అఫ్గన్ సంక్షోభం హైదరాబాద్ బిర్యానీపై ప్రభావం చూపెడుతోంది. బిర్యానీ రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలను నిజం చేస్తూ.. ఇప్పటికే చాలాచోట్ల రేట్లు పెంపును అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని చాలా చోట్ల ఇప్పటికే బిర్యానీ రేట్లు పెరిగాయి. రేపు మొదటి తారీఖు (సెప్టెంబర్ 1) కావడంతో పెంచిన ధరలను అమలు చేయాలని మెజార్టీ రెస్టారెంట్ల ఓనర్లు నిర్ణయించారు.
ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిన్న, ఓ మోస్తరు రెస్టారెంట్‌లు సైతం మినిమమ్ 20 నుంచి 30 రూ. పెంచేశాయి. గరిష్టంగా రూ.100 దాకా పెరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రెస్టారెంట్లు ఇప్పటికే మెనూను ఆన్‌లైన్‌ల్లో అప్‌డేట్ చేశాయి. పెంచిన ధరల్ని పార్శిల్‌కు సైతం వర్తింపజేయనున్నారు. అయితే కొన్ని రెస్టారెంట్లు వాటి ఆన్‌లైన్ ఆర్డర్‌లకు తప్ప.. దాదాపు మెజార్టీ హోటల్స్, రెస్టారెంట్లు బిర్యానీ రేట్లను పెంచేశాయి. సింగిల్, డబుల్ పీస్, జంబో, ఫ్యామిలీ ప్యాక్.. ఇలా దాదాపు అన్నింటిపైనా వడ్డింపు మొదలు కానుంది. కొన్ని రెస్టారెంట్లు ఆన్‌లైన్ బుకింగ్‌పై జీఎస్టీ, ప్యాకింగ్ చార్జీలు, డెలివరీ చార్జీలతో మోత మోగించడం ఇప్పటికే మొదలుపెట్టేశాయి. చిన్న చిన్న బిర్యానీ పాయింట్లు మాత్రం దాదాపు పాత రేట్లకే బిర్యానీని అందిస్తున్నాయి.
బిర్యానీతో పాటు కబాబ్, రకరకాల మాంసాహార, శాఖాహార వంటకాల్లో వాడే డ్రై ఫ్రూట్స్, కొన్నిరకాల మసాల దినుసుల్ని అఫ్గనిస్థాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఆ దినుసుల వ్యాపారం మీద ఆధారపడి వేల కుటుంబాలు బతుకుతున్నాయి కూడా. అయితే, తాలిబన్ల ఆక్రమణ తర్వాత.. అక్కడి నుంచి వాటి దిగుమతి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దీంతో మార్కెట్‌లో వాటి బల్క్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆ ప్రభావం ‘బిర్యానీ’పై పడగా.. రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెప్తున్నారు. తిరిగి యథాస్థితి నెలకొంటే.. అప్పుడు రేట్ల తగ్గింపు గురించి ఆలోచిస్తామని కొందరు వ్యాపారులు అంటున్నారు.
చదవండి: అఫ్గన్ సంక్షోభం.. ఇలాగైతే బిర్యానీ రేట్లు పెరిగే ఛాన్స్!
Comments
Please login to add a commentAdd a comment