ఎనిమిదోసారీ కీలక రుణ రేటు యథాతథం
6.50 శాతంగా కీలక వడ్డీ రేటు కొనసాగింపు
ఆర్‌బీఐ విధాన సమీక్షలో నిర్ణయం
2024–25లో జీడీపీ వృద్ధి రేటు 7 శాతం నుంచి 7.2 శాతానికి పెంపు
ద్రవ్యోల్బణం అంచనా 4.5 శాతం
ముంబై: అంతా ఊహించినట్లే రిజర్వ్ బ్యాంక్ కీలక వడ్డీ రేట్లను (రెపో) వరుసగా ఎనిమిదో సారీ యథాతథంగా ఉంచింది. ఇటు పటిష్టమైన వృద్ధి అటు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని 6.5 శాతం స్థాయిలోనే కొనసాగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024–25) వృద్ధి రేటు గతంలో భావించిన 7 శాతానికి మించి 7.2 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. అలాగే ద్రవ్యోల్బణం 4.5 శాతం స్థాయిలో ఉండొచ్చని పేర్కొంది.
ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షకు సంబంధించి బుధవారం నుంచి మూడు రోజుల పాటు సమావేశమైన ఆరుగురు సభ్యుల మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ శుక్రవారం ఈ విషయాలు వెల్లడించారు. ఆగస్టు 8న తదుపరి పాలసీ ప్రకటన ఉంటుంది.
వడ్డీ రేటును తగ్గించాలని గత సమీక్షలో అభిప్రాయపడిన వారు ఒకరే ఉండగా ఈసారి అది ఇద్దరికి పెరిగింది. ఎక్స్‌టర్నల్ సభ్యులు (ఆషిమా గోయల్, జయంత్ వర్మ) వీరిలో ఉన్నారు. బ్యాంకులకు ఆర్‌బీఐ తానిచ్చే నిధులపై వసూలు చేసే వడ్డీ రేటే రెపో. బ్యాంకింగ్ వ్యవస్థలో వడ్డీ రేట్లు ప్రధానంగా దీనిపై ఆధారపడి ఉంటాయి. 2023 ఫిబ్రవరి నుంచి ఈ రేటు య«థాతథంగా ఉంది.
బల్క్ డిపాజిట్ల పరిమితి పెంపు
బ్యాంకుల అసెట్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపర్చేందుకు తోడ్పడేలా బల్క్ ఫిక్సిడ్ డిపాజిట్ల ప్రారంభ పరిమితిని ఆర్‌బీఐ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లకు పెంచింది. సాధారణంగా రిటైల్ టర్మ్ డిపాజిట్లతో పోలిస్తే బల్క్ ఎఫ్‌డీలపై బ్యాంకులు కొంత అధిక వడ్డీ రేటు ఇస్తాయి. పరిమితులను సవ రించడం సాధారణంగా జరిగేదేనని కొన్నేళ్ల క్రితం ఇది కోటి రూపాయలుగా ఉండేదని, తర్వాత రెండు కోట్లకు పెరిగిందని, తాజా పరిస్థితుల కు అనుగుణంగా దీన్ని రూ. 3 కోట్లకు పెంచామని డిప్యుటీ గవర్నర్ జె. స్వామినాథన్ తెలిపారు.
యూపీఐ లైట్ వాలెట్లు, ఫాస్టాగ్‌లకు ఆటోలోడ్ సదుపాయం..
చిన్న మొత్తాలను డిజిటల్‌గా చెల్లించేందుకు ఉపయోగపడే యూపీఐ లైట్ వాలెట్లలో బ్యాలెన్స్ తగ్గినప్పుడల్లా ఆటోమేటిక్‌గా లోడ్ చేసుకునే సదుపాయాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తేవాలని ఆర్‌బీఐ ప్రతిపాదించింది. ఇందుకోసం దీన్ని ఈ–మ్యాన్‌డేట్ ఫ్రేమ్‌వర్క్ పరిధిలోకి తేవాలని నిర్ణయించింది.
యూపీఐ లైట్ వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు ఇది ఉపయోగపడగలదని దాస్ తెలిపారు. ఫాస్టాగ్, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ (ఎన్‌సీఎంసీ)లను కూడా ఈ–మ్యాన్‌డేట్ పరిధిలోకి తేవాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రస్తుతం యూపీఐ లైట్ రోజువారీపరిమితి రూ. 2,000గా ఉండగా, ఒకసారి గరిష్టంగా రూ. 500 వరకు మాత్రమే చేయడానికి వీలుంది. యూపీఐ లైట్ యాప్‌లో బ్యా లెన్స్ గరిష్టంగా రూ. 2,000కు
మించరాదు.
బ్యాంకుల సిస్టమ్ వైఫల్యాల వల్లే పేమెంట్స్ అంతరాయాలు..
చెల్లింపు లావాదేవీల్లో అంతరాయాలతో కస్టమర్లకు సమస్యలు ఎదురవడానికి కారణం బ్యాంకుల సిస్టమ్‌ల వైఫల్యమే తప్ప యూపీఐ, ఎన్‌పీసీఐలు కాదని దాస్ చెప్పారు. ప్రతి అంతరాయాన్ని కేంద్రీయ బ్యాంకులో సంబంధిత అధికారులు నిశితంగా అధ్యయనం చేస్తారని, ఈ విషయంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) లేదా ఏకీకృత చెల్లింపుల విధానం ప్లాట్‌ఫాం లోపాలున్నట్లుగా ఏమీ వెల్లడి కాలేదని ఆయన తెలిపారు. టెక్నాలజీకి సంబంధించి బ్యాంకులు గణనీయంగా ఇన్వెస్ట్ చేస్తున్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment