అఫ్గాన్‌లో తాలిబన్ల ఆదేశాలు
కాబూల్: అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ పాలకులు మహిళలకు వ్యతిరేకంగా మరో నిర్ణయం తీసుకున్నారు. తమ దేశ మహిళలు పనిచేసే జాతీయ, విదేశీ ప్రభుత్వేతర సంస్థలన్నిటినీ మూసివేయనున్నట్లు సోమవారం ప్రకటించారు. ఇస్లాం సిద్ధాంతాల ప్రకారం ధరించాల్సిన హిజాబ్‌ను ఆయా సంస్థల్లోని అఫ్గాన్ మహిళలు ధరించకపోవడమే ఇందుకు కారణమన్నారు. ఆర్థిక శాఖ ఆదివారం రాత్రి ‘ఎక్స్’లో ఈ విషయం వెల్లడించింది. తమ ఉత్తర్వులను బేఖాతరు చేసే సంస్థల లైసెన్సులను రద్దు చేస్తామని, కార్యకలాపాలను నిలిపివేస్తామని కూడా అందులో హెచ్చరించింది.
నాన్ గవర్నమెంటల్ సంస్థల రిజిసే్ట్రషన్, సమన్వయం, నిర్వహణ, పర్యవేక్షణ సహా అన్ని కార్యకలాపాల బాధ్యత తమదేనని స్పష్టం చేసింది. తాలిబాన్ నియంత్రణలో లేని సంస్థలు అన్నిటిలోనూ మహిళలు పనిచేయడం ఆపేయాలని మరోసారి హుకుం జారీ చేసింది. అత్యవసరమైన మానవతా సాయం అందించే కార్యక్రమాల్లోనూ మహిళల ప్రాతినిథ్యాన్ని తాలిబన్లు అడ్డుకుంటున్నారని ఇటీవల ఐరాస సైతం ఆరోపించడం గమనార్హం. బాలికలు ఆరో గ్రేడ్ మించి చదువుకోరాదని, బహిరంగంగా కనిపించే విధుల్లో పాల్గొనరాదని ఇప్పటికే తాలిబన్ పాలకులు నిషేధం విధించడం తెలిసిందే.
కిటికీల నుంచి మహిళలు కనిపించొద్దు
తాలిబన్ నేత హిబతుల్లా అఖుంద్‌జాదా మరో తాఖీదు జారీ చేశారు. మహిళలు, నిలబడి లేదా కూర్చున్నట్లుగా కనబడేలా భవనాలకు కిటికీలు ఉండరాదన్నారు. కొత్తగా నిర్మించే వాటితోపాటు ఇప్పటికే ఉన్న భవనాలకు సైతం ఈ నిబంధన వర్తిస్తుందన్నారు. వరండాలు లేదా వంటగదులు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దన్నారు. ఒక వేళ కిటికీలుంటే భవన యజమాని ఆ స్థానంలో గోడను నిర్మించడం లేదా ఏదైనా అడ్డుగా ఉంచడం చేయాలన్నారు. నివాస భవనాల్లోపలి భాగం కనిపించేలా కొత్తగా భవన నిర్మాణం చేయరాదని ఆయన మున్సిపల్, ఇతర అధికారులకు సైతం నిర్దేశించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment