Innovative services
-
వినూత్నం: ఆ గుప్పెళ్లు.. దయగల గుండెల చప్పుళ్లు
యానాం: ఎదుటివారికి సాయపడాలనే ఆలోచనతో మొదలు పెట్టిన ఆ కార్యక్రమం అయిదేళ్లుగా అవిచ్ఛినంగా సాగడమే కాక అభాగ్యులను ఆదుకుంటోంది. తమ పూర్వవిద్యార్థులు అనాథాశ్రమాలకు సహాయ పడాలనే ఆలోచనతో మొదలు పెట్టిన గుప్పెడు బియ్యం.. గుప్పెడు సాయం సేవా కార్యక్రమం నేటికీ కొనసాగిస్తూ రీజెన్సీ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి సేవానిరతి పలువురి ప్రశంసలు అందుకుంటోంది. చదవండి: చనిపోయాడనుకుని దహన సంస్కారాలు.. చిన్న కర్మ జరుపుతుండగా... ప్రతి బుధవారం ఇంటి వద్ద నుంచి గుప్పెడు బియ్యం తీసుకువచ్చి... కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి బుధవారం ఉదయం వచ్చేటప్పుడు తమ వెంట గుప్పెడు బియ్యాన్ని చిన్న పాటి బాక్సుల్లో తీసుకువస్తారు. తరగతి గదికి వెళ్లకముందే బియ్యాన్ని కళాశాల ఆవరణలో ఉంచిన ప్రత్యేకంగా తయారు చేయించిన పెద్ద డ్రమ్ములో వేస్తారు. ఆ విధంగా కళాశాలలో ఉన్న ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 530 మందితో పాటు 23 సిబ్బంది బియ్యాన్ని తీసుకువచ్చి మనం ఒకరికి సహాయపడుతున్నాం అనే భావనతో డబ్బాలో వేస్తారు. ఈ విధంగా 100 కేజీలు అయిన తర్వాత ఆ బియ్యాన్ని వివిధ అనాథ ఆశ్రమాలకు సంచుల్లో అందిస్తున్నారు. దాదాపు రెండు వారాల్లోనే డబ్బా నిండిపోతుంది. దీంతో రెండువారాలకు వచ్చే బియ్యాన్ని అనాథలకు, ఎవరూ ఆధారంలేని అభాగ్యులకు అందిస్తున్నారు. వీటిని స్వయంగా విద్యార్థులే తీసుకువెళ్లి అందించడం గమనార్హం. 2017లో ప్రారంభం విద్యార్థులకు సేవాభావాన్ని, నైతికతను, సామాజిక విలువలను తెలియజేయాలనే ఆలోచనతో 2017లో గుప్పెడు బియ్యం..గుప్పెడు సహాయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మార్తాండప్రసాద్, ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ సరెళ్ల వీరకుమార్, పీఈటీ సోమేష్, అధ్యాపక సిబ్బంది విద్యార్ధులకు మార్గదర్శకంగా ఉంటున్నారు. మా వంతు తోడ్పడుతున్నాం అభాగ్యులకు తోడ్పాలనే ఆలోచనతో మేమంతా గుప్పెడు బియ్యాన్ని తీసుకువస్తున్నాం. ఈ కార్యక్రమం మా పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. దీనిని అవిఘ్నంగా కొనసాగిస్తూ సేకరించిన బియ్యాన్ని అనాథాశ్రమాలకు అందిస్తూ మా వంతు తోడ్పడుతున్నాం. – ఎం.అరవింద్, పి.మురళీకృష్ణ, ఎస్.సూర్య, సీహెచ్ అవినాష్‌రెడ్డి (రీజెన్సీ ఇంటర్ విద్యార్థులు) అయిదేళ్లుగా నిరాటంకంగా సమాజంలో పేదలకు విద్యార్థులు ఏవిధంగా సహాయపడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశాం. సహాయపడే విధానాన్ని విద్యార్థులకు నేర్పాలి అనే అధ్యాపకుల ఆలోచనతో ఇది మొదలయ్యింది. అయిదేళ్లుగా నిరాటంకంగా సాగుతోంది. –మార్తాండప్రసాద్, ప్రిన్సిపాల్, రీజెన్సీ కళాశాల -
తిరుమల శ్రీవారికి కొత్తగా నవనీత సేవ
తిరుమల : తిరుమల శ్రీవారి నైవేద్యాల కోసం ప్రతిరోజూ అవసరమయ్యే నెయ్యిని దేశవాళీ ఆవుల నుంచి సేకరించడానికి త్వరలో ‘నవనీత సేవ’ పేరుతో నూతన సేవకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్లు టీటీడీ సాధికార మండలి చైర్మన్, ఈఓ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు. అలాగే, శ్రీవారి ఆలయంలో నైవేద్యానికి వినియోగించే ప్రసాదాల తయారీకి రోజుకు 30 కిలోల దాకా నెయ్యి అవసరమవుతుందని.. ఇందుకోసం సుమారు 1,200 లీటర్ల పాలు కావల్సి ఉంటుందన్నారు. తిరుమల ఏడుకొండలకు సూచికగా ఏడు దేశవాళీ రకాల ఆవులతోపాటు స్థానికంగా ఉన్న మరో మూడు రకాలతో తిరుమలలో 250–300 ఆవులను సేకరించి పాల ఉత్పత్తి ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఈఓ చెప్పారు. ఈ కార్యక్రమానికి దేశవాళీ ఆవుపాల నుంచి తయారుచేసిన స్వచ్ఛమైన నెయ్యిని భక్తుల నుంచి కూడా విరాళంగా తీసుకుంటామని.. భక్తులు వారి శక్తి మేరకు నెయ్యి విరాళంగా ఇవ్వొచ్చని ఆయన తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం సాధికార మండలి సమావేశం జరిగింది. అనంతరం మండలి చైర్మన్, ఈఓ జవహర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ►శ్రీవారి నైవేద్యానికి స్వచ్ఛమైన నెయ్యి తయారీకి పలువురు భక్తులు 25 గిర్ గోవులను విరాళంగా అందించారు. ►గో సంరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారిని గోసంరక్షణ ట్రస్టులో కో–ఆప్షన్ సభ్యులుగా నియమిస్తాం. ►టీటీడీకి ఏటా అవసరమయ్యే ఏడు వేల టన్నుల శనగపప్పును గోఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన దానినే కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలించాలని నిర్ణయించాం. ►తిరుపతి ఎస్వీ పశు వైద్య విశ్వవిద్యాలయం సహకారంతో పశువుల దాణా తయారీ ప్లాంట్, పశువుల సంతానోత్పత్తికి ఆధునిక పిండ మార్పిడి విధానాలకు సంబంధించి ఎంఓయు చేసుకోవాలని నిర్ణయించాం. ►తిరుపతి ఎస్వీ గోశాలలో పంచగవ్యాలతో తయారుచేసిన అగరబత్తీలను ఆగస్టు 15 నుండి తిరుమలలో భక్తులకు అందుబాటులో ఉంచుతాం. ►అలాగే, 4 నెలల్లోపు పంచగవ్య ఉత్పత్తులైన సబ్బు, షాంపు, ధూప్ స్టిక్స్. ఫ్లోర్ క్లీనర్ వంటి 15 రకాల ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకొస్తాం. ►టీటీడీ ముద్రణాలయంలో ఏటా రూ.35 కోట్ల నుంచి రూ.40 కోట్లు విలువయ్యే పనులు జరుగుతున్నాయి. పీపీపీ విధానంలో అధునాతన యంత్రాల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన వారిని ఆహ్వానిస్తాం. ►సప్తగిరి మాసపత్రిక ఎడిటోరియల్ బోర్డును ఇటీవల నిష్ణాతులైన పండితులతో ఏర్పాటుచేశాం. త్వరలో పత్రికను సరికొత్త రూపంతో పాఠకుల ముందుకు తీసుకొస్తాం. ►తిరుమలలో విద్యుత్ వాహనాలను ప్రవేశపెట్టేందుకు నిర్ణయించాం. తొలిదశలో ప్రయోగాత్మకంగా 35 విద్యుత్ కార్లను నెలకు రూ.32 వేలు చొప్పున అద్దె చెల్లించి తీసుకోవాలని నిర్ణయించాం. ఐదేళ్ల తరువాత ఈ వాహనాలు టీటీడీ సొంతమవుతాయి. ►2022 సంవత్సరానికి గాను 12 పేజీల క్యాలెండర్లు 15 లక్షలు, డీలక్స్ డైరీలు 8 లక్షలు, చిన్న డైరీలు 2 లక్షలు ముద్రించేందుకు ఆమోదించాం. ►టీటీడీ పరిపాలనా భవనం, ముద్రణాలయం, రవాణా విభాగంలో సీసీటీవీల ఏర్పాటుకు రూ.2 కోట్ల టెండర్లు ఖరారు చేశాం. 22 బ్యాగేజి స్కానర్ల కొనుగోలు నిమిత్తం రూ.4.27 కోట్ల మంజూరుకు ఆమోదించాం. ►త్రిదండి రామానుజ చిన్న జీయర్‌స్వామివారి సూచనల మేరకు పలు ఆలయాల అభివృద్ధికి రూ.8.94 కోట్లు అందిçస్తున్నాం. పురాతన విఠలేశ్వరస్వామివారి ఆలయం రాతి కట్టడానికి రూ.6 కోట్లకు పైగా మంజూరు చేశాం. ►‘బర్డ్’ పాత భవనంలో తాత్కాలికంగా ఏర్పాటుచేస్తున్న ఎస్వీ చిన్నపిల్లల ఆసుపత్రిలో రూ.6 కోట్లతో అధునాతన ఫ్లాట్ డిటెక్టర్ క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదించాం. ఈ సమావేశంలో ఏఈవో ఏవీ ధర్మారెడ్డి, జేఈఓ సదాభార్గవి, సీవీఎస్ఓ గోపినాథ్ జెట్టి, అదనపు ఎఫ్ఏ అండ్ సీఏఓ రవిప్రసాద్ పాల్గొన్నారు. -
ఆన్లైన్లో ప్రాపర్టీ షో!
వినూత్న సేవలతో మార్కెట్లోకి బిల్డ్‌ఈజీ.కామ్ * స్థిరాస్తి సమాచారమంతా ఒకే వేదికగా పొందే వీలు * ఇల్లు నుంచి ఇంట్లోని ఫర్నిచర్ దాకా.. * వాస్తు నుంచి ప్లంబింగ్ వర్క్ వరకూ.. బిల్డ్‌ఈజీ.కామ్‌లో సాక్షి, హైదరాబాద్: ఎంతో కష్టపడి.. పైసా పైసా కూడబెట్టి బైకో, కారో కొనాలంటేనే నలుగురిని సంప్రదిస్తాం. షాపింగ్ వెళ్లి దుస్తులు కొంటే మన శరీరానికి నప్పుతాయో లేవోనని ఒకటికి రెండు సార్లు ట్రయల్ వేసుకొని మరీ చూస్తాం... మరి జీవితకాలం నివాసముండే సొంతిల్లు ఎంపికంటే? ఒకట్రెండు ప్రాపర్టీ షోలకు వెళ్లో.. ఆన్లైన్లో సెర్చ్ చేసో నిర్ణయం తీసుకునే విషయమేమీ కాదు. మరె లా? ప్రతీదానికి ఆన్లైన్ కొనుగోళ్లు అలవాటైన ఈ రోజుల్లో ప్రాపర్టీని కూడా ఆన్లైన్లో కొనేస్తే! నేరుగా ఆన్లైన్లో ప్రాపర్టీ షోలో పాల్గొంటే!! అచ్చం ఇదే వ్యాపా ర సూత్రంగా మార్చుకుంది బిల్డ్‌ఈజీ.కామ్. వినూత్న సేవలతో త్వరలోనే మార్కెట్లోకి రానున్న ఈ సంస్థ మరిన్ని సేవలను బిల్డ్‌ఈజీ.కామ్ వ్యవస్థాపకులు రాంగోపాల్, లక్ష్మీనారాయణలు‘సాక్షి రియల్టీ’తో పంచుకున్నారు. ఫిజికల్‌గా ప్రాపర్టీ షో నిర్వహించడమంటే మామూలు విషయం కాదు. అటు నిర్వాహకులకు, ఇటు ఎగ్జిబిటర్లకూ ఎంతో వ్యయ, ప్రయాసలతో కూడుకున్న పని. నిర్వాహకుల విషయానికొస్తే.. లొకేషన్ ఎంపిక నుంచి స్టాల్ ఏర్పాటు, భోజన కార్యక్రమాలు, ఎగ్జిబిటర్లను ఒప్పించడం వరకు ప్రతీదీ పనే. ఇక ఎగ్జిబిటర్ల విషయానికొస్తే.. షో ఉన్నన్ని రోజులు ఉద్యోగుల డ్యూటీ నుంచి ప్రాజెక్ట్‌ల డిస్ప్లే, వాక్ త్రూ ఏర్పాట్లు, కరపత్రాలు, బ్రోచర్ల ప్రింట్లు, పంపిణీ, సందర్శకులను ఒప్పించడం వరకూ ప్రతీదీ కష్టంతో కూడుకున్నదే. * ఈ కష్టాలకు పరిష్కారం చూపించేదే ఆన్లైన్ ప్రాపర్టీ షో. బిల్డ్‌ఈజీ.కామ్‌తో ఆఫీసులోని కంప్యూటర్ ముందు కూర్చొని నేరుగా ఆన్లైన్లో ప్రాపర్టీ షోలో పాల్గొనొచ్చు. కస్టమర్ ఓకే అంటే అక్కడికక్కడే డీల్‌ను క్లోజ్ చేయొచ్చు కూడా. * ఆన్లైన్ ప్రాపర్టీ షోలో ఏముంటుందంటే.. ఎగ్జిబిటర్లకు సంబంధించిన సమాచారం, ప్రాజెక్ట్ వివరాలు, ఎలివేషన్, స్పెసిఫికేషన్స్, ఫ్లోర్ ప్లాన్, వసతులు, ప్రాజెక్ట్ ఏరియల్ వ్యూ, లొకేషన్, భవిష్యత్తు వృద్ధి వంటి వివరాలెన్నో ఉంటాయి. కస్టమర్ సమాచారం, ఫీడ్ బ్యాక్, ఫోన్ నంబర్ వంటి సమాచారాన్ని స్థిరాస్తి సంస్థలకు అందిస్తాం. * మరి ఆన్లైన్ ప్రాపర్టీ షోకు లీడ్స్‌ను ఎలా ఆకర్షిస్తామంటే.. కరపత్రాలు, పోస్టర్లు, పేపర్ ప్రకటనలు, హోర్డింగ్స్, ఆటో, బస్ క్యాంపెయిన్, ప్రసార మాధ్యమాల్లో డిస్ప్లే, స్క్రోలింగ్ యాడ్స్, డిజిటల్ మార్కెటింగ్, ఫేస్బుక్, ట్వీటర్, యూట్యూట్, లింక్డిన్ వంటి సామాజిక మాధ్యమాల, ఎస్ఎంఎస్, ఈ-మెయిల్, వాట్సప్ క్యాంపెయిన్ ద్వారా ప్రాపర్టీ షోకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తాం. * బిల్డ్‌ఈజీ.కామ్‌లో ప్రాపర్టీ షోనే కాకుండా స్థిరాస్తులకు సంబంధించిన సమస్త సమాచారం ఒకే వేదికగా పొందొచ్చు. అంటే స్థిరాస్తి కొనుగోళ్లు, అద్దెలు, లీజు, అర్కిటెక్ట్‌లు, నిర్మాణ సామగ్రి, గృహ రుణాలు, నిర్మాణ సంస్థలు, యాజమాన్యాలు, వాస్తు పండితులు, ఇంటీరియర్ డిజైనర్లు, ప్లంబర్, శానిటేషన్ నిపుణులు, పెయింటర్స్, అగ్నిమాపక నియంత్రణ నిపుణులు, కార్పెంటర్లు.. ఇలా నిర్మాణ రంగానికి సంబంధించిన సమాచారమంతా ఇక్కడుంటుందన్నమాట. * స్థిరాస్తి రంగంలో వస్తున్న నూతన ఒరవడి, సరికొత్త ట్రెండ్స్, ఆధునిక వసతులకు సంబంధించిన ఆర్టికల్స్, వార్తా కథనాలనూ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు కూడా. * కొనుగోలుదారులు, స్థిరాస్తి సంస్థలకు మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. అంటే వీరిద్దరి మధ్య వారధిగా నిలుస్తుందన్నమాట. * నిర్మాణంలో ఉన్న ప్రాజెక్ట్‌లు, గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్ట్‌లను నేరుగా ఆన్లైన్ ద్వారా ప్రాపర్టీ షో నిర్వహించి కొనుగోలుదారులకు మరింత చేరువ చేస్తుంది. * కొనుగోలుదారుల సొంతింటి కలను తీర్చేందుకు అవసరమైన గృహరుణాలనూ అందించేందుకు బ్యాంకింగ్ రంగంతోనూ ఒప్పందం చేసుకున్నాం. దీంతో ఆన్లైన్లోనే అప్పటికప్పుడే లోన్ విధానాన్ని పూర్తి చేయవచ్చు కూడా. * బిల్డ్‌ఈజీ.కామ్ స్టార్టప్ మాతృ సంస్థ గ్రాఫిక్స్ ఇన్ఫర్మేటిక్స్. వెబ్ డెవలప్మెంట్, మల్టిమీడియా, ప్రింట్ విభాగాల్లో జేఎన్టీయూ దగ్గర్లో 2005లో కార్యాలయాన్ని ప్రారంభించి సేవలందిస్తుందీ సంస్థ. బిల్డ్‌ఈజీ.కామ్ సేవలు రెండు రకాలు.. 1. ప్రీమియర్ పార్టిసిపెంట్ 2. ప్రైమ్ పార్టిసిపెంట్ * ప్రీమియర్ చార్జీ ఏడాదికి రూ.3.50 లక్షలు+ పన్నులు. * వీళ్లు చానల్ స్పాన్సర్‌గానూ కొనసాగుతారు. ఏడాది పాటు బిల్డ్‌ఈజీ.కామ్ సేవలను పొందొచ్చు. * ఆన్లైన్ ప్రాపర్టీ షోలో నిశ్చల స్థానం. లీడ్ డిస్ట్రిబ్యూషన్లో మొదటి స్థానం వీరిదే. * ప్రైమ్ పార్టిసిపెంట్ చార్జీ రూ.2.50 లక్షలు+ పన్నులు. * ఆన్లైన్ ప్రాపర్టీ షోలో రాండమ్ స్థానాన్ని పొందుతారు. మూడు నెలల పాటు సేవలు. * 50 శాతం నగదును ముందుగా చెల్లించాలి. మిగతా మొత్తాన్ని ప్రాపర్టీ షో ప్రారంభ తేదీ కంటే వారం ముందుగా చెల్లించాల్సి ఉంటుంది.