ఆఫ్గనిస్తాన్‌లో కొనసాగుతున్న పరిస్థితులు ఇలాగే మరికొంత కాలం కొనసాగితే బిర్యానీ రేట్లు పెంచక తప్పదంటున్నారు హైదరాబాద్ హోటళ్ల నిర్వాహకులు. తాలిబన్ల వల్ల చెలరేగిన అల్లకల్లోలం త్వరగా సద్దుమణగకపోతే బిర్యానీ భారం కావడం ఖాయం అంటున్నారు.
నోరూరించే బిర్యానీ
కమ్మని నోరూరించే హైదరాబాద్ బిర్యానీపై తాలిబన్ ప్రభావం పడనుంది. ఒకప్పుడు హైదరాబాద్ నగరానికే వన్నె తెచ్చిన బిర్యానీ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది. జిల్లా కేంద్రాలతో పాటు ఓ మోస్తరు పట్టణాల్లో సైతం బిర్యానీ సెంటర్లు వెలిశాయి. సెలవు రోజులు వస్తే ఇళ్లలో సైతం బిర్యాణీ ఘుమఘుమలాడుతోంది. అయితే త్వరలో బిర్యానీ ధర పెరగడంతో లేక రుచిలో తేడా కావడంతో తప్పదంటున్నారు హోటల్ నిర్వహాకులు.
రుచి కోసం డ్రై ఫ్రూట్స్
బిర్యానీ తయారీలో మాంసం, బాస్మతి రైస్‌లే ప్రధానమైనా ఆ వంటకు అద్భుతమైన రుచి తేవడంలో డ్రై ఫ్రూట్స్‌ది కీలక పాత్ర. ఎండుద్రాక్ష, ఆల్మండ్, అత్తి, జీడిపప్పు, పిస్తాపప్పులను బిర్యానీ తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఈ డ్రై ఫ్రూట్స్‌లో సింహభాగం అఫ్గనిస్తాన్ నుంచే దిగుమతి అవుతున్నాయి. హైదరాబాద్ నగరంలో పేరున్న పెద్ద హోటళ్లు బిర్యానీ తయారీలో సగటున యాభై కేజీల వరకు బాదం పప్పును వినియోగిస్తున్నాయి. ఇదే స్థాయిలో మిగిలిన డ్రై ఫ్రూట్స్ అయిన జీడిపప్పు, కిస్మిస్‌ల వినియోగం కూడా ఉంటోంది.
హాట్ న్యూస్ : కొండెక్కిన కోడి
ఇప్పటికైతే ఓకే
హైదరాబాద్‌లో బిర్యానీకి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో కొందరు అఫ్గన్ వ్యాపారులు హైదరాబాద్‌లోనే ఉంటూ ఎండు పళ్ల వ్యాపారం నిర్వహిస్తున్నారు. భారీ ఎత్తున ఎండు పళ్లను అఫ్గన్ నుంచి తెప్పించి ఇక్కడి హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు డ్రై ఫ్రూట్ నిల్వలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అయితే ప్రస్తుతం ఇక్కడి వ్యాపారులకు అఫ్గన్‌లోని ఎగుమతి దారులతో సంబంధాలు తెగిపోయాయి. తాలిబన్ల రాకతో అక్కడ అశాంతి నెలకొంది. రవాణా వ్యవస్థ స్థంభించి పోయింది. ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగితే డ్రై ఫ్రూట్స్ కొరత ఎదుర్కొక తప్పదని ఎండు పళ్ల వ్యాపారులు అంటున్నారు.
పన్నులు పెరిగే ఛాన్స్
ఇప్పటి వరకు ఇండియా, ఆఫ్గన్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు బాగుండేవని, పన్నులు కూడా తక్కువగా ఉన్నాయని వ్యాపారులు అంటున్నారు. తాలిబన్ల పాలనలోకి వచ్చాక డ్రై ఫ్రూట్స్ ఎగుమతులపై ఆంక్షలు పెట్టినా, పన్నులు పెంచినా ఇబ్బందులు తప్పవంటున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో ఉన్న బిర్యానీ సెంటర్లకు సైతం డ్రై ఫ్రూట్ ఇబ్బందులు తప్పేలా లేవు.
ధర పెంచడమే మార్గం
కోవిడ్ ఆంక్షల కారణంగా బిర్యానీ వినియోగం తగ్గిపోయిందని, ఇప్పుడిప్పుడే మార్కెట్ కోలుకుంటుండగా ఆఫ్గన్ సంక్షోభం వచ్చిపడందంటున్నారు హోటల్ నిర్వాహకులు. డ్రై ఫ్రూట్ ధరలు పెంచితే బిర్యానీ ధరలు పెంచడం తప్ప మరో మార్గం లేదని ఫేమస్ అయిన హోటల్ నిర్వాహకులు పేర్కొంటుండగా... ఎండు పళ్ల వాడకం తగ్గించేస్తామంటున్నారు చిన్న బిర్యానీ సెంటర్ల నిర్వాహకులు
-సాక్షి, వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment