Central banks
-
2024 గ్లోబల్ బ్యాంకింగ్‌పై నెగటివ్ అవుట్‌లుక్: మూడీస్
న్యూఢిల్లీ: కేంద్ర బ్యాంకుల కఠిన ద్రవ్య విధానాల వల్ల పలు దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి తగ్గే అవకాశం ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ పేర్కొంది. దీనివల్ల 2024కి సంబంధించి ప్రపంచ బ్యాంకుల అవుట్‌లుక్ ప్రతికూలంగా (నెగటివ్) ఉందని పేర్కొంది. మొండి బకాయిలకు కేటాయింపు (ప్రొవిజనింగ్స్) వ్యయాలు తగ్గే అవకాశాలు, దేశ చక్కటి వృద్ధి రేటు వల్ల భారత్ బ్యాంకుల లాభదాయకత పెరుగుతుందని మూడీస్ అంచనావేయడం గమనార్హం. అధిక నిధుల సమీకరణ వ్యయాలు, రుణ వృద్ధి తక్కువగా ఉండడం వంటి సమస్యలు ఉన్నప్పటికీ భారత్ బ్యాంకింగ్ సవాళ్లను తట్టుకుని నిలబడుతుందన్న అభిప్రాయాన్ని నివేదిక వ్యక్తం చేసింది. ‘‘లిక్విడిటీ తగ్గడం (ద్రవ్య లభ్యత), రుణ చెల్లింపుల నాణ్యత పడిపోవడం వల్ల ప్రపంచంలోని పలు దేశాల బ్యాంకుల అసెట్ నాణ్యత దెబ్బతింటుంది’’ అని మూడీస్ తన గ్లోబల్ బ్యాంకింగ్ అవుట్‌లుక్ నివేదికలో పేర్కొంది. కఠినమైన ద్రవ్య విధానాల వల్ల బ్యాంకింగ్ నిర్వహణా పరిస్థితులు క్షీణిస్తాయని అభిప్రాయపడింది. ప్రధాన కేంద్ర బ్యాంకులు రేట్లు తగ్గించడం ప్రారంభించినప్పటికీ, కఠిన ద్రవ్య పరిస్థితులే 2024లో కొనసాగుతాయని, ఇది ఆయా దేశాల స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిపై ప్రభావం చూపుతుందని మూడీస్ పేర్కొంది. ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పర్యావరణ సవాళ్లు ఆందోళనకు గురిచేస్తాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ప్రైవేట్ వ్యయాలు తగ్గడం, బలహీన ఎగుమతులు, ప్రాపర్టీ మార్కెట్ దిద్దుబాటు కారణంగా చైనా ఆర్థిక వృద్ధి మందగిస్తుందని అభిప్రాయపడింది. దీనివల్ల పలు చైనా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం పడే వీలుందని అంచనావేసింది. -
ఆర్బీఐ ఉత్కర్ష్ 2.0 ఆవిష్కరణ
న్యూఢిల్లీ: 2023–25 సంవత్సరాలకు గాను పాటించే మధ్యకాలిక వ్యూహ ప్రణాళిక ’ఉత్కర్ష్ 2.0’ను రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఆవిష్కరించారు. నిర్దిష్ట మైలురాళ్లను సాధించేందుకు, విధుల నిర్వహణలో ఆర్బీఐ అత్యుత్తమ పనితీరు కనపర్చేందుకు పాటించాల్సిన విధానాలకు ఇది మార్గదర్శిగా ఉండనుంది. ఇందులో డేటా విశ్లేషణకు సంబంధించి కృత్రిమ మేధ(ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్)ను మరింత విస్తృతంగా వినియోగించనున్నారు. 2023–2025 మధ్య కాలంలో ఆర్బీఐ ప్రాధాన్యమివ్వాల్సిన అంశాలు, చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సిన ఫలితాలు మొదలైనవి ఉత్కర్ష్ 2.0లో ఉంటాయి. 2019–2022 మధ్య కాలంలో తొలి ఉత్కర్ష్ ను అమలు చేశారు. అంతర్జాతీయంగా, దేశీయంగా పెను సవాళ్లు నెలకొన్న తరుణంలో భారత్ జీ–20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదే ఉత్కర్ష్ 2.0 కూడా ప్రారంభమవుతోందని ఆర్బీఐ పేర్కొంది. డేటా సేకరణ, సమాచార వెల్లడిలో రిజర్వ్ బ్యాంక్ రెండు రకాల పాత్రలు పోషించాల్సి ఉంటుందని తెలిపింది. దీంతో అర్థవంతమైన, సరైన సమాచారాన్ని ఇచ్చేందుకు తాను సేకరించే డేటా కచ్చితమైనదిగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్బీఐపై ఉంటుందని వివరించింది. డేటాకు ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో విశ్లేషణ మొదలైన అవసరాల కోసం ఏఐ, ఎంఎల్ ఆధారిత సాధనాలను ఉత్కర్ష్ 2.0లో విస్తృతంగా వినియోగించనున్నట్లు పేర్కొంది. -
రూపాయిల్లో వాణిజ్యంపై భారత్, యూఏఈ చర్చలు
న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్యాన్ని తమ తమ కరెన్సీల్లోనే నిర్వహించుకునే అంశంపై భారత్, యూఏఈ కసరత్తు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రూపాయి, దిర్హామ్‌లలో వాణిజ్య నిర్వహణకు సంబంధించిన నమూనా పత్రంపై ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకులు చర్చలు జరుపుతున్నట్లు యూఏఈలో భారత రాయబారి సంజయ్ సుధీర్ తెలిపారు. లావాదేవీల ఖర్చులను తగ్గించుకోవడమనేది ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యమని వివరించారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలను పటిష్టం చేసుకునేందుకు రెండు దేశాలు ఫిబ్రవరిలోనే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్‌టీఏ) కుదుర్చుకున్నాయి. ప్రస్తుతం 60 బిలియన్ డాలర్లుగా ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం.. ఈ ఒప్పందం ఊతంతో వచ్చే అయిదేళ్లలో 100 బిలియన్ డాలర్లకు చేరగలదని అంచనా వేస్తున్నారు. -
జీ 20 భేటీ...
వాషింగ్టన్లో జరిగిన జీ 20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల 4వ సదస్సులో ప్రసంగిస్తున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్‌దాస్‌ను చిత్రంలో తిలకించవచ్చు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను ప్రపంచ దేశాలు ఐక్యంగా ఎదుర్కొనాలని ఆమె ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో భారత్ ఈ సంవత్సరం చివర్లో జీ–20 దేశాల అధ్యక్ష బాధ్యతలను ఇండోనేషియా నుంచి స్వీకరించనుంది. డిసెంబర్ 1 నుంచి 2023 నవంబర్ 30 వరకూ నిర్వహించే ఈ బాధ్యతల సమయంలో భారత్ ప్రధానంగా అభివృద్ధి చెందిన దేశాల సవాళ్ల పరిష్కారంపై దృష్టి పెట్టనుంది. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి జీ–20 ఆర్థికమంత్రులు, సెంట్రల్ బ్యాంక్‌లతో జరిపిన సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచబ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశాల్లో పాల్గొనడానికి వాషింగ్టన్ వచ్చిన నిర్మలా సీతారామన్, పలు దేశా ల ఆర్థికమంత్రులు, సంస్థల చీఫ్‌లతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
ద్రవ్యోల్బణంపై పోరు తప్పదు!
వాషింగ్టన్: ద్రవ్యోల్బణం పూర్తిగా అదుపు తప్పుతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టలిన్ జార్జివా హెచ్చరించారు. అసాధారణమైన ఆర్థిక సంక్షోభ సమయంలో మరింత బాధను కలిగించే అవకాశం ఉన్నప్పటికీ, అంతర్జాతీయంగా విధాన నిర్ణేతలు ద్రవ్యోల్బణంపై పోరు సల్పాలని ఆమె పిలుపునిచ్చారు. ఇప్పటికే పలు దేశాల సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలను తీసుకుంటున్న నేపథ్యంలో ఐఎంఎఫ్ చీఫ్ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ వార్షిక సమావేశం నేపథ్యంలో ఆమె ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ఇంకా ఆమె ఏమన్నారంటే... ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఒకదాని తర్వాత మరొ కటి షాక్‌లు తగులుతున్నాయి. కరోనా వైరస్ మహమ్మారి, ఉక్రెయిన్‌పై రష్యా దాడి, ఇప్పుడు ద్రవ్యోల్బణం తీవ్రత అన్నీ సమస్యాత్మకమే. ► ఇప్పుడు ద్రవ్యోల్బణాన్ని ఎలా ఎదుర్కొనాలన్నదే ప్రధాన అంశం. మనం ధర స్థిరత్వాన్ని పునరుద్ధరించలేకపోతే, వృద్ధి అవకాశాలకూ విఘాతం కలుగుతుంది. ప్రత్యేకించి పేద ప్రజల జీవనం మరింత సంక్షోభంలోకి వెళుతుంది. ► మహమ్మారితో పోరాడిన నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు రుణ సమస్యల్లో ఉన్నాయి. ఆహార కొరత లేకుండా చేయడం, ఇంధన వ్యయాల కట్టడి, పేద వారికి సహాయం చేయడంపై తక్షణం దేశాలు దృష్టి పెట్టాలి. విస్తృత వ్యయ కార్యక్రమాలపై ఇప్పుడు ప్రణాళికలు సరికాదు. విధాన చర్యలు పటిష్టం లక్ష్యంతో సాగాలి. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పోటీ రాజకీయ కూటములతో ‘విచ్ఛిన్నం’ చేయడం వల్ల ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవడంలో మరింత జాప్యం జరుగుతుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల సరఫరాల చెయిన్ పూర్తిగా దెబ్బతింటుంది. రేటు పెంపు వల్ల అనుకున్న లక్ష్యాలను సకాలంలో సాధించలేం. ► ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఐక్యతా ప్రయోజనాలను మనం కోల్పోతే, మనమందరం పేదలుగా ఉండే అవకాశం ఉంది. -
గ్లోబల్ ట్రెండ్, ఆర్బీఐ సమీక్షపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పాలసీ సమీక్షను చేపట్టనుంది. బుధవారం(28) నుంచి మూడు రోజులపాటు సమావేశంకానున్న పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) శుక్రవారం(30న) నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్బీఐ అధ్యక్షతన ఎంపీసీ ధరల అదుపునకే ప్రాధాన్యతనిస్తూ గత మూడు సమీక్షల్లో వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 1.4 శాతం హెచ్చించింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. ఈసారి సమీక్షలోనూ మరోసారి 0.5 శాతం రేటును పెంచే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వెరసి రెపో రేటు మూడేళ్ల గరిష్టం 5.9 శాతానికి ఎగసే వీలుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్బీఐ పరపతి నిర్ణయాలపై కన్నేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డాలరు జోరు యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా పలు కేంద్ర బ్యాంకులు గత వారం వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణ కట్టడికే కట్టుబడనున్నట్లు ప్రకటించిన ఫెడ్ ఫండ్స్ రేట్లను ఈ ఏడాది మరింత పెంచే వీలున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ ప్రభావం ఆర్బీఐపైనా పడనున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కాగా.. ఫెడ్ అండతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్టం 111కు చేరింది. ట్రెజరీ ఈల్డ్స్ సైతం 3.5 శాతాన్ని దాటాయి. దీంతో దేశీ కరెన్సీ ఏకంగా కొత్త చరిత్రాత్మక కనిష్టం 81కు పడిపోయింది. వడ్డీ రేట్లు, రూపాయి మారకం వంటి అంశాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కొత్త సిరీస్ షురూ సెప్టెంబర్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు గురువారం(29) ముగియనుంది. వారాంతం నుంచీ అక్టోబర్ సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో ట్రేడర్లు పొజిషన్లను కొత్త సిరీస్‌కు రోలోవర్ చేసుకునే అవకాశముంది. ఇది మార్కెట్లలో ఆటుపోట్లకు దారితీయవచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్త వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న అంచనాలు కొద్ది రోజులుగా గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీస్తున్న విషయం విదితమే. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లను ఈ అంశాలు ప్రభావితం చేసే అవకాశముంది. పలు అంశాలు.. ఆర్బీఐ, ఎఫ్‌అండ్‌వో ముగింపు, గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్‌తోపాటు.. ఈ వారం ఇన్వెస్టర్లు మరిన్ని అంశాలపై దృష్టి సారించనున్నారు. యూఎస్ ఆర్థిక వృద్ధి(జీడీపీ) గణాంకాలు, ముడిచమురు ధరలపై రష్యా యుద్ధ భయాల ప్రభావం, ఎఫ్‌పీఐల పెట్టుబడులు, రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు తదితరాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు నిపుణులు వివరించారు. ఎఫ్‌పీఐలు ఓకే పలు ఆటుపోట్ల మధ్య ఈ నెల(సెప్టెంబర్)లోనూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లపట్ల ఆసక్తి చూపుతున్నారు. 1–23 మధ్య మూడు వారాల్లో రూ. 8,638 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. గత నెల(ఆగస్ట్)లో ఏకంగా రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఇటీవల కాస్త వెనకడుగు వేస్తున్నారు. గత వారం చివరి రెండు రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 2,500 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం! డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో ఇకపై పెట్టుబడులు మందగించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. అయితే 9 నెలల వరుస అమ్మకాల తదుపరి జులైలో తిరిగి ఎఫ్‌పీఐలు నికర ఇన్వెస్టర్లుగా నిలుస్తూ రూ. 5,000 కోట్ల విలువైన ఈక్విటీలను సొంతం చేసుకున్నారు! కాగా.. గతేడాది అక్టోబర్ మొదలు ఈ ఏడాది జూన్ వరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్య ఆందోళనలు, డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం వంటి అంశాలు ఎఫ్‌పీఐలను వెనక్కి లాగుతున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ నిపుణులు శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు. -
రేట్ల పెంపు ఎకానమీలకు ప్రతికూలమే!
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)సహా ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన కేంద్ర బ్యాంకులు పాలసీ రేట్లను కఠినతరం చేయడం వల్ల వచ్చే 6–8 నెలల్లో డిమాండ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, రికవరీ ప్రక్రియ మందగించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐసహా (4 నుంచి 4.4 శాతానికి) అమెరికా సెంట్రల్ బ్యాంక్ (అరశాతం పెంపుతో ఒక శాతానికి), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ (పావు శాతం పెంపుతో 13 ఏళ్ల గరిష్ట స్థాయి ఒక శాతానికి)సహా పలు కేంద్ర బ్యాంకులు ‘రష్యా–ఉక్రెయిన్ వివాదంతో తీవ్రమవుతున్న ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు’ తమ బెంచ్‌మార్క్ రుణ రేట్లను పెంచాయి. 77వ రోజులోకి ప్రవేశించిన రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచ సరఫరా చైన్‌కు అంతరాయం కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఇంధనం, ఆహారధాన్యాల ధరలు మరింతగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎకనమిస్టులు, నిపుణుల అభిప్రాయాలు ఎలా ఉన్నాయంటే... - వివిధ కేంద్ర బ్యాంకుల నిర్ణయాలు డిమాండ్‌పై ప్రభావం చూపుతాయి. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఇంకా మహమ్మారి ముందు స్థాయికి చేరుకోని ప్రపంచంలోని పలు ఎకానమీలకు తాజా పరిస్థితులు మరింత తీవ్ర ప్రతికూలతలను సృష్టిస్తాయి. - గతంలో సరఫరా చైన్ వల్ల మాత్రమే పెరిగే ద్రవ్యోల్బణం సవాళ్లు ప్రస్తుతం యుద్ధం వల్ల మరింత తీవ్రతరమవుతున్నాయి. - ద్రవ్యోల్బణం సవాళ్ల కట్టడికి అన్ని ప్రధాన కేంద్ర బ్యాంకులు ఇప్పుడు వడ్డీరేట్ల పెంపు చర్యలు తీసుకోవాల్సి వస్తోంది. రాబోయే 6–8 నెలల పాటు ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా చర్యలు ఉంటాయి. ఇవి వ్యవస్థలో డిమాండ్‌ను తగ్గిస్తాయి. భవిష్యత్తులోనూ రేట్ల పెంపు తప్పదని సెంట్రల్ బ్యాంకులు సంకేతాలు ఇస్తుండడం గమనార్హం. రూపాయిలో ఆర్బీఐ జోక్యం ఇబ్బందే! ఆర్బీఐ వర్గాల కథనం ప్రకారం, రూపాయి అస్థిరతను అరికట్టడానికి గత కొన్ని రోజులుగా ఫారెక్స్ మార్కెట్లో కూడా ఆర్బీఐ జోక్యం చేసుకుంటోంది. ఈ వారం ప్రారంభంలో అమెరికా డాలర్‌తో రూపాయి తన జీవితకాల కనిష్ట స్థాయి 77.44కి పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే రూపాయిని ఒక స్థాయి వరకూ ఆర్బీఐ పడిపోకుండా చూడగలదుకానీ, భారీ పతనాలను నివారించలేదన్నది నిపుణుల వాదన. అలాంటి చర్యలకు ఆర్బీఐ దిగితే, భారత్ విదేశీ మారకద్రవ్యం నిల్వలు తరిగిపోయి, రూపాయి మారకంలో డాలర్ పటిష్టత మరింత ఊపందుకుంటుంది. 2021 సెప్టెంబర్‌లో జీవితకాల గరిష్ట స్థాయి 642.54 బిలియన్ డాలర్ల స్థాయికి చేరిన భారత్ విదేశీ మారకద్రవ్య నిల్వలు ప్రస్తుతం 600 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దాదాపు 12 నెలల దిగుమతులకు ఇవి సరిపోతాయి. అధిక ద్రవ్యోల్బణం కట్టడికే ప్రాధాన్యత: ఆర్థికశాఖ ఇదిలావుండగా, ఆర్థిక మంత్రిత్వశాఖ నెలవారీ ఆర్థిక సమీక్షను విడుదల చేస్తూ, దీర్ఘకాలికంగా ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉండకుండా కట్టడి చేసేందుకే ప్రభుత్వం, ఆర్బీఐ తగిన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొంది. ఆర్బీఐ ఇటీవలి రేట్ల పెంపు ఈ దిశలో తీసుకున్న చర్యేనని పేర్కొంది. ద్రవ్యోల్బణమే ప్రధాన సమస్యగా వివరించింది. డబ్ల్యూటీవో కృషి చేయాలి అంతర్జాతీయ ద్రవ్యోల్బణం కట్టడికి ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) పాటు పడాలని భారత్ డిమాండ్ చేసింది. అధిక ద్రవ్యోల్బణం సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిస్తున్నట్టు గుర్తు చేసింది. డబ్ల్యూటీవోలో భారత శాశ్వత రాయబారి బ్రజేంద్ర నవనీత్ ఈ మేరకు ప్రకటన చేశారు. కరోనా విపత్తు తర్వాత, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకోవడం, స్థిరమైన ఆర్థిక వృద్ధి సాధనను అత్యంత ప్రాధాన్య అంశాలుగా తీసుకోవాలని డబ్ల్యూటీవోను భారత్ కోరుతున్నట్లు తెలిపారు. చదవండి: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. -
సెన్సెక్స్.. రోలర్ కోస్టర్; +416 నుంచి –545కు..
ముంబై: కీలక ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకటనకు ముందు స్టాక్ మార్కెట్లో అప్రమత్తత చోటు చేసుకుంది. అమెరికాతో సహా ఇదే వారంలో పలుదేశాల కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ సమీక్ష సమావేశాల నేప థ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడుల ఉపసంహరణకు మొగ్గుచూపారు. అలాగే ఒమిక్రాన్ భయాలు, విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఈ పరిణామాలతో మార్కెట్ సోమవారం భారీ పతనాన్ని చవిచూసింది. సెన్సెక్స్ 503 పాయింట్లు నష్టపోయి 58,283 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 143 పాయింట్లు కోల్పోయి 17,368 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. ఒక ఐటీ మినహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తి డిని ఎదుర్కొన్నాయి. బ్యాంకింగ్, ఆర్థిక షేర్లలో అధిక విక్రయాలు జరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2743 కోట్ల షేర్లను అమ్మేశారు. దేశీయ ఇన్వెస్టర్లు రూ.1351 కోట్ల షేర్లను కొన్నారు. ప్రపంచ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. గరిష్టం నుంచి 960 పాయింట్ల పతనం సెన్సెక్స్ ఉదయం 317 పాయింట్ల లాభంతో 59,104 వద్ద, నిఫ్టీ 108 పాయింట్లు పెరిగి 17,619 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి గంటలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్ 416 పాయింట్లు పెరిగి 59,203 వద్ద, నిఫ్టీ 155 పాయింట్లు ర్యాలీ చేసి 17,511 వద్ద ఇంట్రాడే గరిష్టాలను అందుకున్నాయి. అయితే జాతీయ, అంతర్జాతీయ ప్రతికూలతలతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. మిడ్‌సెషన్‌లోనూ యూరప్ మార్కెట్ల బలహీన ప్రారంభం ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో సెన్సెక్స్ గత ముగింçపుతో పోలిస్తే 545 పాయింట్లు కోల్పోయింది. వెరసి ఇంట్రాడే గరిష్టం(59,203) నుంచి 960 పాయింట్లు పతనమై 58,243కు చేరింది. అమ్మకాలు ఎందుకంటే...? ► అమెరికా ఫెడ్ రిజర్వ్‌తో పాటు ఈ వారంలో యూరోపియన్ యూనియన్ బ్యాంక్(ఈసీబీ), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్‌లు పరపతి సమీక్ష గణాంకాలు వెల్లడి కానున్నాయి. వడ్డీరేట్లు, బాండ్ల క్రయ, విక్రయాలు, ద్రవ్యవిధానంపై ఆయా దేశాల కేంద్ర బ్యాంకులు తమ వైఖరిని ప్రకటించనున్నాయి. ఇప్పటికే యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు భయాలు తెరపైకి వచ్చాయి. ► ఒమిక్రాన్ వేరియంట్ కట్టడికి కర్ఫ్యూలు, సరిహద్దుల మూసివేతతో సప్లై చైన్ దెబ్బతింది. ఫలితంగా అమెరికా నవంబర్ ద్రవ్యోల్బణం 39 ఏళ్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. దేశీయంగానూ ఇవే కారణాలతో ద్రవ్యోల్బణం పెరగవచ్చనే ఆందోళనలతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహిస్తూ అమ్మకాలకు పాల్పడ్డారు. ద్రవ్యోల్బణ కట్టడికి కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపునకు మొగ్గుచూపాయనే సంగతి తెలిసిందే. ► బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్ మరణం నమోదైనట్లు అధికార వర్గాలు ధ్రువీకరించాయి. కేసుల సంఖ్య భారీగా నమోదవుతున్నాయి. కట్టడి చర్యలను మరింత కఠినం చేస్తే ఆర్థిక రికవరీ ఆగిపోవచ్చని ఆందోళనలు మార్కెట్ వర్గాలను కలవరపెట్టాయి. ► విదేశీ ఇన్వెస్టర్లు విక్రయాలు కొనసాగడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ఈ డిసెంబర్లో ఇప్పటి వరకు రూ.8,879 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. ఇందులో రూ.7,462 కోట్ల ఈక్విటీ మార్కెట్ నుంచి, డెట్ మార్కెట్ నుంచి రూ.1,272 కోట్లు, హైబ్రిడ్ ఫండ్స్ నుంచి రూ.145 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఐటీ, బ్యాంకింగ్ షేర్లను పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారు. రూ. లక్ష కోట్ల సంపద మాయం సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోవడంతో రూ. లక్ష కోట్ల సంపద ఆవిరైంది. ఫలితంగా బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.266 లక్షల కోట్లకు దిగివచ్చింది. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 523 పాయింట్లు, నిఫ్టీ 149 పాయింట్లను కోల్పోయాయి. మార్కెట్లో మరిన్ని సంగతులు ► పేటిఎం యాప్ ద్వారా గత రెండు నెలల్లో వర్తకులకు చేసిన మొత్తం చెల్లింపుల విలువ(జీఎంవీ) రెట్టింపు అయినప్పటికీ.., పేటీఎం షేరు 1% నష్టపోయి రూ.1555 వద్ద స్థిరపడింది. ► బోర్డు సమావేశానికి ముందుకు ఈజీమైట్రిప్ షేరు పదిశాతం ర్యాలీ చేసి రూ.1039 వద్ద ముగిసింది. ► ఎంకే బ్రోకరేజ్ సంస్థ ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించినా., స్టార్ హెల్త్ షేరు ఒకశాతం క్షీణించి రూ.897 వద్ద నిలిచింది. -
డాలర్ల రాకపై రూపాయి భరోసా
ముంబై: దేశానికి మరింత భారీగా డాలర్లు వస్తా యన్న భరోసా రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 40 పైసలు బలపడి 73.29కి చేరింది. గడచిన రెండు నెలల్లో (జూన్ 14 తర్వాత) రూపాయి ఈ స్థాయికి బలోపేతం కావడం ఇదే తొలిసారి. వడ్డీరేట్లు సమీపకాలంలో పెంచే అవకాశాలు లేవని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్ సంకేతాలు డాలర్ బలహీనతకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ 73.20 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్వల్ప నష్టాలతో 92.29 వద్ద ట్రేడవుతోంది. భారత్ ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి ముగింపు 73.69. సోమవారం 73.46 వద్ద ప్రారంభమైంది. 73.21 గరిష్ట–73.54 కనిష్ట శ్రేణిలో కదలింది. గడచిన మూడు ట్రేడింగ్ సెషన్లలో రూపాయి లాభపడుతూ వస్తోంది. డాలర్‌పై ఈ రోజుల్లో 95 పైసలు లాభపడింది. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
వీటి పనితీరు ఎలా ఉందో? తయారీ, సేవల రంగాలపై ఆర్బీఐ కన్ను!
ముంబై:తయారీ, సేవల రంగాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం రెండు కీలక సర్వేలను ఆవిష్కరించింది. క్లుప్తంగా వీటిని పరిశీలిస్తే...తయారీ రంగం పనితీరును మదింపు చేయడానికి త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) పారిశ్రామిక అవుట్‌లుక్ సర్వే (ఐఓఎస్) ప్రారంభమైంది. ►సేవలు, మౌలిక రంగాలకు సంబంధించి ప్రస్తుత త్రైమాసిక (జూలై–సెప్టెంబర్) పనితీరును తెలుసుకునేందుకు సేవలు, మౌలికరంగ అవుట్‌లుక్ సర్వే (ఎస్‌ఐఓఎస్)ను ఆర్బీఐ ప్రారంభమైంది. ► సేవలు, తయారీ, మౌలిక రంగాలు జూలై, ఆగస్టు, సెప్టెంబర్లలో ఏ విధంగా పనితీరును కనబరుస్తున్నాయి?, వ్యాపార సెంటిమెంట్ ఎలా ఉంది?, డిమాండ్, ఫైనాన్షియల్, ఉపాధి అవకాశాలు, ధరల పరిస్థితి ఏమిటి? వంటి అంశాలపై ఈ సర్వే ప్రధానంగా దృష్టి సారిస్తుంది. తద్వారా మూడవ త్రైమాసికం (అక్టోబర్–డిసెంబర్) పరిస్థితిపై ఒక అంచనాలకు వస్తుంది. ► కరోనా ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో సేవలు, తయారీ, మౌలిక రంగాలు తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్న సంగతి తెలిసిందే. ►భారత్ మొత్తం ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ)లో సేవల రంగం వాటా దాదాపు 55 శాతంకాగా, తయారీ రంగం వాటా దాదాపు 15 శాతం. చదవండి: ఈ రెండు రంగాల్లో పెట్టుబడులు పెరిగాయి, కారణం ఇదేనా -
ఇకపై వాట్సాప్ ద్వారా పెన్షన్ స్లిప్పులు: కేంద్రం
న్యూఢిల్లీ: పింఛన్‌దారులకు పెన్షన్ స్లిప్పులను వాట్సాప్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా పంపించాలని కేంద్రం బ్యాంకులకు సూచించింది. ఇందుకోసం ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ లాంటి సదుపాయాలతోపాటు సోషల్ మీడియా యాప్‌లను ఉపయోగించుకోవాలంటూ తాజాగా ఒక ఉత్తర్వు జారీ చేసింది. ప్రభుత్వ పెన్షన్, భత్యాలు, పన్ను కోతలు వంటి పూర్తి వివరాలు పెన్షన్ స్లిప్పులో ఉండాలని పేర్కొంది. ఇలాంటి వివరాలు పెన్షన్ స్లిప్పుల్లో చేర్చేందుకు బ్యాంకులు ఇటీవలే అంగీకారం తెలిపినట్లు పేర్కొంది. -
వెయ్యి టన్నులా, బంగారం కొనుగోళ్లపై సెంట్రల్ బ్యాంక్‌ల ఫోకస్
న్యూఢిల్లీ: వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు పసిడి కొనుగోలు ప్రణాళికల్లో ఉన్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ కొనుగోళ్ల వల్ల అంతర్జాతీయంగా పసిడి ధర పటిష్ట స్థాయిలో స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన ఏడాది కాలంలో బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు తిరిగి యల్లో మెటల్‌పై ఆసక్లి చూపుతున్నట్లు సమాచారం. సెర్బియా నుంచి థాయ్‌లాండ్ వరకూ సెంట్రల్ బ్యాంకులు తాజాగా తమ విదేశీ మారకపు నిధుల్లో పసిడి వాటా పెంపుపై దృష్టి పెడుతున్నాయి. పసిడికి కొనుగోలు చేయనున్నట్లు ఘనా ఇటీవల ప్రకటించింది. దీర్ఘకాలికంగా ప్రయోజనం ద్రవ్యోల్బణం ఒత్తిడులకు దీర్ఘకాలంలో పసిడి మంచి ప్రయోజనాలను అందిస్తుందని, ఆర్థిక పరమైన గట్టు స్థితి నుంచి గట్టెక్కిస్తుందని నేషనల్ బ్యాంక్ ఆఫ్ సెర్బియా ఇటీవలే ప్రకటించింది. ప్రస్తుతం తమ సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న 36.3 టన్నుల పసిడిని 50 టన్నులకు పెంచుకోనున్నట్లు కూడా సెర్బియా అధ్యక్షుడు అలెక్సాండర్ వూసిక్ పేర్కొన్నారు. క్రూడ్ ధరల పెరుగుదల వల్ల కజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ వంటి చమురు ఎగుమతిదేశాలు పసిడి కొనుగోళ్లపై దృష్టి సారిస్తున్నట్లు హెచ్ఎస్బీసీ హోల్డింగ్స్ మెటల్స్ చీఫ్ విశ్లేషకులు జేమ్స్ స్టీల్ పేర్కొన్నారు. వచ్చే ఏడాది ప్రతి ఐదు సెంట్రల్ బ్యాంకుల్లో ఒకటి పసిడి కొనుగోలు చేసే ప్రణాళికలో ఉన్నట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ ఇటీవలి నివేదిక ఒకటి పెరిగింది. ప్రపంచ రికవరీ బులిష్ పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంకులు 2021లో 500 టన్నులు, 2022లో 540 టన్నుల పసిడిని కొనుగోలు చేసే అవకాశం ఉందని ఈ రంగంలో నిపుణులు అంచనావేస్తున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు, భౌగోళిక ఉద్రిక్తతల వంటి పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంచనా. -
రాబడి మీకోసమేనా..?
అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా అన్ని రకాల పరిశ్రమలకూ ఈ సెగ గట్టిగానే తగులుతోంది. ముడి చమురు ధరలు, లోహాలు, రసాయనాలు, వంటనూనెలు ఇలా దాదాపు అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. వినియోగ డిమాండ్ పెరగడం, ఉత్పత్తి, సరఫరా తగినంత లేకపోవడం దీనికి కారణంగా పేర్కొంటున్నారు. కారణాలేవైనా కానీ మన దేశంలో ద్రవ్యోల్బణం గరిష్టాల్లోనే ఉంటోంది. కనుక ఇన్వెస్టర్లు అందరూ పెట్టుబడుల నిర్ణయాలు తీసుకునే విషయంలో ఈ అంశాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాల్సిందే. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకుంటుందన్న అంచనాలు అధిక ద్రవ్యోల్బణానికి మార్గమే అవుతుంది. గడిచిన 12 నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 6 శాతంగా ఉంది. అంటే 6 శాతం రాబడినిచ్చే సాధనంలో ఇన్వెస్ట్ చేసినా.. నికరంగా మీ చేతికి వచ్చేది సున్నాయే. 2009 నుంచి 2014 మధ్య ద్రవ్యోల్బణం సగటున 10.4 శాతంగా మన దేశంలో కొనసాగింది. అందుకే ద్రవ్యోల్బణాన్ని మించిన రాబడుల కోసం ఇన్వెస్టర్లు మెరుగైన సాధనాలకు పెట్టుబడుల్లో చోటివ్వాలి.. బాండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ ద్రవ్యోల్బణం పెరిగిపోతుంటే నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంకులు అనుసరించే మార్గం వడ్డీ రేట్లను పెంచడం. కనుక రేట్లను పెంచే క్రమంలో బాండ్లలో పెట్టుబడులు అనుకూలం కాదు. దీనివల్ల బాండ్ల ధరలు తగ్గుతాయి. కరోనా రెండు విడతల ప్రభావంతో దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు కుంటుపడ్డాయి. వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. కనుక కొంత ఆలస్యంగా వడ్డీ రేట్లను పెంచే మార్గంలోకి వెళ్లొచ్చు. కానీ, కీలక రేట్లు పెరగకపోయినా.. ద్రవ్యోల్బణం రెక్కలు తొడుగుకుంటే మార్కెట్ ఆధారిత వడ్డీ రేట్లు (పదేళ్ల జీ–సెక్‌లు) పెరిగిపోతాయి. ఇన్వెస్టర్లు 2009–2014 మధ్య భారత ప్రభుత్వ సెక్యూరిటీలను కలిగి ఉన్నట్టయితే వారికి లభించిన రాబడి రేటు వార్షికంగా 3.2 శాతమే. వాస్తవ రాబడి మైనస్ అవుతుంది. అందుకని అధిక ద్రవ్యోల్బణం కొనసాగుతుందనుకుంటే అటువంటప్పుడు దీర్ఘకాల ప్రభుత్వ సెక్యూరిటీలు, దీర్ఘకాలంతో కూడిన కార్పొరేట్ బాండ్లకు దూరంగా ఉండడమే మంచిది. బ్యాంకుల ఎఫ్డీ రేట్లు సార్వభౌమ బాండ్ల రేటు కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయి. అయినా కానీ ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనేందుకు ఇవి చాలవు. ఈ విడత కీలక రేట్ల సవరణ విషయంలో ఆర్బీఐ వేచి చూసే ధోరణితో ఉన్నందున.. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి తగ్గట్టు వడ్డీ రేట్లు కూడా సమీప కాలంలో పెరగకపోవచ్చు. ఆర్బీఐ గణాంకాలను పరిశీలిస్తే 2009–2014 మధ్య బ్యాంకు ఎఫ్డీ రేట్లు 8.6 శాతంగా ఉన్నాయి. మంచి రేటు కదా అని అనుకోవద్దు. ఎందుకంటే ఆ సమయంలో సగటు ద్రవ్యోల్బణం 10.4 శాతంగా ఉంది. నేడు బ్యాంకు ఎఫ్‌డీల రేట్లు 5–6 శాతం మధ్యే ఉన్నాయి. ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటోంది. కనుక వాస్తవంగా ఇన్వెస్టర్‌కు వచ్చే రాబడి ఏమీ ఉండదు. చిన్న మొత్తాల పొదు పథకాల్లో టైమ్ డిపాజిట్లు, కిసాన్ వికాస్పత్ర, ఎన్ఎస్సీ రేట్లు కూడా 6–7 శాతం మధ్యే ఉన్నాయి. కనుక వాస్తవంగా వచ్చే రాబడి ఒక్క శాతం కూడా మించదు. ఈక్విటీలు ద్రవ్యోల్బణ ప్రభావాన్ని ఎదుర్కొని మెరుగైన వాస్తవ రాబడులకు ఈక్విటీలు మార్గం చూపిస్తాయి. దీర్ఘకాలంలో ఈక్విటీలు బాండ్ల కంటే అధిక రాబడులనే ఇస్తున్నట్టు ఇప్పటి వరకు ఉన్న చారిత్రక గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తుంది. ఈక్విటీల్లో రిస్క్ ఉంటుంది. దీర్ఘకాలంలోనే ఈ రిస్క్‌ను అధిగమించే రాబడులకు అవకాశం ఉంటుంది. కనీసం పదేళ్లు అంతకుమించిన కాలానికి ఈక్విటీల్లో మెరుగైన రాబడులను ఆశించొచ్చు. స్వల్పకాలానికి మాత్రం స్టాక్స్‌లో రాబడులు బాండ్లను మించి, ద్రవ్యోల్బణాన్ని మించి ఉంటాయని చెప్పడానికి లేదు. ఎప్పుడూ కూడా స్టాక్స్ ధరలు ఆయా కంపెనీల వృద్ధినే ప్రతిఫలిస్తుంటాయి. పారిశ్రామిక ముడి పదార్థాలైన పెట్రోకెమికల్స్, కెమికల్స్, పారిశ్రామిక లోహాల ధరలు పెరుగుతుంటే అవి కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకంటే పెరుగుతున్న ధరలను కంపెనీలు పూర్తి స్థాయిలో వినియోగదారులకు బదిలీ చేయలేని పరిస్థితిని ఎదుర్కొం టాయి. కరోనా రెండో విడత నేపథ్యంలో డిమాండ్ పరిస్థితులు బలహీనంగానే ఉన్నాయి. పెరిగిపోయిన ముడి సరుకుల ధరల వల్ల కంపెనీల లాభాలపై ప్రభావం పడనుంది. కానీ, ఇదే సమయంలో కమోడిటీలను ఉత్పత్తి చేసే కంపెనీలు పెరుగుతున్న ధరల సైకిల్‌తో మంచి లాభాలను నమోదు చేసుకుంటాయి. ఇలా అధిక ద్రవ్యోల్బణ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు కమోడిటీలను వినియోగించేవి కాకుండా.. వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలను ఎంపిక చేసుకోవడం వల్ల అధిక లాభాలను ఆర్జించేందుకు వీలుంటుంది. బంగారం ద్రవ్యోల్బణానికి రక్షణ సాధనంగా బంగారాన్ని పరిగణిస్తుంటారు. కానీ, మన దగ్గర ద్రవ్యోల్బణానికి హెడ్జ్ సాధనంగా బంగారానికి అంత ప్రాధాన్యం లేదు. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ద్రవ్యోల్బణానికి రెక్కలు వచ్చిన తరుణంలో బంగారం ప్రాధాన్య సాధనంగా ఉంటోంది. భారత ఇన్వెస్టర్లకు.. అంతర్జాతీయ సంక్షోభ సమయాలు లేదా కమోడిటీల ధరల పెరుగుదల సమయంలోనే రూపాయి క్షీణత కూడా చోటు చేసుకుంటోంది. 2009–2014 కాలంలో అధిక ద్రవ్యోల్బణం సమయంలో మన దేశ ఇన్వెస్టర్లకు బంగారం మంచి రాబడులను కురిపించింది. వార్షికంగా 13.2 శాతం చొప్పున బంగారం ఈటీఎఫ్‌లు రాబడులను ఇచ్చాయి. ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుందనుకుంటే ఆ సమయంలో బంగారానికి కొంత కేటాయింపులు సహేతుకమే అవుతాయి. వివేకంతో వ్యవహరించాలి ఇటీవలే మోతీలాల్ ఓస్వాల్ సంస్థ విడుదల చేసిన నివేదికను పరిశీలించినట్టయితే.. నిఫ్టీ ఇండెక్స్‌లోని 11 కంపెనీలు పెరుగుతున్న కమోడిటీల ధరల నుంచి లబ్ధి పొందుతాయని అర్థమవుతోంది. 13 కంపెనీలపై చాలా ప్రతికూల ప్రభావం పడనుంది. మిగిలిన కంపెనీలపై ప్రభావం తటస్థంగానే ఉంటుందని తెలుస్తోంది. అధిక కమోడిటీల ధరలు ఎక్కువ కాలం పాటు కొనసాగే అవకాశాలే ఉంటే.. ఇన్వెస్టర్లు ఆటోమొబైల్, ఎఫ్ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలకు దూరంగా ఉండడమే మంచిదవుతుంది. దిగ్గజ కంపెనీలతో పోలిస్తే.. మధ్య తరహా, చిన్న కంపెనీలకు ఉత్పత్తుల ధరలను నిర్ణయించే శక్తి తక్కువగానే ఉంటుంది. కనుక పెరుగుతున్న తయారీ వ్యయాల ప్రభావం వాటిపైనే ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ సమయంలో పెద్ద కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం సురక్షితం. నిఫ్టీ లాభాల్లో కమోడిటీ కంపెనీల వాటా 36 శాతంగా ఉంది. ద్రవ్యోల్బణం చాలా ఎక్కువగా ఉన్న 2009–14 కాలంలో నిఫ్టీ–50 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్, నిఫ్టీ 500 టోటల్ రిటర్న్స్ ఇండెక్స్ వార్షికంగా 17 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఆ కాలంలో ఉన్న సగటు ద్రవ్యోల్బణం 10.4 శాతం కంటే ఈక్విటీలు మెరుగైన రాబడులను ఇచ్చినట్టు అర్థమవుతోంది. కాకపోతే నాటికి, నేటికీ మధ్య స్టాక్స్ వ్యాల్యూషన్లలో వ్యత్యాసం ఉంది. బేర్ మార్కెట్ తర్వాత 2009లో స్టాక్స్ వ్యాల్యూషన్లు చౌకగా ఉన్నాయి. నిఫ్టీ 50పీఈ 2009 జనవరిలో 13.3 పీఈ వద్ద ఉంది. కానీ నేడు నిఫ్టీ 50 పీఈ 29వద్ద ఉంది. కనుక ఈ దశలో పెట్టుబడులకు ఎంపిక చేసుకునే కంపెనీల విషయంలో వివేకంతో వ్యవహరించాలి. ధరలను శాసించగల కంపెనీలను, పెరుగుతున్న కమోడిటీల ధరల నుంచి లబ్ధి పొందే వాటిని ఎంపిక చేసుకోవాలి. ఈక్విటీలు ఏ ఇతర సాధనంతో పోల్చినా దీర్ఘకాలంలోనే మెరుగైన రాబడులను ఇచ్చాయి. స్వల్ప కాలంలో ద్రవ్యోల్బణాన్ని మించి మెరుగైన రాబడులేవనే చెప్పాలి. -
పసిడిపై ఆర్బీఐ గురి
న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధ భయాలు, రాజకీయంగా అనిశ్చితి మొదలైన పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి. దేశీయంగా రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కూడా అదే బాటలో పసిడి కొనుగోళ్లు జరుపుతోంది. జనవరిలో 6.5 టన్నుల మేర పసిడి కొనుగోలు చేసింది. దీంతో ఆర్బీఐ వద్ద పసిడి నిల్వలు 607 టన్నులకు చేరాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) గణాంకాల ప్రకారం భారత విదేశీ మారక నిల్వల్లో (ఫారెక్స్) పసిడి వాటా క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2018లో 6.2 శాతంగా ఉన్న పరిమాణం జనవరిలో మరికాస్త పెరిగి 6.4 శాతానికి చేరింది. డబ్ల్యూజీసీ గణాంకాల ప్రకారం ఫారెక్స్ నిల్వల్లో పసిడి వాటా అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ప్రస్తుతం 11వ స్థానంలో ఉంది. 612.5 టన్నులతో నెదర్లాండ్స్ 10వ స్థానంలో ఉంది. రెండు దేశాల నిల్వల మధ్య వ్యత్యాసం కేవలం 5.5 టన్నులు మాత్రమే ఉండటంతో.. త్వరలోనే భారత్ 10వ స్థానానికి చేరొచ్చన్న డబ్ల్యూజీసీ భావిస్తోంది. నెదర్లాండ్స్ సెంట్రల్ బ్యాంక్ పసిడి నిల్వల్లో గత దశాబ్దకాలంగా పెద్దగా మార్పులేమీ చోటు చేసుకోలేదు. అంతక్రితం దాకా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్‌తో ఒప్పందాల కారణంగా నెదర్లాండ్స్ పసిడి విక్రయిస్తూ నిల్వలను తగ్గించుకుంటూ వచ్చింది. తాజా నిల్వల గణాంకాల ప్రకారం భారత్ త్వరలోనే నెదర్లాండ్స్ స్థానాన్ని ఆక్రమించే అవకాశముందని అంచనాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అదే ధోరణి.. వాస్తవానికి మిగతా ప్రపంచ దేశాల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. డాలర్ బలపడుతున్న నేపథ్యంలో సెంట్రల్ బ్యాంకులు తమ రిజర్వ్‌లలో ఇతరత్రా సాధనాల వాటాను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నాయి. డాలర్‌కు ప్రత్యామ్నాయంగా మిగతా అన్నింటికన్నా బంగారమే పటిష్టమైన హెడ్జింగ్ సాధనంగా ఉంటుందని భావిస్తున్నాయి. అందుకే పసిడి నిల్వలను పెంచుకుంటున్నాయి. రికార్డు స్థాయిలో కొనుగోళ్లు.. జనవరిలో స్థూలంగా 13 టన్నుల పసిడిని విక్రయించిన సెంట్రల్ బ్యాంకులు .. 48 టన్నుల మేర కొనుగోళ్లు జరిపాయి. దీంతో నికర కొనుగోళ్లు 35 టన్నులుగా నమోదయ్యాయి. ఇందులో సింహభాగం కొనుగోళ్లు తొమ్మిది సెంట్రల్ బ్యాంకులే జరిపాయి. 2002 తర్వాత జనవరి నెలలో సెంట్రల్ బ్యాంకులు ఈ స్థాయిలో పసిడి కొనుగోలు చేయడం ఇదే ప్రథమమని డబ్ల్యూజీసీ డైరెక్టర్ (మార్కెట్ ఇంటెలిజెన్స్) అలిస్టెయిర్ హెవిట్ తెలిపారు. ఎక్కువగా వర్ధమాన దేశాల సెంట్రల్ బ్యాంకులు ఈ కొనుగోళ్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, ఆర్థిక అనిశ్చితి తదితర అంశాల నేపథ్యంలో అవి హెడ్జింగ్ కోసం బంగారంపై దృష్టి పెడుతున్నాయని వివరించారు. 2018లో ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు ఏకంగా 600 టన్నుల పసిడి కొనుగోలు చేశాయి. ఇది ఆయిదు దశాబ్దాల గరిష్టం కావడం గమనార్హం. వర్ధమాన దేశాల సెంట్రల్ మార్కెట్లే ఈ విషయంలో ముందంజలో ఉన్నాయి. -
కార్పొరేషన్ బ్యాంకు ఎండీగా పీవీ భారతి
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని కార్పొరేషన్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్, సీఈవోగా పి.వి.భారతి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. భారతి ప్రస్తుతం కెనరాబ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. వచ్చే ఫిబ్రవరి 1, ఆ తర్వాత ఆమె నూతన బాధ్యతలు స్వీకరిస్తారని, 2020 మార్చి 31 వరకు కార్పొరేషన్ బ్యాంకు ఎండీ, సీఈవో బాధ్యతల్లో ఉంటారని కేంద్రం ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక, కార్పొరేషన్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బిరూపాక్ష మిశ్రా, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాలకృష్ణ ఆల్సేను నియమిస్తున్నట్టు సిబ్బంది వ్యవహారాల శాఖ మరో ఉత్తర్వులో పేర్కొంది. ప్రస్తుతం మిశ్రా సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండి యా జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. బాలకృష్ణ కార్పొరేషన్ బ్యాంకు జనరల్ మేనేజర్‌గా ఉన్నారు. ఇక కార్పొరేషన్ బ్యాంకు మరో జన రల్ మేనేజర్ కె.రామచంద్రన్‌ను అలహాబాద్ బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించింది. -
భారీగా బ్లాస్ట్ అయిన బిట్‌కాయిన్
బిట్‌కాయిన్ భారీగా బ్లాస్ట్ అయింది. నేడు ఏకంగా 20 శాతం మేర కిందకి పడిపోయింది. మూడు నెలల కాలంలో తొలిసారి 6,200 డాలర్ల మార్కు కిందకి వచ్చి చేరింది. ఇటీవల కాలంలో ప్రపంచంలో ప్రధాన మార్కెట్లలో క్రిప్టోకరెన్సీకి ఎదురుదెబ్బలు తగులుతుండటంతో దీని విలువ భారీగా కుదేలవుతోంది. నవంబర్ మధ్య నుంచి తొలిసారి ఈ వర్చ్యువల్ కరెన్సీ 6,190 డాలర్లకు పడిపోయిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్టు చేసింది. క్రిప్టోమార్కెట్‌కు పలు దేశాల నుంచి కఠినతరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి. చైనా, రష్యా, దక్షిణ కొరియా లాంటి అతిపెద్ద మార్కెట్ల ప్రభుత్వాలు దీనిపై నిషేధం విధిస్తున్నాయి. పేమెంట్ సిస్టమ్‌లో క్రిప్టోకరెన్సీలను వాడకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భారత్ కూడా ప్రకటించింది. హ్యాకర్లు 530 మిలియన్ డాలర్లు వర్చ్యువల్ కరెన్సీని దొంగలించడంతో, ఆ కరెన్సీ ఎక్స్చేంజ్పై జపాన్ అథారిటీలు రైడ్ కూడా చేశారు. రుణ భయాలతో పలు కమర్షియల్ లెండర్లు క్రెటిట్ కార్డుల ద్వారా బిట్కాయిన్లను కొనుగోలు చేయడాన్ని కస్టమర్లకు నిరాకరించాయి. యూరప్, జపాన్, అమెరికా సెంట్రల్ బ్యాంకులు కూడా బిట్కాయిన్లపై ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. దీంతో బిట్‌కాయిన్ భారీగా కిందకి పడిపోతుంది. అటు ఈక్విటీ మార్కెట్లు కూడా నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. -
ఉమ్మడి ఆర్థిక విధానాలే బ్రెగ్జిట్‌కు సమాధానం
ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పిలుపు షాంఘై : యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోయిన (బ్రెగ్జిట్) ప్రభావంతో ఎదురవుతున్న సవాళ్లను, అనిశ్చితిని ఎదుర్కొనడానికి ప్రధాన ఆర్థిక దేశాల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు కలిసి పనిచేయాలని ఆర్థికమంత్రి జైట్లీ సూచించారు. తదనుగుణంగా తగిన ఉమ్మడి ద్రవ్య, పరపతి విధానాలను అనుసరించాలని ప్రధాన ఆర్థిక వ్యవస్థల ప్రభుత్వాలు, సెంట్రల్ బ్యాంకులు, ఇతర రెగ్యులేటర్లను అభ్యర్థించారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మొదటి సమావేశాన్ని ఉద్దేశించి జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో జైట్లీ సమావేశాలకు హాజరుకాలేకపోవటంతో దాన్ని సమావేశంలో ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్ చదివి వినిపించారు. -
సెంట్రల్ బ్యాంకుల నుంచి ఎక్కువ ఆశించొద్దు: రాజన్
బాసెల్ (స్విట్జర్లాండ్): సెంట్రల్ బ్యాంకుల నుంచి మరీ ఎక్కువగా ఆశించడం సరికాదని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. సెంట్రల్ బ్యాంకులు సైతం తమ అమ్ములపొదిలో ఇంకా ఆయుధాలున్నాయంటూ పేర్కొనడాన్ని ఆయన తప్పు బట్టారు. స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జరిగిన సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల ప్యానల్ చర్చా కార్యక్రమంలో రాజన్ ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం విషయంలో సెంట్రల్ బ్యాంకులు నేర్చుకున్న అనుభవాలను పంచుకునేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్ మాట్లాడుతూ... అభివృద్ధి చెందిన దేశాలు సంప్రదాయ విధానాలను విడిచిపెట్టి.. అదే సమయంలో వర్థమాన దేశాలు మాత్రం పరపతి విధానం, ఆర్థిక విధానాల విషయంలో సంప్రదాయంగానే కొనసాగాలని కోరుకోవడాన్ని తప్పుబట్టారు. ప్రస్తుతం అమలుచేస్తున్న విధానాలు ఫలితాలు ఇవ్వని పరిస్థితిలో అభివృద్ధి చెందిన దేశాలు పడిపోయాయని చెప్పుకొచ్చారు. ‘సంప్రదాయ సిద్ధాంతాలకు అనుగుణంగా నడవడం మంచిదే. కానీ ప్రస్తుతమున్న వాతావరణంలో ఇది అంతగా ఆచరణయోగ్యం కాదు. కనుక కొత్త పరిష్కారాలతో ముందుకు రావాలి. వాతావరణం ఎంతో మారింది కానీ, ఆర్థికపరమైన వాతావరణం కాదు’ అని అన్నారు. -
ఆర్థిక వ్యూహాల్లో రాజకీయాలదే ముఖ్యపాత్ర
- ద్రవ్యోల్బణమే లక్ష్యంగా కేంద్ర బ్యాంకులు - అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఇంకా గాడిలో పడలేదు... - ద్రవ్యోల్బణ కట్టడే తొలి ప్రాధాన్యం జాక్సన్ హోల్ ఆర్థిక సదస్సులో రాజన్ వాషింగ్టన్: ఆర్థిక విధానపరమైన వ్యూహా రచనల్లో రాజకీయాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. భారత్‌లోని రాజకీయ వ్యవస్థ కేంద్ర బ్యాంకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి తోడ్పాటునందిస్తోందని, రాజకీయ ఆర్థిక వ్యవస్థ నుంచి ఒత్తిళ్లను దూరం చేయడమే పాలసీ ప్రక్రియ ప్రాధాన్యమని తెలిపారు. ఆయన వోమింగ్‌లో జరిగిన కన్సాస్ సిటీ ఫెడరల్ రిజర్వు జాక్సన్ హోల్ ఆర్థిక సదస్సులో మాట్లాడారు. ఆసక్తికరంగా ఇదే వేదికపై రాజన్ గతంలో 2007-08 ఆర్థిక మాంద్యం వస్తుందని ముందే చెప్పారు. అప్పుడు రాజన్ ఐఎంఎఫ్ చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్నారు. దేశ ఆర్థిక విధాన లక్ష్యాలను వాటి రాజకీయ, చారిత్రక అంశాలు ప్రభావితం చేస్తాయని చెప్పారు. తమ పాలసీ విశ్లేషణలో రాజకీయ ఆర్థిక వ్యవస్థ కూడా పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రస్తుతం సెంట్రల్ బ్యాంకులన్నీ ద్రవ్యోల్బణమే లక్ష్యంగా పనిచేస్తున్నాయని తెలిపారు. గతంలో (1920) జరిగిన ఘటన వల్ల జర్మనీ అధిక ద్రవ్యోల్బణం నుంచి రక్షణ పొందటానికి ఆలోచిస్తే.. 1920,30లో బ్యాంకుల దివాలా కారణంగా అమెరికా ప్రతి ద్రవ్యోల్బంపై ఎక్కువగా దృష్టి కేంద్రీకరిస్తోందని పేర్కొన్నారు. బాగా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలను కలిగిన దేశాల్లో మాదిరి కాకుండా ఇటీవల కాలంలో ద్రవ్యోల్బణం అధికంగా ఉందన్నారు. ఈ అధిక ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. అధిక వడ్డీ వ్యయాలు, కరె న్సీ ఒడిదుడుకుల కారణంగా తయారీ రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని తెలిపారు. అమెరికా, యూకే మినహా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఇంకా గాడిలో పడలేదని, పుంజుకోవలసిన అవసరం ఉందన్నారు. వర్ధమాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇంకా మందగమనంలోనే ఉన్నాయని తెలిపారు. చైనా ఆర్థిక వ్యవస్థ గురించి కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయని, ఆ దేశం పుంజుకోవడానికి మరింత సమయం పడుతుందన్నారు. బయటి దేశ వ్యక్తిగా చైనా ఆర్థిక వ్యవస్థ పరిస్థితులను కచ్చితంగా అంచనా వేయడం కష్టమని, కానీ ఆ దేశంలో అనిశ్చితి నెలకొని ఉందని తెలిపారు. -
సరళ విధానాలనే నిందించొద్దు...
వాషింగ్టన్ : ప్రపంచంలోని పలు సెంట్రల్ బ్యాంకులు అనుసరిస్తున్న సరళ పరపతి విధానాలే ఆర్థిక సంక్షోభాలకు ఆజ్యం పోస్తున్నాయన్న వాదనలను అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) తోసిపుచ్చింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 1930 నాటి మహా మాంద్యం తరహా సమస్యలోకి జారిపోతోందని.. దీనికి ప్రధానంగా సెంట్రల్ బ్యాంకులు పోటాపోటీగా ప్రకటిస్తున్న సహాయ ప్యాకేజీలు, సరళ పాలసీలే కారణమని ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ తాజాగా హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఒక్క సరళ పాలసీవల్లే ఆర్థిక సంక్షోభాల్లోకి జారిపోతున్నామంటూ నిందించడం తగదని ఐఎంఎఫ్ తన పరిశోధన పత్రంలో పేర్కొంది. గత సంక్షోభాలకు కారణం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వాన్ని కాపాడేందుకు పటిష్టమైన నియంత్రణ యంత్రాంగం లేకపోవడమేనని తెలిపింది. 2007-08 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన అతికొద్ది మంది ఆర్థికవేత్తల్లో రాజన్ ఒకరు. రాజన్ అలా అనలేదు...: మహా మాంద్యం తరహా సమస్యల్లోకి జారిపోతున్నామని రాజన్ వ్యాఖ్యానించలేదని ఆదివారం ఆర్బీఐ వివరణ ఇచ్చింది. అప్పటి ఆర్థిక మాంద్యానికి కేంద్ర బ్యాంకుల విధానాలతో పాటు పలు కారణాలున్నాయని.. ప్రస్తుత విధానాలు, అప్పటి వ్యూహాల్లా మారిపోవొచ్చని మాత్రమే వ్యాఖ్యానించినట్లు ఆర్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. -
తక్కువ వడ్డీ రేట్లు ముఖ్యమే, కానీ..
డిమాండే అత్యంత కీలకం: రాజన్ న్యూయార్క్: ద్రవ్యపరపతి విధానాలను సడలించాలంటూ ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులపై ఒత్తిళ్లు పెరుగుతుండటంపై రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్టుబడులు ఆకర్షించేందుకు తక్కువ స్థాయి వడ్డీ రేట్లు, పన్నులపరమైన ప్రోత్సాహకాలు ముఖ్యమే అయినప్పటికీ.. ఆర్థిక వృద్ధి సాధించాలంటే వినియోగపరమైన డిమాండ్ అత్యంత కీలకమని ఆయన చెప్పారు. న్యూయార్క్‌లోని ఎకనామిక్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా రాజన్ ఈ విషయాలు తెలిపారు. అంతర్జాతీయంగా ద్రవ్య విధానంలో ప్రస్తుతం ఒక పద్ధతంటూ లేకపోవడం వల్ల ఇటు నిలకడైన వృద్ధికి అవకాశం లేకుండా పోయిందని, అటు ఆర్థిక రంగానికి గణనీయమైన ముప్పు ఉందని ఆయన చెప్పారు. సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లు, పన్నులపరమైన ప్రయోజనాలిచ్చే పెట్టుబడులు, ఉపాధి కల్పనను ప్రోత్సహించడం జరుగుతుందని ఆయన చెప్పారు. అయితే, రుణాల భారం వల్ల సుదీర్ఘకాలం పాటు వినియోగదారుల నుంచి డిమాండ్ బలహీనంగా ఉన్నప్పుడు .. కొత్త పెట్టుబడులపై రాబడులు అంతగా ఉండబోవని రాజన్ తెలిపారు. పాలసీ రేట్లను సున్నా స్థాయి కన్నా కూడా తక్కువకి తగ్గించడం సాధ్యం కాదని, చాలా మటుకు యూరోపియన్ దేశాలు ఈ విషయంలో పరిమితికి మించి చర్యలు తీసుకుంటున్నాయని ఆయన చెప్పారు.