న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) పాలసీ సమీక్షను చేపట్టనుంది. బుధవారం(28) నుంచి మూడు రోజులపాటు సమావేశంకానున్న పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) శుక్రవారం(30న) నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్‌బీఐ అధ్యక్షతన ఎంపీసీ ధరల అదుపునకే ప్రాధాన్యతనిస్తూ గత మూడు సమీక్షల్లో వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 1.4 శాతం హెచ్చించింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. ఈసారి సమీక్షలోనూ మరోసారి 0.5 శాతం రేటును పెంచే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వెరసి రెపో రేటు మూడేళ్ల గరిష్టం 5.9 శాతానికి ఎగసే వీలుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్‌బీఐ పరపతి నిర్ణయాలపై కన్నేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
డాలరు జోరు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా పలు కేంద్ర బ్యాంకులు గత వారం వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణ కట్టడికే కట్టుబడనున్నట్లు ప్రకటించిన ఫెడ్ ఫండ్స్ రేట్లను ఈ ఏడాది మరింత పెంచే వీలున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ ప్రభావం ఆర్‌బీఐపైనా పడనున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కాగా.. ఫెడ్ అండతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్టం 111కు చేరింది. ట్రెజరీ ఈల్డ్స్ సైతం 3.5 శాతాన్ని దాటాయి. దీంతో దేశీ కరెన్సీ ఏకంగా కొత్త చరిత్రాత్మక కనిష్టం 81కు పడిపోయింది. వడ్డీ రేట్లు, రూపాయి మారకం వంటి అంశాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
కొత్త సిరీస్ షురూ
సెప్టెంబర్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు గురువారం(29) ముగియనుంది. వారాంతం నుంచీ అక్టోబర్ సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో ట్రేడర్లు పొజిషన్లను కొత్త సిరీస్‌కు రోలోవర్ చేసుకునే అవకాశముంది. ఇది మార్కెట్లలో ఆటుపోట్లకు దారితీయవచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్త వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న అంచనాలు కొద్ది రోజులుగా గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీస్తున్న విషయం విదితమే. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లను ఈ అంశాలు ప్రభావితం చేసే అవకాశముంది.
పలు అంశాలు..
ఆర్‌బీఐ, ఎఫ్‌అండ్‌వో ముగింపు, గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్‌తోపాటు.. ఈ వారం ఇన్వెస్టర్లు మరిన్ని అంశాలపై దృష్టి సారించనున్నారు. యూఎస్ ఆర్థిక వృద్ధి(జీడీపీ) గణాంకాలు, ముడిచమురు ధరలపై రష్యా యుద్ధ భయాల ప్రభావం, ఎఫ్‌పీఐల పెట్టుబడులు, రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు తదితరాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు నిపుణులు వివరించారు.
ఎఫ్‌పీఐలు ఓకే
పలు ఆటుపోట్ల మధ్య ఈ నెల(సెప్టెంబర్)లోనూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లపట్ల ఆసక్తి చూపుతున్నారు. 1–23 మధ్య మూడు వారాల్లో రూ. 8,638 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. గత నెల(ఆగస్ట్)లో ఏకంగా రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఇటీవల కాస్త వెనకడుగు వేస్తున్నారు. గత వారం చివరి రెండు రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 2,500 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం! డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో ఇకపై పెట్టుబడులు మందగించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. అయితే 9 నెలల వరుస అమ్మకాల తదుపరి జులైలో తిరిగి ఎఫ్‌పీఐలు నికర ఇన్వెస్టర్లుగా నిలుస్తూ రూ. 5,000 కోట్ల విలువైన ఈక్విటీలను సొంతం చేసుకున్నారు! కాగా.. గతేడాది అక్టోబర్ మొదలు ఈ ఏడాది జూన్ వరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్య ఆందోళనలు, డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం వంటి అంశాలు ఎఫ్‌పీఐలను వెనక్కి లాగుతున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ నిపుణులు శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు.
గ్లోబల్ ట్రెండ్, ఆర్‌బీఐ సమీక్షపై దృష్టి
Published Mon, Sep 26 2022 6:11 AM | Last Updated on Mon, Sep 26 2022 8:29 AM
Comments
Please login to add a commentAdd a comment