అంకెల్లో పెరిగింది శాతంలో తగ్గింది | 23108 crore for education in Telangana budget | Sakshi
Sakshi News home page

అంకెల్లో పెరిగింది శాతంలో తగ్గింది

Published Thu, Mar 20 2025 4:27 AM | Last Updated on Thu, Mar 20 2025 4:27 AM

23108 crore for education in Telangana budget

2025–26 బడ్జెట్‌లో విద్యకు రూ.23,108 కోట్లు

రూ.1,816 కోట్లు గత బడ్జెట్‌తో పోలిస్తే అధికంగాకేటాయించింది

7.57% మొత్తం బడ్జెట్‌లోకేటాయింపు

7.77% 2024–25 బడ్జెట్‌లో కేటాయించింది

పాఠశాల విద్యకు 13,763 కోట్లు పెరిగినా 10 వేల మంది కొత్త టీచర్ల జీతాలకే ఇది చెల్లు 

తాజా బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యా రంగానికి రూ.23,108 కోట్లు కేటాయించింది. గత బడ్జెట్‌తో పోలిస్తే రూ.1,816 కోట్లు ఎక్కువని పేర్కొంది. మొత్తం బడ్జెట్‌లో విద్యాశాఖ వాటా 7.57 శాతంగా ఉంది. అయితే గత బడ్జెట్‌తో పోలిస్తే కేటాయింపు పెరిగినా, మొత్తం బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకుంటే ఈసారి కేటాయింపుల శాతం తగ్గింది. 2024–25 బడ్జెట్‌ మొత్తం రూ.2,74,058 కోట్లు. ఇందులో విద్యా రంగం కేటాయింపులు రూ.21,292 కోట్లు అంటే మొత్తం బడ్జెట్‌లో 7.77 శాతం. కానీ 2025–26 మొత్తం బడ్జెట్‌ రూ.3,04,965 కోట్లు. 

ఇందులో విద్యారంగానికి కేటాయింపులు రూ.23,108 కోట్లు. అంటే 7.57 శాతం. అంటే 2024–25తో పోల్చుకుంటే ఈసారి విద్యకు 0.20 శాతం మేర కేటాయింపులు తగ్గాయన్నమాట. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ స్కూళ్ళల్లో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్‌ విద్య, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో బోధన, విశ్వవిద్యాలయాల ఆధునీకరణ, బోధనా సిబ్బంది నియామకాలు, ఉన్నత విద్యలో సాంకేతిక పురోగతి, నైపుణ్యాభివృద్ధి కల్పన, ప్రభుత్వ వర్సిటీల పరిధిలో తీసుకొచ్చే కొత్త కంప్యూటర్‌ కోర్సులకు మౌలిక వసతులు కల్పనకు సరిపడా నిధుల కేటాయింపు జరగలేదని విద్యారంగ నిపుణులు అంటున్నారు.  

విద్య పద్దులో ఇవీ కీలకాంశాలు.. 
పాఠశాల విద్యకు రూ.19,341.23 కోట్లు కేటాయించారు.గత బడ్జెట్‌తో పోలిస్తే ఇది రూ.13,763 కోట్లు ఎక్కువ. కేటాయింపుల్లో 91 శాతం టీచర్లు, సిబ్బంది వేతనాలకే ఖర్చవుతుంది. గత ఏడాది కొత్తగా 10 వేల మంది టీచర్ల
నియామకం చేపట్టారు. దీంతో వేతనాల ఖర్చు పెరగనుంది. 

రాష్ట్ర వ్యాప్తంగా26 వేల ప్రభుత్వస్కూళ్ళున్నాయి.వీటిల్లో 3 వేల స్కూళ్ళల్లో డిజిటల్‌ విద్య, మరో 1,500 స్కూళ్ళల్లో ఏఐ టెక్నాలజీతో బోధనచేపడతామని ప్రభుత్వం తెలిపింది. తొలిదశలో రూ.50 కోట్లు ఖర్చవుతుందని విద్యాశాఖ అంచనా వేయగా..ప్రస్తుతబడ్జెట్‌లో రూ.40 లక్షలు కేటాయించారు. పరీక్షల నిర్వహణకు రూ.6 కోట్ల నుంచి రూ.7.50 కోట్లకు నిధులు పెంచారు.  

ఉన్నత విద్యలో సమూల మార్పుల దిశగా అనేకనివేదికలు రూపొందించారు. ఇప్పటికే వర్సిటీల్లో కొత్త కోర్సులు తీసుకొచ్చారు. కంప్యూటర్‌ అనుబంధ కోర్సులకు ప్రత్యేక మౌలిక వసతుల కల్పన అవసరం. వీటికోసం రూ.500 కోట్లు కావాలని ప్రతిపాదించినా వాటి ఊసు లేదు. 

ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు రూ.2,900 కోట్లే..  
యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సంగతి తెలిసిందే. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రూ.11,600 కోట్ల మంజూరుకు పాలనపరమైన అనుమతులూ ఇచ్చింది. కానీ ప్రస్తుత బడ్జెట్‌లో ఈ స్కూళ్ళ నిర్మాణానికి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రూ.2,900 కోట్లే కేటాయించింది. 

ఒక్కో స్కూల్‌కు రూ.200 కోట్లు వెచ్చించినా, ఈ ఏడాది మొదలు పెట్టే స్కూళ్ళ సంఖ్య 15కు మించే అవకాశం లేదు. నైపుణ్యాభివృద్ధి దిశగా కాలేజీల్లో స్కిల్‌ కోర్సులు, ఏఐ విద్యా విధానం ప్రతిపాదనలు సిద్ధం చేసినా... వీటికి నిధుల కేటాయింపును చూపించలేదు. పారిశ్రామిక కార్పస్‌ ఫండ్‌ నుంచి వీటిని అమలు చేయాలనే ఆలోచనతో ఉంది.  

6 గ్యారంటీలు 56 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రజలకిచ్చిన ప్రధాన హామీలైన ఆరు గ్యారంటీల కోసం బడ్జెట్‌లో రూ.56,084 కోట్లు కేటాయించారు. వీటికి వరుసగా రెండో ఏడాది కూడా ప్రాధాన్యమిస్తూ గత బడ్జెట్‌లో కేటాయించిన దాని కంటే రూ.9వేల కోట్ల వరకు అదనంగా ప్రతిపాదించడం విశేషం. రైతుభరోసా, చేయూత, ఇందిరమ్మ ఇళ్లు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, 200 యూనిట్లలోపు ఉచిత కరెంటు, సన్నధాన్యానికి బోనస్, రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, రూ.500కే గ్యాస్‌ సిలిండర్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు ఈ నిధులను కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌ పత్రంలో పేర్కొన్నారు. 

రైతు భరోసాకు గత ఏడాది కంటే రూ.3వేల కోట్లు పెంచగా, గత ఏడాది తరహాలోనే పింఛన్లకు నిధులు చూపెట్టారు. అంటే ఈసారి కూడా పింఛన్ల పెంపు హామీ పరిష్కారమయ్యే అవకాశాలు కనిపించడం లేదని బడ్జెట్‌ గణాంకాలు చెబుతున్నాయి. ఇక, నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో అవసరమయ్యే 4 లక్షలకుపైగా ఇందిరమ్మ ఇళ్ల కోసం రూ.12,571 కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. 

ఇళ్ల నిర్మాణంలో కేంద్రమిచ్చే సాయం పోను ఈ నిధులు సరిపోతాయని ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, గృహజ్యోతి, గృహలక్ష్మికి తగిన కేటాయింపులు చేశామని అంటున్నాయి. అయితే, మహిళలకు నెలకు రూ.2,500 చొప్పున భృతి ఇస్తామనే ముఖ్యమైన గ్యారంటీతోపాటు ఆరు గ్యారంటీల్లోని ఇతర అంశాలను బడ్జెట్‌లో ప్రస్తావించకపోవడం గమనార్హం. అంటే ఆ గ్యారంటీల అమలుకు మరో ఏడాది ఆగాల్సిందేనన్న మాట.  

రోడ్లు, భవనాల శాఖకు రూ.5,907 కోట్లు
సాక్షి, హైదరాబాద్‌: రోడ్లు, భవనాల శాఖకు ప్రభుత్వం రూ.5,907 కోట్లను ప్రతిపాదించింది. ఇందులో రీజినల్‌ రింగురోడ్డుకు గత బడ్జెట్‌లో చూపినట్టుగానే రూ.1,525 కోట్లను చూపింది. భూసేకరణకు వీటిని వినియోగించనున్నారు. గత బడ్జెట్‌లో ఈ నిధులను చూపినా, వాటిని వినియోగించలేదు. ఇక మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రోడ్ల నిర్మాణానికి రూ. 50 కోట్లను మాత్రమే ప్రతిపాదించింది. 

జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్‌ భవనాల కోసం రూ.300 కోట్లు, నక్సల్‌ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.251 కోట్లు కేటాయించింది. హైబ్రిడ్‌ యాన్యూట్‌ మోడ్‌లో రోడ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందుకుగాను రూ.300 కోట్లను బడ్జెట్‌లో చూపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement