Governor Raghuram Rajan
-
ధరలపై పోరు కీలకం కావాలి...
* ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ * ఇదే విధానం కొనసాగుతుందన్న విశ్వాసం ముంబై: ద్రవ్యోల్బణం కట్టడే దేశాభివృద్దికి కీలకమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం స్పష్టం చేశారు. తన పదవీ విరమణ తరువాత బాధ్యతలు చేపట్టే ఆర్బీఐ కొత్త చీఫ్, అలాగే ఏకాభిప్రాయం ప్రాతిపదికన కీలక రేటు నిర్ణయానికి ఏర్పడబోతున్న ప్రతిపాదిత పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) ద్రవ్యోల్బణాన్ని నిలువరించడంపైనే దృష్టి సారిస్తాయన్న అభిప్రాయాన్నీ ఆయన వ్యక్తం చేశారు. రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలను అందుబాటులో ఉంచడం, అలాగే ఏకాభిప్రాయ ప్రాతిపదికన రేటు నిర్ణయానికి ఎంపీసీ ఏర్పాటు కేంద్రం తీసుకున్న కీలక చర్యలుగా వివరించారు. ఇక్కడ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటర్ రిసెర్చ్ సంస్థలో ‘ద్రవ్యోల్బణంపై పోరు... పరపతి విధాన వ్యవస్థలో పటిష్టత’ అన్న అంశంపై ఆయన మాట్లాడారు. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతే.. ఒడిదుడుకులను భారత్ తట్టుకుంటుందని వివరించారు. ఎంపీసీ ఏర్పాటు విప్లవాత్మకం ఎంపీసీ ఏర్పాటు నిజంగా ఒక విప్లవాత్మకమైన అడుగని రాజన్ అన్నారు. దేశంలో పలు సంవత్సరాల నుంచి అధిక ద్రవ్యోల్బణం సమస్య ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతికూల వాస్తవ వడ్డీరేటు ధోరణి అన్ని వర్గాలపై ప్రతికూల ప్రభావం చూపిందని వివరించారు. ఈ నేపథ్యంలో తగిన గణాంకాల రూపకల్పన, ఏకాభిప్రాయం ప్రాతిపదికన తగిన రేటు నిర్ణయం దిశలో రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు, ఎంపీసీల ఏర్పాటు కీలకమని వివరించారు. గత మూడేళ్లుగా ద్రవ్యోల్బణంపై జరుపుతున్న పోరాటం ఫలితంగా పలు ఆర్థిక అంశాల్లో స్థిరత్వం నెలకొందని పేర్కొన్నారు. మన పరపతి విధాన లక్ష్యాల పట్ల పెట్టుబడిదారుల విశ్వాస్వాన్ని పెంపొందించడానికి ‘స్థిర రూపాయి విలువ’ దోహదపడుతుందని రాజన్ ఈ సందర్భంగా వివరించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల భారీ పెరుగుదల వల్ల ఆర్థిక వ్యవస్థ అన్ని స్థాయిల్లో భారీ ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. ద్రవ్యలోటు కట్టడి ఆర్థికవృద్ధిలో కీలకమని అన్నారు. త్వరలో రాజన్ వారసుని పేరు! రాజన్ తరువాత ఆర్బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోయే వ్యక్తి పేరును త్వరలో కేంద్రం ప్రకటిస్తుందని సంబంధిత అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. కొత్త గవర్నర్ నియామకానికి ప్యానల్ ఏర్పాటు వంటి ఊహాగానాలను ఒక సీనియర్ అధికారి కొట్టిపారేస్తూ... అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టంచేశారు. అనవసర ఊహాగానాలకు తావివ్వకుండా ముందస్తుగానే కొత్త గవర్నర్ ఎవరన్న ప్రకటన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. సెప్టెంబర్ 4న రాజన్ పదవీ విరమణ చేయనున్నారు. ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య సహా పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయి. -
సంస్కరణలపై ‘రెగ్జిట్’ ప్రభావం పడదు
ప్రపంచబ్యాంక్ స్పష్టీకరణ * రేటింగ్ నిర్ణయాలు విధానాలపై తప్ప వ్యక్తులపై ఆధారపడి ఉండవని ఫిచ్ ప్రకటన న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ రెండవసారి ఈ బాధ్యతల్లో కొనసాగబోనని చేసిన ప్రకటన (రెగ్జిట్) ప్రభావం బ్యాంకింగ్ సంస్కరణలపై పడబోదని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. ఆయా సంస్కరణలు కొనసాగుతాయని భావిస్తున్నట్లు ప్రపంచబ్యాంక్ భారత్ వ్యవహారాల డెరైక్టర్ ఓనో రుయాల్ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్‌లోటు, విదేశీ మారక ద్రవ్య నిల్వల వంటి భారత్ స్థూల ఆర్థిక అంశాలు పటిష్టంగా ఉన్నట్లు కూడా తెలిపారు. కాగా రేటింగ్ సంస్థ- ఫిచ్ కూడా రెగ్జిట్పై ఒక కీలక ప్రకటన చేస్తూ... రేటింగ్ నిర్ణయాలు విధానాలపై ఆధారపడి ఉంటాయితప్ప, వ్యక్తులపై కాదని స్పష్టం చేసింది. రాజన్ పదవీ విరమణ ప్రభావం సావరిన్ రేటింగ్స్‌పై ఎంతమాత్రం ఉండబోదని స్పష్టం చేసింది. ద్రవ్యోల్బణం, మొండిబకాయిల వంటి సమస్యల పరిష్కారానికి కేంద్రం, రాజన్ వారసుడు తగిన చర్యలను కొనసాగిస్తారన్న విశ్వాసాన్ని ఫిచ్ ఆసియా-పసిఫిక్ సావరిన్స్ గ్రూప్ డెరైక్టర్ థామస్ రుక్మాకర్ పేర్కొన్నారు. రాజన్ భారత్ బ్యాంకింగ్ వ్యవస్థకు చేసిన కీలకమైనవని కూడా ఆయన అన్నారు. ప్రస్తుతం ఫిచ్ భారత్ రేటింగ్ ‘బీబీబీ-’ జంక్ హోదాకు ఇది ఒక స్థాయి ఎక్కువ. ప్రైవేటు పెట్టుబడులు, డిమాండ్ కీలకం కాగా ప్రైవేటు పెట్టుబడులు, గ్రామీణ డిమాండ్ క్రియాశీలకంగా ఉండడం ద్వారానే భారత్ 7.6 శాతం వృద్ధి రేటు మున్ముందు కొనసాగుతుందని ప్రపంచబ్యాంక్ తన తాజా ద్వైవార్షిక నివేదికలో పేర్కొంది. ప్రతిష్టంభనలో ఉన్న రంగాల్లో వ్యవసాయం, గ్రామీణ గృహ వినియోగం, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు ఉన్నట్లు తెలిపింది. 2015-16 తరహాలో 2016-17లో కూడా భారత్ వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. రానున్న రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈ రేటు 7.7 శాతం, 7.8 శాతంగా అంచనా. -
రాజన్‌ను కొనసాగించాలి: సీఐఐ
ఒకాసా: రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను సెప్టెంబర్ 4 తరువాత ఇదే బాధ్యతల్లో కొనసాగించాలని పరిశ్రమల వేదిక- కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) పేర్కొంది. సీఐఐ ప్రెసిడెంట్ నౌషాద్ ఫోర్బ్స్ గురువారం ఇక్కడ ఈ అంశంపై ఒక వార్తా సంస్థతో మాట్లాడారు. ఆర్థికమంత్రి జైట్లీ పర్యటనలో భాగంగా, ఇక్కడకు వచ్చిన అత్యున్నత స్థాయి బృందంలో ఫోర్బ్స్ ఒకరు. ఈ సందర్భంగా ఆయన మాటలను క్లుప్తంగా చూస్తే... ‘‘రాజన్ ఇప్పటివరకూ గణనీయమైన బాధ్యతలు నిర్వహించారు. ఆయనపై వ్యక్తిగత వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికాదు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నారు. ఇక మిగిలిన అంశాలకు వస్తే.. రాజన్‌పై సుబ్రమణ్యస్వామి విమర్శలను నేను తీవ్రంగా చూడ్డం లేదు. ప్రజాస్వామ్యంలో ఇవి ఒక భాగం. అయితే వ్యక్తిగత విమర్శలు మాత్రం సరికాదు. రాజన్‌ను తిరిగి గవర్నర్‌గా కొనసాగింపునకు సంబంధించి నిర్ణయాన్ని ప్రభుత్వం తగిన సమయంలో తీసుకుంటుందని భావిస్తున్నాను’’. -
ఫెడ్ రేట్ల పెంపుపై సిద్ధంగా ఉన్నాం..
పావు శాతం వరకూ పెంచొచ్చని అంచనా... ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు కోల్‌కతా: అమెరికా సెంట్రల్ బ్యాంక్.. ఫెడరల్ రిజర్వ్ వచ్చే వారం జరపనున్న సమీక్షలో పావు శాతం వరకూ వడ్డీరేట్లను పెంచే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ నిర్ణయం కారణంగా తలెత్తే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ ఆర్బీఐ బోర్డు సమావేశంలో పాల్గొన్న సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాజన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘రేట్ల పెంపునకు సంబంధించి ఫెడ్ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. 0.1-0.25 శాతం మేర పెంపు ఉండొచ్చని అంచనా వేస్తున్నాం. మెజారిటీ మార్కెట్ వర్గాలు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నాయి’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఫెడ్ రేట్ల పెంపు అనేది దాదాపు ఖాయమేనని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఊర్జిత్ పటేల్ కూడా పేర్కొన్నారు. ఇదే జరిగితే మార్కెట్లలో నిధుల ప్రవాహంపై కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. ఫెడ్ సమీక్ష ఈ నెల 15-16 తేదీల్లో జరగనుంది. ఆర్థిక వ్యవస్థ రికవరీ పుంజుకుంటుండటం, ఉద్యోగ గణాంకాలు కూడా ఆశావహంగానే నమోదవుతున్న నేపథ్యంలో దశాబ్దం తర్వాత తొలిసారిగా ఫెడ్ వడ్డీరేట్లను పెంచుతుందన్న బలమైన అంచనాలు నెలకొన్నాయి. ఇదే జరిగితే.. భారత్ సహా వర్ధమాన దేశాల క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా నిధులు ఉపసంహరించుకుంటారన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం నాటినుంచి ఫెడ్ వడ్డీరేటును దాదాపు జీరో స్థాయిలోనే(0.25 శాతం) కొనసాగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఫెడ్ చైర్పర్సన్ జానెట్ ఎలెన్ కూడా ఈసారి రేట్ల పెంపు అనివార్యమంటూ సంకేతాలివ్వడం తెలిసిందే. రికవరీల జోరు పెంచాలి... భారీగా పేరుకుపోతున్న మొండిబకాయిలను వసూలు చేసేందుకు బ్యాంకులు తీసుకునే కఠిన చర్యలను అడ్డుకోవడంలో బడా కంపెనీల ప్రమోటర్లు ఆరితేరారని గవర్నర్ రాజన్ బ్యాంకులను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆలస్యం చేయకుండా రికవరీ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా ఆయన సూచించారు. ‘మొండిబకాయిల సమస్యను అధిగమించేందుకు బ్యాంకులకు చాలా మార్గాలు ఉన్నాయి. అయితే, కొన్ని కేసుల్లో అవి చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తున్నాయి. దీనికి కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో కొంతమంది బడా ప్రమోటర్లు కూడా బ్యాంకుల చర్యలను అడ్డుకోవడానికి తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నారు’ అని రాజన్ వ్యాఖ్యానించారు. ఐడీబీఐ బ్యాంకుకు రూ.900 కోట్ల రుణాన్ని ఎగవేసిన కేసులో యూబీ గ్రూప్ చైర్మన్ విజయ్ మాల్యాను తాజాగా సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.5,800 కోట్లకుపైగా రుణ డిఫాల్ట్‌కు సంబంధించి మాల్యాను ఎస్బీఐ ఇప్పటికే ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుగా కూడా ప్రకటించింది. కాగా, వ్యవస్థలో తగినంత ద్రవ్య సరఫరా(లిక్విడిటీ) ఉండేవిధంగా ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని రాజన్ చెప్పారు. ఇందుకోసం అవసరమైతే ఓపెన్ మార్కెన్ నుంచి కూడా బాండ్లను కొనుగోలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. -
జైట్లీతో రాజన్ భేటీ
డిసెంబర్ 1 పాలసీ సమీక్ష నేపథ్యం... న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ శుక్రవారం సమావేశమయ్యారు. డిసెంబర్ 1వ తేదీన ఆర్బీఐ ఐదవ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష నేపథ్యంలో జరిగిన ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. పలు దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక కీలక అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. ముఖ్యంగా వడ్డీరేట్లకు సంబంధించి అమెరికా ఫెడ్ తీసుకునే నిర్ణయంపై ప్రధాన చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. చర్చల అనంతరం రాజన్ మాట్లాడుతూ, ‘చర్చలు ఎప్పుడూ చక్కగా, సుహృద్భావ వాతావరణంలో జరుగుతాయి’ అని అన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5 శాతానికి చేరడం, ఫెడ్ ఫండ్ రేటు పెంపు అంచనాల నేపథ్యంలో... డిసెంబర్ 1వ తేదీన ఆర్బీఐ పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తుందన్న అంచనాలు వెలువడుతున్నాయి. అలాగే ఇప్పటికే తగ్గించిన రేటు కోత ప్రయోజనాన్ని బ్యాంకులు ఇంకా తగిన స్థాయిలో కస్టమర్లకు బదలాయించలేదన్న అభిప్రాయమూ ఉంది. ఆర్బీఐ నుంచి తాము తీసుకునే స్వల్పకాలిక రుణంపై బ్యాంకులు చెల్లించే వడ్డీరేటు రెపో ప్రస్తుతం నాలుగేళ్ల కనిష్ట స్థాయిలో 6.75 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో రేటు కోత: బీఓఎఫ్ఏ మంగళవారం ఆర్బీఐ రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం లేదని, అయితే ఫిబ్రవరిలో జరిగే సమీక్ష సందర్భంగా పావుశాతం తగ్గించే వీలుందని బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ -
మార్కెట్లు దెబ్బతిన్నా సరే... వడ్డీరేటు పెంచండి
అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు ఆర్బీఐ గవర్నర్ రాజన్ సూచన ‘ఈజీ మనీ’తో అంతర్జాతీయ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయని హెచ్చరిక బాసెల్(స్విట్జర్లాండ్): రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి తీవ్ర హెచ్చరిక చేశారు. ‘ఈజీ మనీ’ విధానం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జీరో స్థాయిలో ఉన్న ఫెడ్ ఫండ్ రేటును పెంచాలని ఆయన అమెరికా సెంట్రల్ బ్యాంక్‌కు సూచించారు. మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయినప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించి, హెచ్చరించిన వ్యక్తిగా ప్రపంచ ఆర్థిక రంగంలో రాజన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసిందే. జర్మనీ సెంట్రల్ బ్యాంక్ చీఫ్‌తో కలిసి ఒక కార్యక్రమంలో విద్యార్ధులతో మాట్లాడిన రాజన్ ఈ వ్యాఖ్య చేశారు. తక్కువ రుణ వ్యయాలు, ద్రవ్య ముద్రణ వంటి అంశాలు ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా వాటిల్లుతాయని, అలాగే ఎక్కువ కాలం కొనసాగితే... ఈ విధానం సమర్థత కూడా కోల్పోతుందని హెచ్చరించారు. రాజన్ అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లు జర్మనీ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ జీన్స్ వైడ్‌మెన్ పేర్కొన్నారు. కాగా డిసెంబర్లో ఫెడ్ రిజర్వ్ రేటు పెంపు ఉంటుందని అభిప్రాయపడిన రాజన్, ఇది మార్కెట్ల ఒడిదుడుకులకు దారితీస్తుందని అన్నారు. అయినా రేటు పెంపు తప్పనిసరి అని వివరించారు. బీఐఎస్ బోర్డ్ వైస్‌చైర్మన్‌గా నియామకం.. రాజన్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ బ్యాంక్ (బీఐఎస్) బోర్డ్ వైస్‌చైర్మన్‌గా నియమితులయ్యారు. బీఐఎస్ ప్రధాన కార్యాలయం బాసెల్ (స్విట్జర్లాండ్)లో ఉంది. పటిష్ట అంతర్జాతీయ ద్రవ్య విధానం, ఫైనాన్షియల్ స్థిరత్వం లక్ష్యంగా ప్రపంచస్థాయిలో సెంట్రల్ బ్యాంకుల సమన్వయ సాధనకు బీఐఎస్ కృషి చేస్తుంది. ఏడాదికి కనీసం ఆరుసార్లు బ్యాంక్ బోర్డ్ సమావేశమవుతుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ గవర్నర్, బ్యాంక్ ఆఫ్ జపాన్ గవర్నర్‌సహా పలువురు ఆర్థికవేత్తలు ఈ బోర్డ్‌లో సభ్యులుగా ఉంటారు. బాసెల్‌లో సోమవారం జరిగిన బీఐఎస్ డెరైక్టర్ల బోర్డు సమావేశం రాజన్‌ను వైస్‌చైర్మన్‌గా ఎంపికచేసింది. ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ నుంచీ మూడేళ్లు రాజన్ ఈ బాధ్యతల్లో కొనసాగుతారని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. 2013 డిసెంబర్ నుంచి రాజన్ బోర్డ్ డెరైక్టర్లలో ఒకరిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్మనీ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ జీన్స్ వైడ్‌మెన్ బీఐఎస్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్నారు. -
ఆర్థిక వ్యూహాల్లో రాజకీయాలదే ముఖ్యపాత్ర
- ద్రవ్యోల్బణమే లక్ష్యంగా కేంద్ర బ్యాంకులు - అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిలో పడలేదు... - ద్రవ్యోల్బణ కట్టడే తొలి ప్రాధాన్యం జాక్సన్ హోల్ ఆర్థిక సదస్సులో రాజన్ వాషింగ్టన్: ఆర్థిక విధానపరమైన వ్యూహా రచనల్లో రాజకీయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. భారత్‌లోని రాజకీయ వ్యవస్థ కేంద్ర బ్యాంకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పాటునందిస్తోందని, రాజకీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఒత్తిళ్లను దూరం చేయడమే పాలసీ ప్రక్రియ ప్రాధాన్యమని తెలిపారు. ఆయన వోమింగ్‌లో జరిగిన కన్సాస్ సిటీ ఫెడరల్ రిజర్వు జాక్సన్ హోల్ ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ఆసక్తికరంగా ఇదే వేదికపై రాజన్ గతంలో 2007-08 ఆర్థిక మాంద్యం వస్తుందని ముందే చెప్పారు. అప్పుడు రాజన్ ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్నారు. దేశ ఆర్థిక విధాన లక్ష్యాలను వాటి రాజకీయ, చారిత్రక అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పారు. తమ పాలసీ విశ్లేషణలో రాజకీయ ఆర్థిక వ్యవస్థ కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులన్నీ ద్రవ్యోల్బణమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో (1920) జరిగిన ఘటన వల్ల జర్మనీ అధిక ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందటానికి ఆలోచిస్తే.. 1920,30లో బ్యాంకుల దివాలా కారణంగా అమెరికా ప్రతి ద్రవ్యోల్బంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తోందని పేర్కొన్నారు. బాగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాల్లో మాదిరి కాకుండా ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉందన్నారు. ఈ అధిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అధిక వడ్డీ వ్యయాలు, కరె న్సీ ఒడిదుడుకుల కారణంగా తయారీ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. అమెరికా, యూకే మినహా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఇంకా గాడిలో పడలేదని, పుంజుకోవలసిన అవసరం ఉందన్నారు. వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంకా మందగమనంలోనే ఉన్నాయని తెలిపారు. చైనా ఆర్థిక వ్యవస్థ గురించి కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయని, ఆ దేశం పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందన్నారు. బయటి దేశ వ్యక్తిగా చైనా ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయడం కష్టమని, కానీ ఆ దేశంలో అనిశ్చితి నెలకొని ఉందని తెలిపారు. -
రేటు కోతకు గణాంకాలు అనుకూలించాలి
వాషింగ్టన్: ద్రవ్యోల్బణం, ఇతర స్థూల ఆర్థిక గణాంకాలు అనుమతిస్తే- రెపో రేటు కోతకు ఏమీ అభ్యంతరం ఉండబోదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్ స్పష్టం చేశారు. రేటు కోతకు తాము అనుకూలమే అయినా గణాంకాలు ఇందుకు వీలుకల్పించాలని సూచించారు. ద్రవ్య పరపతి సమీక్ష సెప్టెంబర్ 29న జరగనున్న నేపథ్యంలో రాజన్ తాజా వివరణ వెలువడ్డం గమనార్హం. కన్సాస్ సిటీ ఫెడరల్ రిజర్వ్ ప్రతిష్టాత్మక జాక్సన్ హోలీ ఎకనమిక్ సింపోజియంలో పాల్గొన్న రాజన్ ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో రెపో రేటు కోత అంశంపై మాట్లాడారు. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 7.25 శాతం)ను ఈ ఏడాది ఇప్పటికి ఆర్బీఐ మూడుసార్లు తగ్గించింది. ఈ ప్రయోజనంలో దాదాపు సగాన్ని బ్యాంకులు సైతం కస్టమర్లకు బదలాయించారు. వృద్ధికి చేయూతగా బ్యాంక్ మరింత రేటు కోత నిర్ణయం తీసుకోవాలన్న డిమాండ్ అటు ప్రభుత్వం నుంచీ ఇటు పారిశ్రామికవేత్తల నుంచీ వస్తోంది. ఈ అంశంపై రాజన్ మాట్లాడుతూ, ‘‘రేటు కోత అంశం పూర్తయ్యిందని మేము చెప్పడం లేదు. అలా చేయడానికి గణాంకాలు అనుమతించాలని మాత్రమే మేము కోరుకుంటున్నాం’’ అని అన్నారు. -
ఒడిదుడుకులను ఎదుర్కొంటాం
ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ - భారత్ ఆర్థిక పరిస్థితులు పటిష్టం - అందుబాటులో తగిన విదేశీ మారక ద్రవ్యం - రెపో కోతకు ద్రవ్యోల్బణం సహకరించాలి ముంబై: స్టాక్, కరెన్సీ మార్కెట్ల భారీ పతనం నేపథ్యంలో నెలకొన్న భయాలను పోగొట్టే ప్రయత్నం చేశారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్. దేశంలో ఆర్థిక ఫండమెంటల్స్ పటిష్టంగా ఉన్నాయని తెలిపారు. మార్కెట్ ఒడిదుడుకులను తట్టుకునే స్థాయిలో విదేశీ మారకద్రవ్య నిల్వలు మన సొంతమని భరోసా ఇచ్చారు. అలాగే ద్రవ్యోల్బణం దిగువ స్థాయిలో కొనసాగితే... వృద్ధికి ఊతం ఇచ్చే దిశలో తాజాగా రెపో రేటు తగ్గించే అవకాశాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చారు. రెపో కోత ఎవ్వరో అడిగితే తగ్గించేది కాదని, అది అతి తక్కువ ధరల ద్వారా ఒనగూరే సహజ ఫలితమనీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో. ఈ రేటును ఈ ఏడాది ఇప్పటికే ఆర్బీఐ మూడుసార్లు తగ్గించింది. ప్రస్తుతం ఇది 7.25 శాతంగా ఉంది. ఐబీఏ-ఫిక్కీ నిర్వహించిన ఒక బ్యాంకింగ్ సమావేశంలో రాజన్ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే... - భారత్ వద్ద ప్రస్తుతం 355 బిలియన్ డాలర్ల భారీ విదేశీ మారకపు ద్రవ్య నిల్వలు ఉన్నాయి. మరో 25 బిలియన్ డాలర్లు అందాల్సిన మొత్తం. ఈ నిల్వలు మన రూపాయి విలువ ఒడిదుడుకులను నియంత్రించడానికి దోహదపడతాయి. - భారీ విదేశీ మారకద్రవ్య నిల్వలతోపాటు దిగువస్థాయి కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటుకు సంబంధించి ఆర్థిక క్రమశిక్షణ, తగిన స్థాయిలో ద్రవ్యోల్బణం, స్వల్ప కాలానికి సంబంధించి విదేశీ కరెన్సీ బకాయిలు తక్కువ స్థాయిలో ఉండడం వంటి అంశాలు భారత్ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను తెలియజేస్తున్నాయి. - తక్కువ స్థాయి వడ్డీరేట్ల వ్యవస్థ ఏర్పాటుకు కృషి జరుగుతోంది. ఇందుకు ద్రవ్యోల్బణాన్ని తగిన స్థాయిలో ఉంచే చర్యలు అమలు జరుగుతున్నాయి. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ఆర్బీఐ వడ్డీరేట్లపై తగిన నిర్ణయం తీసుకుంటుంది. బ్యాంకులు ప్రస్తుతం ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. వడ్డీరేట్లు తగ్గించి వృద్ధికి దోహదపడాలి. కరెన్సీ ఒడిదుడుకుల కట్టడి లక్ష్యం... భారత్ ప్రధాన లక్ష్యం రూపాయి ఒడిదుడుకులను నిరోధించడమేనని అన్నారు. ఒడిదుడుకులు తీవ్ర స్థాయిలో ఉంటే మనకు ఇబ్బందని తెలిపారు. రూపాయి భారీగా బలపడితే- మన ఎగుమతులకు ఇబ్బంది అవుతుందన్నారు. తీవ్ర స్థాయిలో బలహీనపడినా ఇబ్బందేనని అన్నారు. దిగుమతుల ద్రవ్యోల్బణం సమస్య దీనివల్ల పెరుగుతుందని విశ్లేషించారు. అందువల్ల మన రూపాయి మారకం విలువ సమతౌల్యంలో ఉండాలన్నారు. ఇదే లక్ష్యంతో ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. -
ఒత్తిళ్లకు తలొగ్గని రాజన్..
పాలసీ రేట్లు యథాతథం ఆహార ధరలపై ఆందోళన ఈ ఏడాది 0.75 శాతం రెపో కోతలో సగమే కస్టమర్లకు అందిందని వ్యాఖ్య తద్వారా బ్యాంకులు రుణరేటును మరింత తగ్గించాలని సూచన వర్షపాతం బాగుండి, ధరలు తగ్గితే... రేటు కోత ఉంటుందని స్పష్టీకరణ ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ రఘురామ్ రాజన్- అటు ప్రభుత్వ వర్గాల నుంచి.. ఇటు పారిశ్రామిక వర్గాల నుంచి వచ్చిన ఒత్తిళ్లకు లొంగలేదు. మంగళవారం జరిపిన మూడవ ద్వైమాసిక ద్రవ్య, పరపతి విధాన సమీక్ష సందర్భంగా పాలసీ రేట్లలో ఎటువంటి మార్పులూ చేయకుండా, యథాతథంగా ఉంచారు. దీనితో రెపో రేటు 7.25 శాతంగా కొనసాగనుంది. రివర్స్ రెపో రేటు 6.25 శాతంగా, నగదు నిల్వల నిష్పత్తి 4 శాతంగా యథాతథ స్థితిలో ఉండనున్నాయి. ఎందుకింత ప్రాధాన్యం... దేశంలో ద్రవ్య, పరపతి విధాన తీరుతెన్నులను ఆర్బీఐ సమీక్షే నిర్దేశిస్తుంది. బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణంపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటే- రెపో. బ్యాంకులు స్వల్పకాలం తన వద్ద ఉంచే నిధులపై ఆర్బీఐ చెల్లించే వడ్డీరేటే- రివర్స్ రెపో. బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన నిధుల పరిమాణమే నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్). వ్యవస్థలో ద్రవ్యోల్బణం, డిమాండ్, ద్రవ్య సరఫరా పరిస్థితులను తగిన విధంగా నియంత్రించడానికి రెపో, రివర్స్ రెపో, సీఆర్ఆర్ వంటి ప్రధాన మార్గాలను ఆర్బీఐ అనుసరిస్తుంది. ఉదాహరణకు రెపో రేటు తగ్గిస్తే.. బ్యాంకులు ఆ మేరకు తక్కువ వడ్డీరేటుకు ఆర్బీఐ నుంచి రుణం పొందగలుగుతాయి. ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయిస్తే... వ్యవస్థలో రుణ వృద్ధికి... అటుపై వినియోగ డిమాండ్‌కు దారితీస్తుందని, తద్వారా పారిశ్రామిక వృద్ధి... దేశాభివృద్ధికి ఇది కారణమవుతుందన్నది ఆర్థిక సిద్ధాంతం. అయితే ధరలు తీవ్రంగా ఉంటే- రేటు కట్టడి ద్వారా వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) డిమాండ్ పరిస్థితులను నియంత్రించి ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుత ధరల తీవ్రత తాజా నిర్ణయానికి ఒక కారణమని ఆర్బీఐ పేర్కొనడం ఇక్కడ గమనార్హం. పాలసీ ముఖ్యాంశాలు... - ఆర్థిక రికవరీ ఇంకా పురోగతిలో ఉంది - జూన్‌లో వర్షపాతం బాగుంది. అయితే జూలైలో ఆశాజనకంగా లేదు. మొత్తంగా రుతుపవనాల పరిస్థితి సాధారణానికి సమీపంలోనే ఉంది - వినియోగ డిమాండ్ ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో పుంజుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి - బలహీన అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులు ఎగుమతులకు విఘాతంగా మారుతున్నాయి. - ప్రైవేటు రంగం నుంచి కొత్త పెట్టుబడులకు క్రమంగా డిమాండ్ పెరుగుతున్న సంకేతాలు కనబడుతున్నాయి. అయితే ఈ విషయంలో ప్రభుత్వం వైపు నుంచి పరిస్థితి స్థిరంగా ఉంది. - 2015-16లో వృద్ధి లక్ష్యం 7.6 శాతంగానే కొనసాగింపు - నాల్గవ త్రైమాసిక పరపతి సమీక్ష సెప్టెంబర్ 29న - ఆగస్టు చివరినాటికి కొన్ని చిన్న ఫైనాన్స్, పేమెంట్ బ్యాంకుల లెసైన్సుల జారీ చేసే అవకాశం ఉంది. - ప్రభుత్వం బ్యాంకులకు మరింతగా మూలధనం కేటాయించేలా కేంద్రం ప్రకటించిన ప్రణాళిక హర్షణీయం. పాలసీ రేటుపై మెజారిటీ నిర్ణయం మంచిదే... వడ్డీరేటు విషయంలో ఆర్బీఐ గవర్నర్ వీటో పవర్‌ను కట్‌చేసే అంశం పరిశీలనలో ఉన్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించినప్పుడు రాజన్ ఇందుకు సంబంధించి నెలకొన్న వివాదాన్ని చల్లార్చే కామెంట్ చేశారు. ఇలాంటి కమిటీ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు. బెంచ్‌మార్క్ రేట్లను ఒక వ్యక్తి నిర్ణయించడానికి బదులు, పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) నిర్ణయించడం మంచిదేనని అన్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాల ఖరారు క్రమంలో ప్రభుత్వం-ఆర్బీఐ మధ్య విభేదాలు ఏమీ ఉండబోవని అన్నారు. రేట్లపై గవర్నర్‌కు వీటో పవర్ అక్కర్లేదని ఈ సందర్భంగా పేర్కొన్న ఆయన, అత్యున్నత సంస్థ ఆర్బీఐకి నిర్ణయాలు తీసుకోవడంలో మరింత ప్రతిపత్తి అవసరం అని అన్నారు. పరపతి విధాన రూపకల్పన ప్రక్రియ వ్యవస్థీకరణ ముఖ్యమని ఆయన పేన్నారు. ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో ఆర్బీఐకి ప్రభుత్వం ఒక స్పష్టమైన లక్ష్యాన్ని ఇచ్చిందన్నారు. ఆయా అంశాలన్నింటిలో ప్రభుత్వం-ఆర్బీఐ మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవని వివరణ ఇచ్చారు. బ్యాంకులు తగ్గించింది కొంతే... ద్రవ్యోల్బణం పటిష్టస్థాయిలో కొనసాగుతుండడం ఆందోళనకరం. తగిన వర్షపాతం నమోదై.. ధరలు తగ్గిన పరిస్థితుల్లో కీలక రేటు కోత ఉంటుంది. దీనితోపాటు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లకు సంబంధించి ఇచ్చే సంకేతాలూ రేటు నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి. ఈ ఏడాది రెపో రేటును మూడు దఫాలు 75 బేసిస్ పాయింట్లు (100 పాయింట్లు ఒక శాతం) తగ్గించడం జరిగింది. ఈ ప్రయోజనంలో దాదాపు 30 బేసిస్ పాయింట్లే.. బ్యాంకింగ్ కస్టమర్లకు అందించింది. ఈ ప్రయోజనాన్ని మరింత బదలాయించాల్సి ఉంటుంది. ఆయా అంశాలన్నింటిపైనా తదుపరి పాలసీ నిర్ణయం ఆధారపడి ఉంటుంది. పాలసీ సమీక్ష తేదీకి, రేట్లపై నిర్ణయానికి సంబంధం ఉండదు. తగిన అనువైన పరిస్థితుల్లో ఎప్పుడైనా ఆర్బీఐ పాలసీ రేట్లను సవరిస్తుంది. మూడవ త్రైమాసికం నుంచీ రుణ డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉంది. రుణ రేటు తగ్గించిన ప్రయోజనాన్ని బ్యాంకులు దీనిద్వారా పొందుతాయి. -
పుట్టినరోజు రిటర్న్ గిఫ్ట్ లేదు...
ద్వైమాసిక సమీక్షలో పాలసీరేట్లను యథాతథంగా కొనసాగించిన రాజన్ ఎస్ఎల్ఆర్ మాత్రం అరశాతం కోత 21.5 శాతంగా 7వ తేదీ నుంచీ అమలు వ్యవస్థలోకి దాదాపు రూ.42,000 కోట్లు రుణాల పెంపునకు బ్యాంకులకు వెసులుబాటు ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నరు రఘురామ్ రాజన్ తన 52వ పుట్టిన రోజున అటు పాలకవర్గాలకు కానీ, ఇటు పారిశ్రామిక రంగానికి కానీ కోరుకున్న విధంగా భారీ రిటర్న్ గిఫ్ట్ అందించలేదు. మంగళవారం ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో పాలసీరేటు- రెపోను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రుణ మంజూరీలు పెరిగేందుకు వీలుగా స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియోను (ఎస్ఎల్ఆర్) 50 బేసిస్ పాయింట్లు (అరశాతం) తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో ఎస్ఎల్ఆర్ 21.5 శాతానికి తగ్గుతుంది. 7వ తేదీ నుంచీ ఇది అమల్లోకి వస్తుంది. ఈ నిర్ణయం వల్ల ఆర్థిక వ్యవస్థలోకి రూ.42,000 కోట్లు విడుదలవుతాయి. 2013 సెప్టెంబర్‌లో రాజన్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక, ఆర్బీఐ 2.5 శాతం వరకూ ఎస్ఎల్ఆర్ను తగ్గించింది. రెపోరేటు యథాతథంగా 7.75 శాతంగా కొనసాగనుంది. ఎలా పనిచేస్తాయి? అంతర్జాతీయంగా చమురు ధరలు, దేశీయంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆమోదనీయ స్థాయిలో ఉంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనూహ్యంగా (ఫిబ్రవరి 3 పాలసీ రేటుకు ముందుగానే) జనవరి 15న ఆర్బీఐ రెపోరేటును పావుశాతం తగ్గించి, బ్యాంకులకు రుణ రేటు తగ్గింపు సంకేతాలిచ్చింది. 2013 మే తరువాత రెపో తగ్గింపు ఇదేకావటం గమనార్హం. రెపో రేటు పావుశాతం తగ్గినందున, దీనికి అనుగుణంగా ఉండే రివర్స్ రెపో రేటు (బ్యాంకులు తన వద్ద స్వల్పకాలికంగా ఉంచే నిధులపై రిజర్వ్ బ్యాంక్ చెల్లించే వడ్డీరేటు) 7 శాతం నుంచి 6.75 శాతానికి తగ్గింది. కాగా బ్యాంకులు తమ డిపాజిట్లలో తప్పనిసరిగా ఆర్బీఐ వద్ద ఉంచాల్సిన నగదు నిల్వల నిష్పత్తిని (సీఆర్ఆర్) 4 శాతంగానే కొనసాగించింది. జనవరి 15న ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోగా... 45 వాణిజ్య బ్యాంకుల్లో మూడు మాత్రమే ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాయి. ఇక తాజాగా మంగళవారం ఆర్బీఐ తగ్గించిన ఎస్ఎల్ఆర్ విషయానికి వస్తే- బ్యాంకుల రుణ మంజూరీ వృద్ధికి దోహదపడడానికి తీసుకున్న చర్య ఇది. ఇప్పటివరకూ ఈ నిష్పత్తి 22 శాతంగా ఉంది. దీనిని తాజాగా 21.5 శాతానికి తగ్గించారు. అంటే ఆ మేరకు రూ.42,000 కోట్ల నిధులు ఇప్పుడు బ్యాంకులకు ‘రుణాలు ఇవ్వడానికి’ అందుబాటులోకి వస్తాయి. దీంతో బ్యాంకుల రుణ మంజూరీలు పెరిగే వీలుంది. మరికొన్ని ముఖ్యాంశాలు... 2014-15 కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 1.3% ఉంటుంది. 2016 జనవరి నాటికి ద్రవ్యోల్బణం లక్ష్యం 6 శాతం. పాత బేస్ ప్రకారం (2004-05) ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరం జీడీపీ 5.5%. 2015-16లో 6.5 %. ఉత్పాదక రంగాలకు మరిన్ని రుణాలు అందాలి. పెట్టుబడుల పునరుత్తేజానికి, వృద్ధికి ఇది అవసరం. లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద ఒక భారతీయుడు వ్యక్తిగతంగా విదేశాల్లో 2,50,000 డాలర్ల వరకూ పెట్టు బడులు పెట్టవచ్చు. ఇంతక్రితం పరిమితికన్నా ఇది రెట్టింపు. పటిష్ట దేశీయ విదేశీ మారకద్రవ్య నిల్వల స్థితికి నిదర్శనం. చిన్న ఫైనాన్స్ బ్యాంకుల ఏర్పాటుకు 72 అప్లికేషన్లు, పేమెంట్స్ బ్యాంకులకు 41 అప్లికేషన్లు అందాయి. ఏప్రిల్ 1 తరువాత కార్పొరేట్ రుణ పునర్వ్యవస్థీకరణ విండోను పొడిగించాలన్న బ్యాంకర్ల విజ్ఞప్తికి నో... అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపునకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, ఆయా ఫలితాలను ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం. పోటీతో రేట్లు తగ్గుతాయి బ్యాంకుల లాభాలు తక్కువగా ఉన్నాయి. అయితే రుణ వృద్ధి రేటు బలహీనంగా ఉన్నందున, అవి తిరిగి పుంజుకోడానికి బ్యాంకులు ప్రయత్నించాలి. దీనికోసం పరస్పరం పోటీపడాలి. దీనర్థం అవి కనీస రుణ రేటును తప్పకుండా తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక ఆర్బీఐ సంకేతాలకు అనుగుణంగా తనకు అందివచ్చిన పాలసీరేటు ప్రయోజనాన్ని అంతిమంగా కస్టమర్‌కు బదలాయించాల్సిన పరిస్థితి బ్యాంకులకు ఏర్పడుతుంది. ఈ దిశలో బ్యాంకులు తగిన నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నా. పలు బ్యాంకులు ఇప్పటికే తమ డిపాజిట్ రేట్లను తగ్గించిన విషయం గమనిస్తున్నాం. అయితే అంతే స్పీడుగా రుణ రేట్లపై నిర్ణయం తీసుకోలేదు. రెపోరేటుకు సంబంధించి ప్రస్తుతానికి మా విధానం పూర్తిగా సరైనదే. పలు స్థూల ఆర్థిక రంగాలకు సంబంధించి ఇంకా తాజా గణాంకాలు రావాల్సి ఉన్నాయి. ద్రవ్య పటిష్టత, ద్రవ్యోల్బణం ఒత్తిళ్ల వంటి అంశాల ప్రాతిపదికన దీనిపై మా తదుపరి చర్య ఆధారపడి ఉంటుంది. పరపతి విధానం అనేది దీర్ఘకాలం ప్రభావం చూపే ఒక ప్రక్రియ. కేంద్ర బ్యాంక్ చర్య ఏదైనా అది వాస్తవ రూపంలో కనబడేసరికి మూడు త్రైమాసికాల సమయం పడుతుంది. రేట్ల కోత నిర్ణయం ఒక వార్త కావచ్చు కానీ, దాని ప్రభావం కనబడ్డానికి తొమ్మిది నెలలు పడుతుంది. అన్ని పరిస్థితులనూ పూర్తిగా అధ్యయనం చేయడం ద్వారా తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. - రఘురామ్ జీ రాజన్, గవర్నర్, ఆర్బీఐ. బడ్జెట్ తర్వాత: పరిశ్రమలు బహుశా బడ్జెట్ అనంతరం రేట్ల కోత దిశలో అడుగు వేయవచ్చని సీఐఐ అధ్యక్షుడు అజయ్ ఎస్ శ్రీరామ్ చెప్పారు. ఫిక్కీ ప్రెసిడెంట్ జోత్స్నా సూరీ మాట్లాడుతూ, 2015లో రుణ రేటును మరో 75 బేసిస్ పాయింట్లు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. అసోచామ్ ప్రెసిడెంట్ రాణా కపూర్ మాత్రం ఆర్బీఐ కాకున్నా... ప్రభుత్వమైనా వడ్డీ ప్రయోజనాన్ని పారిశ్రామికవేత్తలకు బదలాయించే చర్యలు తీసుకోవాలన్నారు. రియల్టర్ల నిరుత్సాహం: క్రెడాయ్ మరోవైపు ఆర్బీఐ పాలసీ పట్ల రియల్టర్లు నిరుత్సాహాన్ని వ్యక్తం చేశారు. క్రెడాయ్ ప్రెసిడెంట్ సీ శేఖర్ రెడ్డి ఈ విషయంపై మాట్లాడుతూ, గృహ అమ్మకాల భారీ వృద్ధికి రుణ రేట్లు తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధి రేటు పురోగమించడానికి ఇది సరైన సమయమని, దీనికి వడ్డీరేట్ల తగ్గింపు అవసరమని తాము భావిస్తున్నామని చెప్పారు. ఎస్ఎల్ఆర్ కోతపై హర్షం వ్యక్తంచేశారు. తక్షణ తగ్గింపు ఉండదు: బ్యాంకర్లు ఆర్బీఐ రుణ రేటు తగ్గింపు సాంకేతాలు ఇచ్చినప్పటికీ తక్షణం ఈ దిశలో చర్యలేవీ ఉండవని.. బడ్జెట్ వరకూ వేచిచూస్తామని బ్యాంకర్లు చెప్పారు. మార్కెట్ అంచనాలకు అనుగుణంగా పాలసీ ఉందని ఎస్బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య, ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్ చెప్పారు. ఎస్ఎల్ఆర్ కోతతో తమకు రూ.7,000 కోట్లు అందుబాటులోకి వస్తాయని అరుంధతి తెలియజేశారు. -
రాజన్ రూటు మారుతుందా?
రేపు ఆర్బీఐ పాలసీ సమీక్ష వడ్డీరేట్ల తగ్గింపునకు సానుకూల పరిస్థితులు... భారీగా దిగొచ్చిన ద్రవ్యోల్బణం, ముడి చమురు ధరల ఆసరా... న్యూఢిల్లీ: వడ్డీరేట్ల తగ్గింపుపై ఇప్పటిదాకా కఠినంగా వ్యవహరిస్తున్న ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఈసారి మెత్తబడతారా? ఈ నెల 2న(రేపు) చేపట్టనున్న పరపతి విధాన సమీక్షలో అనూహ్యంగా రేట్ల కోతతో ఆశ్చర్యపరుస్తారా? గడిచిన 2 నెలలుగా జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే వాదనలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణం వరుసగా ఐదో నెలలో కూడా భారీగా దిగిరావడం... మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దాదాపు నాలుగున్నరేళ్ల కనిష్టానికి పడిపోవడం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. కార్పొరేట్లు వడ్డీ రేట్లు తగ్గించాలంటూ పదేపదే డిమాండ్ చేసినప్పటికీ గత 4 సమీక్షల్లో పాలసీ రేట్లను రాజన్ యథాతథంగా కొనసాగించడం తెలిసిందే. అన్నీ మంచి శకునములే... రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 5.52 శాతానికి దిగిరాగా.. టోకు ధరల ఆధారిత(డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం రేటు ఐదేళ్ల కనిష్టమైన 1.77 శాతానికి శాంతించడం తెలిసిందే. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటిదాకా 40 శాతం మేర క్షీణించాయి. ప్రస్తుతం నెమైక్స్ క్రూడ్ బ్యారెల్ ధర 66 డాలర్ల వద్ద, బ్రెంట్ క్రూడ్ 70 డాలర్ల స్థాయికి పడిపోయింది. ఇది దేశీయంగా పెట్రో ధరలు తగ్గేందుకు.. ఫలితంగా ద్రవ్యోల్బణం మరింత శాంతించేందుకు దోహదం చేసే అంశం. అంతేకాకుండా అత్యధికంగా ముడిచమురు దిగుమతులపై ఆధారపడిన మన ఆర్థిక వ్యవస్థకు కూడా ఇది శుభపరిణామమే. ఎందుకంటే దిగుమతుల బిల్లు తగ్గి.. కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్) కూడా అదుపులో ఉంటుంది. అంతేకాకుండా... ముడి చమురు ధర 100 డాలర్ల స్థాయి కొనసాగవచ్చన్న అంచనాలతో ఆర్బీఐ రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యాలను నిర్దేశించింది. 2015 జనవరినాటికి 8 శాతం, 2016 జనవరికి 6 శాతానికి కట్టడి చేయాలని నిర్దేశించుకుంది. ఈ లక్ష్యాలు ఇప్పటికే సాకారమయ్యాయి కూడా. ఆర్బీఐ అంచనాలతో పోలిస్తే చమురు ధర 30 శాతం క్షీణించడంతో రాజన్ ఆలోచనలో మార్పు వచ్చి, రేట్లు తగ్గించే అవకాశం లేకపోలేదు. మంగళవారం సెంటిమెంట్! రాజన్‌కు మంగళవారం సెంటిమెంటు ఉందా? ఈ ఆర్థిక సంవత్సరం ఆరంభం(ఏప్రిల్) నుంచి ఇప్పటిదాకా జరిగిన నాలుగు పాలసీ సమీక్షలతో పాటు రేపటిది కూడా మంగళవారమే కావడం చూస్తే ఇలాంటి అభిప్రాయమే కలుగుతోంది. 2013 సెప్టెంబర్ 4న బాధ్యతలు చేపట్టిన రాజన్.. గత ఆర్థిక సంవత్సరంలో జరిపిన 4 సమీక్షల్లో 2 మంగళవారమే నిర్వహించారు. పాలసీ యథాతథమే: బ్యాంకర్లు ద్రవ్యోల్బణం దిగొచ్చినప్పటికీ.. రేపటి పాలసీ సమీక్షలో కీలక వడ్డీరేట్ల కోత ఉండకపోవచ్చని ఎస్బీఐ చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య అభిప్రాయపడ్డారు. బహుశా ఈ ఆర్థిక సంవత్సరం చివర్లో(మార్చి) రేట్ల కోత ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. యునెటైడ్ బ్యాంక్ ఈడీ దీపక్ నారంగ్ కూడా ఆర్బీఐ మరికొన్నాళ్లు వేచిచూసే అవకాశం ఉందన్నారు. ‘వడ్డీరేట్ల తగ్గింపునకు పరిస్థితులు సానుకూలంగానే ఉన్నప్పటికీ... రుణాలకు డిమాండ్ పెద్దగా లేదు. పావు శాతం రేటు తగ్గించడం వల్ల గణనీయంగా డిమాండ్ పెరిగే అవకాశాల్లేవు. అందుకే వృద్ధికి చేయూతనివ్వాలంటే తగిన సమయంలో నిర్ణయం తీసుకోవడం కోసం ప్రస్తుతానికి యథాతథంగానే ఆర్బీఐ పాలసీని కొనసాగించే చాన్స్ ఉంది’ అని నారంగ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రెపో రేటు 8 శాతం, రివర్స్ రెపో 7 శాతం, నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్ఆర్) 4% వద్ద ఉన్నాయి. తగ్గించొచ్చు: యస్ బ్యాంక్ అయితే, యస్ బ్యాంక్ సీఈఓ, ఎండీ రాణా కపూర్ మాత్రం రేపటి ఆర్బీఐ సమీక్షలో పావు శాతం వడ్డీరేట్ల కోతకు ఆస్కారం ఉందని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణం శాంతించడంతో పాటు అంతర్జాతీయంగా ముడిచమురు ధర భారీ పతనం.. భవిష్యత్తులో మరింత తగ్గొచ్చనే అంచనాలే దీనికి కారణమ న్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో ఆర్బీఐ వడ్డీరేట్ల తగ్గింపునకు చాన్స్ ఉందని కోటక్ మహీంద్రా బ్యాంక్ చీఫ్ ఉదయ్ కోటక్ అన్నారు. కాగా, విశ్లేషకులు మాత్రం ఈ సారి సమీక్షలో రేట్లను మరోసారి యథాతథంగానే కొనసాగించవచ్చని అంటున్నారు. రేట్లు తగ్గించాల్సిందే: కార్పొరేట్లు ఆర్థిక వృద్ధి రేటు మందగమనం, ద్రవ్యోల్బణం తగ్గుముఖం నేపథ్యంలో ఆర్బీఐ కచ్చితంగా వడ్డీరేట్ల కోతతో ఉపశమనం కల్పించాలని కార్పొరేట్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ ఏడాది రెండో త్రైమాసికం(2014-15, క్యూ2)లో జీడీపీ వృద్ధి రేటు 5.3 శాతానికి(క్యూ1లో 5.7 శాతం) పరిమితమైన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కూడా వడ్డీరేట్లను తగ్గించి రేట్లను తగ్గించడం ద్వారా వృద్ధికి చేయూతనివ్వాలని పదేపదే చెబుతూవస్తున్నారు. నేడు రాజన్‌తో జరగనున్న భేటీలో రేట్ల కోత అంశాన్ని జైట్లీ ప్రస్తావిస్తారని పారిశ్రామిక రంగం గంపెడాశలతో ఉంది. ‘వృద్ధి ఇంకా గాడిలోపడలేదు. మరోపక్క, అంచనాలకు మంచి ద్రవ్యోల్బణం దిగొచ్చింది. క్రూడ్ ధర కూడా భారీగా దిగొచ్చింది. ఇప్పట్లో ఇది పెరగే అవకాశం లేకపోగా.. 60 డాలర్ల(నెమైక్స్ క్రూడ్ బ్యారెల్ రేటు) స్థాయికీ పడిపోవచ్చనే అంచనాలున్నాయి. ఈ పరిస్థితులన్నీ దృష్టిలోపెట్టుకొని కనీసం అర శాతం వడ్డీరేట్ల(రెపో) కోతను ఆర్బీఐ ప్రకటించాల్సిందే’ అని పారిశ్రామిక మండలి అసోచామ్ ఒక ప్రకటనలో పేర్కొంది. తయారీ రంగం ప్రస్తుత గడ్డు పరిస్థితులకు అధిక వడ్డీరేట్లూ ప్రధాన కారణమే. ద్రవ్యోల్బణం దిగిరావడంతో పెట్టుబడుల సెంటిమెంట్‌ను మెరుగుపరచాలంటే ఆర్బీఐ రేట్ల తగ్గింపుతోనే సాధ్యమని ఫిక్కీ ప్రెసిడెంట్ సిద్ధార్థ్ బిర్లా అభిప్రాయపడ్డారు. ఆర్బీఐ ఇకనైనా తన స్టేటస్ కో(యథాతథ) ధోరణిని పక్కనబెట్టి వడ్డీరేట్ల కోతతో పరిశ్రమకు, సామాన్య రుణ గ్రహీతలకూ ఉపశమనం కల్పించాలని భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) డెరైక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పేర్కొన్నారు. -
రుణ మాఫీ వద్దే వద్దు: రఘురామ్ రాజన్
ముంబై: రైతుల రుణమాఫీ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఒకవైపు తమ డిమాండ్‌ను కొనసాగిస్తుండగా, రాష్ట్రాలు అలాంటి రాయితీలను కోరే ఆలోచన విరమించుకోవాలంటూ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ సోమవారం సూచించారు. కొన్ని రాష్ట్రాలు ప్రకటించిన రుణమాఫీ,.. బ్యాంకుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందని, బ్యాంకుల గుణాత్మక ఆస్తులు క్షీణిస్తాయని రిజర్వ్ బ్యాంక్ తన ప్రకటనలో పేర్కొంది. 15 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, 27రాష్ట్రాల, 9 కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికశాఖల కార్యదర్శులతో సోమవారం ఢిల్లీ జరిగిన సదస్సులో రఘురామ్ రాజన్ ప్రసంగించారు. -
రీ షెడ్యూల్‌పై ఆశలు ఆవిరి!
రైతు రుణాల విషయంలో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి హైదరాబాద్: రైతు రుణాల రీ షెడ్యూల్‌పై రాష్ర్ట ప్రభుత్వం పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. దీనితో ప్రత్యామ్నాయ మార్గాల వేటలో పడింది. రుణాలు రీ షెడ్యూల్ అవుతాయని నిన్నటి వరకు భావించిన ప్రభుత్వం, రిజర్వ్‌బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ మీడియాతో మాట్లాడుతూ రీ షెడ్యూల్‌పై వ్యక్తం చేసిన అభిప్రాయాల నేపథ్యంలో పునరాలోచనలో పడిం ది. రీ షెడ్యూల్‌తో కొంతమేరకు ప్రభుత్వంపై తక్షణ భారం తగ్గుతుందని భావించినా... ఇప్పుడాపరిస్థితి కూడా లేకపోవడంతో నిధుల సమీకరణ ఎలా అన్న అంశంపై దృష్టి పెట్టింది. బాండ్లద్వారా నిధుల సేకరణ, సెక్యురిటీ గ్యారెంటీ, భూముల విక్రయం, బడ్జెట్లో బ్యాంకులకు చెల్లించే మొత్తాన్ని కేటాయించడం వంటివి మినహా మరో మార్గం లేదని ఉన్నతాధికారవర్గాలు స్పష్టంచేశాయి. కాగా, మంగళవారం ఆర్బీఐకి లేఖ రాశామనీ, దానికి స్పష్టమైన సమాధానం కోసం ఎదురుచూస్తున్నామని అధికారులు చెబుతున్నారు. రుణాల రీ షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్‌కు చేస్తే... తెలంగాణకు కూడా అది వర్తిస్తుందని వ్యాఖ్యానించారు. ఆర్బీఐ నుంచి అధికారిక సమాచారం వచ్చే వరకు తాము పూర్తిగా ఆశ వదులుకోలేమని చెబుతూనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పంటల దిగుబడిపై జిల్లాను యూనిట్‌గా తీసుకుని.. రిజర్వ్‌బ్యాంకు నిబంధనల కంటే ఎక్కువ దిగుబడి ఉన్నందున రీ షెడ్యూల్ ఎలా చేస్తామంటూ కొర్రీలు వేస్తున్నారని, కాని మండలాల వారీగా పరిశీలిస్తే.. చాలా మండలాల్లో దిగుబడి తక్కువగా ఉందని, పైలాన్ తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ప్రభుత్వం అంటోంది. గతంలో రుణాల రీ షెడ్యూల్‌పై ఆర్బీఐ ఏనాడు ఇలా ఇబ్బందులు సృష్టించలేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. గతంలో యూపీఏ ప్రభుత్వం 60 వేల కోట్ల రూపాయల రుణ మాఫీ చేసినప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేయని ఆర్బీఐ ఇప్పుడే ఎందుకు చేస్తోందని ప్రభుత్వంలో ప్రముఖుడు ఒకరు వ్యాఖ్యానించారు. నిధుల సమీకరణ ఎలా చేస్తారన్న ప్రశ్నకు మాత్రం ఆయన సూటిగా సమాధానం చెప్పకుండా దాటవేయడం గమనార్హం. ప్రస్తుతం రైతులు రుణాలు చెల్లిస్తే.. వారికి రీయింబర్స్ చేసే విధానాన్ని పరిశీలిస్తున్నారు. అది తప్ప మరోమార్గం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది.