ఫెడ్ రేట్ల పెంపుపై సిద్ధంగా ఉన్నాం..
పావు శాతం వరకూ పెంచొచ్చని అంచనా...
ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు
కోల్‌కతా: అమెరికా సెంట్రల్ బ్యాంక్.. ఫెడరల్ రిజర్వ్ వచ్చే వారం జరపనున్న సమీక్షలో పావు శాతం వరకూ వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ నిర్ణయం కారణంగా తలెత్తే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ఆర్‌బీఐ బోర్డు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘రేట్ల పెంపునకు సంబంధించి ఫెడ్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. 0.1-0.25 శాతం మేర పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. మెజారిటీ మార్కెట్ వర్గాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఫెడ్ రేట్ల పెంపు అనేది దాదాపు ఖాయమేనని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఊర్జిత్ పటేల్ కూడా పేర్కొన్నారు. ఇదే జరిగితే మార్కెట్లలో నిధుల ప్రవాహంపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు.
ఫెడ్ సమీక్ష ఈ నెల 15-16 తేదీల్లో జరగనుంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ పుంజుకుంటుండటం, ఉద్యోగ గణాంకాలు కూడా ఆశావహంగానే నమోదవుతున్న నేపథ్యంలో దశాబ్దం తర్వాత తొలిసారిగా ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న బలమైన అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే.. భారత్ సహా వర్ధమాన దేశాల క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా నిధులు ఉపసంహరించుకుంటారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటినుంచి ఫెడ్ వడ్డీరేటును దాదాపు జీరో స్థాయిలోనే(0.25 శాతం) కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫెడ్ చైర్‌పర్సన్ జానెట్ ఎలెన్ కూడా ఈసారి రేట్ల పెంపు అనివార్యమంటూ సంకేతాలివ్వడం తెలిసిందే.
రికవరీల జోరు పెంచాలి...
భారీగా పేరుకుపోతున్న మొండిబకాయిలను వసూలు చేసేందుకు బ్యాంకులు తీసుకునే కఠిన చర్యలను అడ్డుకోవడంలో బడా కంపెనీల ప్రమోటర్లు ఆరితేరారని గవర్నర్ రాజన్ బ్యాంకులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆలస్యం చేయకుండా రికవరీ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా ఆయన సూచించారు. ‘మొండిబకాయిల సమస్యను అధిగమించేందుకు బ్యాంకులకు చాలా మార్గాలు ఉన్నాయి. అయితే, కొన్ని కేసుల్లో అవి చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నాయి. దీనికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో కొంతమంది బడా ప్రమోటర్లు కూడా బ్యాంకుల చర్యలను అడ్డుకోవడానికి తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నారు’ అని రాజన్ వ్యాఖ్యానించారు.
ఐడీబీఐ బ్యాంకుకు రూ.900 కోట్ల రుణాన్ని ఎగవేసిన కేసులో యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యాను తాజాగా సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.5,800 కోట్లకుపైగా రుణ డిఫాల్ట్‌కు సంబంధించి మాల్యాను ఎస్‌బీఐ ఇప్పటికే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా కూడా ప్రకటించింది. కాగా, వ్యవస్థలో తగినంత ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) ఉండేవిధంగా ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటుందని రాజన్ చెప్పారు. ఇందుకోసం అవసరమైతే ఓపెన్ మార్కెన్ నుంచి కూడా బాండ్‌లను కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు.