓవెన్ కు హలో చెప్పింది! ఎవరీయన అనుకునేరు... నిత్యం మీటింగ్‌లు, చర్చల్లో బిజిబిజీగా గడిపే బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఈయన! చిరంజీవి పెట్టిన ఆవకాయ అన్నం రుచినీ.. మిర్చిబజ్జీలు, హైదరాబాద్ బిర్యానీ వెరైటీలనూ నెమరేసుకున్న ఆయన ఇంకా ఏమన్నారంటే.... సమోసా, బోండాలు నచ్చేశాయి ‘‘హైదరాబాద్ వచ్చి రెండు నెలలే అయ్యింది. కానీ.. ఉదయాన్నే ఫ్యామిలీతో కలిసి నడక సాగిస్తూంటా. నేనో భోజనప్రియుడిని. థాయ్‌లాండ్‌లో రెడ్ కర్రీ తదితర స్ట్రీట్‌ఫుడ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశా. హైదరాబాద్ ఫుడ్ కూడా బాగా నచ్చేసింది. ముఖ్యంగా చెప్పాల్సింది బోండాల గురించి! పిల్లలు వాటిని డోనట్లని పిలుస్తున్నారు. సమోసాలు, మిర్చిబజ్జీలూ రుచి చూశా. బోర్ కొట్టినప్పుడల్లా మసాలా చాయ్‌లు లాగించేస్తున్నా. ఇక హైదరాబాదీ బిర్యానీల్లో ఉన్న వెరైటీకి ఇప్పటికే ఫిదా అయిపోయా’’ ఆంధ్ర కారం పరీక్ష పెట్టింది ‘‘ఈమధ్యే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రితో భోంచేస్తున్నా. రకరకాల వంటలు వడ్డించారు. బ్రిటిష్ వాడిని, నా శరీరం అన్నింటినీ బాగానే తట్టుకుంటుందని అనుకున్నా కానీ, అక్కడ వడ్డించిన ఓ వంటకం నిజంగానే నాకు పరీక్ష పెట్టింది. కొంచెం రుచి చూడగానే అర్థమైపోయింది. అది మన తాహతుకు మించి మరీ కారంగా ఉందీ అని. అక్కడితో ఆపేశా. ఏమాటకామాట చెప్పుకోవాలి. మంత్రితో సమావేశం, విందూ రెండూ తృప్తినిచ్చాయి’’ హైదరాబాదీ హడావుడి బాగుంది ‘‘రోజంతా హడావుడిగా ఉండే నగరం తెగనచ్చేసింది. స్ట్రీట్‌ఫుడ్ కోసం లేదా వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఒకచోట నిలబడి చుట్టూ జరుగుతున్న హడావుడిని గమనిస్తూ ఉండిపోవడం చాలా ఇష్టం. కొన్ని రోజుల క్రితం చార్మినార్‌కు వెళ్లా. ఓల్డ్సిటీలోనూ తిరిగా... వెస్ట్ మిడ్‌ల్యాండ్ మేయర్‌తో కలిసి వెళ్లా అక్కడికి! అబ్బో.. ఎంత కళకళలాడుతుంటుందో అక్కడ. భలే బాగుంటుంది. ఇంకో మూడేళ్లు ఇక్కడే ఉంటాను కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలన్నీ తిరగాలి.’’ చిరంజీవి ఆవకాయ అన్నం వడ్డించారు ‘‘సినిమాలు, సంగీతం, నాట్యం వంటివి ఇష్టమైనప్పటికీ హైదరాబాద్‌లో ఇంకా వాటిని పెద్దగా ఆస్వాదించలేదు. కాకపోతే... ఈ మధ్యే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశా. ఆయన నాకు స్వయంగా వడ్డించారు కూడా. అందులో ఆవకాయ బాగా నచ్చింది. నాలుగు గంటలపాటు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నిజం చెప్పాలంటే అతిపెద్ద టాలీవుడ్ స్టార్‌తో గడిపానని అస్సలు అనిపించలేదు’’ నా సైకిల్ వచ్చేస్తోంది ‘‘కోవిడ్ నేర్పిన అతిపెద్ద పాఠం శారీరక వ్యాయామాన్ని అస్సలు మరచిపోవద్దూ అని. నాకూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం అంటే ఇష్టం కూడా. హైదరాబాద్‌లో బోలెడన్ని సైక్లింగ్ గ్రూపులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా నా సైకిల్ కూడా లండన్ నుంచి వస్తోంది. ఆ తరువాత నేనూ హైదరాబాద్ రోడ్లపై సైకిల్లో తిరిగేస్తా. హుస్సేన్ సాగర్ చుట్టూ రౌండ్లు కొట్టేస్తా. ఫిట్నెస్ కోసం నేను చేసే ఇంకో పని పంచింగ్ బ్యాగ్‌తో బాక్సింగ్ చేయడం! నిరాశా, నిస్పృహలను వదిలించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది’’ పిల్లలూ కలిసిపోయారు ‘‘నాకు పదకొండేళ్ల అలిసియా, తొమ్మిదేళ్ల థామస్‌లు ఉన్నారు. ఇక్రిశాట్లో ఉన్న స్కూల్లో చేరారు. ఈ ఏడాది కొంచెం ఆలస్యంగానే స్కూలుకెళ్లారు కానీ.. వెళ్లిన వెంటనే పిల్లలతో కలిసిపోయారు. ఉదయాన్నే ఏడు గంటలకల్లా వాళ్లను స్కూల్‌కు వదిలేస్తూంటాం. కొంచెం దూరమే కానీ.. అక్కడి వాతావరణం బాగా నచ్చింది.’’ -
Ind Vs Aus 3rd T20- Uppal: హైదరాబాద్ బిర్యానీకి రోహిత్ ఫిదా
India Vs Australia T20 Series- 3rd T20- Hyderabad- బంజారాహిల్స్: హైదరాబాద్ బిర్యానీకి భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఫిదా అయ్యారు. ఇండియా–ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ కోసం శనివారం హైదరాబాద్‌కు వచ్చిన రోహిత్ శర్మ జట్టుసభ్యులతో కలిసి బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో బస చేశారు. అయితే మల్కాజ్‌గిరిలో నివసించే భారత ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ఆహ్వానం మేరకు శనివారంరాత్రి రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్, మిగతా కోచ్‌లు, అసిస్టెంట్లతో కలిసి ఆయన ఇంటికి విందుకు వెళ్లారు. గోల్కొండ హోటల్ నుంచి తీసుకొచ్చిన బిర్యానీని రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్, మిగతా సిబ్బంది పసందుగా ఆరగించారు. రుచికరమైన బిర్యానీని వడ్డించిన గోల్కొండ హోటల్ సిబ్బందితో రోహిత్ శర్మ సెల్ఫీ తీసుకున్నారు. ఇక ఆదివారం మూడో టీ20లో ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించిన టీమిండియా సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగే సిరీస్‌కు సన్నద్ధమయ్యే పనిలో పడింది. Winners Are Grinners! ☺️ ☺️ That moment when #TeamIndia Captain @ImRo45 received the #INDvAUS @mastercardindia T20I series trophy 🏆 from the hands of Mr. @ThakurArunS, Treasurer, BCCI. 👏 👏 pic.twitter.com/nr31xBrRBQ — BCCI (@BCCI) September 25, 2022 చదవండి: IND vs AUS 3rd T20: మెరిసిన కోహ్లి, సూర్య కుమార్.. భారత్ భలే గెలుపు IND vs Aus: కార్తీక్‌పై మరోసారి సీరియస్ అయిన రోహిత్!.. కానీ -
బిర్యానీ ప్రియులకు షాక్.. పెరిగిన రేట్లు!
అఫ్గన్ సంక్షోభం హైదరాబాద్ బిర్యానీపై ప్రభావం చూపెడుతోంది. బిర్యానీ రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలను నిజం చేస్తూ.. ఇప్పటికే చాలాచోట్ల రేట్లు పెంపును అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని చాలా చోట్ల ఇప్పటికే బిర్యానీ రేట్లు పెరిగాయి. రేపు మొదటి తారీఖు (సెప్టెంబర్ 1) కావడంతో పెంచిన ధరలను అమలు చేయాలని మెజార్టీ రెస్టారెంట్ల ఓనర్లు నిర్ణయించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిన్న, ఓ మోస్తరు రెస్టారెంట్లు సైతం మినిమమ్ 20 నుంచి 30 రూ. పెంచేశాయి. గరిష్టంగా రూ.100 దాకా పెరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రెస్టారెంట్లు ఇప్పటికే మెనూను ఆన్లైన్ల్లో అప్డేట్ చేశాయి. పెంచిన ధరల్ని పార్శిల్‌కు సైతం వర్తింపజేయనున్నారు. అయితే కొన్ని రెస్టారెంట్లు వాటి ఆన్లైన్ ఆర్డర్లకు తప్ప.. దాదాపు మెజార్టీ హోటల్స్, రెస్టారెంట్లు బిర్యానీ రేట్లను పెంచేశాయి. సింగిల్, డబుల్ పీస్, జంబో, ఫ్యామిలీ ప్యాక్.. ఇలా దాదాపు అన్నింటిపైనా వడ్డింపు మొదలు కానుంది. కొన్ని రెస్టారెంట్లు ఆన్లైన్ బుకింగ్‌పై జీఎస్టీ, ప్యాకింగ్ చార్జీలు, డెలివరీ చార్జీలతో మోత మోగించడం ఇప్పటికే మొదలుపెట్టేశాయి. చిన్న చిన్న బిర్యానీ పాయింట్లు మాత్రం దాదాపు పాత రేట్లకే బిర్యానీని అందిస్తున్నాయి. బిర్యానీతో పాటు కబాబ్, రకరకాల మాంసాహార, శాఖాహార వంటకాల్లో వాడే డ్రై ఫ్రూట్స్, కొన్నిరకాల మసాల దినుసుల్ని అఫ్గనిస్థాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఆ దినుసుల వ్యాపారం మీద ఆధారపడి వేల కుటుంబాలు బతుకుతున్నాయి కూడా. అయితే, తాలిబన్ల ఆక్రమణ తర్వాత.. అక్కడి నుంచి వాటి దిగుమతి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దీంతో మార్కెట్లో వాటి బల్క్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆ ప్రభావం ‘బిర్యానీ’పై పడగా.. రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెప్తున్నారు. తిరిగి యథాస్థితి నెలకొంటే.. అప్పుడు రేట్ల తగ్గింపు గురించి ఆలోచిస్తామని కొందరు వ్యాపారులు అంటున్నారు. చదవండి: అఫ్గన్ సంక్షోభం.. ఇలాగైతే బిర్యానీ రేట్లు పెరిగే ఛాన్స్! -
హైదరాబాద్ బిర్యానీపై తాలిబన్ ఎఫెక్ట్!
ఆఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న పరిస్థితులు ఇలాగే మరికొంత కాలం కొనసాగితే బిర్యానీ రేట్లు పెంచక తప్పదంటున్నారు హైదరాబాద్ హోటళ్ల నిర్వాహకులు. తాలిబన్ల వల్ల చెలరేగిన అల్లకల్లోలం త్వరగా సద్దుమణగకపోతే బిర్యానీ భారం కావడం ఖాయం అంటున్నారు. నోరూరించే బిర్యానీ కమ్మని నోరూరించే హైదరాబాద్ బిర్యానీపై తాలిబన్ ప్రభావం పడనుంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే వన్నె తెచ్చిన బిర్యానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. జిల్లా కేంద్రాలతో పాటు ఓ మోస్తరు పట్టణాల్లో సైతం బిర్యానీ సెంటర్లు వెలిశాయి. సెలవు రోజులు వస్తే ఇళ్లలో సైతం బిర్యాణీ ఘుమఘుమలాడుతోంది. అయితే త్వరలో బిర్యానీ ధర పెరగడంతో లేక రుచిలో తేడా కావడంతో తప్పదంటున్నారు హోటల్ నిర్వహాకులు. రుచి కోసం డ్రై ఫ్రూట్స్ బిర్యానీ తయారీలో మాంసం, బాస్మతి రైస్లే ప్రధానమైనా ఆ వంటకు అద్భుతమైన రుచి తేవడంలో డ్రై ఫ్రూట్స్‌ది కీలక పాత్ర. ఎండుద్రాక్ష, ఆల్మండ్, అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పులను బిర్యానీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్‌లో సింహభాగం అఫ్గనిస్తాన్ నుంచే దిగుమతి అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పేరున్న పెద్ద హోటళ్లు బిర్యానీ తయారీలో సగటున యాభై కేజీల వరకు బాదం పప్పును వినియోగిస్తున్నాయి. ఇదే స్థాయిలో మిగిలిన డ్రై ఫ్రూట్స్ అయిన జీడిపప్పు, కిస్మిస్ల వినియోగం కూడా ఉంటోంది. హాట్ న్యూస్ : కొండెక్కిన కోడి ఇప్పటికైతే ఓకే హైదరాబాద్‌లో బిర్యానీకి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొందరు అఫ్గన్ వ్యాపారులు హైదరాబాద్‌లోనే ఉంటూ ఎండు పళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఎండు పళ్లను అఫ్గన్ నుంచి తెప్పించి ఇక్కడి హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు డ్రై ఫ్రూట్ నిల్వలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే ప్రస్తుతం ఇక్కడి వ్యాపారులకు అఫ్గన్‌లోని ఎగుమతి దారులతో సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్ల రాకతో అక్కడ అశాంతి నెలకొంది. రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే డ్రై ఫ్రూట్స్ కొరత ఎదుర్కొక తప్పదని ఎండు పళ్ల వ్యాపారులు అంటున్నారు. పన్నులు పెరిగే ఛాన్స్ ఇప్పటి వరకు ఇండియా, ఆఫ్గన్ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగుండేవని, పన్నులు కూడా తక్కువగా ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. తాలిబన్ల పాలనలోకి వచ్చాక డ్రై ఫ్రూట్స్ ఎగుమతులపై ఆంక్షలు పెట్టినా, పన్నులు పెంచినా ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో ఉన్న బిర్యానీ సెంటర్లకు సైతం డ్రై ఫ్రూట్ ఇబ్బందులు తప్పేలా లేవు. ధర పెంచడమే మార్గం కోవిడ్ ఆంక్షల కారణంగా బిర్యానీ వినియోగం తగ్గిపోయిందని, ఇప్పుడిప్పుడే మార్కెట్ కోలుకుంటుండగా ఆఫ్గన్ సంక్షోభం వచ్చిపడందంటున్నారు హోటల్ నిర్వాహకులు. డ్రై ఫ్రూట్ ధరలు పెంచితే బిర్యానీ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఫేమస్ అయిన హోటల్ నిర్వాహకులు పేర్కొంటుండగా... ఎండు పళ్ల వాడకం తగ్గించేస్తామంటున్నారు చిన్న బిర్యానీ సెంటర్ల నిర్వాహకులు -సాక్షి, వెబ్‌డెస్క్