న్యూఢిల్లీ: ఈ వారం దేశీ ఈక్విటీ మార్కెట్లను ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ తీసుకోనున్న పరపతి నిర్ణయాలు ప్రభావం చూపనున్నాయి. గత కొన్ని నెలలుగా ఆర్‌బీఐ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) వడ్డీ రేట్ల పెంపును బలపరుస్తోంది. ధరల అదుపునకే తొలి ప్రాధాన్యమిస్తూ కీలక రేటు రెపోను పెంచుతూ వస్తోంది. గత పాలసీ సమీక్షలో చేపట్టిన 0.5 శాతం పెంపుతో ప్రస్తుతం వడ్డీ రేట్లకు కీలకమైన రెపో 5.9 శాతానికి చేరింది. తిరిగి ఈ నెల 5–7 మధ్య ఎంపీసీ పరపతి సమీక్షను నిర్వహించనుంది. ద్రవ్యోల్బణ కట్టడికి మరోసారి 0.25–0.35 శాతం స్థాయిలో రెపోను పెంచే వీలున్నట్లు అత్యధిక శాతం మంది బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు.
ఫలితాలపై కన్ను
కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేటి(5)తో పూర్తికానుంది. వీటితోపాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు 8న వెలువడనున్నాయి. 7న ఆర్‌బీఐ నిర్ణయాలు, 8న ఎన్నికల ఫలితాలు మార్కెట్ల దిశను నిర్ధారించవచ్చని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా, హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ నిపుణులు దీపక్ జసానీ పేర్కొంటున్నారు. ఇవికాకుండా విదేశీ మార్కెట్లలో నెలకొనే పరిస్థితులు సైతం సెంటిమెంటుపై ప్రభావం చూపగలవని భావిస్తున్నారు.
పెట్టుబడులు కీలకం
రష్యా– ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో కొద్ది రోజులుగా ప్రపంచస్థాయిలో ధరలు అదుపు తప్పుతున్న సంగతి తెలిసిందే. దీంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్ల పెంపు తదితర కఠిన పరపతి విధానాలను అమలు చేస్తున్నాయి. దీంతో డాలరు బలపడుతుంటే దేశీ కరెన్సీ నేలచూపులు చూస్తోంది. అయితే ఇకపై ఫెడ్ వడ్డీ పెంపు వేగం మందగించవచ్చన్న అంచనాలతో ట్రెజరీ ఈల్డ్స్, డాలరు కొంతమేర వెనకడుగు వేస్తున్నాయి. మరోవైపు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు మార్కెట్లకు కీలకంకానున్నాయి. ఇటీవల ఎఫ్‌పీఐలు అమ్మకాలను వీడి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటంతో దేశీ ఈక్విటీ మార్కెట్లు సరికొత్త గరిష్టాలను సాధిస్తున్న విషయం విదితమే.
రికార్డుల వారం
గత వారం దేశీ స్టాక్ మార్కెట్లు బుల్ ట్రెండ్‌లో పరుగు తీశాయి. సెన్సెక్స్ నికరంగా 575 పాయింట్లు బలపడి 62,869 వద్ద, నిఫ్టీ 183 పాయింట్లు పుంజుకుని 18,696 వద్ద స్థిరపడ్డాయి. గురువారం(1న) సెన్సెక్స్ 63,583, నిఫ్టీ 18,888 పాయింట్లను తాకడం ద్వారా సరికొత్త గరిష్టాలను సాధించాయి. కాగా.. సమీప కాలంలో దేశీ మార్కెట్లకు ఆర్‌బీఐ, ఫెడ్ నిర్ణయాలు మార్గనిర్దేశం చేయనున్నట్లు శామ్‌కో సెక్యూరిటీస్ నిపుణులు అపూర్వ షేత్, కొటక్ సెక్యూరిటీస్ విశ్లేషకులు అమోల్ అథవాలే, జియోజిత్ ఫైనాన్షియల్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు.
వడ్డీ రేట్లవైపు మార్కెట్ చూపు
Published Mon, Dec 5 2022 6:20 AM | Last Updated on Mon, Dec 5 2022 6:20 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment