
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)లో రూ.13,500 కోట్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ బెల్జియంలో క్యాన్సర్ చికిత్స పొందుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ఇటీవల ముంబయిలోని మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) ప్రత్యేక కోర్టుకు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. చోక్సీని పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడిగా (ఎఫ్ఈఓ) ప్రకటించాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రయత్నిస్తోంది. దాంతో ఆయన ఆస్తులను జప్తు చేసేందుకు ప్రభుత్వానికి వీలు కలుగుతుంది.
చోక్సీ తన బంధువు నీరవ్ మోదీతో కలిసి మోసపూరిత లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్ (ఎల్ఓయూ), ఫారిన్ లెటర్స్ ఆఫ్ క్రెడిట్ (ఎఫ్ఎల్‌సీ) ద్వారా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB)లో రూ.13,500 కోట్లకు పైగా మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2018 నుంచి కొనసాగుతున్న ఈ కేసు తదుపరి విచారణను ముంబయి కోర్టు ఫిబ్రవరి 27కి వాయిదా వేసింది. చోక్సీ ఆరోగ్య పరిస్థితి కారణంగా ప్రయాణం చేయలేకపోతున్నాడని, ఆయనను ఎఫ్ఈఓగా ప్రకటించడం అన్యాయమని తన తరఫు న్యాయవాది వాదించారు. ఈ కుంభకోణం బయటపడకముందే భారత్‌ను వదిలి వెళ్లిన ఆయన 2018 నుంచి ఆంటిగ్వాలోనే ఉంటున్నారని చెప్పారు. మరోవైపు నీరవ్ మోదీని 2019లో ఎఫ్ఈఓగా ప్రకటించారు. ప్రస్తుతం ఆయన లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు.
ఇదీ చదవండి: భారీగా పడిపోయిన పామాయిల్ దిగుమతులు
చోక్సీ ఆరోగ్య సమస్యల నేపథ్యంలో రాబోయే విచారణలో ఆయనను ఎఫ్ఈఓగా ప్రకటించడంపై కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎఫ్‌ఈఓగా ప్రకటిస్తే తన ఆస్తులను ప్రభుత్వం వేలం వేసి నష్టాన్ని భర్తీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటికే మెహుల్ చోక్సీ ఈక్విటీ ఆస్తులకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ కీలక నిర్ణయం తీసుకుంది. చోక్సీ బ్యాంకు ఖాతాలు, షేర్లు, మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్‌లను జప్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment