
ఇంటికి తీసుకు వచ్చి విచారణ
ఆందోళనకు దిగిన బాధితులు..ఉద్రిక్తత
హైదరాబాద్ : చిట్టీలు, అధిక వడ్డీల ఆశ చూపి ప్రజలను నిలువునా మోసం చేసిన పుల్లయ్య ఆస్తులను సీసీఎస్ పోలీసులు సీజ్ చేశారు. సనత్‌నగర్ బీకేగూడ దాసారం బస్తీ రవీంద్రనగర్ సమీపంలో ఉండే పుల్లయ్య చిట్టీలు, వడ్డీల పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసి..వందల మందిని మోసం చేసిన విషయం విదితమే. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన సీసీఎస్ పోలీసులు ఇటీవల బెంగుళూరులో పుల్లయ్యను అరెస్టు చేసి నగరానికి తీసుకువచ్చారు.
విచారణలో భాగంగా బుధవారం సాయంత్రం సీసీఎస్ పోలీసులు బీకేగూడలోని నివాసానికి పుల్లయ్యను తీసుకువచ్చారు. ఏసీపీ మల్లికార్జున చౌదరి ఆధ్వర్యంలో పుల్లయ్య తోపాటు అతని ఇద్దరు కుమారులను మూడు గంటల పాటు విచారించి ఆస్తులకు సంబంధించిన పలు కీలక పత్రాలను స్వా«దీనం చేసుకున్నారు. ఐదు అంతస్తుల ఇంటితో పాటు ఫార్చూనర్ కారు, ఇతర సామాగ్రిని సీజ్ చేసి తరలించారు. కాగా ఇంటిపై రూ.60 లక్షల బ్యాంకు లోను ఉన్నట్లు తెలిపారు.
కాగా పుల్లయ్యను ఇంటికి తీసుకువచ్చారన్న సమాచారంతో బాధితులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకుని ఆందోళకు దిగారు. మహిళా బాధితులు కొందరు ఆగ్రహంతో ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పుల్లయ్యతో మాట్లాడించాలని వారు పోలీసులతో వాగి్వవాదానికి దిగారు. తిరిగి పుల్లయ్యను సీసీఎస్‌కు తరలించే క్రమంలో పోలీసు వాహనాలను వెళ్లనివ్వకుండా అడ్డు తగిలారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కారు వెంట పరుగెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దశలో పోలీసులు అప్రమత్తమై జనాలను అడ్డుకున్నారు.