న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ ఎగువబాట పట్టింది. కూరగాయాలు, పప్పులు, వంట దినుసుల ధరల మంటతో డిసెంబర్ మాసానికి 5.69%కి పెరిగింది. ఇది నాలుగు నెలల గరిష్ట స్థాయి కావడం గమనించాలి. వినియోగ ధరల సూచీ (సీపీఐ/రిటైల్) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 నవంబర్ నెలలో 5.55%గా ఉంటే, 2022 డిసెంబర్ నెలకు 5.72%గా ఉంది. ఈ వివరాలను జాతీయ గణాంక కార్యాలయం విడుదల చేసింది.
రిటైల్ ద్రవ్యోల్బణంలో సగం వాటా కలిగిన ఆహారోత్పత్తుల ధరలు (కూరగాయలతో కూడిన).. గతేడాది నవంబర్ నెలలో 8.7%గా ఉంటే, డిసెంబర్ నెలలో 9.53%కి పెరిగిపోయాయి. 2022 డిసెంబర్‌లో వీటి ధరలు సూచీలో 4.19% వద్దే ఉండడం గమనార్హం. 2023 ఆగస్ట్‌లో ద్రవ్యోల్బణం 6.83% గరిష్ట స్థాయిని తాకిన తర్వాత నుంచి కొంత తగ్గుతూ వచ్చింది. కూరగాయల విభాగం ద్రవ్యోల్బణం 27.64%గా ఉంది. పప్పులకు సంబంధించి 20.73%, వంట దినుసుల ద్రవ్యోల్బణం 19.69% చొప్పున నమోదైంది.
ఆహార విభాగంలోనే...
సీపీఐ ద్రవ్యోల్బణం త్రైమాసికం వారీగా పెరిగిపోవడం అన్నది ఆహారం, పానీయాల విభాగం వల్లేనని ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితి నాయర్ పేర్కొన్నారు. మిగిలిన అన్ని విభాగాల్లో ద్రవ్యోల్బణం కొంత తగ్గడం లేదంటే అదే స్థాయిలో కొసాగినట్టు తెలిపారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని దీర్ఘకాలంలో 4% స్థాయిలో (2 శాతం అటూ ఇటూ దాటకుండా) పరిమితం చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment