రక్తదాతలకు పంపిణీ చేసిన బీమా కార్డుతో గ్యారెత్, మెగాస్టార్ చిరంజీవి
బంజారాహిల్స్ (హైదరాబాద్): చిరంజీవి బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి అందరికీ స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తారని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గ్యారెత్ విన్ వోవెన్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంకులో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రక్తదానం చేస్తూ పలువురు ప్రాణాలు కాపాడుతున్న 1,500 మంది రక్తదాతలకు రూ.7 లక్షల విలువ చేసే బీమా కార్డులతో పాటు బ్లడ్ డోనర్స్ గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న చిరంజీవి అందరి హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవిగానే మిగిలిపోతారన్నారు. ప్రతిష్టాత్మకమైన ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్’–2022 అవార్డును గెలుచుకున్న చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. బ్రిటన్ ప్రభుత్వంతో తెలుగు సినీ పరిశ్రమ గొప్ప సంబంధాలు నెలకొల్పేందుకు చిరంజీవితో కలిసి పని చేయాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.
ఇప్పటివరకు 10లక్షలయూనిట్ల రక్తదానం
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ను సందర్శించడం గొప్ప గౌరవమని, ఎంతోమంది రక్తదాతలకు ఇది మరింత స్ఫూర్తినిస్తుందని చిరంజీవి చెప్పారు. ఈ బ్లడ్ బ్యాంకులో ఇప్పటివరకు 10 లక్షల యూనిట్ల రక్తదానం చేశామని, నేత్ర బ్యాంక్ ద్వారా 9,060 మందికి కంటిచూపు పునరుద్ధరించామని వెల్లడించారు. 32 జిల్లాల్లోని సీసీటీ ఆక్సిజన్ బ్యాంకుల ద్వారా ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా అందుబాటులోకి తెచ్చామని కరోనా సమయంలో ఆక్సిజన్ కొరతను అధిగమించడంలో ఇది సహాయ పడిందన్నారు.
రక్తం దొరకక తన దూరపు బంధువు ఒకరు చనిపోయినప్పుడు పడ్డ ఆవేదన నుంచే బ్లడ్ బ్యాంకు ఆలోచన వచ్చిందని వివరించారు. బ్లడ్‌బ్యాంకుకు అవసరమైన సాంకేతిక నిపుణుల కొరత ఉండటం వల్లే ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయలేకపోతున్నానమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిచోట తన అభిమానులు చెప్పగానే రక్తదానం చేస్తున్నారని..అభిమానులున్న చోట బ్లడ్ బ్యాంకులు ఉన్నట్లేనని వెల్లడించారు. ఇటీవల ఓ తల్లి తన బాబు(8)కు ప్లేట్‌లెట్స్‌ను తన అభిమానులు ఇచ్చి ప్రాణాలు కాపాడారని ఓ సందేశం పంపినప్పుడు తనకు చాలా ఆనందం కలిగిందన్నారు. కార్యక్రమంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ సీఈవో డాక్టర్ మాధవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment