ఇంటికొచ్చిన అతిథి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం... నచ్చిన వంట వండి పెట్టడం... భారతీయులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు! మరి.. మన దేశానికో కొత్త అతిథి వస్తే...? వారికేమిష్టమో కూడా తెలుసుకోవాలి కదా... అందుకే.. ‘ఫ్యామిలీ’ గారెత్ ఓవెన్ కు హలో చెప్పింది!
ఎవరీయన అనుకునేరు... నిత్యం మీటింగ్‌లు, చర్చల్లో బిజిబిజీగా గడిపే బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ ఈయన!
చిరంజీవి పెట్టిన ఆవకాయ అన్నం రుచినీ.. మిర్చిబజ్జీలు, హైదరాబాద్ బిర్యానీ వెరైటీలనూ నెమరేసుకున్న ఆయన ఇంకా ఏమన్నారంటే.... సమోసా, బోండాలు నచ్చేశాయి
‘‘హైదరాబాద్ వచ్చి రెండు నెలలే అయ్యింది. కానీ.. ఉదయాన్నే ఫ్యామిలీతో కలిసి నడక సాగిస్తూంటా. నేనో భోజనప్రియుడిని. థాయ్‌లాండ్‌లో రెడ్ కర్రీ తదితర స్ట్రీట్‌ఫుడ్‌ను కూడా బాగా ఎంజాయ్ చేశా. హైదరాబాద్ ఫుడ్ కూడా బాగా నచ్చేసింది. ముఖ్యంగా చెప్పాల్సింది బోండాల గురించి! పిల్లలు వాటిని డోనట్‌లని పిలుస్తున్నారు. సమోసాలు, మిర్చిబజ్జీలూ రుచి చూశా. బోర్ కొట్టినప్పుడల్లా మసాలా చాయ్‌లు లాగించేస్తున్నా. ఇక హైదరాబాదీ బిర్యానీల్లో ఉన్న వెరైటీకి ఇప్పటికే ఫిదా అయిపోయా’’
ఆంధ్ర కారం పరీక్ష పెట్టింది
‘‘ఈమధ్యే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రితో భోంచేస్తున్నా. రకరకాల వంటలు వడ్డించారు. బ్రిటిష్ వాడిని, నా శరీరం అన్నింటినీ బాగానే తట్టుకుంటుందని అనుకున్నా కానీ, అక్కడ వడ్డించిన ఓ వంటకం నిజంగానే నాకు పరీక్ష పెట్టింది. కొంచెం రుచి చూడగానే అర్థమైపోయింది. అది మన తాహతుకు మించి మరీ కారంగా ఉందీ అని. అక్కడితో ఆపేశా. ఏమాటకామాట చెప్పుకోవాలి. మంత్రితో సమావేశం, విందూ రెండూ తృప్తినిచ్చాయి’’
హైదరాబాదీ హడావుడి బాగుంది
‘‘రోజంతా హడావుడిగా ఉండే నగరం తెగనచ్చేసింది. స్ట్రీట్‌ఫుడ్ కోసం లేదా వాకింగ్‌కు వెళ్లినప్పుడు ఒకచోట నిలబడి చుట్టూ జరుగుతున్న హడావుడిని గమనిస్తూ ఉండిపోవడం చాలా ఇష్టం. కొన్ని రోజుల క్రితం చార్మినార్‌కు వెళ్లా. ఓల్డ్‌సిటీలోనూ తిరిగా... వెస్ట్ మిడ్‌ల్యాండ్ మేయర్‌తో కలిసి వెళ్లా అక్కడికి! అబ్బో.. ఎంత కళకళలాడుతుంటుందో అక్కడ. భలే బాగుంటుంది. ఇంకో మూడేళ్లు ఇక్కడే ఉంటాను కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రాంతాలన్నీ తిరగాలి.’’
చిరంజీవి ఆవకాయ అన్నం వడ్డించారు
‘‘సినిమాలు, సంగీతం, నాట్యం వంటివి ఇష్టమైనప్పటికీ హైదరాబాద్‌లో ఇంకా వాటిని పెద్దగా ఆస్వాదించలేదు. కాకపోతే... ఈ మధ్యే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని కలిశా. ఆయన నాకు స్వయంగా వడ్డించారు కూడా. అందులో ఆవకాయ బాగా నచ్చింది. నాలుగు గంటలపాటు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నిజం చెప్పాలంటే అతిపెద్ద టాలీవుడ్ స్టార్‌తో గడిపానని అస్సలు అనిపించలేదు’’
నా సైకిల్ వచ్చేస్తోంది
‘‘కోవిడ్ నేర్పిన అతిపెద్ద పాఠం శారీరక వ్యాయామాన్ని అస్సలు మరచిపోవద్దూ అని. నాకూ శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం అంటే ఇష్టం కూడా. హైదరాబాద్‌లో బోలెడన్ని సైక్లింగ్ గ్రూపులు ఉన్నట్లు తెలిసింది. ఈ నెలాఖరులోగా నా సైకిల్ కూడా లండన్ నుంచి వస్తోంది. ఆ తరువాత నేనూ హైదరాబాద్ రోడ్లపై సైకిల్‌లో తిరిగేస్తా. హుస్సేన్ సాగర్ చుట్టూ రౌండ్లు కొట్టేస్తా. ఫిట్‌నెస్ కోసం నేను చేసే ఇంకో పని పంచింగ్ బ్యాగ్‌తో బాక్సింగ్ చేయడం! నిరాశా, నిస్పృహలను వదిలించుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది ఇది’’
పిల్లలూ కలిసిపోయారు
‘‘నాకు పదకొండేళ్ల అలిసియా, తొమ్మిదేళ్ల థామస్‌లు ఉన్నారు. ఇక్రిశాట్‌లో ఉన్న స్కూల్‌లో చేరారు. ఈ ఏడాది కొంచెం ఆలస్యంగానే స్కూలుకెళ్లారు కానీ.. వెళ్లిన వెంటనే పిల్లలతో కలిసిపోయారు. ఉదయాన్నే ఏడు గంటలకల్లా వాళ్లను స్కూల్‌కు వదిలేస్తూంటాం. కొంచెం దూరమే కానీ.. అక్కడి వాతావరణం బాగా నచ్చింది.’’
Comments
Please login to add a commentAdd a comment