ఆర్థిక వ్యూహాల్లో రాజకీయాలదే ముఖ్యపాత్ర
- ద్రవ్యోల్బణమే లక్ష్యంగా కేంద్ర బ్యాంకులు
- అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిలో పడలేదు...
- ద్రవ్యోల్బణ కట్టడే తొలి ప్రాధాన్యం జాక్సన్ హోల్ ఆర్థిక సదస్సులో రాజన్
వాషింగ్టన్: ఆర్థిక విధానపరమైన వ్యూహా రచనల్లో రాజకీయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. భారత్‌లోని రాజకీయ వ్యవస్థ కేంద్ర బ్యాంకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పాటునందిస్తోందని, రాజకీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఒత్తిళ్లను దూరం చేయడమే పాలసీ ప్రక్రియ ప్రాధాన్యమని తెలిపారు.
ఆయన వోమింగ్‌లో జరిగిన కన్సాస్ సిటీ ఫెడరల్ రిజర్వు జాక్సన్ హోల్ ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ఆసక్తికరంగా ఇదే వేదికపై రాజన్ గతంలో 2007-08 ఆర్థిక మాంద్యం వస్తుందని ముందే చెప్పారు. అప్పుడు రాజన్ ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్నారు. దేశ ఆర్థిక విధాన లక్ష్యాలను వాటి రాజకీయ, చారిత్రక అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పారు. తమ పాలసీ విశ్లేషణలో రాజకీయ ఆర్థిక వ్యవస్థ కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు.
ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులన్నీ ద్రవ్యోల్బణమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో (1920) జరిగిన ఘటన వల్ల జర్మనీ అధిక ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందటానికి ఆలోచిస్తే.. 1920,30లో బ్యాంకుల దివాలా కారణంగా అమెరికా ప్రతి ద్రవ్యోల్బంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తోందని పేర్కొన్నారు. బాగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాల్లో మాదిరి కాకుండా ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉందన్నారు. ఈ అధిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అధిక వడ్డీ వ్యయాలు, కరె న్సీ ఒడిదుడుకుల కారణంగా తయారీ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు.
అమెరికా, యూకే మినహా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఇంకా గాడిలో పడలేదని, పుంజుకోవలసిన అవసరం ఉందన్నారు. వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంకా మందగమనంలోనే ఉన్నాయని తెలిపారు. చైనా ఆర్థిక వ్యవస్థ గురించి కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయని, ఆ దేశం పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందన్నారు. బయటి దేశ వ్యక్తిగా చైనా ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయడం కష్టమని, కానీ ఆ దేశంలో అనిశ్చితి నెలకొని ఉందని తెలిపారు.