విశ్లేషణ
అమెరికా నాయకత్వంలోని సంకీర్ణ దళాలు 2021లో అఫ్గానిస్తాన్‌ను వీడిన తర్వాత ఆ దేశాన్ని రెండోసారి హస్తగతం చేసుకున్న తాలిబన్... ప్రస్తుతం భద్రతా పరంగా పాకిస్తాన్‌కు అత్యంత ముప్పుగా మారింది. ఒకప్పుడు అఫ్గానిస్తాన్‌లో తమ వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాకిస్తాన్ మిలిటరీ, నిఘా సంస్థలు తాలిబన్లకు శిక్షణ ఇచ్చి వారిని మరింత బలపడేలా చేశాయి. సోవియట్ యూనియన్ దళాల ఉపసంహరణ తర్వాత రాజకీయ అనిశ్చితి మధ్య అఫ్గానిస్తాన్‌ను పాలిస్తున్న బుర్హనుద్దీన్ రబ్బానీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలదోసి 1996లో తాలిబన్లు ఆ దేశాన్ని హస్తగతం చేసు కున్నారు. అప్పటినుండి 2001లో అమెరికాలోని ట్విన్ టవర్స్‌పై దాడి తర్వాత అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు అఫ్గానిస్తాన్‌లోని తాలిబన్ ప్రభుత్వాన్ని కూలదోసి హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఏర్పడే దాకా, తాలిబన్లతో పాకిస్తాన్ సత్సంబంధాలు నెరిపింది.
వివాదాలు కూడా పట్టనంతగా...
ఈ కాలంలో తాలిబన్ ప్రభుత్వం, పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఎంతలా పెనవేసుకు పోయాయంటే, రెండు దేశాల మధ్య 1947 నుండి ఉన్న సరిహద్దు వివాదాలను పక్కన పెట్టేంతగా. ముఖ్యంగా 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయించిన 2,640 కిలోమీటర్ల పొడవైన డ్యూరాండ్ లైన్ వల్ల దశాబ్దాలుగా ఏర్పడిన సంఘర్షణాత్మక వైఖరులను కూడా మరిచిపోయేంతగా. తాలిబన్‌తో సహా అఫ్గానిస్తాన్‌లో ఏర్పడిన అన్ని ప్రభుత్వాలదీ డ్యూరాండ్ లైన్ మీద ఒకే వైఖరి. వాటి వాదన ప్రకారం, ఇది సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూ జాతి ప్రజలను వేరుచేయడమే కాకుండా, శతాబ్దాలుగా ఉన్న సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక సంబంధాలను దెబ్బతీస్తోంది.
పాకిస్తాన్ మాత్రం ఈ లైన్ చట్టబద్ధత కలిగిన అధికారిక సరి హద్దుగా భావిస్తోంది. తాలిబన్ తన మొదటి దశ పాలనలో ఎక్కు వగా అఫ్గానిస్తాన్‌ను ఏకీకృతం చేయడంపై, తన అధికార పరిధిని విస్తరించడంపై దృష్టి కేంద్రీకరించింది. తాలిబన్‌కు కావలసిన కీలక మైన సైనిక, ఆర్థిక, దౌత్య సహాయాలను పాక్ చేస్తుండటంతో సరి హద్దు సమస్యలను లేవనెత్తి పాకిస్తాన్ ఆగ్రహానికి గురికాకూడదనే భయంతో తాలిబన్ కూడా సరిహద్దు విషయాన్ని పక్కన పెట్టింది. సరిహద్దులకు ఇరువైపులా ఉన్న పష్తూన్లు ఏకమైతే పష్తూన్ జాతీయ వాదం తమను ముక్కలు చేస్తుందన్న భయం పాకిస్తాన్‌ను మొదటి నుండి వెంటాడుతోంది. ఆ విషయం తాలిబన్‌కు తెలిసినప్పటికీ తన కున్న అవసరాల దృష్ట్యా పష్తూన్ల ఐక్యత ఒక రాజకీయ కోణంలా రూపాంతరం చెందకుండా చూసుకుంది.
ఎక్కడ చెడింది?
ఇంతటి బలమైన సంబంధాలు నెరపిన పాకిస్తాన్, తాలిబన్ మధ్య 2021 తర్వాత దూరం పెరగడానికి ముఖ్యంగా రెండు కారణాలు కనబడతాయి. ఒకటి, 2001లో అమెరికా చేపట్టిన తీవ్రవాదంపై యుద్ధంలో పాకిస్తాన్ పోషించిన ముఖ్యపాత్ర. 1999లో నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి జనరల్ ముషారఫ్ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పుడు, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అత్యంత దుర్భరస్థితిలో వుంది. ఆ దేశ విదేశీ అప్పులు సుమారు 39 బిలియన్ డాలర్లు ఉంటే, వడ్డీల చెల్లింపులకే బడ్జెట్‌లో సుమారు 56 శాతం కేటాయించాల్సిన పరిస్థితి! ఆ సమయంలో అమెరికాతో జట్టు కట్టడం వలన, అనేక బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం పొందడమే కాకుండా, పారిస్ క్లబ్ రుణదాతల నుండి కొత్త రుణాలు పొందగలిగింది.
పాత రుణ బకాయిల చెల్లింపుల్లో సైతం అనేక వెసులుబాట్లు పొందగలిగింది. 1998లో అణు పరీక్షల తర్వాత ఎదుర్కొన్న అనేక ఆర్థిక ఆంక్షల నుండి విముక్తి పొందగలిగింది. వీటన్నిటి ఫలితంగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడటమే కాకుండా, 2003 నాటికి పారిశ్రామిక రంగం సుమారు 8 శాతం వృద్ధి నమోదు చేసింది. అదే సమయంలో 2001లో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వం కూలిపోవడంతో అనేక మంది తాలిబన్ ఫైటర్లు పాకిస్తాన్‌లోని ట్రైబల్ ఏరియాల్లోకి పారిపోయి ప్రజల్లో కలిసి పోయారు. మరి కొంతమంది, 2007లో పాకిస్తాన్‌లో కూడా తాలిబన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఇస్లామిక్ సిద్ధాంతాలను వ్యాపింప జేయ డానికి ‘తెహ్రిక్ ఏ తాలిబన్ పాకిస్తాన్’(టీటీపీ) స్థాపించారు.
రెండో కారణానికి వస్తే, పాకిస్తాన్ 2017–2022 మధ్య ఏక పక్షంగా తన, అఫ్గానిస్తాన్ మధ్యన ఉన్న సరిహద్దుల్లో కంచె వేసి సరి హద్దులకిరువైపులా ఉన్న అనేక సంబంధాలను దెబ్బ తీసింది. ఈ కంచె తనకు సరిహద్దులపై పట్టును కల్పించి తీవ్రవాదాన్ని, మాదక ద్రవ్యాల, ఆయుధాల, మానవ, ఇతర అక్రమ రవాణాను అరికట్టేందుకు తోడ్పడుతుందని భావించింది. అష్రాఫ్ ఘనీ నేతృత్వంలోని అప్పటి అఫ్గాన్ ప్రభుత్వం ఎంత వ్యతిరేకించినప్పటికీ అత్యాధునిక వసతులతో సరిహద్దు కంచెను పూర్తిచేసింది. ఇది అఫ్గానిసాన్‌లోని అన్ని వర్గాలను, ముఖ్యంగా తాలిబన్లకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఈ సరిహద్దు వలన, సుమారు పదిహేను వేలమంది అఫ్గాన్లు తమ ఉపాధి కోల్పోవడమే కాకుండా, పాకిస్తాన్ నుండి వచ్చే సరుకుల్లో సుమారు 40 శాతం వస్తువులపై కోత పడటంతో అవి స్థానిక మార్కెట్లలో లభ్యం కాక అఫ్గాన్ ప్రజలు తీవ్ర అవస్థలు పడటానికీ, వస్తువుల ధరలు పెరగడానికీ దారితీసింది.
టీటీపీ డిసెంబర్ 31, 2022న మరింత ముందుకెళ్లి ఖైబర్ పఖ్తూన్‌ఖ్వా, గిల్గిట్ బాల్తిస్తాన్ ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఇది ఏకంగా పాకిస్తాన్ సార్వ భౌమత్వాన్ని సవాలు చేయడమే. అప్పటి నుండి పాకిస్తాన్‌లో తీవ్ర వాద దాడులు పెరగడం చూడవచ్చు. ఇస్లామాబాద్‌లోని ‘సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ సెక్యూరిటీ స్టడీస్’ ఇటీవల ప్రచురించిన నివేదిక ప్రకారం, పాకిస్తాన్ గతేడాది 1,166 తీవ్రవాద దాడులు ఎదుర్కొంది. అందులో 2,546 మంది చనిపోతే, 2,267 మంది గాయపడ్డారు. ఈ లెక్కలు అంతకుముందు ఏడాది (2023)తో పోలిస్తే 66 శాతం ఎక్కువ. ఒక్క గత నవంబర్‌లోనే 444 (రోజుకు సుమారు 15) దాడులు జరిగితే అందులో సుమారు 685 మంది చనిపోయారు.
అంటే పరిస్థితి ఎంత తీవ్రత సంతరించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఒక వైపు టీటీపీ, మరోవైపు బలోచిస్తాన్ ప్రాంత స్వతంత్రం కోసం కొట్లాడుతున్న తీవ్రవాద గ్రూపుల దాడుల మధ్య పాకిస్తాన్ చిక్కుకుంది. అయితే, ఆ రెండు ప్రాంతాల తీవ్రవాద గ్రూపుల మధ్య ఉన్న భావజాల విభేదాల వల్ల వాటికి సన్నిహిత సంబంధాలు ఉండక పోవచ్చు. కానీ సరిహద్దుల్లో తాలిబన్ దాడులు చేస్తోంటే, పాకిస్తాన్ లోపల టీటీపీ రక్తపాతాన్ని సృష్టిస్తోంది.
ఇండియాకూ కీలకమే!
ఇలాంటి పరిస్థితుల మధ్య గత డిసెంబర్ 30న పాకిస్తాన్ ఐఎస్‌ఐ అధినేత... తాలిబన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే అఫ్గాన్ నేష నల్ ఫ్రంట్‌కు ఆశ్రయమిచ్చిన తజికిస్తాన్ అధ్యక్షుడు ఏమోమాలి రహెమాన్‌ను కలిశారు. అది జరిగిన కొద్ది రోజులకు, జనవరి 8న భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ తాలిబన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముట్టకీని దుబాయ్‌లో కలిశారు. ఇవి కొత్త చర్చలకు దారి తీయడమే కాకుండా, ఈ ప్రాంతంలో మారుతున్న వ్యూహాత్మక సమీకరణాలను, ఏర్పడుతున్న కొత్త సంబంధాలను, ఆవిష్కృతమవుతున్న నూతన ప్రాంతీయ ముఖచిత్రాన్ని ప్రతిబింబిస్తున్నాయి. రానున్న రోజులలో వివిధ అవసరాల దృష్ట్యా తాలిబన్లతో సత్సంబంధాలు అటు రష్యాకూ, ఇటు చైనాకూ, వాటితో పాటే భారత్‌కూ అత్యంత కీలకం.
గద్దె ఓంప్రసాద్
వ్యాసకర్త అసోసియేట్ ప్రొఫెసర్,
దక్షిణాసియా వ్యవహారాల అధ్యయన కేంద్రం, జేఎన్‌యూ, న్యూఢిల్లీ ‘ opgadde2@gmail.com
Comments
Please login to add a commentAdd a comment