పంజ్‌షీర్‌ను తాలిబన్లు ఆక్రమించిన ఘటన... ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం అమెరికా సమాధిమీద చివరి రాతను రాసేసింది. పాక్ సైన్యం, పాక్ ప్రభుత్వం చేతిలో తాము చిత్తయిపోయామని రష్యా, అమెరికాకు ఆలస్యంగానైనా అర్థమైపోయింది. ఒక్క ఫ్రాన్స్ మినహా మిగతా నాటో కూటమి మొత్తంగా కాగితపు పులేనని అఫ్గాన్ పరిణామాలతో తేలిపోయింది. చైనా కూడా అఫ్గాన్ నూతన ప్రభుత్వం ఐఎస్‌ఐకి విస్తృతరూపమే అని గ్రహించేసింది. అఫ్గాన్ వ్యవహారాల్లో తలదూర్చడమంటే పాక్, అఫ్గాన్ రెండు దేశాల కరువు తీర్చడానికి తన వనరులన్నీ ఖర్చుపెట్టాల్సి ఉందని చైనాకూ అర్థమవుతున్నట్లుంది. నాటో బలగాలు తిరోగమించడం, చైనా–పాక్ కూటమి ముందు రష్యా కూడా తలవంచాక ప్రజాస్వామ్యం కోసం పోరాడే ఒకే ఒక్క దేశంగా భారత్ మిగిలింది. అఫ్గాన్ పరిణామాలు అగ్రరాజ్యానికీ, ప్రపంచ ఆధిపత్య శక్తులకూ అంతిమ పరాజయం.
అఫ్గానిస్తాన్‌లో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభన నేపథ్యంలో బహుశా భారతదేశం ఇప్పుడు తక్కిన ప్రపంచం కోసం సారథ్య స్థానాన్ని కైవసం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. అదేసమయంలో పాకిస్తాన్ సైన్యం, ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని సంకర పౌర ప్రభుత్వం చేతిలో మూర్ఖులుగా మిగిలిపోయామని రష్యా, అమెరికా రెండూ ఇప్పుడు గ్రహిస్తూ మథనపడుతున్నాయి. మరోవైపున చైనా నాయకత్వానికి మెల్లగా తత్వం బోధపడుతున్నట్లుంది. తాలిబన్–పాక్ నిఘా సంస్థ (ఐఎస్‌ఐ) పోషకురాలిగా తాను నిలబడటం అంటే, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ రెండు దేశాలకు సహాయం అందించడానికి తన వనరులన్నింటినీ ఖర్చుపెట్టాల్సి ఉండటమేనని చైనా నాయకత్వానికి కూడా అర్థమవుతున్నట్లు కనిపిస్తోంది.
అంతకుముందు పంజ్‌షీర్ లోయలోని తాలిబన్ తిరుగుబాటు దళాలపై పాక్ బాంబుదాడులు చేయడానికి కజకిస్తాన్‌లోని తన సైనిక స్థావరాలను ఉపయోగించుకోవచ్చని రష్యా అనుమతించింది. మరోవైపున చైనా నిఘా ఉపగ్రహాలు.. అత్యంత కచ్చితత్వంతో అఫ్గాన్ తిరుగుబాటు బలగాలకు చెందిన లక్ష్యాలను దెబ్బతీయడానికి పాకిస్తాన్ బాంబర్లకు, డ్రోన్‌లకు సహాయం చేశాయి. కాగా, పంజ్‌షీర్‌ను తాలి బన్లు ఆక్రమించిన ఘటన జోబైడెన్ నేతృత్వంలోని ప్రపంచ ఏకైక అగ్రరాజ్యం అమెరికా సమాధిమీద చివరి రాతను రాసేసింది. అంతి మంగా, న్యూఢిల్లీ సందర్శించి అమెరికా పరువును నిలబెట్టడమే కాకుండా, తన వ్యక్తిగత ప్రతిష్టను కూడా తిరిగి సాధించే అవకాశాన్ని అన్వేషించాలంటూ సీఐఏ చీఫ్ బర్న్స్‌ని జో బైడెన్ కోరాల్సి వచ్చింది.
అఫ్గాన్ ప్రజలను తాలిబన్లకు వదిలేసిన తన పిరికిపంద చర్యను కప్పిపెట్టుకోవడంతోపాటు తన పరువు నిలబెట్టుకునేందుకు కూడా భారత్ సహాయం చేస్తుందని బైడెన్ ఆశిస్తున్నట్లుంది. తాలిబన్లను అడ్డుకోవడంలో అఫ్గాన్ సైనికబలగాలు విఫలమయ్యాయని బైడెన్ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు అసలు నిజం తెలిసిపోయింది. తాలిబన్ శక్తులు కాబూల్‌ని ఆక్రమించే పనిలో సులభ విజయం సాధించడానికి అమెరికన్లు పాకిస్తాన్ సైన్యాధికారులను తప్పు పద్ధతిలో ప్రోత్సహిం చినట్లు ఇప్పుడు ప్రపంచానికే తెలిసిపోయింది. అలాగే తాలిబన్ దురాక్రమణ బలగాలను ప్రతిఘటించవద్దని అఫ్గాన్ కమాండర్లకు కూడా పనిలోపనిగా కబురందించారు.
చివరిదశలో అఫ్గాన్‌లో ఏం జరిగిందనే విషయమై అమెరికా కథనాలపై అమెరికన్ మీడియా ప్రస్తుతం ప్రతిరోజూ కొత్త వార్తలను వండిపెడుతూనే ఉంది. అఫ్గాన్ మహిళలు తాలిబన్లను సాహసోపేతంగా ఎదుర్కొంటున్నప్పుడు పాక్ సైన్యం, దాని నిఘా సంస్థ ఐఎస్‌ఐ మద్దతుతో విర్రవీగుతున్న తాలిబన్ మూకలు అఫ్గాన్ మహిళల వక్షోజాలకు ఆటోమేటిక్ రైఫిల్స్‌ని గురిపెట్టిన దృశ్యాలను ప్రపంచం తిలకించినప్పుడు అమెరికా పరువు మొత్తంగా పోయింది. పంజ్‌షీర్ లోయపై పాక్ సైన్యం బాంబులు కురిపించడానికి నిరసనగా అఫ్గాన్‌లో ఆందోళనకారులు పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. వారు ప్రదర్శించిన అసాధారణ సాహసాన్ని మొత్తం ప్రపంచం చూసింది. బైడెన్ వల్లించిన అబద్ధాలను ఇక నమ్మేవారు చాలా తక్కువ అని తేలిపోయింది. అయితే ఇస్లామాబాద్‌లోని తమ మార్గదర్శకులకు భంగపాటు కలిగిస్తూ తాలిబన్ సాయుధులు... నిరాయుధులైన మహిళ లను చంపడానికి సాహసించలేకపోయారు.
రావల్పిండిలోని ఐఎస్‌ఐ జనరల్ హెడ్ క్వార్టర్స్ ప్రత్యక్ష ఆదేశాలతో పనిచేసే పాక్ ప్రచ్ఛన్న సంస్థ హక్కాని నెట్‌వర్క్... ఆందోళనకారులను అణచేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నప్పటికీ, ఆందోళనకారులు భీతిల్లలేదు. అప్పుడు కూడా తాలిబన్ సాయుధులు నిరాయుధ మహిళలపై కాల్పులకు ప్రయత్నించలేదు. ఆందోళనకారులను భయపెట్టి వారిపై పాశవిక బలాన్ని ప్రయోగించాలని తలచిన హక్కాని నెట్‌వర్క్... 1989 ఏప్రిల్‌లో తియనాన్మెన్ స్క్వేర్‌లో చైనా ప్రభుత్వం తలపెట్టిన మారణకాండను పోలినదాన్ని మరోసారి సృష్టించాలని స్పష్టంగా భావించింది. ఈలోగా చైనా కూడా అఫ్గాన్ నూతన ప్రభుత్వం ఐఎస్‌ఐకి విస్తృత రూపమే అని గ్రహించేసింది. అఫ్గాన్‌లో తిరుగుబాటు దళాలకు సహకరించవద్దని భారత్‌కు తానిచ్చిన సలహా పెద్ద తప్పిదమని రష్యా కూడా ఎట్టకేలకు గ్రహించింది. కజకిస్తాన్‌లోని తన వైమానిక స్థావరం నుంచి జెట్ ఫైటర్లను పంపే వీలున్నప్పటికీ రష్యా అందుకు పూనుకోలేకపోయింది.
అఫ్గానిస్తాన్‌లో పరిస్థితి ఇప్పటికీ అస్పష్టంగానే కనిపిస్తోంది. మయన్మార్‌లో తాను ప్రారంభించి అమలు చేసిన ప్రయోగాన్ని పునరావృతం చేయడానికి చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్‌కి కూడా కష్టమయ్యేది. అంగ్ సాన్ సూకీ, తదితర ప్రజాస్వామిక నేతలను జైల్లో పెట్టి మార్షల్ లా విధించాలంటూ మయన్మార్ సైనికాధిపతి మిన్ అంగ్ హ్లాయింగ్‌ని ప్రభావితం చేయడంలో చైనా అప్పట్లో విజయం సాధిం చింది. మయన్మార్ ఓడరేవుల వద్దకు రోడ్ లింక్ ఏర్పర్చాలనే తన ప్రయత్నంలో భాగంగా చైనా ఆ దేశంలో తనకు విధేయంగా ఉండే ప్రభుత్వం ఉండాలని కోరుకుంది. చివరకు తన లక్ష్యాన్ని సాధించింది కూడా. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వం ఉంటే అంతంలేని తన డిమాండ్లను సాధించుకోవడం చైనాకు కష్టమయ్యేది మరి. అందుకే సూకీని తిరిగి అధికారంలోకి రాకుండా చైనా అడ్డుకుంది. వాస్తవానికి చైనాతో సూకీ అనేక వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేశారు. అయినా సరే తనకు విధేయంగా ఉండే ప్రభుత్వమే ఉండాలని చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ బలంగా కోరుకున్నారు.
దాంట్లో భాగంగానే మయన్మార్ నుంచి అపార లాభాలను దండుకోవడానికి చైనా అక్కడ సైనిక పాలనను తీసుకొచ్చింది. తనవద్ద పోగుపడిన అదనపు డాలర్లను ప్రతిపాదిస్తూ ఇరాన్, రష్యా, పాకిస్తాన్ దేశాల విషయంలో కూడా ఇదే వ్యూహాన్ని చైనా అమలు పరిచింది. రష్యా పట్ల భ్రమలు తొలగిపోయాక, ఇప్పుడు అఫ్గాన్ విషయంలో ఏర్పడిన కొత్త కూటమి ద్వారా ఈ ప్రాంతంలోని ప్రజల్ని బానిసలుగా చేసుకునే ప్రయత్నాలు విజయవంతమయ్యేందుకు చైనాకు కొన్ని అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయి. అఫ్గాన్‌లో ఇటీవల జరిగిన ఘటనలతో, ఒక్క ఫ్రాన్స్ మినహా మిగతా నాటో కూటమి మొత్తంగా కాగితపు పులేనని తేలిపోయింది. ఆంగ్లో–అమెరికన్ కూటమి చెప్పే ప్రజాస్వామ్యం సారం లేని గుజ్జు అని తేలిపోయింది.
ఈలోపు, పాశ్చాత్య దేశాల సమర్థకులు, అమెరికా కేంద్రంగా పనిచేసే జర్నలిస్టులు, ప్రత్యేకించి ఫరీద్ జకారియా వంటి వారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, పెంటగాన్‌లకు బలహీన స్వరంతో మద్దతు పలుకుతున్నారు. అసాధారణమైన రాజకీయ ఒత్తిడి వల్లే అమెరికన్ నేతృత్వంలోని నాటో శక్తులు అఫ్గానిస్తాన్‌ను వదిలిపెట్టాల్సి వచ్చిం దని, వందల కోట్ల డాలర్ల విలువైన సైనిక సామగ్రిని అక్కడే వదలిపెట్టాల్సి వచ్చిందని వీరు వంతపలికారు. కానీ స్వాతంత్య్ర ప్రేమికులైన ప్రజలతో కూడిన దేశాన్ని తాలిబన్ నిరంకుశ వ్యవస్థకు లొంగిపోయేలా ఎలా చేశారన్న దానిపై ఈ సమర్థకులెవ్వరూ జవాబివ్వరు. పాకిస్తాన్, చైనా దేశాల సైనిక, రాజకీయ మద్దతుతో తాలిబన్ అధికారంలోకి వచ్చిన పరిణామాలను కూడా వీరు పెద్దగా ప్రస్తావించరు.
అఫ్గానిస్తాన్‌లో రెండు దశాబ్దాల క్రితం ప్రారంభమైన ఈ గొప్ప క్రీడ ఇప్పుడు భారతదేశాన్ని దెబ్బతీయడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాంతం నుంచి అమెరికా నేతృత్వంలోని నాటో బలగాలు తిరోగమించడం, చైనా–పాక్ కూటమి ముందు రష్యా కూడా తలవంచాక మానవహక్కులు, ప్రజాస్వామ్యం కోసం పోరాడే ఒకే ఒక్క దేశంగా భారత్ మిగిలి ఉంది. మరోవైపున ఎనభై ఏళ్లు దాటిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనా ముందు ఓడిపోకపోవచ్చు కానీ అఫ్గానిస్తాన్‌లో అమెరికా సంపూర్ణ తిరోగమనాన్ని మాత్రం ఎట్టకేలకు అంగీకరించారు. ఒక్క మాటలో చెప్పాలంటే అఫ్గాన్ పరిణామాలు అగ్రరాజ్యానికీ, ప్రపంచ ఆధిపత్య శక్తులకూ అంతిమ పరాజయం మాత్రమే.
గోపాల్ మిశ్రా, ఫ్రీలాన్స్ జర్నలిస్టు
(ఫస్ట్ ఇండియా సౌజన్యంతో)
Comments
Please login to add a commentAdd a comment