
రాత్రిపగలూ ప్రిపరేషన్‌లోనే ఇంటర్, టెన్త్ విద్యార్థులు
5 నుంచి ఇంటర్, 21 నుంచి పది పరీక్షలు మొదలు
పిల్లల చదువుల కోసం తల్లిదండ్రుల నిద్ర త్యాగం
స్కూళ్లు, కాలేజీల్లో స్టడీ అవర్స్, ప్రత్యేక తరగతులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మిడియట్, పదో తర గతి పబ్లి క్ పరీక్షల సమయం దగ్గరపడటంతో విద్యార్థులు నిద్రాహారాలు మాని పుస్తకాలతో కుస్తీలు పడుతున్నారు. పిల్లల పరీక్షలపైనే తల్లిదండ్రులు దృష్టి పెట్టారు. హాస్టళ్లల్లో రాత్రింబవళ్లూ స్టడీ అవర్స్ నడుస్తున్నాయి. ప్రైవేటు కాలే జీలు, స్కూళ్ల హాస్టల్స్‌లో విద్యార్థులను చదివించడం కోసం ప్రత్యేక సిబ్బంది పని చేస్తున్నారు.
విస్తృతంగా స్టడీ మెటీరియల్స్
ఈ నెల 5వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు మొదలవుతున్నాయి. మొదటి, రెండో సంవత్సరం కలిపి 9,96,541 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రాష్ట్రంలోని 417 ప్రభుత్వ కాలేజీల్లో 1.24 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వీళ్లకు ఇంటర్ బోర్డ్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేసింది. నెల రోజుల క్రితమే అన్ని చోట్లా సిలబస్ పూర్తయింది. 15 రోజులుగా రివిజన్ చేయిస్తున్నారు. ఉదయం, సాయంత్రం గంటపాటు ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నారు.
వెనుకబడ్డ విద్యార్థులను గుర్తించి ముఖ్యమైన ప్రశ్నలపై తర్ఫీదు ఇస్తున్నారు. టెన్త్ పరీక్షలు ఈ నెల 21 నుంచి మొదలవుతాయి. 5.50 లక్షల మంది ఈ పరీక్షలు రాయనున్నారు. ఇందులో 1.40 లక్షల మంది ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్నారు. వందశాతం పాస్ ఫలితాలపై స్కూళ్లు దృష్టి పెట్టాయి. విద్యాశాఖ అన్ని సబ్జెక్టులకూ స్టడీ మెటీరియల్స్‌ను స్కూళ్లకు పంపింది.
నిద్రలేని రాత్రులు
గురుకులాలు, కేజీబీవీలు, ప్రభుత్వ, ప్రైవేటు హాస్టళ్లలో విద్యార్థులకు నిద్ర కూడా కరవవుతోంది. ఉదయం 4 గంటలకే విద్యార్థులను నిద్ర లేపి గంటపాటు స్టడీ అవర్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత సబ్జెక్టు అధ్యాపకులు ముఖ్యమైన చాప్టర్స్‌పై ప్రశ్నలు వేస్తున్నారు. సరైన సమాధానం రాకపోతే ఆ చాప్టర్‌పై శిక్షణ పెంచుతున్నారు. ఎవరు ఎక్కడ బలహీనంగా ఉన్నారు? వారిని ఏ విధంగా ప్రిపేర్ చెయ్యాలనే అంశాలపై స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలు రోజూ నివేదికలు కోరుతున్నాయి. పరీక్షలు అయ్యే వరకు ఎవరూ సెలవు పెట్టొద్దని ఆదేశాలు వెళ్లాయి.
సబ్జెక్టు టీచర్లకు ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు పోటీ పెడుతున్నాయి. ఎక్కువ మంది మంచి జీపీఏ, ర్యాంకులతో పాసయ్యేలా చేస్తే ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తామని ఆశ చూపుతున్నాయి. ఈసారి ప్రభుత్వ స్కూల్ టీచర్లకు కూడా టార్గెట్లు పెట్టారు. సబ్జెక్టులవారీగా మంచి స్కోర్ చేసిన స్కూళ్లను ఎంపిక చేసి అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. తల్లిదండ్రులు కూడా ఇదే స్థాయిలో పిల్లల చదువుపై దృష్టి పెట్టారు. పిల్లలకంటే ముందే నిద్రలేచి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. పిల్లలను కనిపెట్టుకుని ఉంటున్నారు.
పరీక్షలపైనే దృష్టి
ఇది కీలక సమయం. పిల్లలకు పరీక్షలయ్యే వరకు ఏ పనికీ వెళ్లదల్చకోలేదు. వారిని ఎలా చదివించాలనే అంశాలపైనే దృష్టి పెడుతున్నాం. వాళ్లకు ఏం కావా లో దగ్గరుండి చూసుకుంటున్నాం. కంటిమీద కును కు లేకున్నా వాళ్ల భవిష్యత్ కోసమే పనిచేస్తున్నాం. –ఎస్‌కే జబ్బర్ (విద్యార్థి తండ్రి, జడ్బర్ల)
మార్కులు పెంచేలా ప్రిపరేషన్
ఒకటికి పదిసార్లు ముఖ్యమైన ప్రశ్నలపై తర్ఫీదు ఇస్తున్నాం. సబ్జెక్టువారీగా అధ్యాపకులను అందుబాటులో ఉంచుతున్నాం. విద్యార్థులకు ఇబ్బందిగా ఉన్న చాప్టర్స్‌పై ఎక్కువగా దృష్టి పెడుతున్నాం. త్వరగా గుర్తుండిపోయేలా శిక్షణలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. –ఆర్ పార్వతిరెడ్డి (హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, ఖమ్మం)
మెరుగైన ఫలితాల కోసం
ప్రభుత్వ జూనియర్ కాలేజీల విద్యార్థులూ మంచి ర్యాంకులు పొందేలా అధ్యాపకులు కృషి చేస్తున్నారు. ముఖ్యమైన ప్రశ్నలతో పాటు, గతంలో వచ్చిన ప్రశ్నలను గుర్తించి.. ఈసారి తేలికగా పరీక్షలు రాసేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నాం.
– మాచర్ల రామకృష్ణగౌడ్ (ప్రభుత్వ జూనియర్ కాలేజీ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు)
క్షణం తీరిక ఉండటం లేదు
పరీక్షలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ విద్యార్థులు, టీచర్లకు క్షణం కూడా తీరిక ఉండటం లేదు. ప్రభుత్వం సరఫరా చేసిన దీపికల ద్వారా విద్యార్థి తేలికగా పరీక్షలకు సన్నద్ధమయ్యేలా చూస్తున్నాం. – ఆర్ రాజగంగారెడ్డి (ప్రభుత్వ గెజిటెడ్ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు)
Comments
Please login to add a commentAdd a comment