కాబూల్: అఫ్గనిస్థాన్‌లోని అనధికారిక తాలిబన్ల ప్రభుత్వం.. పొరుగు దేశం పాకిస్తాన్‌కు గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. జైష్ - ఇ - మహ్మద్ చీఫ్, అంతర్జాతీయ ఉగ్రవాది అయిన మసూద్ అజర్, అఫ్గనిస్తాలో తలదాచుకున్నాడంటూ పాక్ చేసిన ఆరోపణలను తిప్పి కొట్టింది.
అలాంటి ఉగ్రసంస్థలకు పాక్ గడ్డే అడ్డాగా ఉంటుందని, చివరకు అలాంటి సంస్థలను అక్కడి ప్రభుత్వమే పెంచి పోషిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఈ మేరకు తాలిబన్ ప్రభుత్వ(తాత్కాలిక) అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాయిద్ తీవ్రంగా స్పందించారు.
అఫ్గన్ నంగార్‌హర్ ప్రావిన్స్‌లో మౌలానా మసూద్ అజర్ తలదాచుకున్నాడని, అతనిని గుర్తించి.. అరెస్ట్ చేసి ఇస్లామాబాద్‌కు అప్పగించాలని ఇప్పటికే అఫ్గన్‌ను ఓ లేఖ రాసినట్లు పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం పాక్ మీడియా హౌజ్‌లు కొన్ని ఆ కథనాలను ప్రచురించాయి. ఈ నేపథ్యంలోనే తాలిబన్లు కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది.
‘‘అలాంటి లేఖ ఏం మా ప్రభుత్వానికి అందలేదు. అసలు జైషే చీఫ్ మా దేశంలోనే లేడు. అఫ్గన్ భూభాగాన్ని.. మరే ఇతర దేశానికి వ్యతిరేకంగా ఉపయోగించుకోవడానికి మేము ఎవరినీ అనుమతించబోం. అలాంటిది వాళ్లకు(పాక్‌ను ఉద్దేశించి) మాత్రమే సాధ్యం’’ అంటూ జబీహుల్లా ముజాయిద్ పేర్కొన్నారు. మరోవైపు ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదంటూ అఫ్గన్ విదేశీ వ్యవహారాల శాఖ పాక్‌ను ఉద్దేశిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.
పాశ్చాత్య దేశాలకు చెందిన పర్యాటకులను కిడ్నాప్ చేసిన నేరానికి భారత్‌లో శిక్ష అనుభవించాడు అజర్. అయితే.. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఐసీ-814 హైజాక్ వ్యవహారంలో ప్రయాణికుల కోసం భారత్ అతన్ని విడుదల చేయాల్సి వచ్చింది. బయటకు వచ్చాక జైష్ ఈ మొహమద్‌ను నెలకొల్పి.. భారత్‌లో ఎన్నో ఉగ్రవాద దాడులను నిర్వహించాడు. దీంతో పాక్ ఆ సంస్థను నిషేధించింది. మే 2019లో ఐరాస అతన్ని గ్లోబల్ టెర్రరిస్టుగా ప్రకటించింది. పుల్వామా దాడికి ప్రధాన సూత్రధారి కూడా ఈ మసూదే.
ఇదీ చదవండి: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి యాక్సిడెంట్!
Comments
Please login to add a commentAdd a comment