Federal Reserve System
-
మార్కెట్ చూపు ఫెడ్ వైపు
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య కమిటీ విధాన నిర్ణయాలు, స్థూల ఆర్థిక గణాంకాలు ఈ వారం స్టాక్ సూచీలకు దిశానిర్దేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, యూఎస్, భారత్ బాండ్లపై రాబడులను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చంటున్నారు. వీటితో పాటు క్రూడాయిల్ కదలికలు, డాలర్ మారకంలో రూపాయి విలువ అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. అలాగే వచ్చే వారంలో రియల్ ఎస్టేట్ సంస్థ ఆర్కేడ్ డెవలపర్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ ప్లాట్‌ఫామ్ నార్తెర్న్ ఆర్క్ క్యాపిటల్ ఐపీఓల సబ్‌స్క్రిబ్షన్‌తో పాటు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిస్టింగ్‌పైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చు. ‘‘ఫెడ్ పాలసీ కమిటీ ద్రవ్య విధాన నిర్ణయాల వెల్లడికి ముందు సూచీలు పరిమిత శ్రేణిలో ట్రేడవ్వొచ్చు. వివిధ రంగాల షేర్లలో లాభాల స్వీకరణకు అవకాశం ఉంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువ స్థాయిలో 25,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. కొనుగోళ్లు నెలకొంటే ఎగువున 25,500 వద్ద కీలక నిరోధం ఉంది. ఈ స్థాయిని చేధిస్తే 26,000 వద్ద మరో నిరోధం ఉంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ హెడ్ అజిత్ మిశ్రా తెలిపారు స్థూల ఆర్థిక గణాంకాలు దేశీయ ఆగస్టు టోకు ద్రవ్యోల్బణ డేటాను ఇన్వెస్టర్లు పరిశీలించనున్నారు. అమెరికా పారిశ్రామికోత్పత్తి, ఫెడ్ కమిటీ ఆర్థిక అంచనాలు, యూఎస్ నిరుద్యోగ క్లెయిమ్స్ ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చు. బ్యాంక్ ఆఫ్ జపాన్ శుక్రవారం ద్రవ్యోల్బణం డేటా శుక్రవారం విడుదల కానుంది అదే రోజున బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు వెలువడనున్నాయి. క్రూడాయిల్ ధరలూ కీలకం ద్రవ్యోల్బణంతో పాటు ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్లపై ప్రభావాన్ని చూపే క్రూడాయిల్ ధరలూ ఈ వారం కీలకం కానున్నాయి. అంతర్జాతీయంగా ప్రస్తుతం క్రూడ్ ధరలు 14 నెలల కనిష్టం వద్ద ట్రేడవుతున్నాయి. భారత్‌లో అధికంగా వినియోగించే బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 71.61 డాలర్ల దిగువకు చేరుకుంది. దీంతో చమురు దిగుమతులపై ప్రధానంగా ఆధారపడే దేశమైన భారత్‌కు ఇది సానుకూల అంశంగా మారింది.ఫెడ్ నిర్ణయాలపై దృష్టివడ్డీరేట్లపై ఫెడరల్ రిజర్వ్ తీసుకునే నిర్ణయాలపైనే భారత్‌తో సహా అంతర్జాతీయ మార్కెట్ల చూపు కేంద్రీకృతమై ఉంది. వడ్డీరేట్లను 25 లేదా 50 బేసిస్ పాయింట్లు మేర ఫెడ్ తగ్గించవచ్చనేది ఆర్థికవేత్తల అంచనా. అగ్రరాజ్యం అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశాలు మంగళవారం(సెపె్టంబర్ 17న) మొదలవుతాయి. భారత కాలమాన ప్రకారం బుధవారం(18న) రాత్రి ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ద్రవ్య విధాన నిర్ణయాలు వెల్లడించనున్నారు. రెండురోజుల ఫెడ్ పాలసీ సమావేశంలో ద్రవ్య కమిటీ తీసుకొనే నిర్ణయాలు భారత్‌తో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల గమనానికి అత్యంత కీలకం కానున్నాయి. అలాగే పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలను విదేశీ ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే అవకాశం ఉంది. ప్రథమార్థంలో రూ.27,856 కోట్లుఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు అంచనాలతో పాటు దేశీయ మార్కెట్ స్థిర్వతం కారణంగా సెప్టెంబర్ ప్రథమార్థం(1–15న) విదేశీ ఇన్వెస్టర్లు రూ.27,856 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. ‘‘అగ్ర రాజ్యాలైన అమెరికా, చైనాల ఆర్థిక మందగమన భయాలతో ఎఫ్ఐఐలు తమ కేటాయింపులను పునశ్చరణ చేసుకోవచ్చు. రిస్క్ సామర్థ్యాన్ని తగ్గించుకునే వ్యూహాం అమలు చేసినట్లయితే భారత్ లాంటి వర్థమాన దేశాల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడుల తగ్గొచ్చు’’ అని మోజోపీఎంఎస్ ఇన్వెస్ట్మెంట్ సీఈవో సునీల్ దమానియా తెలిపారు. ఇదే సమీక్షా కాలం(సెపె్టంబర్ 1–13 తేదీల)లో డెట్ మార్కెట్లో రూ.7,525 కోట్ల పెట్టుడులు పెట్టారు. ఎఫ్ఐఐలు ఆగస్టులో రూ.7,320 కోట్లు, జూలైలో రూ.32,365 కోట్లు, జూలైలో రూ.26,565 కోట్లు చొప్పున విక్రయాలు జరిపారు. -
సూచీలకు ఫెడ్ జోష్
ముంబై: ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ వడ్డీరేట్ల తగ్గింపు ఆశలను సజీవంగా ఉంచడంతో గురువారం స్టాక్ సూచీలు లాభాలు ఆర్జించాయి. సెన్సెక్స్ 539 పాయింట్లు పెరిగి 72,641 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 173 పాయింట్లు లాభపడి 22,012 వద్ద నిలిచింది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా బుధవారం రాత్రి ‘ద్రవ్యోల్బణం దీర్ఘకాలిక లక్ష్యానికి మించి ఉన్నప్పటికీ, ఈ ఏడాదిలో మూడు సార్లు వడ్డీరేట్ల కోత ఉంటుంది’ అని పావెల్ సంకేతాలిచ్చారు. దీంతో అమెరికాతో సహా ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. సెన్సెక్స్ ఉదయం 405 పాయింట్లు పెరిగి 72,507 వద్ద, నిఫ్టీ 151 పాయింట్లు బలపడి 21,990 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు రోజంతా ట్రేడయ్యాయి. ముఖ్యంగా మెటల్, విద్యుత్, ఇంధన షేర్లు సూచీల ర్యాలీకి ప్రాతినిథ్యం వహించాయి. ఒక దశలో సెన్సెక్స్ 781 పాయింట్లు ఎగసి 72,881 వద్ద, నిఫ్టీ 242 పాయింట్లు బలపడి 22,081 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. కొంతకాలంగా అమ్మ కాల ఒత్తిడికి లోనైన చిన్న, మధ్య తరహా షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ ఇండెక్సులు వరుసగా 2.36%, 2.01% చొప్పున ర్యాలీ చే శాయి. ఈ ఏడాది జూన్ నుంచి ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చనే ఆశలతో బుధవారం అమెరికా మార్కెట్లు జీవితకాల గరిష్టాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో రూ.5.72 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. బీఎస్ఈ కంపెనీల మొత్తం విలువ రూ. 379 లక్షల కోట్లకు చేరింది. క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ లిస్టింగ్ లాభాలు మాయం క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సరీ్వసెస్ లిమిటెడ్ లిస్టింగ్ లాభాలు నిలుపుకోలేకపోయింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.715)తో పోలిస్తే 11% ప్రీమియంతో రూ.795 వద్ద లిస్టయ్యింది. ఇంట్రాడేలో అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో లిస్టింగ్ లాభాలన్నీ మాయమయ్యాయి. చివరికి రూ.0.38% నష్టంతో రూ.712 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.995 కోట్లుగా నమోదైంది. -
Interim Budget 2024: ప్చ్..నచ్చలే! సెన్సెక్స్ నష్టం 107 పాయింట్లు
ముంబై: సుస్థిర అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ స్టాక్ మార్కెట్‌ను మెప్పించకలేకపోయింది. మౌలిక వసతుల రంగానికి అంచనాల కంటే తక్కువ కేటాయింపులు, ఆదాయం పన్ను శ్లాబులు య«థాతథంగా కొనసాగింపు నిర్ణయాలు నిరాశపరిచాయి. మరోవైపు ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి సందర్భంగా చైర్మన్ పావెల్ ఈ మార్చిలోనూ కీలక వడ్డీ రేట్ల తగ్గింపు ఉండకపోవచ్చనే సంకేతాలిచ్చారు. ఇన్వెస్టర్లు క్యాపిటల్ గూడ్స్, మెటల్, రియల్టీ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఫలితంగా సెన్సెక్స్ 107 పాయింట్లు నష్టపోయి 71,645 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లు దిగివచ్చి 21,698 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో ఒడిదుడుకులు... సార్వత్రిక ఎన్నికల ముందు ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనే అంచనాలతో ఉదయం స్టాక్ మార్కెట్ లాభాలతో మొదలైంది. సెన్సెక్స్ 247 పాయింట్లు పెరిగి 71,999, నిఫ్టీ 55 పాయింట్ల లాభంతో 21,781 వద్ద ట్రేడింగ్ ప్రారంభించింది. జనరంజక బడ్జెట్ సమర్పణ ఆశలతో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగ సమయం(గంటసేపు)లో సెన్సెక్స్ 400 పాయింట్లు పెరిగి 72,151 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు బలపడి 21,833 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే స్టాక్ మార్కెట్‌కు ఉత్సాహాన్నిచ్చే ప్రకటలేవీ వెలువడకపోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ పాల్పడ్డారు. ఫలితంగా ఆరంభ లాభాలు కోల్పోయిన సూచీలు చివరికి నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 576 పాయింట్ల పరిధిలో నిఫ్టీ 174 పాయింట్ల రేంజ్లో కదలాడింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ► బడ్జెట్ ప్రకటన రోజు గత ఆరేళ్లలో స్టాక్ మార్కెట్ నాలుగు పర్యాయాలు లాభపడగా., రెండుసార్లు నష్టాలు చవిచూసింది. 2023, 2022, 2021, 2019 ఏడాదిల్లో పెరిగింది. కాగా, 2020, 2024 ఏడాదిల్లో పతనాన్ని చవిచూసింది. ► బాండ్లపై రాబడులు తగ్గడంతో ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పీఎస్బీ, ఐఓబీ, యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ షేర్లు 7–5%, కెనరా బ్యాంక్, పీఎన్బీ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ షేర్లు 4–3% పెరిగాయి. మహారాష్ట్ర బ్యాంక్, ఎస్బీఐలు 2–1% లాభపడ్డాయి. ఎన్ఎస్ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ 3.11% లాభపడింది. ► రైల్వే సంబంధిత స్టాకులు ఆరంభ లాభాలు కోల్పోయి నష్టాలు మూటగట్టుకున్నాయి. ఇర్కాన్ 3.69%, రైల్వే వికాస్ నిగమ్ 3.49%, రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ 3%, జుపిటర్ వేగన్స్ 2% పతనమమయ్యాయి. ఐఆర్సీటీసీ 1.50%, టెక్స్మాకో రైల్ ఇంజనీరింగ్, టిటాఘర్ రైల్వే సిస్టమ్స్ 1% నష్టపోయాయి. ► చరిత్రాత్మకంగా పరిశీలిస్తే మధ్యంతర బడ్జెట్ వేళ ఈక్విటీ మార్కెట్లు పెద్దగా స్పందించలేదు. ఈ ఏడాది అదే పునరావృతమైంది. మూలధన వ్యయాలకు కేటాయింపుల స్వల్ప పెంపు, ద్రవ్య లోటు 5.5% నుంచి 5.1%కి తగ్గింపు లక్ష్యం మినహా ఉత్సాహాన్నిచ్చే ఇతర ప్రకటలేవీ వెలువడలేదు. ప్రసంగం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడ్డారు. ద్రవ్యోల్బణం అదుపులోకి వచ్చే వరకు వడ్డీరేట్ల తగ్గింపు యోచన సముచితంకాదని ఫెడ్ చైర్మన్ వ్యాఖ్యలతో అమెరికా పదేళ్ల బాండ్లపై రాబడులు 4% పెరగడం ప్రతికూల ప్రభావం చూపింది – యస్ సెక్యూరిటీస్ ఎండీ అమర్ అంబానీ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బాధ్యతాయుత, వినూత్న, సమిళిత మధ్యంతర బడ్జెట్‌ను సమరి్పంచారు. ఆర్థిక ఉత్పత్తులకు అధిక ప్రాధాన్యతనిస్తూ., ప్రైవేట్ మూల పెట్టుబడులకు అవకాశం కల్పించారు. జాతీయ ప్రాముఖ్యతలున్న రంగాల వృద్ధికి మరోసారి పటిష్ట పునాదులు వేశారు’’ – బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి -
Fed Meeting: వడ్డీరేట్ల పెంపు తప్పదు: ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్
ప్రస్తుతం నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో పకడ్బందీ ఆర్థిక వ్యవస్థ ఏర్పాటుకు వడ్డీరేట్లు పెంచాల్సిందేనని యూఎస్ ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సి ఉందని పావెల్ సంకేతాలిచ్చారు. ఇందుకు రానున్న రోజుల్లో వడ్డీరేట్లు పెంచక తప్పదని ప్రకటించారు. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినా ఇంకా ఆందోళనకర స్థాయిలోనే కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం రెండు శాతానికి పడిపోయేంత వరకు వడ్డీరేట్లు పెంచే అవకాశం ఉందన్నారు. ఫెడరల్ రిజర్వ్ గతంలోలాగా వడ్డీరేట్లను పెంచకపోవచ్చనే అభిప్రాయాలు ఉండేవి. కానీ పావెల్ తెలిపిన వివరాలతో గ్లోబల్ మార్కెట్లు, ఇండియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. పెడరల్ రిజర్వ్ బెంచ్‌మార్క్ రుణ రేటు 22 సంవత్సరాల గరిష్ఠ స్థాయికి చేరుకుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెట్టకుండా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడమే ఇప్పుడున్న లక్ష్యంగా తెలుస్తుంది. గత సంవత్సరం జూన్‌లో గరిష్ట స్థాయికి చేరిన ప్రధాన ద్రవ్యోల్బణం.. ప్రస్తుతం సగానికి పైగా తగ్గినప్పటికీ, వడ్డీరేట్లు పెంపు ప్రక్రియ దీర్ఘకాలికంగా కొనసాగవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గురువారం అమెరికాలో టెక్ షేర్లలో వచ్చిన అమ్మకాల వెల్లువ అక్కడి మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. యూఎస్‌లో బాండ్ల రాబడులు మరింత పెరగడం కూడా ప్రతికూలంగా మారింది. -
ఆరోసారి ఫెడ్ వడ్డీ పెంపు
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావం చూపగల యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ మరోసారి వడ్డీ రేట్ల పెంపును చేపట్టింది. రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) ద్రవ్యోల్బణ కట్టడే ప్రధాన ఎజెండాగా వరుసగా ఆరోసారి ఫండ్స్ రేట్లను పెంచింది. తాజాగా 0.75 పెంపును ప్రకటించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 3.75–4 శాతానికి చేరాయి. దీంతో వరుసగా నాలుగోసారి 0.75 శాతం చొప్పున రేట్లను పెంచినట్లయ్యింది. ఈ ఏడాది(2022) ఇప్పటివరకూ ఎఫ్‌వోఎంసీ వడ్డీ రేట్లను 3.75 శాతం హెచ్చించింది. ద్రవ్యోల్బణం గత 40 ఏళ్లలోలేని విధంగా 8 శాతాన్ని అధిగమించడంతో ఫెడ్ ధరల కట్టడికి అత్యంత కీలకమైన వడ్డీ రేట్ల పెంపు మార్గాన్ని ఎంచుకుంది. తాజాగా సెప్టెంబర్‌లోనూ వినియోగ ధరల ఇండెక్స్ 8.2 శాతాన్ని తాకింది. -
ఫెడ్ వడ్డీ రేటు పెంపు షాక్
న్యూయార్క్: గత మూడు దశాబ్దాలలోలేని విధంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేట్లను 0.75 శాతంమేర పెంచింది. దీంతో ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 1.5–1.75 శాతానికి చేరాయి. మంగళవారం ప్రారంభమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) సమావేశాలు బుధవారం ముగిశాయి. ద్రవ్యోల్బణం ఇటీవల అదుపు తప్పడంతో ఫెడరల్ రిజర్వ్ కఠిన తర విధానాలవైపు మొగ్గు చూపుతోంది. గత నెల(మే)లో ద్రవ్యోల్బణం 8.6 శాతాన్ని తాకింది. ఇది 40ఏళ్లలోనే అత్యధికంకాగా.. మే నెలలో జరిగిన గత సమావేశం తదుపరి కూడా ఫెడ్ 0.5 శాతం ఫండ్స్ రేట్లను హెచ్చించిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరం తరువాత ఈ స్థాయిలో వడ్డీ రేట్లను పెంచడం గత నెలలోనే జరిగింది. కాగా.. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణ పరిస్థితులు(స్టాగ్ఫ్లేషన్) తలెత్తనున్నట్లు విశ్లేషకులు ఇటీవల అంచనా వేస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా యూఎస్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి. -
రూపాయి.. అధరహో
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 53 పైసలు బలపడి 73.69 స్థాయికి చేరింది. గడచిన 10 వారాల్లో రూపాయి ఇంత స్థాయిలను చూడ్డం (జూన్ 16 తర్వాత) ఇదే తొలిసారి. సరళతర ఆర్థిక విధానాలనే అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ కొనసాగిస్తుందన్న అంచనాలు, ఈక్విటీ మార్కెట్ల బులిష్ వైఖరి వంటి అంశాలు రూపాయి భారీగా బలపడ్డానికి కారణమని నిపుణుల అంచనా. ఫారెన్ బ్యాంకుల డాలర్ అమ్మకాలు, దేశంలోకి విదేశీ నిధులు భారీగా వస్తాయన్న అంచనాలు కూడా రూపాయి బలోపేతానికి కారణం. రూపాయి గురువారం ముగింపు 74.22. దీనితో పోల్చితే శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాలతో 74.17 వద్ద ప్రారంభమైంది. వారంలో రూపాయి 70 పైసలు బలపడింది. ఈ వార్త రాస్తున్న శుక్రవారం రాత్రి 11.30 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 73.78 వద్ద ట్రేడవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ 93పైన ట్రేడవుతోంది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). చదవండి : వడ్డీ రేట్ల పెంపు దిశగా అమెరికా -
37,000 దిగువన మరింత పతనం
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ హఠాత్తుగా అరశాతం వడ్డీ రేటును తగ్గించడంతో పాటు పలు ప్రధాన కేంద్ర బ్యాంకులు ఉద్దీపనలకు సిద్ధంగా వున్నట్లు ప్రకటించినప్పటికీ, కరోనావైరస్ పలు ప్రపంచదేశాల్లో తీవ్రంగా వ్యాప్తిచెందడంతో మార్కెట్ల పతనం కొనసాగుతూ వుంది. ఈ తరహా కేంద్ర బ్యాంకుల సాయం.. ఇన్వెస్టర్లను సమీప భవిష్యత్తులో శాంతింపచేస్తుందా అన్నది అనుమానమే. వ్యాధివ్యాప్తి తగ్గుముఖం పట్టి, ఉత్పత్తి, విక్రయాలు తిరిగి సాధారణస్థాయికి చేరుకుంటున్న సంకేతాలు కన్పిస్తేనే ఈక్విటీ మార్కెట్లు స్థిరపడగలుగుతాయన్నది అత్యధిక విశ్లేషకుల భావన. ఇక మన సూచీల స్వల్పకాలిక సాంకేతికాలు ఇలా వున్నాయి... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... మార్చి6తో ముగిసినవారంలో గత మార్కెట్ పంచాంగంలో ప్రస్తావించిన 39,090 పాయింట్ల గరిష్టస్థాయికి చేరాక బీఎస్ఈ సెన్సెక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడితో 37,011 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితం వారం ముగింపుతో పోలిస్తే 720 పాయింట్ల నష్టంతో 37,577 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారపు పతనక్రమంలో గతేడాది అక్టోబర్9నాటి ‘స్వింగ్ లో’ అయిన 37,415 స్థాయిని శుక్రవారం ఇంట్రాడేలో సెన్సెక్స్ కోల్పోయినందున, కరెక్షన్ మరిన్ని రోజులు కొనసాగే అవకాశాలున్నాయి. ఈ వారం సెన్సెక్స్ నెగిటివ్‌గా మొదలైతే 37,000 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. దీన్ని కాపాడుకోలేకపోతే వేగంగా 36,720 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం వదులుకుంటే 35,990 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకోగలిగితే తొలుత 37,750 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 38,385 పాయింట్ల స్థాయిని చేరవచ్చు. అటుపై క్రమేపీ 38,890 పాయింట్ల వరకూ పెరగవచ్చు. నిఫ్టీ 10,830 మద్దతు కోల్పోతే మరింత కరెక్షన్... క్రితంవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ, గత కాలమ్‌లో ప్రస్తావించినట్లే 11,390 పాయింట్ల వరకూ పెరిగాక వేగంగా 10,827కు పతనమయ్యింది. చివరకు అంతక్రితం వారంతో పోలిస్తే 213 పాయింట్ల నష్టంతో 10,989 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ గతేడాది అక్టోబర్9నాటి ‘స్వింగ్ లో’ అయిన 11,090 పాయింట్ల దిగువనే ముగిసినందున, రానున్న వారాల్లో 10,670 వరకూ పతనం కొనసాగే అవకాశాలు ఎక్కువగా వున్నాయి. ఇక ఈ వారం 10,830 పాయింట్ల స్థాయి తొలి మద్దతు. ఇది పోతే.. వేగంగా 10,670 పాయింట్ల దాకా తగ్గొచ్చు. ఈ లోపున 10,580 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ వారం తొలి మద్దతుస్థాయిని పరిరక్షించుకుంటే 11,035 పాయింట్ల వరకూ పెరగవచ్చు. అటుపైన 11,250 పాయింట్లు, ఆ తర్వాత క్రమేపీ 11,390 వరకూ పెరగవచ్చు. – పి. సత్యప్రసాద్ -
‘బేర్’ బాజా!
ఈ ఏడాది మరో రేట్ల తగ్గింపు లేదని, ప్రస్తుత రేట్ల తగ్గింపు ‘తగ్గింపు సైకిల్’కు ఆరంభంగా పరిగణించకూడదని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలివ్వడంతో గురువారం మన స్టాక్ మార్కెట్ భారీగా పతనమైంది. కీలక పరిశ్రమలు, ద్రవ్యలోటు, వాహన విక్రయాల గణాంకాలు, కంపెనీల క్యూ1 ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం ప్రతికూల ప్రభావం చూపించాయి. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 పైసలు పతనం కావడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ కీలకమైన 11,000 పాయింట్ల దిగువకు పతనమైంది. 138 పాయింట్ల నష్టంతో 10,980 వద్ద ముగిసింది. ఇక బీఎస్ఈ సెన్సెక్స్ 463 పాయింట్లు క్షీణించి 37,018 పాయింట్ల వద్దకు చేరింది. ఈ ఏడాది మార్చి తర్వాత సెన్సెక్స్, నిఫ్టీలు ఈ స్థాయిలకు పడిపోవడం ఇదే మొదటిసారి. ఈ రెండు సూచీలకు ఇది దాదాపు ఐదు నెలల కనిష్ట స్థాయి. ముడి చమురు ధరలు చెప్పుకోదగిన స్థాయిలో పడిపోయినా, మన మార్కెట్ పతనం ఆగలేదు. అయితే చివర్లో కొన్ని బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో నష్టాలు ఒకింత రికవరీ అయ్యాయి. సెన్సెక్స్ 787 పాయింట్లు డౌన్... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్ నష్టాల్లోనే ఆరంభమైంది. రోజులు గడుస్తున్న కొద్దీ నష్టాలు అంతకంతకూ పెరిగాయి. ఎన్ఎస్ఈ వీక్లీ ఆప్షన్ల ముగింపు కారణంగా మార్కెట్లో తీవ్రమైన ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్787 పాయింట్లు, నిఫ్టీ 204 పాయింట్ల వరకూ నష్టపోయాయి. ట్రేడింగ్ చివరి గంటలో కొంత నష్టాల రికవరీ జరిగింది. ఇంధన, వాహన షేర్లు లాభపడటంతో నష్టాలు తగ్గాయి. మారుతీ సుజుకీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ ద్వయం, హిందుస్తాన్ యూని లివర్ షేర్లలో కొనుగోళ్లు జరిగాయి. ఈ రికవరీ కారణంగా సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 10,900 పాయింట్లపైన ముగియగలిగాయి. నికాయ్ మినహా ఇతర ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగియగా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. మరిన్ని విశేషాలు... ► వేదాంత షేర్ 5.5% నష్టంతో రూ.145 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 600కు పైగా షేర్లు ఇంట్రాడేలో ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. ఐషర్ మోటార్స్, బ్లూడార్ట్, ఎౖMð్స డ్ ఇండస్ట్రీస్, వీఎస్టీ టిల్లర్స్, కేర్ రేటింగ్స్, ఎస్కార్ట్స్, ఆర్తి ఇండస్ట్రీస్, వేదాంత, టాటా మోటార్స్, హిదాల్కో, బయోకా న్, ఓకార్డ్, గెయిల్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, తదతర షేర్లు జాబితాలో ఉన్నాయి. ► ఓపెన్హీమర్ కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినప్పటికీ, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ 4 శాతం మేర నష్టపోయి రూ.347 వద్ద ముగిసింది. ► స్టాక్ మార్కెట్ భారీ పతనంలోనూ 16 షేర్లు ఏడాది గరిష్ట స్థాయికి ఎగిశాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గుజరాత్ స్టేట్ పెట్రోనెట్, వైభవ్ గ్లోబల్ ఈ జాబితాలో ఉన్నాయి. 1.6 లక్షల కోట్లు ఆవిరి స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో రూ.1.6 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.6 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.1,39,87,400 కోట్లకు తగ్గింది. తాజా బడ్జెట్ నుంచి చూస్తే, రూ.13.70 లక్షల కోట్లు సంపద ఆవిరైంది. రెండు నెలల్లో 9 శాతం డౌన్ ఎన్ఎస్ఈ నిఫ్టీ ఈ ఏడాది జూన్ 3న రికార్డ్ స్థాయి, 12,103 పాయింట్లను తాకింది. అప్పటి నుంచి కేవలం రెండు నెలల్లో 11,000 పాయింట్లకు (9%) పడిపోయింది. ఈ రెండు నెలల కాలంలో వాహన, బ్యాంక్, ఇంధన, మౌలిక, లోహ షేర్లు బాగా నష్టపోయాయి. ఇక నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 13%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 16% చొప్పున క్షీణించాయి. అంతేకాకుండా నిఫ్టీ 500 సూచీలోని 300కు పైగా షేర్లు 50–90 శాతం రేంజ్లో పతనమయ్యాయి. కాక్స్ అండ్ కింగ్స్, జెట్ ఎయిర్వేస్, సింటెక్స్ ప్లాస్టిక్స్, రిలయన్స్ క్యాపిటల్, డీహెచ్ఎఫ్ఎల్, జైన్ ఇరిగేషన్ , రిలయన్స్ ఇన్ఫ్రా, వొడాఫోన్ ఐడియా తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. పతనానికి కారణాలు ఇవీ.... ► ఫెడ్ కామెంట్స్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లను తగ్గించింది. దీంతో రేట్లు 2.0–2.25 శాతం రేంజ్లో ఉన్నాయి. పదేళ్ల తర్వాత తొలిసారిగా ఫెడ్ రేట్లను తగ్గించింది. అయితే ఈ తగ్గింపు, రేట్ల తగ్గింపు సైకిల్‌కు ఆరంభం కాదని ఫెడ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. దీంతో సమీప భవిష్యత్తులో మరో రేట్ల పెంపు ఉండకపోవచ్చని ఫెడ్ సంకేతాలిచ్చినట్లయింది. ఇది మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య జరుగుతున్న తాజా చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే ముగియడం కూడా ప్రతికూల ప్రభావం చూపించింది. ► గణాంకాల నిరుత్సాహం: ఈ ఏడాది జూన్‌లో ఎనిమిదికీలక పరిశ్రమల వృద్ధి 0.2 శాతం తగ్గింది. సిమెంట్ ఉత్పత్తి, చమురు సంబంధిత రంగాల్లో మందగమనం చోటు చేసుకోవడం దీనికి కారణం. మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్లో ద్రవ్యలోటు 61.4 శాతానికి (రూ.4.32 లక్షల కోట్లు) చేరింది. ఈ గణాంకాలు ఇన్వెస్టర్లలో నిరుత్సాహాన్ని నింపాయి. ► ఉత్తేజాన్నివ్వని వాహన విక్రయాలు: ఈ ఏడాది జూన్‌లో వాహన విక్రయాలు అంతంతమాత్రంగానే ఉన్నాయని కంపెనీలు వెల్లడించిన గణాంకాలు పేర్కొన్నాయి. ► కొనసాగుతున్న విదేశీ నిధుల ఉపసంహరణ: సంపన్నులపై విధించిన అదనపు పన్ను భారం విదేశీ ఇన్వెస్టర్లకు కూడా వర్తిస్తుంది. ఈ పన్ను విషయంలో వెనక్కి తగ్గేది లేదంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలుమార్లు స్పష్టం చేయడంతో విదేశీ ఇన్వెస్టర్లు తమ నిధులను వెనక్కి తీసుకుంటున్నారు. బడ్జెట్ నుంచి ఇప్పటివరకూ ఎఫ్‌పీఐలు 300 కోట్ల డాలర్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారని అంచనా. మన స్టాక్ మార్కెట్ జోరుకు కీలకమైన విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటుండటంతో మార్కెట్లో నష్టాలు కొనసాగుతున్నాయి. గత నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.16,870 కోట్ల మేర తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. ఈ ఏడాది ఇదే ఎఫ్‌పీఐల అత్యధిక పెట్టుబడుల ఉపసంహరణ. సూపర్ రిచ్ పన్నుతో కినుక వహించిన విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. నిధుల ఉపసంహరణ కొనసాగుతుందని నిపుణులంటున్నారు. ► రూపాయి పతనం: డాలర్‌తో రూపాయి మారకం విలువ 41 పైసలు నష్టపోయింది. రూపాయి విలువ గురువారం నాటి ట్రేడింగ్‌లో ఒక దశలో 69.20కు పడిపోయింది. -
పసిడి భవితపై ‘ఫెడ్’ రేటు ప్రభావం
అమెరికా ఆర్థిక పరిస్థితి, కీలక వడ్డీ రేట్లపై (ప్రస్తుతం 2.25 నుంచి 2.50 శాతం శ్రేణి) బుధవారం (20వ తేదీ) ఫెడరల్ రిజర్వ్ పరపతి సమీక్షా కమిటీ తీసుకునే నిర్ణయంపై పసిడి సమీప భవిష్యత్ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఫ్యూచర్స్ కమోడిటీ మార్కెట్– నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) 1,200 డాలర్ల నుంచి ప్రారంభమైన పసిడి తాజా ర్యాలీకి 1,346 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం ఎదురయిన సంగతి తెలిసిందే. అటు తర్వాత కీలకమైన 1,300 డాలర్ల లోపునకు పడిపోయినా, పటిష్టంగా కొనసాగుతోంది. 15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 4 డాలర్ల లాభంతో 1,302 డాలర్ల వద్ద ముగిసింది. అమెరికా ఆర్థిక వృద్ధి, డాలర్ కదలికలు (15వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో 96), అమెరికా, చైనా వాణిజ్య యుద్ధం వంటి అంశాలపై తదుపరి పసిడి కదలికలు ఆధారపడి ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే సమీపకాలంలో పసిడి ధోరణి పటిష్టంగానే ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు సైతం తమ విదేశీ మారకద్రవ్య నిల్వల్లో భాగంగా పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. దేశంలో 32–33 వేల మధ్య స్థిరీకరణ ... కాగా డాలర్ మారకంలో రూపాయి పటిష్టత దేశీయ పసిడి ధరపై ప్రభావం చూపుతోంది. దేశీయ ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం 24పైసలు లాభపడి 69.10కి చేరిన సంగతి తెలిసిందే. గడచిన ఐదు రోజుల్లో 104 పైసలు బలపడింది. అందువల్ల పసిడి అంతర్జాతీయ భారీగా పెరిగినా, దేశీయంగా సమీప కాలంలో అంతర్జాతీయ పెరుగుదల ధోరణి పూర్తిస్థాయిలో ప్రతిబింబించకపోవచ్చన్నది నిపుణుల అభిప్రాయం. అయితే ఆయా అంశాల నేపథ్యంలోదేశీయంగా పసిడి 10 గ్రాముల ధర రూ.32,000–33,000 మధ్య స్థిరీకరణ పొందవచ్చన్నది విశ్లేషణ. దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్ ఎంసీఎక్స్‌లో పసిడి 10 గ్రాముల ధర శుక్రవారం రూ. 31,826 వద్ద ముగిసింది. కాగా ముంబై స్పాట్ మార్కెట్లో 24, 22 క్యారెట్ల ధరలు వరుసగా రూ.32,870, రూ.31,300 వద్ద ముగిశాయి. -
కీలక అవరోధశ్రేణి 36,285–36,560
ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు ఉత్సాహాన్నిచ్చే ప్రకటన గత శుక్రవారం వెలువడింది. ఆర్థిక ఉద్దీపన ఉపసంహరణ, వడ్డీ రేట్ల పెంపు అంశాల్లో మార్కెట్ల భయాందోళనలను పరిగణనలోకి తీసుకుంటామని, తమ పాలసీ ఫైనాన్షియల్ మార్కెట్లకు ఇబ్బందిగా పరిణమిస్తున్నదని భావిస్తే పాలసీని సమీక్షిస్తామంటూ అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పొవెల్ చేసిన ప్రకటనతో అమెరికా, యూరప్ మార్కెట్లు పెద్ద ర్యాలీ జరిపాయి. ఈ బాటలోనే ఆసియా ఇండెక్స్ ఫ్యూచర్లు భారీగా పెరిగాయి. సంవత్సరాంతపు సెలవుల తర్వాత సాధారణంగా జనవరి రెండోవారం నుంచి మన మార్కెట్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహించే విదేశీ ఇన్వెస్టర్లు, ఫెడ్ తాజా ప్రకటనతో భారత్ మార్కెట్లో పెట్టుబడుల్ని పునర్ప్రారంభిస్తారా, అమ్మకాలకు తెరతీస్తారా అనే అంశం సమీప భవిష్యత్తులో మన మార్కెట్ ట్రెండ్‌ను నిర్దేశించగలదు. ఇక సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... సెన్సెక్స్ సాంకేతికాలు... జనవరి 4తో ముగిసిన నాలుగురోజుల ట్రేడింగ్వారం ప్రధమార్థంలో 36,285 పాయింట్ల గరిష్టస్థాయివరకూ పెరిగిన బీఎస్ఈ సెన్సెక్స్ ద్వితీయార్థంలో వేగంగా 35,382 పాయింట్ల కనిష్టస్థాయికి పడిపోయింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 382 పాయింట్ల నష్టంతో 35,695 పాయింట్ల వద్ద ముగిసింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్ భారీ ర్యాలీ ఫలితంగా ఈ వారం గ్యాప్‌అప్‌తో మార్కెట్ మొదలైతే సెన్సెక్స్‌కు 36,235 పాయింట్ల వద్ద తక్షణఅవరోధం కలగవచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 36,285–36,560 పాయింట్ల నిరోధశ్రేణిని అధిగమించడం సెన్సెక్స్ భవిష్యత్ ట్రెండ్‌కు కీలకం. ఈ స్థాయిపైన ముగిస్తే క్రమేపీ 36,800–37,050 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం పైన ప్రస్తావించిన కీలక నిరోధశ్రేణిని దాటలేకపోయినా, సోమవారం మార్కెట్ నిస్తేజంగా ప్రారంభమైనా 35,380 పాయింట్ల వద్ద సెన్సెక్స్‌కు తొలి మద్దతు లభిస్తున్నది. ఈ లోపున ముగిస్తే తిరిగి 35000 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే క్రమేపీ 34,400 పాయింట్ల వరకూ పతనం కొనసాగవచ్చు. నిఫ్టీ కీలక నిరోధశ్రేణి 10925–10,985 గతవారం 10,924 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 10,629 పాయింట్ల కనిష్టస్థాయికి తగ్గిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 133 పాయింట్ల నష్టంతో 10,727 వద్ద ముగిసింది. ఈ వారం నిఫ్టీ గ్యాప్‌అప్‌తో మొదలైతే 10,895 పాయింట్ల వద్ద తక్షణ అవరోధం కలగవచ్చు. అటుపైన కీలక నిరోధ శ్రేణి 10925–10,985 పాయింట్లు. గత మూడువారాలుగా పలుదఫాలు ఈ శ్రేణి అవరోధాన్ని కల్గించినందున, ఈ శ్రేణిని దాటితేనే తదుపరి అప్‌ట్రెండ్ సాధ్యపడుతుంది. ఈ స్థాయిపైన స్థిరపడితే క్రమేపీ 11,035–11,150 శ్రేణి వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం పైన సూచించిన కీలక నిరోధశ్రేణిని దాటలేకపోయినా, ఈ సోమవారం నిఫ్టీ బలహీనంగా ప్రారంభమైనా 10,630 వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 10,535 స్థాయిని తిరిగి పరీక్షించవచ్చు. అటుపై కొద్దిరోజుల్లో 10,330 పాయింట్ల వరకూ క్షీణత కొనసాగే ప్రమాదం ఉంటుంది. -
ఫెడ్ వడ్డీ రేటు పావు శాతం పెంపు..
వాషింగ్టన్: అంచనాలకు అనుగుణంగానే అమెరికా ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) కీలక వడ్డీ రేట్లను పావు శాతం మేర పెంచింది. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 2–2.25 శాతానికి చేరింది. ఉద్యోగాల కల్పన మెరుగ్గా ఉండటం, వ్యాపారాలపై పెట్టుబడులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రెండు రోజుల ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం ఫెడ్ వెల్లడించింది. దీంతో 2015 నుంచి ఇప్పటిదాకా ఎనిమిది సార్లు వడ్డీ రేట్లు పెంచినట్లయింది. ఈ ఏడాది మరోమారు వడ్డీ రేట్ల పెంపు ఉండొచ్చని ఫెడ్ సూచనప్రాయంగా తెలిపింది. స్థూల దేశీయోత్పత్తి రెండో త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన 4 శాతం మేర వృద్ధి నమోదు చేయడం, నిరుద్యోగిత చరిత్రాత్మక కనిష్ట స్థాయి 4 శాతం దరిదాపుల్లో ఉండటంతో పాటు ద్రవ్యోల్బణం కూడా అంచనాలకు తగ్గట్లు రెండు శాతానికి చేరడం తదితర అంశాలు వడ్డీ రేట్ల పెంపునకు కారణమైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, త్వరితగతిన వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం కూడా అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఫెడ్ పాలసీ : పడిపోతున్న మార్కెట్లు
ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు పతనమవడానికి రోజుకో కారణం దొరుకుతోంది. వరుసగా ఐదు రోజుల నుంచి పతనమవుతూ వచ్చిన మార్కెట్లు, ఏదో నిన్న మాత్రం షార్ట్ కవరింగ్ కలసివచ్చి కొనుగోళ్లతో కళకళలాడాయి. నేడు కూడా అదే జోష్‌లో ప్రారంభమయ్యాయి. కానీ ఆ జోష్ ఎంతో సేపు నిలువలేదు. మరికొన్ని గంటల్లో అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంక్ తన పాలసీ నిర్ణయాన్ని ప్రకటించనుందనే వార్తల నేపథ్యంలో మళ్లీ భారీ నష్టాల బాట పట్టాయి స్టాక్ మార్కెట్లు. మరికొన్ని గంటల్లో ప్రకటించబోయే ఫెడ్ పాలసీలో కచ్చితంగా వడ్డీరేట్లను పెంచుతుందనే మెజార్టీ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. దీంతో సెన్సెక్స్ మధ్యాహ్నం ట్రేడింగ్ సమయానికి 250 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ 11,050 మార్కు కిందకి దిగొచ్చింది. ముఖ్యంగా ఫైనాన్సియల్, పీఎస్‌యూ బ్యాంకింగ్ షేర్లు దేశీయ సూచీలను పడగొడుతున్నాయి. ఆటోమొబైల్స్, ఎఫ్ఎంసీజీ సెక్టార్లలో కూడా ఒత్తిడి నెలకొంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా 1 శాతం కిందకి పడిపోయింది. టాప్ లూజర్లుగా టాటా మోటార్స్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్‌లు నష్టాలు గడిస్తున్నాయి. యస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండియాబుల్స్ హౌజింగ్ మాత్రమే లాభాల్లో నడుస్తున్నాయి. అటు ఫెడ్ వడ్డీరేట్లను పెంచనుందనే సంకేతాలతో బంగారం ధరలు స్తబ్దుగా ట్రేడవుతున్నాయి. రెండు రోజుల పాటు సమావేశమైన ఫెడ్ పాలసీ కమిటీ భేటి నేటితో ముగుస్తుంది. నేడు ఫెడ్ నిర్ణయం వెల్లడించనున్నారు. ఒకవేళ ఫెడ్ రేట్లు పెరిగితే, రూపాయి విలువ మరింత ఒడిదుడుకులకు లోనుకావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. -
ఫెడ్ నిర్ణయం, రూపాయి కదలికలే కీలకం..!
న్యూఢిల్లీ: ఈవారంలో సూచీలు మరింత కన్సాలిడేషన్‌కు గురికావచ్చని మార్కెట్ పండితులు భావిస్తున్నారు. ముడి చమురు ధరల పెరుగుదల, డాలరు విలువ బలపడుతుండటం, ద్రవ్యలోటు వంటి పలు ఆందోళనకర అంశాల నేపథ్యంలో మార్కెట్ కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అన్నారు. ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం ఈవారంలో అత్యంత కీలక అంశంగా ఉంది. మన మార్కెట్లలో దిద్దుబాటు చోటుచేసుకుంటున్న క్రమంలో పలు రంగాలు, ఎంపిక చేసిన షేర్లలో వాల్యూ బయ్యింగ్‌కు అవకాశం కనిపిస్తోంది.’ అని వ్యాఖ్యానించారు. ఇక శుక్రవారం వెల్లడికానున్న ద్రవ్యలోటు, ఆగస్టు ఇన్ఫ్రా డేటాలు సైతం మార్కెట్‌పై ప్రభావం చూపనున్నాయని భావిస్తున్నారు. వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఫెడరల్ రిజర్వ్ బుధవారం ప్రకటించనున్న వడ్డీ రేట్ల కోసం ప్రపంచదేశాల మార్కెట్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఈసారి మరో 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు పెరిగేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రీసెర్చ్ సంస్థ రాయిటర్స్ అంచనా ప్రకారం.. సెప్టెంబర్ 25–26 సమావేశంలో పాలసీ రేటు 2 నుంచి 2–25 శాతానికి పెరిగేందుకు అవకాశం ఉంది. ఎఫ్‌ఓఎమ్‌సీ సమావేశం నేపథ్యంలో ఈవారంలో కన్సాలిడేషన్‌కు అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషకులు వీ కే శర్మ అన్నారు. గడిచిన సెషన్లలో చోటుచేసుకున్న కరెక్షన్ అనంతరం మార్కెట్ ఇంటర్మీడియట్ బోటమ్‌ను తాకినట్లు భావిస్తున్నామని వెల్లడించారు. వెంటాడుతున్న వాణిజ్య యుద్ధ భయాలు 200 బిలియన్ డాలర్ల చైనా దిగుమతులపై అమెరికా సుంకాలను విధించగా.. చైనా సైతం 110 బిలియన్ డాలర్ల అమెరికా దిగుమతులపై సుంకాలను ప్రకటించింది. ఈ రెండు దేశాల ట్యారిఫ్‌లు కూడా సోమవారమే అమల్లోకిరానున్నాయి. అమెరికా–చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య యుద్ధం ఇప్పట్లో ముగియకపోగా మరింత వేడెక్కే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ 72.91 స్థాయికి పడిపోయిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ముడిచమురు ధరలు, రూపాయి కదలికలపై దృష్టిసారిస్తున్నారు. 11,090 స్థాయిని కోల్పోతే మరింత దిగువకు 11,170 పాయింట్ల కీలక మద్దతు స్థాయిని కోల్పోయిన నిఫ్టీకి తక్షణ మద్దతు స్థాయి 11,090 వద్ద ఉందని, ఈ స్థాయిని కూడా కోల్పోతే మరింత కరెక్షన్ను చూడవచ్చని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ విశ్లేషించింది. పుల్‌బ్యాక్ ర్యాలీస్ నమోదైతే 11,250 అత్యంత కీలక నిరోధమని వివరించింది. -
బేరిష్‌గా బంగారం..
న్యూఢిల్లీ: బలపడుతున్న డాలరు, అమెరికా ఫెడ్ రేట్ల పెంపు అంచనాలు ఈ వారం బంగారానికి ప్రతికూలంగా ఉండొచ్చని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. వీటితో పాటు అమెరికాలో హైరింగ్ సరళి మందగిస్తోందన్న అభిప్రాయాలను రూఢీ చేసుకునేందుకు జూలై ఉద్యోగిత గణాంకాలను కూడా ట్రేడర్లు నిశితంగా పరిశీలించవచ్చని అంచనాలు ఉన్నాయి. వీటితో పాటు అంతర్జాతీయంగా వాణిజ్య వివాదాలకు సంబంధించిన పరిణామాలపై సైతం మెటల్స్ ట్రేడర్లు దృష్టి పెట్టనున్నారు. ఈ నెలలో జరగబోయే సమావేశంలో ఫెడరల్ రిజర్వ్ సమావేశంలో రేట్లను పెంచే అవకాశాలున్నాయన్న అంచనాలు.. బంగారానికి ప్రతికూలంగా ఉండొచ్చని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. వీటన్నింటి దరిమిలా గత వారాంతంలో న్యూయార్క్ మెర్కంటైల్ ఎక్సే్చంజ్ కామెక్స్ విభాగంలో ఆగస్టు డెలివరీ బంగారం ఫ్యూచర్స్ ధర 0.29 శాతం తగ్గి 1,222.20 వద్ద ముగిసింది. మొత్తం మీద అంతర్జాతీయంగా వారంలో 0.56 శాతం, ఈ ఏడాది ఇప్పటిదాకా 6.4 శాతం మేర పసిడి రేటు క్షీణించినట్లయింది. దేశీయంగా మళ్లీ 31వేల పైకి.. పండుగల సీజన్, స్థానిక జ్యూయలర్ల కొనుగోళ్ల మద్దతుతో బంగారం ధర దేశీయంగా మళ్లీ కీలకమైన రూ. 31,000 మార్కు పైకి చేరింది. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాములకు రూ. 450 మేర పెరిగింది. మేలిమి బంగారం (99.9 శాతం స్వచ్ఛత) పది గ్రాముల ధర రూ. 31,350, ఆభరణాల బంగారం (99.5 శాతం స్వచ్ఛత) రేటు రూ. 31,200 వద్ద ముగిసింది. వెండి కిలో ధర రూ. 100 మేర పెరిగి రూ. 38,350 వద్ద క్లోజయ్యింది. -
వడ్డీరేట్లు : ఫెడ్ నో సర్ప్రైజ్
అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఎలాంటి సర్ప్రైజ్ను ఇవ్వలేదు. అందరి అంచనాలకు తగ్గట్టే ఫెడ్ వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్టు ఫెడరల్ రిజర్వు ప్రకటించింది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్లు1.75 శాతం నుంచి 2 శాతంగా కొనసాగనున్నాయి. రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశాలలో భాగంగా బుధవారం సాయంత్రం(భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి) ఫెడరల్ రిజర్వు తన పరపతి నిర్ణయాలను ప్రకటించింది. ప్రస్తుతం యథాతథంగా ఉన్నప్పటికీ, సెప్టెంబర్‌లో వడ్డీరేట్ల పెంపు ఉంటుందని సంకేతాలు ఇచ్చింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ ఇప్పటికే ఈ ఏడాదిలో రెండు సార్లు వడ్డీరేట్లు పెంచారు. 2018 ముగింపు నాటికి మరో రెండు సార్లు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుపై గత నెలలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించిన సంగతి తెలిసిందే. రేట్ల పెంపు, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనుందని మండిపడ్డారు. ఆర్థిక వృద్ధిని కొనసాగించడానికి వడ్డీరేట్లను తగ్గించాల్సివసరం ఉందని ట్రంప్ అన్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటంతో, ఫెడరల్ రిజర్వు తన వడ్డీరేట్లను పెంచడం ప్రారంభించింది. ద్రవ్యోల్బణం పెరుగుతుందంటే, ఆర్థిక వ్యవస్థ బాగానే ఉందనే విషయానికి సంకేతమని తెలిపింది. సేవింగ్స్వైపు నుంచి కూడా మంచి రిటర్నులు వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అంతేకాక జూలైలో ప్రైవేట్ రంగంలో అంచనాలను మించుతూ 2.19 లక్షల మందికి ఉపాధి లభించినట్లు కార్మిక శాఖ తాజాగా గణాంకాలు విడుదల చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్నదని, ఉపాధి మార్కెట్ పటిష్టమైందని, ద్రవ్యోల్బణం సైతం లక్ష్యానికి దగ్గరగా ఉన్నదని ఫెడ్ కమిటీ తాజాగా అభిప్రాయపడింది. సమీప భవిష్యత్‌లో ధరలు టార్గెట్‌ను మించిపోయే అవకాశంలేదని, దీంతో ప్రస్తుతానికి యథాతథ పాలసీ అమలుకే మొగ్గుచూపినట్టు జెరోమీ పావెల్ పేర్కొన్నారు. -
3 రోజుల లాభాలకు బ్రేక్
మూడు రోజుల లాభాలకు గురువారం బ్రేక్ పడింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచడం, మే నెల టోకు ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయి 4.43 శాతానికి పెరగడం, గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో కరెంట్ అకౌంట్ లోటు భారీగా పెరగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 139 పాయింట్ల నష్టంతో 35,600 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 49 పాయింట్లు పతనమై 10,808 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో 251 పాయింట్ల నష్టం అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్లను పావు శాతం పెంచింది. ఈ ఏడాది ఫెడ్ రేట్లను పెంచడం ఇది రెండోసారి. అంచనాలకు అనుగుణంగానే రేట్ల పెంపు ఉన్నప్పటికీ, ఈ ఏడాది మరో రెండు దఫాలు రేట్ల పెంపు ఉంటుందని సూచించడంతో ప్రపంచ మార్కెట్లు ప్రధానంగా ఆసియా మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ స్వల్ప లాభాలతో ఆరంభమైంది. అయితే ఆసియా మార్కెట్ల పతన ప్రభావంతో నష్టాల్లోకి జారిపోయింది. ఇంట్రాడేలో 251 పాయింట్లు నష్టపోయి 35,489 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. చివర్లో రిలయన్స్ లాభపడడంతో వంద పాయింట్లకు పైగా రికవరీ అయింది. వివిధ కేంద్ర బ్యాంక్‌ల సమావేశాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు పతనమవుతున్నాయని, ఇది మన మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపించిందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ మార్కెట్ స్ట్రాటజిస్ట్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. టోకు ద్రవ్యోల్బణం 14 నెలల గరిష్ట స్థాయికి పెరగడం, కరెంట్ అకౌంట్ లోటు మరింతగా పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. అయితే ఫార్మా షేర్లు లాభపడటం, రిలయన్స్ ఇండస్ట్రీస్ పెరగడంతో నష్టాలు తగ్గాయని వివరించారు. ఫార్మా జోరు... సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నా, ఫార్మా షేర్ల లాభాలు కొనసాగాయి. పలు ఫార్మా షేర్లు తమ తమ జీవిత కాల గరిష్ట స్థాయిల నుంచి బాగా పతనమయ్యాయని, ప్రస్తుతం సమంజసమైన ధరల్లో లభిస్తున్నాయని అందుకే గత కొన్ని రోజులుగా ఫార్మా షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరుగుతున్నాయని నిపుణులంటున్నారు. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆల్‌టైమ్ హై 1,012ను తాకింది. చివరకు 0.5 శాతం లాభంతో రూ.1,007 వద్ద ముగిసింది. ఈ షేర్‌కు ఇది ఆల్ టైమ్ గరిష్ట క్లోజింగ్. గత మూడు రోజుల్లో ఈ షేర్ 10 శాతం ఎగసింది. -
మార్కెట్లకు ‘ఫెడ్’ దెబ్బ
ముంబై : ఫెడ్ వడ్డీరేటు పెంపుతో, ఆసియా మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో బలహీనంగా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు, చివరికీ నష్టాలతోనే ముగిశాయి. దీంతో మూడు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. సెన్సెక్స్ 139 పాయింట్లు పడిపోయి 35,600 వద్ద, నిఫ్టీ 49 పాయింట్లు లాభంలో 10,808 వద్ద క్లోజయ్యాయి. ఫెడ్ వడ్డీరేటును 25 బేసిస్ పాయింట్లు పెంచడంతో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు పాలసీ ప్రకటన ఎలా ఉంటుందోనని ఇన్వెస్టర్లు అప్రమత్తగా వ్యవహరిస్తున్నారు. సహాయక ప్యాకేజీలకు చెల్లుచీటీ రాయనుందన్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలకు కారణమైనట్లు నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలపడుతున్న కారణంగా ఈ ఏడాది మరో రెండుసార్లు వడ్డీ పెంపు ఉండవచ్చునంటూ ఫెడ్ సంకేతాలివ్వడంతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో ప్రపంచ మార్కెట్లన్నీ అమ్మకాలతో కుదేలయ్యాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, టైటాన్ కంపెనీ, వేదంతా, ఎల్ అండ్ టీ షేర్లు ఒత్తిడిలో కొనసాగగా.. లుపిన్, సన్ ఫార్మా, సిప్లా, కోల్ ఇండియాలు లాభాలు పండించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిసింది. మైండ్రి, సన్ టీవీ, ఎం అండ్ ఎం ఫైనాన్సియల్, మణప్పురం ఫైనాన్స్ షేర్లు కూడా ఒత్తిడిలో కొనసాగాయి. -
లాభాలన్నీ లాస్ట్‌కి ఆవిరి!
ముంబై : ప్రారంభ లాభాలన్నింటిన్నీ మార్కెట్లు కోల్పోయాయి. చివరికి స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 47 పాయింట్ల లాభంలో 35,739 వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంలో 10,856 వద్ద స్థిరపడ్డాయి. ఫెడ్ మీటింగ్‌పై మార్కెట్లు ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలిసింది. ఈ సారి ఫెడ్ తన వడ్డీరేట్లను పెంచుతుందని మార్కెట్లలో అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్టుబడిదారులు కాస్త అప్రమత్తతో వ్యవహరిస్తున్నారు. రంగాల వారీగా ఐటీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంకింగ్ స్టాక్స్ ఎక్కువగా లాభపడగా.. ఆటో, ఇన్ఫ్రా, మెటల్ రంగాలు నేటి ట్రేడింగ్‌లో ఎక్కువగా ఒత్తిడికి గురయ్యాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహింద్రా నేటి ట్రేడింగ్‌లో టాప్ గెయినర్లుగా లాభాల పంట పండించాయి. మరోవైపు రిలయన్స్ జియో మంగళవారం ప్రకటించిన డబుల్ ధమాకా ఆఫర్ ప్రత్యర్థ టెల్కోలను భారీగా దెబ్బకొట్టింది. ఎయిర్టెల్, ఐడియా సెల్యులార్, రిలయన్స్ కమ్యూనికేషన్‌షేర్లు దాదాపు 6 శాతం వరకు పడిపోయాయి. డబుల్ ధమాకా ఆఫర్ కింద కంపెనీ ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్‌లపై అదనంగా 1.5 జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. -
సమాఖ్యలో గవర్నర్ కీలకం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పథకాల ఫలితాలు వీలైనంత ఎక్కువమంది లబ్ధిదారులకు చేరడంలో గవర్నర్లు సహాయం చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కోరారు. సమాఖ్య వ్యవస్థలో గవర్నర్ల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రెండ్రోజులపాటు జరగనున్న 49వ గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్ల సదస్సులో ప్రధాని సోమవారం ప్రారంభోపన్యాసం చేశారు. ఆదివాసీ జనాభా చెప్పుకోదగినంత ఉన్న రాష్ట్రాల గవర్నర్లు విద్య, క్రీడ తదితర రంగాలతోపాటు సమ్మిళిత ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం అమలుపరుస్తున్న కార్యక్రమాల ప్రయోజనాలు ఈ వర్గాలకు అందేట్లు చూడటంలో చేయూతను అందించాలని ప్రధాని కోరారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఆదివాసీల పాత్ర కీలకమని.. దీనిని గుర్తించి, భావితరాల వారికి అందించేందుకుగాను డిజిటల్ మ్యూజియమ్లు మొదలైన పద్ధతుల్లో వీటిని భద్రపరచాల్సిన అవసరం ఉందన్నారు. వివిధ అంశాల్లో గవర్నర్లు తమ అధికారాన్ని ఉపయోగించి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందేవారి సంఖ్యను పెంచాలన్నారు. ‘భారతదేశ సమాఖ్య వ్యవస్థ, రాజ్యాంగ పరిధిలో గవర్నర్ పాత్ర చాలా కీలకం’ అని మోదీ పేర్కొన్నారు. గవర్నర్లు తమ పరిధిలోని యూనివర్సిటీలకు చాన్స్లర్లన్న విషయాన్ని మోదీ గుర్తుచేస్తూ.. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం వేదిక ద్వారా యువతలో యోగాపై అవగాహన పెంచేందుకు కృషిచేయాలని కోరారు. వర్సిటీలు మహాత్మాగాంధీ 150వ జయంతి వేడుకలకు కేంద్రాలు కావాలన్నారు. 65వేల పల్లెలకు గ్రామస్వరాజ్ వెనుకబడిన జిల్లాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తిచేసిన జాతీయ పౌష్టికాహార మిషన్, గ్రామాల విద్యుదీకరణ ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా మోదీ ప్రస్తావించారు. ఇటీవలే విద్యుదీకరణ పూర్తయిన గ్రామాలను గవర్నర్లు సందర్శించి అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలన్నారు. ఏప్రిల్ 14 నుంచి మే 5 వరకు ప్రభుత్వం చేపట్టిన గ్రామ్ స్వరాజ్ అభియాన్ ద్వారా ఏడు ముఖ్యమైన ప్రభుత్వ పథకాలను 16వేల గ్రామాల్లోని ప్రజలకు అందజేసిన విషయాన్ని ప్రధాని వెల్లడించారు. ఆగస్టు 15 వరకు గడువు నిర్దేశించుకుని ఈసారి 65వేల గ్రామాలకు చేరాలని సంకల్పించినట్లు ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది జరిగే 50వ గవర్నర్ల సదస్సుకు ఇప్పటినుంచే ప్రణాళికలు ప్రారంభించాలని కోరారు. తద్వారా ఈ వార్షిక సదస్సు ఫలప్రదమయ్యేలా ప్రయత్నిం చాలన్నారు. మార్పుకు వారధులవ్వాలి: రాష్ట్రపతి పేదలు, అణగారిన వర్గాల విద్యాప్రమాణాలను పెంచడం, వీరి జీవితాల్లో మార్పు తీసుకురావడంలో గవర్నర్లు వారధుల్లా నిలవాలని ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సూచించారు. సమాఖ్య వ్యవస్థలో కీలకమైన గవర్నర్లు.. రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకుడిగా, సంరక్షకుడిగా ఉండాలన్నారు. రాజ్భవన్లు విలువలు, సిద్ధాంతాలకు కేంద్ర స్థానాలుగా ప్రజలు భావిస్తారన్నారు. ‘భారత్‌లో 10 కోట్ల మంది ఆదివాసీలున్నారు. స్వాతంత్య్రం సిద్ధించినప్పటినుంచి నేటి వరకు ఈ వర్గం, మిగిలిన వారిలాగా సంక్షేమ పథకాల లబ్ధిని పొందలేకపోయింది. వీరి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు గవర్నర్లు చురుకైన పాత్ర పోషించాలి’ అని రాష్ట్రపతి పేర్కొన్నారు. ‘గవర్నర్లు అంటే యువతకు గార్డియన్లు. మీరు యువత సరైన నైతికవిలువలతో ముందుకెళ్లేలా ప్రభావితం చేయగలరు. దేశంలోని 69 శాతం యూనివర్సిటీలు రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్నాయి. యువతలో భారత సంస్కృతి సంప్రదాయాలతో పాటు ఆధునిక విద్యను అందుకునేలా మీరు స్ఫూర్తిని పెంచండి. ఈ వర్సిటీలు జాతీయ సమగ్రతను పెంచాలి. మహాత్ముని జయంతి సందర్భంగా ఆయన బోధనలు ఎక్కువగా ప్రసారమయ్యేలా చూడాలి’ అని కోవింద్ సూచించారు. -
గతమంతా రాజ్‌భవన్ గండాలే!
రెండో మాట ఫెడరల్ దృక్పథం దేశంలో సర్వత్రా వికసించకుండా చేసేందుకు భారత ‘ఫెడరేషన్’ దృక్పథాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాల ప్రత్యేక ఉనికికి గుర్తింపు లేకుండా చేశారు పాలకులు. ఇందులో భాగమే ఉత్తర–దక్షిణ భారతాలను వేర్వేరుగా చీల్చే ప్రయత్నాలూ మొగ్గ తొడుగుతున్నాయి. ‘బొంక నేర్చినవాడు వంకలూ నేరుస్తాడన్న’ట్టు ‘ఉత్తరాదిని చేజిక్కించుకున్నాం, దక్షిణాది రాష్ట్రాలను చేజిక్కించుకోవాల’ని ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాలు యూపీ ఎన్నికల తర్వాత కొత్త నినాదాన్ని ‘మౌర్య సామ్రాజ్య విస్తరణ’ కాంక్షతో వ్యాప్తిలోకి తెచ్చారు. మరో వైపున దళితులు, మైనారిటీలపైన దాడులు చేయడానికి వెనుకాడటం లేదు. ‘రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలో గవర్నర్ అనే వ్యక్తి రాజ్యాంగ చట్టాన్ని అమలు చేయడంలో కీలక ఇరుసు వంటివాడు. కనుకనే అతని పాత్ర కేంద్ర–రాష్ట్ర సంబంధాలలో ఒక కీలక సమస్యగా మారింది. తరచుగా అతడిని యూనియన్ ప్రభుత్వం తన సొంత రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటున్నందుకు, అందుకు తగినట్టుగానే గవర్నర్‌లో నిష్పాక్షికత, వివేకం లోపించబట్టే విమర్శలకు గురి కావలసి వస్తున్నది.’ – సర్కారియా కమిషన్ నివేదిక (1988) ‘చివరికి గవర్నర్ల నియామకాలకు, వారి ఉద్వాసనలకు రాష్ట్రపతికి ఉన్న అధికారం సహితం కేంద్ర–రాష్ట్రాలను బంధించే సమాఖ్య స్ఫూర్తి సూత్రీకరణ నుంచి కూడా దూరంగా జరిగిపోయింది. క్రమంగా గవర్నర్లు రాజకీయ పక్షపాతానికి లోనై కేంద్ర ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారేగానీ స్వతంత్ర రాజ్యాంగ కార్యాలయ నిర్వాహకులుగా వ్యవహరిం చలేకపోతున్నారు.’ – ఎల్.పి. సింగ్ (కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి, మణిపూర్ మాజీ గవర్నర్) గవర్నర్ల వ్యవస్థ 1988 నాటికే తీవ్ర విమర్శల పాలైంది. ఆ వ్యవస్థ రాజ్యాంగ నిబంధనలకూ, పరిధికీ తూట్లు పొడిచిన మాట వాస్తవమని ముప్పయ్ ఏళ్ల నాడే సర్కారియా కమిషన్ బాహాటంగా చెప్పింది. ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తిని గవర్నర్లు యథేచ్ఛగా ఉల్లంఘించారని పరిపాలనా సంస్కరణల కమిషన్ (ఎంఆర్సీ) కూడా వెల్లడించింది. అయినా రాజకీయ పార్టీలు, గవర్నర్ల పాత్రలో ఆవగింజంత మార్పు కూడా రాలేదు. ఈ విషయం ఇటీవల కర్ణాటకలో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ద్వారా తాజాగా నిరూపితమైంది. సర్కారియా కమిషన్ విధించిన మూడు షరతులలో ఏ ఒక్కటీ ఆ రాష్ట్ర గవర్నర్ సంతృప్తికరంగా పాటించలేదు. పైగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజారిటీని సాధించడంలో విఫలమైన బీజేపీకి పట్టం కట్టేందుకు ఆయన నడుం కట్టారు. నిజానికి బీజేపీ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సొంత పార్టీ వారినే గవర్నర్లుగా నియమిస్తున్నది. ఈ సంప్రదాయంలో బీజేపీ కూడా కాంగ్రెస్ కంటే తక్కువ తినలేదు. ఈ బాగోతం ఇప్పటిది కాదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత ఆరంభమైన పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఒక మాట అన్నది : ‘సంప్రదాయం వేరు, చట్టం వేరు’ అని. నిజానికి ఈ వేళ కాదు. ఈ దురవస్థను సర్కారియా కమిషన్ వెల్లడించడానికి ముందే కొన్ని దుష్ట సంప్రదాయాలు ప్రవేశించాయి. అప్పటికి మరో 32 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే, అంటే స్వాతంత్య్రం లభించిన తొలినాళ్ల చరిత్రను గమనిస్తే కళ్లు చెదురుతాయి. మరోమాటలో చెప్పాలంటే స్వాతంత్య్రం వచ్చిన తరువాత కేవలం ఐదేళ్లకే (1952) మన రిపబ్లిక్ కొత్త రాజ్యాంగానికి తొలిసారి తూటు పడింది. అదికూడా భారీగానే పడిందని మరచిపోరాదు. అది ఫెడరల్ (రాష్ట్రాల సమాఖ్య భారతం) రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించిన సంవత్సరం. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఆచరణకు నాటి పాలక పక్షం కాంగ్రెస్ తొలిసారి పాల్పడింది. అది తొలి జనరల్ ఎన్నికలలోనే అని గమనించాలి. ఉమ్మడి మద్రాసు శాసనసభకు జరిగిన ఆ ఎన్నికలలో మొత్తం 375 స్థానాలలో కాంగ్రెస్ 152 చోట్ల విజయం సాధించింది. టంగుటూరి ప్రకాశం నాయకత్వంలోని ఐక్య సంఘటన కాంగ్రెస్ పార్టీ కన్నా 14 స్థానాలు అధికంగా గెలుచుకుంది. కానీ నిన్నటి కర్ణాటక నాటకంలో మాదిరిగానే 152 స్థానాలు గెలిచిన తనకే ప్రభుత్వ ఏర్పాటు హక్కు ఉందని మొండి పట్టు పట్టింది. యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ఎక్కువ స్థానాలు గెలిచిన ప్రకాశం కూటమికి అవకాశం లేకుండా చేశారు. నాటి మద్రాసు గవర్నర్ శ్రీప్రకాశ్ సాయంతో రాజాజీని దొడ్డిదారిన కౌన్సిల్ సభ్యుడిని చేసి, కాంగ్రెస్ శాసన సభాపక్షానికి నాయకుడిగా ప్రకటించారు. ఇంకా, ప్రతిపక్షంలోని పదహారు మంది విభీషణ సంతతి చేత ప్లేటు ఫిరాయించేటట్టు చేశారు. ఆ ప్రకారం ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ రాజాజీని ప్రతిష్టించింది. స్వాతంత్య్రం వచ్చిన ఏడేళ్లకు కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజల సాక్షిగా చేసిన నిర్వాకమిది. రుచిమరిగిన పిల్లి ఉట్టి మీదకి ఎగ బాకినట్టు అది మొదలు ప్రతిపక్షాలు ఐక్య ఘటన ద్వారా అధికారంలోకి వచ్చినా కుట్రలు, కూహకాలతో పడగొట్టే దాకా నిద్రపోని ఒక లక్షణం కాంగ్రెస్ పట్టుకుంది. అసలే బ్రిటిష్ పాలన అవశేషంగా వచ్చిన గవర్నర్ వ్యవస్థను కాంగ్రెస్ క్రమంగా కుమ్మరి పురుగులా తొలిచేసింది. ఇదే సంప్రదాయాన్ని మతోన్మాద రాజకీయాలు తప్ప మరొక వ్యాపకం లేని బీజేపీ–ఆరెస్సెస్ కూటమి పాలక పక్షాలు కొనసాగిస్తున్నాయి. కానీ ఈ అనుభవంతో ఒకటి రుజువైంది. ఇటీవల కేంద్ర పాలక పక్షం బీజేపీ అనేక విషయాలలో నర్మగర్భంగా పెడుతున్న ఆరళ్లకూ, సన్నాయి నొక్కుళ్లకు సుప్రీంకోర్టుపై ఇబ్బందుల పాలవుతున్నా న్యాయవ్యవస్థ చైతన్యం ‘కొడిగట్టిపోలేద’ని ఒక మేరకు రుజువయింది. కానీ సుప్రీంకోర్టు భావిస్తున్నట్లు ‘సంప్రదాయం వేరు, చట్టం వేరు’ అన్న వాస్తవాన్ని చెరిపేయటంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య తేడా లేదని గమనించాలి. పాలక విధానాల ఫలితంగా దారి తప్పిన రాజ్యాంగ వ్యవస్థలన్నీ (ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామ్య వికేంద్రీకరణ, దళిత, మైనారిటీల హక్కుల రక్షణ, లౌకిక జనతంత్ర రిపబ్లిక్ రక్షణ హామీలు, సమాచార హక్కు చట్టం వగైరా) ‘గుంటపూలు పూసే’ స్థితికి చేరుకున్నాయి. రాజ్యాంగం మీద నిరంతర దాడి రాజ్యాంగం ప్రజలకు హామీ పడిన హక్కుల పరిరక్షణ కోర్టుల బాధ్యత. వాటిని ఆచరణలో ప్రజల అనుభవంలోకి తీసుకురావడానికి బీజేపీ పాలకుల నుంచి పౌర సమాజం ఎదుర్కొంటున్న ప్రత్యక్ష పరోక్ష దాడులను కట్టడి చేసే బాధ్యత మరొకటి. అన్నింటికీ మించి, రాజ్యాంగాన్ని మరింత మెరుగు పరిచేందుకు రావలసిన మార్పులకు శ్రీకారం చుట్టగల ప్రజాహిత సవరణ అవసరం ఎంతో ఉండగా, ఆ ప్రయత్నాన్ని వదిలి పాలక శక్తులు ప్రజాస్వామిక సెక్యులర్ రాజ్యాంగం స్థానంలో ఏకమతాభినివేశ రాజ్యాంగ వ్యవస్థ నిర్మాణానికి పునాదులు వేసే ప్రయత్నంలో ఉన్నారు. సచేతనమైన, ప్రజాహితమైన తీర్పుల ద్వారా న్యాయస్థానాల ధర్మాసన చైతన్యం దేశ ప్రజలకు ప్రస్ఫుటం కాకుండా కేంద్ర పాలకులు ‘పుల్లలు’ పెడుతున్నారు. ప్రభుత్వాల, శాసన వేదికల నిర్ణయాలను పరిశీలించి, భాష్యం చెప్పి, తన తీర్పుల ద్వారా విధానంలో మార్పులకు దోహదం చేయగల హక్కును న్యాయ వ్యవస్థకు రాజ్యాంగం కల్పించింది. ఇప్పుడా హక్కును కూడా కాలదన్నే ప్రయత్నంలో పాలకులున్నారు. చివరికి న్యాయస్థానాలకు న్యాయమూర్తుల నియామకాల్ని కూడా శాసించజూచే ‘పిదప బుద్ధులకు’ పాలకులు అలవాటు పడుతున్నారు. తమ విచక్షణాధికారాలను చలాయించేందుకు గవర్నర్లకు ఉన్న అధికారాన్ని అదుపు చేస్తూ సుప్రీం 2016లోనే ఒక తీర్పు ఇచ్చింది. గవర్నర్ల నిర్ణయాలు నిరంకుశంగానో లేదా తమకు తోచినట్లుగానో ఉండకూడదని శాసించింది. రాజ్య వ్యవహారాల్లో, పాలనా బాధ్యతల నిర్వహణలో గవర్నర్లు ‘ఇష్టారాజ్యం’గా వ్యవహరించరాదని తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ ‘కరస్పాండెన్స్’లో సంకలనకర్త వాల్మీకి చౌదరి పేర్కొన్నారు. ఈ ‘ఇష్టారాజ్య’ ప్రవర్తనకు మూల కారణం గవర్నర్లను కేంద్ర పాలకులు రాజకీయ ప్రయోజనాలకు ‘పార్టీ పావు’ లుగా వాడుకోవడం. అందుకనే కశ్మీర్, గుజరాత్ మాజీ గవర్నర్ బి.కె. నెహ్రూ గవర్నర్లను ‘పాలక పార్టీలో శక్తులుడిగిపోయి చేవ చచ్చిన వ్యక్తులకు గవర్నర్ పోస్టు లివ్వడం ఖుషీలోక బాంధవుల్నిగా చూడటమే అవుతుంద’ని అన్నాడు. అలాగే, ఒకసారి కాదు, అనేకసార్లు గవర్నర్లను కేంద్ర ప్రభుత్వ ఏజెం ట్లుగా వ్యవహరించేటట్లు చేశార’ని ‘నిపుణుల బెంగాల్ సదస్సు’ వాపోయింది (1983 సెమినార్ ప్రత్యేక సంచిక, పే.400). విస్తరణ కాంక్ష గవర్నర్ల పదవులకు పాలకపక్షం తమ సభ్యుల్నే ఎంపిక చేయడం కాదు. అలాగే గవర్నర్లు రాజ్యాంగ అవసరాలకు అనుగుణంగా నడుచుకోగలిగిన రాజ్యాంగాధినేతలుగా క్రమశిక్షణతో మెలగాలి. అప్పుడే కేంద్ర రాష్ట్రాల మధ్య పరస్పరం సహకారం స్థిరపడుతుందని ప్రసిద్ధ రాజ్యాంగ నిపుణుడు గ్రాన్ విల్లీ ఆస్టిన్ ‘భారత ప్రజాస్వామిక రాజ్యాంగం పనితీరు’ అనే గ్రంథంలో రాశాడు. ఇందుకు ఫెడరల్ సంబంధాలు అనివార్యంగా సుస్థిరం కావలసిందేనన్నాడు (‘వర్కింగ్ ఎ డెమోక్రటిక్ కాన్సిట్యూషన్: ది ఇండియన్ ఎక్స్పీరియన్స్’). కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 1991లోనే దేశాన్ని ‘భారత సంయుక్త రాష్ట్రాలు’గా ప్రకటించాలని కోరాడు. ఫెడరల్ (సమాఖ్య) దృక్పథం దేశంలో సర్వత్రా వికసించకుండా చేసేం దుకు భారత ‘ఫెడరేషన్’ దృక్పథాన్ని నిర్వీర్యం చేసి రాష్ట్రాల ప్రత్యేక ఉనికికి గుర్తింపు లేకుండా చేశారు పాలకులు. ఇందులో భాగమే ఉత్తర–దక్షిణ భారతాలను వేర్వేరుగా చీల్చే ప్రయత్నాలూ మొగ్గ తొడుగుతున్నాయి. ‘బొంక నేర్చినవాడు వంకలూ నేరుస్తాడన్న’ట్టు ‘ఉత్తరాదిని చేజిక్కించుకున్నాం, దక్షిణాది రాష్ట్రాలను చేజిక్కించుకోవాల’ని ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్ షాలు యూపీ ఎన్నికల తర్వాత కొత్త నినాదాన్ని ‘మౌర్య సామ్రాజ్య విస్తరణ’ కాంక్షతో వ్యాప్తిలోకి తెచ్చారు. మరో వైపున దళితులు, మైనారిటీలపైన దాడులు చేయడానికి వెనుకాడటం లేదు. ఇంతకూ ఉత్తరాదిపై కాంగ్రెస్‌కుగానీ, బీజేపీకిగానీ వల్లమాలిన ప్రేమకు కారణం ఏమై ఉంటుంది? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం– ఇతర ఏ భారత రాష్ట్రానికీ కల్పించని 80 పార్లమెంటు (లోక్‌సభ) సీట్లు అనే ‘స్వీటు’. ఆ ఆధిపత్యంతోనే దక్షిణాదిపై సవారీ!! -ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు(abkprasad2006@yahoo.co.in) -
ఆరో రోజూ రూపాయి డౌన్
ముంబై: వరుసగా ఆరో సెషన్లోనూ రూపాయి మారకం విలువ క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే సోమవారం మరో 36 పైసలు తగ్గి 66.48 స్థాయికి పడిపోయింది. ఇది 13 నెలల కనిష్ట స్థాయి కావడం గమనార్హం. 2017 మార్చి 10 తర్వాత ఈ స్థాయిలో ముగియడం ఇదే ప్రథమం. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచుతుందన్న అంచనాలు, క్రూడ్ ధరలు ఒక్కసారిగా ఎగియడం మొదలైన అంశాలు రూపాయిపై ప్రతికూల ప్రభావం చూపాయి. కొన్నాళ్ల క్రితం దాకా చౌక ముడిచమురు ధరలతో రూపాయి బలపడినప్పటికీ, ఇప్పుడు ఆ ర్యాలీకి అడ్డుకట్ట పడినట్లేనని ఫారెక్స్ ట్రేడర్లు అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని ఎగదోసే రిస్కును తెచ్చిపెట్టిన క్రూడ్ ధరల పెరుగుదల మూలంగా.. విధానపర నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభుత్వం డైలమాలో పడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. వాణిజ్య యుద్ధ భయాలు, బాండ్ ఈల్డ్‌ల పెరుగుదల తదితర అంశాలతో అంతర్జాతీయంగా తీవ్ర ఒడిదుడుకుల నేపథ్యంలో ఏప్రిల్‌లో ఇప్పటిదాకా విదేశీ ఇన్వెస్టర్లు, ఫండ్లు భారత మార్కెట్ నుంచి దాదాపు రూ. 8,000 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఫారెక్స్ మార్కెట్లో క్రితం ముగింపు 66.12తో పోలిస్తే సోమవారం ఒకింత బలహీనంగా 66.20 వద్ద ప్రారంభమైన రూపాయి ట్రేడింగ్ ఆ తర్వాత మరింతగా తగ్గింది. డాలర్ల కొనుగోళ్ల ఒత్తిడితో ఇంట్రా డేలో 66.49 స్థాయికి కూడా తగ్గింది. మధ్యలో ప్రభుత్వ రంగ బ్యాంకులతో డాలర్లను విక్రయించడం ద్వారా ఆర్బీఐ కొంత జోక్యం చేసుకున్నప్పటికీ.. పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. చివరికి 0.54 శాతం నష్టంతో దేశీ కరెన్సీ 66.48 వద్ద క్లోజయ్యింది. -
ఫెడ్ నిర్ణయం : రూపాయి పడిపోయింది
ముంబై : ఫెడరల్ రిజర్వు పాలసీ నిర్ణయం నేడు వెలువడనున్న నేపథ్యంలో రూపాయి విలువ క్షీణించింది. అమెరికా డాలర్‌కు వ్యతిరేకంగా రూపాయి నాలుగు నెలల కనిష్టంలో 65.21గా నమోదైంది. 2017 నవంబర్ 16న రూపాయి విలువ ఈ స్థాయిలో ఉంది. 65.23గా ప్రారంభమైన రూపాయి విలువ, 65.19 వద్ద గరిష్ట స్థాయిని, 65.23 వద్ద కనిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. ఫెడరల్ రిజర్వు నేడు తన వడ్డీరేట్లను పెంచనున్నట్టు అంచనాలు వెలువడుతున్నాయి. రెండు రోజుల సమావేశ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వు నిన్న భేటీ అయింది. ఈ ఏడాది మరో రెండు సార్లు ఫెడరల్ రిజర్వు తన వడ్డీరేట్లను పెంచనున్నట్టు తెలుస్తోంది. కొత్త చైర్మన్ పావెల్ అధ్యక్షతన ఫెడ్ కమిటీ నేడు కనీసం పావు శాతం వడ్డీ రేటును పెంచే అవకాశముందని సమాచారం. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 1.5-1.75 శాతానికి చేరనున్నట్లు అత్యధికులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఫెడ్ నిర్ణయంపై ఎక్కువగా దృష్టి సారించారు. -
నేడే ఫెడ్ నిర్ణయం : లాభాల్లో మార్కెట్లు
ముంబై : ఫెడ్ సమావేశ ఫలితాలు, సెకండ్ హాఫ్ సెషన్లో చోటు చేసుకున్న ప్రాఫిట్ బుకింగ్‌తో దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి కాస్త లాభాలను తగ్గించుకున్నాయి. నేటి ఇంట్రాడేలో దాదాపు 300 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్, చివరికి 139 పాయింట్ల లాభంలో 33,136 వద్ద ముగిసింది. నిఫ్టీ 30 పాయింట్ల లాభంలో 10,155 వద్ద క్లోజైంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో మార్కెట్లు ఆద్యంతం సానుకూలంగానే ట్రేడయ్యాయి. కానీ చివరకు ఇన్వెస్టర్లు కాస్త ప్రాఫిట్ బుకింగ్‌కు పాల్పడ్డారు. రెండు రోజులపాటు సమావేశమైన అమెరికా ఫెడ్ పాలసీ నిర్ణయం నేటి అర్ధరాత్రి వెలువడనుంది. కొత్త చైర్మన్ పావెల్ అధ్యక్షతన ఫెడ్ కమిటీ కనీసం పావు శాతం వడ్డీ రేటును పెంచే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 1.5-1.75 శాతానికి చేరనున్నట్లు అత్యధికులు భావిస్తున్నారు. ఇన్వెస్టర్లు ఫెడ్ నిర్ణయాలపై ఎక్కువగా దృష్టి సారించినట్టు నిపుణులు పేర్కొన్నారు. ఫార్మా, మెటల్, మీడియా షేర్లు నష్టాలు గడించగా.. రియల్టీ 0.8 శాతం పైకి ఎగసింది. బ్లూచిప్స్‌లో ఎయిర్టెల్ 4.3 శాతం జంప్‌చేయగా.. బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, ఐబీ హౌసింగ్, బీపీసీఎల్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ, అల్ట్రాటెక్, ఓఎన్జీసీ, ఇండస్ఇండ్ 2.5-1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే టాటా స్టీల్, హీరోమోటో, ఐషర్, అదానీ పోర్ట్స్, ఇన్ఫ్రాటెల్, అరబిందో, బజాజ్ ఆటో, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా 2-1 శాతం మధ్య బలహీనపడ్డాయి. -
ఫెడ్.. లబ్‌డబ్..
ప్రపంచ మార్కెట్లకు దిశానిర్దేశం చేసే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది మూడు దఫాలు మాత్రమే వడ్డీ రేట్లు పెంపు ఉండొచ్చని ముందస్తుగా అనుకున్నప్పటికీ.. అమెరికాలో ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్న నేపథ్యంలో ఈ పెంపు నాలుగుసార్లయినా లేదా అయిదుసార్లయినా కావొచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్‌గా పగ్గాలు చేపట్టిన తర్వాత జెరోమ్ పావెల్ తొలిసారిగా పరపతి విధాన సమీక్ష జరుపుతున్న నేపథ్యంలో వడ్డీ రేట్ల పెంపు విడతలపై ఉత్కంఠ నెలకొంది. మాజీ చైర్మన్ జేనెట్ యెలెన్లాగా క్రమానుగతంగా పెంచుకుంటూ వెళ్లే విధానాలనే కొనసాగిస్తారా.. లేక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను ప్రతిబింబించేలా దూకుడు ప్రదర్శిస్తారా అన్నది మార్కెట్ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌వోఎంసీ) బుధవారం వడ్డీ రేట్లపై నిర్ణయాన్ని ప్రకటించనుంది. అదే సమయంలో ఆర్థిక అంచనాలను కూడా వెలువరిస్తుంది. ఇందులోనే వడ్డీ రేట్ల పెంపు ఎన్ని దఫాలు ఉండొచ్చన్నదీ వెల్లడి కానుంది. ఏదైతేనేం పావెల్ మాటలు బట్టి, అమెరికా సానుకూల ఆర్థిక పరిస్థితులు బట్టి చూస్తే వడ్డీ రేట్లను పెంచే క్రమం పెరగడమే తప్ప.. తగ్గే అవకాశాల్లేవని విశ్లేషకులు అంటున్నారు. సానుకూల పరిస్థితులు.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత గణాంకాలు మొదలైన వాటికి సంబంధించిన సానుకూల అంశాలు మరిన్ని దఫాలు వడ్డీ రేట్ల పెంపునకు దోహదపడే అవకాశాలు ఉన్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవలి కాలంలో ద్రవ్యోల్బణం పెరగడంతో.. వచ్చే ఏడాదిలోగా రెండు శాతం టార్గెట్‌ను సులువుగా చేరొచ్చని ఫెడరల్ రిజర్వ్‌కు కొంత భరోసానిస్తోంది. మరోవైపు, నిరుద్యోగిత స్థిరంగా 4.1 శాతంగా కొనసాగుతోంది. మెరుగుపడుతున్న ఎకానమీకి అనుగుణంగా ఉద్యోగాల కల్పనలో వృద్ధి కూడా క్రమంగా పెరుగుతోంది. రిస్కులూ ఉన్నాయి..: ఇవన్నీ నాణేనికి ఒకవైపు కాగా.. దీనికి మరోవైపు కూడా చూడాలంటున్నారు మరికొందరు విశ్లేషకులు. ఇప్పుడున్నంత తక్కువ స్థాయిలో నిరుద్యోగిత సుదీర్ఘకాలం కొనసాగడం.. దాని ప్రభావాలు ఎలా ఉంటాయన్నది ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడలేదన్నది వారి వాదన. చాన్నాళ్ల క్రితం 1960ల ఆఖర్లో నిరుద్యోగిత 4 శాతం కన్నా తక్కువ స్థాయిలో ఉండేది. అయితే, అది 1970ల నాటికి భారీ ద్రవ్యోల్బణ పరిస్థితులకు దారి తీసింది. వడ్డీ రేట్ల పెంపునకు సంబంధించి ప్రస్తుత ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత అంశాలను ఈ కోణంలో కూడా చూడాల్సి ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే పన్ను కోతలు, వ్యయాల పెంపుతో భారీ ఊతం లభించిన ఎకానమీకి.. అంతర్జాతీయంగా పటిష్ట వృద్ధి, బలహీన డాలరు, మెరుగుపడుతున్న పెట్టుబడులు మొదలైన అంశాలు కూడా తోడైతే ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా అస్థిరతకు లోనయ్యే అవకాశాలూ ఉన్నాయన్న అభిప్రాయం కూడా నెలకొంది. ప్రస్తుతం ఫెడ్ రేట్లు 1.25 శాతం – 1.50 శాతం శ్రేణిలో ఉన్నాయి. తాజా సమీక్షలో వీటిని పావు శాతం పెంచవచ్చని అంచనా. దీంతో వడ్డీ రేట్ల శ్రేణి 1.5 శాతం – 1.75 శాతానికి చేరుతుంది. గతేడాది మూడు దఫాలుగా వడ్డీ రేట్లు పెంచిన ఫెడరల్ రిజర్వ్ .. ఈ ఏడాది మరో మూడు దఫాలు పెంచే అవకాశాలు ఉన్నాయంటూ డిసెంబర్లో సూచనప్రాయంగా వెల్లడించింది. అయితే, ఈ ఏడాది జనవరిలో సమీక్ష జరిపినప్పటికీ.. రేట్లు మాత్రం యధాతథంగానే ఉంచింది. 2007–09 మధ్య కాలంలో ఆర్థిక మాంద్యం దరిమిలా ఎకానమీకి ఊతమిచ్చే ప్రయత్నాల్లో భాగంగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సున్నా స్థాయికి తగ్గించేసిన సంగతి తెలిసిందే.