న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 4 శాతం దిగువకు తగ్గించడంపై సెంట్రల్ బ్యాంక్ దృఢంగా దృష్టి సారించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ మంగళవారం తెలిపారు. ద్రవ్యోల్బణం కట్టడిలో ప్రధానమైన సరఫరాల సంబంధ అవరోధాలను అధిగమించడానికి విధానపరమైన చర్యలను చేపట్టేందుకూ సిద్ధంగా ఉందని తెలిపారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ (డీఎస్‌ఈ) డైమండ్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా ‘ఆర్ట్ ఆఫ్ మానిటరీ పాలసీ మేకింగ్: ది ఇండియన్ కాంటెక్ట్స్’ అంశంపై శక్తికాంతదాస్ విశిష్ట ఉపన్యాసం చేశారు. ప్రసంగంలో
ముఖ్యాంశాలు చూస్తే..
►అధిక ప్రపంచ ద్రవ్యోల్బణం, కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం వంటి అంశాలు ద్రవ్య విధాన నిర్వహణకు సవాళ్లు.
►అంతర్జాతీయ, జాతీయ ఆర్థిక వ్యవస్థలో మారుతున్న స్వభావాలు, ఆర్థిక మార్కెట్లలో పరిణామాలకు అనుగుణంగా భారతదేశ ద్రవ్య విధాన ఫ్రేమ్‌వర్క్ రూపొందుతోంది. ద్రవ్యోల్బణం, ఆర్థిక స్థిరత్వం, వృద్ధి అంశాల ప్రాతిపదికన విస్తృత లక్ష్యాలతో స్వాతంత్య్రం వచ్చినప్పటి దేశ ద్రవ్య విధాన నిర్వహణ జరుగుతోంది.
►కోవిడ్ మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితిని ఎదుర్కోవటానికి వీలుగా సెంట్రల్ బ్యాంక్ పలు ద్రవ్య, పరపతి విధాన చర్యలు తీసుకుంటోంది.కోవిడ్ దశలో కూడా ఆర్థిక స్థిరత్వాన్ని బలోపేతం చేయడానికి మేము నిరంతరం చర్యలు తీసుకున్నాము.
►సుదీర్ఘ కాలం పాటు దాదాపు జీరో పాలసీ రేటు విధానం తర్వాత మారిన ఆర్థిక పరిస్థితుల్లో ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు 2022లో వడ్డీ రేట్లను దూకుడుగా పెంచడం ప్రారంభించాయి. ఇది ఈ ఆర్థిక వ్యవస్థల్లోని కొన్ని బ్యాంకుల్లో ఒత్తిడికీ కారణమైంది.
►2022 మే తర్వాత భారత్‌లో కూడా సెంట్రల్ బ్యాంక్ 250 బేసిస్ పాయింట్ల రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 6.5 శాతం)ను పెంచింది. అయితే ఎక్కడా ఆర్థిక స్థిరత్వం ఆందోళనలు తలెత్తకుండా జాగరూకతతో కూడిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.
►బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ), ఇతర ఆర్థిక సంస్థల నియంత్రణ, పర్యవేక్షణకు రిజర్వ్ బ్యాంక్ వివేకవంతమైన విధానాన్ని అవలంబించింది. తగిన సమన్వయ చర్యలకు శ్రీకారం చుట్టింది. దీనితో భారత్ బ్యాంకింగ్ వ్యవస్థ మూలధనం, రుణ నాణ్యత, లాభదాయకతలకు సంబంధించి చక్కటి బాటన పయనించింది.
►తక్కువ, స్థిరమైన ద్రవ్యోల్బణం దీర్ఘకాల పొదుపులు– పెట్టుబడులకు ప్రణాళిక చేయడంలో గృహాలు, వ్యాపారాలకు సహాయపడుతుంది. ఇది చివరికి నూతన ఆవిష్కరణలు, ఉత్పాదకత స్థిరమైన వృద్ధిని పెంచుతుంది. దీనికి విరుద్ధంగా, అధిక– అస్థిర ద్రవ్యోల్బణం ఉత్పాదకత, దీర్ఘకాలిక వృద్ధి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థను క్షీణింపజేస్తుంది. ద్రవ్యోల్బణం పేదలపై తీవ్ర భారాన్ని కూడా మోపుతుంది.
ఇప్పటికి వడ్డీరేటు తగ్గింపు కష్టమే: నిపుణులు
వాస్తవ పరిస్థితిలో చూస్తే, ఆహార ధరలు ఇటు రిటైల్‌గానూ, అటు టోకుగానూ ఆకాశానంటుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్షణం వడ్డీ రేట్ల తగ్గింపు కష్టమేనని నిపుణులు పేర్కొంటున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44 శాతంగా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే అప్పర్ బ్యాండ్‌లో 6 శాతం అధిగమిస్తే... దానిని ఎకానమీలో డేంజర్ బెల్స్‌గా పరిగణించాల్సి ఉంటుంది. జూలై నెలలో అంకెలు ఈ స్థాయిని అధిగమించడం గమనార్హం. ఇక టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణంలో కీలక విభాగమైన ఫుడ్ బాస్కెట్‌లో ధరల స్పీడ్ కూడా జూలైలో ఏకంగా 14.25 శాతం ఎగసింది (గత ఏడాది జూలై ధరలతో పోల్చి). వినియోగ ధరల సూచీ ప్రత్యేకించి ఆహార ధరల తీవ్రత ఇదే తీరున కొనసాగితే, ఆర్‌బీఐ సరళతర వడ్డీరేటు విధానంవైపు (రేట్ల తగ్గింపునకు అనుకూలం) ఇప్పట్లో తిరిగి చూడ్డం కష్టమని నిపుణులు పేర్కొంటున్నారు.
ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్‌బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు) 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఆగస్టునెల సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్‌బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచ్చింది. ఇదే విషయాన్ని ఆగస్టు నెలల్లో జరిగిన పాలసీ సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్‌బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. ఆర్‌బీఐ రేటు తగ్గింపు ఇప్పట్లో సాధ్యమయ్యే పనికాదని, ఏదైనా జరిగితే 2024 జూలై తరువాత ఈ మేరకు నిర్ణయం ఉంటుందని రేటింగ్స్ ఏజెన్సీ ఇక్రా వంటి సంస్థలు పేర్కొనడం గమనార్హం.
వచ్చే కొద్ది నెలల్లో ధరలది ఎగువబాటే: ఎస్‌అండ్‌పీ
ఇదిలావుండగా, భారతదేశంలో ద్రవ్యోల్బణం సమీప కాలంలో పెరిగే అవకాశం ఉందని గ్లోబల్ రేటింగ్స్ సంస్థ– ఎస్‌అండ్‌పీ ఎకనామిస్ట్ (ఆసియా పసిఫిక్) విశ్రుత్ రాణా పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ విధానాలు ధరలు తీవ్రం కాకుండా నిరోధిస్తాయని ఆయన అన్నారు. ‘ఆసియా–పసిఫిక్ క్రెడిట్ ఫోకస్’ వెబ్‌నార్‌లో రానా మాట్లాడుతూ, భారత్‌లో రుతుపవనాలు చాలా తక్కువగా ఉన్నాయని, మొత్తం వర్షపాతం సాధారణం కంటే 11 శాతం తక్కువగా ఉందని చెప్పారు. ఇది రాబోయే కొద్ది నెలల్లో భారతదేశంలో ధాన్యం ధరలను ప్రభావితం చేసే అంశంమని పేర్కొన్న ఆయన, ఇది ఒక తీవ్ర ఆందోళన కరమైన అంశంగా తెలిపారు. కొన్ని నిత్యావసరాల ధరలు నెలవారీగా ఒడిదుడుకులు చూస్తున్నప్పటికీ, ఈ ధరలను దేశంగా ప్రధానంగా ఇంధన ధరలే ప్రభావితం చేస్తాయని రాణా తెలిపారు. భారత్‌లో ధరల పెరుగుదల ‘తాత్కాలిక ధోరణి’ మాత్రమేనని, ప్రభుత్వం–ఆర్‌బీఐ ధరల తగ్గింపునకు తగిన చర్యలు తీసుకుంటాయని ఆర్థిక మంత్రిత్వశాఖ ఇటీవలి తన నెలవారీ నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అనిశ్చితి ఆర్థిక పరిస్థితుల్లోనూ రానున్న రోజుల్లో దేశీయ వినియోగం, పెట్టుబడుల డిమాండ్ పరిస్థితులు పటిష్టంగా ఉంటాయన్న విశ్వాసాన్ని రాణా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment