
పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) 131వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని 34 వినూత్న ఉత్పత్తులు, సర్వీసులను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్(ఆర్థిక సమ్మేళనం), కస్టమర్లకు సాధికారత కల్పించడం, డిజిటల్ పరివర్తనను స్వీకరించడం.. వంటి లక్ష్యాలతో కొత్త ఆఫర్లను ప్రవేశపెట్టినట్లు బ్యాంకు తెలిపింది.
పీఎన్‌బీ ప్రవేశపెట్టిన సర్వీసుల్లో 12 ప్రత్యేక డిపాజిట్ పథకాలు ఉన్నాయి. ఇవి విభిన్న శ్రేణి కస్టమర్లను ఆకర్షించడానికి రూపొందించినట్లు అధికారులు తెలిపారు. వేతన జీవులు, మహిళలు, రక్షణ సిబ్బంది, రైతులు, ఎన్ఆర్ఐలు, సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు వంటి సమూహాలను లక్ష్యంగా చేసుకుని ఈ పథకాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రతి సమూహం ప్రత్యేక అవసరాలను పరిష్కరించడం ద్వారా బ్యాంక్ ఆర్థిక భద్రతను పెంచాలని, సౌకర్యవంతమైన బ్యాంకింగ్ పరిష్కారాలను అందించాలని భావిస్తోంది.
డిజిటల్ పరివర్తన
సాంకేతిక పరిజ్ఞానంలో అగ్రగామిగా నిలిచేందుకు పీఎన్‌బీ 10 డిజిటల్ కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. వీటిలో ‘పిహు’ అనే లైవ్ చాట్ అసిస్టెంట్ ఉంది. ఇది కస్టమర్లు అడిగే ప్రశ్నలకు సమగ్రంగా సమాధానం ఇస్తుందని బ్యాంకు పేర్కొంది. అదనంగా బ్యాంక్ తన ఖాతాదారులతో ఇంటరాక్టివ్ అవ్వడానికి యూజర్ ఫ్రెండ్లీ కమ్యూనికేషన్‌ను అందిస్తూ క్యూఆర్ కోడ్ ఆధారిత కస్టమర్ ఫీడ్‌బ్యాక్ యంత్రాంగాన్ని ప్రారంభించింది.
వాట్సాప్ సేవలు అప్‌డేట్
వాట్సాప్ ద్వారా ఫిక్స్‌డ్ డిపాజిట్లను బుక్ చేసుకునే వెసులుబాటు, రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ కోసం రుణ సౌకర్యాలను అందించడం, సుస్థిర ఇంధన స్వీకరణను ప్రోత్సహించడం వంటి డిజిటల్ ఆవిష్కరణలు ప్రవేశపెట్టింది. వినియోగదారులకు మొబైల్ ద్వారా అందించే బ్యాంకింగ్ సేవలను సులభతరం చేస్తూ కొత్త యాప్ ఫీచర్లను అప్‌డేట్ చేసింది. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఎన్‌బీ సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్ థీమ్‌తో ‘సైబర్ రన్’ మారథాన్‌ను నిర్వహించింది. ఇది సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతుల ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది.
ఇదీ చదవండి: యూఎస్‌లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..
వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా..
పీఎన్‌బీ ఎండీ, సీఈఓ అశోక్ చంద్ర మాట్లాడుతూ..‘నిరుపేదలు, పౌరుల సాధికారత, యువతకు విద్యాబుద్ధులు నేర్పడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, స్వయం ఉపాధిని ప్రోత్సహించడంలో ఈ బ్యాంకు కార్యక్రమాలు ఎంతో తోడ్పడుతాయి. ఇవన్నీ 2047 నాటికి కేంద్రం తలపెట్టిన వికసిత్ భారత్ విజన్‌కు అనుగుణంగా ఉన్నాయి. మేము మా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను నిరంతరం మెరుగుపరుస్తున్నాం. కాల్ సెంటర్ కార్యకలాపాలను మరింత అభివృద్ధి చెస్తున్నాం. సేవా నాణ్యతను పెంచడానికి సమర్థవంతమైన కస్టమర్ ఫీడ్ బ్యాక్ కోసం క్యూఆర్ కోడ్‌లను ఉపయోగిస్తున్నాం’ అని చెప్పారు.