ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును యథాతథంగా 6.5 శాతం వద్ద కొనసాగించాలని నిర్ణయించింది. ముంబైలో ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో మూడు రోజుల పాటు జరిగిన ఆరుగురు సభ్యుల ఆర్‌బీఐ ఎంపీసీ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష గురువారం ముగిసింది.
సమావేశ వివరాలను గవర్నర్ వివరిస్తూ, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యం, దేశంలో వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభుత్వం నిర్దేశిస్తున్న విధంగా 4 శాతానికి దిగిరావాలన్న లక్ష్యం వంటి అంశాల నేపథ్యంలో రెపో రేటును ప్రస్తుతమున్నట్టుగానే కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు (రెపో) 6.5 శాతంగా కొనసాగనుంది. ఫలితంగా బ్యాంకింగ్ రుణ రేట్లలో కూడా దాదాపు ఎటువంటి మార్పులూ జరగబోవని నిపుణులు అంచనావేస్తున్నారు.
వరుసగా ఆరవసారి ‘యథాతథం’..
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్‌బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగా అదుపులోకి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో తాజా సమీక్ష సహా గడచిన ఐదు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్‌బీఐ పెద్దపీట వేసింది.
పాలసీలో కీలకాంశాలు...
► ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023–24లో వృద్ధి రేటు 7.3 శాతంగా అంచనా.
► ఇదే కాలంలో రిటైల్ ద్రవ్యోల్బణం 5.4% నుంచి 4.5 శాతానికి డౌన్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 5 శాతం ద్రవ్యోల్బణం నమోదవుతుందని అంచనా.
► నియంత్రణా పరమైన మార్గదర్శకాలను ఎంతోకాలంగా పాటించకపోవడమే పేటీఎంపై చర్యకు దారితీసినట్లు గవర్నర్ దాస్ పేర్కొన్నారు. ఈ చర్యలు వ్యవస్థకు ముప్పు కలిగించేవిగా భావించరాదని కూడా స్పష్టం చేశారు.
► డిజిటల్ రూపాయి వినియోగదారులు ఇకపై పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనూ లావాదేవీలను త్వరలో నిర్వహించగలుగుతారు. తక్కువ లేదా పరిమిత ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లో లావాదేవీల కోసం సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ–రిటైల్(సీబీడీసీ–ఆర్) ఆఫ్‌లైన్ కార్యాచరణను ఆర్‌బీఐ త్వరలో ఆవిష్కరించనుంది.
► రుణ ఒప్పంద నిబంధనల గురించి కీలక వాస్తవ ప్రకటన (కేఎఫ్‌ఎస్)ను కస్టమర్‌లకు అందించవలసి ఉంటుందని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. దీని ప్రకారం బ్యాంకింగ్ ఇకపై రిటైల్‌తోపాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) రుణగ్రహీతలకు కూడా కేఎఫ్‌ఎస్‌ను అందించాల్సి ఉంటుంది.
► తదుపరి పాలసీ సమీక్ష ఏప్రిల్ 3 నుంచి 5వ తేదీ వరకు జరుగుతుంది.
వచ్చే పాలసీలో రేటు తగ్గొచ్చు
దేశంలో హౌసింగ్ డిమాండ్ పెంచడానికి వచ్చే ఆర్‌బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటు తగ్గింపు నిర్ణయం ఉంటుందని భావిస్తున్నాం. ప్రస్తుతానికి వడ్డీరేట్ల స్థిరత్వం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాం. దీనివల్ల డిమాండ్ ప్రస్తుత పటిష్ట స్థాయిలోనే కొనసాగుతుందని పరిశ్రమ భావిస్తోంది. దేశ ఎకానమీ స్థిరంగా ఉండడం పరిశ్రమకు కలిసివచ్చే అంశం.
– బొమన్ ఇరానీ, క్రెడాయ్ ప్రెసిడెంట్
వృద్ధికి బూస్ట్
రేటు యథాతథ విధానాన్ని కొనసాగిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రగతిశీలమైంది. సుస్థిర ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. అంతర్జాతీయ, దేశీయ సవాళ్లు– ఆహార రంగానికి సంబంధించి ధరల సమస్యల వంటి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుంటూ... వినియోగదారు ప్రయోజనాలే లక్ష్యంగా జరిగిన నిర్ణయాలు హర్షణీయం. జాగరూకతతో కూడిన విధానమిది.
– దీపక్ సూద్, అసోచామ్ సెక్రటరీ జనరల్
Comments
Please login to add a commentAdd a comment