స్ఫూర్తి
నెరవేరిన ‘హై’డ్రీమ్
చెత్తను సేకరించే అమ్మాయి అధికారిణి అయితే... కలలను నిజం చేసుకోవడానికి స్థాయి అక్కర్లేదు అని చూపుతోంది హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో పిల్లిగుడిసెల బస్తీ వాసి అరిపిన జయలక్ష్మి. బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ హోదాలో ఇటీవల ఒక రోజు బాధ్యతలు నిర్వహించి, వివిధ శాఖలను సందర్శించి, అక్కడి పనితీరును అడిగి తెలుసుకుంది. ఈ సందర్భంగా అందుకున్న గౌరవాన్నే కాదు, తెలుసుకున్న విశేషాల గురించీ పంచుకుంది.
‘‘మూడు సంవత్సరాల నుంచి ఈ పోటీలో ఎంపిక కావడానికి ప్రయత్నిస్తున్నాను. 2021లో రన్నరప్ వచ్చింది. ఈ ఏడాది ఒక రోజు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్‌కి ఎంపికయ్యాను అని తెలిసి, చాలా ఆనందించాను.
రోజంతా కార్యక్రమాలతో బిజీ...
ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా నేను సూట్ వేసుకొని అధికారిణిగా మా బస్తీ నుంచి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ సర్‌తో కలిసి బయల్దేరాను. మొదటగా రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసును సందర్శించాం. అక్కడ ఐఎఫ్‌ఎస్ ఆఫీసర్ నీరజ జొన్నలగడ్డ గారితో మాట్లాడాను. రీజినల్ పాస్‌పోర్ట్ ఆఫీసు మొత్తం తిప్పి చూపించారు. అక్కడ జరిగే వర్క్ గురించి అంతా తెలుసుకున్నాను. అక్కణ్ణుంచి... మై ఛాయిస్ ఫౌండేషన్‌కు వెళ్లాం. గృహహింస, ట్రాఫికింగ్ పైన ఆ సంస్థ పనిచేస్తుంది.
పది రాష్ట్రాల్లో వారు చేస్తున్న పని గురించి తెలుసుకున్నాం. ఆ తర్వాత వి–హబ్ కి వెళ్లాం. తెలంగాణ మహిళలు వ్యాపారులుగా ఎదిగేందుకు మద్దతునిస్తున్నారు. వాళ్లు ఏ విధంగా వారి ఆలోచనలు ముందుకు తీసుకెళుతున్నారో చెప్పారు. నా గురించి, నా ఫ్యూచర్ ΄్లాన్స్ గురించి వాళ్లూ అడిగారు. ఉమెన్ స్టార్టప్స్ గురించి అడిగి తెలుసుకున్నాను. వారితో కలిసి లంచ్ చేశాం. మంచి ఇంటరాక్టివ్ సెషన్ మా మధ్య జరిగింది.
అక్కణ్ణుంచి.. డజన్ ఫౌండేషన్‌కి వెళ్లి, మహిళా ఉద్యోగులతో చర్చలు జరిపాం. టెక్ రంగంలో మహిళల నైట్ షిప్ట్‌లు, పేమెంట్ విషయంలో జెండర్ బయాస్డ్ సమస్యలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నాను. ఆ తర్వాత సీనియర్ సిటిజెన్స్ కోసం పనిచేసే ఫాతిమా ఫౌండేషన్‌ను సందర్శించాం.
చెత్త సేకరణ మా వృత్తి
మా అమ్మానాన్నలతో పాటు కలిసి మేం హైదరాబాద్‌లో 400 ఇళ్లలో చెత్త సేకరిస్తుంటాం. ఉదయం 5 గంటలకు మా పని మొదలవుతుంది. 7–8 గంటల వరకు పని ముగించుకొని, కాలేజీకి వెళతాను. స్కూల్ రోజుల నుంచి అమ్మానాన్నలతో పాటు నేను, మా చెల్లెలు, అన్నయ్య కూడా ఇదే పనిలో ఉంటున్నాం. 8వ తరగతిలో ఉన్నప్పుడు మౌంట్‌ఫోర్ట్ సోషల్ ఇన్‌స్టిట్యూట్ చిల్డ్రన్ పార్లమెంట్ అనేప్రోగ్రామ్ పెట్టింది.
పది బస్తీల నుంచి పిల్లలను తీసుకొని ఈప్రోగ్రామ్ చేసేది. నేను అందులో పాల్గొన్నాను. 9వ తరగతిలో హైదరాబాద్ చిల్డ్రన్ పార్లమెంట్‌కు పీఎమ్‌గా ఉన్నాను. మా బస్తీ పిల్లలందరం సమస్యల మీద మాట్లాడుకుని అధికారులను కలిసేవాళ్లం. టెన్త్ క్లాస్‌లో ఉన్నప్పుడు సాయంకాలాలు మా బస్తీలో ఉన్న ముప్పై మంది పిల్లలకు పాఠాలు చెబుతుండేదాన్ని. కోవిడ్ సమయంలో యునిసెఫ్ నుంచి వాలెంటీర్‌గా పనిచేశాను.
ఆకలి విలువ.. నిద్ర విలువ
మా కమ్యూనిటీలో పిల్లలు ఉదయం టిఫిన్ చేయకుండానే స్కూళ్లకు వెళ్లిపోతుంటారు. మా చిన్నప్పటి నుంచి ఆకలి విలువ, నిద్ర విలువ మాకు తెలుసు. అందుకే, అధికారులను కలిసి విషయం చెబితే బస్తీల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ముఖ్యంగా ఐఏఎస్ దివ్యా దేవరాజన్ మేడమ్ నాకు ఎన్నో విషయాల్లో అడ్వైజ్ చేస్తుంటారు. బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గురించి అలాగే నాకు తెలిసింది.
అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒకరోజు డిప్యూటీ హై కమిషన్ 2017 నుంచి ఏటా పోటీలు నిర్వహిస్తుంది. తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించిన పోటీల్లో ఈ ఏడాది నేను విజేతగా నిలిచాను. అంతకు ముందు ఢిల్లీలో ఛేంజ్ మేకర్ అవార్డ్ తీసుకున్నాను. గాంధీ కింగ్ స్కాలర్‌షిప్‌కి దేశం మొత్తంలో పది మంది సెలక్ట్ అయితే వారిలో నేనొకరిని. ఇందులో భాగంగా జూన్ 2023లో అమెరికా వెళ్లి వచ్చాను. ఈ ఏడాది మహిళా శక్తి పురస్కారం కూడా అందుకున్నాను.
నేను పుట్టి పెరిగింది గార్బేజ్ కమ్యూనిటీలో. అలాంటిది ఉదయం నుంచి డిస్కవర్ వెహికల్‌లో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ ఓవెన్ సర్‌తో కలిసి ప్రయాణించడం సాధారణ విషయం కాదనిపించింది. యుపీఎస్సీ సాధించి, ఆఫీసర్ హోదాను పొందితే ఇంకా ఎన్నో మంచి పనులు చేయచ్చు. దానికి ముందు పై అధికారులు ఎలా ఉంటారు.. ఎలా వర్క్ చేస్తారు అనేవి స్వయంగా కలిసి తెలుసుకున్నాను అనిపించింది. మా కమ్యూనిటీని అభివృద్ధి చేసేంతగా ఎదగాలన్నది నా లక్ష్యం’’ అని వివరించింది జయలక్ష్మి.
నా పనిని నేను ప్రేమిస్తాను..
చెత్త సేకరిస్తామని ‘ఆ వాసన ను ఎలా భరిస్తావు’ అని మా క్లాస్‌మేట్స్ కొందరు అడిగేవారు. చాలా వరకు జాలి చూపేవారు. కానీ నేను మా పనిని ప్రేమిస్తాను. అమ్మా నాన్నా మా చిన్నప్పటి నుంచి అదే చెప్పేవారు. నాకు మద్దతుగా నిలిచే ఫ్రెండ్స్ ఉన్నారు. లెక్చరర్స్ నుంచి చాలా సపోర్ట్ ఉంది. అమ్మకి నా పట్టుదల, నేను చేస్తున్న పనులంటే చాలా ఇష్టం. అన్నయ్య డిగ్రీ పూర్తయ్యింది, చెల్లి డిగ్రీ చేస్తోంది. అమ్మానాన్నలను చూసుకునేలా, మా కమ్యూనిటీని బాగు చేసేలా ఉన్నత జీవితాల్లో స్థిరపడాలన్నదే మా కల.
– అరిపిన జయలక్ష్మి
మాటల్లో వర్ణించలేను
మా కమ్యూనిటీ, నేనుండే బస్తీ వాతావరణం వేరు. అలాంటిది, ఒక రోజంతా ఆఫీసర్‌గా ఉండటం అనేది నాకు దక్కిన అరుదైన అవకాశం. ఉదయం నుంచి డిస్కవరీ వెహికిల్‌లో కూర్చొని రోజంతా పెద్ద పెద్ద అధికారులతో చర్చిస్తూ తిరగడం, నా జీవితంలో ఓ గొప్ప రోజు. మాటల్లో వర్ణించలేను. బ్రిటిష్ హై కమిషనర్ మా బస్తీకి వచ్చి, నా చుట్టూ ఉన్న పరిస్థితులను చూశారు. మా బస్తీవాసులతో మాట్లాడారు. వాళ్లందరి సమక్షంలో నాకు సర్టిఫికెట్ ఇచ్చారు.
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment