సాక్షి,ముంబై: వేలకోట్ల కుంభకోణానికి పాల్పడి విదేశాలకు చెక్కేసిన డైమండ్ వ్యాపారి నీరవ్‌మోదీపై విపుల్ అంబానీ కీలక వ్యాఖ్యలు చేశారు. పీఎన్‌బీ స్కాంలో కీలక నిందితుడుగా ఉన్న నీరవ్ వ్యాపార విస్తరణ క్రమం తనను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు. అలాగే భవిష్యత్తులో మరింత విస్తరించేలా భారీ ప్లాన్లను రూపొందించుకున్నారని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ బంధువు, టవర్ క్యాపిటల్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విపుల్ అంబానీ వెల్లడించారు.
1999లో వ్యాపారాన్ని ప్రారంభించిన నీరవ్ మోదీ అయిదేళ్లు తిరక్కుండానే తన రత్నాలు, వజ్రాల వ్యాపార సంస్థ ‘ఫైర్‌స్టార్ గ్రూప్’ ను విదేశాల్లోనూ విస్తరించాడని తెలిపారు. అప్పటికే 6 అంతర్జాతీయ నగరాలకు తన వ్యాపారాన్నివిస్తరింపజేసిన నీరవ్ 2015లో మరింత దూకుడు పెంచాడన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన డైమండ్ వ్యాపార సామ్రాజ్యాన్ని 2020 నాటికి 12 దేశాల్లో భారీగా విస్తరించాలని భావించారట. ఈ సందర్భంగా 30కి పైగా ఔట్‌లెట్లను నెలకొల‍్పడమే లక్ష్యంగా పనిచేస్తానని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్‌లో నీరవ్ వెల్లడించిన విషయాన్ని విపుల్ గుర్తు చేశారు.
అంతటి విస్తరణా కార్యక్రమాల్ని చూసిన ఎవరికైనా ఔరా.! అనిపిస్తుందని ఆయన తెలిపారు. ప్రఖ్యాత నటి, మోడల్ నవోమీ వాట్స్ నుంచి జూనియర్ ట్రంప్ వరకు నీరవ్ బిజినెస్ మోడల్‌ను చూసి అలా ఆశ్చర్యపోయిన వారేనని అన్నారు. నీరవ్ మోదీ, అతని మామ మోహుల్ చోక్సీలు పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్కాంలో ఆరోపణలపై విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment