న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన కేంద్ర బ్యాంకులు పాలసీ రేట్లను కఠినతరం చేయడం వల్ల వచ్చే 6–8 నెలల్లో డిమాండ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, రికవరీ ప్రక్రియ మందగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్‌బీఐసహా (4 నుంచి 4.4 శాతానికి) అమెరికా సెంట్రల్ బ్యాంక్ (అరశాతం పెంపుతో ఒక శాతానికి), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (పావు శాతం పెంపుతో 13 ఏళ్ల గరిష్ట స్థాయి ఒక శాతానికి)సహా పలు కేంద్ర బ్యాంకులు ‘రష్యా–ఉక్రెయిన్ వివాదంతో తీవ్రమవుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు’ తమ బెంచ్‌మార్క్ రుణ రేట్లను పెంచాయి. 77వ రోజులోకి ప్రవేశించిన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ సరఫరా చైన్‌కు అంతరాయం కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇంధనం, ఆహారధాన్యాల ధరలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎకనమిస్టులు, నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే...
- వివిధ కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు డిమాండ్‌పై ప్రభావం చూపుతాయి. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇంకా మహమ్మారి ముందు స్థాయికి చేరుకోని ప్రపంచంలోని పలు ఎకానమీలకు తాజా పరిస్థితులు మరింత తీవ్ర ప్రతికూలతలను సృష్టిస్తాయి.
- గతంలో సరఫరా చైన్ వల్ల మాత్రమే పెరిగే ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రస్తుతం యుద్ధం వల్ల మరింత తీవ్రతరమవుతున్నాయి.
- ద్రవ్యోల్బణం సవాళ్ల కట్టడికి అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు ఇప్పుడు వడ్డీరేట్ల పెంపు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. రాబోయే 6–8 నెలల పాటు ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా చర్యలు ఉంటాయి. ఇవి వ్యవస్థలో డిమాండ్‌ను తగ్గిస్తాయి. భవిష్యత్తులోనూ రేట్ల పెంపు తప్పదని సెంట్రల్ బ్యాంకులు సంకేతాలు ఇస్తుండడం గమనార్హం.
రూపాయిలో ఆర్‌బీఐ జోక్యం ఇబ్బందే!
ఆర్‌బీఐ వర్గాల కథనం ప్రకారం, రూపాయి అస్థిరతను అరికట్టడానికి గత కొన్ని రోజులుగా ఫారెక్స్ మార్కెట్‌లో కూడా ఆర్బీఐ జోక్యం చేసుకుంటోంది. ఈ వారం ప్రారంభంలో అమెరికా డాలర్‌తో రూపాయి తన జీవితకాల కనిష్ట స్థాయి 77.44కి పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రూపాయిని ఒక స్థాయి వరకూ ఆర్‌బీఐ పడిపోకుండా చూడగలదుకానీ, భారీ పతనాలను నివారించలేదన్నది నిపుణుల వాదన. అలాంటి చర్యలకు ఆర్‌బీఐ దిగితే, భారత్ విదేశీ మారకద్రవ్యం నిల్వలు తరిగిపోయి, రూపాయి మారకంలో డాలర్ పటిష్టత మరింత ఊపందుకుంటుంది. 2021 సెప్టెంబర్‌లో జీవితకాల గరిష్ట స్థాయి 642.54 బిలియన్ డాలర్ల స్థాయికి చేరిన భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ప్రస్తుతం 600 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దాదాపు 12 నెలల దిగుమతులకు ఇవి సరిపోతాయి.
అధిక ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యత: ఆర్థికశాఖ
ఇదిలావుండగా, ఆర్థిక మంత్రిత్వశాఖ నెలవారీ ఆర్థిక సమీక్షను విడుదల చేస్తూ, దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండకుండా కట్టడి చేసేందుకే ప్రభుత్వం, ఆర్‌బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆర్‌బీఐ ఇటీవలి రేట్ల పెంపు ఈ దిశలో తీసుకున్న చర్యేనని పేర్కొంది. ద్రవ్యోల్బణమే ప్రధాన సమస్యగా వివరించింది.
డబ్ల్యూటీవో కృషి చేయాలి
అంతర్జాతీయ ద్రవ్యోల్బణం కట్టడికి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పాటు పడాలని భారత్ డిమాండ్ చేసింది. అధిక ద్రవ్యోల్బణం సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నట్టు గుర్తు చేసింది. డబ్ల్యూటీవోలో భారత శాశ్వత రాయబారి బ్రజేంద్ర నవనీత్ ఈ మేరకు ప్రకటన చేశారు. కరోనా విపత్తు తర్వాత, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకోవడం, స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధనను అత్యంత ప్రాధాన్య అంశాలుగా తీసుకోవాలని డబ్ల్యూటీవోను భారత్ కోరుతున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment