తమ వెంట తెచ్చిన గుప్పెడు బియ్యాన్ని స్టీలు డ్రమ్ములో వేస్తున్న విద్యార్థులు
యానాం: ఎదుటివారికి సాయపడాలనే ఆలోచనతో మొదలు పెట్టిన ఆ కార్యక్రమం అయిదేళ్లుగా అవిచ్ఛినంగా సాగడమే కాక అభాగ్యులను ఆదుకుంటోంది. తమ పూర్వవిద్యార్థులు అనాథాశ్రమాలకు సహాయ పడాలనే ఆలోచనతో మొదలు పెట్టిన గుప్పెడు బియ్యం.. గుప్పెడు సాయం సేవా కార్యక్రమం నేటికీ కొనసాగిస్తూ రీజెన్సీ విద్యార్థులు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారి సేవానిరతి పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
చదవండి: చనిపోయాడనుకుని దహన సంస్కారాలు.. చిన్న కర్మ జరుపుతుండగా...
ప్రతి బుధవారం ఇంటి వద్ద నుంచి గుప్పెడు బియ్యం తీసుకువచ్చి...
కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి బుధవారం ఉదయం వచ్చేటప్పుడు తమ వెంట గుప్పెడు బియ్యాన్ని చిన్న పాటి బాక్సుల్లో తీసుకువస్తారు. తరగతి గదికి వెళ్లకముందే బియ్యాన్ని కళాశాల ఆవరణలో ఉంచిన ప్రత్యేకంగా తయారు చేయించిన పెద్ద డ్రమ్ములో వేస్తారు. ఆ విధంగా కళాశాలలో ఉన్న ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 530 మందితో పాటు 23 సిబ్బంది బియ్యాన్ని తీసుకువచ్చి మనం ఒకరికి సహాయపడుతున్నాం అనే భావనతో డబ్బాలో వేస్తారు. ఈ విధంగా 100 కేజీలు అయిన తర్వాత ఆ బియ్యాన్ని వివిధ అనాథ ఆశ్రమాలకు సంచుల్లో అందిస్తున్నారు. దాదాపు రెండు వారాల్లోనే డబ్బా నిండిపోతుంది. దీంతో రెండువారాలకు వచ్చే బియ్యాన్ని అనాథలకు, ఎవరూ ఆధారంలేని అభాగ్యులకు అందిస్తున్నారు. వీటిని స్వయంగా విద్యార్థులే తీసుకువెళ్లి అందించడం గమనార్హం.
2017లో ప్రారంభం
విద్యార్థులకు సేవాభావాన్ని, నైతికతను, సామాజిక విలువలను తెలియజేయాలనే ఆలోచనతో 2017లో గుప్పెడు బియ్యం..గుప్పెడు సహాయం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సేవా కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మార్తాండప్రసాద్, ఎన్‌ఎస్‌ఎస్ ఆఫీసర్ సరెళ్ల వీరకుమార్, పీఈటీ సోమేష్, అధ్యాపక సిబ్బంది విద్యార్ధులకు మార్గదర్శకంగా ఉంటున్నారు.
మా వంతు తోడ్పడుతున్నాం
అభాగ్యులకు తోడ్పాలనే ఆలోచనతో మేమంతా గుప్పెడు బియ్యాన్ని తీసుకువస్తున్నాం. ఈ కార్యక్రమం మా పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. దీనిని అవిఘ్నంగా కొనసాగిస్తూ సేకరించిన బియ్యాన్ని అనాథాశ్రమాలకు అందిస్తూ మా వంతు తోడ్పడుతున్నాం.
– ఎం.అరవింద్, పి.మురళీకృష్ణ, ఎస్.సూర్య, సీహెచ్ అవినాష్‌రెడ్డి (రీజెన్సీ ఇంటర్ విద్యార్థులు)
అయిదేళ్లుగా నిరాటంకంగా
సమాజంలో పేదలకు విద్యార్థులు ఏవిధంగా సహాయపడాలనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి అంకురార్పణ చేశాం. సహాయపడే విధానాన్ని విద్యార్థులకు నేర్పాలి అనే అధ్యాపకుల ఆలోచనతో ఇది మొదలయ్యింది. అయిదేళ్లుగా నిరాటంకంగా సాగుతోంది.
–మార్తాండప్రసాద్, ప్రిన్సిపాల్, రీజెన్సీ కళాశాల
Comments
Please login to add a commentAdd a comment