ప్రముఖ ఫిన్ టెక్ దిగ్గజం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పేటీఎంపై ఆర్‌బీఐ నియంత్రణ చర్యల్ని సమీక్షించబోమని తెలిపారు.
ఇటీవల ఆర్‌బీఐ..పేటీఎంపై కఠిన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 29 తర్వాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని స్పష్టం చేసింది. యూజర్ల అకౌంట్లు, ప్రీ పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు,ఫాస్టాట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు చేయకూడాదని ఆర్‌బీఐ తెలిపింది.
వినియోగదారుల భద్రతే ఆర్‌బీఐ లక్ష్యం
ఈ ఆంక్షల నేపథ్యంలో ఫిబ్రవరి 12న (నేడు) కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డుతో సమావేశమయ్యారు. ఈ భేటీలో శక్తికాంత దాస్ సైతం పాల్గొన్నారు. అనంతరం ఆర్‌బీఐ సమావేశం గురించి శక్తికాంత దాస్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా నియంత్రిత సంస్థలపై (పేటీఎంను ఉద్దేశిస్తూ) సెంట్రల్ బ్యాంక్ క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతే చర్యలు తీసుకుంటుందని పునరుద్ఘాటించారు.ఆర్‌బీఐ ఫిన్‌టెక్ రంగానికి మద్దతు ఇస్తూనే, కస్టమర్ల ప్రయోజనాలను కాపాడేందుకు మొగ్గు చూపుతుందని స్పష్టం చేశారు.
అప్పటి వరకు ఎదురు చూడాల్సిందే
పేటీఎం ఆర్ధికపరమైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుందా? లేదంటే ఫైనాన్షియల్ సిస్టమ్‌పై ఏవైనా చిక్కులు ఉన్నాయా అని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ‘పేటీఎం అంశంపై తీసుకున్న నిర్ణయాలపై ఎప్పటికప్పుడు వెల్లడిస్తాం. అంతేకాదు, ఈ వారంలో ఎఫ్ఏక్యూ జారీ చేస్తామని, అప్పటి వరకు అందరూ వేచి చూడాలని కోరారు.
ఆర్‌బీఐ నిబంధనల్ని పేటీఎం పట్టించుకోలేదు
గత వారం జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమీక్షా సమావేశం అనంతరం ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మీడియాతో పలు అంశాల గురించి మాట్లాడారు. ఆర్‌బీఐ ఏదైనా సంస్థను నియంత్రించాలంటే ముందుగా దిద్దుబాటు చర్యల వైపే మొగ్గచూపుతుంది. ఇందుకోసం సదరు సంస్థలకు తగినంత సమయం ఇస్తుంది. పేటీఎం విషయంలోనూ ఇదే జరిగింది. గత కొన్నేళ్లుగా పేటీఎం ఆర్‌బీఐ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోలేదు. నిబంధనల్ని ఉల్లంఘించి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిందని అన్నారు.
అన్నీ సక్రమంగా ఉంటే
‘‘ఆర్‌బీఐ సంస్థలపై చర్యలు తీసుకునే ముందు చేసిన తప్పుల్ని సరిదిద్దుకునేందుకు తగింనంత సమయం ఇస్తాం. కొన్నిసార్లు ఇది తగినంత సమయం కంటే ఎక్కువగా ఉంటుంది. సంస్థల పట్ల మేం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తాం. ఆర్‌బీఐ ఆదేశాల్ని తూచా తప్పకుండా పాటిస్తే.. మాకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది?’ అని శక్తికాంత దాస్ ప్రశ్నించారు.
ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే
కాగా, సంస్థపై ఆంక్షలు విధించడంతో తలెత్తిన అనిశ్చితి నుంచి బయటపడేందుకు పేటీఎం ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ ఆర్‌బీఐతో సంప్రదింపులు జరిపారు. ఈ భేటీ తర్వాత ఆర్‌బీఐ తన నిర్ణయంపై సమీక్షించవచ్చని ఊహాగానాలు వెలుగులోకి వచ్చాయి. కానీ అనూహ్యంగా శక్తికాంత దాస్ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉందనేలా మాట్లాడడం ఫిన్ టెక్ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment