
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు నెలకొన్నప్పటికీ 2024 - 25 ఆర్థిక సంవత్సరంలో వస్తు, సేవల ఎగుమతులు 820 బిలియన్ డాలర్లకు చేరినట్లు వాణిజ్య శాఖ వెల్లడించింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగినట్లు తెలిపింది. 2023 - 24లో ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి.
వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం.. 2024–25 ఏప్రిల్ - ఫిబ్రవరి మధ్య కాలంలో ఉత్పత్తుల ఎగుమతులు 395.38 బిలియన్ డాలర్ల నుంచి 395.63 బిలియన్ డాలర్లుకు చేరాయి. అలాగే సర్వీసుల ఎగుమతులు 311.05 బిలియన్ డాలర్ల నుంచి 354.90 బిలియన్ డాలర్లకు పెరిగాయి. 2024 - 25 ఆర్థిక సంవత్సరానికి గాను ఎగుమతులు, దిగుమతుల పూర్తి వివరాలను వాణిజ్య శాఖ ఏప్రిల్ 15న విడుదల చేయనుంది.
పరిశ్రమకు మంత్రి గోయల్ భరోసా..
అమెరికా టారిఫ్‌ల విధింపు నేపథ్యంలో ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు, పరిశ్రమ వర్గాలతో వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుబాటులో ఉన్న అవకాశాలను వివరించారు. అంతర్జాతీయంగా వ్యాపార పరిస్థితుల్లో ఇటీవల తలెత్తిన సవాళ్లను అధిగమించడంలో ఎగుమతి సంస్థలకు తోడ్పాటు అందించేందుకు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి భరోసా ఇచ్చినట్లు వాణిజ్య శాఖ తెలిపింది.
ఎర్ర సముద్రం సంక్షోభం, ఇజ్రాయెల్-హమాస్ ఉద్రిక్తతలు, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం, కొన్ని సంపన్న ఎకానమీల్లో వృద్ధి నెమ్మదించడం తదితర సవాళ్లు నెలకొన్నప్పటికీ ఎగుమతులు వృద్ధి చెందడం సానుకూలాంశమని ఎగుమతిదారులు, పరిశ్రమను మంత్రి అభినందించారు. వివిధ రంగాలకు ప్రాతినిధ్యం వహించే ఎగుమతి ప్రోత్సాహక మండళ్లు ఈ సమావేశంలో తమ అభిప్రాయాలు, అంచనాలను తెలిపాయి. కష్టకాలంలో ఎగుమతి సంస్థలను ఆదుకునేందుకు ప్రభుత్వం క్రియాశీలక చర్యలు తీసుకోవాలని కోరాయి.
అమెరికాతో ఒప్పందంపై కసరత్తు..
అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం విషయంలో సమతుల్యత సాధించడంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి చెప్పారు. దేశానికి ప్రయోజనం కలిగే విధంగా సరైన ఫలితాలను రాబట్టేందుకు ప్రభుత్వం ’వేగంగా’ పనిచేస్తోందని, ’అనవసర తొందరపాటు’ చర్యలు తీసుకోవడం లేదని మంత్రి పేర్కొన్నారు. టారిఫ్‌లపై ఇతర దేశాలు వివిధ రకాలుగా స్పందిస్తున్నాయని ఆయన చెప్పారు. ‘విశ్వసనీయమైన భాగస్వామిగా భారత్ ఎదిగింది.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలో భారత్ పెద్ద సంస్థలను ఆకర్షించే స్థితిలో ఉంది. కాబట్టి తయారీని పెంచుకునేందుకు, మరిన్ని ఉద్యోగాలను కల్పించేందుకు మనకు అవకాశాలు ఉన్నాయి‘ అని మంత్రి వివరించారు. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు పెంచుకోవాలని భారత్, అమెరికా నిర్దేశించుకున్నాయి. ఆ దిశగా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై కసరత్తు చేస్తున్నాయి. చర్చల తొలి దశ ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో ముగుస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 191 బిలియన్ డాలర్లుగా ఉంది.