tenth students
-
ఇంగ్లిష్ 'పది'లం
మా లాంటి పేదలకు అండగా సీఎం గిరిజన ప్రాంతంలో జన్మించిన నేను ప్రారంభంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నా. జగన్ మావయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నా. ప్రస్తుతం జీకే వీధి ఇంగ్లిష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. జగన్ మావయ్య మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఉన్నత చదువులు చదివి మావయ్య ఆశయాన్ని సాధిస్తా. మా అమ్మ కిల్లో జమున, నాన్న కిల్లో నవకుమార్ పోడు వ్యవసాయం చేస్తారు. ఆ ఆదాయంతో నన్ను చదివించేవారు. ఇప్పుడు ఇంగ్లిష్ మీడియం స్కూల్లో ఉచితంగా వసతి కల్పిస్తున్నారు. టీచర్లు బాగా బోధిస్తున్నారు. – కె.ధారామణి, ఇంగ్లిష్ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాల, జీకే వీధి, అల్లూరి జిల్లా సాక్షి, అమరావతి: విద్యా రంగంలో సమూల సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాలుగేళ్ల క్రితం తలపెట్టిన చదువుల యజ్ఞం సత్ఫలితాలనిస్తోంది. మన విద్యార్థులు అంతర్జాతీయంగా సత్తా చాటుకునేలా దూరదృష్టితో ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన ఇంగ్లిష్ మీడియం చదువులకు ఆదరణ పెరుగుతోంది. ఇన్నాళ్లూ మాతృభాష ముసుగులో పేద బిడ్డల ఇంగ్లిష్ చదువులకు అడ్డుపడుతూ కొందరు పెత్తందార్లు కార్పొరేట్ విద్యా సంస్థల కొమ్ము కాశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో పేద విద్యార్థుల కోసం ఇంగ్లీషు మీడియం తీసుకొస్తే తెలుగును అణగదొక్కుతున్నారంటూ విష ప్రచారం చేశారు. అందరూ ఆంగ్లంలోనే చదివితే తమ పరిస్థితి ఏం కావాలని కార్పొరేట్ విద్యా సంస్థలు బెంబేలెత్తాయి. ఇవన్నీ అధిగమిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలు మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియంలో టెన్త్ పరీక్షలు రాసే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సర్కారీ స్కూళ్లలో గత ఐదేళ్లలో దాదాపు 25 శాతం మంది విద్యార్థులు తెలుగు నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మారిపోయి పదో తరగతి పరీక్షలకు హాజరైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఇంగ్లీషు మీడియం చదువులను ముఖ్యమంత్రి జగన్ అందిస్తుండటం తెలిసిందే. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో అత్యధిక విద్యార్థులు తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మారారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తదితరాలతో కిట్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. విద్యార్ధులు సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలుగా బైలింగ్యువల్ పాఠ్యపుస్తకాలను సమకూరుస్తోంది. ఇప్పటివరకు జగనన్న విద్యా కానుక కింద రూ.3,366.53 కోట్లను వ్యయం చేయగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యా కానుక నిధులను సిద్ధం చేస్తూ రూ.1,042.51 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ► వచ్చే నెలలో టెన్త్ పరీక్షలు రాయనున్న మొత్తం విద్యార్ధులు 6.23 లక్షల మంది ఉండగా ఏకంగా 4.51 లక్షల మందికిపైగా ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు రాయనుండటం గమనార్హం. వీరిలో ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న వారు ఏకంగా 3.97 లక్షల మంది ఉన్నారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ స్కూళ్లలో చదువుతున్న వారి సంఖ్య 2.25 లక్షల వరకు ఉంది. ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య త్వరలోనే వంద శాతానికి చేరుతుందంని విద్యావేత్తలు, నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాలకు పదును పెడుతూ టోఫెల్ శిక్షణ సైతం అందుబాటులోకి తెచ్చిందని ఉదహరిస్తున్నారు. ► చంద్రబాబు హయాంతో పోలిస్తే ఐదేళ్లలో పరిస్థితి తిరగబడింది. సీఎం జగన్ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలో రాయనున్న విద్యార్ధులు 72.54 శాతానికి పెరిగారు. ఈసారి తెలుగు మీడియంలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్ధులు 26.74 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగతా అతి స్వల్ప శాతం విద్యార్థులు ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా భాషల్లో చదువుతున్న వారున్నారు. ► టీడీపీ హయాంలో ఇంగ్లీషు మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 2.88 లక్షలు కాగా ఇప్పుడు ఏకంగా 4.51 లక్షలకు పెరిగింది. గత సర్కారు హయాం కంటే ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసే వారి సంఖ్య 1.63 లక్షలు పెరగడం గమనార్హం. వీరంతా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో చదివిన విద్యార్థులే కావడం మరో విశేషం. పరీక్షలపై సీఎస్ సమీక్ష వచ్చే నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, ఇతర భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లును సమీక్షించాలని ఆదేశించారు. మంచినీటి సౌకర్యంతో పాటు బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్ సౌకర్యాలుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్ పోలీస్ స్క్వాడ్లను నియమించాలని ఎస్పీలను ఆదేశించారు. జగన్ మావయ్య ఆశయాన్ని సాధిస్తా గిరిజన ప్రాంతంలో జన్మించిన నేను ప్రారంభంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నా. జగన్ మావయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నా. ప్రస్తుతం జీకే వీధి ఇంగ్లీష్ మీడియం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. జగన్ మావయ్య ఇంగ్లీష్ మీడియం పెట్టి మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఉన్నత చదువులు చదివి మావయ్య ఆశయాన్ని సాధిస్తా. మా అమ్మ కిల్లో జమున, నాన్న కిళ్లో నవకుమార్ పోడు వ్యవసాయం చేస్తారు. వాటి నుంచి వచ్చే ఆదాయంతో నన్ను చదివించేవారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉచితంగా మాకు వసతి కల్పిస్తున్నారు. స్కూల్లో టీచర్లు చాలా బాగా బోధిస్తున్నారు. – కె.ధారామణి, ఇంగ్లీష్ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాల, జీకే వీధి, అల్లూరి జిల్లా. కోరిక నెరవేరింది మా ఊరి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివా. ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్నది నా చిన్ననాటి కోరిక. పేదరికం కారణంగా నా ఆశ నెరవేరదేమో అనుకున్నా. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడంతో నా కోరిక నెరవేరింది. ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో ఆరో తరగతి చదువుతున్నా. జగన్ మామకు మేమంతా రుణపడి ఉంటాం. మా అమ్మ చిలకమ్మ నన్ను కాన్వెంట్లో ఇంగ్లీషు మీడియంలో చదివించాలని బలంగా కోరుకునేది. దళితులమైనందున పేదరికంతో కాన్వెంట్లో చదివించలేకపోయింది. ప్రభుత్వ స్కూళ్లలో జగనన్న ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో మా అమ్మ కోరిక నెరవేరింది. –సామాబత్తుల లక్ష్మి, కాకినాడ జిల్లా, సంపర ప్రాధమిక పాఠశాల మా అదృష్టం.. కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పడం మా అదృష్టం. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవడానికి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి ఇంగ్లీష్ మీడియం పునాదిగా ఉపయోగపడుతుంది. మా తల్లిదండ్రులు నాగరాజు, పద్మావతి బేల్దారి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మాలాంటి పేదలకు ఇంగ్లీష్ మీడియం అందించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. –తలారి శ్వేత, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం -
ఇద్దరు టెన్త్ విద్యార్థినుల ఆత్మహత్య
సాక్షి, యాదాద్రి, భువనగిరి క్రైం: భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్, సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్‌కి వెళ్లగా .. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. యూనిఫాం చున్నీలతో ఉరేసుకుని.. గదికి వెళ్లిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్‌కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కన్పించారు. వారు వెంటనే ట్యూషన్ టీచర్ విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. మమ్మల్ని ఒకే దగ్గర సమాధి చేయాలి టెన్త్ విద్యార్థినుల గదిలో దొరికిన సూసైడ్ నోట్‌ను తోటి విద్యార్థినులు పోలీసులకు అప్పగించారు. ‘మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేము చేయని తప్పుకు అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు పడలేక పోతున్నాం. మా శైలజ మేడం తప్ప ఎవ్వరూ మమ్మల్ని నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకేచోట సమాధి చేయండి. మా ఆఖరి కోరిక ఇది..’ అంటూ భవ్య, వైష్ణవి నోట్ రాశారు. భవ్య 3 వతరగతి నుంచి ఇదే వసతి గృహంలో ఉంటున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన వీరి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఏడవ తరగతి విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో భవ్య, వైష్ణవికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వార్డెన్ శైలజ తెలిపారు. కాగా ఈ ఘటనపై వసతి గృహంలోని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. -
టెన్త్ విద్యార్థులకు యూడైస్ టెన్షన్
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు కొత్త చిక్కు వచ్చిపడేలా ఉంది. యూడైస్‌లో పేరు లేకుంటే పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఇవ్వకూడదని విద్యాశాఖ భావిస్తోంది. దీనివల్ల దాదాపు లక్ష మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిణామం విద్యార్థుల తల్లిదండ్రులను కలవర పెడుతుండగా.. ఇప్పటికిప్పుడు ఈ నిబంధన తేవడం సరికాదని ఉపాధ్యాయులూ అంటున్నారు. యూడైస్ అప్డేట్లో క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించాలని సూచిస్తున్నారు. పాఠశాల విద్యా డైరెక్టరేట్ మాత్రం ఇవేవీ పట్టించుకునేందుకు సిద్ధంగా లేకపోవడం సమస్యకు దారి తీస్తోంది. ఈ నెల 28వ తేదీ నాటికి యూడైస్‌లో విద్యార్థులందరి పేర్లు చేర్చాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే గడువు ముగిసే నాటికి దాదాపు 45 శాతం మంది విద్యార్థుల పేర్లు ఎక్కించే అవకాశం లేకుండా పోయింది. ఈ ఏడాది టెన్త్ పరీక్షలు 5 లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పాత రికార్డు లేకుంటే అంతే... ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో ప్రతి విద్యార్థి సమగ్ర వివరాలు చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థి ఎక్కడ చదివింది, వారి టీసీల వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా లభించే ప్రతి ప్రయోజనానికి (సంక్షేమ పథకం) యూడైస్‌నే ప్రామాణికంగా తీసుకోవాలన్నది విద్యాశాఖ ఆలోచన. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకూ విద్యార్థికి అంతకుముందు ఎక్కడ చదివిందీ తెలిపే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ (టీసీ)తో పనిలేదు. ఈ మేరకే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను టీసీలు లేకున్నా 8వ తరగతిలో చేర్చుకున్నాయి. స్కూల్ ఫీజు చెల్లించని విద్యార్థులకు కొన్ని ప్రైవేటు స్కూళ్ళు టీసీలు ఇవ్వకుండా ఆపాయి. ఈ కారణంగా రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు టీసీల్లేకుండానే ఇతర స్కూళ్ళల్లో చేరారు. ఇంతే కాకుండా చాలా స్కూళ్ళు కింది తరగతుల్లో అనుమతులు లేకుండానే విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ కారణంగానూ విద్యార్థుల వివరాలు లభించని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో యూడైస్ కోసం పాత రికార్డు ఎలా తేవాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. టెన్త్ విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు యూడైస్ సాధ్యాసాధ్యాలను ఉన్నతా ధికారులు గుర్తించాలి. క్షేత్రస్థాయిలో ఎదుర య్యే సమస్యలను అర్థం చేసుకోవాలి. యూ డైస్లో పేరులేదని పరీక్ష ఫీజు కట్టించుకోని పరిస్థితి వస్తే, అనేకమంది టెన్త్ విద్యార్థులు ఇబ్బందులు పడతారు. పరీక్షలు దగ్గరప డుతున్న సమయంలో వారిని మానసికంగా దెబ్బతీయడం సరైన చర్య కాదు. – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి) వెసులుబాటు ఇవ్వకపోతే ఇబ్బందులే విద్యార్థి 8 నుంచి ఒకే స్కూల్లో ఉన్నప్పుడు దాన్నే ప్రామాణికంగా తీసుకుని యూడైస్‌లో చేర్చే ఆప్షన్ ఇవ్వాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఇందులోని ఇబ్బందులను విద్యా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాయి. అప్పటివరకూ తాము యూడైస్‌లో చేర్చే ప్రక్రియ పూర్తి చేయలేమంటున్నాయి. ఆన్లైన్ ఈ మేరకు సాంకేతిక వెసులుబాటును కల్పించాలని కోరుతున్నాయి. -
తిరుపతిలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం!
సాక్షి, తిరుపతి: జిల్లాలో బుధవారం విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేగింది. నెహ్రూ నగర్లో ఉన్న శ్రీ అన్నమయ్య స్కూల్లో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్ధినులు, ఇద్దరు విద్యార్థులు కనిపించకుండా పోయారు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం స్టడీ అవర్స్ పేరుతో ఇంటి నుంచి వెళ్లిన వాళ్లు.. తిరిగి రాలేదని తెలుస్తోంది. ఈ మేరకు సీసీ కెమెరాల్లో వాళ్ల దృశ్యాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం తల్లిదండ్రులు ఫిర్యాదు ఆధారంగా.. పోలీసులు వాళ్ల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. -
పెండింగ్ ఫీజులు.. కడితేనే పరీక్షకు..
సాక్షి, హైదరాబాద్: పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయి. ట్యూషన్, రవాణా, ఇతర ఫీజులు చెల్లిస్తే తప్ప పరీక్ష ఫీజు కట్టించుకోమని తేల్చిచెబుతున్నాయి. ఈ నెల 15కల్లా విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. దీంతో విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. కొన్ని పాఠశాలలు కోవిడ్ కాలంలో పెండింగ్‌లో ఉన్న ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నాయి. ట్యూషన్ ఫీజు సగం చెల్లించిన వారికీ తిప్పలు తప్పడం లేదు. టెన్త్ పరీక్షల తర్వాత విద్యార్థులు పాఠశాలను విడిచి వెళ్తారని, అప్పుడు వసూలు చేయడం కష్టమని యాజమాన్యాలు భావిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఫలానా తేదీకల్లా మొత్తం ఫీజు చెల్లిస్తామని స్థానిక పెద్దల సమక్షంలో కొన్ని స్కూళ్లు హామీ పత్రాలు రాయించుకుంటున్నాయి. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఈ వెసులుబాటు ఇచ్చేందుకు బడులు సుముఖంగా లేవు. వచ్చే మార్చిలో టెన్త్ పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య 5 లక్షల వరకూ ఉంటుంది. ఇందులో 3 లక్షల మంది ప్రైవేటు బడుల విద్యార్థులు ఉన్నారు. సర్కారీ బడుల్లోనూ... ప్రభుత్వ బడుల్లో చదివే పేద విద్యార్థులకు రూ.125 పరీక్ష ఫీజు చెల్లించడం కూడా కష్టంగా ఉంటోంది. వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూల్స్, గురుకులాల్లో ప్రభుత్వమే ఈ ఫీజు చెల్లిస్తుంది. కానీ కొన్ని మారుమూల గ్రామాల్లోని పాఠశాలల్లో స్వచ్ఛంద సంస్థలు పరీక్ష ఫీజులు చెల్లిస్తున్నాయి. మరికొన్ని చోట్ల మాత్రం విద్యార్థులు చెల్లించాల్సి వస్తోంది. అయితే, వాస్తవ ఫీజుకు అదనంగా రూ.75 అధికంగా వసూలు చేస్తున్నారని కరీంనగర్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఫిర్యాదులొచ్చాయి. పరీక్షలకు సంబంధించి జిల్లా, మండల కేంద్రాలకు వెళ్లాల్సి రావడంతో అదనంగా వసూలు చేయాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులకు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై విద్యాశాఖ ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. నిర్ణీత ఫీజు కన్నా ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని ఇటీవల జిల్లా అధికారులను హెచ్చరించారు. నిబంధనలు గాలికి.. వాస్తవానికి టెన్త్ విద్యార్థులకు పరీక్ష ఫీజు రూ.125. దీన్ని బ్యాంకు చలాన్ ద్వారా సమర్పించే వెసులుబాటు కూడా ప్రభుత్వం కల్పించింది. అయితే, ప్రైవేటు స్కూళ్లు మాత్రం ఫీజు తమకే చెల్లించాలని పట్టుబడుతున్నాయి. అది కూడా ప్రభుత్వం ప్రకటించిన ఫీజు కాకుండా రూ. వెయ్యి నుంచి రూ. 2 వేల వరకూ వసూలు చేస్తున్నాయి. తాము బోర్డుకు చెల్లించే సమయంలో అనేక ఖర్చులుంటాయని యాజమాన్యాలు కుంటిసాకులు చెబుతున్నాయి. ప్రభుత్వ గుర్తింపునకు అయ్యే ఖర్చు కూడా ఇందులోనే ఉంటుందని బుకాయిస్తున్నారు. పరీక్ష ఫీజుకు మాత్రం ఎలాంటి రసీదులు ఇవ్వడం లేదని తల్లిదండ్రులు అంటున్నారు. ఈ క్రమంలో పెండింగ్ ఫీజుల విషయంలోనూ యాజమాన్యాలు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తున్నారు. విద్యార్థుల నుంచి డొనేషన్లు, ట్యూషన్ ఫీజుల రూపంలో స్కూల్‌ను బట్టి రూ.30 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకూ వసూలు చేస్తున్నారు. పాఠశాల ప్రారంభంలో సగం ఫీజు వసూలు చేసిన యాజమాన్యాలు ఇప్పుడు మిగతా సగం కోసం ఒత్తిడి చేస్తున్నాయి. -
షాకింగ్ ఘటన.. టెన్త్ విద్యార్థిని కత్తితో పొడిచి చంపిన క్లాస్మేట్స్
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పదో తరగతి చదువుతోన్న 17 ఏళ్ల బాలుడిని ఐదుగురు తోటి విద్యార్థులు దారుణంగా పొడిచి హత్య చేశారు. క్లాస్మేట్స్ దాడిలో తీవ్రంగా గాయపడిన బాలుడిని.. ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాధిత విద్యార్థి దీపాన్షుగా గుర్తించారు. విద్యార్థి హత్యపై వివరాలు వెల్లడించారు డిప్యూటీ కమిషనర్(వాయవ్య) ఉషా రంగ్నాని. పోలీసుల వివరాల ప్రకారం.. సెప్టెంబర్ 29న ఆదర్శ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు విద్యార్థిని కొంత మంది విద్యార్థులు కత్తులతో పొడిచినట్లు ఫోన్ వచ్చింది. ఆ వెంటనే సిబ్బంది అక్కడికి చేరుకుని ఐపీసీ సెక్షన్ 302, 307, 34 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐదుగురు నిందితులతో బాధితుడు గొడవ పడినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఆ పగతో దీపాన్షును బటన్ నైఫ్‌తో పొడిచి హత్య చేశారు. ఆ ఆయుధాన్ని ఆన్లైన్లో కొనుగోలు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. దర్యాప్తులో భాగంగా సీసీటీవీ కెమెరాలను పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు. లాల్ బాఘ్, ఆజాద్‌పుర్ ప్రాంతాలకు చెందిన ఐదుగురు జువైనల్‌లను ఘటన జరిగిన రెండు గంటల్లోనే అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఇదీ చదవండి: 42 కార్లతో పంజాబ్ సీఎం కాన్వాయ్.. ‘వీఐపీ కల్చర్’ అంటూ విమర్శలు! -
పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం పరీక్షల కోసం 2,06,648 మంది దరఖాస్తు చేసుకోగా 1,91,846 మంది పరీక్షలు రాశారు. వీరిలో 1,23,231 మంది ఉత్తీర్ణులయ్యారు. 64.23 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విజయవాడలో ఈ ఫలితాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా వల్ల విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నందున వారికి కంపార్టుమెంటల్ పాస్‌గా కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా డివిజన్లు కేటాయించినట్లు తెలిపారు. 22,236 మందికి ఫస్ట్ డివిజన్, 46,725 మందికి సెకండ్ డివిజన్, 54,249 మందికి థర్డ్ డివిజన్ దక్కాయి. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 46.66 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కాగా ఇంతకుముందు నిర్వహించిన పదో తరగతి రెగ్యులర్ పరీక్షల్లో 67.26 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. దీనికి ఇప్పుడు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఉత్తీర్ణతను కూడా కలిపితే 6,06,070 లక్షల మందికి 5,37,491 మంది (88.68 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. గత ప్రభుత్వంలో మాదిరిగా మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహించి.. కృత్రిమంగా ఉత్తీర్ణతను పెంచే చర్యలకు తమ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందని మంత్రి బొత్స చెప్పారు. ఆ మీడియా కథనాలు అసత్యం.. ప్రతి ఒక్క విద్యార్థిని ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్ది.. వారికి మంచి భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి బొత్స తెలిపారు. ఇందుకోసం అనేక సంస్కరణలను ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. పాఠశాలలు విలీనం అంటూ కొన్ని పత్రికలు, ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఆ పత్రికలు రాస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఇటీవల తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి ఇలాంటి వార్తలు వచ్చాయని అక్కడికి తాను, పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వెళ్లి పరిశీలించామన్నారు. ఆ స్కూళ్లలో తరగతి గదులు లేవని, ఒకే గదిలో పలు తరగతుల విద్యార్థులను కూర్చోబెడుతున్నారని తప్పుడు వార్తలు రాశాయన్నారు. కానీ ఆ స్కూళ్లలో ప్రస్తుత తరగతుల విద్యార్థులకు అదనంగా మిగులు గదులున్నాయని తెలిపారు. 99 శాతం మంది తల్లిదండ్రులు సమర్థిస్తున్నారు.. 99 శాతం మంది తల్లిదండ్రులు స్కూళ్ల మ్యాపింగ్‌ను సమర్థిస్తున్నారని మంత్రి బొత్స చెప్పారు. ఒక్క శాతం మంది కోసం మొత్తం మ్యాపింగ్నే రద్దు చేయాలనడం సరికాదన్నారు. తమ పిల్లలను మంచి చదువుల కోసం తల్లిదండ్రులు ఎక్కడ మంచి స్కూలు ఉంటే అక్కడికి పంపిస్తారని.. దూరాభారం వంటివి చూడరని చెప్పారు. మూడు కిలోమీటర్లు దూరమవుతుందన్న ఉద్దేశంతోనే మ్యాపింగ్‌ను ఒక కిలోమీటర్‌కు తగ్గించినట్లు వివరించారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. జీవో 117 వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయని ఎమ్మెల్సీలు తమ దృష్టికి తేగానే వాటిని సవరించి మార్పులు చేశామన్నారు. కానీ ఆ ఎమ్మెల్సీలు బస్సుయాత్రలు పెట్టి తిరుగుతున్నారని తప్పుపట్టారు. ఉద్యోగులు ఇబ్బందులు ఉంటే ప్రభుత్వాన్ని అడగవచ్చన్నారు. అంతేతప్ప రాజ్యాంగవిరుద్ధంగా ప్రభుత్వ విధాన నిర్ణయాలను ప్రశ్నించరాదని స్పష్టం చేశారు. జేఈఈ కౌన్సెలింగ్ ఈఏపీసెట్ అడ్మిషన్లు.. జేఈఈ (జోసా) కౌన్సెలింగ్ అనంతరమే రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మా తదితర కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈసారి ఈఏపీసెట్ అడ్మిషన్లలో ప్రైవేటు కాలేజీల్లో 30 శాతం, యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించిన ఫైల్ పరిశీలనలో ఉందన్నారు. కొన్ని వివరణలు అడిగామని, అవి వచ్చాక ఉత్తర్వులు వెలువడతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులపై యాప్‌ల భారం పడుతుందన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. సమస్య ఎక్కడ ఉందో తెలిపితే పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆగస్టు 15 కల్లా ప్రవేశాల ప్రక్రియ పూర్తవుతుందని, అనంతరం పిల్లల చేరికల గణాంకాలపై స్పష్టత వస్తుందన్నారు. ప్రయివేటు స్కూళ్లను మూసివేయించాలన్నది ప్రభుత్వ విధానం కాదని స్పష్టం చేశారు. గత విద్యా సంవత్సరం వరకు 6 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రభుత్వ స్కూళ్లలో అదనంగా చేరారని వివరించారు. నాడు నేడు, జగనన్న విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, ఇంగ్లిష్ మీడియం, సీబీఎస్ఈ విధానం ఇలా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఉన్నత ప్రమాణాల కోసమే.. విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన బోధనను అందించేందుకు వీలుగా 3, 4, 5 తరగతులను హైస్కూళ్లకు మ్యాపింగ్ చేస్తున్నామే తప్ప విలీనం చేయడం లేదని మంత్రి స్పష్టం చేశారు. జాతీయ విద్యావిధానంలో పేర్కొన్న మేరకు సీబీఎస్ఈ సిలబస్‌కు అనుగుణంగా పాఠశాల విద్యలో మార్పులు తెస్తున్నామన్నారు. ఎక్కడైనా ఇబ్బందులు ఎదురైతే వాటిని మళ్లీ పరిశీలన చేయించి సరిదిద్దుతున్నామన్నారు. తరగతుల మ్యాపింగ్‌పై ఎమ్మెల్యేలకు లేఖలు రాసి వారి అభిప్రాయాలు సేకరించామన్నారు. 5,800 స్కూళ్లను మ్యాపింగ్ చేస్తే 400 స్కూళ్లలోనే చిన్న చిన్న సమస్యలు ఉన్నట్లు ఎమ్మెల్యేలు తెలిపారన్నారు. వాటిని కూడా పరిష్కరిస్తామని తెలిపారు. -
టెన్త్ సప్లిమెంటరీ 2,07,160, బెటర్మెంట్ పరీక్షలకు 8,609 మంది విద్యార్థులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదోతరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, బెటర్మెంట్ పరీక్షలు బుధవారం ప్రారంభం కానున్నాయి. ఈనెల 15వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్సెస్సీ బోర్డు డైరెక్టర్ డి.దేవానందరెడ్డి తెలిపారు. 986 కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 8.30 నుంచి 9.30 గంటలలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకుని రిపోర్టు చేయాల్సి ఉంటుంది. తొలిసారిగా ఈసారి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీతోపాటు బెటర్మెంట్ పరీక్షను కూడా బోర్డు నిర్వహిస్తోంది. ఎస్సెస్సీ రెగ్యులర్ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయని కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు భావిస్తుండటంతో మార్కులు పెంచుకునేందుకు ఈ బెటర్మెంట్ అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 2,07,160 మంది, బెటర్మెంట్ పరీక్షలకు 8,609 మంది హాజరుకానున్నారు. ఇంతకుముందు పరీక్షల నిర్వహణలో తలెత్తిన సమస్యలు, ఇతర అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సెస్సీ బోర్డు అనేక జాగ్రత్తలు చేపట్టింది. అన్ని కేంద్రాలను నోఫోన్ జోన్లుగా ప్రకటించింది. చీఫ్ సూపరింటెండెంట్లతో సహా ఏ ఒక్కరూ పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడానికి వీల్లేదు. డిజిటల్ డివైజ్‌లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పోలీసులతో కూడిన మొబైల్ స్క్వాడ్లను ఏర్పాటుచేసింది. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఉంటుంది. -
AP SSC Supplementary 2022: సప్లిమెంటరీలో పాసైనా 'రెగ్యులరే'
సాక్షి, అమరావతి: పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయామని ఆవేదన, ఆందోళన చెందాల్సిన పనిలేకుండా రాష్ట్రంలోని టెన్త్ 2022 బ్యాచ్ విద్యార్థులకు ఉపశమనం కలిగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తదుపరి విద్యాభ్యాసానికి ఆటంకం కలగకుండా ఉండేందుకు వీరికి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను నెలరోజుల్లోనే నిర్వహించి ఫలితాలను ప్రకటించనుంది. అంతకన్నా ముఖ్యంగా సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022–ఏప్రిల్ రెగ్యులర్ బ్యాచ్ విద్యార్థులతో సమానంగా పరిగణించనుంది. నిబంధనల ప్రకారం రెగ్యులర్ పరీక్షల్లో ఉత్తీర్ణులకు వారికి వచ్చిన మార్కులను అనుసరించి ఫస్ట్, సెకండ్, థర్డ్ డివిజన్లలో పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్ పాస్‌గానే పరిగణిస్తుంటారు. ఆమేరకు ధ్రువపత్రాలు జారీచేస్తారు. అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు లేక చదువులు కుంటుపడిన విద్యార్థులు టెన్త్ పరీక్షల్లో కొంతవరకు ఇబ్బందులకు గురైనందున వారికి మేలు చేకూరేలా సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే ‘కంపార్టుమెంటల్ పాస్’ను ఈ విద్యాసంవత్సరం వరకు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు విద్యాశాఖ దీనిపై ఉత్తర్వులు జారీచేయనుంది. ఈసారి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను కంపార్టుమెంటల్‌గా కాకుండా రెగ్యులర్ విద్యార్థులతో సమానంగా పరిగణిస్తారు. వారు సాధించిన మార్కులను అనుసరించి ఫస్ట్‌క్లాస్, సెకండ్‌క్లాస్, థర్డ్‌క్లాస్‌లుగా డివిజన్లను ప్రకటిస్తారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టెన్త్ ఫలితాల విడుదల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు కూడా. గ్రేస్ మార్కులు కలపాలని పలువర్గాల నుంచి అందుతున్న వినతులపైనా ప్రభుత్వంలో ఉన్నతస్థాయిలో చర్చించింది. అయితే ఫెయిలైన సబ్జెక్టులకు పదివరకు గ్రేస్ మార్కులు కలిపినా మరో ఐదుశాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యే అవకాశముంది తప్ప అందరికీ ప్రయోజనం కలగదు. ప్రస్తుతం టెన్త్ ఉత్తీర్ణత శాతం 67.26 శాతం కాగా అది 73 శాతానికి చేరుతుందని అధికారులు పేర్కొంటున్నారు. దీనికన్నా సప్లిమెంటరీ పరీక్షల్లో విద్యార్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా డివిజన్లు ఇవ్వడం వల్ల అత్యధిక శాతం మందికి మేలు జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. విద్యార్థులు గ్రేస్ మార్కులతో పాస్ అయినట్లుగా కాకుండా సొంతంగా పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించినట్లు అవుతుందని వివరిస్తున్నారు. ఈసారి టెన్త్ పరీక్షల్లో 2 లక్షలమంది విద్యార్థులు ఫెయిలైన నేపథ్యంలో వారిని అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఈ విద్యార్థులు తప్పిన సబ్జెక్టులపై పాఠశాలల్లో ఈనెల 13వ తేదీ నుంచి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనుంది. సప్లిమెంటరీలో వారు తప్పనిసరిగా ఉత్తీర్ణులయ్యేలా బోధన సాగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఆయా సబ్జెక్టు టీచర్లను అన్ని స్కూళ్లలోను సన్నద్ధం చేయిస్తోంది. పరీక్షలు పూర్తయ్యేవరకు ఈ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నారు. తప్పిన విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా వారికి ప్రత్యేక తర్ఫీదు ఇవ్వనున్నామని అధికారులు చెప్పారు. 20 వరకు సప్లిమెంటరీ ఫీజు గడువు రాష్ట్రంలో టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూలై 6 నుంచి 15వ తేదీవరకు నిర్వహించనున్నారు. మంగళవారం నుంచే ఈ పరీక్షలకు ఫీజుల చెల్లింపు ప్రక్రియ ప్రారంభమైంది. ఫీజు చెల్లింపు గడువు ఈనెల 20వ తేదీవరకు ఉంది. రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ సమాచారంతో సంబంధం లేకుండా ఫెయిలైన వారంతా గడువులోగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఎక్కువ వచ్చిన మార్కుల పరిగణన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను.. ఉత్తీర్ణులైనవారు కూడా (ఇంప్రూవ్మెంట్ కోసం) రాసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. పాసైనా.. తమకు తక్కువ మార్కులు వచ్చాయని భావించే విద్యార్థులు, మరిన్ని మార్కులు సాధించాలనుకున్నవారు కూడా ఈ పరీక్షలు రాయవచ్చు. రెండింటిలో ఎక్కువ వచ్చిన మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. -
టెన్త్ పరీక్షలు రాస్తున్నారా? సక్సెస్‌బాట పట్టించే సూచనలు తెలుసుకోండి
పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు ఓ వైపు ఒత్తిడి, మరోవైపు వారిలో ఆందోళనను నివృత్తి చేసేందుకు వారికి ఉపాధ్యాయులు, అధికారులు పలు సూచనలు చేశారు. మైలార్‌దేవ్‌పల్లి (హైదరాబాద్): ఏకాగ్రత, ప్రణాళిక బద్ధంగా చదివితేనే విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు. పలు సూచనలు.. ► పరీక్షా సమయంలో సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్ల వైపు దృష్టి మరలకుండా చూసుకోవాలి. ప్రతి రోజు విద్యార్థి నిర్ధేశించుకున్న టైమ్ టేబుల్ ప్రకారం చదువుకోవాల్సి ఉంటుంది. ► ఉపాధ్యాయులు, స్నేహితులు, సీనియర్ల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సిద్ధమైతేనే విజయం మరింత సులభమవుతుంది. ► ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ముఖ్యంగా విద్యార్థులకు పరీక్ష సమాయాల్లో ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి. ► విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయడంతో పాటు అవసరమైన ధైర్యాన్ని అందించాలి. ► ఒత్తిడిని తగ్గించేందుకు వారికి సహకారం అందిస్తే అధిక సమయం చదువుకే కేటాయిస్తారు. ► తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన ఆహారం అందించాలి. ► విద్యార్థులు సమయానికి తగినట్లుగా నిద్రపోయేలా కుటుంబసభ్యులు చూసుకోవాలి. రెండు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించాం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదోతరగతి విద్యార్థులను పరీక్షలకు పూర్తి సన్నద్ధం చేశాం. ఇప్పటికే రెండు ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించి వారికి మనోధైర్యాన్ని కల్పించాం. గణితం, సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులలో మంచి మార్కులు వచ్చేలా ఎప్పటికప్పుడు తరగతులు నిర్వహిస్తున్నాం. మే 23 నుంచి జూన్ 1 వరకు పరీక్షలను నిర్వహిస్తున్నాం. –రామిరెడ్డి, ఎంఈఓ రాజేంద్రనగర్ సొంతంగా రాసిన జవాబులకే అధిక మార్కులు ఉపాధ్యాయులు ఇచ్చిన మెటీరియల్‌ను విద్యార్థులు చదువుకుని పాఠ్య పుస్తకాలపైనే దృష్టిసారించాలి. సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. సొంతంగా రా సిన జవాబులకే అధిక మార్కులు వేసే అవకాశం ఉంటుంది. –ఎన్.మాణిక్యంరెడ్డి, ఉపాధ్యాయుడు ఖాళీ కడుపుతో వెళ్లకూడదు విద్యార్థులు పరీక్షలకు వెళ్లే సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. పరీక్షలకు వెళ్లే ముందు తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ప్రశ్నా పత్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే జవాబులు రాయాలి. –డాక్టర్ సుభాష్, మైలార్‌దేవ్‌పల్లి 10 జీపీ సాధిస్తామనే నమ్మకం ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఎలాంటి ఒత్తిడి లేదు. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా వింటూ ఉపాధ్యాయులు ఇచ్చిన నోట్స్‌ను ఇప్పటికే చదివేశాం. పదికి పది జీపీ సాధిస్తామన్న విశ్వాసం ఉంది. –స్వాతి, పదో తరగతి విద్యార్థిని -
టెన్త్ విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్లు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో 2020 – 21 విద్యా సంవత్సరం పదో తరగతి ఫలితాలు విడుదల చేశామని, ఉన్నత విద్య కోసం పొరుగు రాష్ట్రాలకు వెళ్లేందుకు పరీక్ష రుసుముతో పాటు రూ.80 చెల్లించిన విద్యార్థులకు మైగ్రేషన్ సర్టిఫికెట్‌ను సంబంధిత పాఠశాల లాగిన్ లో పొందుపరిచామని ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు ఎ.సుబ్బారెడ్డి తెలిపారు. సర్టిఫికెట్ కలర్ కాపీని సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు అందజేయాలన్నారు. ఈ అవకాశం సెప్టెంబర్ 5 వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత విద్యార్ధులు మరోసారి రూ.80 రుసుము చెల్లించి, ఆన్లైన్లో ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకొని సర్టిఫికెట్ పొందాలని చెప్పారు. 2021 ఏడాది మాత్రమే కాకుండా అంతకు ముందు సంవత్సరాల్లో పదో తరగతి ఉత్తీర్ణులయిన విద్యార్థులు కూడా ఈ సంవత్సరం నుంచి మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం ఆన్లైన్లో ప్రభుత్వ పరీక్షలు సంచాలకుల కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తు తేదీ నుంచి 30 రోజుల వరకు మాత్రమే వెబ్సైట్లో సర్టిఫికెట్ ఉంటుందన్నారు. దరఖాస్తుకు విధివిధానాలు త్వరలో తెలియచేస్తామని చెప్పారు. -
ఆంధ్రప్రదేశ్: 1 నుంచి 9 తరగతులకు స్కూళ్లు బంద్
సాక్షి, అమరావతి: కోవిడ్ మహమ్మారి వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం నుంచి 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లు, హాస్టళ్లు, కోచింగ్ సెంటర్లను మూసివేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. 10వ తరగతి, ఇంటర్మీడియెట్ పరీక్షలను మాత్రం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యథావిధిగా నిర్వహించాలని స్పష్టం చేశారు. జూనియర్ కాలేజీల హాస్టళ్లు కూడా వార్షిక పరీక్షల వరకే తెరిచి ఉంచాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలని, మాస్కు ధరించకుంటే రూ.100 ఫైన్ విధించాలని ఆదేశించారు. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లలో భౌతిక దూరం పాటించటాన్ని తప్పనిసరి చేయాలని సూచించారు. కోవిడ్ నియంత్రణ చర్యలపై సీఎం జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 9వ తరగతి వరకు స్కూళ్లను మూసివేస్తున్నందున టెన్త్ విద్యార్థులను భౌతిక దూరం పాటించేలా దూర దూరంగా కూర్చోబెట్టి బోధన కొనసాగించవచ్చనే అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. ఇంటర్ ప్రాక్టికల్స్ కూడా పూర్తి కావస్తున్నందున ఈ దశలో ఆపాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. సమావేశంలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే.. 104 కాల్ సెంటర్‌కు విస్తృత ప్రచారం.... – 104 కాల్ సెంటర్‌కు మరింత విస్తృత ప్రచారం కల్పించాలి. కోవిడ్ సమస్యలన్నిటికీ ఆ నెంబరు పరిష్కార కేంద్రంగా ఉండాలి. – కన్వెన్షన్ సెంటర్లలో జరిగే ఫంక్షన్లలో రెండు కుర్చీల మధ్య కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూడాలి. – సినిమా థియేటర్లలో ప్రతి రెండు సీట్ల మధ్య తప్పనిసరిగా ఒక సీటు ఖాళీగా ఉంచాలి. – ఆస్పత్రులలో మంచి వైద్య సదుపాయాలు, వైద్యులు, శానిటేషన్ పక్కాగా ఉండేలా చూడాలి. – గ్రామాలు, వార్డులలో ఇప్పటికే వలంటీర్ల ద్వారా సర్వే చేపట్టి ఎవరైనా జ్వరంతో బాధ పడుతున్నా, అలాంటి లక్షణాలు కనిపించినా వెంటనే పరీక్షలు నిర్వహిస్తున్నాం. – అన్ని ఆస్పత్రులలో తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండాలి. విశాఖలోని ప్లాంట్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన వాటా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలి. అవసరమైతే ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుపై దృష్టి పెట్టండి. ఆక్సిజన్ సరఫరాకు ఒప్పందం రోజూ 310 టన్నుల ఆక్సిజన్ సరఫరాకు ఒప్పందాలు చేసుకున్నట్లు సమావేశంలో అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 146 ఆస్పత్రులలో 26,446 ఆక్సిజన్ సదుపాయాలున్న బెడ్లు ఉండగా పూర్తిస్థాయిలో సేవలకు రోజూ 347 కిలోలీటర్ల ఆక్సిజన్ అవసరం ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో 577 కిలోలీటర్ల పూర్తి స్థాయి ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం ఉందని, అది అన్ని ఆస్పత్రులకు ఒకటిన్నర రోజులకు సరిపోతుందన్నారు. అన్ని కోణాల్లో చర్చించాకే నిర్ణయం: మంత్రి సురేష్ ఒకటవ తరగతి నుంచి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఎలాంటి పరీక్షలు ఉండవని సమావేశం అనంతరం విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో అన్ని కోణాల్లో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయన్నారు. స్కూళ్లలో శానిటేషన్ పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇంటర్ ప్రాక్టికల్స్ జరిగే చోట కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించామన్నారు. సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కుటుంబ సంక్షేమ కమిషనర్ కాటమనేని భాస్కర్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్‌తో పాటు, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సొమ్ములిస్తే మార్కులేస్తాం..
భీమవరం: కరోనా వైరస్ కొన్ని విద్యాసంస్థలకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణత చేయిస్తామంటూ కొన్ని కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు గుంజుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని ఒక కార్పొరేట్ విద్యాసంస్థ తమ విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలుకు సంబంధించి ఫోన్లో మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కోవిడ్–19 కారణంగా మార్చి 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు బ్రేక్ పడింది. కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు పరీక్షలు నిర్వహించకుండా విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. 10వ తరగతి పరీక్షలను జూలై నెలలో నిర్వహిస్తామని ముందుగా ప్రకటించి ఆ మేరకు షెడ్యూల్‌ను కూడా విడుదల చేశారు. వైరస్ రోజురోజుకు విస్తరిస్తుండడంతో విద్యార్థులందరినీ ఒకచోట చేర్చి పరీక్షలు నిర్వహించడం వల్ల ఇబ్బందులు వస్తాయని భావించిన ప్రభుత్వం పదవ తరగతి పరీక్షలను రద్దు చేసింది. జిల్లా వ్యాప్తంగా సుమారు 50 వేల మంది పదో తరగతి విద్యార్థులు ఉండగా వీరిలో సుమారు 390 ప్రైవేటు హైసూ్కల్స్‌లో 17 వేల మందికి పైగా పదో తరగతి విద్యార్ధులున్నారు. సమ్మెటివ్ ఎస్సెస్మెంట్ పరీక్ష ఫలితాల ఆధారంగా గ్రేడ్ల నిర్ణయం పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు నిర్వహించకపోవడంతో విద్యాశాఖ ఇంతకు ముందు విద్యార్థులకు నిర్వహించిన ఫార్మటివ్ ఎస్సెస్మెంట్(ఎఫ్ఏ), సమ్మెటివ్ ఎస్సెస్మెంట్(ఎస్ఏ) పరీక్షల మార్కులు ఆధారంగా విద్యార్థులకు గ్రేడ్లు నిర్ణయించాలని ఆదేశాలిచ్చింది. కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు పదో తరగతి విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలుచేసి ఎక్కువ మార్కులు వేయడానికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. విద్యా సంవత్సరం ప్రారంభం అయిన నాటి నుంచి విద్యార్థులకు నాలుగు ఫార్మటీవ్ ఎస్సెస్మెంట్, ఒక సమ్మెటివ్ అస్సెస్మెంట్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ పరీక్షా ప్రశ్నాపత్రాలను ఆయా పాఠశాలల్లోని ఉపాధ్యాయులే తయారుచేస్తారు. అలాగే పరీక్షల అనంతరం వాటిని అక్కడి ఉపాధ్యాయులే వేల్యూయేషన్ చేసి మార్కులు వేస్తారు. వాటిని విద్యాశాఖ ఆన్లైన్ సీఎస్ఈ సైట్‌ను అప్లోడ్ చేస్తుంటారు. ప్రస్తుత విద్యాసంవత్సరం పూర్తిగా క్లాసులు జరగకపోవడంతో ఎఫ్ఏ పరీక్షలు మూడు నిర్వహించగా ఎస్ఏ పరీక్ష ఒకటి నిర్వహించారు. ఎస్ఏ పరీక్షలు నిర్వహించినా ఇంతవరకు వాటిని సీఎస్ఏ సైట్లో అప్లోడ్ చేయలేదని తెలిసింది. ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల మార్కులు ఆధారంగా గ్రేడ్లు నిర్ణయించడంతో కొన్ని ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు తమ విద్యార్థులకు ఫోన్లు చేసి గతంలో మీరు ఎఫ్ఏ పరీక్ష సరిగా రాయలేదని ప్రస్తుతం ఎస్ఏ పరీక్షలో అత్యధిక మార్కులు రాకుంటే మంచి గ్రేడ్ వచ్చే అవకాశం లేనందున సొమ్ములిస్తే మంచి మార్కులు వేస్తామంటూ బేరాలు పెట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా ఒక్కొక్క విద్యార్ధి నుంచి రూ.5 వేలు నుంచి రూ.8 వేలు వరకు వసూలు చేస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రుల ద్వారా తెలిసింది. గతంలో రాసిన ఎస్ఏ పరీక్ష పత్రం స్థానంలో సొమ్ములు ఇచ్చిన విద్యార్థులతో మళ్లీ జవాబులు రాయించి పాతపేపర్ల స్థానంలో వీటిని పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సొమ్ముల వసూలుపై ఎవరికైనా ఫిర్యాదు చేస్తే తమ బిడ్డల భవిష్యత్తు పాడవుతందనే భయంతో తల్లిదండ్రులు నోరు మెదపడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు భీమవరం ప్రాంతంలోని ఒక కార్పొరేట్ స్కూల్లో విద్యార్థుల నుంచి సొమ్ములు వసూలు చేస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదు. అక్కడ డీఐతో విచారణ చేయించాం. ఎక్కడైనా ఇటువంటి అవకతవకలకు పాల్పడితే ఆయా విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం. పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించక పోవడంతో ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్ష మార్కుల ఆధారంగానే విద్యార్థులకు గ్రేడ్ నిర్ణయించే అంశంపై ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. – సీవీ రేణుక, జిల్లా విద్యాశాఖాధికారిణి -
10-12 రోజుల్లో టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్నల్ మార్కుల ఆధారంగా టెన్త్ విద్యార్థులను పాస్ చేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఫలితాల వెల్లడిపై ప్రభుత్వ పరీక్షల విభాగం దృష్టి పెట్టింది. తమ వద్ద ఉన్న విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను ప్రాసె స్ చేసే ప్రక్రియను 10–12 రోజుల్లో పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు బోర్డు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు ఇంటర్నల్ మార్కుల ఆధారంగా ఫలితాలను వెల్లడించేందుకు అవసరమైన ఉత్తర్వుల జారీకి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఉత్తర్వు ల్లో ఉండాల్సిన మార్గదర్శకాలపై చర్చించింది. మంగళవారం రాత్రి లేదా బుధవారం ఇవి వెలువడే అవకాశం ఉంది. వాటితోపాటు కోర్టులోనూ కేసు ఉన్నందున కోర్టుకు తెలియజేయాల్సిన అంశాలపైనా అడ్వొకేట్ జనరల్ (ఏజీ)తో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్ చర్చించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, జీహెచ్ఎంసీలోని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల పరీక్షలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు తీర్పు చెప్పగా ప్రభుత్వం పరీక్షలనే రద్దు చేసింది. ఈ విషయాన్ని హైకోర్టుకు తెలియజేయాలని అధికారులు నిర్ణయించారు. పారదర్శకంగానే ఫలితాలు: మంత్రి సబిత పదో తరగతి ఫలితాలు పారదర్శకంగా ఉంటాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి శేఖర్‌రావు, మధుసూదన్ తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్వరలోనే ఫలితాలను ప్రకటిస్తామన్నారు. విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను స్కూళ్ల యాజమాన్యాలు ఆన్లైన్లో పంపినందున ఆ మార్కులను ఎవరూ మార్చే ప్రయత్నం చేయడం సాధ్యం కాదన్నారు. ఆన్లైన్లో అందిన మార్కులకు సైబర్ భద్రత ఉందని, తద్వారా ఫలితాల్లో పారదర్శకత ఉంటుందన్నారు. విద్యార్థులకు ఇంటర్నల్స్‌లో వచ్చిన వాస్తవ మార్కుల ఆధారంగా నే ఫలితాలు ఉంటాయని ఆమె వివరించారు. -
ఇంటికి టెన్త్ విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: పదోతరగతి పరీక్షలు వాయిదా పడటంతో సంక్షేమ శాఖల పరిధిలో వసతి పొందుతున్న విద్యార్థులు ఇంటిబాట పట్టారు. కోవిడ్ వ్యాప్తిని నిలువరించే క్రమంలో ప్రభుత్వం పదోతరగతి పరీక్షలను వాయిదా వేసింది.మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామనే అంశం తేల్చకపోవడంతో అప్పటివరకు పిల్లలు తల్లిదండ్రుల సంరక్షణలో ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది.దీంతో సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో వసతి పొందుతున్న విద్యార్థులను తల్లిదండ్రులు తీసుకెళ్తున్నారు. కేవలం సంక్షేమ వసతిగృహాల్లోని విద్యార్థులే కాకుండా గురుకుల పాఠశాలలు, ఆశ్రమ స్కూళ్ల విద్యార్థులు కూడా ఇదేవిధంగా వారి వారి ఇళ్లకు చేరుకుంటున్నారు. జాగ్రత్తలు వహిస్తేనే మంచిది కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు అవగాహన, జాగ్రత్త చర్యలే మేలని ప్రభుత్వం స్పష్టం చేసింది.ఈ క్రమంలో ఇళ్లకు వెళ్తున్న టెన్త్ విద్యార్థులకు సంబంధిత అధికారులు పలు సలహాలు, సూచనలు చేశారు.ఇప్పటికే వారికి హ్యాండ్ వాష్‌లు, మాస్కులను పంపిణీ చేయగా... వాటిని వెంట తీసుకెళ్లాలని అధికారులు ఆదేశించారు. అదేవిధంగా ఇళ్ల వద్ద ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మిగిలిన పరీక్షలకు ఎలా సన్నద్ధం కావాలనే విషయాలను పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులకు వివరించారు.ఈమేరకు ప్రత్యేకంగా తయారు చేసిన సూచిక పత్రాలను వారికి ఇచ్చారు. కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టిన వెంటనే పరీక్షలు జరిపే అవకాశం ఉండటంతో ఆమేరకు సిద్ధంగా ఉండాల్సిందిగా సూచించారు. రిజిస్టర్లో విద్యార్థుల వివరాలు పదోతరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థుల వివరాలను రికార్డు చేస్తున్నారు. గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాల వారీగా ఉన్న విద్యార్థులను సంబంధి త అధికారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రిజిస్టర్లో నమో దు చేస్తున్నారు. ఇళ్లకు వెళ్లిన ప్రతి విద్యార్థి ఫోన్ నంబర్లు, పూ ర్తి చిరునామాను అందులో రికార్డు చేస్తున్నారు. విద్యార్థులకు ఏవైనా సందేహాలు తలెత్తితే వాటిని నివృత్తి చేసుకునేందుకు వీలుగా సంబంధిత పాఠశాల/హాస్టల్‌కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక ఫోన్ నంబర్‌ను విద్యార్థులకు ఇస్తున్నారు. -
టెన్త్ విద్యార్థులకు దిల్కుష్..!
సాక్షి, హైదరాబాద్ : సంక్షేమ వసతిగృహాల్లోని పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తోంది. పాఠశాలలో ఇప్పటికే పాఠ్యాంశ బోధన పూర్తి కాగా పునఃశ్చరణ కార్యక్రమాలు జోరందుకున్నాయి. పాఠశాల నుంచి హాస్టల్‌కు వచ్చిన తర్వాతా రివిజన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించిన సంక్షేమ శాఖలు ఈ మేరకు ప్రత్యేక తరగతులకు తెరలేపాయి. గతేడాది నిర్వహించిన స్పెషల్ స్టడీ అవర్స్ అత్యుత్తమ ఫలితాలు ఇవ్వగా.. ఈసారి మరింత శ్రద్ధతో వీటిని నిర్వహించేందుకు ఉపక్రమించాయి. ఇప్పటికే ఎస్సీ అభివృద్ధి శాఖ స్పెషల్ స్టడీ అవర్స్‌ను నిర్వహిస్తుండగా.. పండుగ సెలవులు పూర్తయిన తర్వాత వెనుకబడిన తరగతుల, గిరిజన సంక్షేమ శాఖలు కూడా ప్రారంభించనున్నాయి. అదనపు శక్తి కోసం.. ప్రతిరోజు రాత్రి 7 నుంచి 8 గంటల తర్వాత భోజనం అనంతరం ప్రత్యేక స్టడీ అవర్స్ నిర్వహిస్తారు. రాత్రి 11 గంటల వరకు ఈ తరగతులు కొనసాగుతాయి. ప్రతి 45 నిమిషాలకు ఒక సబ్జెక్టు చొప్పున 4 సబ్జెక్టులను పునఃశ్చరణ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సందేహాలు తలెత్తితే వాటిని నివృత్తి చేసేందుకు ప్రత్యేకంగా ట్యూటర్ల ఏర్పాటుకు సంక్షేమ శాఖలు వెసులుబాటు కల్పించాయి. ఇందులో స్థానికంగా ఉన్న యువకులను భాగస్వామ్యం చేసుకోవచ్చని సూచించాయి. అదేవిధంగా విశ్రాంత ఉపాధ్యాయుడు లేదా సేవా దృక్పథం ఉన్న ఉపాధ్యాయులను కూడా భాగస్వామ్యం చేయవచ్చని స్పష్టం చేయడంతో చాలాచోట్ల యువతకు అవకాశం కల్పించారు. రాత్రి భోజనం తర్వాత దాదాపు 3 గంటలకు పైగా విద్యార్థులు మేలుకోవాల్సి ఉండటంతో వారికి అదనపు శక్తి కోసం స్నాక్స్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా నిధులిస్తున్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ మేరకు బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.15 నుంచి రూ.20 వరకు ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించింది. విద్యార్థులకు టీతోపాటు స్నాక్స్ కింద దిల్కుష్, దిల్పసంద్, సమోసా, జిలేబీ, మిర్చీ, ఎగ్ పఫ్, కర్రీ పఫ్ తదితరాలను పంపిణీ చేస్తున్నారు. అయితే ఈ స్నాక్స్ శుభ్రమైన, తాజాగా ఉన్న వాటినే ఇవ్వాలని నిబంధన విధించడంతో క్షేత్రస్థాయిలో వసతిగృహ సంక్షేమాధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నూరు శాతం ఫలితాలు సాధిస్తాం స్పెషల్ స్టడీ అవర్స్ అత్యుత్తమ ఫలితాలు ఇస్తున్నాయి. గతేడాది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 2017–18 విద్యా సంవత్సరంలో హాస్టల్ విద్యార్థుల ఉత్తీర్ణత 90 శాతం ఉండగా.. 2018–19లో 97.26 శాతానికి పెరిగింది. ఈ ఏడాది నూరు శాతం ఫలితాలు వస్తాయని భావిస్తున్నాం. ఆ మేరకు వసతిగృహ సంక్షేమాధికారులకు ఆదేశాలు జారీ చేశాం. తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయన్న నమ్మకం ఉంది. – పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు -
టెన్త్ విద్యార్థులకు గైడెన్స్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఆపై చదువుల కు ఏ కోర్సును ఎంపిక చేసుకోవాలన్న అంశంపై తర్జనభర్జన పడుతుంటారు. పదో తరగతి తర్వాత ఎంపిక చేసుకునే కోర్సులపైనే విద్యార్థుల కెరీర్ ఆధారపడి ఉంటుంది. గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు కోర్సుల ఎంపికపై గైడెన్స్ ఇచ్చే వారు ఉండరు. దీంతో విద్యార్థులకు కెరీర్‌పై గైడెన్స్ ఇప్పించే బాధ్యతలను స్వయాన రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ తీసుకుంది. విద్యార్థుల మేథస్సు, ఆసక్తి, అభిరుచిల ఆధారంగా పై చదువులకు సంబంధించిన కోర్సుల ఎంపికలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సహకరించనున్నారు. పదో తరగతి ఫలితాలు ప్రకటించిన తర్వాత సర్టిఫికెట్లు తీసుకెళ్లడానికి పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు ఈ మేరకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు పాఠశాల విద్యా శాఖ ఆదేశించింది. ప్రొఫెసర్ గార్డెనర్ హోవర్డ్ ప్రతిపాదించిన మేథస్సు సిద్ధాంతం ప్రకారం ప్రజల్లో ఉండే వివిధ రకాల మేథస్సులు, వాటికి అనుగుణంగా ఎంపిక చేసుకోవాల్సిన కెరీర్‌కు సంబంధించిన చార్టులను అన్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపించింది. ► ఉదాహరణకు వాక్చాతుర్యం, భాష మీద పట్టు గల వారు న్యాయవాది, కమెడియన్, కమ్యూనికేషన్ స్పెషలిస్ట్, క్యూరేటర్, సంపాదకుడు, జర్నలిస్టు, చరిత్రకారుడు, లైబ్రేరియన్, మార్కెటింగ్ కన్సల్టెంట్, కవి, రాజకీయ నేత, పాటల రచయిత, టీవీషో హోస్ట్, ఉపాధ్యాయుడు, భాషా అనువాదకుడు, రచయిత కాగలరు. ► తార్కిక, గణిత నైపుణ్యం గలవారు అకౌంటెంట్, ఆడిటర్, కంప్యూటర్ అనలిస్ట్, కంప్యూటర్ టెక్నీషియన్, కంప్యూటర్ ప్రొగ్రామర్, డేటాబేస్ డిజైనర్, డిటెక్టివ్, ఆర్థికవేత్త, ఇంజనీర్, గణితవేత్త, నెట్వర్క్ అనలిస్ట్, ఫార్మాసిస్ట్, ఫిజిషియన్, ఫిజీసిస్ట్, పరిశోధకుడు, స్టాటిస్టిషియన్, బుక్ కీపర్ కాగలరు. ► దృశ్య నైపుణ్యం గల వారు 3డీ మోడలింగ్, సిమ్యూలేషన్, ఆర్కిటెక్ట్, ఆర్టిస్ట్, కంప్యూటర్ ప్రొగ్రామర్, ఇంజనీర్, ఫిల్మ్ యానిమేటర్, గ్రాఫిక్ ఆర్టిస్ట్, ఇంటీరియర్ డెకరేటర్, ఫొటో గ్రాఫర్, మెకానిక్, నావిగేటర్, ఔట్ డోర్ గైడ్, పైలట్, శిల్పుడు, వ్యూహకర్త, సర్వేయర్, అర్బన్ ప్లానర్, వెబ్‌మాస్టర్ కాగలరు. -
చక్కని దస్తూరీ.. విజయానికి రహదారి..
తూర్పుగోదావరి, ఐ.పోలవరం (ముమ్మిడివరం): పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి. విద్యార్థుల ధ్యాసంతా పరీక్షల కోసం చదువుకోవడం పైనే. అయితే పాఠాలను బట్టీ పట్టడానికి పడే కష్టంలో కొంతైనా చేతి రాతను మెరుగు పరుచుకోవడం కోసం పడే వారు చాలా కొద్ది మంది మాత్రమే. పరీక్షలలో ఇచ్చిన ప్రశ్నలకు సరైన సమాధానాలను రాయడం ఎంత ముఖ్యమో.. ఆ రాసేది చూడముచ్చటగా రాయడమూ అంతే ముఖ్యం. అంటే పరీక్షల్లో మెరుగైన ఉత్తీర్ణతకు దస్తూరీ కూడా కీలకమే. గజిబిజిగా ఉండే దస్తూరీతో రాసిన సమాధానం ఎంత సమగ్రమైనదైనా..పేపరును మూ ల్యాంకనం చేసే ఉపాధ్యాయులకు అర్థం చేసుకోవ డం కొంత ప్రయాస అవుతుంది. విద్యార్థి రాసింది వారికి ఎంత తక్కువ వ్యవధిలో అర్థమయితే అంత ఎక్కువ మార్కులు పడే అవకాశం ఉంటుంది. ముందు నుంచే సాధన చేయాలి.. ఏడాది పాటు చదివిన పాఠ్యాంశాలను రెండున్నర గంటలలో ఆన్సర్ షీట్‌పై పెట్టాలి. ఎంత బాగా చదివిన విద్యార్థులకైనా పరీక్షల సమయంలో సహజంగా ఆందోళన ఉంటుంది. కొందరు మొదటి ప్రశ్నకు సమాధానం చక్కగా రాసి తరువాత అందంగా రాయలేకపోతుంటారు. దీనిని అధిగమించాలంటే ముందుగానే దస్తూరీపై సాధన చేస్తే పరీక్షలలో ఇబ్బందులు ఉండవన్నది నిపుణుల సూచన. ఆణిముత్యాల్లాంటి అక్షరాల కోసం కొన్ని ప్రాథమిక సూత్రాలను పాటించాలని మండల విద్యాశాఖాధికారి నక్కా వెంకటేశ్వరరావు చెబుతున్నారు. ఆయన పనిచేసిన టి.కొత్తపల్లి జెడ్పీ పాఠశాలలో విద్యార్థులకు అక్షరాలు అందంగా రాయడానికి ముందు నుంచి శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఇవి పాటించాలి.. ♦ సమాధానపత్రంలో రాసే జవాబు సూటిగా ఉండటంతో పాటు అక్షరాలు పొందికగా ఉంటే పేపరు దిద్దేవారు ఒకటికి రెండు మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ♦ పేజీ పైభాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్ విడిచి పెట్టాలి. ♦ సామాన్య, భౌతిక శాస్త్రాల్లో బొమ్మలు గీసి భాగాలు గుర్తించే విషయంలో పెన్నును వత్తిపెట్టి రాయకూడదు. ఇలా చేస్తే పేపరు వెనుక కనిపిస్తుంది. ♦ పేజీలో వాక్యాలు పైనుంచి కిందకు లేదా పైకి ఉండకుండా వరుస క్రమంలో ఉండాలి. ♦ పేజీకి పదహారు నుంచి ఇరవై లైన్లను మించి రాయకూడదు. ♦ రోజూ కొద్దిసేపు సాధన చేస్తే పరీక్షలలో ఆందోళన లేకుండా సాఫీగా రాయొచ్చు. ♦ పెన్ను సక్రమంగా పట్టుకొని రాస్తే అక్షరాలు మనకు కనిపించడంతో పాటు అక్షరాలు గుండ్రంగా ఉంటాయి. ♦ జవాబు రాసేటప్పుడు ప్యాడ్ పైకి వాలి, పోకుండా సాధ్యమైనంత వరకూ కూర్చుని రాయడం మంచిది. ♦ అక్షరాలు పదాలు, వాక్యాలు మధ్య తగినంత ఖాళీ ఉండాలి. అదనపు మార్కులు సొంతం అదనపు మార్కులకు చేతి రాత చాలా ముఖ్యం. చేతి రాతను బట్టి విద్యార్థి సామర్థాన్ని అంచనా వేయవచ్చు. పాఠశాల సముదాయ సమావేశాల్లో ఇదే విషయాన్ని అధికారులు స్పష్టం చేస్తున్నారు. పదో తరగతి విద్యార్థుల చేతి రాత బాగుంటే మంచి ఫలితాలు సాధించవచ్చు. – నక్కా వెంకటేశ్వరావు, ఎంఈఓ,ఐ.పోలవరం ప్రాధాన్యం ఇవ్వాల్సిందే శాస్త్ర, సాంకేతిక రంగం ఎంత ఎదిగినా చేతిరాతకు ప్రాధాన్యం పెరుగుతూనే ఉంటుంది. సంబంధిత భాషపై పట్టు ఉంటే రాయడం తేలికవుతుంది. దస్తూరి బాగున్న విద్యార్థినీ విద్యార్థులకు అదనంగా మార్కులు పొందే అవకాశం ఉంది. మా పాఠశాలలో ఈ విధంగా తర్పీదు ఇస్తున్నాం.– ఎన్.సుబ్రహ్మణ్యం, జెడ్పీ పాఠశాల, మురమళ్ల -
టెన్త్ విద్యార్థుల ఆకలి కేకలు
గుంటూరు, సత్తెనపల్లి: టెన్త్ విద్యార్థులు అర్ధాకలితో అల్లాడుతున్నారు. పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతుండటంతో జిల్లావ్యాప్తంగా స్కూళ్లలో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ఉదయం బడికి బయల్దేరే పిల్లలు స్కూలులో మధ్యాహ్నం భోజనం మాత్రమే చేస్తున్నారు. సాయంత్రం వదలగానే అర్ధాకలితో ప్రత్యేక తరగతుల్లో కూర్చుంటున్నారు. మళ్లీ ఇంటికి వెళితేనే నోట్లోకి ముద్ద దిగేది. వారికి ఆహార విషయమై విద్యాశాఖ నుంచి నేటి వరకు ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదు. ఏటా జిల్లా పరిషత్ నుంచి కేటాయింపులు చేసేవారు. ప్రస్తుతం అంతా ఎన్నికల హడావుడిలో పట్టించుకోక పోవడంతో జిల్లాలోని టెన్త్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 59 వేల మంది టెన్త్ విద్యార్థులు ఉంటే వీరిలో సగం మంది జిల్లా పరిషత్ పాఠశాలలకు చెందిన వారే ఉన్నారు. దాతలు ముందుకు రావాలని వినతి ప్రభుత్వ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థులు మంచి గ్రేడ్లతో ఉత్తీర్ణత సాధించాలనే ఉద్దేశంతో విద్యా శాఖ ఉదయం, సాయంత్రం వేళల్లో గత 45 రోజులుగా గంట చొప్పున ప్రత్యేక తరగతులను నిర్వహిస్తోంది. విద్యార్థుల సందేహాలను ఉపాధ్యాయులు నివృత్తి చేస్తూ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. సాయంత్రం వేళ అల్పాహారం లేక చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. అధికారులు కూడా ఏర్పాట్లు చేయడం లేదు. ఆయా మండలాల్లో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే దాతలు ఎంతో మంది ఉన్నారు. వీరితో పాటు ప్రతి గ్రామంలో గ్రామాభివృద్ధి, ఎస్ఎంసీ, జన్మభూమి కమిటీలు ఉన్నాయి. విద్యార్థుల సమస్యలపై వారంతా స్పందించాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయులు కోరుతున్నారు. ఆరోగ్యంపై ప్రభావం మార్చి 18 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఉత్తమ ఫలితాలు సాధించడానికి ఉపాధ్యాయుల సహకారం, విద్యాశాఖ ప్రణాళికలు బాగానే ఉన్నా ... అల్పాహార విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురవు తున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన దూర ప్రాం తాల విద్యార్థుల్లో కొందరు ఉదయం భోజనం చేయకుండానే తరగతులకు హాజరవు తున్నారు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని వైద్యులు అభిప్రాయ పడుతున్నారు. సాయంత్రానికి నీరసం పాఠశాలలో మధ్యాహ్నం తీసుకున్న భోజనంతో సాయంత్రానికి నీరసం వస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పాఠ్యాంశాలు చదడం, రాయడంతో శక్తిని కోల్పోతున్నాం. మధ్యాహ్నం భోజనం తప్పా మళ్లీ ఆహారం అందకపోవడంతో సాయంత్రానికి నీరసం వస్తోంది.– ఏసుపోగు హరిణి, టెన్త్ విద్యార్థిని దృష్టి సారించలేకపోతున్నాం కొన్నిసార్లు ఉదయం ఇంటి వద్ద ఆçహారం తీసుకోకుండానే వచ్చేస్తున్నాం. పాఠశాలలో మధ్యాహ్న భోజనం మాత్రమే చేస్తున్నాం. సాయంత్రానికి ఆకలితో నీరసం వస్తోంది. దీంతో చదువుపై దృష్టి సారించ లేకపోతున్నాం. – చల్లా మహేష్,టెన్త్ విద్యార్థి -
తీపి కబురు
జిల్లాలోని పదోతరగతి విద్యార్థులకు తీపి కబురు అందింది. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కలెక్టర్ ధర్మారెడ్డి వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్న విద్యార్థులకు సాయంత్రం వేళల్లో స్నాక్స్ అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి మార్చి 14 వరకు కొనసాగనుంది. సాయంత్రం వేళల్లో అల్పాహారంతో వారి ఆకలి తీరడంతో చదువుపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచే వీలుంది. దీంతో పది పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంది. పాపన్నపేట (మెదక్): జిల్లాలో 175 ప్రభుత్వ పాఠశాలలు, 67 ప్రైవేట్ పాఠశాలల్లో 11,361 మంది విద్యార్థులు ఈ యేడు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. గత ఏడాది పరీక్షల్లో 90 శాతం ఫలితాలతో జిల్లా 9వ స్థానంలో నిలిచింది. కాగా ఈ విద్యా సంవత్సరంలో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు కలెక్టర్ ధర్మారెడ్డి, డీఈఓ రవికాంతరావు పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జులై నెల నుంచి అన్ని పాఠశాలల్లో ‘లిటిల్ టీచర్ – లిటిల్ లీడర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి తరగతిలో పది మంది విద్యార్థులకు ఒక గ్రూపును తయారు చేసి అందులో నుంచి ఒక లిటిల్ టీచర్, ఒక లిటిల్ లీడర్‌ను ఏర్పాటు చేస్తారు. ఆరోజు జరిగిన పాఠ్యాంశానికి సంబంధించి ప్రశ్నలు తయారు చేసి సమాధానాలు రాస్తారు. అలాగే తెలియని విషయాలపై చర్చ కొనసాగిస్తారు. గ్రూపులోని విద్యార్థులంతా ప్రతిరోజూ ప్రత్యేక తరగతులకు వచ్చేలా లిటిల్ లీడర్ చర్యలు తీసుకుంటారు. సాధారణంగా తమకు వచ్చిన సందేహాలను ఉపాధ్యాయుడిని అడిగేందుకు కొంత మంది విద్యార్థులు వెనుకడుగు వేస్తుంటారు. ఈ పద్ధతిలో లిటిల్ లీడర్ ఆధ్వర్యంలో జరిగే చర్చ ద్వారా విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కలుగుతుంది. ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.45 గంటల నుంచి 5.45 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. వీటికి తోడు జిల్లా విద్యాశాఖ ప్రవేశపెట్టిన స్పెషల్ యాక్షన్ ప్లాన్ ఎలాగు అమలు చేస్తున్నారు. ఆకలి తీర్చేందుకు.. స్నాక్స్... ఉదయం ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులు సాయంత్రం 5.45 గంటల వరకు పాఠశాలల్లోనే ఉండాల్సి వస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంటకు భోజనం చేసే విద్యార్థులకు సాయంత్రం అయ్యే సరికి ఆకలి వేస్తుంది. ముఖ్యంగా పొరుగు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థినీవిద్యార్థులు తిరిగి ఇంటికి వెళ్లే సరికి రాత్రి 7 గంటలు అవుతుంది. దీంతో వారు ఆకలికి తాళలేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఇబ్బందిని తీర్చడానికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు స్నాక్స్ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజనం వండే వంట ఏజెన్సీల ద్వారా విద్యార్థులకు బిస్కెట్లు, బెబ్బర్లు, పెసర్లు, ఉప్మా, పల్లీలు, అటుకులు, పండ్లు లాంటి అల్పాహారాన్ని అందించాలని తెలిపారు. ఇందుకు గాను ప్రతి విద్యార్థికి రూ.5 చొప్పున బడ్జెట్ మంజూరు చేయనున్నారు. మార్చి 14వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా ఈ పథకం ద్వారా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న 3,928 మంది బాలురు, 3,579 మంది బాలికలు ప్రయోజనం పొందనున్నారు. రెండేళ్ల క్రితం ఇలా పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ పంపిణీ చేశారు. అలాగే పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్షలు రాసేందుకు రూ.74.02 లక్షల వ్యయంతో 2 వేల డెస్క్‌లను 57 పరీక్ష కేంద్రాలకు పంపిణీ చేశారు. చాలా ఆనందంగా ఉంది.. నేను పాపన్నపేట ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాను. ప్రతిరోజు ఎనిమిది కిలోమీటర్ల దూరంలోని చిత్రియాల నుంచి పాపన్నపేటకు సైకిల్‌పై వస్తున్నాను. ఉదయం 8.30 గంటలకే తరగతికి రావాల్సి ఉండటంతో తినకుండానే వస్తున్నాను. తిరిగి ఇంటికి వెళ్లే సరికి రాత్రి 6.30 గంటలవుతోంది. దీంతో సాయంత్రం 5 గంటల నుంచే ఆకలి వేస్తోంది. కలెక్టర్ స్నాక్స్ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. –తహమీద్, పదో తరగతి విద్యార్థి, చిత్రియాల -
హెడ్మాస్టర్ బంపర్ ఆఫర్!
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): సాధారణంగా టెన్త్ టాపర్లకు వివిధ రకాల బహుమతులు ఇచ్చి ప్రోత్సహించడం మనకు తెలిసిందే. అయితే ఇవన్నీ ఎక్కువగా కార్పొరేట్ విద్యార్థులకే. ప్రభుత్వ చదువులు చదివిన వారికి ప్రోత్సాహం అంతంతమాత్రమే. అలాటిది.. ప్రభుత్వ హైస్కూల్లో చదివిన విద్యార్థులకు విమానం ఎక్కే అవకాశం ఉంటుందని ఎవరు ఊహిస్తారు? బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నందుకు స్కూలు హెడ్ మాస్టర్ ఆ అవకాశం కల్పిస్తారని ఎవరు అనుకుంటారు? అయితే ఓ ప్రధానోపాధ్యాయుడు దానిని సాధ్యం చేశారు. పేద పిల్లలు తమ ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించేట్టు వారికి ప్రోత్సహించడానికి, ఉన్నత లక్ష్యాలు అందుకునే దిశగా వారిని ఉత్తేజపరచడానికి చింతలగ్రహారం జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు శివాజీ ఈ ఆఫర్ పెట్టారు. తమ హైస్కూల్లో టెన్త్ టాపర్లుగా 10/10 సాధించుకున్న విద్యార్థులను ఆయన ఏటా ప్రోత్సహిస్తుంటారు. గతేడాది రూ. 5 వేల వంతున నగదు ప్రోత్సాహకాలు ఇచ్చిన ఆయన ఈసారి బంపర్ ఆఫర్ ప్రకటించారు. 10/10 గ్రేడ్లు వచ్చిన వారందరినీ విమానంలో హైదరాబాద్ టూర్‌కు పంపిస్తానని విద్యార్ధులను ఉత్తేజపరిచారు. దాంతో విద్యార్థులు పోటాపోటీగా చదివారు. గత టెన్త్ పరీక్షల్లో పొలమరశెట్టి కుశలవర్ధన్, దాడిరూప, వడ్డీది సింధు 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించారు. వీరు విజయవాడలో ట్రిపుల్ ఐటీ సీట్లు కూడా సాధించారు. మాట ఇచ్చిన శివాజీ వాగ్దానం ప్రకారం వీరిని శుక్రవారం స్పైస్‌జెట్ విమానంలో హైదరాబాద్‌కు టూర్‌కు పంపారు. రూప టికెట్ ఉన్నా అనివార్యకారణాల వల్ల ఈ అవకాశాన్ని చివరి నిమిషంలో పొందలేదు. కుశలవర్ధన్, సింధులకు హైదరాబా ద్ చూపించడానికి తోడుగా నాగమణి టీచర్‌ను కూడా పంపారు. ఇలా రెండురోజుల పాటు హైదరాబాద్‌లో ముఖ్య పర్యాటక ప్రాంతాలను వీరు సందర్శించి తిరిగి గరీబ్‌ర«థ్ ఎక్స్‌ప్రెస్‌లో విశాఖ చేరుకుంటారు. శుక్రవారం విమానాశ్రయంలో ఈవిజేతలకు హ్యాపీ జర్నీ అంటూ హెచ్ఎం శివాజీ వీడ్కోలు పలకడాన్ని అక్కడి ప్రయాణికులంతా చూసి,మంచి మాస్టారని అభినందించారు. -
చీకటి చదువులు.. ఇంకెన్నాళ్లు?
రాయ్‌పూర్ : దేశవ్యాప్తంగా పదోతరగతి విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే.. చత్తీస్‌ఘడ్‌లోని ఓ గ్రామంలో మాత్రం గత కొన్నేళ్లుగా విద్యార్థులు సవాళ్లు ఎదుర్కుంటున్నారు. చిమ్మచీకటిలో లాంతరు వెలుగుల మధ్య చదువుకోవాల్సిన పరిస్థితి వాళ్లది. బలరాంపూర్ జిల్లాలోని త్రిశూల్ గ్రామంలో పరిస్థితి ఇది. స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు అయినా కూడా ఈ గిరిజన గ్రామానికి కరెంట్ సరఫరా లేదు. జిల్లా అధికారులకు ఎన్నోసార్లు విజ్ఞప్తి చేశామని అయినా కూడా పరిస్థితి మారలేదని గ్రామస్థులు వాపోతున్నారు. ఎన్నో ఏళ్ల నుంచి అవస్థలు పడుతున్నామని.. ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. అయితే గ్రామానికి 15 కి.మీ దూరంలో ఉన్న బీజేపీ ఎంపీ రాంవిచార్ నేతమ్ ఇంటికి మాత్రం నిత్యం కరెంట్ సరఫరా ఉండటాన్ని వారు ప్రస్తావించారు. మరోవైపు గ్రామంలో ప్రైమరీ ఎడ్యూకేషన్ ప్రారంభించినాకూడా సరైన రోడ్డు సదుపాయం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కరు కూడా పాస్ కాలేదు.. ఇప్పటివరకూ ఈ గ్రామంలో ఒక్కరు కూడా పదోతరగతి పాస్ అవ్వలేదని గ్రామస్థులు చెబుతుండగా, కరెంట్ లేకపోవడంతో సరిగ్గా చదవలేక ఫెయిల్ అవుతున్నట్లు విద్యార్థులు చెబుతుండటం గమనార్హం. త్వరలో సమస్యకు పరిష్కారం.. పొరుగునే ఉన్న బుండిపాకు గ్రామానికి కరెంట్ సరఫరా ప్రారంభించామని.. త్వరలోనే త్రిశూల్ గ్రామానికి కూడా సరఫరా చేస్తామని జిల్లా కలెక్టర్ అవినాష్ కుమార్ తెలిపారు. -
పరీక్ష రాసేందుకు వెళుతూ..
గండేపల్లి(జగ్గంపేట): పదో తరగతి పరీక్ష రాసేందుకు వెళుతున్న ఆటోలో వెళుతున్న విద్యార్థులు ప్రమాదబారిన పడ్డారు. రాంగ్రూట్లో వస్తున్న వాహనాన్ని తప్పించబోయే ప్రయత్నంలో ఆటో అదుపుతప్పి బోల్తాకొట్టడంతో ఆటోలో ఉన్న విద్యార్థులు తీవ్రగాయాలపాలయ్యారు. ఎస్సై దుర్గాశ్రీనివాస్ కథనం ప్రకారం.. సోమవారం మండలంలోని ఉప్పలపాడు గ్రామానికి చెందిన మల్లేపల్లి హైస్కూల్ విద్యార్థులు 12 మంది గండేపల్లిలో హైస్కూల్ పరీక్ష కేంద్రంలో పరీక్ష రాసేందుకు ఆటోలో వెళుతున్నారు. గండేపల్లి శివారున రాయి చెరువు ఎదురుగా(సోమా కంపెనీ) సమీపంలోకి వచ్చేసరికి గండేపల్లిలో రైస్‌మిల్లుకు చెందిన బొలెరో(మినీ వాహనం) రాంగ్రూట్లో వస్తోంది. దీంతో విద్యార్థులతో ప్రయాణిస్తున్న ఆటో బొలెరాను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో కె.వీరదుర్గలక్ష్మి, జి.వీరలక్ష్మి, షేక్ దేవి, ఎం.దేవిలకు తీవ్రంగా, మిగిలిన విద్యార్థులకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఇతర ప్రయాణికులు, స్థానికుల సహాయంతో పోలీసులు ఆటోలో చిక్కుకున్న విద్యార్థులను బయటకుతీసి మరో వాహనంలో చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం విద్యార్థులు పరీక్షలు రాసేందుకు పరీక్ష కేంద్రాలకు హాజరయ్యారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులు ముగ్గురు పరీక్షలు రాయలేకపోవడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మరొకరి సహాయంతో పరీక్షలు రాసేందుకు అవకాశం కల్పించారు. పరీక్ష సమయం ముగిసిన వెంటనే నలుగురు విద్యార్థులను రోడ్డు సేఫ్టీ వాహనంలో రాజమహేంద్రవరం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్ష కేంద్రాల వద్ద పరీక్షలకు హాజరైన విద్యార్థులను తహసీల్దార్ గీతాంజలి, ఎంపీడీఓ రమేష్, ఎంఈఓ కేహెచ్ నాయక్, సీఐ కాశీవిశ్వనాథం, పోలీస్ సిబ్బంది పరిశీలించి తల్లిదండ్రులు, బందువులతో మాట్లాడారు. ప్రమాదమేమిలేదని ఆందోళన చెందవద్దని ఓదార్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై పేర్కొన్నారు. -
ఇది ‘బాబు’ భయోమెట్రిక్!
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పదవ తరగతి విద్యార్థుల బయోమెట్రిక్ హాజరుపై సమీక్షిస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని మండల కేంద్రాల్లో ని హైస్కూళ్ల హెడ్మాస్టర్లు విధిగా టెన్త్ విద్యార్థుల హాజరును బయోమెట్రిక్‌లో తీసుకోవాలి’’– ఇదీ బుధవారం ఉదయం 10.30 గంటల కు జిల్లా విద్యాశాఖనుంచి హైస్కూ ళ్ల ప్రధానోపాధ్యాయులకు అందిన సంక్షిప్త సందేశం. అంతే! హెచ్ఎం లు బెంబేలెత్తారు. తరగతుల సంగ తి పక్కనబెట్టారు. టెన్త్ విద్యార్థుల హాజరును బయోమెట్రిక్‌లో తీసుకునేందుకు నానాపాట్లు పడ్డారు. యాదమరి: ప్రభుత్వ పాఠశాలల్లో వి ద్యార్థుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ మెషిన్లను ఇచ్చినప్పటికీ వివిధ కారణాలతో వాటిని అటకెక్కించారు. అప్ప ట్లో ఉపాధ్యాయులు విద్యార్థుల ఆధార్ కార్డు వివరాలతోపాటు నమోదు చేశా రు. సర్వర్లు సక్రమంగా పనిచేయకపోవడంతో ఇది పూర్తిస్థాయిలో కార్యరూపం దాల్చలేదు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. వారు కూడా దీనిమీద ఫోకస్ పెట్టకపోవడంతో ఆ న మోదు కార్యక్రమం అలాగే ఆగిపోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి, టెన్త్ విద్యార్థుల బయోమెట్రిక్ అటెం డెన్స్‌ను సమీక్షిస్తారని, దీని వివరాలు వెంటనే ఇవ్వాలని ఆదేశాలు రావడంతో జిల్లాలోని హెడ్మాస్టర్లు కంగుతిన్నారు. సమాచారం అందింది మొదలుకుని టెన్త్ విద్యార్థుల బయోమెట్రిక్ హాజరు నమోదుకు ఆపసోపాలు పడ్డారు. నియోజకవర్గంలోని పూతలపట్టు, యాదమరి, తవణంపల్లె, ఐరాల, బంగారుపాళ్యం మండలాలలో 42 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో టెన్త్ చదువుతున్న బాలురు 1260, బాలికలు 1158, మొత్తం 2418మంది ఉన్నారు. పనిచేయని సర్వర్లు.. ప్రభుత్వ హైస్కూళ్లలో 6 నుంచి 10వ తరగతికి సంబంధించి ప్రతి తరగతికీ బయోమెట్రిక్ మెషిన్ ఇచ్చారు. పంపిణీ చేసిన సమయంలో సర్వర్ల సమస్య కారణంగా పూర్తి స్థాయిలో వివరాలు నమోదు చేయలేకపోయారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే దీనిపై సమీక్షకు పూనుకున్నప్పటికీ సర్వర్లు పనిచేయకపోవడం గమనార్హం! దీంతో ఎక్కడ వేసిన బయోమెట్రిక్ అక్కడే అన్న చందాన మారింది. ఈ క్రమంలో టెన్త్ విద్యార్థుల హాజరు బయోమెట్రిక్‌లో ఎక్కడా నమోదు కాలేదని అధికారులు చెప్పడంతో ముఖ్య మంత్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో యుద్ధ ప్రాతిపదికన హెడ్మాస్టర్లు నమోదుకు పూనుకున్నారు. అక్రమాలు అరికట్టేందుకేనా? విద్యార్థులు తక్కువగా హాజరైనా ఎక్కువమంది హాజరైనట్లు రికార్డుల్లో నమోదు చేసి మధ్యాహ్న భోజన పథకం అమలులో అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలు రావడంతో ప్రభుత్వం దీనికి చెక్ పెట్టే దిశగా విద్యార్థులకూ బయోమెట్రిక్ ట్యాగ్ తగిలించిందని తెలుస్తోంది. -
‘10 తర్వాత పెళ్లి వద్దు’ పోస్టర్ ఆవిష్కరణ
భానుగుడి (కాకినాడ): బాల్యవివాహాలను రద్దు చేసేందుకు సర్వశిక్షా అభియా¯ŒS ద్వారా ‘పది తర్వాత పెళ్లికాదు.. 11వ తరగతి’ అనే రాష్ట్రవ్యాప్త కార్యక్రమాన్ని గురువారం కలెక్టర్ హెచ్ఆర్.అరుణ్‌కుమార్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ గురువారం ఆవిష్కరించి బాలికావిద్యను ప్రగతి పథలో పెట్టేందుకు రూపొందించిన కార్యక్రమానికి అందరూ సహకరించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 352 కేజీబీవీలలో చదువుతున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు బాల్యవివాహాలపై అవగాహన కల్గించేందుకు ప్రతీ పాఠశాలకు ఒక సైకియాట్రిస్ట్, విద్యావేత్త ద్వారా అవగాహన కల్పిస్తున్నట్టు పీవో మేకా శేషగిరి తెలిపారు. జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో 8, మైదానప్రాంతాల్లో 2, ముంపు మండలాల్లో 2 మొత్తం 12కేజీబీవీలు ఉన్నాయని, వీటిలో 2,400 మంది విద్యార్థినులు చదువుతున్నారని, వారిలో 400 మంది పదోతరగతి చదువుతున్నారన్నారు. వీరందరికీ ఈనెల 30,31 తేదీలలో ఈ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. సీఎంవో ఇంటి వెంకట్రావు, ఏఎంవో చామంతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.