
ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంకులో (PNB) మరో మోసం వెలుగు చూసింది. ఒరిస్సాకు చెందిన గుప్తా పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ రూ.271 కోట్ల మేర రుణం తీసుకుని తిరిగి చెల్లించకుండా మోసానికి పాల్పడింది. ఈ ఖాతాను మొండిపద్దుగా (ఎన్‌పీఏ) వర్గీకరించి రిజర్వ్ బ్యాంక్ దృష్టికి తీసుకెళ్లినట్లు బ్యాంకు వివరించింది. ఇప్పటికే ఈ మొత్తానికి ప్రొవిజనింగ్ చేసినట్లు పేర్కొంది.
భువనేశ్వర్‌లోని పీఎన్‌బీ స్టేషన్ స్క్వేర్ బ్రాంచ్ ఈ రుణాన్ని జారీ చేసింది. పీఎన్‌బీ ఫ్రాడ్ జరిగినా డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం రెండు రెట్లు పెరిగి రూ.4,508 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో రూ.2,223 కోట్లతో పోలిస్తే అధికంగా నమోదైంది. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ.29,962 కోట్ల నుంచి రూ.34,752 కోట్లకు, వడ్డీ ఆదాయం రూ.27,288 కోట్ల నుంచి రూ.31,340 కోట్లకు పెరిగింది. అంతేకాకుండా పీఎన్‌బీ స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 6.24 శాతం నుంచి 4.09 శాతానికి తగ్గింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కొన్నేళ్లుగా హైప్రొఫైల్ కేసులతో ఇబ్బంది పడుతోంది. అందులో కొన్ని కింద తెలియజేశాం.
నీరవ్ మోదీ స్కామ్ (2018): భారతదేశ చరిత్రలో అతిపెద్ద బ్యాంకింగ్ మోసాల్లో ఒకటిగా నిలిచింది. దీని విలువ సుమారు రూ.12,700 కోట్లు. నగల వ్యాపారి నీరవ్ మోదీ తన బంధువు మెహుల్ చోక్సీతో కలిసి పీఎన్‌బీ ఉద్యోగులతో కుమ్మక్కై అనధికార లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్ఓయూ)లను ఉపయోగించి మోసపూరిత రుణాలు పొందారు. బ్యాంకింగ్ వ్యవస్థలో లొసుగుల కారణంగా ఈ కుంభకోణం ఏళ్ల తరబడి బయటపడలేదు.
నీరవ్ మోదీ కుంభకోణంలో గీతాంజలి జెమ్స్ యజమాని మెహుల్ చోక్సీ కూడా ఇరుక్కున్నాడు. 2018 ప్రారంభంలో దేశం విడిచి పారిపోయిన అతను అప్పటి నుంచి అధికారులు, విచారణ వ్యవస్థల నుంచి తప్పించుకు తిరుగుతున్నాడు.
ఇదీ చదవండి: రేట్ల కోత కాదు.. ఏం చేయాలో సూచించిన మిశ్రా
పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్స్ మోసం (2020): సరైన నిబంధనలు పాటించకుండా షెల్ కంపెనీలకు రుణాలు ఇచ్చిన కేసులో పీఎన్‌బీఐ హౌసింగ్ ఫైనాన్స్ ప్రమేయం ఉందని తేలింది. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment