సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు కొత్త చిక్కు వచ్చిపడేలా ఉంది. యూడైస్‌లో పేరు లేకుంటే పరీక్ష ఫీజు చెల్లించే అవకాశం ఇవ్వకూడదని విద్యాశాఖ భావిస్తోంది. దీనివల్ల దాదాపు లక్ష మంది విద్యార్థులు పరీక్ష ఫీజు కట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పరిణామం విద్యార్థుల తల్లిదండ్రులను కలవర పెడుతుండగా.. ఇప్పటికిప్పుడు ఈ నిబంధన తేవడం సరికాదని ఉపాధ్యాయులూ అంటున్నారు.
యూడైస్ అప్‌డేట్‌లో క్షేత్రస్థాయి సమస్యలు గుర్తించాలని సూచిస్తున్నారు. పాఠశాల విద్యా డైరెక్టరేట్ మాత్రం ఇవేవీ పట్టించుకునేందుకు సిద్ధంగా లేకపోవడం సమస్యకు దారి తీస్తోంది. ఈ నెల 28వ తేదీ నాటికి యూడైస్‌లో విద్యార్థులందరి పేర్లు చేర్చాలని విద్యాశాఖ ఆదేశించింది. అయితే గడువు ముగిసే నాటికి దాదాపు 45 శాతం మంది విద్యార్థుల పేర్లు ఎక్కించే అవకాశం లేకుండా పోయింది. ఈ ఏడాది టెన్త్ పరీక్షలు 5 లక్షల మంది రాసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
పాత రికార్డు లేకుంటే అంతే...
ఏకీకృత జిల్లా విద్యా సమాచార వ్యవస్థ (యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్)లో ప్రతి విద్యార్థి సమగ్ర వివరాలు చేర్చాలని విద్యాశాఖ నిర్ణయించింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థి ఎక్కడ చదివింది, వారి టీసీల వివరాలు ఇందులో పొందుపర్చాల్సి ఉంటుంది. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా లభించే ప్రతి ప్రయోజనానికి (సంక్షేమ పథకం) యూడైస్‌నే ప్రామాణికంగా తీసుకోవాలన్నది విద్యాశాఖ ఆలోచన.
అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం 8వ తరగతి వరకూ విద్యార్థికి అంతకుముందు ఎక్కడ చదివిందీ తెలిపే ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ)తో పనిలేదు. ఈ మేరకే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు విద్యార్థులను టీసీలు లేకున్నా 8వ తరగతిలో చేర్చుకున్నాయి. స్కూల్ ఫీజు చెల్లించని విద్యార్థులకు కొన్ని ప్రైవేటు స్కూళ్ళు టీసీలు ఇవ్వకుండా ఆపాయి.
ఈ కారణంగా రాష్ట్రంలో చాలామంది విద్యార్థులు టీసీల్లేకుండానే ఇతర స్కూళ్ళల్లో చేరారు. ఇంతే కాకుండా చాలా స్కూళ్ళు కింది తరగతుల్లో అనుమతులు లేకుండానే విద్యార్థులను చేర్చుకున్నాయి. ఈ కారణంగానూ విద్యార్థుల వివరాలు లభించని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో యూడైస్ కోసం పాత రికార్డు ఎలా తేవాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
టెన్త్ విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు
యూడైస్ సాధ్యాసాధ్యాలను ఉన్నతా ధికారులు గుర్తించాలి. క్షేత్రస్థాయిలో ఎదుర య్యే సమస్యలను అర్థం చేసుకోవాలి. యూ డైస్‌లో పేరులేదని పరీక్ష ఫీజు కట్టించుకోని పరిస్థితి వస్తే, అనేకమంది టెన్త్ విద్యార్థులు ఇబ్బందులు పడతారు. పరీక్షలు దగ్గరప డుతున్న సమయంలో వారిని మానసికంగా దెబ్బతీయడం సరైన చర్య కాదు. – చావా రవి (టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
వెసులుబాటు ఇవ్వకపోతే ఇబ్బందులే
విద్యార్థి 8 నుంచి ఒకే స్కూల్‌లో ఉన్నప్పుడు దాన్నే ప్రామాణికంగా తీసుకుని యూడైస్‌లో చేర్చే ఆప్షన్ ఇవ్వాలని ఉపాధ్యాయ వర్గాలు కోరుతున్నాయి. ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు ఇందులోని ఇబ్బందులను విద్యా శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాయి. అప్పటివరకూ తాము యూడైస్‌లో చేర్చే ప్రక్రియ పూర్తి చేయలేమంటున్నాయి. ఆన్‌లైన్ ఈ మేరకు సాంకేతిక వెసులుబాటును కల్పించాలని కోరుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment