బంగారం ధరలు (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ : వరుసగా నాలుగు రోజుల నుంచి పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు నేడు భారీగా తగ్గాయి. నేటి బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర దాదాపు 500 రూపాయల మేర కిందకి పడిపోయింది. 460 రూపాయలు నష్టపోయి రూ.31,390గా నమోదైంది. స్థానిక జువెల్లర్ల నుంచి డిమాండ్ పడిపోవడంతో పాటు గ్లోబల్‌గా సంకేతాలు ప్రతికూలంగా వస్తుండటంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. పారిశ్రామిక యూనిట్లు, కాయిన్ తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడంతో కేజీ వెండి ధర రూ.250 తగ్గి, రూ.39,300గా నమోదైంది.
అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు బలంగా ఉందని.. ఫెడ్ పాలసీ రేట్లను క్రమంగా పెంచుతుందని ఫెడరల్ రిజర్వు చైర్మన్ జీరోమ్ పావెల్ ప్రకటించడంతో, డాలర్‌కు సెంటిమెంట్ బలపడింది. దీంతో ఎంతో విలువైన ఈ మెటల్‌కి డిమాండ్ పడిపోయింది. మంగళవారం అంతర్జాతీయంగా బంగారం ధరలు 1 శాతం క్షీణించాయి. ఈ ఏడాది మూడు నుంచి నాలుసార్లు రేట్లను పెంచబోతున్నట్టు కూడా జీరోమ్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు రూ.460 చొప్పున పడిపోయి రూ.31,390గా రూ.31,240గా నమోదయ్యాయి. గత నాలుగు సెషన్లలో బంగారం ధరలు రూ.500 మేర పెరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment