సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్ సడలింపులతో సరుకు రవాణా, వస్తు లభ్యత పెరిగినా.. ధరలు మాత్రం దిగిరావట్లేదు. లాక్‌డౌన్ సమయంలోని ధరలే ప్రస్తుతం ఉండటం, చాలా వస్తువులపై ఆఫర్లు, డిస్కౌంట్లు ఎత్తేయడంతో ధరలు తగ్గకపోగా.. అంతకంతకూ కిరాణా ఖర్చులు పెరు గుతుండటం వారిని హైరానా పెడుతోంది. దీనికి తోడు ప్రభుత్వం ఏప్రిల్, మే నెలల్లో ఇచ్చిన రూ.1,500 సాయాన్ని నిలిపేయడం, ఆర్థిక పరిస్థితిలో మెరుగుదల కనిపించకపోవడంతో వినియోగదారులు విలవిల్లాడుతున్నారు.
తగ్గిన ఆదాయం.. పెరిగిన ఖర్చు..
రెండు నెలల పాటు కొనసాగిన లాక్‌డౌన్‌తో పేద, మధ్య తరగతితో పాటు ఎగువ మధ్యతరగతి కుటుంబాలపై పెను ప్రభావం పడింది. వారి నెలసరి ఆదాయం కనీసంగా 40 శాతం మేర పడిపోయింది. కుటుంబసభ్యులంతా ఇంటికే పరిమితం కావడంతో నిత్యావసరాలు, కిరాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇదే సమయంలో సరుకు రవాణాలో ఇబ్బందులు, హోల్‌సేల్, రిటైలర్ల మధ్య గ్యాప్ పెరగడంతో కిరాణా సరుకుల ధరలన్నీ పెరిగాయి. అయితే ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో పొరుగు రాష్ట్రాల నుంచి సరఫరా మెరుగైంది. రాష్ట్రాల పరిధిలోనూ అన్ని సరుకుల లభ్యత పెరిగింది. అయినా కూరగాయల ధరలు మినహాయిస్తే అన్ని ధరలు ఏమాత్రం దిగిరావట్లేదు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నివేదికల ప్రకారమే కందిపప్పు ధర లాక్‌డౌన్ ముందున్న ధరల కన్నా రూ.10–15 అధికంగా ఉండి ప్రస్తుతం రూ.110కి అందుబాటులో ఉంది. పెసరపప్పు, మినప్పప్పు ధర సైతం రూ.125–134 మధ్యే ఉంటోంది. ఇది సైతం లాక్‌డౌన్‌కు ముందుతో పోలిస్తే రూ.20 నుంచి రూ.25 ఎక్కువ. చింతపండు ధర కిలో ఏకంగా రూ.200కు చేరుకోగా, కారం రూ.170కి చేరింది. వీటి ధరల్లో పెరుగుదల ఏకంగా రూ.40–60 వరకు ఉంటోంది. అన్ని రకాల నూనెల ధరల్లోనూ రూ.10–30 వరకు పెరుగుదల ఉండగా, అవే ధరలు ఇప్పుడూ కొనసాగుతున్నాయి.
ఆఫర్లు లేకపోవడమూ కారణమే..
లాక్‌డౌన్ సడలింపుల తర్వాత హోల్‌సేల్, రిటైలర్లతో పాటు ఈ–కామర్స్ సంస్థలు ఆఫర్లు తొలగించాయి. కొన్ని సరుకులు బహిరంగ మార్కెట్లలో ఎంఆర్‌పీ కన్నా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. ఉప్పు, కారం, పాల ధరలు ఇలాగే పెరిగాయి. ఈ భారమంతా వినియోగదారుడి నడ్డి విరుస్తున్నాయి. లాక్‌డౌన్ అనంతరం 25 శాతం మంది వినియోగదారులు మాత్రమే సరైన ధరలకు వస్తువులు కొనుగోలు చేశామని లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో చెప్పగా, 49 శాతం మంది తాము ఎంఆర్‌పీ కన్నా అధిక ధరలకే కొనుగోలు చేశామని చెప్పారు. ఓ పక్క ఆదాయం తగ్గడం, మరోపక్క కిరాణా ఖర్చులు తడిసి మోపెడు అవుతుండటంతో వినియోగదారులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
కరోనా నివారణకు పండ్లు తినాలన్న ప్రభుత్వ సూచనల నేపథ్యంలో ఇంటి ఖర్చు నెలకు రూ.6–8 వేల నుంచి రూ.10–12 వేలకు పెరిగినట్లు సర్వేలు చెబుతున్నాయి. లాక్‌డౌన్ అనంతరం సైతం వినియోగదారులు 15 శాతానికి పైగా ఈ–కామర్స్ సంస్థలపై, 8 శాతం వాట్సాప్ ఆర్డర్లపై, 19 శాతం పక్కనే ఉన్న కిరాణా దుకాణాలపై ఆధారపడుతుండగా, 53 శాతం మంది 3 కిలోమీటర్ల పరిధిలోని స్థానిక రిటైల్ దుకాణాలపై ఆధారపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. మాల్స్, సూపర్ మార్కెట్లు, స్టోర్‌లకు వెళ్లేందుకు జంకుతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment