rates increase
-
బాబు వచ్చాడు.. భవిష్యత్ అంధకారమే: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు కూటమి సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ధరల పెరుగుదలతో పేద మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అలాగే, విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నాడని కామెంట్స్ చేశారు.వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా.. బాబు వచ్చాడు.. ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయలు కొండెక్కి.. మాంసం ధరలు మండిపోతూ.. పప్పులు నిప్పయ్యాయి. ఒకదాని ధర పెరిగిందని మరోదానితో సర్దుకునే పరిస్థితి లేక ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయింది.పేద, మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మరోవైపు సామాన్యుడిపై విద్యుత్ చార్జీలు పెంచేందుకు చంద్రబాబు సిద్దం అవుతున్నాడు. బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటి నినాదం కాస్తా.. ఇప్పుడు బాబు వచ్చాడు-భవిష్యత్తు అంధకారం నినాదంగా మారిపోయింది అంటూ కామెంట్స్ చేశారు. బాబు వచ్చాడు.. ధరలు ఆకాశాన్నంటాయి. కూరగాయలు కొండెక్కి ....మాంసం ధరలు మండిపోతూ.....పప్పులు నిప్పయ్యాయి. ఒకదాని ధర పెరిగిందని మరోదానితో సర్దుకునే పరిస్థితి లేక ఇంటి ఖర్చు అమాంతం పెరిగిపోయింది. పేద మధ్యతరగతి వర్గాలు ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు పట్టించుకోవడం లేదు. మరోక వైపు…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 31, 2024 -
టాటా మోటార్స్: వాహనాల ధరల పెంపు
పండుగ సందడి ముగిసిన వెంటనే.. స్వదేశీ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ వాహనదారులకు షాకిచ్చింది. ప్యాసింజర్ వెహికల్స్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ధరల అమలు జనవరి 19 (బుధవారం నుంచి) వర్తిస్తుందని పేర్కొంది. ప్యాసింజర్ వాహనాల ధరల్ని పెంచుతున్నట్లు టాటా మోటార్స్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. వాహనాలపై సగటున 0.9 శాతం పెంపుదల బుధవారం నుంచి వర్తిస్తుందని పేర్కొంది. వేరియెంట్, మోడల్‌ను బట్టి ధరల నిర్ధారణ ఉంటుందని తెలిపింది. జనవరి 18(ఇవాళ), అంతకంటే ముందు బుక్ చేసుకున్న కార్ల ధరలపై ఎలాంటి ప్రభావం చూపబోదని కంపెనీ స్పష్టం చేసింది. ముడిసరుకు వ్యయాలు క్రమంగా అధికం అవుతోందని, ఇన్పుట్ ఖర్చుల పెరుగుదల ప్రభావాన్ని పాక్షికంగా భర్తీ చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అదే సమయంలో కస్టమర్ల నుంచి తీసుకున్న ఫీడ్‌బ్యాక్‌ను అనుసరించి.. ప్రత్యేకించి కొన్ని వేరియెంట్ల మీద పది వేల రూ. దాకా తగ్గింపు కొనసాగుతుందని ప్రకటించి ఊరట ఇచ్చింది. ముంబై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ ఆటోమేకర్.. టియాగో, పంచ్, హర్రియర్ లాంటి మోడల్స్‌తో దేశీయ మార్కెట్‌ను ఆకర్షిస్తోంది. ఇదిలా ఉంటే కిందటి నెలలోనే కమర్షియల్ వాహనాలపై రేట్లు పెంచిన టాటా మోటార్స్.. జనవరి 1 నుంచి ప్యాసింజర్ వెహికల్స్ పైనా రేట్లు పెంచింది. ఇప్పుడు పదిహేను రోజుల వ్యవధి తర్వాత మళ్లీ ప్రకటన చేసింది. రీసెంట్గా మరో కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఏకంగా 4.3 శాతం దాకా వాహన ధరలు పెంచిన విషయం తెలిసిందే. గత ఏడాది కాలంగా స్టీల్, అల్యూమినియం, రాగి, ప్లాస్టిక్, విలువైన లోహాల వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో.. వాహనాల ధరలు పెంచాల్సి వస్తోందని ఆటోమొబైల్ కంపెనీలు ప్రకటించుకుంటున్నాయి. చదవండి: వారెవ్వా టాటా ! ‘డార్క్’ దద్దరిల్లిపోతుందిగా !! -
బిర్యానీ ప్రియులకు షాక్.. పెరిగిన రేట్లు!
అఫ్గన్ సంక్షోభం హైదరాబాద్ బిర్యానీపై ప్రభావం చూపెడుతోంది. బిర్యానీ రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలను నిజం చేస్తూ.. ఇప్పటికే చాలాచోట్ల రేట్లు పెంపును అమలు చేస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని చాలా చోట్ల ఇప్పటికే బిర్యానీ రేట్లు పెరిగాయి. రేపు మొదటి తారీఖు (సెప్టెంబర్ 1) కావడంతో పెంచిన ధరలను అమలు చేయాలని మెజార్టీ రెస్టారెంట్ల ఓనర్లు నిర్ణయించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. చిన్న, ఓ మోస్తరు రెస్టారెంట్లు సైతం మినిమమ్ 20 నుంచి 30 రూ. పెంచేశాయి. గరిష్టంగా రూ.100 దాకా పెరిగినట్లు తెలుస్తోంది. కొన్ని రెస్టారెంట్లు ఇప్పటికే మెనూను ఆన్లైన్ల్లో అప్డేట్ చేశాయి. పెంచిన ధరల్ని పార్శిల్‌కు సైతం వర్తింపజేయనున్నారు. అయితే కొన్ని రెస్టారెంట్లు వాటి ఆన్లైన్ ఆర్డర్లకు తప్ప.. దాదాపు మెజార్టీ హోటల్స్, రెస్టారెంట్లు బిర్యానీ రేట్లను పెంచేశాయి. సింగిల్, డబుల్ పీస్, జంబో, ఫ్యామిలీ ప్యాక్.. ఇలా దాదాపు అన్నింటిపైనా వడ్డింపు మొదలు కానుంది. కొన్ని రెస్టారెంట్లు ఆన్లైన్ బుకింగ్‌పై జీఎస్టీ, ప్యాకింగ్ చార్జీలు, డెలివరీ చార్జీలతో మోత మోగించడం ఇప్పటికే మొదలుపెట్టేశాయి. చిన్న చిన్న బిర్యానీ పాయింట్లు మాత్రం దాదాపు పాత రేట్లకే బిర్యానీని అందిస్తున్నాయి. బిర్యానీతో పాటు కబాబ్, రకరకాల మాంసాహార, శాఖాహార వంటకాల్లో వాడే డ్రై ఫ్రూట్స్, కొన్నిరకాల మసాల దినుసుల్ని అఫ్గనిస్థాన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఆ దినుసుల వ్యాపారం మీద ఆధారపడి వేల కుటుంబాలు బతుకుతున్నాయి కూడా. అయితే, తాలిబన్ల ఆక్రమణ తర్వాత.. అక్కడి నుంచి వాటి దిగుమతి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. దీంతో మార్కెట్లో వాటి బల్క్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. ఆ ప్రభావం ‘బిర్యానీ’పై పడగా.. రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని వ్యాపారులు చెప్తున్నారు. తిరిగి యథాస్థితి నెలకొంటే.. అప్పుడు రేట్ల తగ్గింపు గురించి ఆలోచిస్తామని కొందరు వ్యాపారులు అంటున్నారు. చదవండి: అఫ్గన్ సంక్షోభం.. ఇలాగైతే బిర్యానీ రేట్లు పెరిగే ఛాన్స్! -
కిరాణా ఖర్చుతో హైరానా!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్డౌన్ సడలింపులతో సరుకు రవాణా, వస్తు లభ్యత పెరిగినా.. ధరలు మాత్రం దిగిరావట్లేదు. లాక్డౌన్ సమయంలోని ధరలే ప్రస్తుతం ఉండటం, చాలా వస్తువులపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఎత్తేయడంతో ధరలు తగ్గకపోగా.. అంతకంతకూ కిరాణా ఖర్చులు పెరు గుతుండటం వారిని హైరానా పెడుతోంది. దీనికి తోడు ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లో ఇచ్చిన రూ.1,500 సాయాన్ని నిలిపేయడం, ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపించకపోవడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు. తగ్గిన ఆదాయం.. పెరిగిన ఖర్చు.. రెండు నెలల పాటు కొనసాగిన లాక్‌డౌన్‌తో పేద, మధ్య తరగతితో పాటు ఎగువ మధ్యతరగతి కుటుంబాలపై పెను ప్రభావం పడింది. వారి నెలసరి ఆదాయం కనీసంగా 40 శాతం మేర పడిపోయింది. కుటుంబసభ్యులంతా ఇంటికే పరిమితం కావడంతో నిత్యావసరాలు, కిరాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇదే సమయంలో సరుకు రవాణాలో ఇబ్బందులు, హోల్‌సేల్, రిటైలర్ల మధ్య గ్యాప్ పెరగడంతో కిరాణా సరుకుల ధరలన్నీ పెరిగాయి. అయితే ప్రస్తుతం లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా మెరుగైంది. రాష్ట్రాల పరిధిలోనూ అన్ని సరుకుల లభ్యత పెరిగింది. అయినా కూరగాయల ధరలు మినహాయిస్తే అన్ని ధరలు ఏమాత్రం దిగిరావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నివేదికల ప్రకారమే కందిపప్పు ధర లాక్డౌన్ ముందున్న ధరల కన్నా రూ.10–15 అధికంగా ఉండి ప్రస్తుతం రూ.110కి అందుబాటులో ఉంది. పెసరపప్పు, మినప్పప్పు ధర సైతం రూ.125–134 మధ్యే ఉంటోంది. ఇది సైతం లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే రూ.20 నుంచి రూ.25 ఎక్కువ. చింతపండు ధర కిలో ఏకంగా రూ.200కు చేరుకోగా, కారం రూ.170కి చేరింది. వీటి ధరల్లో పెరుగుదల ఏకంగా రూ.40–60 వరకు ఉంటోంది. అన్ని రకాల నూనెల ధరల్లోనూ రూ.10–30 వరకు పెరుగుదల ఉండగా, అవే ధరలు ఇప్పుడూ కొనసాగుతున్నాయి. ఆఫర్లు లేకపోవడమూ కారణమే.. లాక్డౌన్ సడలింపుల తర్వాత హోల్‌సేల్, రిటైలర్లతో పాటు ఈ–కామర్స్ సంస్థలు ఆఫర్లు తొలగించాయి. కొన్ని సరుకులు బహిరంగ మార్కెట్లలో ఎంఆర్పీ కన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఉప్పు, కారం, పాల ధరలు ఇలాగే పెరిగాయి. ఈ భారమంతా వినియోగదారుడి నడ్డి విరుస్తున్నాయి. లాక్డౌన్ అనంతరం 25 శాతం మంది వినియోగదారులు మాత్రమే సరైన ధరలకు వస్తువులు కొనుగోలు చేశామని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో చెప్పగా, 49 శాతం మంది తాము ఎంఆర్పీ కన్నా అధిక ధరలకే కొనుగోలు చేశామని చెప్పారు. ఓ పక్క ఆదాయం తగ్గడం, మరోపక్క కిరాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతుండటంతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. కరోనా నివారణకు పండ్లు తినాలన్న ప్రభుత్వ సూచనల నేపథ్యంలో ఇంటి ఖర్చు నెలకు రూ.6–8 వేల నుంచి రూ.10–12 వేలకు పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. లాక్డౌన్ అనంతరం సైతం వినియోగదారులు 15 శాతానికి పైగా ఈ–కామర్స్ సంస్థలపై, 8 శాతం వాట్సాప్ ఆర్డర్లపై, 19 శాతం పక్కనే ఉన్న కిరాణా దుకాణాలపై ఆధారపడుతుండగా, 53 శాతం మంది 3 కిలోమీటర్ల పరిధిలోని స్థానిక రిటైల్ దుకాణాలపై ఆధారపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. మాల్స్, సూపర్ మార్కెట్లు, స్టోర్లకు వెళ్లేందుకు జంకుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. -
మారుతీ కార్ల ధరలు పెరిగాయ్
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా తన వాహన ధరలను పెంచినట్లు సోమవారం ప్రకటించింది. మోడల్ ఆధారంగా రూ. 10,000 వరకు పెంచింది. పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని కస్టమర్లకు బదలాయించడంలో భాగంగా పలు మోడళ్ల ధరలను పెంచుతున్నామని, ఈ పెంపు నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గరిష్టంగా 4.7 వరకు పెంచినట్లు వెల్లడించింది. మార్కెట్లోకి మారుతీ బీఎస్–6 సీఎన్జీ ఆల్టో ప్రారంభ ధర రూ. 4.32 లక్షలు భారత్ స్టేజ్ (బీఎస్)–6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఉన్న సీఎన్జీ వెర్షన్ ఆల్టో కారును మారుతీ సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘ఆల్టో ఎస్–సీఎన్జీ’ పేరిట అందుబాటులోకి వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ. 4.32 లక్షలు (ఎక్స్–షోరూం, ఢిల్లీ). కిలో సీఎన్జీ 31.59 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది. పర్యావరణానికి హాని చేయని వాహనాలను అందించడంలో భాగంగా ఈ నూతన వెర్షన్ మార్కెట్లోకి విడుదలచేసినట్లు కంపెనీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. నేచురల్ గ్యాస్ వినియోగాన్ని గణనీయంగా పెంచడం ద్వారా ముడి చమురు వినియోగాన్ని తగ్గించాలని ప్రభుత్వం భావిస్తున్న విషయం తెలిసిందే కాగా, ప్రస్తుతం 6.2 శాతంగా ఉన్న నేచురల్ గ్యాస్ వినియోగాన్ని 2030 నాటికి 15 శాతానికి చేరుకునేలా చర్యలు చేపడుతోంది. మోడల్ పెరిగిన ధర (రూ.) ఆల్టో 9,000–6,000 ఎస్–ప్రెస్సో 1,500–8,000 వ్యాగన్ఆర్ 1,500–4,000 ఎర్టిగా 4,000–10,000 బాలెనో 3,000–8,000 ఎక్స్ఎల్6 5,000 -
ఆర్టీసీ బస్సుల అద్దె పెంపు
సాక్షి, హైదరాబాద్: ఇటీవలే కిలోమీటరుకు 20 పైసలు చొప్పున బస్సు చార్జీలు పెంచిన ఆర్టీసీ, తాజాగా సొంత బస్సులను ప్రైవేటు కార్యక్రమాలకు అద్దెకు ఇచ్చేందుకు గాను చార్జీలను పెంచింది. పెంచిన రవాణా చార్జీలను పరిగణనలోకి తీసుకుని ఈ ధరలను సవరించింది. పల్లెవెలుగు మొదలు స్లీపర్ సర్వీసు వెన్నెల వరకు అన్ని కేటగిరీల బస్సు హైర్ చార్జీలను పెంచింది. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు, యాత్రలు, ప్రైవేటు కార్యక్రమాలకు బల్క్ గా బుక్ చేసుకుంటే ఆర్టీసీ సొంత బస్సులను కేటాయిస్తోంది.వీటికి శ్లాబ్ పద్ధతిలో ఛార్జీలు విధిస్తుంది. కనిష్టంగా 8 గంటలు–200 కి.మీ.లు. గరిష్టంగా 24 గంటలు–480 కి.మీ. పద్ధతిలో ఆ ధరలు ఉంటాయి. ఆక్యుపెన్సీ రేషియో ఆధారంగా సాధారణ సమయాలు, పీక్ సమయాలుగా పేర్కొంటూ వేరువేరు రేట్లు ఉంటాయి. ఇప్పు డు వాటిని ఆర్టీసీ పెంచింది. కిలోమీటరుకు పల్లెవెలుగుకు సాధారణ సమయాల్లో రూ.40, కీలక (పీక్) వేళల్లో రూ.44, ఎక్స్‌ప్రెస్ రూ.47, రూ.49, డీలక్స్ (దీనికి ఒకటే ధర) రూ.49, సూపర్‌లగ్జరీ రూ.50 గా నిర్ధారించింది. వజ్ర బస్సులను తొలగించాలని నిర్ణయించినప్పటికీ, అవి కొనసాగినన్ని రోజులు అమలుచేసేలా వాటి ధరలను కూడా సవరించింది. సిటీ బస్సులకు విడిగా ధరలు కేటాయించింది. కనిష్టంగా 6 గంటలు–90 కి.మీ., గరి ష్టంగా 16 గంటలు–240 కి.మీ. ప్రాతిపదికన ఉన్నాయి. అన్ని బస్సుల కాషన్ డిపాజిట్మొత్తాలను పెంచింది. మిగతా నిబంధనలు యథావిధిగా ఉంచింది. ఇలా భారీ ఆదాయం సమకూరుతుందని ఆర్టీసీ భావిస్తోంది. ఆదివారం నుంచే కొత్త చార్జీలు అమలులోకి వచ్చాయి. -
మేం కూడా రేట్లు పెంచుతున్నాం : జియో
సాక్షి, ముంబై : ఒకవైపు అధిక పన్నుల చెల్లింపు, మరోవైపు జియో రాకతో భారత టెలికాం పరిశ్రమలోని ఇతర నెట్వర్క్ కంపెనీలైన ఎయిర్టెల్, వొడాఫోన్- ఐడియా కంపెనీలు ఆర్ధికంగా తీవ్ర నష్టాలకు గురయ్యాయి. ఒక రకంగా టెలికాం పరిశ్రమలో సంక్షోభం తలెత్తే పరిస్థితులు కనిపించాయి. ఈ నేపథ్యంలో ట్రాయ్ సూచనల ప్రకారం డిసెంబర్ నుంచి చార్జీలు పెంచుతామని ఆయా కంపెనీలు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వరుసలో జియో కూడా పయనిస్తోంది. ఇప్పటివరకు అత్యంత చౌకగా కాల్స్, డాటా సౌకర్యాన్ని ఇచ్చిన జియో కూడా చార్జీలను పెంచనుంది. ఈ మేరకు జియో కంపెనీ మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ సూచనల ప్రకారం పరిశ్రమ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని తాము కూడా చార్జీలను పెంచుతున్నామని ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే వినియోగదారులపై అధిక భారం పడకుండా చూసుకుంటామని తెలిపింది. -
సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89 పెంపు
న్యూఢిల్లీ: ఎల్పీజీ వినియోగదారులకు ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు మరోసారి షాక్ ఇచ్చాయి. 14.2 కిలోల బరువున్న సబ్సిడీ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.2.89, సబ్సిడీ లేని ఎల్పీజీ సిలిండర్‌పై రూ.59 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ క్షీణించిన నేపథ్యంలో సబ్సిడీలేని సిలిండర్‌పై రూ.59 పెంచామని వెల్లడించింది. ఇక జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడంతో సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89 అదనపు భారం పడిందని పేర్కొంది. అలాగే వినియోగదారులకు చెల్లిస్తున్న నగదు బదిలీ మొత్తాన్ని రూ.320.49 నుంచి రూ.376.6కు పెంచినట్లు ఐవోసీ తెలిపింది. -
భారీగా తగ్గిన బంగారం ధరలు
న్యూఢిల్లీ : వరుసగా నాలుగు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. నేటి బులియన్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 500 రూపాయల మేర కిందకి పడిపోయింది. 460 రూపాయలు నష్టపోయి రూ.31,390గా నమోదైంది. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో పాటు గ్లోబల్‌గా సంకేతాలు ప్రతికూలంగా వస్తుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో కేజీ వెండి ధర రూ.250 తగ్గి, రూ.39,300గా నమోదైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు బలంగా ఉందని.. ఫెడ్ పాలసీ రేట్లను క్రమంగా పెంచుతుందని ఫెడరల్ రిజర్వు చైర్మన్ జీరోమ్ పావెల్ ప్రకటించడంతో, డాలర్‌కు సెంటిమెంట్ బలపడింది. దీంతో ఎంతో విలువైన ఈ మెటల్‌కి డిమాండ్ పడిపోయింది. మంగళవారం అంతర్జాతీయంగా బంగారం ధరలు 1 శాతం క్షీణించాయి. ఈ ఏడాది మూడు నుంచి నాలుసార్లు రేట్లను పెంచబోతున్నట్టు కూడా జీరోమ్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.460 చొప్పున పడిపోయి రూ.31,390గా రూ.31,240గా నమోదయ్యాయి. గత నాలుగు సెషన్లలో బంగారం ధరలు రూ.500 మేర పెరిగాయి. -
ఎరువు.. బరువు
గత ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలించలేదు. నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, పంటలకు చీడపీడలు, దోమపోటు.. అరకొర పంటలు చేతికొచ్చినా గిట్టుబాటు ధర దక్కలేదు. పెట్టుబడి అప్పులకు వడ్డీ పెరిగి తడిసి మోపెడయింది. దీనికితోడు కాంప్లెక్స్ ఎరువుల ధర పెంపు నిర్ణయం రబీ ఆశలపై నీళ్లు చల్లింది. వెరసి రైతు పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. బూర్గంపాడు : ఖరీఫ్ కలిసిరాకపోవడంతో రైతులు ఆశలన్నీ రబీపై పెట్టుకుని సాగుకు ఉపక్రమించారు. తాజాగా కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచేందుకు ఆయా కంపెనీలు నిర్ణయించడంతో ఆందోళన మొదలైంది. ఫిబ్రవరి నుంచి ఎరువుల ధరలు పెరుగుతాయని డీలర్లు చెబుతున్నారు. ప్రభుత్వపరంగా ఎరువుల ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించలేదు. ఎరువుల తయారీలో వినియోగించే ముడిసరుకు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగటంతో ఎరువుల కంపెనీలు ధరలను పెంచేందుకు నిర్ణయించుకున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరలను సుమారు 10శాతానికి పైగానే పెంచేందుకు కంపెనీలు నిర్ణయించాయి. డీఏపీ ధర ప్రస్తుతం రూ. 1100 వరకు ఉంది. దీని ధర సుమారు రూ.125 వరకు పెరిగే అవకాశముంది. రైతులు అధికంగా వినియోగించే కాంప్లెక్స్ ఎరువు 20:20:00:13 ధర బస్తా ప్రస్తుతం రూ 900 వరకు ఉంది. దీని ధర సుమారు రూ 100 వరకు పెరిగే అవకాశముంది. 28:28:00 ధర కూడా రూ.125 వరకు పెరగవచ్చు. వీటితో పాటు 14:35:14 ధర రూ. 130, 10:26:26 ధర రూ 110 వరకు, 17:17:17 ధర రూ 70 వరకు పెరిగే అవకాశాలున్నట్లు డీలర్లు రైతులకు ముందుగానే తెలియపరుస్తున్నారు. పెరగనున్న ధరలు రబీసాగు రైతులకు భారం కానున్నాయి. రైతులకు పెరగనున్న పెట్టుబడి భారం జిల్లావ్యాప్తంగా రబీలో సుమారు 11 వేల హెక్టార్లలో వరిపంట సాగుచేస్తున్నారు. 1200 హెక్టార్లలో మొక్కజొన్న సాగుచేస్తున్నారు. ఇవిగాక కూరగాయలు, అపరాలు మొత్తం కలిపి మరో 2500 హెక్టార్లలో రబీలో సాగుచేస్తున్నారు. రబీ పంటల సాగు మొదలై కేవలం నెలరోజులు కావస్తోంది. రైతులు మొదటిధపా ఎరువులు మాత్రమే వేసుకున్నారు. ఇంకా రెండో, మూడో విడతల్లో పంటలకు ఎరువులు వేయాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచితే రైతులపై ఎకరాకు కనీసం రూ.400కు పైగానే భారంపడే అవకాశాలున్నాయి. ప్రస్తుతం డీలర్ల వద్ద ఉన్నటువంటి కాంప్లెక్స్ ఎరువులను పాతధరలకే విక్రయించాల్సిఉంది. కొత్తగా వచ్చేటువంటి ఎరువుల స్టాక్ మాత్రం కొత్తరేట్లలో అమ్మకాలు చేయాల్సిఉంటుందని డీలర్లు చెబుతున్నారు. పెట్టుబడులకు కటకటలాడుతున్న సమయంలో ఎరువుల ధరలు పెంచితే సాగు భారమవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల ధరలను పెంచకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి: సోము వీర్రాజు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధరల పెరుగుదల ఆందోళనగా ఉందని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు చెప్పారు. రైతుకి గిట్టుబాటు ధర లేదు కానీ.. మార్కెట్లో పప్పుల ధరలు ఎందుకు పెరుగుతున్నాయని మండిపడ్డారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ధరల పెరుగుదలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజిలెన్స్ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి 6 తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఉద్యమం చేస్తామన్నారు. గుంటూరులో అగ్రిగోల్డ్‌కు అనేక భూములు ఉన్నాయని ఆరోపించారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో సామాన్యులకు ప్రభుత్వం న్యాయం చేయాలని చెప్పారు. మార్చి 6న బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా హాజరవుతారని సోమువీర్రాజు వెల్లడించారు.